మీరు మెలకువగా ఉండుడి

అంతట యేసు వారితోకూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి–నేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొనిపోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసుమరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి, సాగిలపడి– నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి ఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి –

మత్తయి 26:36-41.

నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది అని ప్రభువు చెప్తున్నాడు. అలాగే నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. యేసు ప్రతీవిషయములో శిష్యులకు నేర్పించాలి అని కోరుకున్నాడు. అందుకే తన తరువాత పరిచర్య భారమును మోయవలసినటువంటి పేతురును, యాకోబును మరియు యోహానును వెంటబెట్టుకుని వెళ్ళారు.

ఇక్కడ సందర్భము చూస్తే, సాధ్యమైతే ఈ గిన్నె తొలగించు, కానీ నీ చిత్తమే జరిగించు. ఆ పాపము యేసుపై పెట్టబడినప్పుడు, యేసు తండ్రినుండి దూరంచెయ్యబడతాడు. అది యేసుకు ఇష్టములేదు. కాని తండ్రి చిత్తము ఏమిటంటే, యేసు సమస్తమైన వారికొరకు, ఆ కలువరి సిలువలో పాపపరిహారనిమిత్తం మరణించాలి. ఇలాంటి పరిస్థితులు మన అందరికీ అనగా ఆత్మీయంగా ఎదుగుతున్న వారికి అందరికీ కలుగుతాయి. మన విశ్వాసాన్ని పరీక్షించేవి ఇటువంటి సందర్భాలే.

మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి –

మత్తయి 26:41

మనలను అపవాది సమయము చూసుకుని, చిక్కుపెట్టేవాడు గా ఉన్నాడు కాబట్టి, ఆత్మీయంగా ఎదిగిన వారు, ఖచ్చితంగా మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండుట అంటే ఏమిటి? మెలకువగా ఉన్నప్పుడు మన కళ్ళముందు జరిగేది కనబడుతుంది. మన పరీక్షాసమయము, ఆత్మీయజీవితం పడిపోయే సందర్భాలలో  లేదా శోధన సమయములో మెలకువ కలిగి ఉన్నప్పుడు, నా సొంత చిత్తమును జరిగిస్తే దేవుని చిత్తము జరగదు అని గుర్తు ఎరిగినవారుగా ఉంటాము.  

సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగములచేత పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరో వారందరు ఆ రోగులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి; అప్పుడాయన వారిలో ప్రతివానిమీద చేతులుంచి, వారిని స్వస్థపరచెను. -లూకా 4:40. ఇక్కడ యేసు ఆయన దేనినిమిత్తము భూమిమీదకు పంపబడ్డాడో ఆ చిత్తప్రకారము పని జరిగించుచుండెను. తరువాత వచనములో చూస్తే “ఇంతేకాక దయ్యములు–నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు. -లూకా 4:41″.  ఆ దెయ్యాలు దేవుని చిత్తము జరగకుండా ఉండునట్లు అనగా, ఆ కలువరి సిలువలో సమస్త మానవాళి కొరకు ప్రాణము పెట్టాలి, అనే కార్యము జరగుకుండాఉండటానికి. యేసు దేవుని కుమారుడు అని కేకలువేసి ఆటంకంచేస్తున్న ఆ సందర్భములో, యేసయ్య మెలకువకలిగి వారికి ఛాన్స్ కూడా ఇవ్వకుండా మాటలాడనీయలేదు.

మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమలమధ్యను గురుగులు విత్తిపోయెను. -మత్తయి 13:25.  మనము మెలకువగా ఉండవలసిన సందర్భములో మెలకువగా ఉండకపోతే, శత్రువు ఖచ్చితంగా నాటుతుంది. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి –అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనమువిత్తితివి గదా, అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి. -మత్తయి 13:27. అంటే మనలను బయటనుండి చూసేవారు, వీరు చాలా భక్తిపరులు కదా? ప్రార్థనాపరులుకదా? వీరికి ఎలా ఇలాంటి పరిస్థితివచ్చింది? అనుకుంటారు. అయితే యేసు చెప్తున్నాడు–ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు–మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి. -మత్తయి 13:28. అప్పుడు యేసుచెప్తున్నాడు, కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను. -మత్తయి 13:30. ఒకవేళ నేను మెలకువగా ఉండవలసిన సమయములో నేను మెలకువగా ఉండకపోతే, కోతకాలము వరకు వేచిఉండాల్సిందే

ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానునువెంట బెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను. -మత్తయి 17:1. అప్పుడు ఆయన (యేసు) ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు – ప్రభువా, మన మిక్కడ ఉండుట మంచిది; నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. -మత్తయి 17:2-4. ఆత్మీయంగా మనము ఎదుగుతున్న సందర్భములో, గర్వము అనేది ఖచ్చితంగా మనలోకి ప్రవేశిస్తుంది. పేతురు పర్ణశాలలు కడదాము అని చెప్పినప్పుడు,అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. -మత్తయి 17:5. అంటే అటువంటి గర్వాన్ని పురికొల్పే సమయములలో, దేవుని చిత్తాన్ని గురించిన ఆలోచనకలిగి, ఆయన హెచ్చవలసిందే నేను తగ్గవలసిందే అని మనము మెలకువకలిగి ప్రవర్తించాలి. అనగా నేను దేవుని ప్రియకుమారుడిని అని గుర్తెరిగి, నేను నా చుట్టు ఉన్నవారిని వారి మాటలను బట్టి గర్వమును రానీయక, తండ్రి చిత్తానుసారము నేను జరిగించాలి. మెలకువగా ఉండే సమయము ఉంది, విశ్రాంతితీసుకునే సందర్భము ఉంది.  

యూట్యూబ్ లో ఈ వర్తమానం వినండి