స్తోత్రగీతము – 1
హల్లెలూయా ఆరాధన
రాజాధి రాజు యేసునకే
మహిమయు ఘనతయు
సర్వాధికారి క్రీస్తునకే (2)
చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ
ఆ ప్రభుని కీర్తించెదం
నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో
స్తోత్రార్పణ చేసెదం ||హల్లెలూయా||
రూపింప బడక ముందే
నన్ను ఎరిగితివి
నా పాదములు జారకుండా
రక్షించి నడిపితివి (2) ||చప్పట్లు||
అభిషేక వస్త్రము నిచ్చి
వీరులుగా చేసితివి
అపవాది క్రియలను జయించే
ప్రార్థన శక్తినిచ్చితివి (2) ||చప్పట్లు||
స్తోత్రగీతము – 2
నన్నాకర్షించిన నీ స్నేహబంధం
ఆత్మీయ అనుబంధం (2)
ఆరాధన – నీకే యేసయ్యా (2)
నాచేయిపట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా (2)
{నన్నాకర్షించిన}
మహా ఎండకు కాలిన అరణ్యములో
స్నేహించిన దేవుడవు నీవూ
సహాయకర్తగ తోడు నిలచి తృప్తి పరచిన దేవా..
చేరదీసిన ప్రభువా.. (2)
నన్నాకర్షించిన నీ ప్రేమ బంధం- అనురాగ సంబంధం
చెడిన స్థితిలో లోకంలో పడియుండగా
ప్రేమించిన నాధుడవు నీవే
సదాకాలము రక్షణ నిచ్చి శక్తినిచ్చిన దేవా
జీవమిచ్చిన ప్రభువా.. .(2)
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం – ఆత్మీయ అనుబంధం
స్తోత్రగీతము – 3
అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2)
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)
పాపముల నుండి విడిపించును
యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
క్రీస్తేసు నామము (2)
||యేసు నామము ||
సాతాను పై అధికార మిచ్చును
శక్తి గల యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము (2)
||యేసు నామము ||
స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము (2)
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము (2)
||యేసు నామము ||
ఆరాధన వర్తమానము
దేవుని సన్నిధిలో మనము కూడుకొన్న ఈ సమయము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ లోకములో ఎంతో ప్రాముఖ్యమైనది గా ఎంచబడే దానికన్నా కూడా ఈ సమయము ఎంతో ప్రశస్తమైనది. మన వ్యక్తిగతమైన జీవితాలు ఆయన సొంతమై ఉన్నవి. మనము ఆయన కొరకే ఉన్నాము, ఆయన మహిమ కొరకే మన జీవితము ఉంది అని సిద్ధపరచుకున్నప్పుడు, అడుగడుగునా దేవుని కృపను చూసేవారిగా మనము ఉండగలుగుతాము. దేవుని సన్నిధిలో ఉండే ఈ సమయము, మనకు మనమే చేసుకోలేని విషయాలను, దేవుని వాక్యము మన పక్షమున చేసేదిగా ఉంటుంది. లోకములోని మాలిన్యము మనకు అంటుకున్నప్పుడు మనలను శుద్ధిచేసేది దేవుని వాక్కు మాత్రమే. మన జీవితాలను బాగు చేయడానికే దేవుడు తన వాక్కును విడుదల చేస్తాడు.
ఉదయాన తెలియచేయబడిన సత్యము – “మనము చేసే యదార్థమైన ఉపవాసము, అపవాది ఎంతటి శక్తినైనా సరే జయించగలుగులాగున పరలోకమును సహితము కదిలించగలిగిన శక్తి గలది”.
సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు. -యెషయా 12:6
“సీయోను నివాసీ” అంటే, దేవుని పట్టణములో నివాసము ఉండేవారు. మనము కూడా దేవునికి స్వంతమైన వారము, దేవునికి ఆలయముగా ఉంటున్నాము గనుక ఈ మాటలు మనకొరకే! ఈసాయంకాలము దేవుడు తెలియ చేస్తున్న సత్యము – “నీ మధ్యన నీ దేవుడు ఉన్నాడు”. అయితే నీ మధ్యన ఉన్న దేవుడు ఏమై ఉన్నాడో అని చూస్తే,
సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశములో అష్షూరును సంహరించెదను నా పర్వతములమీద వాని నలుగద్రొక్కెదను వాని కాడి నా జనులమీదనుండి తొలగిపోవును వాని భారము వారి భుజముమీదనుండి తొలగింప బడును. -యెషయా 14:24-25
నేను ఏమి నిర్ణయించానో అలాగుననే జరుగుతుంది, నేను ఏమి ఆలోచన నీ పట్ల కలిగి ఉన్నానో అదే స్థిరపరచబడుతుంది అని దేవుడైన యెహోవా చెప్పుచున్నాడు.
నా దేశములో అనగా దేవునికి సంబంధించిన నీ జీవితము, అష్షూరు అనగా అపవాదికి సంబంధించిన ఏదైనా సరే, దానిని తొలగించి, సంహరించే ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రకటించబడే దేవుని వాక్కు వెలుగై ఉన్నది, మన జీవితములో ఎక్కడ చీకటి ఉన్నదో, అక్కడ ఆ వెలుగు ప్రకాశిస్తుంది, ఆ చీకటిని పారద్రోలుతుంది. గనుక ఉత్సహించు, నీ జీవితములోని అష్షూరు సంహరించబడుతున్నాడు.
యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. -కీర్తనలు 94:14
మనలను విలువ పెట్టి కొని సంపాదించుకున్నాడు గనుక, మనము ఆయన సొత్తు, స్వాస్థ్యము గనుక మనలను ఎన్నడూ విడవడు, ఎడబాయడు. నీ జీవితములో నిన్ను నలిచివేస్తున్న ప్రతీ పరిస్థితికీ కారణమైన దానిని నీ జీవితమునుండి తొలగిస్తాను అని నీ దేవుడే సెలవిస్తున్నాడు.
దుష్టులమీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? -కీర్తనలు 94:16
ఈ వాక్యము వింటున్న నీవు నిలిచే వాడవు ఎందుకనగా, నీ దేవుడు నీకు వ్యతిరేకముగా నిలబడుతున్న అష్షూరును సంహరిస్తున్నాడు, నీవు దేవుని స్వాస్థ్యమై ఉన్నావు. నీవు ఈ సత్యమును నీవు గ్రహించి నిలబడినప్పుడు, అపవాదికి వణుకు పుడుతుంది. ఆదాము, హవ్వల జీవితములో అపవాది ప్రవేశించినప్పుడు, దేవుడు ఒక యుద్ధమును ప్రకటించాడు. గనుక, దేవునికి నీకు కలిగియున్న సంబంధమును నీవు ఎరిగి ఉన్నప్పుడు, అపవాది వణికేవాడిగా ఉంటాడు. గనుక ఈ సత్యమును విడిచిపెట్టవద్దు. ఎరిగిన సత్యమును ప్రకటించుట ఎంతో ప్రాముఖ్యము.ఇలా నీవు ప్రకటించినప్పుడు అపవాదికి సంబంధించిన కార్యములు నీ జీవితములో ఖచ్చితముగా లయమైపోవలసినదే.
వాక్యము పట్టుకొని ఏ పరిస్థితిలో చీకటి ఉందో, ఆ పరిస్థితిలో నిలబడినప్పుడు, అప్పటివరకు ఉన్న ఆ చీకటి నీవు నిలబడిన ఆ వాక్యమును బట్టి తొలగిపోతుంది.
