స్తోత్రగీతము – 1
యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2)
యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2)
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్ (2) ||యేసే||
మహా శ్రమలలో వ్యాధి బాధలలో
సహనము చూపి స్థిరముగ నిలచిన
యోబు వలె నే జీవించెదను (2)
అద్వితీయుడు ఆదిసంభూతుడు
దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||
ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాటిన
దానియేలు వలె జీవింతును (2)
మహోన్నతుడు మన రక్షకుడు
ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||
జీవితమంతా ప్రభుతో నడచి
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
హనోకు వలె నే జీవించెదను (2)
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||
స్తోత్రగీతము – 2
అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు రాజుల రాజా
యావే నిన్ను స్తుతియింతును
యావే నిన్ను ఘనపరతును
హల్లెలూయా హల్లెలూయా హోసన్నా
నీవే నీవే నా మార్గము నీవే నీవే నా సత్యము
నీవే నీవే నా జీవము నీవే నీవే నా రక్షణ
నీవే నీవే నా నిరీక్షణ నీవే నీవే నా సంగీతము
నీవే నీవే నా సంతోషము నీవే నీవే నా బలము
నీవే నీవే నా ఖడ్గము నీవే నీవే నా కిరీటము
నీవే నీవే నా కవచం నీవే నీవే నా కేడెము
నీవే నీవే నా కోట నీవే నీవే నా ఆశ్రయం
నీవే నీవే నా శృంగము నీవే నీవే నా సంపద
స్తోత్రగీతము – 3
యేసయ్య! నీకృప నాకు చాలయ్య
నీకృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము
నేనూహించలేను యేసయ్య …… “2”
పల్లవి :-
యేసయ్య నీకృప నాకు చాలయ్య
నీ కృపలేనిదే నేనుండలేనయ్యా ……. 2
మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహినే నీవు మాధుర్యముగ మార్చి
మాదిరి చూపి మరు రూపమిచ్చావు “2”
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది – నీ కృప “2”
యేసయ్య నీకృప నాకు చాలయ్య
నీ కృపలేనిదే నేనుండలేనయ్యా ……. 2
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకున్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు
నా … ఆశ తీర ఆరాధన చేసె
అదృష్టమిచ్చింది – నీ కృప “2”
యేసయ్య నీకృప నాకు చాలయ్య
నీ కృపలేనిదే నేనుండలేనయ్యా ……. 2
ఆరాధన వర్తమానము
ఈ దినము మన జీవితములలో ఎంతో ప్రత్యేకమైన దినము. ఎందుకు అంటే? మిగతా దినాలు మన వ్యక్తిగతమైన అవసరముల కొరకు ఇవ్వబడ్డాయి అయితే ఆదివారము మాత్రము, మనలను జీవింపచేసిన మన దేవునిని ఆరాధించే అద్భుతమైన సమయము.
యెరూషలేమా, యెహోవాను కొనియాడుము సీయోనూ, నీ దేవుని కొనియాడుము. -కీర్తనలు 147:12
సీయోను అనగా దేవుని పట్టణము. మన వ్యక్తిగతమైన జీవితము కూడా దేవునికి సంబంధించినదే. గనుక మన దేవునిని కొనియాడవలసినవారమై ఉన్నాము. మన దేవుడు ఎటువంటివాడో ఎరిగితే ఖచ్చితముగా కొనియాడేవారముగా ఉంటాము. ఆయన అన్యాయము చేయుట అసంభవము. మన జీవితములను ఎన్నో మేళ్ళు చేసినవాడుగా ఉన్నాడు.
మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను ఆయన కృప నిరంతరముండును. -కీర్తనలు 136:23
మనము సంతోషముగా సమృద్ధిగా ఉండే సమయములో మనము దేవునిని సంతోషముగా ఆరాధిస్తాము. అయితే మన దీన దశలో ఆయనను ఆరాధించే మనసు రాదు, అయితే మన దేవుడు మన దీన దశలో ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు. అందుకె దావీదు వలే మనము మన హృదయములను సిద్ధపరచుకోవాలి.
