స్తోత్రగీతము – 1
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4)
యేసయ్యా నీవే నా రక్షకుడవు
యేసయ్యా నీవే నా సృష్టికర్తవు
దరి చేర్చి ఆదరించుమా
ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా
వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు
ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు
హాల్లేలూయా ఆమెన్
ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా
పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి
సర్వాధికారివి.. ఓ యేసయ్యా (2)
కరుణించి కాపాడుమా
ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2)
||హల్లెలూయా||
స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్
కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా (2)
కృప చూపి నడిపించుమా
ఓ యేసయ్యా.. కృప చూపి నడిపించుమా (2)
||హల్లెలూయా||
స్తోత్రగీతము – 2
మేలు చేయక నీవు ఉండలేవయ్య – ఆరాధించక నేను ఉండలేనయ్య || 2 ||
యేసయ్యా యేసయ్యా || 2 || || మేలు చేయక ||
నిన్ను నమ్మినట్లు నేను – వేరే ఎవరిని నమ్మలేనయ్యా
నీకు నాకు మధ్య దూరం – తొలగించావు వదిలుండలేక
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా
క్రియలున్న ప్రేమా నీదీ – నిజమైన ధన్యతనాది || యేసయ్యా ||
ఆరాధించే వేళలందు – నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపము కలిగే నాలో – నేను పాపినని గ్రహింయిన్చగానే
నీ మేళ్లకు అలవాటయ్యి – నీ పాదముల్ వదలకుంటిన్
నీ మేళ్లకు అలవాటయ్యి – నీ పాదముల్ వదలకుంటిన్
నీ కిష్టమైన దారి – కనుగొంటిని నీతో చేరి || యేసయ్యా ||
పాపములు చేసాను నేను – నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించగల్గే నీ మనసు – ఓదార్చింది నా ఆరాధనలో
నా హృదయము నీతో అంది – నీకు వేరై మనలేనని
నా హృదయము నీతో అంది – నీకు వేరై మనలేనని
అతిశయించెద నిత్యమూ – నిన్నే కలిగి ఉన్నందుకు || యేసయ్యా ||
స్తోత్రగీతము – 3
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను నాట్యమాడెదన్ – 2
నాట్యమాడెదన్ నేను నాట్యమాడెదన్ నేను
దావీదువలె నేను నాట్యమాడెదన్
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను పాటపాడెదన్ – 2
పాటపాడెదన్ నేను పాటపాడెదన్ నేను
దావీదువలె నేను పాటపాడెదన్
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను స్తుతించెదను
స్తుతించెదన్ నేను స్తుతించెదన్ నేను
దావీదువలె నేను స్తుతించెదను
ఆరాధన వర్తమానమ
పరిశుద్ధ దినము యొక్క విలువ తెలిసినవారు దీనిని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. మన వ్యక్తిగతమైన జీవితములు ప్రభువుకు సొంతమై, ఆయన సొత్తైన జీవితములు. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు, నీ జీవితములో ప్రతి విషయములో ఆయనే బాధ్యత తీసుకోనేవాడుగా ఉంటాడు గనుక మన జీవితములు ఆయనకు సమర్పించుకోవాలి. అంతేకాక ఆత్మ సంబంధమైన విషయములయందు మనము ఎదిగేవారుగా ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడొ మనము ఎరిగినప్పుడు ఈ విధముగా సిద్ధపడగలము. ఇశ్రాయేలు ప్రజల జీవితములను మనము గమనిస్తే ఈ విషయము మనము గ్రహించగలము. ఇశ్రాయేలీయులు తన ప్రజలుగా స్వీకరించినదానిని బట్టి, వారి చెప్పులు అరిగిపోలేదు, బట్టలు చిరిగిపోలేదు.
