04-08-23 సూపర్ నేచురల్ సర్వీస్

స్తోత్ర గీతము – 1

ఆపత్కాలమున తన పర్ణశాలలో
ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను
తన గుడారపు మాటున నన్ను దాచెను
ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను

యెహోవా నా ప్రాణ దుర్గము – నేను ఎవరికి వెరతును
నా చేయి విడువని దేవుడుండగా – నేను భయపడను

ఇహలోక దుఃఖ బాధలలో – నీవు నాతో ఉన్నావు
ముదిమి వచ్చువరకు – నన్ను ఎత్తుకొనే దేవుడవు
నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు
నిత్యము నీ పై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్
ఆ … హల్లెలూయ …. హల్లెలూయ

లెక్కించలేని అద్భుతములు – మక్కువతో చేసిన దేవా
నీవు చేసిన కార్యములకై – నేను ఏమి అర్పింతును
స్వచ్ఛమైన నిత్య ప్రేమను – నాపై చూపినదేవుడవు
కోట్ల కొలది స్తోత్రములు – నిరతము నీకే ప్రభువా
ఆ … హల్లెలూయ …. హల్లెలూయ

స్తోత్ర గీతము – 2

ఆరాధింతు నిన్ను దేవా
ఆనందింతు నీలో దేవా
ఆరాధనలకు యోగ్యుడా
స్తుతి పాడి నిన్ను పోగిడిదము

ఆరాధన ఆరాధన ఆరాధన నీకే||ఆరా||

1. యేరికో గోడలు అడువచ్చిన
ఆరాధించిరే గంభీరముగా
కూలిపోయెను అడుగోడలు
సాగిపోయిరి కానాను యాత్రలో||ఆరా||

2. పెంతెకొస్తు పండుగ దినమునందు
ఆరాధించిరందరు ఐక్యతతో
కుమ్మరించెను అగ్నిజ్వాలలు
నింపబడెను ఆత్మ బలముతో||ఆరా||

3. పౌలు సీలలు భందింపబడగా
పాటలు పాడి ఆరాధించగా
బంధకములు తైంపబడెను
వెంబడించిరి యేసయ్యనెందరో||ఆరా||

స్తోత్ర గీతము – 2

దేవుడు మా పక్షమున వుండగా మాకు విరోధి యెవడు
జీవము గల దేవుని సైన్యముగా – సాతాన్ను వోడింతుము
యుద్ధం యెహొవాదె – రక్షణ యెహొవాదె- విజయం యెహొవాదె – ఘనతా యెహొవాదె

మాదేవుని బాహువే – తన దక్షిణ హస్తమే – ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును
తనదగు ప్రజగా మము రూపించి – నిరతము మాపై కృప చూపించి
తన మహిమకై మము పంపించి – ప్రభావమును కనుపరచును /యుద్ధం /

మాదేవుని యెరిగిన – జనులముగ మేమందరం
బలముతొ ఘన కార్యముల్ – చేసి చూపింతుము
దేవుడు చేసిన క్రియలను చేసి – భూమిని తలక్రిందులుగా చేసి
ఆయన నామము పైకెత్తి – జయ ధ్వజము పైకెత్తెదమ్ /యుద్ధం/

ప్రవచనాత్మక వాక్యము

మన ప్రభువు మన రక్షకుడు మనలను ప్రేమించినవాడు! వాక్యాన్ని మనము ధ్యానము చేసినప్పుడు, తెలియచేయబడిన సత్యము ఏమిటి అంటే, మనము పడిపోయిన గుంటలోనుండి లేపేవాడు. తన వాక్కును పంపి మనము పడిన గుంటలలోనుండి లేపేవాడు మన దేవుడు. లోతైన వాక్య జ్ఞానము లేకపోవుట చేత మన జీవితములు చెరలోనికి లాక్కుపోబడుతున్నాయి. అయినప్పటికీ మన ప్రభువు మన రక్షకుడు మనలను ప్రేమించినవాడు తన ఉద్దేశ్యమును వెల్లడిపరచారు! బంధింపబడినది విడుదలచేయబడుతుంది. దేనిని నీవు జయించలేకపోతున్నావో, దేని విషయములో వెనుకంజవేస్తున్నావో ప్రభువు ఎరిగినవాడై, తన ఉద్దేశ్యాన్ని తెలియచేస్తున్నాడు.

ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేప్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.౹ -హెబ్రీయులకు 1:3

మన జీవితములో ఈ పాపము విషయములో అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించిన సందర్భములలో మనము కూడగట్టుకున్న పాపముల విషయములో శుద్ధీకరణము చేసినవాడుగా మన ప్రభువు ఉన్నాడు! పాపము అంటే మనము చేసే పని మాత్రమే కాదు, ఆ పాపమును బట్టి మనము పోగొట్టుకొన్న ప్రతీదానినీ తిరిగి సమకూర్చేవాడుగా ఉన్నాడు!

ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.౹ -ప్రసంగి 12:13

యిర్మియా గ్రంథములో దేవుని మనస్సు ఎంతగానో క్షోభించడము చూడగలము. “నాలో ఏ వ్యర్థమైనదానిని చూసి మీ పితరులు నన్ను విసర్జించారు” అని దేవుడు అడుగుతున్నాడు. మనము చేసే క్రియలను బట్టి తన కోపమును కలిగినప్పటకీ, దానిని దిగమింగుకుని ఓపికతో కనిపెట్టేవాడుగా మన దేవుడు ఉన్నాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తముచేసి దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి తన మహత్తుగల మాటను విడుదల చేసేవాడుగా ఉన్నాడు. నీవు ఎన్ని రకాలుగా బంధించబడినప్పటికీ తన మాటలు విడుదలచేసి నిన్ను విడిపించాలనే ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు.

అయితే నీవు చేయవలసినది ఆయవ విడుదల చేసే మాటను పొందుకోవడానికి సిద్ధపడటమే!

నయోమి బెత్లెహేము నుండి మోయాబు దేశమునకు వెళ్ళింది. అక్కడ తన పిల్లలను పెనిమిటిని పోగొట్టుకుంది. అటువంటి సందర్భములో యెహోవా దేవుడు బెత్లెహేమును దర్శిస్తున్నాడు అని తెలుసుకుంది. బెత్లేహేములో ఉన్న కరువును బట్టి మోయాబు దేశమునకు వెళ్ళింది. అయితే ఆమె విన్నది బెత్లెహేమును దర్శిస్తున్నాడు కరువు పోగొట్టాడు అని. నీ నా జీవితములో కూడా ఏ బంధింపబడిన పరిస్థితిలో ఉన్నప్పటికీ, దేవుడు దర్శించుటనుబట్టి ప్రతీ బంధకము తెగగొట్టబడుతుంది. నయోమిని చూస్తే, “యెహోవా దర్శిస్తున్నాడు” అని తెలుసుకుంది కాబట్టే తిరిగి వెళ్ళడానికి సిద్ధపడింది. అప్పుడు రూతు ఏమి అంటుందో చూద్దాము!

అందుకు రూతు–నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;౹ -రూతు 1:16

రూతుకూడా భర్తను పోగొట్టుకుంది. అంటే సమస్తమును పోగోట్టుకుంది అని అర్థము. అయినప్పటికీ, “నీ దేవుడే నా దేవుడు” అని చెప్పగలిగింది. అంటే మోయాబునుంచి దేవుడు దర్శించే బెత్లెహేముకు వెళ్ళడానికి సిద్ధపడింది. ఎప్పుడైతే తను బెత్లెహేములో అడుగుపెట్టిందో అప్పుడు తన జీవితము ఎలా మార్చబడిందో మనకు తెలిసినదే!

మోయాబీయు రాలైన రూతు–నీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె–నా కుమారీ పొమ్మనెను.౹ -రూతు 2:2

మన దేవుడు సిద్ధపరచే దేవుడు. సమస్తము పోగొట్టుకొన్న స్థితిలో రూతు వచ్చింది. మొదటగా తనకు ఆహారాన్ని సిద్ధపరచాడు. అక్కడ బోయజు కాక వేరే వాళ్ళ పొలములు ఉన్నప్పటికీ, బోయజు పొలమునకు మాత్రమే నడిపిచబడింది. మన జీవితములో కూడా మనము మోయాబు దేశములాంటి బంధింపబడిన స్థితిలో ఉన్నప్పటికీ, మనలను బంధకములను విడుదల చేసి మనము తృప్తిపరచబడునట్లు సిద్ధపరచినదానిని మనకి దయచేసేవాడు మన దేవుడు. సమస్తము కోల్పోయినప్పటికీ సమస్తమును తిరిగి ఇవ్వగల సమర్థుడి సన్నిధిలో ఉన్నాము!

ఆరాధన గీతము!

దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భజియించి పూజించి ఆరాధింప
నీకే నీకే మహిమ (2)
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
మహిమా నీకే మహిమా – (4) ||దేవా||

కష్టాలలోన నష్టాలలోన
కన్నీరు తుడిచింది నీవే కదా (2)
నా జీవితాంతం నీ నామ స్మరణే
చేసేద నా యేసయ్యా (2) ||మహిమా||

నా కొండ నీవే నా కోట నీవే
నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే (2)
నిన్నే భజించి నిన్నే స్తుతించి
ఆరాధింతునయా (2) ||మహిమా||

ఈరోజు ప్రకటించబడిన దేవుని ఉద్దేశ్యము – “బంధింపబడినది విడుదల చేయబడుతుంది”

నీవు చేసే ఆరాధన నీకొరకు సిద్ధపరచిన విడుదల పొందుకోవడానికి నిన్ను సిద్ధపరుస్తుంది. గనుక దయచేసి మౌనముగా ఉండవద్దు! నోరు తెరిచి స్తుతించి సత్యమును ప్రకటించు!


అవును దేవా నీవు మా దేవుడవు తండ్రీ, మా జీవితములలో విడుదల కొరకు మార్గములు సిద్ధపరచేవాడవు!

నీవు నోటితో ఒప్పుకున్నది నీ జీవితములో స్థిరపరచబడుతుంది. గనుక నీ నోటితో నీ దేవుని గూర్చిన సత్యము ప్రకటించి ఆరాధించు!

కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీ యేసయ్య అని నిజముగా నీవు గ్రహిస్తే ప్రకటిస్తావా, నోరు తెరిచి ఆరాధిస్తావా!

రూతు దేవుడు దర్శిస్తున్నాడు అని గ్రహించింది. ఈరోజు నీవు దేవుని ఉద్దేశ్యమును గ్రహిస్తే, కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచేది యేసయ్యే అని గ్రహిస్తే, నోరారా ఆరాధించు. దయచేసి మౌనముగా ఉండవద్దు.

నా కష్టాలను తీర్చేవాడవు నీవే, నా నష్టాలను తీర్చేవాడవు నీవే, నా కన్నీరు తుడిచేది నీవే ప్రభువా అని పరలోకమువైపు చేతులెత్తి ప్రకటిస్తావా

నీ ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు, ఆయనను చూస్తూ చెప్పు, యేసయ్యా నీకే మహిమా!

ఈరోజు విడుదల చేయబడిన మాటల నెరవేర్పు కొరకు దేవదూతలు పనిచేసేవారుగా ఉన్నారు. ఈ రోజు బంధింపబడినవి విడుదల అని వాక్కు విడుదల అయింది. దానికొరకు ఏమి బంధించబడిందో మనము గ్రహించాలి. అది మనము వాక్యము ద్వారానే మనము తెలుసుకోవాలి.

దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.౹ -ప్రసంగి 3:11

“దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు” ఈ మాటలు మీరు స్వీకరిస్తే, ఈ మాట లో నీ జీవితాన్ని చూడాలి. అంటే, “నా జీవితములో దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు ప్రతీ ఆశీర్వాదము ఆయన నియమించియున్నాడు”. నీవు అడగకుండానే నీ జీవితములో కావలసిన ప్రతీదీ నియమించేసాడు. ఒక మనిషి జీవితాన్ని పరిశీలిస్తే, వాడు బాల్య దశతో ప్రరంభమయింది. వాడికి మొదట చదువు, తరువాత ఉద్యోగము, తరువాత వివాహము, తరువాత పిల్లలు, తరువాత పిల్లలను చక్కపరచుకొనుట ఇలా అనేకమైన దశల గుండా వాడి జీవితము వెళుతుంది. ప్రతీ దశలో ఏమి అవసరమో ఆ ప్రతీ దాన్ని దేవుడు ముందుగానే క్రమముగా సిద్ధపరచాడు.

అయితే మనలో చాలమంది జీవితములో ఈ క్రమము తప్పిపోయేదిగా మనము చూస్తాము. కొంతమందికి చదువులో క్రమము తప్పుతుంది, మరికొంతమంది ఉద్యోగము విషయములో, ఇంకొంతమంది వివాహములో ఇలా అనేకమైన విషయాలలో నష్టాలను చూస్తున్నారు. ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదము చూడవలసిన మనము నష్టము వెంబడి నష్టము గుండా మన జీవితపు దశల గుండా వెళుతున్నాము. ఇలా మన జీవితములు బంధింపబడిన స్థితిలో ఉంటున్నాయి.

మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము.౹ -యిర్మీయా 5:25

మీ దోషములు మీకొరకు ముందుగా సిద్ధపరచిన ఆశీర్వాదముల యొక్క క్రమమును తప్పిస్తాయి. దేవుని మాట వినని ప్రతీ సారీ మన ఆశీర్వాదమును మనమే బంధించుకుంటున్నాము. అయితే ఈరోజు ప్రభు ఆ బంధకములను తెంచబోతున్నాడు.

