15-10-2023 – ఆదివారం రెండవ ఆరాధన – ఆయనను నమ్ముకుంటే

స్తుతిగీతము – 1

నీవు చేసిన మేళ్లకు
నీవు చూపిన కృపలకు (2)
వందనం యేసయ్యా (4)

ఏపాటివాడనని నేను
నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి
నన్నెంతగానో దీవించావు (2)
||వందనం||

బలహీనుడనైన నన్ను
నీవెంతగానో బలపరచావు
క్రీస్తేసు మహిమైశ్వర్యములో
ప్రతి అవసరమును తీర్చావు (2)
||వందనం||

స్తుతిగీతము – 2

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)
తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2)
||ఆశ్చర్యకరుడు||

తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)
నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2)
||ఆశ్చర్యకరుడు||

మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2)
||ఆశ్చర్యకరుడు||

స్తుతిగీతము – 3

నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని

దారులలో.. ఏడారులలో..
సెలయేరులై ప్రవహించుమయా..
చీకటిలో.. కారు చీకటిలో..
అగ్ని స్తంభమై నను నడుపుమయా..
||దీవించావే సమృద్ధిగా||

నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)

ఊహలలో.. నా ఊసులలో..
నా ధ్యాస…. బాసవైనావే..
శుద్ధతలో.. పరిశుద్ధతలో..
నిను పోలి నన్నిల సాగమని..
||దీవించావే సమృద్ధిగా||

కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)

ఆశలలో.. నిరాశలలో..
నేనున్నా నీకని అన్నావే..
పోరులలో.. పోరాటములో..
నా పక్షముగానే నిలిచావే..
||దీవించావే సమృద్ధిగా||

ఆరాధన వర్తమానము

దేవుని సన్నిధి బలమైనదిగా ఉంటుంది. ఆ బలమైన ప్రసన్నతలోనికి, ఆయన సన్నిధిలోనికి మన ప్రభువు మనలను నడిపించాడు. దేవుడు ఏమి చేసినా సరే ఒక ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు. ఆయన సన్నిధికి వట్టినే నడిపించడు గనుక ఈరోజు మనము ఆయన సన్నిధిలో కూడుకొనుట అనేదాని వెనుక దేవుని ఉద్దేశ్యము ఉంది.

మనకు తెలిసిన సత్యము మన శరీరమునకు, ఆత్మకు కలిగిన కల్మషమును తొలగించుటకు, మనకు అవరసరమైన ఈవులు దయ చేయడానికి అలాగే ఆయన ఏమై ఉన్నాడో ఎరుగునట్లుగా కూడ ఆయన మన యెడల కృప కలిగి ఉన్నాడు.

మన దేవుని ప్రేమను గూర్చి చెప్పాలంటే, ఒకే మాట మనము చెప్తాము. అదేమిటంటే, మన కొరకు తన ఒక్కగానొక్క కుమారుని అర్పించాడు. అయితే మరొక వాక్యము ద్వారా కూడా మనము దేవుని ప్రేమను గూర్చి తెలుసుకుందాము.

అందుచేతను ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు –మీరు ఈ వాక్యమువద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసికొంటిరి గనుక ఈ దోషము మీకు ఎత్తయిన గోడ నుండి జోగిపడబోవుచున్న గోడ అండవలె అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. కుమ్మరికుండ పగులగొట్టబడునట్లు ఆయన ఏమియు విడిచిపెట్టక దాని పగులగొట్టును పొయిలోనుండి నిప్పు తీయుటకు గాని గుంటలోనుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు. -యెషయా 30:12-14

మన జీవితములలో మనము కూడా దేవుని వాక్యమును త్రోసివేసి మనకు నచ్చిన విధానములో ప్రవర్తించేవారముగా ఉంటాము. అయినప్పటికీ దేవుని ప్రేమ మనలను నిలబెట్టేది గా ఉంది.