దేవునితో గల సంబంధములో యదార్థతను కనుబరిచి ఆయన సన్నిధికై ఆశ కలిగిన జీవితములు గనుక జీవిస్తే మన జీవితములో కావలసిన సమస్తము ఆయనే దయచేసేవాడుగా ఉంటాడు. మన దేవుడు ఎంతో నమ్మకత్వము గలవాడై ఉన్నాడు గనుక, ఆయనలో నీవు ఉంటునన్నావా లేదా? నీ ప్రవర్తన, మాట ఆయనకు తగినట్టుగా ఉందా లేదా అనే విషయాలలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మన జీవితాలను దేవుని వద్దనుండి లాక్కుపోవడానికి అపవాది ఎల్లప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు.
మనము లోకములో ఉన్నాము గనుక దాని మాలిన్యము ఖచ్చితముగా మనకు అంటుకుంటుంది, లేదా ప్రయత్నము ఖచ్చితముగా జరుగుతుంది గనుక, వాక్యము ద్వారా ఉదక స్నానము చేయవలసిన అవసరము ఉంది. అందుకే ఆదివారము దేవుని సన్నిధిని అస్సలు మనము పోగొట్టుకోకూడదు. మనము నిజాయితీగా, సత్యముతో, ఆత్మతో మనము ఆరాధించినప్పుడు మనము నూతనమైన ఉజ్జీవము గలిగినవారమై ఉండుట అనే అనుభవమును పొందువారిగా ఉంటాము.
ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను -యెషయా 12:2
నేను రక్షించబడటానికి కారణము ఆయనే కాబట్టి నేను ఆయనను నమ్ముకొంటున్నాను అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. “యెహోవా యెహోవాయే…” అంటే యెహోవాను తప్ప ఇంక ఖచ్చితముగా నూటికి నూరు శాతము వేరెవరినీ నమ్ముకొనను అని అర్థము.
అంతేకాక, నేను పాడటానికి, స్తుతించడానికి, కీర్తించడానికి ఆయనే కారణము. ఏలయనగా నేను రక్షించబడటానికి ఆయనే కారణము అయి ఉన్నాడు అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. మరి నీవు నేను రక్షించబడటానికీ, గడిచిన దినములలో మనము క్షేమము కలిగి నిలిచి ఉండటానికి కూడా మనలను ప్రేమించిన దేవుడే కారణము. ఆయన కృపనుబట్టియే మనము ఈరోజున జీవించి ఉన్నాము. అనగా మనము బ్రతుకుటకు ఆయనే ఆధారము అయి ఉన్నాడు.
యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను. -నిర్గమకాండము 15:2
ఇక్కడ కూడా మోషేయు, ఇశ్రాయేలీయులు “యెహోవాయే నా బలము, నా గానము” అని చెప్పుచున్నారు. యెహోవా చేసిన గొప్ప రఖణకార్యమును బట్టి వారు చెప్పుచున్నమాటలు ఇవి.
యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను. -కీర్తనలు 118:14
ఇక్కడ దావీదు కూడా అదే సాక్ష్యము ఇస్తున్నాడు. అంటే తరములు మారినప్పటికీ మన దేవుని గూర్చిన సాక్ష్యము, అనుభవము మారడము లేదు గనుక మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నదేవుడుగా మనము అర్థము చేసుకోగలము.
ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు ఆయన రక్షణాధారము అనే సాక్ష్యము ప్రకటించబడింది. ఆలా ప్రకటించబడిన సాక్ష్యము యెషయా సమయములో కొనసాగించబడింది, దావీదు సమయములో కొనసాగించబడింది ఇప్పుడు మన జీవితములో కూడా అదే సాక్ష్యము కొనసాగించబడి ప్రకటించబడాలి.
మోషేను చూస్తే, అంతవరకు తానెరుగని అద్భుత కార్యములను అనుభవించి ఆ కీర్తన గానము చేసినవాడై ఉన్నాడు. అలా ప్రకటించబడిన దేవుని లక్షణమును తరువాతి తరములలోని వారుకూడా అనుభవించి తిరిగి అదే విధానములో దేవునిని కీర్తించినట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఇప్పుడు మన జీవితములో ఆయన లక్షణములను అనుభవించినప్పుడు అదే సాక్ష్యము మనము ఇవ్వగలుగుతాము.
ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను -యెషయా 12:2
వాక్యము చదువుట మొదటి స్థాయి, వాక్య ధ్యానము రెండవ స్థాయి, వాక్య అనుభవము మూడవ స్థాయి. మనము ఈ వాక్యమును అనుభవించే స్థాయికి వచ్చినప్పుడు ఖచ్చితముగా మన దేవుని గూర్చిన సాక్ష్యము మన జీవితము ద్వారా ఖచ్చితముగా ప్రకటించబడుతుంది.
కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలోనుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరీలాగందురు –యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చు కొనుడి. -యెషయా 12:3-4
“రక్షణాధారములైన బావులలోనుండి నీళ్లు చేదుకొందురు” అనే వాక్యమును గమనిస్తే. సంఘములో ఉన్న మనకు ఒక్కోక్కరికీ ఒక్కొక్క విషయములో రక్షణాధారము అవసరమై ఉన్నది. వాక్యము జ్ఞాపకము చేసుకుంటే, బుద్ధిజ్ఞానముల సర్వసంపదలు యేసుక్రీస్తులోనే ఉన్నవి, సమస్తమునకు ఆధారమైనవాడు యేసయ్యే అనే సత్యము మనకు బోధపడుతుంది యేసయ్యే ఆ రక్షణాధారమైన బావిగా చూస్తే, చేదుకొనుట అనగా స్వీకరించుట అని అర్థము చేసుకోవచ్చు. అంటే, యేసయ్యే రక్షణాధారము అని ఎరిగిన వారు, ఆయనలో సమస్తము ఉన్నవి అని యెరిగి, ఆయనలో ఉన్న సమస్తములోనుండి వారికి ఆ దినమునకు అవసరమైన దానిని విశ్వాసముతో స్వీకరించి, అనుభవించి, దేవుని స్తుతించేవారిగా ఉంటాము అని అర్థము. అనగా మన అనుభవపూర్వకమైన ఆరాధనకు యేసయ్యలో మనకు ఇవ్వబడిన రక్షణాధారమైన వాక్కును విశ్వాసముతో స్వీకరించుట అనేది ఎంతో ప్రాముఖ్యము. అందుకే మనము ఈ సత్యము ఎరిగినవారుగా మౌనముగా ఉండక మన దేవునిని ఆరాధిద్దాము. తరములు మారినా ప్రభువును గూర్చిన సాక్ష్యము మారలేదు. ఈ సత్యము ఎరిగి ఆరాధనకు సిద్ధపడదాము.
ఆరాధన గీతము
ఆధారం నీవేనయ్యా (2)
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా ||ఆధారం||
నీ దీప స్థంభమై నేను
జీవించ చిరకాల ఆశ
నీ దరికి చేరి
నను నీకర్పించి
సాక్షిగా జీవింతును (నా దేవా) ||ఆధారం||
నీ మహిమ కొరకే నేను
జీవించ చిరకాల ఆశ
నీ దరి కి చేరి
నను నీకర్పించి
సాక్షిగా జీవింతును (నా దేవా) ||ఆధారం||
వారము కొరకైన వాక్యము
యేసయ్య దగ్గరకు వచ్చి వట్టి చేతులతో వెళ్ళినవారు ఎవరూ లేరు గనుక ఆయన సన్నిధికి వచ్చిన మనము వట్టి చేతులతో వెళ్ళము. ఆయనే మన రక్షణకు ఆధారము అనే సత్యము ఈరోజున విశ్వసించి, ఆరాధన ద్వారా ప్రకటించాము గనుక ఈ వారమంతా ఈ సత్యమును అనుభవించడానికి సిద్ధపడదాము. ఈ వారములో ప్రతి రోజు ఈ సత్యము ఎలా కనపరచబడుతుంది అని గమనించండి, మీరు ఏ విషయములో కనపరచబడిందో గమనించి ప్రతి రాత్రి దానిని బట్టి స్తుతించండి.
