27-08-2023 – ఆదివారం మొదటి ఆరాధన – దేవుని అభిషేకము

స్తోత్రగీతము – 1

సర్వేశ్వరా నీకే స్తుతి
సర్వము నీకే ప్రభు
ఆధారము ఆశ్రయము
నీవే నా యేసు “2”

నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి

చిన్న చిన్న గొర్రె పిల్లలము
కాపరి మము కాయుము
అమ్మ నాన్న అన్ని నీవే
ఆదరించి సేదదీర్చుము

పరిగెత్తెదా కొండ కోనల్లోనా
పచ్చని పచ్చికలో
అండ దండా కొండా
కోనా నీవే నా యేసు

స్తోత్రగీతము – 2

నిన్ను కాపాడువాడు కునుకడు
నిన్ను ప్రేమించు యేసు నిదురపోడేన్నాడు
నీ భారము వహియించు యేసు
నీ కొరకే మరణించే చూడు

పలుకరించే వారు లేక పరితపిస్తున్న
కనికరించే వారు లేక కుమిలిపోతున్న
కలతలెన్నో… కీడులెన్నో ….
బ్రతుకు ఆశను అణచి వేసినా
ఎడబాయడు యేసు నిన్ను
దరిచేర్చును యేసు నిన్ను

మనస్సులోన శాంతి కరువై
పరుల మాటలు క్రుంగదీసి బాధపెడుతున్న
భీతులెన్నో… భ్రాంతులెన్నో….
సంతసంబును తృంచివేసిన
ఎడబాయడు యేసు నిన్ను
దరిచేర్చును యేసు నిన్ను

స్తోత్రగీతము – 3

యేసు రక్షకా శతకోటి స్తోత్రం
జీవన దాత కోటి కోటి స్తోత్రం
యేసు భజియించి పూజించి ఆరాధించెదను (2)
నా సమస్తము అర్పించి ఆరాధించెదను (2)
యేసు ఆరాధించెదను – ఆరాధించెదను

శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు
నన్ను రక్షింప నర రూపమెత్తాడు (2)
నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు (2)
చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2)

పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు
ఎన్నటికిని ఎడబాయనన్నాడు (2)
తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు (2)
నా సేద దీర్చి నన్ను జీవింపజేసాడు (2)

యేసు ఆరాధించెదను – ఆరాధించెదను
నా సమస్తము అర్పించి – ఆరాధించెదను
నా సర్వము అర్పించి – ఆరాధించెదను
శరణం శరణం యేసు స్వామి శరణం (3)

ఆరాధన వర్తమానము

ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు -కీర్తనలు 90:1-2

సమస్తమును సృష్టించిన సృష్టికర్త మనలను కలుసుకోవడానికి, మనతో సహవాసము కలిగిఉండటానికి, ఆయన ఆత్రుత పడుతున్నాడు. అందుకే ఆయన సన్నిధిని ఎటువంటి పరిస్థితులైనా సరే పోగొట్టుకోకూడదు. ఆయన సన్నిధిలో సమస్తము, పూర్ణ సంతోషము ఉన్నది. అందుకే కీర్తనాకారుడు ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్తామా అని ఆశ కలిగి ఉన్నాడు.

యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశిం చెదరు చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు. గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర చూచెను నాకువిరోధముగా లేచినదుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను -కీర్తనలు 92:8-11

దేవునిని నీవు ఆశ్రయముగా చేసుకున్నప్పుడు, ఆయన ఏమై ఉన్నాడో నీకు ఆయన తెలియపరుస్తాడు. ఆయన శక్తిమంతుడే కానీ ఆయన ఏమై ఉన్నాడో ఎరుగక, ఆయనను శక్తిహీనుడుగా చేస్తున్నది మనమే.

యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నామీదికి లేచువారు అనేకులు. –దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదని నన్నుగూర్చి చెప్పువారు అనేకులు యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. -కీర్తనలు 3:1-3

మనము మన పరిస్థితులలో దేవునిని నమ్ముకుని నిలబడతాము. అయితే కొన్నిసార్లు ఆ పరిస్థితులలో మనకు ఏ మార్గము తెరువబడనప్పుడు మనము నిరాశతో కృంగిపోయేవారముగా అయిపోతాము అయితే, మన దేవుడు మన తల ఎత్తేవాడు అనే సత్యములో మనము నిలబడాలి. మన ధైర్యము మన దేవుడే!సంపూర్ణమైన సమర్పణ లేకపోవటము చేత మనము మన జీవితములో అనేకమైనవి కోల్పోతున్నాము.

