స్తోత్రగీతము – 1
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి
దివారాత్రములు కంటిపాపవలె కాచి (2)
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2)
గాడాంధకారములో కన్నీటి లోయలలో (2)
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2)
సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2)
సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2)
సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2)
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2)
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2)
పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2)
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2)
స్తోత్రగీతము – 2
ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా,
ఎనలేని దైవమా నీకేనయ్య…
నీకేనయ్యా….. నీకేనయ్య….
నీకేనయ్యా… నీకే నయ్య
ఏమి జరిగినా స్తోత్రమయ్యా,
ఎవరు విడిచినా స్తోత్రమయ్య
స్తోత్రం స్తోత్రం ఎల్లపుడు స్తోత్రం
స్తోత్రం స్తోత్రం ఎల్లపుడు స్తోత్రం
ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా
ఎనలేని దైవమా నీకేనయ్యా
ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా
ఎనలేని దైవమా నీకేనయ్యా
నీతి దైవమా స్తోత్రమయ్యా
విజయ వంతుడా స్తోత్రమయ్యా
“స్తోత్రం ” “ఎల్లపుడు స్తోత్రం ”
అనాది దైవమా స్తోత్రమయ్య
అధిపతి అయిన వాడ స్తోత్రమయ్య “2”
“స్తోత్రం ” “ఎల్లపుడు స్తోత్రం ”
స్తోత్రగీతము – 3
అబ్రాహము దేవుడవు ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు రాజుల రాజా
యావే నిన్ను స్తుతియింతును
యావే నిన్ను ఘనపరతును
హల్లెలూయా హల్లెలూయా హోసన్నా
నీవే నీవే నా మార్గము నీవే నీవే నా సత్యము
నీవే నీవే నా జీవము నీవే నీవే నా రక్షణ
నీవే నీవే నా నిరీక్షణ నీవే నీవే నా సంగీతము
నీవే నీవే నా సంతోషము నీవే నీవే నా బలము
నీవే నీవే నా ఖడ్గము నీవే నీవే నా కిరీటము
నీవే నీవే నా కవచం నీవే నీవే నా కేడెము
నీవే నీవే నా కోట నీవే నీవే నా ఆశ్రయం
నీవే నీవే నా శృంగము నీవే నీవే నా సంపద
ఆరాధన వర్తమానము
మన దేవుడు మంచి దేవుడు, అన్నివేళలా కూడా మంచివాడు. మనము ఈ సత్యమును ఎరిగిన వారముగా ఉన్నప్పుడు ఆ సత్యము మన జీవితములను స్థిరపరచేదిగా ఉంటుంది. అందుకే ఎల్లప్పుడు మనము సత్యమందే స్థిరపరచబడాలి.
యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములనుబట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమునుబట్టి ఆయనను స్తుతించుడి. -కీర్తనలు 150:1-2
దేవుడు చేసిన పరాక్రమకార్యములను బట్టి స్తుతించమని వాక్యము తెలియచేస్తుంది. దేవుని పరాక్రమము ఎక్కడ కనపరచబడుతుంది అంటే, మన జీవితాలలోనే! అందుకే పౌలు, “నాలో ఉన్నవానిని బట్టీ నేను సమస్తము చెయ్యగలను” అని చెప్పగలుగుతున్నాడు. పౌలులో ఉన్న దేవుడు మనలో కూడా ఉంటున్నాడు. ఆ దేవుడు పరాక్రమము కలవాడు, మన జీవితములను స్థిరపరచడానికి ఆయన పరాక్రమ కార్యములను చేసేవాడుగా ఉన్నాడు.
యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాకవారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహ గానము చేయుదురు గాక. -కీర్తనలు 149:4-5
మనము దేవుని జనులుగా ఉండుటయే మన ఆధిక్యత! దీనమైన మన ప్రతీ స్థితిలో రక్షణను కనపరచేవాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే మనయందు ఆయన ప్రీతి కలిగినవాడిగా ఉంటున్నాడు.
జనాంగము వేరు భక్తిని కనబరుచుటవేరు. దేవుని జనాంగము అంటే దేవునికి సంబంధించినవారు. భక్తులు అంటే ఆయన ఏమై ఉన్నాడో ఎరిగినవారై ఆయనను వెంబడించేవారు. కావున, మన దీన స్థితిలో రక్షణ పొందుకుంటాము, దేవునిని బట్టి ఘనతను పొందేవారముగాను ఉంటాము. దీనిని బట్టి మనము ఆయన స్తుతించి ఆరాధించేవారముగా ఉండాలి.
