07-05-2023 – ఆదివారం మొదటి ఆరాధన – అసాధ్యమైనది జరగడానికి

స్తోత్రగీతము – 1

ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను నాట్యమాడెదన్ – 2
నాట్యమాడెదన్ నేను నాట్యమాడెదన్ నేను
దావీదువలె నేను నాట్యమాడెదన్

ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను పాటపాడెదన్ – 2
పాటపాడెదన్ నేను పాటపాడెదన్ నేను
దావీదువలె నేను పాటపాడెదన్

ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను స్తుతించెదను
స్తుతించెదన్ నేను స్తుతించెదన్ నేను
దావీదువలె నేను స్తుతించెదను

స్తోత్రగీతము – 2

జయం జయం జయం జయం
యేసులో నాకు జయం జయం (2)

విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా
ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా
నీ వాక్యమే నా హృదయములో
నా నోటిలో నుండినా

గొప్ప కొండలు కదిలిపోవును
సరిహద్దులు తొలగిపోవును
అసాధ్యమైనది సాధించెదా
విశ్వాసముతో నేను

స్తోత్రగీతము – 3

యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2)
యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2)
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్ (2) ||యేసే||

మహా శ్రమలలో వ్యాధి బాధలలో
సహనము చూపి స్థిరముగ నిలచిన
యోబు వలె నే జీవించెదను (2)
అద్వితీయుడు ఆదిసంభూతుడు
దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||

ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాటిన
దానియేలు వలె జీవింతును (2)
మహోన్నతుడు మన రక్షకుడు
ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||

జీవితమంతా ప్రభుతో నడచి
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
హనోకు వలె నే జీవించెదను (2)
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||

ఆరాధన వర్తమానము

దేవుని సన్ణిధిలో ఉండుట మహాభాగ్యముతో కూడినది. దేవుని సన్నిధిలోని మహాభాగ్యాన్ని ఈలోకములో ఉన్న దేనితో కూడా పోల్చలేమో. అందుకే వెండి బంగారములకన్నా మిన్న అయినది దేవుని సన్నిధి అని కొనియాడబడుతున్నది. ఆయన సన్నిధిలో కూడిన మన అందరమూ, ధన్యులము. ఈలోకములో ఏమి ఉన్నా లేకపోయినా ధన్యకరమైన వారము. ఈ ధన్యత మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఇవ్వబడింది.

అన్నీ కలిగి ఉన్న జీవితము ధన్యము అని లోకము చెప్తుంది. ఏమున్నా లేకపోయినా ప్రభువు ఉన్నాడు.

ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.౹ ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.౹ ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.౹ -కొలొస్సయులకు 1:15-17

లోకములో అన్ని ఉంటేనే ధన్యత అని భావిస్తారు. మనమైతే అన్ని కలిగినవాడినే మనము ప్రభువుగా కలిగి ఉన్నాము. అయితే అపవాది లోకములోని విషయాలు చూపించి మోసగిస్తాడు. ఆదామును కూడా అలాగే మోసపుచ్చింది. మనము ఈ సత్యము ఎరిగి ఉండాలి.

ఆయన ద్వారా మనకు ఈ జీవితము ఇవ్వబడింది గనుక ఈ జీవితము ఆయనది. అందుకే మీరు మీ సొత్తు కాదు గానీ నా సొత్తు అయి ఉన్నారు అని వాక్యము ద్వారా దేవుడు చెప్తున్నాడు. మన దగ్గర ఒక విలువైన వస్తువు ఉందనుకోండి, ఒక వేళ అది ఎమైనా పాడైతే, ఆ వస్తువు మరలా సరిచేసేవారకు మనకు మనశ్శాంతి ఉండదు. అలాగే మనము దేవునికి విలువైనవారముగా ఉన్నాము. మన జీవితము పాడుగా ఉన్నప్పుడు తిరిగి ఆ జీవితాన్ని బాగుచేసేవరకు, సరిచేసేవరకు దానిని విలువపెట్టి కొన్న ప్రభువు బాధ్యత వహిస్తారు.

మన ప్రభువు ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. సమస్తము ఆయనను బట్టి, ఆయన ద్వారా సమస్తము జరిగించబడతాయి. మన జీవితములు నిజానికి విలువైనవి, ఆ జీవితము పాడైపోతే దేవునికి మహిమ రాదు. ఆ జీవితము సరిచేయబడితేనే తిరిగి మీ జీవితములో ఆయన మహిమపరచబడతారు. “సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను” అంటే, మన జీవితమును సరిచేసేవాడు, ఆ సరిచేసే దానిని సిద్ధపరచేవాడు చేసేవాడు ఆయనే.

గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును. -కీర్తనలు 23:4

మనలను విలువపెట్టి కొన్నవాడు అయిన ప్రభువు మన జీవితములపై బాధ్యత తీసుకొనేవాడు గనుక గాఢాంధకారములో అయినా సరే ఆయన తోడున్నాడు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. అందుకే “యెహోవా నా కాపరి” అని చెప్పగలుగుతున్నాడు. ఆయన కాపరి గనుక మన జీవితములను నడిపించడానికి, విడిపించడానికి ఆయన సమస్తము జరిగించేవాడు, సిద్ధపరచేవాడు అయి ఉన్నాడు, గనుక మన జీవితములు శ్రేష్టకరమైనవి. అవసరమైతే మనకొరకు నూతనమైనవి దేవుడు సృష్టించి సిద్ధపచేవాడు అయి ఉన్నాడు.

ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా? -మత్తయి 6:26

అవి “విత్తవు, కోయవు, కూర్చుకొనవు” అనగా వాటికి ఏమీ లేదు అని. అయినప్పటికీ, “మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు”. ఈ పక్షులను గమనిస్తే, అవి అనేకరకములైన ఆహారము తింటాయి. వాటికి ఆ అనేకరకములైన ఆహారము సిద్ధపరచేది దేవుడే. అలాగే మనకు కూడా అవసరమైన సమస్తము దయచేసేది, సిద్ధపరచేది ఆయనే.

ఆదాముకి దేవుడిచ్చిన జీవితమును చూస్తే, భూమిమీద సమస్తమును ఏలుబడిచేసే జీవితము. అయితే అటువంటి జీవితమును దొంగిలించడానికి సాతాను ప్రయత్నించాడు. మన జీవితములను సహితము అబద్ధములద్వారా మోసపుచ్చి మనకు ఇవ్వబడిన శ్రేష్టకరమైన జీవితము దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే, నీది శ్రేష్టకరమైన జీవితము అని, నీ జీవితము నీ ప్రభువు విలువ పెట్టి కొన్నాడు అనే సత్యము నీవు ఎరిగినప్పుడు హబక్కూకు పలికినట్టు నీవు కూడా పలికెదవు.

అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును. -హబక్కూకు 3:17-19
గనుక సంతోషముతో, “దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి. -కీర్తనలు 47:6”.

ఆరాధన గీతము

నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేను వుంటా నేసయ్యా
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా

ఎన్ని బాధలున్నను యిబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన నిష్టూరమైనను

బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను
అలలు ముంచి వేసినా ఆశలు అణగారిన

ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా

నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు నాకిల సమానము

 

మెయిన్ మెసేజ్

ఈరోజు “అసాధ్యమైనది జరగటానికి” అనే విషయము గూర్చి ధ్యానిద్దాము. ఏమి చేస్తే అసాధ్యమైనది జరుగుతుంది? ఈ విషయము గూర్చి బైబిల్ గ్రంథము లో ఏమి వ్రాయబడింది? అనే విషయాలు తెలుసుకుందాము.

అందుకు యేసు వారితో ఇట్లనెను–మీరు దేవునియందు విశ్వాసముంచుడి. -మార్కు 11:22

దేవుని యందు విశ్వాసముంచితే ఏమి జరుగుతుంది? దీని గూర్చి అదే మార్కు సువార్త 11 వ అధ్యాయము 12వ వచనము నుండి నేర్చుకుందాము. యేసు మరియు ఆయన శిష్యులు, బేతనియనుండి వెళ్లుచుండగా ఆకలిగొని ఒక అంజూరపు చెట్టువద్దకు వచ్చి చూడగా అక్కడ అంజూరపు పండ్లు ఏమియు లేకపోయెను. ఆ సమయములో యేసు, ఆ అంజూరపు చెట్టును చూసి, నీ పండ్లు ఎవరూ ఎన్నటికినీ తినకుందురు గాక అని పలికినప్పుడు, సాయంకాలమునకు ఆ చెట్టు ఎండిపోయింది. ఆ విషయమును గమనించిన పేతురు “బోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను”. అప్పుడు ఆ సందర్భములో యేసయ్య చెప్పిన మాటలు, “మీరు దేవునియందు విశ్వాసముంచుడి”. ఎందుకు ఇలా చెప్పాడు అని ఆలోచిస్తే, అక్కడ ఒక అసాధారణమైన కార్యము జరిగింది. ఆ కార్యము యేసయ్య పలికి మాటలను బట్టి జరిగింది అనే సంగతి పేతురు గమనించాడు. అయితే ఆ సందర్భములో “దేవుని యందు విశ్వాసముంచుడి” అని చెప్పడములో అర్థము, మనకు సహితము అదేవిధముగా ఉండాలి అనే మాదిరి అని అర్థము చేసుకోవాలి.

తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము.౹ -1 యోహాను 4:17
నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు –నే నాయనను నమ్ముకొనియుందును అనియు –ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు – హెబ్రీ 2:11.

యేసయ్య మాటలు ఇంకొంచెం విపులీకరిస్తే, “నేను దేవుని యందు విశ్వాసముంచి నేను ఆ అసాధ్యమైన కార్యము జరిగించాను, మీరు కూడా దేవుని యందు విశ్వాసముంచిన యెడల ఆసాధ్యమైన కార్యములు జరిగించగలుగుతారు అని అర్థము”.

యేసు–రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త–ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.౹ అందుకు యేసు–నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;౹ -యోహాను 11:39-40

అప్పటికే లాజరు చనిపోయి 4 రోజులు అయినది గనుక స్వాభావికముగా ఆ మృతశరీరము నిజముగానే వాసన వస్తుంది. అయితే యేసయ్య చెప్తున్నాడు, “నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని”. అనగా యేసయ్య ఏమి చూస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు అంటే? దేవుని యందలి విశ్వాసము ద్వారా దేవుని మహిమను చూస్తున్నాడు. అనగా దేవుని యందలి విశ్వాసమును బట్టి అసాధ్యమైన కార్యములు జరిగించబడతాయి.

అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి–తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.౹ నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను.౹ -యోహాను 11:41-42

ఈ వాక్యము ద్వారా యేసయ్య దేవుని యందలి నమ్మిక, విశ్వాసము కలిగి జీవించాడు అని చూడగలము. యేసయ్య మనుష్య స్వరూపము ధరించుకుని వారికి మాదిరికరమైన జీవితమునే జీవించాడు. అయితే మరొక సత్యము మనము గ్రహించవలసినది ఏమిటి అంటే, ఆ విశ్వాసము ద్వారా మనకు కలిగిన ఆధిక్యత దేవుని మహిమ పరచడానికే వినియోగించాలి. నీ జీవితములో నీకు అడ్డుగా వచ్చిన అసాధ్యకరమైన విషయములో విశ్వాసముంచిన యెడల, అసాధ్యమైన కార్యము జరుగుతుంది అని అర్థము. అంతే కానీ, నీకు సంబంధములేని ప్రతి అసాధ్యమైన విషయములోను, కార్యము జరిగించుమని కాదు.

అయితే మనము నేర్చుకొనవలసిన సత్యము, “విశ్వాసము అనేది అసాధ్యమైన సందర్భములలో దేవుని శక్తిని ప్రత్యక్షపరచబడునట్లు చేసేది”.

మరలా మనము మార్కు 11:22 లో చూస్తే, “మీరు దేవునియందు విశ్వాసముంచుడి” అని యేసయ్య చెప్తున్నారు. అంటే దాని అర్థము మీరు కూడా విశ్వాసము ద్వారా అసాధ్యమైన కార్యము చేయునట్లు సిద్ధపరచుకొనుడి అని అర్థము.

ఎవడైనను ఈ కొండను చూచి–నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. -మార్కు 11:23-24

ఈ మాటల ద్వారా ప్రభువు తన శిష్యులను సహితము అట్టి ప్రకారము సిద్ధపరచుకొనుమని యేసయ్య చెప్పుచున్నాడు. అదే విధానములో, మనము కూడా అదేవిధమైన విశ్వాసము కనపరచినయెడల అసాధ్యమైన కార్యములు జరిగించగలమని వాక్యము ద్వారా తెలుసుకోగలము.

పౌలును గమనిస్తే, “నన్ను బలపరచువానియందు నేను సమస్తము చేయగలను” అని చెప్తున్నాడు, అంటే, యేసయ్య బలము కలవాడు అనే కదా! అలాగే “విశ్వసించిన యెడల అసాధ్యమైన కార్యములు చేయగలుగుతావు” అనగా, యేసయ్య కూడా విశ్వాసము కనపరిచారు అనే కదా! యేసయ్య తాను చెప్పినదే చేసి, మనకు మాదిరిగా ఉన్నాడు.