16-07-2023 – ఆదివారం మొదటి ఆరాధన

స్తోత్ర గీతము – 1

ఆరాధించెదను నిన్ను
నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2)
ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2)
||ఆరాధించెదను||

నీ జీవ వాక్యము నాలో
జీవము కలిగించె (2)
జీవిత కాలమంతా
నా యేసయ్యా నీకై బ్రతికెదను (2)
||ఆరాధించెదను||

చింతలన్ని కలిగిననూ
నిందలన్ని నన్ను చుట్టినా (2)
సంతోషముగ నేను
నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2)
||ఆరాధించెదను||

స్తోత్ర గీతము – 2

ఉత్సాహ గానము చేసెదము
ఘనపరచెదము మన యేసయ్య నామమును (2)
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా
హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్ (2)

అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి (2)
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము (2)
||హల్లెలూయ||

వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన (2)
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము (2)
||హల్లెలూయ||

స్తోత్ర గీతము -3

పల్లవి : స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా …
స్తోత్రించి ఘనపరతుము మహోన్నతుడా … (2)

అను పల్లవి : యేసయ్య మా యేసయ్య
నీవేగా అర్హుడవు
స్తుతియించెదము
స్తోత్రించెదము
పూజించెదము
ఘనపరచెదము
॥ స్తుతించి ॥

1. నా దేహం నీ ఆలయమై
నా సర్వం నీకంకితమై … ఓ (2)
నా జీవితమంతా నీకై నేను పాడి
నా సర్వము నర్పింతును (2)
॥ యేసయ్య ॥

2. ప్రతి క్షణము నీ సముఖములో
అనుదినము నీ అడుగులలో … ఓ (2)
నా జీవితమంతా నీకై నేను పాడి
నా సర్వము నర్పింతును (2)
॥ యేసయ్య ॥

ఆరాధన వర్తమానము

దేవుని సన్నిధిలో ఉన్న కారణము చేత మనమందరము సంతోషముగా ఉన్నాము. ఎందుకు అంటే, ఆయన సన్నిధిలో పూర్ణ సంతోషము ఉంది. ఈ సంతోషము నీవు నేను అనుభవించాలి అనేది దేవుని ఉద్దేశ్యము. దేవుని సన్నిధిలో ఆయన దయచేయు సంతోషమును అనుభవించి మనము తిరిగి మనము మునుపున్న స్థితిలోనే వెళ్ళము. అందుకే మనము మన దేవునిని స్తుతించవలసినవారమై ఉన్నాము.

ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేప్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.౹ -హెబ్రీయులకు 1:3

మనము దేవుడు ఏమై ఉన్నాడు అని ఆలోచిస్తే, “తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచున్నవాడు”. దేవుడు దేని కాలమున అది చక్కగా ఉండునట్లు అమర్చినవాడు, అని లేఖనముల ప్రకారము మనకు తెలుసు. మనలను సృష్టించిన వాడు ఆయనే. మనకు తండ్రిగా ఉన్నవాడు ఆయనే. తండ్రి ఏమి చేస్తాడు? తన కుమారులకొరకు సమస్తమును సిద్ధపరుస్తాడు. కనుక మన జీవితమునకు కావలసిన సమస్తమును ఆయన సిద్ధపరచి నిర్వహించేవాడుగా ఉన్నాడు.

రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను–మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు.౹ యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.౹ ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.౹ -1 దినవృత్తాంతములు 29:10-12

సత్యము ఎరిగీ దావీదు, మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు అని చెప్పుచున్నాడు. మన జీవితాలకు కావలసిన సమస్తము సిద్ధపరచి, నిర్వహిచేవాడుగా ఉన్నాడు. అందుకే నీవు, “నా తండ్రి నిత్యము స్తోత్రార్హుడే” అనే సత్యము ఎరిగి, ఆ ప్రకారము నీ ఆత్మ, జీవము మరియు శరీరమును సిద్ధపరచుకుని ఆరాధించిన యెడల, నీ జీవితములో అన్నీ అమూల్యమైనవే అనుభవించగలుగుతావు.

ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు. -యెషయా 26:3

నీవు ఆయన మీద ఆనుకున్నప్పుడు, నిన్ను ఖచ్చితముగా తృప్తి పరుస్తాడు. అందుకే నీ జీవితములో నిరంతరము ఆయన స్తోత్రార్హుడుగా ఉన్నాడు. మన భూసంబంధమైన జీవితములో ప్రతీదీ ఆయన వశము అయ్యి ఉన్నది అనే సత్యము మనము గ్రహించాలి. అంతే కాదు గానీ ఈ భూమియందు ఉన్న రాజ్యములు, ప్రభుత్వములు సమస్తము ఆయనవే. అలాగే మన వ్యక్తిగతమైన జీవితములు కూడా ఆయనదే. ఉదాహరణకు మన జీవితములో ఉన్న వాటిని చూస్తే, మనుష్యులు, వనరులు, ఆశలు, వస్తువులు ధనము ఇలా అనేకము ఉన్నవి. మన జీవితము లో రాజ్యము ఆయనది అందరికి పైగా హెచ్చించుకున్నవాడు కాబట్టి, అది మనుష్యులైనా, పరిస్థితులైనా అవి శత్రువుగా నీ జీవితములో ఉన్నప్పుడు, వాటన్నింటికి మీద అధిపతిగా ఉన్నాడు గనుక, ఆయనను బట్టి, ఆయనకు నీకు ఉన్న సంబంధమును బట్టి, నీ జీవితములో శత్రువుగా ఉన్న పరిస్థితి తొలగిపోవలసినదే! ఈ సత్యము నీవు ఎరిగిన యెడల నీవు నీ దేవుని ఆరాధిస్తావు. ఆయనను ఆరాధించుట అంటే ఆయన నామమును మనస్పూర్తిగా ఒప్పుకోవడమే. అయితే నీవు నిజముగా సత్యమును యెరిగి, స్వీకరించి ఆరాధించినప్పుడు, నీ ముందర శత్రువుగా ఉన్న ప్రతీ పరిస్థితీ తొలగిపోతుంది.

“ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన (దేవుని వలన) కలుగును” అని వాక్యము చెప్పుచున్నది. దేవుని కలిగినవారు దినదినము వర్థిల్లుతారు.

అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును. -కీర్తనలు 1:3

నిత్యము జీవము అందించబడిన చెట్టు, దానికి అందించబడిన నీటిని బట్టి ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తుంది. ఆయనలో నీవు నాటబడినప్పుడు నీవు కూడా ఆయన జీవపు ఊటగా ఉన్నాడు గనుక, నీవు ఫలిస్తావు. నీవు చేసే ఉద్యోగములలో కూడ, మనుష్యులను బట్టి, నీవు వర్థిల్లవు కానీ దేవుడు నీ పక్షమున జరిగించే కార్యము. మనము లేమితో జీవితములను కొనసాగించబడాలి అని దేవుని ఉద్దేశ్యము కాదు. మనము సమృద్ధి కలిగి జీవించాలి అని దేవుని ఉద్దేశ్యము. నీ జీవితమును ఏలువాడు నీ దేవుడే. అంటే, పరిపాలించేవాడు ఆయనే అని అర్థము. ఒక రాజు తన రాజ్యమును పరిపాలిస్తున్నప్పుడు ఏమి చేస్తాడు? అని అర్థముచేసుకుంటే, మంచి రాజు తన ప్రజలు క్షేమముగాను, సమృద్ధిగాను, సమాధానముగా ఉండాలి అనే ఉద్దేశ్యముతో సమకూర్చి, ఆజ్ఞలు జారీ చేసేవాడుగా ఉంటాడు. అలాగే మన జీవితములను ఏలేవాడూ, పరిపాలించేవాడు అయిన దేవుడు కూడా నీవు సంతోషముగాను, సమృద్ధిగానూ, సమాధానముతోను ఉండులాగున ఆజ్ఞలు జారీ చేస్తాడు. అందుకే నీకు సమాధానము లేని పరిస్థి నీకు ఉంటే, ఆ పరిస్థితి చక్కబడుతుంది అని నీవు విశ్వసించగలుగుతావు.