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము -కీర్తనలు 103:1-2
దావీదు తానున్న కృంగుదల సమయములో తన ప్రాణముతో చెప్పుకుంటున్న మాటలు ఇవి. నా అంతరంగమున ఉన్న సమస్తమా! నాలో ఉన్న ప్రతీ బాధ, శ్రమను బట్టి కృంగకు గానీ ఇంతకు ముందు దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకము చేసుకో అని చెప్పుకుంటున్నాడు. ఇది ఎంతో సత్యము. మనము కృంగిపోయి ఉన్నప్పుడు అపవాది దేవునిని ఆరాధించకుండకుండా అనేకమైన ఆలోచనలు పుట్టిస్తాడు. అందుకే దావీదు వలె మనము కూడా మన హృదయములను, ప్రాణములను సిద్ధపరచుకోవాలి.
మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండును. -కీర్తనలు 136:23-24
మనము కృంగిపోయే పరిస్థితికి తీసుకువచ్చినది శత్రువుగా చూడవచ్చు. అయితే ఆ పరిస్థితుల చేతిలోనుండి మన దేవుడు మనలను విడిపించేవాడుగా ఉన్నాడు. అందుకే మన స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఆయన మాత్రము నీకు దేవుడై ఉన్నాడు.
యెరూషలేమా, యెహోవాను కొనియాడుము సీయోనూ, నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచియున్నాడు నీమధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే -కీర్తనలు 147:12-14
నీ గుమ్మముల గడియలను బలపరచి ఉన్నాడు. మన గుమ్మముల గడియలు బలహీనముగా ఉండుటను బట్టి శత్రువు ప్రవేశించే అవకాశము లభించింది. ఇప్పుడు దేవుడు ఆ గడియలను బలపరచి ఉన్నాడు. ఇంతకు ముందు దీనడశలోనిని వెళ్ళడానికి కారణము, మన గడియలు బలముగా లేకపోవటము. అయితే మన దేవుడు కనికరపూర్ణుడు గనుక మన దీనదశలో జ్ఞాపకము చేసుకొని, దానికి గల కారణములను కనుగొని మన గడియలను బలపరచినాడు.
సరిహద్దు అంటే నీ జీవితము అంతా నీ సరిహద్దే. అంటే నీ జీవితములో సమాధానము కలుగచేయువాడు ఆయనే అనే సత్యము ఎరిగి ఉన్నట్టయితే, నీ హృదయములో నేను నా దేవునిని స్తుతించాలి అనే ఆశ కలిగి మౌనముగా ఉండక నోరు తెరిచి ఆరాధించేవానిగా ఉంటావు.
భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును. -కీర్తనలు 147:15
దేవుడు ఈరోజు నీతో మాట్లాడిన మాటలను ఎంతగా నమ్మి నీవు స్వీకరిస్తే అంత త్వరగా ఆ వాక్కు నీ జీవితములో నెరవేరుతుంది. అపవాది ఎప్పుడు మింగుదుమా అని తిరుగుతున్నాడు గనుక మనము దేవుని ఆధారము చేసుకుని మాత్రమే మనము జీవించాలి. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. మనము అనుకుంటాము దేవుని వాగ్దానము నెరవేరడానికి చాల సమయము పడుతుంది అనుకుంటాము. అయితే అబ్రహాము జీవితము ద్వారా అర్థము చేసుకుందాము.
అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై–నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.౹ -ఆదికాండము 17:1
అబ్రహాము చూస్తే, ఒకసారి ఎలియాజరును వారసుడుగా ఆలోచించాడు, మరొక సారి ఇష్మాయేలు వారసుడు అని అనుకున్నాడు. అయితే దేవుని ఉద్దేశ్యమును అర్థము చేసుకోలేక దేవుని చిత్తము ఎదుట నిందారహితుడుగా లేకపోవుటను బట్టి, వాగ్దానము ఆలస్యమైంది గానీ, ఎప్పుడైతే అబ్రహాము దేవుని యందు విశ్వాసము కలిగి నిలబడ్డాడో, అప్పుడు వాగ్దానము నెరవేరింది. మన జీవితములో కూడా, దేవుడు మనకు చేసిన వాగ్దానములు దేవుని వాక్కు ప్రకారము, దేవుని నియమము ప్రకారము సిద్ధపడలేని కారణము బట్టి ఆలస్యమవుతుంది గానీ, మన దేవుడు ఆలస్యము చేయువాడు కాదు!
యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయువాడు, యెహోవా ప్రతికారముచేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.౹ -నహూము 1:2
మన దేవుడు మనలను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. మన జీవితము ఆయన సొత్తు అయిన జీవితము. గనుక నీ జీవితమును ఆక్రమించిన దానిమీద రోషముగలిగి ప్రతికారము చేసేవాడుగా ఉన్నాడు. ఇంతకు ముందు మన అలక్ష్యమును బట్టి ఒక సందు దొరికి అపవాది మన జీవితములలో నష్టము కలుగచేసాడు. అయితే ఈరోజు దేవుడు నీ గుమ్మముల గడియలు బలపరుస్తాను అని చెప్పుచున్నాడు.
నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల యెదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయముతట్టు నేను నమస్కారముచేయు చున్నాను నీ నామమంతటికంటె నీవిచ్చిన వాక్యమును నీవు గొప్పచేసియున్నావు. నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకు కృతజ్ఞతా స్తుతులు నేను చెల్లించెదను. -కీర్తనలు 138:1-2
ఆయన కృపను బట్టి మనలను జ్ఞాపకము చేసుకొనేవాడు. సత్యము ఏమిటి అంటే, మన దీన దశలో నిన్ను విడువక జ్ఞాపకము చేసుకుని, నీ దీన దశకు కారణమైన దానిని ఇక ముందు అటువంటి పరిస్థితి రాకుండునట్టు బలపరచేవాడుగా ఉన్నాడు. గనుక, మౌనముగా ఉండక, నోరు తెరిచి మనసారా ఆయనను ఆరాధించాలి. నీ జీవితము ఆయన సొత్తు, ఇది సత్యము! నిన్ను విడువడు, ఖచ్చితముగా లేవనెత్తుతాడు.
నీ జీవితములో అపవాది ప్రవేశిస్తుంటే ఊరకనే ఉండేవాడు కాదు నీ దేవుడు. నీ జీవితమునకు కంచె వేసి మరెన్నడు అపవాది నిన్ను తాకకుండా నిన్ను బలపరచడానికి ఇష్టము కలిగి ఉన్నాడు
ఆరాధన గీతము
నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును (2)
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా (2) ||నా ప్రాణమా||
ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు (2) ||నా ప్రాణమా||
మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును (2) ||నా ప్రాణమా||
దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్పు యొక్క వేగము నీవు కనపరచే విశ్వాసము మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఇలా చెప్పుచున్నాడు.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను. -కీర్తనలు 91:14-16
వారము కొరకైన వాక్యము
ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.౹ -యోహాను 15:5
మన జీవితములలో ఫలింపు కొరకు ఎంతో ప్రయత్నిస్తాము, కష్టపడతాము. అయితే వాక్యము చెప్పుచున్న సత్యము – “ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో”. అప్పుడు వచ్చే ఫలింపు సామాన్యమైనది కాదు గానీ, బహుగా ఫలింపు.
ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమొంది–దేవుని మందసమును నాయొద్దకు నేను ఏలాగు తీసికొని పోవుదుననుకొని, మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసికొనిపోక, దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను.౹ దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద మూడు నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. -1 దినవృత్తాంతములు 13:12-14
ఒబెదెదోము దేవుని యందు ఎంతో ఆసక్తి గలిగినవాడు. దేవుని మందసమునకు కాపలాదారునిగా ఉన్నాడు. దేవుని మందిరములో వాయిద్యకారుడుగా ఉన్నాడు. “ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో” అనే నియమము ప్రకారము ఒబెదెదోము తన జీవితమును సిద్ధపరచుకున్నాడు.