ఈరోజున మన జీవితములో సాతాను ప్రయత్నాలు నశించడానికి ఏమి చేయాలి అనే విషయము గూర్చి తెలుసుకుందాము. ఈ లోకములో రెండే కార్యములు, దేవుని రాజ్యము కట్టబడాలి అపవాది రాజ్యము కూల్చబడాలి లేదా అపవాది రాజ్యము దేవుని రాజ్యమును నశింపచేయాలి. ఈ రెండు విషయాలను బట్టియే లోకములోని కార్యములు జరుగుతున్నవి.
ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరచి వాని హెచ్చించి, వాని పీఠమును తన దగ్గర నున్న అధిపతులందరికంటె ఎత్తుగా నుంచెను.౹ కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరును రాజాజ్ఞాను సారముగా మోకాళ్లూని హామానునకు నమస్కరించిరి. మొర్దకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు–నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దకైని అడిగిరి.౹ ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయెను గనుక వారు–మొర్దకైయొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు–నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి యుండెను.౹ -ఎస్తేరు 3:1-4
“ఈ సంగతులైన తరువాత ” అనగా ఎస్తేరు రాణిగా చేయబడిన తరువాత అని గమనించవచ్చు. ఇక్కడ రాజుచేత హామాను హెచ్చింపబడ్డాడు గనుక అందరూ అతనికి సాగిలపడి నమస్కరించేవారుగా ఉండేవారు. అయితే మొర్దెకై మాత్రము అలా సాగిలపడక ఉండెను. దానికి కారణము ఏమిటి అంటే, “నేను యూదుడను గనుక” అనే సత్యము అతను ఎరిగి ఉండుటను బట్టియే. అనగా తాను ఏమై ఉన్నాడో తాను ఎరిగి ఉన్నాడు. అంతే కాక తాను ఏమై ఉన్నాడో దానిని బట్టి ఏమి చెయ్యాలో చెయ్యకూడదో కూడా ఎరిగినవాడై ఉన్నాడు. మనము చూస్తే, మనము క్రైస్తవులము అని ఎరిగి ఉంటే, క్రైస్తవులుగా మనము ఏమి చేయవచ్చో, ఏమి చెయ్యకూడదో ఎరిగి ఉండాలి. మనము చదివిన వాక్యములో ముందుకు వెళితే,
–ఆ వెండి నీకియ్య బడియున్నది; నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి యున్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు.౹ -ఎస్తేరు 3:11
ఇక్కడ హామాను యూదులకు శత్రువుగా ఉన్నాడు. గనుక మొర్దెకై అస్సలు మోకాళ్ళూనలేదు. దీనిని బట్టి మనము అర్థము చేసుకోవలసినది ఏమిటి అని చూస్తే, ఈ లోకము దేవునికి శత్రువు గనుక, ఈ లోకమునకు అనుకూలముగా దేవునిని అవమానకరమైన ఏ కార్యము చేయకూడదు.
అయితే ఈ హామాను మొర్దెకైను బట్టి ఎంతో కోపము కలిగి, అతనిని మాత్రము చంపక, తన జనులైన యూదులందరినీ చంపాలి అనే దురాలోచన చేసాడు. మన జీవితములో చూస్తే, మనము క్రైస్తవులము గనుక మన జీవితములో అపవాది శ్రమ పరచడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తాడు. మొర్దెకై ఆత్మీయ జీవితమునకు ప్రతినిధిగా ఉన్నాడు, హామాను అపవాదికి సంబంధించిన జీవితమునకు ప్రతినిధిగా ఉన్నాడు. అందుకే వచ్చిన శ్రమలో మొర్దెకై మాటలు, ఆలోచన ఎలా ఉందో చూస్తే,
నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్నయెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును గాని, నీవును నీ తండ్రి యింటివారును నశించుదురు. నీవు ఈ సమయమునుబట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను.౹ -ఎస్తేరు 4:14
మన జీవితములో కూడా అపవాది నాశనకరమైన ప్రయత్నములు చేస్తున్నాడు అనే సంగతి తెలియచేయబడుతుందో, అప్పుడు మనము మౌనముగా ఉండే సమయము కానే కాదు. ఎస్తేరు రాణి స్థానములో ఉంది గనుక, ఈ సమయములో రాజుతో మాట్లాడి ఈ శ్రమలో తనకు చేతనైన కార్యము చేయమని చెప్పుచున్నాడు.
రాజుయొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాస ముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగినవారైరి, అనేకులు గోనెను బూడిదెను వేసికొని పడియుండిరి.౹ -ఎస్తేరు 4:3
ఇక్కడ యూదులకు కలిగిన శ్రమను బట్టి మౌనముగా ఉండక, “ఉపవాస ముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగినవారై” దేవుని సన్నిధిలో వారు గడిపినవారుగా ఉన్నారు. మనము కూడా, అపవాది ప్రయత్నాలు చేస్తున్నాడు అనే సంగతి మనము ఎరిగిన వెంటనే మనము మౌనముగా ఉండక, దేవుని సన్నిధిలో కనిపెట్టేవారుగా ఉండాలి. ఉపవాసము ఉండుట అనేది ఎంతో బలమైనది. ఉపవాసము అనగా కేవలము తిండి మానడము కాదు కానీ, దేవుని సన్నిధిలో ఉండుట అనేది ఎంతో ఆవశ్యము గనుక, ఒకవేళ ఉద్యోగములకు వెళ్ళవలసి వస్తే, రాత్రి సమయములో ఉపవాసముండి దేవుని సన్నిధిలో కనిపెట్టండి.
అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథములవలన గ్రహించితిని.౹ అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసి కొంటిని.౹ -దానియేలు 9:2-3
ఇక్కడ దానియేలుకు కూడా, తనకు సంబంధించిన “విడుదలకు” సంబంధించిన వాక్యము తెలియగానే, దేవుని యెదుట తనను తాను తగ్గించుకొని, ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకు సిద్దపడ్డాడు.
–దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పుమాటలు తెలిసికొనుమనెను. అతడీమాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడితిని.౹ అప్పుడతడు–దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొనవలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలనుబట్టి నేను వచ్చితిని -దానియేలు 10:11-12
అలా దానియేలు దేవుని యెదుట తగ్గించుకొని ఉపవాసము చేత సిద్ధపడినపుడు ఏమి జరిగింది అని చూస్తే? దానియేలు ఏ విడుదల కొరకు దానియేలు ఉపవాసము ఉన్నాడో, ఆ విడుదల కొరకైన ప్రార్థనకు జవాబుగా పరలోకము నుండి కార్యములు విడుదల అవుతున్నాయి. మన జీవితములో కూడా అంతే, అందుకే ఉపవాసము సరిగా చేయుట ఎంతో ప్రాముఖ్యము.
మొర్దెకై మరియు యూదులు కూడా వారి కష్ట సమయములో విడుదల కొరకు వారు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉపవాసము చేత సిద్ధపరచుకొనుట బట్టి, వారి జీవితములలో గొప్ప ఆశ్చర్య కార్యము జరిగింది.
జనసమూహములో ఒకడు– బోధకుడా, మూగదయ్యము పెట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని; అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను. -మార్కు 9:17-18
ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులు–మే మెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి. అందుకాయన–ప్రార్థన (ఉపవాసముతో కూడిన) వలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. -మార్కు 9:28-29
అపవాది కార్యములు, ప్రయత్నములు నాశనము చేయాలి అంటే ఖచ్చితముగా ఉపవాసముతో కూడిన ప్రార్థన ఎంతో అవసరము.