బలమును పరాక్రమమును నీకు దానముగా ఇచ్చేవాడుగా నీ దేవుడు ఉన్నాడు. నీ పరిస్థితులలో నీవు వాటిని జయించడానికి అవసరమైన బలము వాటిపై అధిపతిగా ఉన్న దేవుడు నీకు దయచేసేవాడుగా ఉన్నాడు. ఈ సత్యము నీవు ఎరిగి నీవు నీ దేవుని ఆశ్రయించినపుడు, దావీదు అనుభవించి చెప్పగలిగినట్లు, నీవు స్తోత్రార్హుడవు అని నిజముగా చెప్పగలుగుతావు. నీవు ఈరోజు ఆరాధనలో ఒప్పున్నది రేపు నీ జీవితములో స్థిరపరచబడుతుంది. ఇది ఆత్మీయ మర్మము. దేవుని సంరక్షణలో ఉన్నంతసేపు నిన్ను శత్రువు ఏమీ చెయ్యలేడు. ఎప్పుడైతే నీవు దేవుడు నీకొరకు నియమించిన హద్దును మీరినప్పుడు అపవాది పన్నిన ఉచ్చులలో పడి నష్టపోతాము. అపవాదికి అవకాశము ఇవ్వకుండా ఉండాలి అంటే నీవు దేవునిని కలిగిఉండుట, నీ దేవుడు నీకు ఇచ్చిన జీవము కొరకైన హద్దును మీరక ఆయన సంరక్షణలో ఉండుటయే నీవు చేయవలసినది, చేయగలిగినది.

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. -రోమా 8:30

పశువులకాపరి అయిన దావీదు కనుగొని హెచ్చించినదేవుడు నిన్ను నన్ను కూడ కనుగొన్నాడు. మనము దేవుని సన్నిధిలో ఉన్నాము అంటేనే మనము ముందుగా నిర్ణయించబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము అని అర్థము. అటువంటి అవకాశము, ఆధిక్యత మనకు దయచేసిన దేవునిని మనము ఆరాధిద్దాము.

ఆరాధన గీతము

నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే – నీవే ||నా తండ్రి||

నా రాజువు నీవే – నా అధిపతివి నీవే
నా తండ్రి నీవే – నీవే ||నా తండ్రి||

యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా…. యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా… యేసయ్యా ||నా తండ్రి||


నా అడుగులు తప్పటడుగులై
నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి
పగలు ఎండ దెబ్బయైనను
రాత్రి వెన్నెల దెబ్బయైనను
తగులకుండ కాచే నీ ప్రేమ

యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా… యేసయ్యా
||నా తండ్రి||


గాడాంధకార లోయలో
నే నడచిన ప్రతివేలలో
తోడున్న నా తండ్రివి
వేయిమంది కుడి ఎడమకు
కూలినా కూలును కాని
చెదరకుండ నన్ను కాపడు ప్రేమ


యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా… యేసయ్యా
||నా తండ్రి||

 

ఈ వారము కొరకైన వాక్యము

మనము గాడి తప్పిపోయే పరిష్తితిలో ఉన్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను సంధిస్తాడు. ఆయన సంధించినప్పుడు గద్దింపుకు లోబడినప్పుడు రక్షించబడతాము. మన హృదయములు బహు ఘోరమైనవి, రహస్యపు పాపములను సహితము ఎరిగినవాడు గనుక ఆయనను తప్పించుకుని వెళ్ళలేము. ఆయన యెదుట మనము చేసే ప్రతీదీ, మనము ఆలోచించే ప్రతీదీ తేటగా కనబడుతుంది. మనము భయము కలిగి సరిచేసుకుందాము. మన దేవుడు ప్రేమ కలిగినవాడు మాత్రమే కాదు గానీ, అవిధేయతను బహు రౌద్రముతో శిక్షించేవాడు కూడా దేవుడే. అందుకే భయభక్తులు కలిగి జీవించాలి. సాక్ష్యమును పోగొట్టుకొనుట ఎంతో భయంకరమైనది – దేవుని గద్దింపు ప్రేమపూర్వకమైనది. స్వీకరిద్దాము.

మాటలతో ప్రభువు చెప్పినప్పుడు మనము సరిచేసుకొందాము. ప్రభువు చేతలవరకు వస్తే మనము తట్టుకోలేము. అయినప్పటికీ ఏ విధమునైననూ నిన్ను సరిచేయాలి అనేదే ఆయన ఆశ. మాటలైనా చేతలైనా నిన్ను నిలబెట్టడానికే.

మన జీవితమునకు అవసరమైనది, ముఖ్యమైనది ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాము.