ఉదాహరణకు మన ఉద్యోగములను ఆలోచిస్తే, 24 గంటలు పని 3 షిఫ్ట్స్ గా ఉంటాయి. ఒబెదెదోము ఒక 8 గంటలు కాపలాదారునిగా పనిచేసి తరువాత వాయిద్యకారునిగా పని చేస్తున్నాడు. అంటే దేవుని పని కొరకు తాను ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో అర్థము చేసుకోవచ్చు. మనము కూడా అదే విధానములో మన జీవితాన్ని కట్టుకోవాలి. అప్పుడు నీ జీవితము ఆశ్చర్యకరముగా మారుతుంది. అయితే, వాక్యమును నీవు వెంబడించే రీతిపై అది ఆధారపడి ఉంటుంది.
“ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు” ఇది ఒక నియమము. ఒక ద్రాక్షావల్లిని చూసినప్పుడు, దానికి అనేకమైన తీగెలు ఉంటాయి. ఆ తీగెలు ఆ ద్రాక్షావల్లిలో ఉన్న జీవమును బట్టి ప్రారంభమయ్యి ఎదుగుతాయి.
అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.౹ -1 పేతురు 2:9
మనము పిలువబడిన పిలుపును చూస్తే, “మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము మీరు ఉన్నారు”. అంటే ఆయన ద్రాక్షావల్లి అయితే ఆ ద్రాక్షావల్లి యొక్క గుణములను కలిగి ఉండాలి ఆ విధముగా మనము ఆయన గుణములను ప్రచురము చేస్తాము.
దేవుని మొదటి గుణము, “పరిశుద్ధత”. మనము కూడా ఆ పరిశుద్ధత కలిగి ఉండాలి. అపవాది కూడా మన పరిశుద్ధతను పాడుచేయటానికి అనేమైన ఉచ్చులు పన్నాగములు, ప్రయత్నములు చేస్తాడు. ఎందుకంటే, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని సంతోషపరచలేడు.
మన అవయవములన్నీ నిజానికి నీతిసాధనములుగా ఉండటానికి ఇవ్వబడ్డాయి కానీ, మన అవయవములు పాపమునకు ఉపయోగిస్తున్నాము. మన కన్నులు చూస్తే, పాపము విషయములో తిప్పుకోలేని బలహీనత. ఈరోజు గనుక చూస్తే, మొబైల్లోనే మన జీవితము గడిచిపోతుంది. కామెడీ షో యే కదా అని చూస్తున్నాము, కానీ అపహాస్యము చేసేవారితో మనము కలిసి సంతోషిస్తున్నాము. మనము చివరి దినములలో ఉన్నాము గనుక సమయమును పోనివ్వద్దు.
ఈరోజు నీవు నేను తీగెగా ఉన్నామో లేదో మనలను మనమే పరీక్షించుకోవచ్చు. ఆయన తీగెలుగా మనము ఉంటే, ఆయన జీవము, వెలుగు మనలో కూడా ఉంటుంది. మన దేవుడు చీకటిలో ఉన్నవారికి వెలుగుగా ఉన్నాడు. ఆయనలోని తీగెలుగా మనము కూడా వెలుగువలే ఉంటున్నామా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత ఖచ్చితముగా కలిగి ఉండాలి. మన కళ్ళు, చేతులు, నోరు, కాళ్ళు అన్నీ నీతి సాధనములుగా చేసుకుందాము. పాపము ఉన్న చోటికి నా కాళ్ళు వెళ్ళనివ్వను, పాపము చెయ్యడానికి నా చెయ్యి తియ్యను, పాపము మాటలాడుటకు నా నోరు తెరువను అని తీర్మానము చేసుకుందాము. షద్రకు, మేషాకు మరియు అబెద్నెగోలు నిలబడ్డట్టుగా మనము కూడా దేవుని పరిశుద్ధతను ప్రచురపరచే విధానములో సిద్ధపరచుకుందాము.