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.౹ -రోమా 12:1

సంపూర్ణమైన సమర్పణ అంటే – పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన సమర్పణ. దేవుడు నిన్ను ఏ రీతిగా కోరుకొంటున్నాడో ఆ రీతిగా సమర్పించుకోవడము. పౌలు మాటలలో – ఇక జీవించునది నేను కాదు నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు.

ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము. -కీర్తనలు 90:14

సంపూర్ణమైన సమర్పణ లేకపోవటము చేత మనము ఏమి కోల్పోతున్నాము అంటే, దినదినము దేవుడు అనుగ్రహించే కృపను పోగొట్టుకొంటున్నాము. అనుదినము మన భారము ఆయన మోయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకయాత్ర కొనసాగించాలి అంటే ఖచ్చితముగా ఆయన కృప మనకు కావాలి. ఆయన లాభాపేక్షలేని తన ప్రేమ చేత, అర్హత లేని మనలను నడిపించాలి అని ఆశపడుతున్నాడు. అందుకే ఖచ్చితముగా ఆదివారమును మనము అస్సలు పోగొట్టుకోకూడదు. నిన్ను ప్రేమించే వ్యక్తి వట్టి చేతులతో రాడు గానీ, నిన్ను తృప్తిపరచుటకొరకు తాను సిద్ధపరచినది నీకు దయచేసేవాడు.

మన దేవుడు కొమ్మును పైకెత్తేవాడు. అనగా మనలను విజయవంతులుగా చేసేవాడు.

యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహ రించినను నేను భయపడను యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టు వాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది నీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. (సెలా.) -కీర్తనలు 3:5-8

నీ జీవితాన్ని లాక్కుపోవటానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, దేవుడు చెప్పుచున్నమాట, “రక్షణ యెహోవాది, ఆశీర్వాదము మీది”. అంటే నీ జీవితాన్ని నిలబెడతాను అని ఖచ్చితముగా ప్రభువు చెప్తున్నాడు గనుక భయపడవద్దు. గనుక మనకు కేడెముగా ఉన్న దేవునిని ఆరాధిద్దాము.

దేవుడు తెలియచేసిన సత్యమును గ్రహించి హృదయమును సిద్ధపరచుకో! ఒకవేళ ఏ భయమైనా నిన్ను కమ్మివేసి ఉంటే, నీ ముందు నిలబడి నీతో మాటలాడిన యేసయ్య వైపు చూసి, వదిలిపెట్టు. ఆయనను ఆరాధించటానికి సిద్ధపడు.

ఆరాధన గీతము

ఆరాధింతు నిన్ను దేవా
ఆనందింతం నీలో దేవా
ఆరాధనలకు యోగ్యుడా
స్తుతి పాడి నిన్ను పోగిడిదము

ఆరాధన ఆరాధన ఆరాధన నీకే||ఆరా||

యేరికో గోడలు అడువచ్చిన
ఆరాధించిరే గంభీరముగా
కూలిపోయెను అడుగోడలు
సాగిపోయిరి కానాను యాత్రలో||ఆరా||

పెంతెకొస్తు పండుగ దినమునందు
ఆరాధించిరందరు ఐక్యతతో
కుమ్మరించెను అగ్నిజ్వాలలు
నింపబడెను ఆత్మ బలముతో||ఆరా||

పౌలు సీలలు భందింపబడగా
పాటలు పాడి ఆరాధించగా
బంధకములు తైంపబడెను
వెంబడించిరి యేసయ్యనెందరో||ఆరా||

కూలిపోవును అడ్డుగోడలు సాగిపోదును దేవుడు సిద్దపరచినది స్వతంత్రించుకొనుటకు – ఆరాధన నీకే ప్రభువా

ఎవరి హృదయము ఆయన కొరకు ఆశకలిగి ఉన్నదో, ఆ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. నీవు ఏ విషయములో కృంగిపోయినప్పటికీ, ప్రేమకలిగిన నీ దేవుడు నీ పక్సమున నిలబడ్డాడు గమనించు.

యెరికో గోడలు అడ్డుగా ఉన్నప్పుడు వారు చేసిన ఆరాధన ఆ గోడలను కూల్చివేసింది. ఈరోజు నీ ముందర ఎటువంటి యెరికో గోడలు ఉన్నప్పటికీ, ఈరోజు నీవు చేసే ఆరాధన ఆ గోడలను కూలద్రోస్తుంది. గనుక మౌనముగా ఉండకు.

నీ శత్రువును నశింపచేయుటకు నీ దేవుడు లేచి ఉన్నాడు.