జరిగినదంతయు తెలియగానే మొర్దకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసికొని బూడిదె పోసికొని పట్టణము మధ్యకు బయలువెళ్లి మహా శోకముతో రోద నముచేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను; గోనె కట్టుకొనినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు.౹ -ఎస్తేరు 4:1-2
అయితే యూదుడైన మొర్దకై రాజుగుమ్మమున కూర్చునియుండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటివలన నాకు ప్రయోజన మేమియు లేదని అతడు చెప్పగా -ఎస్తేరు 5:13
ఇక్కడ మొర్దెకై రాజు గుమ్మము యెదుట ఉపవాసముతో కూర్చుని ఉన్నాడు. అయితే హామానుకు అక్కడ కూర్చున్న మొర్దెకై ఉపవాసముచేత కూర్చున్నంత కాలము అతని అధికారము వలన ఏమి ఉపయోగము లేదు అని చెప్పుచున్నాడు. మన జీవితములో కూడా, మనము దేవుని సన్నిధిలో తగ్గించుకుని ఉపవాసము చేత, ప్రార్థన విజ్ఞాపనలు చేస్తామో, అప్పుడు ఖచ్చితముగా అపవాది యొక్క అధికారము మనమీద పనిచేయదు.
ఆ రాత్రి నిద్రపట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను.౹ ద్వారపాలకులైన బిగ్తాను తెరెషు అను రాజుయొక్క యిద్దరు నపుంసకులురాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దకై తెలిపినట్టు అందులో వ్రాయబడి యుండెను.౹ -ఎస్తేరు 6:1-2
“ఆ రాత్రి” అనగా మొర్దెకైను ఉరితీసే ముందు రోజు రాత్రి. రాజు పడుకున్నాడు కానీ, నిద్ర పట్టలేదు. అబ్రహాము భార్య అయిన శారాను అబిమెలెకు రాజు పట్టుకుపోయినప్పుడు కూడా, రాత్రి స్వప్నమందు కనబడి హెచ్చరించాడు. అయితే నిద్రపట్టక రాజు ఏమి చేసాడు? మద్యముతో గడపక, రాజ్యపు సమాచారపు గ్రంథము తీసుకు రమ్మన్నాడు. అనగా ఖచ్చితముగా ఉపవాసము వలన పరలోకము కదిలించబడి, కార్యము అనుకూలముగా మార్చబడుతుంది. నష్టము జరగక మునుపే పరలోకము ఆక్టివేట్ అవుతుంది. అయితే ఉపవాసము ఫెయిల్ అవ్వడానికి కారణము, ఎలా ఉపవాసము చేయాలో ఎరుగక చేయడమును బట్టి.
రాజు ముందరనుండు షండులలో హర్బోనా అనునొకడు–ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దకైని ఉరితీయుటకు హామాను చేయించిన యేబది మూరల యెత్తు గల ఉరికొయ్య హామాను ఇంటియొద్ద నాటబడి యున్న దనగా రాజు–దానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను.౹ కాగా హామాను మొర్దకైకి సిద్ధముచేసిన ఉరి కొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజుయొక్క ఆగ్రహము చల్లారెను. -ఎస్తేరు 7:9-10
మొర్దెకైను ఉరి తీయాలి అని ప్రయత్నము చేసిన హామానే అదే సిద్ధపరచబడిన ఉరికొయ్యపై ఉరి తీయబడ్డాడు.
ఎస్తేరు, రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తల పెట్టిన చెడుయోచన తన తలమీదికే వచ్చునట్లుగా చేసి,వాడును వాని కుమారులును ఉరికొయ్యమీద ఉరితీయబడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను.౹ -ఎస్తేరు 9:25
అపవాది యూదులందరని చంపడానికి ప్రయత్నిస్తుంటే, అపవాది తన దూతలతో సహా లయపరచబడటానికి నీవు చేసే మొర్దెకై వంటి ఉపవాసము నీవు చేయాలి. ఆ యూదుల వెలే, ఎస్తేరు వలే ఉపవాసము ఉండి దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టాలి. కాబట్టి ఈ సత్యమును బట్టి, మనము ఇంక అపవాదికి భయపడవలసిన అవసరము లేదు.