29-10-2023 – ఆదివారం రెండవ ఆరాధన

స్తుతిగీతము – 1

యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి
యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము /2/
పాట పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసేదం /2/యేసే/

పలురకాల మనుషులు పలువిధాల పలికినా
మాయలెన్నో చేసినా లీలలెన్నో చూపినా (2)
యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ /2/యేసే/

బలములేని వారికి బలమునిచ్చు దేవుడు
కృంగియున్న వారిని లేవనెత్తు దేవుడు (2)
యేసులోనే నిత్యరాజ్యం యేసులోనే విడుదల /2/యేసే/

స్తుతిగీతము – 2

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా
దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా…
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా…
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా


ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డాచ్చినా
సాతానే శోధించినా శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా…


పర్వతాలు తొలగినా మెట్టలు దద్దరిల్లినా
తుఫానులే చెలరేగినా వరదలే ఉప్పొంగినా
కడకు నీ కడకు ప్రభుయేసే దిగి వచ్పుగా
నమ్ము ఇది నమ్ము యెహెూవా యీరే గదా…

స్తుతిగీతము – 3

ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘన నామం (2)
స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును
క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును (2)
వేవేనోళ్లతో స్తుతి నే పాడెదా. (2)
యేసునందే సత్యం యేసులోనే మార్గం
యేసే నా నిత్యజీవము (2)

ప్రభు నామము ఎంతో ఘనమైనది
అన్ని నామములకంటె హెచ్చైనది (2)
ఆ నామమందే రక్షణ సోదరా (2)
యేసయ్య రక్తము చిందించెగా (2)
యేసే నా రక్షణ యేసే విమోచన యేసే నా నిరీక్షణా (2)

ప్రభు నామము ఎంతో బలమైనది
అపవాది క్రియ లయపరుచునది (2)
భయమేల నీకు ఓ సోదరా (2)
సాతాను సిలువలో ఓడిపోయెగా (2)

యేసే రక్తమే జయం యేసు నామమే
జయం యేసునందే విజయం (2)

ఆరాధన వర్తమానము

మన దేవుడు దయ కలిగినవాడు. లేఖనాలు చెప్పుచున్న సత్యము చూస్తే,

యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు గాక విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును తూర్పునుండి పడమటినుండి ఉత్తరమునుండి దక్షిణము నుండియు నానాదేశములనుండియు ఆయన పోగుచేసినవారును ఆమాట పలుకుదురుగాక. -కీర్తనలు 107:1-3


మన దేవుని గూర్చిన సత్యము మన జీవితములను స్వతంత్రులనుగా చేస్తుంది. మన దేవుడు దయాళుడుగా ఉంటున్నాడు. అయితే ఈ మాట ఎవరు పలుకుతారు అని వ్రాయబడిన విధానము చూస్తే, ఈ క్రింద పేర్కొన్న వారు పలుకుతారు అని వ్రాయబడింది.

1. ఆయన విమోచించినవారు
2. విరోధుల చేతిలోనుండి విమోచించబడినవారు
3. నానా దేశములనుండి (పరిస్థితులనుండి) ఆయన పోగుచేసినవారు

అసత్యమైన వ్యర్థదేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు.౹ -యోనా 2:8

యెహోవా యొక్క కృప నిత్యము ఉంటుంది అనే సత్యము ఎరిగి, ఆ కృపను నమ్ముకున్నట్టయితే, ఆ కృప ద్వారా కలిగే ఆధారమును ఆసరాగా చేసుకొని నిలబడగలుగుతాము. అనేకమైన పరిస్థితులగుండా మనము వెళ్ళినప్పుడు ఆయన కృపయే మనలను జాగ్రత్తగా నడిపించింది. అందుకే మనము కృతజ్ఞతా స్తుతులు చెల్లించవలసినవారమై ఉన్నాము

వారు అరణ్యమందలి యెడారిత్రోవను తిరుగులాడుచుండిరి. నివాస పురమేదియు వారికి దొరుకకపోయెను. -కీర్తనలు 107:4

ఈ మాటలు మన వ్యక్తిగతమైన జీవితములను గూర్చి ప్రభువు చెప్పుచున్నాడు. నివాసపురము దొరకకపోయెను అంటే, స్థిరత్వము లేని పరిస్థితిని సూచిస్తుంది.

వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను. -కీర్తనలు 107:7

అనగా స్థిరత్వము లేని పరిస్థితిని స్థిరపరచేవాడుగా మన దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన దయాళుడు అయి ఉన్నాడు.

ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలిగొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు. -కీర్తనలు 107:8-9

నీవున్న అస్థిరమైన పరిస్థితులలో, స్థిరత్వము కలగచేయు నీ దేవుని గూర్చిన సత్యము ఎరిగి, అనగా ఆయన దయాళుడు ఆయన కృప నిత్యముండును అనే సత్యము ఎరిగి స్తుతించు.

ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గా ఉన్న దేవుడే నీకు, నాకూ దేవుడుగా ఉన్నాడు. వారిని అరణ్యములో నడిపించి రక్షించిన దేవుడే, మన జీవితములోని ప్రతి పరిస్థితిలోనూ నడిపించగల సమర్థుడై ఉన్నాడు.

వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండియు మరణాంధకారములోనుండియు వారిని రప్పించెను. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టి యున్నాడు ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు. -కీర్తనలు 107:14-16

బంధించబడిన వారిగురించి ప్రభువు చెప్పుచున్న మాటలు. నీవున్న బంధకములనుండి నిన్ను విడిపించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అస్థిరమైన పరిస్థితులలో దేవుని కృప విడుదల అయి మార్గము తెరువబడుతుంది గనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటారు.

బాధ చేతను ఇనుప కట్లచేతను బంధింప బడినవారై చీకటిలోను మరణాంధకారములోను నివాసముచేయువారి హృదయమును ఆయన ఆయాసముచేత క్రుంగజేసెను.వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందువారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను -కీర్తనలు 107:11-13

మన జీవితములో కూడా ఏ పరిస్థితి చేతనో బంధించబడిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్య కార్యములు చేసేవాడుగా ఉన్నాడు. గనుక వారు విమోచించబడతారు. ఎవరైతే బంధించబడిన స్థితిలో ఉన్నారో, వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యెహోవా దయాళుడు, ఆయన దయ మన జీవితములను మార్చేవాడుగా ఉన్నాడు. మనము బంధించబడిన పరిస్థితులలో ఉంటే, ఆ బంధకములనుండి విడిపించేవాడిగా ఉన్నాడు. ఆర్థిక బంధకములనుండి మన ప్రభువు విమోచించేవాడుగా ఉన్నాడు.

ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయనవారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. -కీర్తనలు 107:20-21

పడిన గుంట అనే విషయమును చూస్తే, గుంట అనగా ఒకరు అనుకోకుండా పడిపోయే పరిస్థితి. కావాలి అని ఎవరూ గుంటలో పడరు. అపవాది పన్నిన ఉచ్చులలో అనుకోకుండా చిక్కిన పరిస్థితిగా కూడా మనము చూడవచ్చు. అయితే ఎక్కడైతే నువ్వు పడిపోయి ఉన్నావో, అక్కడ ప్రభువు యొక్క కృపను బట్టి నీవు లేపబడతావు. తన వాక్కును పంపేవాడిగా ఉన్నాడు. దేవుని వాక్కు విడుదల అయింది అంటే, దాని వెనుక దేవుని ఆలోచన ఒకటి ఉంటుంది. అంతే కాక ఆ విడుదల కొరకు అవసరమైన ప్రణాళిక దేవుని యొద్ద సిద్ధముగా ఉంది అని అర్థముచేసుకోవాలి.

