08-10-2023 – ఆదివారం మొదటి ఆరాధన – ఆలస్యం వెనుక దేవుని ఉద్దేశ్యం

స్తుతిగీతము – 1

ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే
జీవిత కాలమెల్ల స్తుతించెదము
[ఆయనే]

స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే (2)
వేడుచుండు భక్తుల స్వరము విని
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2)
[ఆయనే]

ఇద్దరు ముగ్గురు నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన (2)
ఉండెదననిన మన దేవుని
కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2)
[ఆయనే]

సృష్టికర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల కీర్తించెదము (2)
రాకడలో ప్రభుతో నిత్యముందుము
మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2)
[ఆయనే]

స్తుతిగీతము – 2

నిన్ను పోలిన వారెవరు
నీతో సమముగా లేరెవరు
పరమును వీడి నా దరికొచ్చిన
నా ప్రభువా నిన్ను స్తుతియించెదన

యేషూవ యేషూవ – నా రాజు మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా
యేషూవ యేషూవ – నా సర్వం మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా….

1) సిలువలో నాకై – మరణించి
నా పై నీ ప్రేమను – కనుపరచి
మూడవ దినమున – తిరిగి లేచి
మరణమునే జయించి
వేలాది దూతలతో మధ్యఆకాశములో
నన్ను కొనిపోవా రానైయున్న

యేషూవ యేషూవ – నా రాజు మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా
యేషూవ యేషూవ – నా సర్వం మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా….

2) నా పేరుతో- నన్ను పిలచి
నీ సాక్షిగా- నిలువబెట్టి
నీ ఆత్మతో- అభిషేకించి
నీ సొత్తుగా- నన్ను మార్చి
కృప వెంబడి కృపతో- యెనలేని ప్రేమతో
నీ సేవకునకు తోడైయున్న

యేషూవ యేషూవ – నా రాజు మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా
యేషూవ యేషూవ – నా సర్వం మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా….

స్తుతిగీతము – 3

సేవకులారా సువార్తికులారా యేసయ్యా కోరుకున్నా శ్రమికులారా
సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము

ఉన్నత పనికై మమ్మును పిలచినా దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి వుండుటే మా భాగ్యము
నీ కొరకై జివించెదము || సేవకులారా ||

దైవాజ్ఞాను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు
ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని ఇల విడిచారు
మా ఆత్మలు రక్షించుటకు హతసాక్షులు మీరైయ్యారు
నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు
||ఉన్నత పనికై మమ్మును పిలచినా దేవా||
|| సేవకులారా ||

సంఘమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు
సువార్తకై పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు
మీ ప్రేమను ఎరుగని వారు ఆన్యాయముగా మిము చంపారు
మీ ఈ త్యాగము మేము ఎన్నటికి మరిచిపపోమూ……..

||ఉన్నత పనికై మమ్మును పిలచినా దేవా||
|| సేవకులారా ||

సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు
ఆకలితో మోకాళ్ళున్ని సంఘమును పోషించారు
మాకు మాదిరి చూపించుటకు క్రిస్తుని పొలి జీవించారు
మీ జత పనివారమే మేము మీ జాడలో ఇకనుంచి

||ఉన్నత పనికై మమ్మును పిలచినా దేవా||
|| సేవకులారా ||

ఆరాధన వర్తమానము

మనము దేవుని స్తుతించవలసినవారమై ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేక దినము, సంఘకాపరుల దినము. ప్రతి సంఘకాపరికి యేసయ్యే మాదిరిగా ఉన్నాడు. ఒక కాపరి ఎలా ఉండాలి అనేది ఆయన భూలోకములో ఉన్నప్పుడు జీవించి చూపించాడు.

యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. -కీర్తనలు 23:1

ఈ మాట సత్యము. యెహోవా కాపరిగా ఎవరికైతే ఉంటాడో, వారి జీవితములో లేమి కలుగదు. అయితే భూలోకములో సంఘమును కాయుటకు కాపరులుగా దేవుడు కొంతమందిని ప్రభువు ఏర్పరుచుకున్నాడు. ఆ కాపరి యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకోవలసినవారిగా ఉన్నాము.

అందుకు యేసు ఇట్లనెను–ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోపట్టణమునకు దిగి వెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను. ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను. మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవానికిచ్చి–ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. -లూకా 10:30-35

ఈ భాగము మనము అనేకసార్లు చదివిన, విన్న భాగమే. ఇంతకుముందు మనము ఈ భాగము ద్వారా యేసయ్య వ్యక్తిగతమైన జీవితములో చూపిన ప్రేమను గూర్చి తెలుసుకున్నాము. మన పాపములచేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను అపవాదిచేతికి చిక్కి దోచుకోబడిన స్థితిలో మన పాపపు గాయములను కడిగి సంఘములోనికి చేర్చాడు. ఈ భాగములో పూటకూళ్ళ ఇల్లు సంఘముగాను, ఆ పూటకూళ్ళవాడు సంఘకాపరి గాను మనము అర్థము చేసుకోవచ్చు. మంచి కాపరి సంఘములో కలిగిఉండుట ఎంతో భాగ్యము.

