22-10-2023 – ఆదివారం మొదటి ఆరాధన

స్తుతిగీతము – 1

రాజుల రాజా రానైయున్నవాడా (2)
నీకే ఆరాధన
నా యేసయ్యా.. నీకే ఆరాధన (2)

కష్టాలలో జయమిచ్చ్చును – శోధనలో జయమిచ్చును
సాతానును ఓడించును – విజయము చేకూర్చును (2)
నా మార్గము యేసయ్యా – నా జీవము యేసయ్యా
నా సత్యము యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా (2)
||రాజుల||

రోగాలను స్వస్థపరచును – శాపాలనుండి విడిపించును
మరణమునుండి లేవనెత్తును – పరలోకము మనకిచ్ఛును (2)
ప్రతి మోకాలు వంగును – ప్రతి నాలుక పాడును
ప్రతి నేత్రము చూచును – నిన్నే రారాజుగా (2)
||రాజుల||

స్తుతిగీతము – 2

నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును (2)
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా (2)
||నా ప్రాణమా||

ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు (2)
||నా ప్రాణమా||

మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును (2)
||నా ప్రాణమా||

స్తుతిగీతము – 3

చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నేను నమ్మిన నా యేసుడు
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నాకు దొరికిన నా యేసుడు (2)
మాటలలో చెప్పలేనంత
చేతలలో చూపలేనంత (2)
చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు
చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2)
||చాలా||

నా పాప శిక్షను తాను మోసెను
నా కొరకు కలువారిలో త్యాగమాయెను (2)
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం (2)
||మాటలలో||

యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు
జగమంతా వెదకినా కానరారులే (2)
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం (2)
||మాటలలో||

ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు
వింతైన ప్రేమ అంతు చిక్కదు (2)
కలువరిలో చూపిన ప్రేమ
శాపమునే బాపిన ప్రేమ (2)
||మాటలలో||

ఆరాధన వర్తమానము

ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన ఉంటాను దేవాదిదేవుడు వాక్యము ద్వారా సెలవిచ్చాడు, గనుకా ఈ దినము మన మధ్యన ఉన్న దేవునిని స్తుతించి ఆరాధించి ఘంపరచాలి.

యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను. -కీర్తనలు 92:1-4

ఈ మాటలు కేవలము ఆయన కృపను అనుభవించి, ఆయన మీద ఆనుకొని ఉంటారో వారు మాత్రమే చెప్పగలరు.

ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు. -యెషయా 26:3

అందుకే కీర్తనాకారుడు చెప్పుచున్నాడు, “ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది” అని. రాత్రి అనే మాటను మనము ధ్యానము చేస్తే,రాత్రి కాలమున అపవాది కార్యములు అన్నీ జరుగుతాయి. అయితే దాని ప్రభావము గానీ, దాని ఉచ్చులు గానీ మన మీద పడకుండా మన దేవుడు కాపాడుచున్నాడు. రాత్రి అనగా మనకు తెలియని, ఎరుగని పరిస్థితి గా మనము చూడవచ్చు. అలాగే పగలు అనగా మనకు తెలిసిన లేదా ఎరిగిన పరిస్థితిగా మనము చూడవచ్చు. అయితే మనముందు ఏముందో తెలిసినప్పటికీ, ఆ స్థితిలో ఏమి చేయాలో తెలియని, తెలిసినా శక్తి చాలని పరిస్థితిలో దేవుని కృప మనకు తోడుగా ఉంది. మనము శోధించబడే సమయము గనుక మన జీవితములో గమనిస్తే, దాని అర్థము, దేవుని విశ్వాస్యత నీ యందు నిలచిఉన్నది.

ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత కాలము పగలుగా చూస్తే దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. భవిష్యత్తు మనకు తెలియదు గనుక, దానిని రాత్రిగా చూస్తే, దేవుని విశ్వాస్యత మనకు తోడుగా ఉంటుంది.

నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివా సము చేసెదను. -కీర్తనలు 23:6

అనగా మనము బ్రతికే దినములన్నీ, దేవుని కృప మరియు ఆయన విశ్వాస్యత ఒక్కొక్క దినమును ముగించేవిగా ఉన్నాయి. తన బిడ్డల పక్షమున తన కృప కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు. మనమున్న సమయము మన ప్రభువు రాకడకు సమీపముగా ఉన్న సమయము. ఈ దినములలో దేవుని కృప గాక, మరేదీ ఆధారము కానేరదు. మన జీవితములో దేవుని కార్యము మన ఊహకు మించినది అయి ఉంటుంది. ఆయన సూపర్ నేచురల్ కార్యములు జరిగించేవాడు.

యెహోవా, రాజు నీ బలమునుబట్టి సంతోషించు చున్నాడు నీ రక్షణనుబట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు.శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచి యున్నావు. -కీర్తనలు 21:1-3
ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక యుంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండ నిలుచును. -కీర్తనలు 21:7

మనము గనుక దేవుని యందు నమ్మిక ఉంచినట్టయితే, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుడు మనలను ఎదుర్కోనేవాడుగా ఉన్నాడు. మన పక్షమున ఆశ్చర్య కార్యములు జరిగించేదేవుడుగా ఉన్నాడు.

వివాహ విషయములో చూస్తే, మనమే ఎన్నుకుంటాము. అయితే కొంతమంది మాత్రమే ప్రభువా నాకొరకు సిద్ధపరచిన వారిని తెలియచేయమని ఆనుకొనేవారుగా ఉంటారు. అటువంటివారి జీవితములు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నింపబడతాయి.

గతవారమంతా మనము దేవుని కృపను, ఆయన విశ్వాస్యతను పొందుకొన్నాము గనుకనే ఈరోజు మనము ఆయన సన్నిధిలో చేరగలిగాము. గనుక ఈ సత్యము ఎరిగినవారిగా ఆత్మతో మన ప్రభువును ఆరాధిద్దాము. ఈ సత్యము ఎరిగినవారైతే, నా భవిష్యత్తు కృపాక్షేమములే అని చెప్పగలిగేవారిగా ఉంటాము. దాని అర్థము శ్రములు రావు అని కాదు, గానీ గాఢాంధకారపు లోయలో సంచరించవలసిన పరిస్థితులు వచ్చినా సరే, ఏ అపాయము మనలను నాశనము చేయదు, దేవుని దుడ్డుకర్ర, దండము మనలను రక్షించును గనుక, నిశ్చయముగా మన భవిష్యత్తు కృపా క్షేమములే అని దేవుని మీద ఆనుకొనేవారు చెప్పగలుగుతారు. గనుక మన దేవుని కృపను, విశ్వాస్యతను బట్టి దేవుని స్తుతిద్దాము, ఆరాధిద్దాము.

నీ పరిస్థితులు భయంకరముగా వ్యతిరేకముగా ఉన్నాప్పటికీ నీవు జీవము గలిగి ఉన్నావు అంటే, దేవుని కృప, విశ్వాస్యత నీ మీద నిలిచి ఉండుటయే. నీ పరిస్థితులు ఆయన తప్పక మారుస్తాడు.

ఆరాధన గీతము

స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం – దేవా అనుక్షణం

దయతో కాపాడినావు
కృపనే చూపించినావు (2)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు

పాపినై యుండగ నేను
రక్షించి దరి చేర్చినావు (2)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు

సిలువే నాకు శరణం
నీవే నాకు మార్గం (2)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు

వారము కొరకైన వాక్యము

ఆచారయుక్తమైన భక్తి ఏ మాత్రము లాభసాధకము కాదు. క్రైస్తవులముగా చెప్పుకొనుచూ, క్రీస్తు మహిమ కనపరచని జీవితము జీవిస్తే, విడువబడేవారముగా ఉండిపోతాము గనుక మనము జాగ్రత్త కలిగి ఉండాలి.

నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫలమిచ్చును. -యోబు 34:11

“క్రియలకు తగినట్టుగా ఫలము” ఖచ్చితముగా ఉంది అని అర్థముచేసుకోగలము. “అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫలమిచ్చును”, మనము జీవించే విధానము బట్టియే మనకు లభించే ఫలము ఆధారపడి ఉంది.

ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డైవెనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. -2 కొరింథీయులకు 5:10

ఖచ్చితముగా మనమున్న దినములు సరిచేసుకోవలసిన దినములు. ఇంకా దేవుడు తన కృపను బట్టి మనకు సమయము ఇచ్చినాడు.

కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమునుగూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.౹ -2 పేతురు 3:9

మన ప్రభువు కోరిక ఎవరూ నశించిపోకూడదు అని. మన ప్రభువు ఎంతగొప్పవాడు? ఒకవేళ మన క్రియలు మంచివైతే దేవునికి స్తోత్రము. అయితే అవి చెడ్డవైతే, సరిచేసుకోవడానికి ఆయన ఆలస్యము చేస్తున్నాడు గనుక భయము కలిగి సరిచేసుకొందాము.

ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.౹ -యిర్మీయా 17:10

మన ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేది మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన ప్రవర్తన బట్టియే మన ఫలము ఆధారపడి ఉంది. సాధారణముగా మనుష్యులు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరొకలాగా ఉంటాము. మనము వేషధారణ కలిగి ఎవరిని మోసము చేసినా సరే దేవునిని మాత్రము మోసము చెయ్యలేము. “యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను” అని దేవుడు ఖచ్చితముగా చెప్పుచున్నాడు.

ఒకరిని గాయపరిచే రీతిలో మన ప్రవర్తన ఉండకూడదు. లోకములో ఉన్నట్టు అపహాస్యముచేసి ఆనందించే స్వభావము మనము కలిగి ఉండకూడదు. చిన్నవారైనా, పెద్దవారైనా మన స్వభావము సరిచేసుకొనే సమయము మనకు ఇచ్చాడు గనుక మనము సమయమును పోనియ్యక, మన ప్రవర్తన బట్టియే మన ఫలము అని ఎరిగి సరిచేసుకొని సిద్ధపరచుకుందాము. ఫలము ఇవ్వడానికైతే ప్రభువు సిద్ధముగానే ఉన్నాడు.

ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మ నుబట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును.౹ -గలతీయులకు 6:8

శరీరము ఎప్పుడూ నాశనము చేసేవిధముగానే కోరికలు కలుగచేస్తుంది. అయితే ఆత్మ ఎల్లప్పుడు దేవుని మహిమ పరచడానికే ఆశ కలిగి ఉంటుంది. గనుక ఏ ప్రకారము మనము మన జీవితాన్ని సిద్ధపరచుకొంటున్నాము అనే పరీక్ష మనము చేసుకోవాలి. శరీరమును అనుసరిస్తున్నామా? ఆత్మను అనుసరిస్తున్నామా? ఈ జాగ్రత్త మనము ఎల్లప్పుడూ కలిగే ఉండాలి.

మనలో ఉన్న ఆత్మ మనము శరీరానుసారముగా ప్రవర్తించినప్పటికీ, ఒక ప్రక్కన ఆ కార్యము సరైనది కాదు అని చెప్తూనే ఉంటుంది. అయినప్పటికీ ఆ మాటలు పెడచెవినపెట్టినప్పుడు ఆ ఆత్మ క్షోభబడుతుంది. నీ శరీరానుసారమైన క్రియలను బట్టి క్షయమనే పంటనే కోసుకొంటావు. అయితే ఆ ఆత్మ మాటలను విని, శరీరముయొక్క ఆలోచనలను జయించి నిలబడితే, నిత్యజీవమనే పంటను కోసుకొంటావు. జక్కయ్య జీవితమును చూస్తే, సుంకరిగా ఉన్న ఆయన ఎంతసేపూ డబ్బు కోసమే తాను చేసిన ప్రతీ కార్యము చేసాడు. దానిని బట్టి అందరిచేత ద్వేషించబడిన జీవితమును తాను కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్యను చూడాలి అనే కోరిక కలిగిందో, తన పరిస్థితులు ఒక్కక్కటిగా దేవుని చేత ప్రేమించబడిన స్థితిలోనికి మారచబడ్డాయి.

సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టివాడైనందున జనులు గుంపుకూడి యుండుటవలన చూడ లేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. -లూకా 19:2-4

జక్కయ్య వలే మనముకూడా లోకములో, శరీరము ప్రకారము ఆలోచనలు కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నాము. అయితే ఈరోజు ప్రభువు మనకు అవకాశము కల్పించాడు. తన ప్రేమ పూర్వకమైన మాటలచేత ఈరోజు మనలో ఆశను రేకెత్తించాడు. త్వరలో రానై ఉన్న యేసయ్యతో నిత్యము ఉండుటకు ఆశ కలిగి ఎదురుచూసే జీవితమును మనము కలిగి ఉంటే, మన ఆశను బట్టి ప్రతి పరిస్థితి అనుకూలపరచబడుతుంది. జక్కయ్య జీవితములో చూస్తే –

యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి–జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా -లూకా 19:5

ఎప్పుడైతే జక్కయ్య ఆశ కలిగి ఉన్నాడో, ఆయన ఆశను బట్టి యేసయ్య తానున్న చోటికి రావడమే కాక, పేరు పెట్టి పిలువబడ్డాడు, తన ఇంటిని రక్షించుకున్నాడు. మనము కూడా ఈరోజు విన్న వాక్యమునకు లోబడితే, అదే విధముగా మన జీవితములో కూడా జరుగుతుంది. మన జీవితమును మార్చుకోవడానికి సిద్ధపడితే, మన జీవితములో ఫలము ఇవ్వడానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు, ఆయనే దేవుని యొక్క వరముగా మన జీవితములో ఉన్నాడు.

అందుకు యేసు–నీవు దేవుని వరమును– నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను.౹ -యోహాను 4:10

ఎటువంటి వరాన్ని మనము పొందుకోబోతున్నాము? ఎటువంటి ఫలము మనము పొందుకోబోతున్నాము అని ఎరిగి ఉంటే, ఖచ్చితముగా ఈ రోజు విన్న వాక్యమునకు లోబడి, మన జీవితమును సరిచేసుకుంటాము.

ఆ స్త్రీకి నీళ్ళవిషయమైన కష్టము ఉంది. అయితే యేసయ్య జీవ జలముగూర్చి చెప్పుచున్నాడు. జక్కయ్య జీవితములో చూస్తే, ఎప్పుడైతే యేసయ్యను అంగీకరించాడో, అప్పుడు ఇంతకు ముందు అన్యాయముగా సంపాదించిన దాని బదులుగా నాలుగు రెట్లు చెల్లిచడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు, ఆశీర్వాదముగా మార్చబడ్డాడు.

అబ్రహాము జీవితమును చూస్తే, రాజులు సహితము అతని ముందు తలవంచవలసిన పరిస్థితులు కలిగాయి. కనుక మనలో దేవునికి మహిమకరము కాని ప్రవర్తన ఎక్కడ ఉన్నాసరే, ప్రభువు యెదుట మనము దానిని ఒప్పుకొని, విడిచిపెట్టి ప్రభువుయొక్క కనికరమును పొందుకొనేవారిగా మనము మారతాము. జక్కయ్య కూడా యేసయ్య చూడలేదు కదా అని తన అతిక్రమము దాచిపెట్టలేదు గానీ, ఒప్పుకొని విడిచిపెట్టాడు గనుకనే ఆశీర్వదించబడ్డాడు. నీ జీవిత్ములో అన్నీ బాగుండి, ఒక్క విషయములోనే మనము తప్పిపోతే, ఆ ఒక్క విషయములో సహితము దేవుడు మహిమపరచబడాలి అని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. గనుక మన ప్రవర్తన దేవునికి అంగీకారముగా మనము సరిచేసుకొందాము.

మనము తగ్గించుకోవలిసి వస్తే దేవునిని బట్టి తగ్గించుకొంటున్నాము. మనలను హెచ్చించే సమయము కూడా ఉంది గనుక దేవుని బలిష్టమైన చేతికింద దీన మనసు కలిగి జీవిద్దాము. మన దేవుడు నమ్మదగినవాడు.

ఇహమందు ధనవంతులైనవారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.౹ -1 తిమోతికి 6:17

సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయువాడు దేవుడే! అయితే నీవు కోరుకొన్న దానిని బట్టి నీకు సుఖము ఉండదని దేవుడు ఎరిగి ఉంటే, దానిని నీ జీవితములో జరగనివ్వడు. మన క్షేమమును కోరుకొనేవాడు. కోపము మనము పాపము చేయులాగున ప్రేరేపిస్తుంది గనుక కోపమును మనము విడిచిపెడదాము. ప్రభువు అనేకసార్లు మాటలాడినాడు గనుక జాగ్రత్త పడదాము.