27-10-23 సూపర్ నేచురల్ సర్వీస్ – యుద్ధము యెహోవాదే 

స్తుతిగీతము – 1

యుద్ధము యెహొవాదే (4)

1. రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు
సైన్యములకు అధిపతియైన యెహోవా మనఅండ (2)

2. వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన
విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మనఅండ (2)

3. యెరికో గోడలు ముందున్న ఎఱ్ఱ సముద్రము ఎదురైన
అద్భుత దేవుడు మనకుండ భయమేల మనకింక (2)

4. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చినా
యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ

స్తుతిగీతము – 2

దేవుడు మా పక్షమున ఉండగా – మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా – మాకు విరోధి ఎవడు
జీవగల దేవుని సైన్యముగా – సాతాను నోడింతుము -2
యుద్ధం యెహోవాదే – రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే – ఘనత యెహోవాదే -2
దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు

మా దేవుని బాహువే – తన దక్షిణ హస్తమే
ఆయన ముఖ కాంతియే – మాకు జయమిచ్చును -2
తనదగు ప్రజగా మము రూపించి – నిరతము మాపై కృప చూపించి
తన మహిమకై మము పంపించి – ప్రభావమును కనపరుచును

యుద్ధం యెహోవాదే – రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే – ఘనత యెహోవాదే -2
దేవుడు మా పక్షమున ఉండగా – మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా – మాకు విరోధి ఎవడు

మా దేవుని ఎరిగిన – జనులముగా మేమందరం
బలముతొ ఘనకార్యముల్ – చేసి చూపింతుము -2
దేవునిచే శూర క్రియలను చేసి – భూమిని తలక్రిందులుగా చేసి
ఆయన నామము పైకెత్తి – ప్రభు ధ్వజము స్థాపింతుము

యుద్ధం యెహోవాదే – రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే – ఘనత యెహోవాదే -2
దేవుడు మా పక్షమున ఉండగా – మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా – మాకు విరోధి ఎవడు

ఆరాధన వర్తమానము

దేవుడు దయచేసిన ఈ మరొక దినమును మీరు ఎలా చూస్తున్నారో తెలియదు కానీ, ఇది మరొక సూపర్నేచురల్ దినము. మనము దేవునిని ఎరిగి ఆ దేవునిని స్వీకరించినప్పుడు, మన జీవితములు అద్భుతముగా మార్చబడతాయి. అయితే లేఖనములను స్పష్టముగా తెలుసుకున్నప్పుడే దేవునిని గూర్చి ఎరుగగలుగుతాము. విశ్రాంతి దినాన్ని దేవుడు ఏర్పాటు చేసాడు. ఆ దినమునకు ఒక ఆధిక్యత ఇచ్చాడు. దినములు అనే మాటను చూస్తే, బాల్య దినములు, యవ్వన దినములు అనే ప్రత్యేకత ఉంది. దినము అనగా కేవలము ఒక రోజు మాత్రమే కాదు గాని ఒక ప్రత్యేకమైన సందర్భము కొరకు ఏర్పరచబడిన సమయముగా చూడవచ్చు. ఈ దినము, మన జీవితములలో అద్భుతములు చేయడానికి ఈ దినమును మనకొరకు ఏర్పాటుచేసాడు. ఎవరైతే ఈ సత్యమును నమ్మి వచ్చారో వారి జీవితములలో అద్భుత కార్యములను జరిగిస్తాడు.

ప్రభువా, నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్య ములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు.ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు – కీర్తన 86:8-9

నీ జీవితములో అద్భుతములు చేయువాడు ఆయన. ఎవరిని నమ్మి ఈ వాక్యము వింటున్నావో, చదువుతున్నావో ఆయన మహత్కార్యములు చేయువాడు. ఈ దినము దేవుని యొక్క కార్యము జరిగించబడే దినము. ఆయన కార్యము మీ జీవితములలో స్థిరపరచబడుతుంది.

యెహోవా, రాజు నీ బలమునుబట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణనుబట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు.అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతని కనుగ్రహించి యున్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసియున్నావు. నీ రక్షణవలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసియున్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించియున్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసియున్నావు. – కీర్తన 21:1-2

నా దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించువాడు. ఈ దినము నాకొరకు ఏర్పాటు చేసాడు అని నమ్మి వచ్చారో, ఏ కార్యము జరగాలి అని హృదయము నిండుగా కోరిక కలిగి ఉన్నారో ఆ కార్యము దేవుని మహత్కార్యములచేత స్థిరపరచబడుతుంది.