కాపరి పరామర్శించేవాడుగా ఉన్నాడు. మనము కలిగిన బాధలో, దుఃఖములో మరియు శ్రమలో పరామర్శించేవాడుగా సంఘ కాపరి ఉంటాడు. నీ జీవితములో కలిగే ప్రతి మేలు వెనుక నీవు కలిగి ఉన్న సంఘకాపరి కన్నీటి ప్రార్థన ఉంటుంది.

నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.౹ -యోహాను 10:9
నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.౹ -యోహాను 10:11

కాపరి సంఘమునకు ద్వారము అయి ఉన్నాడు. ఆ మంచి కాపరి యొక్క కాపరత్వములో ఎవరుంటారో, వారి జీవితములో ఆత్మీయమైన భౌతికమైన ఆశీర్వాదములో కాపరి బాధ్యత కలిగి ఉంటాడు. అనగా నీ ఆశీర్వాదము కొరకు కన్నీటి ప్రార్థన చేసేవాడుగా, నీ పరిస్థితులలో దేవుని యొద్ద గోజాడేవాడుగా ఉంటాడు.

అయితే మంచివాడు కాని కాపరి ఎలా ఉంటాడు అంటే, నీ శ్రమలో నిన్ను విడిచిపెట్టేవాడుగా ఉంటాడు.

జీతగాడు గొఱ్ఱెల కాపరికాడు గనుక గొఱ్ఱెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱెలను పెట్టి చెదరగొట్టును.౹ జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱెలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.౹ -యోహాను 10:12-13

గనుక నీవు గనుక మంచి కాపరి యొక్క కాపరత్వములో ఉండి ఉంటే, నీ దేవునిని మహిమపరచవలసిన వారిమిగా ఉన్నాము. ఆ మంచి కాపరి మన స్థితి కంటే తక్కువ స్థితిలో ఉన్నా లేక ఎక్కువ స్థితిలో ఉన్నా సరే వారిని దేవుని బట్టి వారిని గౌరవించేవారిగా ఉండాలి.

మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి. -హెబ్రీయులకు 13:17

సంఘ కాపరి తనకు అప్పగించిన సంఘము విషయములో లెక్క అప్పగించవలసిన బాధ్యత కలిగినవాడుగా ఉన్నాడు. అందుకే తనకు అప్పగించిన సంఘములోని వారి యొక్క ఆత్మలను కాయువానిగా సంఘకాపరి ఉంటాడు. అటువంటి కాపరి దుఃఖము కలిగి కాపు కాయుట మనకే ఆశీర్వాదము కాదు. ఆయనకు దుఃఖము ఎప్పుడు కలుగుతుంది? ఆయనను కించపరచి, ఆయన మాట ప్రకారము చేయక తృణీకరించేవారుగా మనము ఉంటే, ఆయన దుఃఖము కలిగినవాడుగా ఉంటాడు. అయితే ఆయనకు దేవుని పేరట, దేవునిని బట్టి సంఘకాపరికి ఇచ్చే స్థానము ఇచ్చినట్టయితే సంతోషముతో ఆయన తన బాధ్యత నెరవేర్చేవాడుగా ఉంటాడు. సంఘకాపరి అంటే పాస్టరుగారు మరియు పాస్టర్ గారి భార్య కూడా బాధ్యత కలిగినవారుగా ఉన్నారు. సంఘము అనగా దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబము. నీకాపరి మంచి కాపరి, బాధ్యత కలిగిన కాపరి అని నీవు గుర్తిస్తే, ఆయనను బట్టి దేవునిని స్తుతించు.

ఆరాధన గీతము

దేవా నా దేవా – నీవే నా కాపరి
నీ ప్రేమ నీ క్షమా – ఎంతో గొప్పది (2)
ఆరాధింతును హృదయమంతటితో
స్తుతించెదను నీ పాద సన్నిధిలో (2)
నీవే కదా దేవుడవు – (2)
దేవా యేసు దేవా (4) ||దేవా||

పాపము నుండి విడిపించినావు
పరిశుద్ధుని చేసి ప్రేమించినావు (2)
నీవే కదా దేవుడవు – (2)
దేవా యేసు దేవా (4) ||దేవా||

పరిశుద్ధాత్మను నాలో నింపావు
మట్టి దేహమును మహిమాత్మతో నింపావు (2)
నీవే కదా దేవుడవు – (2)
దేవా యేసు దేవా (4) ||దేవా||

హృదయమారా, సత్యముతో మన మంచికాపరి అయిన యేసయ్యను స్తుతిద్దాము, ఆయన పాద సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరిద్దాము.