యెహోవాయే యెరూషలేమును కట్టువాడు చెదరిన ఇశ్రాయేలీయులను పోగుచేయువాడు -కీర్తనలు 147:2
దేవుని పరాక్రమ కార్యములలో ఒకటి, “కట్టుట”. యెరుషలేము అంటే దేవుని పట్టణము, దేవుని నివాస స్థలము. ఈరోజు నీవు నేను కూడా దేవుని నివాసములమే! కాబట్టి మనలను కట్టువాడు మన దేవుడే. “చెదరిన ఇశ్రాయేలీయులను పోగుచేయువాడు”, ఇక్కడ ఇశ్రాయేలీయులు అంటే ప్రత్యేకించబడిన జనాంగము. అయితే వారు చెదిరిపోయి ఉన్నారు. మన జీవితమును చూస్తే, మన జీవితములో ఆయన నివాసము చేసేవాడుగా ఉన్నాడు. మన జీవితములలో కొన్ని ప్రత్యేకమైనవి ఆయన మహిమపరచబడుటకు వేరుపరచుకున్నాడు. అయితే అవన్నీ చెదరిన స్థితిలో ఉన్నాయి. ప్రభువు తిరిగి అవన్నీ పోగు చేసి నీ జీవితముద్వారా మహిమ పరచబడతాడు.ఈ సత్యమును ఎరిగినవారమై మనము ప్రభువును ఆరాధించాలి.
గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడువారి గాయములు కట్టువాడు. -కీర్తనలు 147:3
మనము ఎంత గొప్ప ఆధిక్యత మనము కలిగిఉన్నామో మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈరోజు దేవుడు ప్రకటిస్తున్నాడు, నిన్ను కడతాను, చెదరిపోయిన వాటిని నీ జీవితములో సమకూరుస్తున్నాను, నీ గుందె చెదరిన స్థితిలో నిన్ను బాగుచేస్తాను అని ప్రకటిస్తున్నాడు. ఈ సత్యమును ఎరిగి విశ్వసించి ఆయనను ఆరాధించాలి.
కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమికొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతములమీద గడ్డి మొలిపించువాడు -కీర్తనలు 147:7-8
ఆకాశమును మేఘముతో కప్పుటకు అవసరము ఏమిటి అంటే, భూమిని సిద్ధపరచుట కొరకే. దేవుడు వాక్కును ప్రకటిస్తున్నాడు అంటే నిన్ను నన్ను స్థిరపరచడానికి. దేవుడు ముందుగా వాక్కును విడుదల చేస్తాడు. ఆయన మాట పలకగా ఆ ప్రకారము ఆయెను అని వ్రాయబడింది గనుక, పరిస్థితి ఎలా ఉన్నాసరే, ఆయన మాట ప్రకారము మాత్రమే జరుగుతుంది.
“అపాయము ఉన్ననూ, ఉపాయము లేనివారము కాదు” అని భక్తులు చెప్పగలుగుతున్నారు. నీవు నేను విశ్వాసముతో నిలబడితే, మనము శ్రమలో ఉన్నప్పటికీ ఆయన మనకు మార్గము తెరిచేవాడుగా ఉన్నాడు.
సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును. -1 కొరింథీయులకు 10:13
ఈ సత్యమును పౌలువలే నీవు నేను ఎరిగి ఉన్నప్పుడు, మనము కూడా అదే విధముగా మన విశ్వాస క్రియలద్వారా ప్రకటించగలుగుతాము. చెదిరిన నీ స్థితిని బాగుచేయుటకు ఆయన మార్గము తెరిచేవాడుగా ఉన్నాడు. ఈ సత్యము ఎరిగియున్నాము గనుక మనము దేవునిని ఆరాధిద్దాము.
మన దేహము ప్రభువు మహిమ కొరకు ఉన్నది. ప్రభువు కార్యములన్నీ మన దేహము కొరకే అయి ఉన్నవి – ఆమేన్! ఇది సత్యపూర్వకముగా ప్రకటించు!