అయితే ఒక కండిషన్: ఈ సూపర్ నేచురల్ సర్వీస్ ప్రభువుచేత ఏర్పాటు చేయబడింది. ఈరోజు ప్రభువు నేను హృదయములో నిండియున్న విషయమును గూర్చి నాతో మాట్లాడతాడు అని నమ్మి వచ్చారో! వారికొరకు ప్రభువు కార్యము చేస్తాడు.

పైన చదివిన వాక్యములో కూడ ఎందుకు ఆ ఆశీర్వాదములు ప్రకటించబడ్డాయి అని చూస్తే,

ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక యుంచు చున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండ నిలుచును – కీర్తన 21:7

నీవు కూడ దేవుని యందు అదే నమ్మిక కలిగి ఉన్నట్టయితే, నీ కొరకు కూడా దేవుని చేత సిద్ధపరచబడిన కార్యము మనలను ఎదుర్కొనబోతుంది. దేవుని నమ్ముకున్నవారు ఎవరూ సిగ్గుపడరు. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదము ప్రభువు కలగజేసేవాడుగా ఉన్నాడు.

యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తు చున్నాము నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక – కీర్తనలు 20:5

ప్రభువు మాటను బట్టి నీవు నమ్ము స్తుతించినట్టయితే, ప్రభువు మాట ప్రత్యక్షపరచబడటము అనుభవిస్తావు. నీవున్న ప్రస్తుత పరిస్థితిని బట్టి నీవు ఆలోచించకు. గొర్రెల కాపరిని రాజుగా అభిషేకించినదేవుడు. ఆయనను రాజుగా చేయుటకు తగిన కార్యము చేసాడు కదా! ఫిలిష్తీయులలో అతి భయంకరమైన గొలియాతు ఇశ్రాయేలు ప్రజలను 40 దినములు హేళనగా మాట్లాడుతూ సవాలు చేస్తూ వున్నాడు. ఒకవిషయము ఆలోచిస్తే, ఆ యుద్ధము దావీదు చేత ముగించబడాలి అని దేవుని నిర్ణయించాడు. దావీదు సింహాసనము మీద కూర్చొనుటకు కావలసిన పరిస్థితి అనుమతించి, దావీదు అవకాశము వరకు ముందుకు కదలక నిలిచి ఉండునట్లు ప్రభువు పరిస్థితిని నియంత్రించాడు. మనము గ్రహించవలసినది ఏమిటి అంటే, మన సామర్థ్యము, ప్రణాళిక కాదు గానీ, దేవుని చిత్తము నెరవేరడానికి యుద్ధము చేయువాడు ఆయనే! ఆయన మాట ఇచ్చాడు అంటే నిర్ద్వందముగా నమ్మిక కలిగి స్తుతించుటయే మన పని!

నా దేవుడు చెప్తే అగి జరుగుతుంది అంతే అనే ఆటిట్యూడ్ మనము కలిగి ఉందాము. మన దేవుడు సిద్ధపరచి మన ముందుకు తీసుకువచ్చేవాడు. గనుక మన దేవునిని ఆరాధిద్దాము. ఇంకా కార్యము జరగకమునుపే మన దేవుని ఎరిగియున్నవారిగా, నమ్మినవారిగా ఆరాధించి ఘనపరుద్దాము. కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము. వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము.

ఈరోజు నీవు చేయు స్తుతి, నీ ఆశీర్వాదమును నిర్ణయిస్తుంది. కీర్తన 21::1-6 జాగ్రత్తగా గమనించండి. మీకొరకు దేవుడు వాగ్దానము చేసిన 5 ఆశీర్వాదములు పొందుపరచబడ్డాయి.

నీ నమ్మికకు ఉన్న శక్తి నీవు ఎరిగిఉన్నావా? “నేను చేయగలను అని నీవు నమ్ముతున్నావా?” అని ప్రభువు అడిగే ప్రశ్నకు “అవును” అనేది నీ సమాధానమైతే ఆశీర్వాదము నీదే!

“మా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తు చున్నాము ” అనే మాటను చూస్తే, యుద్దములో జెండాను ముందుగా నిలబెట్టి యుద్ధమునకు సిద్ధపడతారు. మన ముందు ఉన్న పరిస్థితిపై మనము చేసే యుద్ధముపై మన దేవునిని నామమునే ముందు పెట్టి ఒక ధ్వజముగా నిలబడదాము.