ప్రభువును ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –మీరు మరలి వచ్చి ఊరకుండుటవలన రక్షింప బడెదరు మీరు ఊరకుండి నమ్ముకొనుటవలన మీకు బలము కలుగును. -యెషయా 30:15

మరలి వచ్చి అంటే? త్రోసివేసిన వాక్యము యొద్దకు మరలా వచ్చి ఊరక ఉండి, నమ్ముకొనుట వలన రక్షించబడెదరు అని ప్రభువు చెప్తున్నాడు.

కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యమువేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు యెహోవా న్యాయముతీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు. -యెషయా 30:18

అనగా మనము ఎప్పుడు మరలి వస్తామో అని ఆలస్యము చేసి, మనలను విడిచిపెట్టక మనకొరకు వేచి చూసేవాడుగా ఉన్నాడు. మనము పడిన స్థితిలో సైతము దేవుని ప్రేమ మనకొరకు కనిపెట్టుకొంటుంది. సర్వశక్తుడైన దేవుడు నిన్ని ఆశీర్వదించాలి అని ఆశతో వేచి ఉన్నాడు. దేని కాలమున అవి చక్కగా ఉండునట్లు ఆయన నియమించాడు. అయితే ఆ నియమించినవాటిని మనము పొందలేని అనుభవము కూడా మనకు ఉంది. దానికి కారణము ఏమిటి అంటే, ఆయన వాక్యమును త్రోసివేయుట. అయితే మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. మన అజ్ఞానము ద్వారా పోగొట్టుకొన్న ఆశీర్వాదములను, తన ప్రేమ ద్వారా తిరిగి ఇవ్వడానికి ఆయన వేచి ఉన్నాడు అందుకే ఆయన ఆలస్యము చేస్తున్నాడు అని వాక్యము స్పష్టముగా తెలియచేస్తుంది.

నీకొరకు సిద్ధపరచింది దేవుడు. సిద్ధపరచినదానికి పోగొట్టుకొన్నది మనము. అయితే పోగొట్టుకొన్నదానిని తిరిగి ఇవ్వడానికి మన దేవుడు తండ్రివలే ఎదురుచూస్తున్నాడు. మన దేవుడు పరమ తండ్రి గనుక, నీవు పోగొట్టుకున్నది తిరిగి ఇవ్వడానికి ఆయన ఎదురుచూస్తున్నాడు. నిన్ను లేవనెత్తుటకు, నీ జీవితాన్ని నిలబెట్టుటకు నీ దేవుడు ఇష్టము కలిగి ఉన్నాడు.

ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక౹ యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.౹ అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.౹ -యోహాను 4:4-6

సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది అని వ్రాయబడింది. అయితే ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఆ సమరయ గ్రామములోనికి వచ్చిన యేసయ్య ఎందుకు వేచి ఉన్నాడు? అంటే, అక్కడకు జీవితమును పోగొట్టుకొన్న ఒక స్త్రీ రాబోతుంది, ఆమెను తిరిగి సమకూర్చడానికి ఆయన వేచి ఉన్నాడు. ఆమె వివాహ జీవితము పాడైన స్థితిలో ఉంది. అటువంటి జీవితమును సరిచేయడానికి ఆయన నిలబడి ఉన్నాడు. అలాగే మన జీవితమును కూడా మార్చడానికి మనకొరకు మన ప్రభువు వేచి ఉన్నాడు. గనుక నీవు తిరిగి దేవుని యొద్దకు, నీ యొద్దకు ఇంతకు ముందు వచ్చిన వాక్యము యొద్దకు రా!

ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.౹ ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింప బడడు.౹ ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింప గలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము. -1 కొరింథీయులకు 2:14-16

ఆరాధన గీతము

నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా

నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా

నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు
నిన్నే పూజింతును నే వెనుదిరుగా
||నీ సన్నిధిలో||

నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా
||నీ సన్నిధిలో||

నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు
నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా
||నీ సన్నిధిలో||

నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు
నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా
||నీ సన్నిధిలో||

మనము త్రోసివేసిన ఆయన యొద్దకి మనము మరలి వచ్చినప్పుడు ఆయన చేర్చుకొని, తిరిగి పోగొట్టుకున్న సమస్తము సమకూర్చేవాడుగా నీ దేవుడు ఉన్నాడు. “నిన్నే ప్రేమిస్తాను” అంటే, “నీ వాక్యమును ఇక ఎన్నడూ త్రోసివేయను” అని అర్థము

నీవు ఆరాధన గీతము పాడుచుండగా “దేవా నీ వాక్యమును ఎన్నడూ త్రోసివేయను” అని నీ హృదయములో నిజముగా ఒప్పుకో!