నా దేశములో అష్షూరును సంహరించెదను నా పర్వతములమీద వాని నలుగద్రొక్కెదను వాని కాడి నా జనులమీదనుండి తొలగిపోవును వాని భారము వారి భుజముమీదనుండి తొలగింప బడును. సర్వలోకమునుగూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరిమీద చాపబడిన బాహువు ఇదే. -యెషయా 14:25-26
ఈ మాటలు దేవుడు ప్రమాణపూర్వకముగా సెలవిస్తున్న మాట ఇది గనుక, నీ జీవితములో ఉన్న కాడి విరుగగొట్టబడులాగున ఈ సత్యమును ప్రకటించు, ఆ వాక్కును చేతబట్టుకుని నిలబడు. అప్పుడు నీ జీవితములో ఇంతవరకు ఉన్న అపవాది భారము ఇంక నిలువదు, వాడి కాడి విరుగగొట్టబడవలసినదే! గనుక విశ్వాసపూర్వకముగా నీవు దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు నీవు ఆ సత్యమును ప్రకటిస్తున్నావు. నీవు అలా ప్రకటించగానే, అపవాది కాడి, భారము తొలగించబడే కార్యము ఖచ్చితముగా జరిగుతుంది.
దేవుడు ప్రమాణ పూర్వకముగా ఈరోజు నీకు తెలియచేసిన మాటలు స్వీకరించడానికి నీవు సిద్ధమా? అయితే ఈ మాటలను వదలక ప్రకటించు. ఈరోజు ఆరాధనలోనే కాదు గానీ, ప్రతీ రోజూ, నీ ప్రతి పరిస్థితిలో ఈ సత్యము ప్రకటించు.
కాడి అంటే, మనకు ఇష్టము ఉన్నాలేకున్నా అపవాది చెప్పినట్టే చేయుట . అయితే ఈరోజు నీవు చేసే ప్రకటన, ఆ కాడిని విరుగగొట్టి, నిన్ను స్వతంత్రుడుగా చేస్తుంది. అందుకే నీవు ఈ సత్యమును నమ్మితే, స్వీకరించు. స్వీకరిస్తే, మౌనముగా ఉండక ఉత్సాహముతో ఆయనను ఆరాధించు.
మీరు చేసే విశ్వాస సహితమైన ఆరాధన ఎంత శక్తిగలిగినదో మీరు అనుభవించులాగున, మౌనముగా ఉండక, తెలియచేయబడిన సత్యమును బట్టి నోరు తెరిచి స్తుతించండి.
ఆరాధన గీతము
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భజియించి పూజించి ఆరాధింప
నీకే నీకే మహిమ (2)
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
మహిమా నీకే మహిమా – (4) ||దేవా||
కష్టాలలోన నష్టాలలోన
కన్నీరు తుడిచింది నీవే కదా (2)
నా జీవితాంతం నీ నామ స్మరణే
చేసేద నా యేసయ్యా (2) ||మహిమా||
నా కొండ నీవే నా కోట నీవే
నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే (2)
నిన్నే భజించి నిన్నే స్తుతించి
ఆరాధింతునయా (2) ||మహిమా||
నీ జీవితములో ఉన్న అష్షూరు ఇక నిలువడు, ఆ పరిస్థితులు ఇంక కొనసాగవు, ఇదే దేవుని వాక్కు.
ఈరోజు దేవుని వాక్కు (రేమా): నీ జీవితములో ముగించబడవలసినది ముగించబడుతుంది. ఇంతవరకు ఏమైనా సరే ఇప్పుడు మాత్రము పరలోకము కార్యము జరిగించే సమయము.
నేల మీద ఉన్న నిన్ను సింహాసనముపై కూర్చుండబెట్టుటకు దేవుడు కార్యము జరిగించబోతున్నాడు. గనుక సంతోషించి దేవుడు ఇచ్చిన మాటను పట్టుకుని ఇంక ముందుకే సాగండి గానీ వెనుకకు చూడకండి.
