06-08-2023 – ఆదివారం మొదటి ఆరాధన

స్తోత్ర గీతము -1

హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి

రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్
హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి

తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి
పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని యేసుని స్తుతియించుడి              ||రాజుల||

సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి
అగ్నివడగండ్లార మీరు  కర్తను స్తుతియించుడి
హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి              ||రాజుల||

యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి
పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి              ||రాజుల||

అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి
అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి
దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి              ||రాజుల||

స్తోత్ర గీతము -2

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా (2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2)     ||నీ కృప||

మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప (2)     ||యేసయ్యా||

ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప (2)     ||యేసయ్యా||

స్తోత్ర గీతము -3

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4)
యేసయ్యా నీవే నా రక్షకుడవు
యేసయ్యా నీవే నా సృష్టికర్తవు
దరి చేర్చి ఆదరించుమా
ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా
వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు
ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు
హాల్లేలూయా ఆమెన్
ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా

పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి
సర్వాధికారివి.. ఓ యేసయ్యా (2)
కరుణించి కాపాడుమా
ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2)
||హల్లెలూయా||

స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్
కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా (2)
కృప చూపి నడిపించుమా
ఓ యేసయ్యా.. కృప చూపి నడిపించుమా (2)
||హల్లెలూయా||

ఆరాధన వర్తమానము

మన దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను పొందుకున్న మనము, మన దేవునిని నిజముగా స్తుతించవలసినవారమై ఉన్నవారము. అన్ని సమయములలో ఆయన స్తుతించబడవలసినవాడు! మన సంతోషములోనే కాదు, మన ఇబ్బందులలో కష్టములో సహితము ఆయన స్తుతించవలసినవారము!

విశ్రాంతి దినముయొక్క ప్రాముఖ్యత ఏమిటో మనకు తెలియక మనకున్న పరిస్థితులను బట్టి మిస్స్ చేసుకునేవారముగా ఉంటాము.

నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవ ములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. -యెషయా 58:13-14

విశ్రాంతి దినము యెహోవాకు ప్రతిష్టితము, మనకు మనోహరము అయిన దినము. శ్రేష్టమైన దేవునిని కలుసుకొని, ఆయనతో సహవాసము చేయడానికి వస్తున్నాము గనుక ఈ దినము మనకు ఎంతో శ్రేష్టమైనది మరియు ఘనమైనది.

నీవు విశ్రాంతి దినమును ఘనమైనదిగా ఎంచి దేవునిని ఘనపరిస్తే దేశము యొక్క ఉన్నతమైన స్థలములమీద ఎక్కిస్తాను అనే మాట చెప్పుచున్నాడు!

నీవు చేసిన ప్రార్థన నిన్ను బంధకములలోనుండి విడిపిస్తుంది, బంధకములలో పడకుండా కూడా కాపాడుతుంది.

కురుపులతో బాధపడిన లాజరు లోకములో భయంకరమైన దినములు అనుభించిన తరువాత, పరలోకములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అంటే తన దినములు లోకములో దేవుని వెంబడించి, ప్రేమించి ఆశ్రయించిన దినములుగా ఉన్నాయి అని అర్థముచేసుకోవచ్చు!

మనమున్న సంతోషకరమైన పరిస్థితిలో దేవునిని ఎలా స్తుతించామో, మన కష్టసమయములో కూడా అదే ఉజ్జీవముతో స్తుతించినప్పుడు మనకు దేవునిపై ఉన్న ప్రేమను కనపరచగలుగుతాము!

యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. -యెషయా 58:11

నీ దేవుని స్వభావము ఏమిటి అనేది నీవు ఎరిగి ఉండవలసిన అవసరము ఉన్నది. మనము వెళ్ళే గడ్డు పరిస్థితులలో, కష్ట పరిస్థితులలో ఆయన ఎలా మనతో ఉంటున్నాడో మనము ఎరిగినప్పుడు, మనము దేనికీ భయపడము. నిత్యము కూడా ఆయన మనలను నడిపించేవాడు! నిత్యము అంటే కేవలము సంతోషకరమైన పరిస్థితులే కాదు గానీ దుఃఖకరమైన పరిస్థితులు కూడా! నీ శ్రమలో నీవు నిలబడినప్పుడు నిన్ను ఖచ్చితముగా నడిపిస్తాడు! అప్పుడు దేవుని మాటలు నీ పరిస్థితులలో ప్రత్యక్షపరచబడతాయి.

నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు. -కీర్తనలు 23:3

నీ కష్టములో నీవు అలాగే ఉండిపోవడము దేవునికి ఇష్టము లేదు. ఖచ్చితముగా మన హృదయములను సేద తీరుస్తాడు అంతేకాక, ఆయన నీతి మార్గములో మనలను ఖచ్చితముగా నడిపిస్తాడు. ఆ మార్గములో మరణమే లేదు.

నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు -కీర్తనలు 73:24

వారమంతా ప్రతీ దినము కృపలో నడిపించిన దేవునిని ఆరాధించే సమయము ఎలా పోగొట్టుకుంటాము? అన్ని రోజులలో దేవుని ప్రేమను పొందుకుని, ఆయనను ఆరాధించే రోజును మాత్రము మన పరిస్థితులను బట్టి ఎలా పోగొట్టుకోగలము? దేవునిని నిజముగా ప్రేమించేవారు ఖచ్చితముగా దానిని పోగొట్టుకొనరు! మన దేహము ప్రభువు నిమిత్తమే! నీవు నిలబడితే నీ పక్షమున యుద్ధము చేసేవాడు నీ దేవుడు.

ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణమువరకు ఆయన మనలను నడిపించును. -కీర్తనలు 48:14

నిత్యము నీకు సేద తీర్చేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను నీతి మార్గములో నడిపించేవాడు అయిన ఈ నీ దేవుడు సదాకాలము నీకు దేవుడై ఉన్నాడు. మరణమువరకు మనతో ఉండి నడిపించేవాడు! అందుకే ఆయనకంటే శ్రేష్టకరమైనది ఏదీ ఉండకూడదు! ఆయనే మనకు మనోహరుడుగా ఉండాలి.

ఆరాధన గీతము

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించేదము (2)
నీ కనుపాపలే నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే ఎబినేజరే
ఇంత కాలము కాచితివే
ఎబినేజరే ఎబినేజరే
నా తోడువై నడిచితివే

స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కౌగిలిలో దాచితివి స్తోత్రం

ఎడారిలో ఉన్న నా జీవితమును
మేళ్లతో నింపితివి (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం (2)
|| ఎబినేజరే ||

ఆశలే లేని నాదు బ్రతుకును
నీ కృపతో నింపితివి (2)
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2)
|| ఎబినేజరే ||

జ్ఞానుల మధ్యన నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యం ఆశ్చర్యమే (2)
నీ పాత్రను కానే కాదు స్తోత్రం
కేవలం నీ కృప యే స్తోత్రం (2)
|| ఎబినేజరే ||

వారము కొరకైన వాక్యము

జీవగ్రంధములోనుండి మనము అనేకమైన సత్యములను మనము నేర్చుకోవాలి. ఆ సత్యములను వెంబడించినప్పుడు దేవుని యొక్క కార్యములను చూసేవారిగా ఉంటాము. రాజు చేసిన బంగారు ప్రతిమకు మొక్కమని రాజు ఆజ్ఞాపించగా! షద్రకు మేషాకు అబెద్నెగో అనేవారు తప్ప మిగతావారు అందరూ మొక్కినారు. అగ్నిగుండములో వెస్తారు అని తెలిసినప్పటికీ షద్రకు, మేషాకు మరియు అబెద్నెగో అనువారు దేవుని గూర్చిన సత్యమును సమయము వచ్చినప్పుడు ప్రకటించినవారుగా ఉన్నారు.

మనము కూడా దేవుని ప్రేమించేవారము అని చెప్పుచుంటాము గానీ, సమయము వచ్చేసరికి చతికిలపడిపోతాము. సత్యములో నాటబడకుండా నీవు ఫలించలేవు, సత్యములోని స్వాతంత్రమును అనుభవించలేవు. అందుకే జీసస్ కేర్స్ యూ మినిస్ట్రీ ద్వారా దేవుని సత్యములను నేర్చుకుంటున్న మనము మాత్రము దేవుని గూర్చిన సత్యములపై మాత్రమే మనము నిలబడాలి.

“నా దేవుడు రక్షించ సమర్థుడై ఉన్నాడు!” – ఇది సత్యము, ఇదే సత్యము! అయితే దేవుని చేత పరీక్షించబడే సమయము ఖచ్చితముగా ఉంటుంది. పరీక్షా సమయము వచ్చింది అనే సత్యము గ్రహించినప్పుడు దేవుని మాట ప్రకారము నిలబడు!