నన్ను దర్శించు ప్రభువా, నా జీవితాన్ని దర్శించు తండ్రీ, నా స్థితిని మార్చుటకొరకై నన్ను దర్శిచండి నాయనా అని అడుగుదామా!

వారము కొరకైన వాక్యము

దేవుని సన్నిధిని అనుభవించాలి అనే ఆశ మనము కలిగి ఉండాలి. మనము ఇంకా వాక్యము చదువుట వరకే ఉండిపోయాము. అయితే వాక్యానుభవములోనికి మనము రావాలి.

దేవుని పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య యొక్క అనుభవము లేకుండా ఆయన ప్రత్యక్షతలను మనము అర్థము చేసుకోలేము, తీర్పు తీర్చలేము. ఆ అనుభవము కొరకు, యదార్థమైన సంపూర్ణమైన సమర్పణతో ఆయన సన్నిధిలో మొదటగా ఒప్పుకోని ప్రార్థనలో ఆశ కలిగి వేచిచూసినప్పుడు ఖచ్చితముగా దేవుని ప్రత్యక్షత పొందుకొనగలుగుతాము. మనలో ఉన్న కల్మషము ఆత్మ పరిచర్యలో కడుగబడినతరువాత ఆత్మతో ఖచ్చితముగా నింపబడతాము. ఆత్మ పరిచర్య వాక్యము ద్వారానే జరుగుతుంది. నీవు వాక్యము చదవడము మాత్రమే కాక, ఆ వాక్యానికి లోబడుట ద్వారా వాక్యానుభవములోనికి రాగలుగుతావు. అప్పుడు నీ ముందరకు ఏది వచ్చినప్పటికీ నిన్ను మాత్రము ఏమీ చెయ్యలేదు.

భాషలు ఉన్నాయా? ఒకవేళ నీకు ఈ ప్రశ్న ఉంటే, ప్రార్థనాపూర్వకముగా ప్రభువు సన్నిధిలో కనిపెట్టు. ఆ అనుభవము గలిగినవారిని అడుగు! అడుగువారికి మరి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును కదా అని వాక్యము చెప్పుచున్నది కదా! అందుకే ఆశ కలిగి ప్రభువు సన్నిధిలో కనిపెట్టాలి. మనము పోరాడుచున్నది అంధకార సంబంధులగు నాథులతో పోరాడుచున్నాము. మన జీవితములను నాశనము చేయడానికి అపవాది అనేకములైన విధానములలో ప్రయత్నిస్తున్నాడు.

ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.౹ -ఎఫెసీయులకు 6:12

మనము ఆదివారము దేవుని సన్నిధికి రావడము మూలముగా విడుదల అయిన వాక్కును బట్టి ఆ పోరాటములో నిలబడగలుగుతున్నావు. అపవాది తంత్రములను మనము ఎరిగి ఉండాలి. అలా ఎరగాలి అంటే మొదట మనకు సహాయము కావాలి కదా! ఆ సహాయము మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. అయితే ఆ సహాయమును ఎరిగి ఆ ప్రకారము సిద్ధపరచుకోవాలి అంటే అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడతాడో మనము ఎరిగి ఉండాలి.

నీ దైవ జనుని కొరకు ప్రార్థన చేయుట దేవుడు వాక్యానుసారముగా నీకిచ్చిన బాధ్యత.

ఈరోజు దేవుని అభిషేకము గూర్చి నేర్చుకొందాము. అసలు అభిషేకము అంటే ఏమిటి? పాత నిబంధనలో చూస్తే, దేవుని పరిచర్య కొరకైన పాత్రలను, మనుష్యులను, రాజులను, ప్రవక్తలను అభిషేకించినట్టుగా మనము చూడగలము. అభిషేకము అనగా ఒక వ్యక్తినిగాని, వస్తువును గానీ, ఒక ప్రత్యేకమైన ప్రయోజనముకొరకు సిద్ధపరచుట. ఇది తైలము చేత జరిగేదిగా పాత నిబంధలో మనము చూడగలము.

అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.౹ -1 పేతురు 2:9

అభిషేకమునకు ఒక ప్రత్యేకమైన ప్రయోజనము లేదా ఉద్దేశ్యము ఉన్నది. మనము యేసయ్యను అంగీకరించి మారుమనస్సు పొందినప్పుడు మనము ప్రత్యేకపరచబడ్డాము. దేనికొరకు ప్రత్యేకించబడ్డాము? అనేది 1 పేతురు 2:9 లో చూసాము.

ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను. అందుకు యోహాను –నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని యేసు–ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. -మత్తయి 3:13-15

“నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట” అనగా ఒక విధానమును యేసయ్య సిద్ధపరచినట్టుగా మనము అర్థముచేసుకోగలము.

యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు–ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. -మత్తయి 3:16-17

బాప్తీస్మము ఇలాగు జరగాలి అని ఒక నియమము యేసయ్య ఇచ్చినప్పుడు ఆయన బాప్తీస్మము తీసుకున్న తరువాత ఎలా అయితే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యలో నివసించినాడో, మనము బాప్తీస్మము తీసుకున్న తరువాత మనము కూడా పరిశుద్ధాత్మ దేవునిని కలిగి ఉండుట అనేది కూడా నియమము. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించబడినవాడు, ఆయన మనలో ఉండుటను బట్టి, మనము కూడా అభిషేకించబడినవారముగా మారుతున్నాము. అయితే దేనికొరకు అభిషేకించబడ్డాము? అనేది మనము తెలుసుకోవాలి. ఉదాహరణకు అహరోనును ప్రధాన యాజకుడుగా అభిషేకించాడు అంటే తరువాత ఆయన అదే పనిలో ఆయన కొనసాగించబడ్డాడు.

నీవు నేను ప్రవక్తవలే ఉండుట కొరకు అభిషేకించబడ్డాము. ప్రవక్త అంటే దేవుని సన్నిధిలో ఉండి, దేవుని వాక్కును పొందుకొని, ఆ వాక్కును ప్రకటించేవాడు. అయితే ఎక్కడ దేవుని మాటను ప్రకటించాలి? వాక్యము వెలుగై ఉన్నది గనుక ఎక్కడ చీకటి ఉన్నదో అక్కడ ప్రకటించాలి. పాత నిబంధన గ్రంథములో చూస్తే ఇశ్రాయేలు ప్రజలు బంధకములలో ఉన్నప్పుడు, ప్రవర్తన సరిలేనప్పుడు అక్కడ ప్రవక్తలను దేవుడు పంపించేవాడు. అంతేకాక, ప్రవక్త దేవుని యొద్ద గోజాడేవాడిగా ఉంటాడు.

ఎప్పుడైతే దేవుని వాక్యమును అంగీకరించామో అప్పుడు మనము వెలుగుమయముగా చేయబడతాము. వెలుగుమయముగా చేయబడిన మనము ప్రకాశింపచేయబడతాము. అనగా చెప్పుటకంటే ముందు, మనము ఆచరించేవారిగా ఉన్నప్పుడు ఫలితము దక్కుతుంది. మనలను మనము వాక్యానుసారముగా చీకటిని పారద్రోలి, సిద్ధపరచుకున్నప్పుడు, నీ అభిషేకము అనుసరించి పనిచేయగలుగుతావు. అనగా చీకటిలో ఉన్నవారికి వెలుగుగా ఉండగలుగుతాము.

మనలను యాజకత్వము చేయుటకు మనలను దేవుడు అభిషేకము చేసాడు. యాజకుడు దేవుని పరిశుద్ధ సన్నిధిలో నిలువబడి ఆయనను ఆరాధించేవాడు. ఆ యాజకుడు చేసే ఆరాధనలను సింహాసనముపై ఆసీనుడై అంగీకరించి సంతోషించేవాడిగా దేవుడు ఉన్నాడు.

యాజకుడు దేవునికి వచ్చిన ప్రజలకు మధ్యవర్తిగా ఉంటాడు. దేవుని ఆరాధించుట, ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండుట కొరకు ఏర్పరచబడ్డవారు.

అ తరువాత రాజులుగా అభిషేకించబడ్డాము. దావీదును చూస్తే, గొర్రెల కాపరిగా ఉన్న అతను రాజుగా అభిషేకించబడ్డాడు. మనము రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాము. రాజు అనగా రాజ్యము ఉంటుంది. రెండు రాజ్యములు ఉన్నాయి. ఒకటి చీకటి రాజ్యము మరొకటి వెలుగు రాజ్యము. రాజు రాజ్యమును పరిపాలించేవాడిగా ఉన్నాడు గనుక మనము కూడ పరిపాలించేవారిగా ఉంటాము. మనము చీకటి రాజ్యమును పరిపాలించాలి అనగా మనము దానిపై అధికారము కలిగి ఉండాలి.

అయితే ఆ చీకటి రాజ్యములో – “ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులగు లోక నాథులు” ఉంటారు. వారితో మనము పోరాడాలి. భయపడుట కొరకు కాదు గానీ, పోరాడుట కొరకే మనము అభిషేకించబడ్డాము.

ప్రవక్తగా, యాజకునిగా, రాజుగా మనము అభిషేకించబడ్డాము.