14-07-23 సూపర్ నేచురల్ సర్వీస్

స్తోత్రగీతము -1

రాజుల రాజా రానైయున్నవాడా (2)
నీకే ఆరాధన
నా యేసయ్యా.. నీకే ఆరాధన (2)

కష్టాలలో జయమిచ్చ్చును – శోధనలో జయమిచ్చును
సాతానును ఓడించును – విజయము చేకూర్చును (2)
నా మార్గము యేసయ్యా – నా జీవము యేసయ్యా
నా సత్యము యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా (2)
||రాజుల||

రోగాలను స్వస్థపరచును – శాపాలనుండి విడిపించును
మరణమునుండి లేవనెత్తును – పరలోకము మనకిచ్ఛును (2)
ప్రతి మోకాలు వంగును – ప్రతి నాలుక పాడును
ప్రతి నేత్రము చూచును – నిన్నే రారాజుగా (2)
||రాజుల||

స్తోత్రగీతము – 2

నే యేసుని వెంబడింతునని
నేడేగా నిశ్చయించితిని
నే వెనుదిరుగన్ వెనుకాడన్
నేడేసుడు పిల్చిన సుదినం ||నే యేసుని||

నా ముందు శిలువ నా వెనుక లోకాశల్
నాదే దారి నా మనస్సులో
ప్రభు నా చుట్టు విరోధుల్
నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్
నాకిలలో గానిపించరని ||నే యేసుని||

కరువులైనను కలతలైనను
కలసిరాని కలిమి లేములు
కలవరంబులు కలిగిననూ
కదలనింకా కష్టములైనా
వదలను నాదు నిశ్చయము ||నే యేసుని||

శ్రమయైననూ బాధలైననూ
హింసయైన వస్త్రహీనత
ఉపద్రవములు ఖడ్గములైన
నా యేసుని ప్రేమనుండి
నను యెడబాపెటి వారెవరు ||నే యేసుని||

స్తోత్రగీతము – 3

నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
నీ మాట సత్యముగలదయ్యా
నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా
నీ మాట మరిచిపోనిదయ్యా
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా
{నీ మాట}

1. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట
బంధించబడిన వారిని విడిపించును నీ మాట
త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట
కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా
{నీ మాట}

2. సింహాల బోనులో నుండి విడిపించును నీమాట
అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట
మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట
ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా
{నీ మాట}

ఆరాధన వర్తమానము

గడచిన శుక్రవారము అనగా 7-జూలై-2023 తేదీన, మందిరము యొక్క స్థలము రిజిస్ట్రేషన్ అయింది. దీనిని బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక!

వారు అందులో నివాసముచేసి, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను, మామీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ యెదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొఱ్ఱపెట్టినయెడల నీవు ఆలకించి మమ్మును రక్షిం చుదువని అనుకొని, యిచ్చట నీ నామఘనతకొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా.౹ -2 దినవృత్తాంతములు 20:8-9

మందిరములో దేవుని సన్నిధి, ఆయన వాక్కు వుంటాయి. “నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకొని” వారు దేవుని మందిరమునకు వస్తున్నారు అని పైన వాక్యములో చెప్తున్నారు. మనము కూడా, ఒక ఆశతో, నా ప్రభువు నాతో మాట్లాడతాడు అనే నమ్మకముతో ప్రభువు సన్నిధికి మనము రావాలి. “కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను” ఏది నీ జీవితములలో కలిగి ఉన్నప్పటికీ, నీవు వచ్చినది నీ మొర ఆలకించే దేవుడి సన్నిధికి వచ్చారు.

నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచు నప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును.౹ -ద్వితీయోపదేశకాండము 20:1

నీవు నా దేవుడు నన్ను రక్షించగల సమర్థుడు అని నీవు నమ్మి నిలబడితే, “నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును”. నీవున్న కరువులోనో, అనారోగ్యములోనో, తెగులులోనో, నీ సంతోషమునకు అడ్డుగా నిలిచే ప్రతీదాని మీద నీకు జయమును ఇచ్చేవాడు నీ దేవుడే. అవి ఎంత భయంకరముగా కనబడినప్పటికీ, ఈరోజు సూపర్ నేచురల్ సర్వీస్ ద్వారా చెప్తున్న మాట, “నీ స్థితిని చూసి నీవు భయపడకు, నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును.”.

నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే మాట సత్యము. అయితే నీకు తోడుగా ఉన్న దేవుడు ఎటువంటివాడు? అనే సత్యము నీవు గ్రహించాలి. “ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన” దేవుడు నిన్ను తన కొరకు ప్రత్యేకపరచుకున్నాడు. మునుపు మనము అపవాదికి సంబంధించినవారము అయితే ఇప్పుడు మనము దేవునికి సంబంధించినవారము. ఐగుప్తు అంటే ఆశనించడానికి సహితము అవకాశములేని స్థితి. అటువంటి పరిస్థితి నుండి నిన్ను రప్పించాడు. అంటే దేవుని ఉద్దేశ్యము ఏమై ఉంటుంది? ఐగుప్తు నీవు వెళ్ళిన పరిస్థితిలగుండా, వెళ్ళిన విధానములో అక్కడనుండి విడుదల పొందిన తరువాత మరలా అదే విధానములో మన జీవితము ఉండకూడదు.

అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించునప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఈలాగు చెప్పవలెను –ఇశ్రాయేలీయులారా, వినుడి; నేడు మీరు మీశత్రువులతో యుద్ధము చేయుటకు సమీ పించుచున్నారు. మీ హృదయములు జంకనియ్యకుడి, భయపడకుడి,౹ వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే.౹ -ద్వితీయోపదేశకాండము 20:2-4

మన ముందుకు పోరాటము వస్తుంది అంటేనే, అది ముగించబడటానికి, ఆ శత్రువు ఓడించబడటానికే నీ ముందరకు వస్తున్నాడు. అందుకే వాటిని చూసి, భయపడకండి. ఉదాహరణకు బయట సాఫ్ట్ వేర్ ఉద్యోగాలలో చాలా ఇబ్బందిగా ఉంది, అయినప్పటికీ నీవు భయపడకు. నీవు చేస్తున్న పోరాటములో, తీవ్రత పెరుగుతున్నప్పటిఈ నీవు భయపడకు. నీ పక్షముగా నీ శత్రువుతో పోరాడేది నీ దేవుడే.

ఐగుప్తు యొక్క రాజు అయిన ఫరో చాలా బలమైనవాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ రాజు బలము బట్టి ఏమాత్రము ఆశ, నిరీక్షణ లేని స్థితిలో ఉన్న ప్రజల జీవితాలను విడిపించి, ఆ ఐగుప్తులోనుండి నీ దేవుడు విడుదల చేసిన తరుత మరలా ఐగుప్తు వైపు వెళ్ళకూడదు. నీ ఐగుప్తు దినాలు ముగించబడ్డాయి.

అపవాది ప్రభావము బట్టియో, అనారోగ్యము చేతనో నీ జీవితములో ఆశీర్వాదము కనబడకపోతే, ఈరోజు ప్రభువు చెప్పుచున్న మాట – “ఐగుప్తు దినములు ముగించబడ్డాయి.

చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను– శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.౹ -యిర్మీయా 31:3

నీవు ఎదుర్కొంటున్న కరువులోనో, తెగులులోనో, పోరాటములోనో ఒంటరిగా ఉన్నట్టయితే, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ఐగుప్తు జీవితమును ముగిస్తున్నాడు. ఐగుప్తులో తల్లిదండ్రులు అనుభవించిన శ్రమ, పిల్లలు కూడా అనుభవించారు. ఐగుప్తు శ్రమ ముగించబడింది అంటే, నీ జీవితములోనే కాదు గానీ, నీ పిల్లల జీవితములలో కూడా!