ఈ రోజు “దేహము” గూర్చి నేర్చుకుందాము. యేసు క్రీస్తు రక్షణ సువార్తను అంగీకరించిన మనము అందరము మారు జన్మ పొందాము. అప్పటినుండి నీ దేహము యొక్క ఉద్దేశ్యము మారిపోయింది.

మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,౹ -1 కొరింథీయులకు 6:19

ఈరోజు నీవు నేను దేవునికి ఆలయముగానూ, పరిశుద్ధాత్మకు ఆలయముగానూ ఉన్నది. ఈ సత్యము ఎరుగకపోతే అసహ్యకరమైన కర్యములు మనము చేసేవారిగా ఉండిపోతాము. అయితే ఈరోజు సత్యము ప్రకటించబడుతుంది, గ్రహిస్తావా!

భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజనపదార్థములకును నియమింపబడి యున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే.౹ -1 కొరింథీయులకు 6:13

ప్రభువా నా దేహము నీకొరకే అపవాదికి కొరకు, లోకము కొరకు కాదు నాయనా అని ఒప్పుకుంటావా! నా దేహము ద్వారా నీవే మహిమపరచబడాలి ప్రభువా అని తీర్మానము ప్రకటిద్దామా! అట్టి రీతిగా మన దేహమును సిద్ధపరచుకుందాము.

జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.౹ -2 కొరింథీయులకు 5:15

నా దేహము ప్రభువు నిమిత్తమే, ఇక నా జీవితము నా కొరకు కాదు కానీ నాకొరకు ప్రాణము పెట్టిన నా ప్రభువు కొరకే అని మనము తీర్మానము తీసుకుందాము.

మీ దేహములు క్రీస్తునకు అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంతమాత్రమును తగదు.౹ -1 కొరింథీయులకు 6:15

మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవి అని చెప్పబడింది. ఎంత గొప్ప ఆధిక్యత మనది? ఈ సత్యము నీ హృదయములో నాటబడాలి అని అంతగానో దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. వేశ్యను గమనిస్తే, తను చేసే అన్ని పనులు అపవాదికి సంబంధించినవే. క్రీస్తు అవయవములుగా చేయబడిన మన దేహములతో వేశ్య కార్యములు, అపవాది కార్యములు ఎలా చేయగలము? అలా చేయతగదు అని ప్రభువు ప్రేమపూర్వకముగా తెలియచేస్తున్నాడు.

మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.౹ -రోమా 6:13

ఈ సత్యము అర్థము చేసుకుని మన దేహమును నీతి సాధనముగా ప్రభువు మహిమ కొరకు సిద్ధపరచుకుందాము.

దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. –నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. –కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. –మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. -2 కొరింథీయులకు 6:16

ఎప్పుడైతే మన దేహమును ఆయన కొరకు సిద్ధపరచుకుంటామో అప్పుడు ఆయన ఈ దేహములో ప్రభువు నివసించేవాడుగా ఉన్నాడు. నీ దేహము ఆయన కొరకైన నీతి సాధనముగా సిద్ధపరచుకున్నపుడు, నీలో ఆయన సంచరించేవాడుగా ఉంటాడు. ఎక్కడ సంచరిస్తాడు అంటే, ఎక్కడైతే చీకటి ఉంటుందో, అక్కడ వెలుగు సాధనముగా నిన్ను వాడుకొనుట ద్వారా ఆయన సంచరించేవాడుగా ఉంటాడు. అయితే ఇది జరగాలి అంటే నీవు నీ దేహము ప్రభువు కొరకే అనే ఉజ్జీవము కలిగి ఉండాలి. అంతే కాదు గాని, మన జీవితములకు దేవుడుగానూ, వేరేవారికి మనలను వెలుగుగాను ప్రభువు చేసేవాడుగా ఉంటాడు.

దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును. -మత్తయి 6:22

మనమున్న ప్రస్తుత పరిస్థితులలో మన కన్ను చెడిపోవడానికి అపవాది అనేకమైన ఉచ్చులు బిగించింది. దానికొరకు మన చేతిలో ఉన్న మొబైల్ ని ఒక సాధనముగా అపవాది వాడుకుంటున్నాడు. మనము ఏది చూస్తే చెడిపోతామో, దానిని చూడటానికి తహతహలాడే పరిస్థితిలోనికి మనము వెళ్ళిపోతాము. అయితే ఈ సత్యము ఎరిగినవారమై మనము ప్రభువుకొరకు సిద్ధపరచుకుంటే ఆ ఉచ్చులో పడకుండా మనము కాపాడబడగలుగుతాము.