ఆరాధన గీతము

దేవుడు మా పక్షమున ఉండగా – మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా – మాకు విరోధి ఎవడు
జీవగల దేవుని సైన్యముగా – సాతాను నోడింతుము -2
యుద్ధం యెహోవాదే – రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే – ఘనత యెహోవాదే -2
దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు

దేవుడు నా పక్షమున ఉండగా – నాకు విరోధి ఎవడు
నా దేవుడు నా పక్షమున ఉండగా – నాకు విరోధి ఎవడు
జీవగల దేవుని సైన్యముగా – సాతాను నోడింతును

నా దేవుని బాహువే – తన దక్షిణ హస్తమే
ఆయన ముఖ కాంతియే – నాకు జయమిచ్చును
తనదగు ప్రజగా నను రూపించి – నిరతము నాపై కృప చూపించి
తన మహిమకై నను పంపించి – ప్రభావమును కనపరుచును

పదే పదే ఓడిపోతున్న స్థితిలో ఉంటే, లేదా ఉద్యోగముకొరకు పదే పదే ప్రయతించి దొరకని స్థితిలో ఉంటే ఈ ఆరాధన ద్వారా నూతనమైన మార్గములు తెరిచేదిగా ఉంది. గనుక ఉత్సాహముతో, ఉల్లాసముతో, ఉత్తేజముతో ప్రభువుని ఆరాధిద్దాము.

సిస్టర్. లక్ష్మి – నీ కుటుంబములో ఉన్న విషాదములో దేవుని యొక్క ఆదరణ చూడబోతున్నావు. సమాధానము లేని స్థితిలో దేవుని మార్గము చూడబోతున్నావు.

సిస్టర్. కుమారి – ప్రభువు నీవున్న మార్చబడలేని పరిస్థితులను మారుస్తున్నాడు.

కొంతమంది తమ పిల్లల భవిష్యత్తు గూర్చి ఆలోచన కలిగిఉన్నారు. అయితే యుద్ధము చేయు నీ దేవుడు వారి ముందు నడచేవాడుగా ఉన్నాడు.

ఇంతవరకు దేవుడు ఏమి చేయగలడో నీవు తెలుసుకున్నావు. ఇకముందు నీ జీవితములో ప్రాక్టికల్ గా, క్రియలరూపములో దేవుడు నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు.

సిస్టర్ ప్రేమ – ఏది జరగాలని నీవు ఆశ కలిగి ఉన్నావో, అది నీ పక్షమున నీ దేవుడు జరిగించేవాడు.

బంధించబడిన దానిని దేవుడు విడుదల చేస్తున్నాడు. ఆగిపోయిన పరిస్థితి ముందుకు కదలబోతుంది. మనము లేచి చక్కగా నిలబడేవారముగా ఉండబోతున్నాము. కుటుంబములు, వివాహములు సెట్ అవుతున్నాయి. జరిగినట్టే జరిగి మిస్ అవుతుంది. గర్భము అయినా వచ్చినట్టే వచ్చి పోతుంది అనే పరిస్థితి ఇంక ఉండదు. ఈసారి అది నిలబడేదిగా ప్రభువు సెలవిస్తున్నాడు.

విదేశీ ప్రయాణములకొరకు ఎదురుచూసేవారికొరకు మార్గము తెరుస్తున్నాడు.

వ్యాపారము చేయాలని ఆశపడేవారి కొరకు, నష్టము వచ్చిన స్థితిలో ఉన్నవారైనా ప్రభువు న్యాయము తీర్చి మహిమ కార్యము చేసేవాడిగా ఉన్నాడు.

నీకు అన్యాయము చేయాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నీ దేవుడు వాటిని సఫలము కానివ్వడు. దేవుని కార్యములు నీ జీవితములో స్థిరపరుస్తాడు.