అంతట వారు ప్రయాణమై పోవుచుండగా, ఆయన యొక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్ర్తీ ఆయనను తన యింట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరి యుండెను. ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి, ఆయనయొద్దకు వచ్చి–ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు –మార్తా, మార్తా, నీవనేకమైన పనులనుగూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. -లూకా 10:38-42

ఇక్కడ మార్త, మరియల జీవితము ద్వారా నీకు నాకు కొన్ని విషయాలు బోధిస్తున్నాడు. “ఉత్తమమైనదానిని” ఏర్పరచుకోవలసిన అవసరము ఉన్నది. కొన్ని సందర్భములలో మార్త లాంటి జీవితము, కొన్ని సందర్భములలో మరియ లాంటి జీవితము కలిగి ఉంటాము. అయితే, మనము దేవుని సన్ణిధిలో ఆయన మాటలు వినుట అనేది”ఉత్తమమైనది”.

దేవుని కృపను బట్టి, మన సంఘములలో భోజనము సిద్ధపరచే సహోదరీలు, సహోదరులు దాని విషయమై దేవుని వాక్యమును పోగొట్టుకొనేవారుగా లేరు. ఈ విధానము మన వ్యక్తిగతమైన జీవితములలో కూడా అవసరమైనది.

మార్తతోనే మరియ ఉన్నది అయితే మరియ యేసయ్య పాదముల వద్ద బోధ వింటుంది. మార్త మాత్రము పనిపెట్టుకుంది గనుక తాను ఒంటరిగా ఉంది అని చింతపడుతుంది. దేవుని మనము వదిలి పెట్టినప్పుడు వారి, వీరి సహాయముకొరకు ఎదురుచూసేవారుగా, ప్రాకులాడేవారిగా ఉంటాము. అయితే దేవుని సన్నిధిలో ఆయన బోధను వినుటద్వారా మన ప్రతీ పరిస్థితిలోనూ జీవము కలిగి ఉంటాము.

సీమోను పేతురు– ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;౹ -యోహాను 6:68

మరియ యేసయ్య పాదముల చెంత, “నిత్య జీవపు” మాటలు వింటుంది. ఆ మాటలలో దేవుని మహత్తు ఉంటుంది. ఆయన ఒక మాట పలుకగా ఆ మాట ప్రకారము ఆయెను అని వాక్యము చెప్పుచున్నది. నీవు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు వెల్లడి పరచే మాటలు, నీ ప్రస్తుత జీవితము కొరకైనవో, నీ భవిష్యత్తును సంబంధించినవో, నిన్ను సరిచేయుటకు అవసరమైతే గతమునకు సంబంధించినవో “నిత్య జీవపు మహత్తు గల” మాటలు విడుదల అవుతాయి.

పేతురుకు అర్థమైంది, “నిత్య జీవపు” మాటలు యేసయ్య దగ్గరే అని. నీకు అర్థమవుతుందా? అలా అయితే దేవుని సన్నిధిలో ఉండే అవకాశమును పోగొట్టుకొనవు. కేవలము పాస్టరుగారికే దేవుని మాటలు అందించబడవు. నీవు దేవుని సన్నిధిలో నీవు కనిపెడితే, నీవు ఆయన బోధను గ్రహిస్తే, నీకు కూడా దేవుని మాటలు అందించబడతాయి. మన జీవితమునకు ముఖ్యమైనది ఆయన సన్నిధి, ఆ సన్నిధిలో అందించబడే జీవపు మాటలు.

నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును -కీర్తనలు 119:130

దేవుడు బోధిస్తున్నప్పుడు నీవు ఆ మాటలు విని స్వీకరించినప్పుడు, వెంటనే నీ చీకటిగా ఉన్న నీ పరిస్థితి ఆయన వెలుగుచే నింపబడుతుంది. “బుద్ధి జ్ఞాన సర్వసంపదలూ” ఆయనయందే ఉన్నవి. నీవు నేను సత్యమును గ్రహించునట్లు, సత్యమునే ప్రకటించువాడు. నీవు ఏ విషయములలో నీవు సహాయము కొరకు ఎదురుచూస్తున్నావో, ఆ మాటలే నీకు బోధిస్తాడు. ఆ మాటలు నీవు స్వీకరించినప్పుడు నీకు జ్ఞానము కలుగుతుంది. ఆ పరిస్థితిలో నీవు ఎలా చేయాలో, ఎలా చక్కబడాలో తెలియచేయబడుతుంది. అప్పుడు మనము నూతనపరచబడిన బలముచేత మన ప్రతీ పరిస్థితిలో జీవమును స్వతంత్రించుకుంటాము.