వారు–రండి మన దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించు వాడు గదా; నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు.౹ -యిర్మీయా 5:24

బంధించబడినది విడుదల పొందాలి అంటే”నా దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలిగియుంటాను” అని నీ హృదయమును సిద్ధపరచుకోవాలి. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట ద్వారా తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించు వాడు. అనగా నీ జీవితములో అవసరమైన ఆశీర్వాదము మొదలయ్యి సంపూర్ణమయ్యే విధముగా నీ జీవితమును సిద్ధపరచువాడు.

“నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని” సత్యమును మనము గ్రహించలేని కారణాన మన జీవితము బంధించబడిన స్థితిలో ఉండిపోయింది. అయితే ఈరోజునుంచి, నాకు నీవే ఆధారము దేవా, నా జీవితములో సమస్తము నిర్ణయించినవాడవు అని ప్రకటించి ఆయనను ఆధారము చేసుకుని ముందుకు వెళ్ళాలి.

ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు. -యెషయా 26:3

ఏ ఏ విషయములలో నీ జీవితములో శాంతి లేదో, నీవు నా దేవుడు, నా పక్షమున నిలబడేవాడు, నా కొరకు సమస్తము సిద్ధపరచేవాడు అని సత్యమును గ్రహించి ఆయనపైనే భయభక్తులు కలిగి ఆనుకొంటావో అప్పుడు ప్రతీ విషయములో పూర్ణశాంతి ప్రత్యక్షపరచబడుతుంది. దానికొరకు దేవుడు మార్గములు తెరిచేవాడుగా ఉంటాడు. “నిర్ణయింపబడిన కోతకాలపు వారములను” అంటే పండిన పంట కోయబడి అనుభవించే సమయము. యేసు నామములో నా కొరకు సిద్ధపరచినది నేను అనుభవించుదును గాక అని ధైర్యముగా ప్రకటించు! నీ కొరకు పని చేయుటకు దేవదూతలను ప్రభువు నియమించాడు.

పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. -కీర్తనలు 23:2

ఈ గొర్రెలు ఒక చోట పచ్చిక తింటున్నాయి. అక్కడ పచ్చిక అయిపోయింది అనుకోండి, అవి అనుభవించడానికి, తిని తృప్తి చెందడానికి మరొక చోటుకి అనగా పచ్చిక గల చోటికి నడిపించబడుతున్నాయి. అలాగే మన జీవితములలో కూడా పచ్చికలేని బంధింపబడిన జీవితములను, పచ్చిక గలిన ఆశీర్వాదములు అనుభవించే స్థితిలోనికి నడిపిస్తాడు. రూతు సమస్తమును పోగొట్టుకొనినదై ఉన్నప్పుడు సమస్తము దయచేసే బోయజు దగ్గరకే నడిపించబడింది. ఈరోజు నిన్ను కూడా సమాధానకరమైన స్థితిలో ప్రభువు నడిపించాలి అని ఆశ కలిగి ఉన్నాడు.

అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. -యెషయా 45:1

ఇక్కడ కోరెషు గురించి కాదు గానీ, నీ గురించి నా గురించే! కోరెషును అభిషేకించినవాడు, నిన్ను నన్ను కూడా అభిషేకించాడు. అభిషిక్తుడైన యేసయ్యను కలిగి నీవు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, ఈరోజు నీ జీవితాన్ని గూర్చి ప్రభువు చెప్పుచున్నాడు – “ఏ పోరాటాలైతే నీ జీవితములో ఉంటున్నాయో, ఆ పోరాటాలను జయించడానికి నీ కుడి చెయ్యిని పట్టుకొని ఉన్నాడు”.

కొంతమంది దేవునికి దూరముగా వెళ్ళి ఆశీర్వాదము బంధింపబడిన స్థితిలో ఉంటున్నారు. నీవు దేవుని దగ్గరకు తిరిగి వస్తే, నీ ఆశీర్వాదము విడుదల అవుతుంది.

మరి కొంతమంది దేవునిని కలిగినప్పటికీ శత్రువు ఆశీర్వాదమును బంధించి ఉంచాడు. వారి చెయ్యి పట్టుకుని దేవుడు శత్రువు మీద విజయమును ఇచ్చి నీ ఆశీర్వాదము నీవే అనుభవించునట్లు నడిపిస్తాడు.