ఆరాధన గీతము
బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు
శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాము
సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)
హల్లెలూయా……..హల్లెలూయా (2)
హల్లెలూయా……..హల్లెలూయా హోసన్న
హల్లెలూయా……..హల్లెలూయా
1. ఎల్ ఓలామ్ (2)
అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2)
నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు
నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2)
హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా
2. ఎల్ షద్దాయ్ (2)
పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు (2)
రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా
నీ మాటున దాచె దేవా మాటను నెరవేర్చేదేవా (2) ||హల్లెలూయా||
3. అడోనాయ్ (2)
ప్రభువైన దేవుడవు -ప్రభువులకు ప్రభువు నీవు (2)
సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు
నీవే నాకు ప్రభువు -నీవేనా యజమానుడవు (2) ||హల్లెలూయా||
వారముకొరకైన వాక్యము
నీ కొరకు దేవుడు ప్రకటించిన మాటలు “కట్టడము, సమకూర్చడము, బాగుచేయడము”.
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. -రోమా 8:30
ఈ మాటలో మన జీవితమును వెతికితే, ఈరోజున నీవు నేను పిలువబడ్డాము. అంటే మనము నిర్ణయించబడ్డాము అని అర్థము. దేవుడు నీ ద్వారా ఏమి నిర్ణయించాడు? అంటే నీ ద్వారా ఏమి జరిగించాలి అని నిర్ణయించాడు? అనేది మనము తెలుసుకోవాలి. దేనికొరకు నన్ను పిలిచాడు అనే సంగతి మనము తప్పక తెలుసుకోవాలి. ఎందుకు పిలువబడ్డామో తెలిసినప్పుడే ఆ పనికొరకు సిద్ధపడి, ఆ పని చెయ్యగలుతాము.
ఒకసారి జ్ఞాపకము చేసుకుంటే ఈ లోకములో అటు ఇటు తిరుగుతున్నవారిగా ఉన్నప్పుడు ఆయన సన్నిధికి రానిచ్చారు. దానిని బట్టి ఇప్పుడు మనము విశ్వాసులుగా పిలువబడుతున్నాము.
పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.౹ -1 థెస్సలొనీకయులకు 4:7
ఈ లోకములో ఉన్న సంగతులు మనలను అపవిత్రపరచే విధానములోనే ఉంటాయి. అయితే నీ పిలుపు పరిశుద్ధుడుగా ఉండుటకు పిలువబడ్డాను అనే సంగతి గుర్తెరిగి ఉన్నప్పుడు ని పిలుపుకు తగిన న్యాయము చెయ్యగలుగుతావు. నీ పిలుపులో నమ్మకముగా ఉన్నట్టయితే, “నీతిమంతుడు” అనే ముద్ర నీకు వెయ్యబడుతుంది. అనగా నీకు ఒక సాక్ష్యము ఇవ్వబడుతుంది.
ఇలా సాక్ష్యము సిద్ధపరచుకొని సాక్ష్యము సంపాదించుకొనిన తరువాత, నీ సిద్ధపాటుకు తగిన ఫలము దేవుడు దయచేసేవాడుగా ఉన్నాడు. అందుకే నేను పరిశుద్ధత కొరకే పిలవబడ్డాను, పాపము కొరకు నేను పిలివబడలేదు అనే సత్యము ఎరిగి ఉండాలి, దానికొరకు ప్రయాస పడాలి.
రక్షణ పొందినప్పుడు నీకు పరిశుద్ధతను నీకు ధరింపచేసాడు. ఇప్పుడు నీవు ఆ పరిశుద్ధతను నీ జీవితములో నీవే కొనసాగించాలి. ఒకవేళ లోకము వైపుకు మళ్ళినప్పుడు నీ పై ధరింపచేయబడిన పరిశుద్ధత నిలిచి ఉండదు. మరలా నీవు దేవుని యెదుట సరిచేసుకున్నపుడే మరలా నీకు పరిశుద్ధత తిరిగి ధరింపచేయబడుతుంది.
విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.౹ -1 తిమోతికి 6:12
పోరాడటానికి మనలను ప్రభువు ఎన్నుకున్నాడు. మన జీవితములలో వచ్చే పరిస్థితులలో మనము డీలా పడిపోతాము. అయితే మనము పోరాటము చేసేవానిగా మనలను ప్రభువు ఎన్నుకున్నాడు. పోరాటము చేసేవాడు భయపడడు. మనము కూడా శరీర సంబంధమైన విషయాలపై పోరాటము చేసేటప్పుడు మనకు ఇబ్బంది, గాయము కలిగినా సరే నిజమైన యోధుడు యుద్ధము ఆపడు.