ఇశ్రాయేలు కన్యకా, నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు.౹ -యిర్మీయా 31:4

ఇంతకు ముందు నీవు ఎంతవరకు ప్రయత్నించినా సరే నీవు పడిపోయినవాడిగా ఉన్నావు. అయితే నీవు కట్టబడునట్లు, నిన్ను కట్టిస్తాను అని ప్రభువు చెప్తున్నాడు. ఈరోజు వరకు ఏమైనా కానీ, ఈ దినము మొదలుకొని నీ జీవితము రీస్టోర్ అవులాగున ప్రభువు నీ జీవితమును కడతాడు. ఇప్పటి నుండి దేవుని మేలును చూసేవారిగా ఉంటారు.

దర్శనము – “ఖాళీగా ఉన్న కుండలో పోయబడుతుంది – ఖాళీగా ఉన్న నీ స్థితిలో ప్రభువు తన కార్యములతో నింపుతున్నాడు”.ఉద్యోగమైనా, గర్భమైనా, ఇల్లైనా ఎక్కడైతే ఖాళీగా ఉన్నావో అక్కడ నిన్ను కడతాను అని నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమించే నీ దేవుడు చెప్తున్నాడు.

నీవు అవమానము పొందవు, నీ తలదించవుగానీ, తల ఎత్తుకుని దేవుని మహిమపరతువు. “నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు” అనగా నీవు తిరిగి సంతోషించువానిగా, సంతోషించుదానివిగా మార్చబడెదవు.

నీవు షోమ్రోను కొండలమీద ద్రాక్షావల్లులను మరల నాటెదవు, నాటు వారు వాటి ఫలములను అనుభవించెదరు.౹ -యిర్మీయా 31:5

అనగా ఇంతకు ముందు నీవు ప్రయత్నించావు అయితే ఫలము లేదు. అయితే “ఈసారి” ఫలము అనుభవిస్తావు. ఎందుకంటే నీవు ఐగుప్తును దాటావు. నీవు నాటిన దాని ప్రతి ఫలము అనుభవిస్తావు.

ఎఫ్రాయిము పర్వతములమీద కావలివారు కేకవేసి–సీయోనునకు మన దేవుడైన యెహోవాయొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను.౹ -యిర్మీయా 31:6

“దినము నిర్ణయమాయెను” దేనికి అంటే, సాక్ష్యము ఇచ్చునట్టుగా, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు దినము నిర్ణయము అయినది. అంటే, నీవున్న కరువు, తెగులు, పోరాటము ముగించబడే దినము నిర్ణయము అయింది అనే కదా అర్థము. నీ దేవుడే నిన్ను కట్టిస్తాను అని చెప్తున్నాడు.

వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువలయొద్ద వారిని నడిపింతును. -యిర్మీయా 31:9

ఐగుప్తునుండి విడిపించబడిన తరువాత నీ దినములు, “చక్కగా కొనసాగించబడే” దినములు.

అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును. -కీర్తనలు 1:3

దేవుడు నిన్ను నడిపించుటకు ప్రభువు చేయుచున్న కార్యము గూర్చి చెప్పుచున్నాడు. “ఆకువాడక” అంటే ఇప్పుడు నీవు అనుభవిస్తున్న లేమి, కీడు ఇంక ఉండవు అని అర్థము. “నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును”, అంటే ఏమిటి?

దేని కాలమున అది చక్కగా ఉండునట్లు నడిపించేవాడుగా మన దేవుడు ఉన్నాడు. “తన కాలమందు ఫలమిచ్చు” అంటే, నీ జీవితానికి దేవుడు ఏమి సిద్ధపరచి ఉంచాడో, ఆ దేవుని చిత్తము నీ జీవితములో జరిగుతుంది అని అర్థము.

ఆరాధన గీతము

మా మధ్యలో సంచరించువాడా
ఆరాధన నీకెనయ్యా
మా మధ్యలో అద్భుతాలు చేయువాడా
ఆరాధన నీకెనయ్యా
మార్గము తెరిచే అద్భుతకరుడా
మాట తప్పని తేజోమయుడా
నీవే నీవే యేసయ్య -2

మాలో నీవు హృదయాలు మార్చుము
యేసయ్య యేసయ్య
మా మనసులను స్వస్థపరచుము
యేసయ్య యేసయ్య నీవే //మార్గము తెరిచే

చీకటి లోయలో సంచరించిన
నిరీక్షణ కొలిపోయిన
గొప్ప కార్యము జరిగించెదవు
నాలో నెరవేర్చదవు -2 //మార్గము తెరిచే

బంధింపబడిన జీవితాలు, మధ్యలోనే ఆగిపోయిన జీవితములు, ఇప్పుడు మార్చబడుతున్నాయి.