నీ జీవితములో ప్రభువు ఉద్దేశ్యమును బట్టి కలిగే ఆశీర్వదములు

1. నీ మనోభీష్టము సఫలము అవుతుంది
2. నీ పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన ప్రభువు అంగీకరించువాడుగా ఉన్నాడు.
3. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదుర్కొనబడుతావు
4. నీ తలమీద అపరంజి కిరీటము దేవుడు ఉంచియున్నాడు.
5. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీకు దయచేసియున్నాడు.
6. దేవుని రక్షణవలన నీకు గొప్ప మహిమ కలిగచేయును, గౌరవ ప్రభావములను దేవుడు నీకు ధరింపజేసియున్నాడు.
7. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నిన్ను నియమించియున్నాడు
8. దేవుని సన్నిధిని సంతోషముతో నిన్ను ఉల్లసింపజేసియున్నాడు

ప్రవచనాత్మక వాక్యము

యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను – నిర్గమకాండము 14:14

ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయుచుండగా ఎదురుగా ఎర్రసముద్రము అడ్డుగా వచ్చింది వెనుక ఫరో తరుముతూ వస్తున్నాడు. అటువంటి సమయములో ఈ మాటలు చెప్పబడ్డాయి.

అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు – నిర్గమకాండము – 14:13.

అయితే మోషే అంత ఖచ్చితముగా ఎలా చెప్పగలుగుతున్నాడు? వాగ్దానము చేసినవాడు దేవుడు. అయితే ఆ వాగ్దానము నెరవేరకుండా ముందు ఎర్ర సముద్రము అడ్డు, వెనుక చంపడానికి శత్రువు తరుముతున్నాడు. అయితే మోషే మీ పక్షమున యెహోవా యుద్ధము చేస్తాడు అని చెప్పుచున్నాడు.

నీ, నా జీవితములో గనుక మోషేవంటి హృదయమును కలిగి ఉంటే, మనము కూడా అదేవిధముగా చెప్పగలము – “నేడు చూసిన ఈ వ్యతిరేక పరిస్థితి ఇక ముందు చూడను” అని చెప్పగలుగుతారు. ఇంకా ధ్యానిస్తే, మోషే చేసిన ప్రతీ అద్భుతములో ఎలా చేయాలో మోషేకు నడిపింపు దయచేసాడు. అయితే ఎర్రసముద్రము గూర్చి ఎటువంటి విషయము చెప్పలేదు గానీ, మోషే చెప్పిన మాటలు దేవుడు నెరవేర్చిన వాడుగా ఉన్నాడు.

నీ వాగ్దాన నెరవేర్పుకు వచ్చిన ప్రతీ ఆటంకమును తొలగించేవాడు నీ దేవుడు, గనుకనే వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు! నీ జీవితము ఆయన సొత్తు అయి ఉన్నది. అయితే దేవుడు యుద్ధము చేసేవాడు గనుక నీ ఇష్టానుసారముగా నీవు ఉండటము కాదు గానీ, యుద్ధములో నీవు నమ్మిక గలిగి నిలబడాలి.

మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధముచేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. మరియు ఆ కాలమున నేనుయెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు – ద్వితీయోపదేశకాండము 3:22-23.

మనము నిలిచి దేవుడు ఎలా క్రియ జరిగిస్తున్నాడో, ఎలా తన బాహుబలము కనపరుస్తున్నాడో, తన మహిమ ఎలా ప్రత్యక్షపరచబడుతుందో అది చూడవలసినవారుగా ఉన్నాము.

మీకు ముందర నడుచు చున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నులయెదుట ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని – ద్వితీయోపదేశకాండము 1:30-31

“మీ కన్నులయెదుట ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును” – అనగా మనము దేవుని పరాక్రమ కార్యములు, ఆయన బాహుబలము కళ్ళారా చూసేవారముగా ఉంటాము. ఆ రీతిలో దేవుడు యుద్ధముచేసేవాడిగా ఉంటాడు.

దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్పులో వచ్చే ప్రతీ ఆటంకము నీ దేవుడు తన బాహుబలముచేత అద్భుత కార్యము చేసేవాడుగా ఉన్నాడు. అయితే మోషే కనపరచిన విశ్వాసము నీవు నేను కనపరచాలి. నీవు ఒక్కడివే కనపరచే విశ్వాసము నీ కుటుంబము అంతటినీ రక్షించగలగుతుంది. దేవుని వాగ్దానమును బట్టి నీవు ప్రకటించిన సత్యము ఖచ్చితముగా నెరవేరుతుంది.

మోషే గనుక ఈ మాటలు పలుకకపోయి ఉంటే, ఫరో మరొక సారి ఇశ్రాయేలీయుల జీవితములో తారసపడేవారు. అయితే దేవుని వాగ్దానమును ఎరిగిన మోషే, ఇంతకుముందు చూసిన ఫరోను మరెన్నడూ చూడరు అని ప్రకటించాడు. అలాగే నీవు విశ్వాసముతో దేవుని వాగ్దానమును బట్టి ఏమి ప్రకటించావో అది నీ కుటుంబములో నెరవేరుతుంది.