వారము కొరకైన వాక్యము

ఆత్మలో మనము ఎంత శక్తివంతముగా మార్చబడతామో, మనము అంత గొప్ప కార్యములు చూసేవారిగా మనము తయారవుతాము. మన జీవితములు దేవుని శక్తిచేత నింపబడినవి. అటువంటి దేవుని శక్తిని అనుభవించాలి అంటే నీవు వృద్ధికలిగించబడాలి. మనము ఎలా అయితే శరీర జీవితములో ఎదగాలి అని కోరుకుంటామో, అంతకంటే ఎక్కువగా మనము ఆత్మీయముగా ఎదగడానికి కోరుకోవాలి. ఎందుకంటే, ఆత్మీయ జీవితమే శరీర సంబంధమైన జీవితమును లోబరుచుకోగలిగినది.

దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషేను ఎన్నిక చేసుకున్నాడు. ఆ తరువాత ఫరో చక్రవర్తి దగ్గరకు వెళ్ళమన్నాడు. ఆ సందర్భములో దేవుడు ఒక మాట చెప్పుచున్నాడు – “నీవు ఫరో యొద్దకు వెళ్ళి నేను చెప్పమన్న మాటలు చెప్పు” అని చెప్పాడు. ఇందులో దాగి ఉన్న ఆత్మీయ సత్యము ఏమిటి అంటే, ఫరో ముందుకు మోషే వెళ్ళిన సందర్భములో కర్ర వెయ్యగానే పాముగా మారింది. ఆ కర్ర జీవము లేని ఒక వస్తువు. ఎప్పుడైతే దేవుని మాట విడుదల అయిందో ఆ కర్రలో జీవము వచ్చింది. శారీకముగా చూస్తే, కర్రలో జీవము లేదు. అయితే ఆత్మీయమైన దేవుని మాట చేత ఆ కర్రలో జీవము వచ్చింది. అయితే శారీరకమిన జీవితమును లోబరుచుకోవడానికి అపవాదికూడా ప్రయత్నిస్తాడు అయినప్పటికీ ఆత్మీయమైనదే స్థిరపరచబడుతుంది. అయితే ఇదంతా దేవుని యొక్క మాటల చేత నీ జీవితము ఉన్నప్పుడే నెరవేరుతుంది. అందుకే నీ వద్దకు వస్తున్న ప్రభువు యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు మన జీవితము కట్టుకోవాలి. ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడు అనే సత్యము ఎరిగి ఉండాలి.

“ఈరోజు ఆయనను నమ్ముకొంటే ఏమవుతుంది?” అనే విషయమును గూర్చి ఈరోజు తెలుసుకుందాము.

యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. -యెషయా 26:4
యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.౹ -యిర్మీయా 17:7

“నిత్యాశ్రయదుర్గము” అనగా ఏ సమయమైనా ఆయన గాక ఇంక మరొక ఆశ్రయ దుర్గము లేదు. యుగయుగములు ఆయనను నమ్ముకొనుడి అనగా ఏ స్థితి అయినా, ఈరోజైనా రేపైనా మరేరోజైనా సరే యెహోవానే నమ్ముకొనుడి. అనగా “నాకు నా యెహోవా యెహోవానే నిత్యము ఆశ్రయ దుర్గము” అని నిలబడిన వారి జీవితములో ఈ మాటలు ప్రత్యక్షపరచబడతాయి.

నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. -కీర్తనలు 62:5

మన దేవునిని నమ్ముకొనుట ద్వారా మనకు మొట్టమొదట కలిగేది – “నిరీక్షణ”. అనగా దేవునిని నమ్ముకోగానే, ఏదైతే నెరవేరాలి అని నీవు ఆశించావో, దానికొరకు నీవు వేచి చూసేవాడిగా మారతావు. మన కళ్ళముందు ఆధారము కనబడినంతసేపు దాని వెంబడి వెళ్ళి, ఎప్పుడైతే ఆ ఆధారము పోయిందో అప్పుడు దేవునిని నమ్ముకోవడము కాదు. నీ నమ్మకము ఎల్లప్పుడు దేవునిపైనే ఉండాలి.

–నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.౹ –నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.౹ -రోమా 4:18

అబ్రహాము జీవితములో శారీరకమైన ఆధారము ఏమీ లేనప్పటికీ, ఆయన వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు అని నమ్మి, దేవుని వాక్కును మాత్రమే నమ్ముకొన్నవాడుగా, నిరీక్షణ పొందుకోగలిగాడు.

కూషీయుడైన జెరహు వారిమీద దండెత్తి వేయి వేల సైన్యమును మూడువందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషావరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను.౹ వారు మారేషానొద్ద జెపాతా అను పల్లపుస్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి – యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొనియున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆసాయెదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందునవారు పారిపోయిరి.౹ -2 దినవృత్తాంతములు 14:9-12

ఇక్కడ ఆసా వేలమంది సైన్యము దండెత్తి వచ్చినప్పుడు, తన యొద్ద బలము లేనప్పటికీ, బలము లేని వారికి సహాయము చేయువాడైన దేవుని నామమును బట్టి, నమ్మిక కలిగి యుద్ధమునకు సిద్ధపడ్డాడు. “బలము లేని వారికి బలమిచ్చువాడు” అని ఆసా తన పరిస్థితిలో నమ్మాడు. “నా బలము నీవే” అని చెప్పాడు. నీవు నేను మన పరిస్థితులలో కూడా ఆసా వలే దేవుని నమ్ముకొనేవారిగా నిలబడదాము. నీవు నీ దేవుని గూర్చి ఏమైతే నమ్మావో ఆ నమ్మిక ప్రకారము చేయువాడు నీ దేవుడు. అయితే మన నమ్మిక క్రియల ద్వారా కనపరచాలి. అప్పుడు దేవుని నమ్మకత్వము కూడా క్రియలద్వారా కనపరచబడుతుంది. ఆసా జీవితములో కూడా దేవుని శక్తి, బలము ఆ యుద్ధములో కనపరచబడింది, విజయము చేకూరింది.

బహువిస్తారమైన రథములును గుఱ్ఱపు రౌతులునుగల కూషీయులును లూబీయులును గొప్ప దండై వచ్చిరిగదా? అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీచేతికప్పగించెను.౹ -2 దినవృత్తాంతములు 16:8

బలము లేనప్పుడు యెహోవాను నమ్ముకొనినందున గొప్ప దండై వచ్చిన శత్రువు సైన్యమును తన చేతికి అప్పగించాడు. మన జీవితములో చూస్తే, మనము అనేకమైన వాటిని ఎదుర్కొంటున్నాము. అయితే వాటిని సమర్థముగా ఎదుర్కొనుటకు బలము లేదు. ఉదాహరణకు మన సంఘమును నిర్మించాలి అంటే ధనము అవసరము. అయితే మన వద్ద ధనము లేదు. అయితే ఆయనను నమ్ముకొనిన దానిని బట్టి, ఆ సంఘమును కట్టడానికి అవసరమైన ధనము దేవుడే చేతికి అప్పగించేవాడుగా ఉంటాడు. ఆమేన్! అయితే మనము నిలబడేవారుగా ఉండాలి. మనము దేవునిలో నిలబడుట నేర్చుకోవాలి. యుద్ధములో గాయములు సాధారణమే, గాయమైనంత మాత్రమున ఓడిపోయినట్టు కాదు! నిజమైన సైనికుడు ఆ గాయమును లెక్కచేయక మరింతగా పోరాడతాడు. అందుకే యుద్ధములో నిలబడుట అనేది మనము నేర్చుకోవాలి.