దేహము ప్రభువు కొరకు సిద్ధపరచబడాలి అంటే మన కన్ను దేనిని చూస్తుందో గమనించుకుని, సరిచేసుకోవాలి. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టే, తాను ప్రేమించినవారిని హెచ్చరించి సరిచేయటానికి ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. గనుక ప్రభువు మాటలు స్వీకరిద్దాము.

నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియైయుండినయెడల ఆ చీకటి యెంతో గొప్పది. -మత్తయి 6:23

ఆత్మీయమైన ఆరంభము ఎంతో బాగుంటుంది. అయితే నీ కంటిముందుకు అపవాది ఒక ఉచ్చు తీసుకువచ్చి ప్రలోభపరచగానే, ఆ ఉచ్చులో పడిపోయామా, మనలో ఉన్న వెలుగు చీకటిగా అయిపోతుంది. అందుకే అపవాది తంత్రములను ఎరిగిఉండాలి. మనమందరము డిక్లేర్ చేద్దాము! “నా చూపు నీ మహిమ కొరకే భద్రపరచుకుంటాను ప్రభువా”. అంతే కాదు మన శరీరమంతా, అన్ని అవయవములు కూడా ప్రభువుయొక్క నీతి సాధనములుగా సిద్ధపరచుకుందాం.

ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డైవెనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. -2 కొరింథీయులకు 5:10

నన్ను నేను సిద్ధపరచుకొని నీతి సాధనముగా నిలబడితే, ఒక ప్రతిఫలము ఖచ్చితముగా ఉంటుంది. అదే ఒకవేళ ఈ దేహమును అపవాదికి సంబంధించిన సాధనముగా సిద్ధపరచుకుంటే దానికి సంబంధించిన ప్రతిఫలము కూడా ఖచ్చితముగా ఉంటుంది. అందుకే అపవాదికి సంబంధించిన క్రియలు చెయ్యకుండా మనలను మననే కాపాడుకోవాలి. మనలో దేవునికొరకైన రోషము రగిలించబడాలి.

ప్రభువు నీలో ఉన్నాడు అంటే ఆయన క్రియలు ఖచ్చితముగా కనబడతాయి. క్రియలు లేకుండా మనము ఎంత మాటలాడినా అది వ్యర్థమే! మాటలు ఆత్మీయముగా మాట్లాడుతూ, దేహమును మాత్రము అపవాది క్రియలకొరకు వదిలిపెడితే అది ఎంతో దుర్భరమైన స్థితి.

కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.౹ -రోమా 6:12

శరీరమును పాపముచేత ఏలనివ్వకుడి. నీ శరీరము చావునకు లోనైనది గనుక ఆ శరీర ప్రేరేపణకు లోబడవద్దు. అందుకే మొదట నీ దేహమునకు కన్నే గనుక మొదట నీ కన్ను సరిచేసుకో. మన జీవితమునకు దీపము వాక్యమే గనుక, ఆ వాక్యము ఎంత తేటగా నీకు తెలిస్తే అంతగా జీవముతో నింపబడుతుంది.

చాలా సందర్భములలో పరిశుద్ధాత్మ ప్రేరేపణను మనము నిర్లక్ష్యము చేసి శరీరానుసారముగా క్రియలు జరిగించేవారముగా ఉంటాము. అయితే మనము ఇకమీదట, ఈ సత్యము వినిన తరువాత అలా ఉండకూడదు.

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.౹ -రోమా 12:1

సజీవయాగముగా అంటే ఇంక స్వంత ఆశ, కోరిక అనేవి ఇక ఉండవు. అటువంటి విధానములో నిన్ను నీవు సమర్పించుకుంటావా!

అందువలన నేను మీతో చెప్పునదేమనగా–ఏమి తిందుమో యేమి త్రాగు దుమో అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రము కంటె దేహమును గొప్పవి కావా? -మత్తయి 6:25

సజీవయాగముగా నీ దేహమును నీవు ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు, నీ దేహమునకు అవసరమైనది ప్రభువే చూసుకునేవాడుగా ఉన్నాడు. ఒకవేళ ప్రభువు నీతో మాట్లాడితే ఆయనతో ఒప్పుకో!