“దేవా నా దేవా – నీవే నా కాపరి” ఇది కేవలము పాటలోని సాహిత్యము కాదు. కానీ నీ హృదయమారా నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్న సత్యము.

నీ మంచి కాపరిని అయిన యేసయ్యను నీవు నిజముగా హృదయపూర్వకముగా స్తుతిస్తే, ఆయనను స్వీకరించినట్టే. ఆయనను స్వీకరిస్తే, నీవున్న లేమి స్థితి ఖచ్చితముగా సమృద్ధిగా మార్చబడుతుంది.

వారము కొరకైన వాక్యము

చాలా సందర్భాలలో మన వ్యక్తిగతమైన జీవితములలో ఆలస్యము అనేది అనేకమైన సార్లు అనుభవించిన వారిగా ఉన్నాము. ప్రత్యేకించి అసాధ్యముగా కనబడే విషయములో ఆలస్యము అయినప్పుడు నిరాశ నిస్పృహలు కలిగి దానిని వదిలిపెట్టేసేవారిగా ఉంటాము. అయితే మన జీవితములు ఎంతో శక్తివంతమైనవి, మన జీవితముల ద్వారానే దేవుని మహిమ లోకమునకు చాటింపబడుతుంది. అందుకే వాక్యము స్వీకరించుటలో మన ఆశీర్వాదము దాగిఉంది. “నా జీవితము దేవుని శక్తి వెల్లడిపరచబడటానికి ఒక మార్గము అయి ఉన్నది” అని జ్ఞాపకము పెట్టుకోండి.

మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి . గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగియాయెను.౹ ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.౹ అతని అక్కచెల్లెండ్రు – ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.౹ -యోహాను 11:1-3

“యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడు” అని యేసయ్యకు వర్తమానము పంపబడింది.

యేసు అది విని–యీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.౹ యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.౹ అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.౹ -యోహాను 11:4-6

మార్త, మరియ లాజరు కుటుంబమును యేసయ్య ఎంతో ప్రేమిచాడు. అటువంటి కుటుంబములో ఒక వ్యాధి వచ్చింది. అయితే ఒక విషయము మనము జ్ఞాపకము చేసుకోవాలి, యేసయ్యను అంగీకరించినవారి జీవితములో వ్యాధి, రోగము శ్రమ కలగవు అని ఎక్కడా ప్రభువు చెప్పలేదు గానీ, దాని ప్రభావము నీలో, నీపై నిలువదు అని యెరిగి ఉండాలి.

“యీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.” అనగా కొన్ని శ్రమలు మన ద్వారా దేవుడు మహిమపరచబడటానికి కలిగేవిగా ఉన్నాయి. అనేకసార్లు మనము చేసిన తప్పును బట్టి శ్రమకలిగింది అనుకుంటాము అయితే ప్రతీ శ్రమ అటువంటిదే కాదు. అందుకే శ్రమ కలిగినప్పుడు అది ఎందుకు కలిగింది అని దేవుని సన్నిధిలో కనిపెట్టాలి.

ఇక్కడ చదివిన భాగములో మార్త, మరియలు విశ్వాసము కలిగినవారై ఉన్నారు.

మార్త యేసుతో–ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.౹ -యోహాను 11:21

అనగా యేసయ్య గనుక లాజరు చనిపోకముందు దగ్గర ఉండివుంటే ఖచ్చితముగా లాజరు బ్రతికేవాడు అని విశ్వాసము కనపరిచింది.

అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడి–ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను.౹ -యోహాను 11:32

మరియ కూడా అదే విశ్వాసము కనపరచినది. తన సహోదరుడు చనిపోక ముందు గనుక యేసయ్య వస్తే ఖచ్చితముగా బ్రతుకుతాడు అని నమ్మారు. అయితే తాను చనిపోయాక ఇంక విశ్వాసము విడిచిపెట్టారు. అనగా విశ్వసించిన విషయము దొరకక ముగించబడినప్పుడు మన విశ్వాసము విడిచిపెట్టే స్థితిలోనికి మనము వెళతాము. అయితే మనము నమ్మిన దేవుడు అన్యాయస్థుడు కాదు గనుక విశ్వాసమును విడిచిపెట్టక కనిపెట్టి ఉండుట నేర్చుకుందాము.

లాజరు రోగిగా ఉన్నాడు. రోగిగా ఉన్నప్పుడే యేసయ్యకు వర్తమానము పంపిచారు. వర్తమానము అందిన తరువాత రెండు రోజులు యేసయ్య ఆలస్యము చేసారు. దానిని బట్టి, కనిపెట్టినవారు ఆలస్యమైపోయింది అని ఆశ కోల్పోయినవారుగా అయిపోయారు. అయితే ప్రభువు చేసిన ఆలస్యము వెనుక ఒక ఉద్దేశ్యము ఉంది.