మీ మధ్యలో నీ దేవుడు ఉన్నాడు అంటే, నీవున్న కరువులోనో, తెగులులోనో, పోరాటములోనో నీతోనే ఉన్నాడు. నీ ఐగుప్తు దినములు ముగించబడ్డాయి.

క్రమముగాలేని కుటుంబపరిస్థితులు అన్నింటిని సెటిల్ చేస్తాను అని ప్రభువు చెప్తున్నాడు.

నీకున్నాను నీతో ఉన్నాను అని ప్రభువు నీతో చెప్తున్నాడు. మాట తప్పని దేవుడు నీ దేవుడు.

మన జీవితములు మార్చడానికి ఆయన వెల్లడి చేసిన మాటలు ఆయన సన్నిధిలో ఉన్న ప్రతివారి జీవితములో నెరవేరుతాయి.

గర్భఫలము కొరకు ఎదురుచూసేవారి కొరకు ప్రభువు మాట- ఒక్కదినము అయింది నీవు ఆశీర్వదించబడిన దానవు

కలహములు, డిస్టర్బెన్సెస్ అన్నిటినుండి ప్రభువు విడుదల చేస్తున్నాడు.

దేవుని కార్యము కళ్ళారా చూడబోతునావు. నీ పక్షమున వ్యాజ్యమాడేవాడు నీ దేవుడు.

నీ దినములు ప్రభువు ఏర్పాటు చేసిన దినములు

దేవుడు నీ పక్షమున ఒక నూతన కార్యము జరిగించబోతున్నాడు.

 

 

ప్రాఫెటిక్ సర్వీస్

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును -యిర్మీయా 6:16

పురాతన మార్గములగూర్చి విచారించి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొండి. అప్పుడు నెమ్మది కలుగుతుంది అని చెప్పుచున్నాడు. అనగా గతములో ఏమి జరిగింది అనే విషయము గూర్చి ఆలోచించాలి. ఇప్పుడు ఉన్న స్థితిలో నెమ్మది లేదు. ఇంతకు ముందు నీవు నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు ఏమి జరిగి నీకు నెమ్మది కలిగింది అని విచారించు అని ప్రభువు చెప్తున్నాడు.

ఇది యయిన తరువాత మోయాబీయులును అమ్మోనీయులును మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతుమీదికి వచ్చిరి.౹ అంతలో కొందరు వచ్చి–సముద్రము ఆవలనుండు సిరియనులతట్టునుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చుచున్నది; చిత్తగించుము, వారు హససోన్‌తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి.౹ -2 దినవృత్తాంతములు 20:1-2

యెహోషాపాతు మంచిగా ఉన్న సందర్భములో తాను ఎదుర్కొంటున్న పరిస్థితి. అప్పుడు తాను ఏమి చేస్తున్నాడో చూడండి –

అందుకు యెహోషాపాతు భయపడి యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, యూదాయంతట ఉపవాసదినము ఆచరింపవలెనని చాటింపగా -2 దినవృత్తాంతములు 20:3

మన జీవితాల్లో నెమ్మది లేని పరిస్థితుల గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. అపవాది ఎప్పుడు మింగుదుమా అని అనేకమైన పరిస్థితులతో తన ఉచ్చులు బిగుస్తుంది. మనము ఆ పరిస్థితులలో మనము వెళుతున్నప్పుడు నెమ్మది లేని స్థితిలో ఉంటాము. అప్పుడు మనము ఏమి చేయాలి? అనేది నేర్చుకుందాము.