ఎర్రసముద్రము ఎదురుగా ఉన్నప్పుడు, మొషేతో నాకు ఎందుకు మొర్రపెడతున్నావు? ముందుకు సాగిపో అని ఊర్కనే చెప్పలేదు గానీ, ఏమి చేయాలో ముందుగానే సిద్ధపరచి ఉన్నాడు గనుక అలా చెప్పాడు. మనకు కూడా దేవుని వాక్కు వస్తుంది అంటే, మన జీవితములో దేవునికి ఒక ప్రణాళిక దానికి సంబంధించిన విధివిధానములు సిద్ధపరచినవాడుగా ఉంటాడు.

ఈరోజు మనము పడిన గుంటలోనుండి లేవనెత్తడానికి ప్రభువు వద్ద సొల్యూషన్ ఉంది కాబట్టే, తన వాక్కు పంపుతున్నాడు. అందుకే ఆ వాక్కును స్వీకరించడము ఎంతో ప్రాముఖ్యము. ఈ సత్యము స్వీకరించినవారు కృతజ్ఞతా స్తుతులు చెల్లించేవారిగా ఉంటారు.

ఆరాధన గీతము

యెహోవ దయాళుడు సర్వ శక్తిమంతుడు
ఆయన కృప నిత్యముండును
ఆయనే బలవంతుడు ఆయనే యుద్ధ వీరుడు

యెహోవా నాకు తోడుండగ నాకు భయమే లేనేలేదు
యెహోవా నాకు తోడుండగ నాకు దిగులే లేనె లేదు
జై జై యేసురాజ జై యేసు రాజ
జై జై యేసురాజ జై యేసు రాజ

సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే
మృతుడైన లాజరును – మరణము నుండి లేపిన వారాయనే

దావీదు వంశమును – ఇల చిగురింప చేసిన వారాయనే
విలువైన రక్షణలో నను కడవరకు నడిపించు వారాయనే

వారము కొరకైన వాక్యము

నీ నా జీవితములలో ఆయన అద్భుతం చేయాలనుకుంటున్నాడు. అయితే ఎందుకు ఆయన అద్భుతము చేయాలి అనుకుంటున్నాడు? ఆ అద్భుతము పొందుకొనుటకు మనము అర్హులమేనా అనే సంగతి ఈరోజు తెలుసుకుందాము.

అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.౹ రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి.౹ -యోహాను 6:1-2

రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. అయితే వారు ఎందుకు వెంబడించారు? అని ఆలోచిస్తే, కొంతమంది అద్భుతములు చూడాలి అని, కొంతమంది ఆ అద్భుతములు పొందుకోవడానికి వెళ్ళి ఉంటారు. అనగా ఆయన శక్తిని తెలుసుకోవడానికి గానీ, శక్తిని అనుభవించడానికి గానీ ఈరోజు ప్రభువు సన్నిధినిలోనికి వచ్చారో వారు ఖచ్చితముగా దానిని పొందుకుంటారు.

అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.౹ కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తనయొద్దకు వచ్చుట చూచి–వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలుకొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని౹ యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.౹ -యోహాను 6:4-6

ఈ బహుజనులు అందరూ యేసయ్య చేసే అద్భుతములు గూర్చి తెలుసుకొనే ఆయనను వెంబడించి వచ్చారు. అయితే “యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి” యేసయ్య అక్కడ ఉన్నారు. అనగా వచ్చినవారు యేసయ్య చేసిన అద్భుతములు చూసి వచ్చినవారుగా ఉన్నారు అని యేసయ్య ఎరిగి ఇక్కడ ఉన్న అవసరములో కూడా ఒక అద్భుతము చేయడానికి ఆయన మనసు కలిగి ఉన్నారు.

ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ౹ –ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా౹ -యోహాను 6:8-9

ఈ భాగమును ఆలోచిస్తే, యేసయ్య అయితే ఏమి చేయాలో ఎరిగినవాడై ఉన్నాడు. అయితే ఫిలిప్పును ఎందుకు అడిగాడు అని ఆలోచిస్తే,

మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని–నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.౹ ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు.౹ ఫిలిప్పు నతనయేలును కనుగొని – ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.౹ అందుకు నతనయేలు – నజరేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా–వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను.౹ యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి–ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను.౹ –నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు–ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను – యోహాను 1:43-51

ఫిలిప్పుకూ నతానియేలుకూ మధ్య జరిగిన సంభాషణలో యేసయ్య వారి వద్ద లేరు. అయితే గడచిన ఆ సందర్భమును గూర్చిన విషయము యేసయ్య ఎరిగే ఉన్నాడు. అలాగే ఇప్పుడు తన వద్దకు వచ్చిన జనులు అద్భుతము చూడాలి అనే వచ్చారు అని యేసయ్య ఎరిగే ఉన్నాడు. గనుక వారున్న అవసరములో దేవుడు అద్భుతమును చేయాలి అనుకుంటున్నాడు. అలాగే ఈరోజు నీవు కూడా ఈ టైటిల్ చూసి దేవుడు నా జీవితములో అద్భుతము చేయాలి అని ఆశ కలిగి వస్తే, వారు అద్భుతమును పొందుకుంటారు.

నీవు ఈరోజు కలిగి ఉన్నా చిన్న స్థితిలోనే ప్రభువు అద్భుతము చేయాలి అని ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు. నీవు చేసే చేతిపని విషయములో దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. దేవుని ఆశీర్వాదము ఎలా మన జీవితములో కనపరచబడుతుంది? మృతమైన దానిలో జీవము పుడుతుంది. అనగా ఉన్నది గానీ ఏమాత్రము సరిపోయేదిగా లేదు. దాని విషయములో వృద్ధి కలిగించడము ద్వార దేవుడు ఆశీర్వదిస్తాడు. మరొకటి చూస్తే లేని దానిని ఉన్నట్టుగా చేసేవాడు. అనగా ఏమీ అవకాశములేని చోట నూతన మార్గము కలుగుతుంది.

మనము చదివిన భాగములో అయిదు చిన్న రొట్టెలు, రెందు చిన్న చేపలు మాత్రమే ఒక చిన్నవాని వద్ద ఉన్నాయి. అయితే ఆ ఉన్నవాటినే ఆశీర్వదించాలి అని దేవుడు ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు. తద్వారా వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన చేసిన అద్భుతమును చూసారు. ఈరోజు నీవు కూడా ఆయన అద్భుతమును చేస్తాడు అని నమ్మి వస్తే, నీకున్న చిన్న పరిస్థితిలోనే ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు.

ప్రభువు అద్భుతములు చేయడానికి, స్వస్థత చేయడానికి, సూచక క్రియలు చేయడానికి కారణము ఏమిటి? దేవుడు మనకొరకు ఉద్దేశ్యము కలిగిన జీవితము అధికారము కలిగినదిగా ఉంది. యేసయ్యను అంగీకరించిన వారు దేవుని కుటుంబములో చేర్చబడ్డారు, వారి జీవితములో దేవుని అధికారము కనపరచబడుతుంది. అది ఈ సమయములో కూడా, ఈ రోజులలో కూడా, తన అధికారముచేత నీ జీవితమును మహిమకరముగా మార్చాలి అనే ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు. తద్వారా నీవు ఆయనను వెంబడించాలి అని ఆయన చిత్తము.

ఒక ఆత్మీయ నియమము ఏమిటి అంటే, నీ వద్ద ఉన్న దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనము చదివిన భాగములో ఇదే సంగతి చూసాము. ఎర్ర సముద్రము వద్ద కూడా మోషే దగ్గర ఉన్న చిన్న కర్రనే వాడుకొని అద్భుతము దేవుడు చేసాడు.