వారము కొరకైన వాక్యము
కోల్పోయినదానిని తిరిగి సంపాదించుకొనుట అనే విషయమును గూర్చి తెలుసుకుందాము. “నీ ఆత్మ వర్థిల్లుతున్న ప్రకారముగా నీవు అన్ని విషయములలో అభివృద్ధి చెంది వర్థిల్లుతావు” అని వాక్యము సెలవిస్తుంది కదా! మనము ఆశీర్వాదము వెంబడి వెళ్ళడము కాదు గానీ కీర్తనలలో చూసినట్టు శ్రేష్టమైన ఆశీర్వాదములే మనలను ఎదుర్కోవాలి.
కోల్పోయినదానిని తిరిగి సంపాదించుకోవాలి అంటే మన ఆత్మీయ స్థాయిని నిలబెట్టుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. దాని కొరకు మత్తయి సువార్తలోని భాగము ద్వారా నేర్చుకుందాము.
పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది. -మత్తయి 25:1
ఇది ఒక ఉపమానము. ఇక్కడ పది మంది కన్యకలు అని వ్రాయబడి ఉన్నది. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి దివిటీలు పట్టుకొని వారు బయలుదేరినారు. అయితే కన్యకలు మాత్రమే ఇక్కడ ప్రస్తావించబడ్డారు ఎందుకు అని ఆలోచిస్తే, కన్యకలు అనగా పురుషుని ఎరుగని వారు పవిత్రమైన వారుగా పరిశుద్ధమైనవారుగా మనము చూడవచ్చు. అనగా పిలువబడినవారు పరిశుద్ధులుగా ఉన్నారు అని అర్థము చేసుకోవచ్చు. మనము పరలోకరాజ్యమును చేరడానికి పిలువబడ్డాము. మనము యేసయ్యను బట్టి పరిశుద్ధమైన జీవితమును పొందుకున్నాము.
వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు. -మత్తయి 25:2
ఇక్కడ చూస్తే, ఇక్కడ బుద్దిగలిగినవారుగా, బుద్ధిలేనివారుగా ఎలా చెప్పబడుతున్నారు? అది వారికి కలిగిన జ్ఞానమును బట్టి ఆ సాక్ష్యము వచ్చిందా? వారి క్రియలను బట్టి వచ్చిందా? ఈ సత్యమును మనము కూడా గ్రహించాలి. యేసయ్యను అంగీకరించిన మనము పరిశుద్ధతను ధరించుకొనే ఉన్నాము. అయితే సమయము వచ్చినప్పుడు చేసే క్రియలను బట్టి మనకు సాక్ష్యము స్థిరపరచబడుతుంది.
బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి. -మత్తయి 25:3-4
ఈ పదిమంది వద్ద దివిటీలు ఉన్నాయి. ఈ పది మంది కూడా పెండ్లికుమారుడికొరకు ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే నూనె తీసుకువెళ్ళిన కన్యకలు ఏమి ఆలోచన కలిగి తీసుకెళ్ళారు? నూనె తీసుకుని వెళ్ళని కన్యకలు ఏమి ఆలోచన కలిగి తీసుకువెళ్ళారు?
ఒకవేళ పెండ్లి కుమారుడు వచ్చేసరికి ఈ దివిటీ ఆరిపోతే, నూనె గనుక దగ్గర ఉంటే, మరలా వెలిగించుకోవచ్చు అని బుద్ధిగలిగిన కన్యకలు ఆలోచించారు. నూనె అనేది పరిశుద్ధాత్మకు నిదర్శనము. పరిశుద్ధాత దేవుడు మనలో ఉన్నంతకాలము మన జీవితములు ప్రకాశిస్తాయి, వెలుగుమయముగా ఉంటాయి. అయితే ఎలా అయితే, “నూనె ఉంటేనే గానీ దివిటి వెలగదు” అని బుద్ధిగలిగిన వారు గ్రహించారో, మనము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకుండా మనము ప్రకాశించలేము.
పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రివేళ– ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధిలేని ఆ కన్యకలు– మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి. -మత్తయి 25:5-8
ఇక్కడ చూస్తే, బుద్ధిలేని వారి దివిటీలు ఆరిపోతున్నాయి, తిరిగి వెలిగించుకోవడానికి వారి వద్ద నూనె లేదు. అనగా వారు నిర్లక్ష్యముగా ఉన్నట్టుగా మనము చూడవచ్చు. బుద్ధిగలిగినవారుగా నూనె సిద్ధపరచుకొన్నట్టు, మన జీవితములో నిత్యము పరిశుద్ధాత్ముడు మనలోనే నిత్యము ఉండాలి అంటే ఏమి చేయాలి?
ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడు–నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. -లూకా 3:21-22
మనలో పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి అంటే ఏమి చేయాలి? బాప్తీస్మము అంటే ఏమిటి? మన పాపములు సమాధిచేయబడి ఉండుట, నూతనమైన వ్యక్తిగా తిరిగి లేచుట అనేదానిని సూచిస్తుంది. అంటే, పాపము విషయములో సమాధిచేయబడినవారుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనమీదికి దిగివచ్చి, మనలో ఉండేవారుగా ఉంటారు. మనము దేనికొరకు తిరిగి లేచాము అంటే, నూతమైన పరిశుద్ధత కలిగి జీవించే వ్యక్తిగా తిరిగి లేచాము. నూనెను చూస్తే, అగ్నిని రగిలించగలిగే శక్తి కలిగి ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మకు కూడ ఒక శక్తి ఉంది.
మృతులలోనుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. -రోమా 8:11
పరిశుద్ధాత్మకు ఉన్న ఆ శక్తి ఏమిటి అని చూస్తే, “మృతమైనదానిని జీవింపచేయుట”. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి అంటే, పాపము విషయములో మృతమైపోవాలి. అయితే నేను పరిశుద్ధాత్మను కలిగి కొనసాగించాలి అనే బలమైన ఆలోచన కలిగి ఉండాలి. అయితే అలాకాక నిర్లక్ష్యముగా ఉన్నట్టయితే, మధ్యలోనే ఆయనను పోగొట్టుకొనేవారిగా అయిపోతాము. గనుక మనము ఈ సత్యమును ఎరిగినవారిగా సిద్ధపడదాము.
ఇక్కడ మనము చూస్తే, దివిటీలలో ఉన్న నూనె సమయము గడిచేకొద్దీ అయిపోతుంది. మరి మనము పరిశుద్ధత్మను ఎలా దూరము చేసుకుంటాము? ఇది అర్థము చేసుకోవడానికి కొన్ని వచనాలు చూద్దాము.
లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును.౹ -యోహాను 14:17
పాపము విషయములో మృతమైనప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. అయితే మనము ఏ పాపమును విడిచిపెట్టి ఒప్పుకున్నామో అదే పాపమును మరలా తిరిగి చేయుటకు బయలుదేరితే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండడు గానీ, నీతో ఉండి నీవు చేసేది తప్పు అని నిన్ను పాపమును గూర్చి ఒప్పించేవాడుగా ఉంటాడు. ఈ హెచ్చరికలను ఖాతరు చేయక ముందుకు వెళ్ళేవారు క్రమక్రమంగా పరిశుద్ధాత్మ దేవునిని కోల్పోయేవారిగా ఉంటారు.