పరలోకరాజ్యము ఒక యజమానుని పోలి ఉంది. ఆ యజమానుడు తన దగ్గర ఉన్న తలాంతులను తన దాసులకు ఇచ్చి వెళ్ళాడు. ఎవరైతే వాటిని రెండింతలుగా చేసారో వారిని ఇంకా ఉన్నతమైన స్థానమునకు వారిని తీసుకువెళ్ళారు. అలా చెయ్యని వాడు విడువబడ్డాడు.
నీవు పిలువబడిన పిలుపు ప్రకారము సిద్ధపరచుకుంటావో, అప్పుడు సాక్ష్యము పొందుకుంటావు. అప్పుడు పోరాటము చేయవలసిన లెవెల్ కి నీవు ఎదుగుతావు. ఎప్పుడైతే నిలబడి పోరాడతావో అప్పుడు విజయము పొందుకొని, విజయవీరుడు అని మహిమ పరచబడతావు.
రాజ్యములో ఎంతో మంది ఉన్నప్పటికీ యుద్ధము చేయటానికి కొంతమందినే ఏర్పాటు చేయబడతారు. ఎవరిలో ఆ సామర్థ్యము ఉంటుందో వారినే పరీక్షించి ఆ పనికొరకు సిద్ధపరచుకుంటారు. అయితే నీలో ఉన్నవాడు, నీముందర ఉన్న పోరాటము కంటే బలవంతుడు. ఆయనను బట్టే నీవు పోరాటము చేసేవాడిగా సిద్ధపరచబడతావు.
మొట్టమొదట నీ పిలుపును ఎరిగి ఉండుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అటుపై నీ పిలుపు ప్రకారము జీవించుటకు సిద్ధపడితే, అప్పుడు పోరాటము చేసే నెక్స్ట్ లెవెల్ కి ప్రభువు తీసుకెళతాడు.
క్రీస్తు కూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.౹ -1 పేతురు 2:21
క్రీస్తు అన్యాయముగా మాటలు పడ్డాడు, అన్యాయముగా శ్రమ పొందినవాడుగా ఉన్నాడు. లోకము నన్ను ఎరుగదు గనుక మిమ్మును హింసించును అని ప్రభువు చెప్పాడు. అయినప్పటికీ ధైర్యము తెచ్చుకొనుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. అనగా మనము కూడా క్రీస్తువలే అన్యాయముగా శ్రమను అనుభవించిన తరువాత, ఆ శ్రమలో భయపడక నిలిచి ఉన్నప్పుడు మనము మహిమ పరచబడతాము.
ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి. -1 పేతురు 3:9
మన జీవితము దేని కొరకు ఎన్నిక చేసుకున్నాడు అనే సంగతి తెలియట్లేదు. మన పిలుపు ఆసీర్వాదము కొరకు పిలువబడ్డాము. ఏదైతే ఆశీర్వాదము అని దేవుని చేత నిర్ణయైంచబడిందో, ఆ ప్రతీ ఆశీర్వాదమునకు వారసుడవు. అయితే కండిషన్ ఏమిటి అంటే ప్రతి దూషణ చేయకూడదు. అంటే ఉదాహరణకు కష్టములు, నష్టములు, అప్పులు బాధలు చుట్టుముట్టినప్పుడు, మనలో వచ్చే మాటలు, “ఎందుకొచ్చిన జీవితము? నా జీవితము వృధా అని మనకు మనమే శపించుకుంటాము”. అలా మనము పరిస్థితులకు ప్రతి దూషణ మనము చేయకూడదు. అయితే అలాకాక ఆ పరిస్థితిలో సహితము, “దీవించుడి” అంటే నా జీవితము మహిమ పరచబడే జీవితము. దేవుని చేత ఎన్నిక చేయబడినది అని పలకాలి. అప్పుడు సాక్ష్యము పొందుకుంటాము చివరికి మహిమపరచబడతాము. నీ జీవితము దేవుని చేత ఎన్నిక చేయబడింది. నిన్ను ఎన్నిక చేసిన దేవుడు సామాన్యుడు కాదు.
- పరిశుద్దత కొరకు పిలువబడ్డాము
- పోరాటము చేయడానికి పిలువబడ్డాము
- మహిమపరచబడటానికి పిలువబడ్డాము
- ఆశీర్వాదము కొరకు పిలువబడ్డాము
కాబట్టి ఈరోజు నిన్ను నీవు సిద్ధము చేసుకో. ఇంక నేను అపవిత్రతకు చోటివ్వను ప్రభువా అని తీర్మానము చేసుకుందాము.