నీ వాక్యము నన్ను బ్రదికించియున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. -కీర్తనలు 119:50

దేవుడు బోధ చేసే సమయములో మనము ఆయన సన్నిధిని పోగొట్టుకోకూడదు. ఆ సమయములో విడుదల అయ్యే మాట, నిన్ను బ్రదికించేది, నీకు నెమ్మది కలిగించేది. నీ జీవితములో మరేదీ దీనికంటే ముఖ్యమైనది కాదు.

నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను. -కీర్తనలు 119:102

మనము తొలగిపోకుండా దేవుని బోధ మనకు సహాయకరముగా ఉంటుంది. “నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను” అంటే ఏమిటి? పాపము చేయకుండా వాక్యము సహాయకరము గా ఉంది అని మనము సాధారణముగా చూస్తాము. ఆయన బోధించినదానిని బట్టి మన జీవితమునకు అవసరమైనది తెలియచేయబడుతుంది. ఒకవేళ నీ జీవితమును ఆశీర్వదించెదను అని ప్రభువు చెప్పాడు అనుకోండి, ఆయన పలికిన మాట నెరవేర్చబడకుండా ఆయన యొద్దకు వెళ్ళదు. నీ ఆశీర్వాదమును పొందుకోకుండా తొలగిపోవు.

నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి నా నోటిమాటలకు చెవియొగ్గుడి -కీర్తనలు 78:1

దేవుడు తన పులిపిట్ మీదనుండి విడుదల అయ్యే ప్రతి మాటకు మనము చెవి యొగ్గాలి అంటే, ఆ మాటను పట్టుకునే ముందుకు వెళ్ళాలి.

అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును. -సామెతలు 8:34-35

నీవు ఈరోజు సిద్ధపడతావా! ఆయన విడుదల చేసే మాటలు కనుగొనువాడు జీవమును కనుగొనును. ఆయన సన్నిధిలో లేకుండా ఎలా ఆయన మాటలు మనము వినగలము? చింతతో ఉండుటకొరకైన జీవితములు కాదు గానీ, జీవము కలిగి, ధన్యకరమైన స్థితిలో ఉండవలసిన జీవితములు. దేవుని సన్నిధిలో కాచుకొనే ఆశ కలిగిన వారిగా మనము మనలను మార్చుకొందాము. ఇశ్రాయేలు ప్రజలు ఒక జాము అంతా వారి పాపములను ఒప్పుకొన్నారు, ఆయనను ఆరాధించారు. మనము ఎంతసేపు ఆయన సన్నిధిలో ప్రార్థనలో కనిపెడుతున్నాము? దేవా నీ మాట రాకపోతే నేను బ్రతకలేను అనే ధోరణిలోకి మనము మారాలి. అప్పుడు మనము అనేకమందికి ఆశీర్వాదకరముగా మార్చబడతాము. దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది అని నీవు గ్రహిస్తేనే గానీ, దానిని కనుగోవడానికి నిన్ను నీవు సిద్ధపరచుకోలేవు. అటువంటి మంచి తీర్మానము ఈరోజు తీసుకుంటావా?

అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.౹ -అపొస్తలుల కార్యములు 1:8

యెరూషలేములోను అనగా మీరు ఆరాధించే స్థలము. యూదయ దేశము అంటే చుట్టుపక్కల ప్రదేశములలో, భూదిగంతములు అనగా మీ ప్రయాణము ఎక్కడికైతే కొనసాగించబడుతుందో, అంతమేరా దేవునికి సాక్షులుగా ఉంటారు. మీ ప్రతీ పరిస్థితిలో దేవుడు మిమ్మును విడుదలచేసి మిమ్మును ఆయన మహిమకు సాక్షులుగా ఆయన చేస్తాడు. కాబట్టి మంచి తీర్మానము తీసుకుందామా? దేవుని సన్నిధిలో లేకుండా నా దినాన్ని నేను ముగించను అని తీర్మానము తీసుకుంటావా?