తీమయి కుమారుడైన బర్తీమయి ఎంతమంది ఆటంకపరచినప్పటికీ, నమ్మకము వదిలిపెట్టక “దావీదు కుమారుడా నన్ను కరుణించు” అని మరి యెక్కువగా కేకలు వేసాడు. అదే విధానన్ములో మనము కూడా నిలబడాలి.

మన పౌర స్థితి పరలోకములో ఉంది గనుక మన విశ్వాసము, నమ్మకము పరలోకాధిపతి అయిన దేవునిపైనే ఉండాలి.

ఆసా “నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము” అని ఎలా చెప్పగలిగాడు? ఆసా పితరులు అయిన ఇశ్రాయేలీయులు బలమైన ఎర్రసముద్రమును ఎలా దాటారో ఎరిగి ఉన్నాడు. పోరాటములో నిలబడితే దేవుడు ఏమి చెయ్యగలడో ఆయన తన పితరుల నుండి నేర్చుకొని ఉన్నాడు. అందుకే అలా చెప్పగలిగాడు. దేవుని నమ్ముకొని నిరీక్షిస్తున్న సమయములో వచ్చే ఆటంకములకు తొణకక ఇంతకు ముందు వేరే పరిస్థితిలో దేవుడు ఎలా నడిపించాడో జ్ఞాపకము చేసుకొని నిలబడాలి.

అంతలో కొందరు వచ్చి–సముద్రము ఆవలనుండు సిరియనులతట్టునుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చుచున్నది; చిత్తగించుము, వారు హససోన్‌తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి.౹ -2 దినవృత్తాంతములు 20:2
అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతనిమీదికి రాగా అతడీలాగు ప్రకటిం చెను –యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును.౹ -2 దినవృత్తాంతములు 20:14-15

యెహోవా ఆత్మ దేవుని హృదయములో ఉన్న ఉద్దేశ్యములను వెల్లడి పరుస్తాడు. “యెహోవా ఆత్మ అతనిమీదికి రాగా” అనగా యెహోషాపాతు రాజ్యము మీదకి వచ్చిన యుద్ధము విషయములో దేవుని ఉద్దేశ్యము ఏమిటో దేవుని ఆత్మద్వారా తెలియచేయబడింది. నీవు ఏ విషయములో ఆయనను నమ్ముకున్నావో ఆ విషయములో దేవుడే కార్యము చేసేవాడిగా ఉన్నాడు.

ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవు చున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.౹ -2 తిమోతికి 1:12

దేవుడు ఏమై ఉన్నాడో మనము ఎరిగి ఉంటే మనము కూడా పౌలు వలే చెప్పగలుగుతాము. మందిరము విషయమునే ఈ వాక్యములో చూద్దాము. అయితే “నీ భారము యెహోవాపై మోపుము” అనే వాక్యము ప్రకారము, మందిరము యొక్క భారము దేవునికి అప్పగించినప్పుడు, “రాబోవుచున్న ఆ దినము” అనగా మందిరము కట్టబడిన దినము వరకు ఆటంకములు వచ్చినా, అడ్డులు వచ్చినా కాపాడగలిగిన వాడు అని మనము నిలబడాలి. అలాగే మన వ్యక్తిగతమైన జీవితములలో కూడా ఏ విషయములో మనము ఆయనను నమ్ముకొన్నాసరే, ఆ విషయములో ఆయన నమ్మదగినవాడు.

అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి–యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహోవాను నమ్ము కొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను.౹ -2 దినవృత్తాంతములు 20:20

మనము కూడా మన జీవితములో సమస్త విషయములో మన దేవుడైన యెహోవానే నమ్ముకొందాము. అప్పుడు మనము ఆ విషయములలో స్థిరపరచబడతాము. ఆ ప్రకారము మనము సిద్ధపడునట్టుగా మన దేవుడు సహాయము చేయును గాక!