యేసు దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి– నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను. -మత్తయి 21:12-13
ఇక్కడ మనము యేసయ్య ఎలా ఉన్నాడో గమనిద్దాము. దేవుని మందిరము ఆలయముగా లేదు గానీ, ఒక వ్యాపార గృహముగా మార్చపడింది. ఆ స్థితిలో ఉన్న ఆలయము చూసినప్పుడు రోషము కలిగి రగిలి, అవన్నీ పడద్రోసినవాడుగా లేడా? మరి ఆయనలోని తీగెలుగా ఉన్న మనము మన దేహమనే ఆలయము, హృదయమనే ఆలయము, లోకములోని విషయాలతో పాడు అవుతున్న సమయములో, అదే రోషము కలిగి మనము కూడా ఆ ఆలయమును సరిచేయాలి కదా! అప్పుడే మనము ఆయనలోని తీగెలుగా ఉండగలము. మందిరమునకు ప్రార్థనా మందిరము అనే టైటిల్ ఉంది, మనకైతే దేవుని ప్రియమైన కుమారుడు అనే టైటిల్ ఉంది. గనుక మనము కూడా రోషము కలిగి, పాడుచేసే ప్రతీదానినీ తీసివేసి, నేను దేవుని లోని తీగెనే అని ప్రకటిద్దాము.
ఆయన ఏమై ఉన్నాడో అదే విధముగా మనలను సిద్ధము చేసుకొనుటద్వారా మనము ఆయన తీగెలుగా ఉండగలుగుతాము. అయితే “ద్రాక్షావల్లిని నేను” అని చెప్పడానికి ఒక కారణము ఉంది. “ద్రాక్షావల్లి” అనగా ఇశ్రాయేలు సంతతిని సూచిస్తుంది. అయితే ఆ నాటిన ఇశ్రాయేలు కారు ద్రాక్షలను ఇచ్చింది.
నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొక ద్రాక్షతోట యుండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను దానిమధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను -యెషయా 5:1-2
అయితే ఇప్పుడు యేసయ్య “నేను నిజమైన ద్రాక్షావల్లిని” అని చెప్పుచున్నాడు. ఈ ద్రాక్షావల్లి మంచి ఫలాలను ఇచ్చేది అని అర్థము. మనము కూడా అదేవిధముగా ఫలించుటకు ఆ ద్రాక్షావల్లికి తీగెలుగా చేయబడ్డాము.
మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.౹ -యోహాను 15:16
అంటే, ఆ ద్రాక్షావల్లికి తీగెలుగా ఉన్న మనము, మంచి ఫలములనే ఫలిస్తాము. అయితే మన జీవితమును దానికొరకు మనము సిద్ధపరచుకోవాలి. అప్పుడు మనము ఫలిచెడికొమ్మగానే ఉంటాము. అప్పుడు నీ ఫలమును ఎవ్వరూ రాల్చలేరు.
యేసయ్య నిలబడ్డ ప్రతి స్థలములోనైనా మార్పు అనేది కనబడుతూనే వచ్చింది. మార్కు 8 వ అధ్యాయములో చూస్తే,
ఆ దినములలో మరియొక సారి బహుజనులు కూడి రాగా, వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తనయొద్దకు పిలిచి –జనులు నేటికి మూడుదినముల నుండి నాయొద్దనున్నారు; వారికి తిననేమియు లేనందున, నేను వారిమీద కనికరపడుచున్నాను; -మార్కు 8:1-2
అక్కడ ఉన్న జనములు మాకు ఆకలి అవుతుంది అని ఎవరూ అడగలేదు. అయినప్పటికీ యేసయ్య తనకు తానుగా వారి మీద కనికరపడి వారి ఆకలి తీర్చడానికి సిద్ధపడ్డాడు. అదేవిధముగా ఆయన నీలో, నాలో గనుక ఉన్నట్టయితే మనము అడగకమునుపే మనమున్న పరిస్థితిని బట్టి కనికరపడేవాడుగా ఆయన ఉంటాడు గదా! అయితే ఆయన మనలో ఉండకుండా, మనమే అడ్డు పెడతాము. ఎలా అంటే, పాపము చేయుట ద్వారా. మన అవయవములను నీతి సాధనములుగా మాత్రమే ఉపయోగించబడాలి అనే రోషము కలిగి సిద్ధపరచుకోవాలి. నీవు ఇలా నిన్ను సిద్ధపరచుకున్నప్పుడు దేవుడు నీలో నిలిచి ఉంటాడు, నీవు అడగక మునుపే, నీవు అవసరమైన ప్రతీదీ నీకి దయచేసేవాడుగా ఉంటాడు.
ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. -మత్తయి 6:32-33
కాబట్టి, మొట్టమొదట ఆత్మీయమైనదానికొరకు సిద్ధపడితే, భౌతికమైన అవసరములన్నీ ఖచ్చితముగా దేవుడే చూసుకుంటాడు.
నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినయెడల మార్గములో మూర్ఛపోవుదురు; వారిలో కొందరు దూరము నుండి వచ్చియున్నారని వారితో చెప్పెను. -మార్కు 8:3
మూడు రోజులనుండి ఆయన దగ్గర ఉన్నవారు ఎటువంటి పరిస్థితులలో ఉన్నారో, ఎరిగినవాడుగా ఆయన ఉన్నాడు. వారి స్థితి మార్చబడకపోతే, నీ బ్రతుకు పోగొట్టుకుంటావు అనే సత్యము కూడా ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. అయితే నీవున్న సందర్భము ఎంతో అననుకూలమైనది అయ్యి ఉండవచ్చు. అయితే నీలో ఉన్నవాడు ఎటువంటివాడో అది ఎరిగి ఉండాలి.
అందు కాయన శిష్యులు–ఈ అరణ్యప్రదేశములో ఒక డెక్కడ నుండి రొట్టెలు తెచ్చి, వీరిని తృప్తిపరచగలడని ఆయన నడిగిరి. ఆయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారు – ఏడనిరి. అప్పుడాయన – నేలమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి ఆ యేడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి. -మార్కు 8:4-6
వారు భోజనముచేసి తృప్తిపొందినమీదట, మిగిలిన ముక్కలు ఏడు గంపలనిండ ఎత్తిరి. -మార్కు 8:8
వారు అరణ్యప్రదేశములో ఉన్నప్పటికీ, భోజనము చేసారు. అంటే, మన పరిస్థితులు ఎంత అననుకూలముగా ఉన్నప్పటికీ, అసాధ్యముగా కనబడుతున్నప్పటికీ, ఆయన మనలో నిలిచి ఉన్నట్టయితే, ఖచ్చితముగా తృప్తిపరచబడతాము.
నన్ను బలపరచువాని యందే సమస్తము నేను చేయగలను అని పౌలు చెప్పుచున్నాడు. ఆ బలపరచువాడు నాలో, నీలో ఉన్నాడు. అంటే, మనము కూడా సమస్తము చేయగలిగినవారుగా ఉండాలి. అయితే ఒకటే మనము పరీక్షించుకోవాలి – మనము యేసు అనే ద్రాక్షావల్లికి తీగెలుగా ఉన్నామా లేదా?
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.౹ -యోహాను 6:56
దానిని విరిచి–యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.౹ -1 కొరింథీయులకు 11:24
యేసయ్య నీకొరకు నా కొరకు తన శరీరమును నలగగొట్టబడి, నీ, నా పాపములనుండి విడిపించుటకొరకు తన రక్తమును చిందించాడు అనే సత్యము మనము ఎరిగి, ఆ బల్లలో మనము చేయి వెయ్యాలి. అందుకే మనలను మనమే పరీక్షించుకుని ఒప్పుకుని అప్పుడు ఆ బల్లలో మనము చేయివేయాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్థిల్లడు గానీ, ఆ అతిక్రమములను ఒప్పుకుని విడిచిపెట్టువాడు వర్థిల్లును. మనము పాపము ఒప్పుకొని విడిచిపెట్టకుండా ప్రభువుబల్లలో చెయ్యివేస్తే, “ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు.౹ -1 కొరింథీయులకు 11:30” అని వాక్యము చెప్పుచున్నది.
జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.౹ -యోహాను 6:57
మనము ఫలించేవారిగానూ, సమస్తము చేయగలిగినవారిగాను, జీవము గలిగినవారిగాను ఉండగలుగుతాము.