బుద్ధిలేని ఆ కన్యకలు– మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. -మత్తయి 25:8-9
ఈ భాగములో చూస్తే, పెండ్లి కుమారుడు వచ్చాడు అనే పిలుపు వచ్చింది అప్పుడు బుద్ధిలేనివారు సరిచేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. మన జీవితములో చూస్తే, మనము ఆత్మీయ జీవితములో పడిపోయిన స్థితిలో ఉంటే, తిరిగి నిలబెట్టుకోవడానికి ఒక అవకాశము ఉంది. “అమ్మువాని యొద్దకు పోయి కొనుక్కోవాలి” అంటే ఏమిటి? పరిశుద్ధత్మను అమ్మువాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే నూనెను అమ్మువాడు. అయితే ఎలా కొనాలి? నీ దగ్గర ఉన్నది ఇచ్చి, ఆయన వద్ద ఉన్నది కొనాలి. అయితే మన దగ్గర ఏమి ఉంది? మనము చేసిన పాపమే ఉంది. ఆ పాపమును ఒప్పుకొనుటయే ఆయనకు ఇచ్చుట, అప్పుడు ఆయన వద్ద ఉన్న పరిశుద్ధతను మనకు దయచేసేవాడుగా ఉంటాడు. ఎప్పుడైతే నీలో ఉన్న పాపమును విడిచిపెట్టేవానిగా సిద్ధపడతావో, అప్పుడు నీతో ఉన్న పరిశుద్ధాత్ముడు, నీలోనికి వచ్చేవాడుగా ఉంటాడు.
తప్పిపోయిన కుమారుని ఉపమానములో చూస్తే, తప్పిపోయిన కుమారునికి బుద్ధివచ్చినప్పుడు వాడు కూడ సరిచేయబడటానికి సిద్ధపడుతున్నాడు. ఎలా సిద్ధపడుతున్నాడో చూస్తే,
అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు–నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను. నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను. -లూకా 15:17-19
మనము చేసే క్రియలలో ఆత్మీయమైన విషయములు మిళితమై ఉన్నాయి గనుక, మనము భౌతికముగా పాపము చేసినప్పటికీ పరలోకమునకు వ్యతిరేకముగా పాపము చేసేవారిగా అయిపోతాము. ఇది మనము తెలుసుకోవలసిన సత్యము. ఎప్పుడైతే బుద్ధివచ్చి తండ్రిదగ్గరకు వచ్చాడో ఏమి జరిగింది?
వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. -లూకా 15:20-21
చిన్న కుమారుడు తండ్రి వద్దకు వచ్చి తన తప్పును ఒప్పుకోగానే, తండ్రి తన ప్రేమను కనపరచాడు. ఎలా అంటే, తాను పోగొట్టుకొన్న సమస్తము తిరిగి సంపాదించుకొన్నవాడిగా మారిపోయాడు.
అయితే తండ్రి తన దాసులను చూచి –ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి; క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము; -లూకా 15:22-23
మనము కూడా మనము చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పాపమునకు మృతుడవుగా నీవు ఎంచుకొని జీవిస్తే మరలా నీవు పరిశుద్ధాత్మను నీలో నివసించులాగున ఆయన మరలా నీలో నివసిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మను నేను కలిగి ఉండాలి అనే బలమైన బుద్ధిపూర్వకమైన ఆలోచన నిత్యము కలిగి ఉండాలి అలా కాని యెడల మన నిర్లక్ష్యము మన జీవితాలను నాశనము చేస్తుంది.
వస్త్రము రక్షణ, ఉంగరము అధికారము, చెప్పులు సమాధాన సువార్తకు సూచనగా ఉన్నాయి. ఎప్పుడైతే నీవు మరలా వెనక్కి వెళ్ళి చేసిన పాపములను విడిచిపెట్టినయెడల తిరిగి నీవు రక్షణ, అధికారము, సువార్త కొరకు పరిచర్యకొరకు తిరిగి వాడబడే స్థితిలోనికి మరలా రాగలుగుతావు.
పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నీలో జీవము కలిగినవాడిగా నీవుంటావు. అలాగే నీ యెదుట వ్యతిరేకమైనది నిలబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు వాటిని దహించేవాడుగా ఉంటాడు. మనలను మనమే సిద్ధపరచుకుందాము.