“యెహోషాపాతు భయపడి యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని”. తన నెమ్మది లేని పరిస్థితిలో యెహోషాపాతు యెహోవాయే నా ప్రాణాధారము అని ఆయన సన్నిధిలో కనిపెట్టినవాడుగా ఉన్నాడు.

నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి. -ద్వితీయోపదేశకాండము 30:20

నెమ్మది లేని పరిస్థితులు ఎదుర్కుంటున్న పరిస్థితులలో ప్రభువే మనకు ఆధారము అయి ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో మనము నిలిచి వేడుకోవాలి. దేవునిని కలిగిన జీవితాల పక్షముగా కార్యము జరిగించువాడు ఆయనే!

యూదావారు యెహోవావలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవాయొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలోనుండి జనులు వచ్చిరి.౹ -2 దినవృత్తాంతములు 20:4

“యెహోవావలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి” మన జీవితములలో కూడా మేలు కలిగించే మార్గము దేవుని సహాయము మాత్రమే. అందుకే ప్రభువు చెప్తున్నాడు “పురాతన మార్గములు విచారించండి” అని చెప్తున్నాడు.

–మీరు దిగులుపడకుడి, ధైర్యము విడువకుడి; అష్షూరు రాజుకైనను అతనితోకూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు.౹ -2 దినవృత్తాంతములు 32:7

ఇక్కడ కూడ, దేవుని సహాయము చేత వారు ఎదుర్కొంటున్న యుద్ధమును జయించగలుగుతున్నారు.

అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను.౹ -1 సమూయేలు 17:47

ఈ వచనాలన్నింటిలో యుద్ధము చేసేది ప్రజలు కాదు గానీ, దేవుడే. దేవుని సహాయము చేతనే వారు యుద్ధాలను ముగించగలిగారు. అందుకే, నీకు మేలు కలుగు మార్గము ఏది అని నీవు గ్రహించాలి.

ఐగుప్తుదేశములోనుండి, ఆ యినుప కొలిమిలోనుండి నేను మీపితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని–నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీపితరులకిచ్చెదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు, మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటినిబట్టి యీ నిబంధన వాక్యముల ననుసరించినయెడల మీరు నాకు జనులైయుందురు నేను మీకు దేవుడనైయుందును.౹ -యిర్మీయా 11:4

పురాతనమైన మార్గములను విచారించి తెలుసుకొనుడి. కాపరి ముందు నడుస్తాడు, వెనుక గొర్రెలు వెంబడించేవిగా ఉంటాయి. కాపరి వెళుతున్న అదే మార్గమును గొర్రెలు వెంబడిస్తాయి. ఒకవేళ ఏమైన అడ్డుగావచ్చినప్పుడు ఆ గొర్రెలకు అర్థమయ్యే విధానములో కొన్ని సంఃజ్ఞలు ఇస్తాడు. అగి గ్రహించినప్పుడు ఆ గొర్రెలు ఆ అడ్డును తప్పించుకోగలుగుతాయి. అదేవిధముగా మనము కూడా మేలు కరమైన మార్గము ఏది అని గ్రహించునట్లు దేవుడు తన వాక్యముతోనే మాట్లాడతాడు. దేవుడు మనకు ఇచ్చిన నిబంధన వాక్యములని మనం గైకొన్నప్పుడు ఏమి జరుగుతుంది? ముందు దేవుడు చేసిన “ప్రమాణము” ఇప్పుడు నెరవేర్చబడుతుంది.

నీకు గతములో చేయబడిన వాగ్దానము నెరవేరాలి అంటే, ఆ నిబంధన వాక్యమును పట్టుకొని నీవు నడచుకోవాలి. మన పాదములకు వెలుగు వాక్యమే. దేవుని వాక్యము ప్రకారము నడుచుకొనుటయే నీకు మేలు కలుగచేయు మార్గము. నెమ్మది లేని పరిస్థితిలో నీవు చేయవలసినది, ఎక్కడైతే దేవుని మాటలు కనబరచబడట్లేదో అక్కడ సరిచేసుకుని సిద్ధపరచుకోవటమే!

రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక యున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.౹ నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పినయెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను.౹ -యిర్మీయా 31:17-18

మొట్టమొదట దేవుని వాక్కు విడుదల అయింది. అప్పుడు ఎఫ్రాయీము నా మనస్సును తిప్పిన యెడల నేను తిరుగుదును, నా పరిస్థితిలో నన్ను గమనించు అని గోజాడినప్పుడు దేవుడు వింటున్నాడు. వినడమేకాక, జవాబు కూడా చెప్పుచున్నాడు.

–నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలిసికొని తొడ చరుచుకొంటిని, నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని.౹ ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దు బిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు. -యిర్మీయా 31:19-20

నిన్ను నీవు సిద్ధపరచుకున్నప్పుడు దేవుని మనస్సు, “తప్పక నేనతని కరుణింతును” అనే చెప్తుంది. దేవుని దగ్గరగా ఉన్నప్పుడు నిన్ను రక్షించేవాడిగా ఆయన ఉంటాడు. అదే నీకు దేవునికి నీ పాపము అడ్డుగా ఉన్నప్పుడు దేవుడు రక్షించనేరక యుండునట్లు, నీ పాపము అడ్డుగా వస్తుంది. అయితే ఎప్పుడైతే, నీవు తిరిగి దేవుని యొద్దకు నిన్ను సరిచేసుకొని వచ్చినప్పుడు, ఆయన తప్పక నిన్ను కరుణించేవాడిగా ఉన్నాడు.

సమస్త జనములమధ్యను వాటిని జ్ఞాపకము చేసికొని, నీ దేవుడైన యెహోవావైపు తిరిగి, నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్తమునుబట్టి నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతివారును వినినయెడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును.౹ -ద్వితీయోపదేశకాండము 30:2-3

దేవుని కరుణ నీకు అనుగ్రహించబడినప్పుడు జరిగేది ఏమిటి అంటే, చెల్లాచెదురు అయిన జీవితములలో సమకూర్చబడటము మీరు చూడగలుగుతారు, అనుభవిస్తారు. అందుకే దేవుని వాక్యము ద్వారా ప్రభువు నిన్ను తట్టినప్పుడు, దేవుని యొద్దకు తిరిగి రావాలి. అప్పుడు ప్రభువు నిన్ను కరుణించి, నిన్ను సమకూరుస్తాడు. నీవు భూమి అట్టడుగుభాగమునకు దిగజారి చెల్లాచెదురు అయిపోయినాసరే అక్కడనుండి సహితము సమకూరుస్తాను అని నీ దేవుడు చెప్పుచున్నాడు. అయితే నీవు తిరిగి ప్రభువు వద్దకు వచ్చిన యెడల ఇది తప్పక కరుణిస్తాడు.

నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచు కొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును.౹ -ద్వితీయోపదేశకాండము 30:5

సమకూర్చబడటమే కాదు కానీ, విస్తరించబడతావు. ఇంతకు ముందు నీ సమయానికి తగినట్లు నీవు కొన్ని కోరుకున్నావు, అయితే ఇప్పుడు అంతకు మించి నీకు దయచేసి ఆశీర్వదించేవాడుగా నీ ప్రభువు ఉన్నాడు. గతములో ఉన్నదానికంటే ఇప్పుడు విస్తరింపచేయబడతావు.నీవు విస్తరించబడుటకొరకు అవసరమైన స్థానము నీకు కలుగులాగున నిన్ను కట్టింతును అని ప్రభువు చెప్పుచున్నాడు.

మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవావైపు మళ్లునప్పుడు యెహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలుచేయుటకు నీయందును ఆనందించి నీవైపు మళ్లును. -ద్వితీయోపదేశకాండము 30:9

నిన్ను నీవు సిద్ధపరచుకున్నప్పుడు, మేలు కలుగచేయు మార్గములో నీవు నిలిచినప్పుడు, అనగా దేవుడి నీకు ఇచ్చిన మాటల ప్రకారము నీ జీవితమును సిద్ధపరచుకుని నీవు వెళుతున్న కొలదీ నీ జీవితములో మార్చబడవలసినవి ఖచ్చితముగా మార్చబడతాయి.