దేవుని కృప నాకు కనపరచబడాలి అని నీవు కనిపెట్టుకుని ఉంటే, నీకు కనపరచబడకుండా ఆయన కృప ఎలా మిస్ అవుతుంది? దేవుని కార్యము గూర్చి నీవు విశ్వాసము కలిగి ఎదురు చూస్తుండగా, ఆ కార్యము నెరవేరకుండా ఎలా తప్పిపోతుంది? ఈ సత్యము ఎరిగి ఉండాలి.

అయితే దేవుడు ఆలస్యము చేయుట వెనుక ఉద్దేశ్యము ఏమిటి అంటే, దేవుడు కార్యము ఎలా చేయగలుగుతాడో అనే సత్యము, దేవుని యొక్క సూపర్ నేచురల్ శక్తికి సాక్ష్యముగా నీ జీవితము ఈ లోకము యెదుట కనబడుటయే!

అయితే ఈ అనుభవము మనము కలిగి ఉండాలి అంటే, ప్రార్థన చేయాలి, విశ్వాసము కూడా కనపరచాలి.

ఆయన యీ మాటలు చెప్పిన తరువాత–మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా౹ -యోహాను 11:11

ఏ విషయము గూర్చి నీవు ప్రార్థన చేస్తూ, విశ్వాసము కనుపరుస్తూ ఉన్నావో ఆ విషయము ఆలస్యము అగుట అనేది నిద్రించుచున్న స్థితిలో ఉన్నదానిని సూచిస్తుంది. అది నిద్రించుచున్నదే గానీ, చనిపోయిన స్థితికాదు. అనగా అది ముగించబడలేదు, నెరవేరబడవలసినదే!

ఆయన సముద్రతీరమున నుండగా సమాజమందిరపు అధికారులలో యాయీరను నొకడు వచ్చి, ఆయనను చూచి ఆయన పాదములమీదపడి –నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీచేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితోకూడ వెళ్లెను; బహుజనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. -మార్కు 5:22-24
ఆయన ఇంకను మాటలాడుచుండగా, సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చి–నీ కుమార్తె చనిపోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు వనిరి. యేసు వారు చెప్పినమాట లక్ష్యపెట్టక–భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజమందిరపు అధికారితో చెప్పి -మార్కు 5:35-36
లోపలికిపోయి– మీరేల గొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించు చున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తలిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండి యున్న గదిలోనికి వెళ్లి ఆ చిన్నదాని చెయిపెట్టి– తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. -మార్కు 5:39-42

ఇక్కడ కూడా, యాయీరు జీవితములో భౌతికముగా చనిపోయింది అయితే ఆత్మీయముగా నిద్రించునున్నదే అని ప్రభువు చెప్పుచున్నారు. అయితే ఈ అనుభవము ఎవరి జీవితములో అంటే, నీవు ప్రార్థించి, విశ్వసించిన వారి జీవితములో.

లాజరు జీవితములో కూడా అంతే, ఆలస్యము ద్వారా దేవుని శక్తి కనపరచబడటానికి ప్రభువు ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు. అంతే కాక అబ్రహాము జీవితములో కూడా, చూస్తే, “దహన బలికి అవసరమైన గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు” అని విశ్వాసము కనపరచాడు. ఆ విశ్వాసము ప్రకారము అక్కడ గొర్రెపిల్ల దేవుడు ఏర్పాటుచేసాడు.

నీవు నేను కూడా విశ్వాసము కలిగి కనిపెట్టి ఉన్నయెడల ఎన్నడునూ సిగ్గుపరచబడము.

కావున యేసు–లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను.౹ -యోహాను 11:14

ఒకవేళ యేసయ్య లాజరు వద్ద ఉండి ఉంటే, శిష్యులు వేరేచోట ఉండేవారు. అయితే యేసయ్య గనుక లాజరు వద్ద ఉంటే, లాజరు ఎలాగూ బ్రతుకుతాడు అయితే, శిష్యుల యెదుట ఈ కార్యము జరిగేది కాదు. అయితే ఇప్పుడు శిష్యుల ఎదుట ఆ కార్యము జరుగుటను బట్టి, ఆ శిష్యులు భూమిని తల్లకిందులు చేసే వారిగా సిద్ధపరచబడ్డారు.

అనగా దేవుడు ఆలస్యము చేయుటలో ఒక ఉద్దేశ్యము దేవుని శక్తి మన జీవితము ద్వారా లోకమునకు చాటి చెప్పుట, మరొకటి ఆ కార్యము ద్వారా దేవుని పని కొరకు మరొకరిని లేవనెత్తి సిద్ధపరచుట.