ఇశ్రాయేలీయులు మోషేమాటలను నమ్మడానికి అవకాశము లేదు. ఎందుకంటే అంతకు ముందు సముద్రము విడిపోవడము అనేది వారు చూడలేదు. అనగా వారి ఊహకు మించిన కార్యము దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు నీ వాగ్దాన నెరవేర్పు విషయములో అడ్డుగా ఉన్న దానిని తొలగించుటకు దేవుడు చేసే కార్యము నీ ఊహకు మించినది

అంతలో యెహోవా మోషేతో-నీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము – నిర్గమకాండము -14:15

నీవు తీసుకునే తీర్మానము ఎంతో బలమైనది. ఏమైతే నీ దేవునిని గూర్చి నమ్మి ప్రకటించావో దానిని నెరవేర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. గనుక నీవు నిలబడటము అనేది ఎంతో ముఖ్యమైన కార్యము, ప్రధానమైన కార్యము.

నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు – నిర్గమకాండము -14:16

ఈ సంగతి చూస్తే, ఆలోచించడానికి కూడా కష్టమైన సంగతి. మొత్తము ఎండిపోతే ఫరవాలేదు, అయితే రెండు పాయలుగా చీలి, అటు ఇటు గోడలుగా ఉన్న దారిలో నడవాలి అంటే ఎంత విశ్వాసము కావాలి? మనము కూడా ప్రభువు ఏ మార్గము సిద్ధపరిస్తే అదే మార్గములో మనము నిలిచి ఉండాలి. దేవుని మార్గము తెరువబడిన తరువాత కూడా వెనుకడుగు వేసేవారు అనేకులు ఉంటారు. మనము అలా ఉండకూడదు.

మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను – నిర్గమకాండము 14:21

దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఖచ్చితముగా నెరవేరుతుంది. మోషే కర్ర పట్టుకుని నిలబడ్డాడు, అయితే వెనుక అదృశ్యముగా ప్రభువు జరిగించే కార్యములు ఎవరికీ కనబడవు. అయితే ఈ విషయములు మనము ఎరిగి అర్థముచేసుకుని ఉండాలి.

మన వ్యక్తిగతమైన జీవితములో అడ్డు తొలగించడానికి, దేవుడు వెనుక ఏ కార్యము జరిగిస్తాడో గమనించేవారుగా ఉండాలి. ఏ మాట పట్టుకుని నిలబడుతున్నావో ఆ మాటను నెరవేర్చడానికి ప్రభువు సిద్ధమే! అయితే ప్రభువు చెప్పిన రీతిలో ప్రశ్నలు వేయకుండా నిలబడటము ఎంతో అవసరము.

దేవుడు నీతో మాట్లాడే విషయము గ్రహించే మనసు నీవు కలిగిఉండాలి. అంతే కాక, ఆ మాటలకు లోబడే మనసు నీ కలిగి ఉండాలి. అప్పుడు దేవుని కార్యము ఖచ్చితముగా జరుగుతుంది. నీవు విశ్వాసముతో నిలబడటానికి సిద్ధపడగానే ప్రభువు కార్యము మొదలవుతుంది. ప్రతి దానికి ముగింపు సమయము ప్రభువు నిర్ణయించాడు.

దేవుడు నాకొరకు మార్గము తెరిచాడు, తన కార్యము ప్రారంభించాడు అనే సంగతి గమనించగలిగినవెంటనే నీవు ఆయన ప్రభావము అనుభవించగలిగే స్థితిలోకి మారతావు. నీ శత్రువు వంటి పరిస్థితులు నాశనము అయిపోతాయి. నీ తీర్మానము, నీ వెంబడింపు ఎంతో ప్రాముఖ్యము.

మీకు ముందర నడుచు చున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నులయెదుట ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని – ద్వితీయోపదేశకాండము 1:30-31

వాగ్దానము యొక్క నెరవేర్పులో ఇప్పటివరకు ఎత్తుకుని నడిపించాడు. ఇకముందు కూడా ఎత్తుకొని నడిపించేవాడుగా మన దేవుడు ఉన్నాడు. యుద్ధము ఆయనే మన పక్షముగా చేసేవాడుగా ఉన్నాడు గనుక విజయము మనదే! వాగ్దానము నెరవేర్పు ఖచ్చితముగా జరుగుతుంది.