మనము చదివిన భాగములో గంపలో ఉన్న రొట్టెలు ఒకటి వడ్డించగానే ఆ స్థానములో మరొకటి వచ్చి ఉన్నది. అలాగే మోషే కర్ర పైకెత్తితే ఎర్ర సముద్రము విడిపోవడము ఎంత ఆశ్చర్యకరము? వీరే కాదు గానీ, ఏలియా జీవితములో చూస్తే, సారెఫతు విధవరాలి వద్ద ఉన్న దానినే, దేవుడు ఆశీర్వదించాడు.

అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య–నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవాయందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొనిపోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొఱ్ఱపెట్టగా ఎలీషా–నా వలన నీకేమి కావలెను? నీ యింటిలో ఏమి యున్నదో అది నాకు తెలియ జెప్పుమనెను. అందుకామె–నీ దాసురాలనైన నా యింటిలో నూనెకుండ యొకటి యున్నది; అది తప్ప మరేమియు లేదనెను.౹ -2 రాజులు 4:1-2

ఇక్కడ గమనిస్తే, ఆ స్త్రీ వద్ద నూనె కుండ తప్ప మరేమీ లేదు. అలాగే ఆమె ఎలీషా వద్దకు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, ఎలీషా దేవుని ఆత్మను కలిగినవాడు. అలాగే ఆమె భర్త ఎలీషా వద్ద శిష్యునిగా ఉన్నాడు. అనగా ఆ ప్రవక్త ఎటువంటివాడో ఆమె ఎరిగి ఉన్నది. ఆమె అద్భుతమును ఆశించి ఎలీషా వచ్చింది. అలాగే ఎలీషా కూడా ఆమె కోరుకున్న అద్భుతమును దేవుని ద్వారా జరిగించాడు.

అయితే దేవుని వాక్యమును ఎంతగా తెలుసుకుంటే, అంతగా ప్రభువును యెరుగగలుగుతావు. అప్పుడు ఆయన ఏమి చేయగలడో తెలిసి ఆయన వద్దకు సరైన ఆశ కలిగి వెళ్ళగలుగుతాము. గనుక దేవుని వాక్యమును లోతుగా ఎరిగి ఉండుట మహాభాగ్యము. అయితే మనము గమనించవలసినది ఏమిటి అంటే, అద్భుతము చేయడానికి యేసయ్య సిద్ధమే, అయితే ఆయన చెప్పిన మాటలు నమ్మి అదే ప్రకారము చేయడానికి సిద్ధపడగలవా? నువ్వు నమ్మగలిగితే నీ జీవితము అద్భుతముగా మార్చబడుతుంది. నీ ఊహకు అందితే అద్భుతము ఎలా అవుతుంది? అందుకె నీ ఊహకు మించిన కార్యము నీ దేవుడు చేస్తాడు. అయితే దానికి ప్రాముఖ్యమైనది ఆయన చేయగలడు అనే నీ నమ్మిక. మరొక ప్రాముఖ్యమైన సంగతి, దేవుని అద్భుతము చూడాలి అంటే, నీ జ్ఞానము పనిచేయకూడదు.

అందుకు యెహోవా–నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే;౹ అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులునుగల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను. -యోనా 4:10-11

ఈ వాక్యములో దేవుని హృదయము మనము అర్థము చేసుకోవచ్చు. దేవుడు కేవలము మన జీవితములను గూర్చి మాత్రమే కాదు గానీ, మనము కలిగిన దాని విషయములో కూడా ఆలోచన కలిగిఉన్నాడు. అందుకే దేవుడు ఏమి చెప్తే ఆ ప్రకారము చేయడానికి నీవు సిద్ధపడితే, కాలాలు మారినా యుగాలు మారిన మారనివాడు మన దేవుడు గనుక, నీ జీవితములో అద్భుతమును ఖచ్చితముగా పొందుకుంటావు