అభిషేకము కలిన వారి చెయ్యి దేవుడు పట్టుకొనేవాడుగా ఉన్నాడు. అంటే, పాపములేకుండా ఎవరైతే వారి జీవితాన్ని సిద్ధపరచుకుంటారో, వారిలో దేవుడు నివాసము ఉంటాడు. అంటే అభిషేకము కలిగి ఉంటావు. అప్పుడు దేవుడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను విజయము వైపు నడిపించి నీ ఆశీర్వాదము నీవే అనుభవించునట్లు నిన్ను నడిపిస్తాడు.

దేవుడు నీ ఆశీర్వాదమును నియమించాడు. ఆ ఆశీర్వాదమును నీవు పొందుకోకుండా శత్రువు ప్రయత్నము చేసినప్పటికీ, నీవు దేవునితో కలిగిన సహవాసమును బట్టి కలిగిన అభిషేకమును బట్టి ఆయన నీ చేయి పట్టి నిన్ను జయకరముగా నడిపిస్తాడు.

అంతే కాక, “ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను” ప్రభువు చెప్పుచున్నాడు. అంటే ఏమిటి? దేని కాలమున అది చక్కగా ఉండునట్లు ప్రభువు ముందుగానే నియమించి ఉన్నాయి. మనము ఆ సిద్ధపరచినది పొందుకోకుండా శత్రువు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ద్వారములు మూయబడకుండా తలుపులు తీసేవాడుగా ఉన్నాడు.

“నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థల ములను సరాళముచేసెదను” అంటే, నీ ఆశీర్వాదము దేవుడు నియమించేసాడు. ఆ ఆశీర్వాదము పొందకుండా శత్రువు ఎటువంటి అడ్డంకులు సృష్టించినప్పటికీ ఆ స్థలములను సరాళము చేసేవాడుగా నీ ప్రభువు ఉన్నాడు.

“ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ” అంటే నీవు కొన్ని పరిస్థితులలో బంధించబడి ఉన్నావు. వాటి నుండి విడుదల పొందుకోవడానికి నీవు ఏమి ప్రయత్నము చేసినా సరే సాధ్యం కాని పరిస్థితులలో ఆ బంధించిన తలుపులను పగులగొట్టేవాడుగా నీ దేవుడు ఉన్నాడు.

కోరేషును అభిషేకించినవాడు ఈరోజు నిన్ను నన్ను అభిషేకించాడు. కోరెషు చెయ్యి పట్టుకుని నడిపించిన అదే దేవుడు మార్పులేని వాడు గనుక నిన్ను నన్ను కూడా చెయ్యి పట్టి నడిపించేవాడుగా ఉన్నాడు.

“ఇనుపగడియలను విడగొట్టెదను” అంటే, ఆ గడియ తీస్తే చాలు విడుదల అయిపోతాము. ఆశీర్వాదము ఏ విషయమును బట్టి బంధించబడిందో ఆ పరిస్థితిలో ప్రభువు నిన్ను విడుదల చేసేవాడుగా ఉన్నాడు.

సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించు టయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి౹ యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనినయెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజములవారికి పత్రికలిమ్మని అడిగెను.౹ -అపొస్తలుల కార్యములు 9:1-2

మన జీవితములో చూస్తే, అధికారము చేత దేవుని బిడ్డలను బంధించడానికి పరిస్థితులు చుట్టుముడుతున్నాయి. అలాగే నీ ఆశీర్వాదములని బంధించడానికి అధికారముచేత నీ యెదుటకు వచ్చే ప్రతీదానినుండి నిన్ను తప్పించడానికి దేవుడే కార్యము జరిగించేవాడుగా ఉన్నాడు.

అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చి నప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.౹ -అపొస్తలుల కార్యములు 9:3

నీ జీవితములో ఉద్యోగములోనైనా, కుటుంబములోనైనా మరి ఏ పరిస్థితులలోనైనా నీ ఆశీర్వాదమును బంధించుటకు ఏ అధికారము ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నములనుండి తప్పించడానికి ప్రార్థన చేయడముద్వారా పరలోకమును కదిలిస్తుంది. సౌలు కూడా దమస్కులోనికి వెళ్ళగానే ప్రభువు ఎందుకు దర్శించాడు అని చూస్తే, అక్కడ అననీయ అనే ప్రార్థనాపరుడు ఉన్నాడు. నీవు చేసే ప్రార్థనలు కూడా బంధింపబడిన ఆశీర్వాదమును విడుదలచేసే శక్తిగలవిగా ఉన్నాయి. పేతురు బంధించబడ్డాడు సంఘము చేసిన ప్రార్థన విడుదల చేసింది. బంధించడానికి వచ్చిన సౌలునుండి తన ప్రజలను విడిపించింది అననీయ ప్రార్థనలు.