30-04-2023 – ఆదివారం రెండవ ఆరాధన – దేవునిని సరిగా అర్ధంచేసుకో 

స్తోత్రగీతము – 1

స్తుతులకు పాత్రుడు యేసయ్యా
స్తుతి కీర్తనలు నీకేనయ్యా ॥2॥
మహిమకు పాత్రుడు ఆయనయ్యా
కీర్తియు ఘనతయు రాజునకే

నే పాడెద ప్రభు సన్నిధిలో
నే ఆడెద ప్రభు సముఖములో
చిన్ని బిడ్డను పోలి నే ॥2॥

స్తుతి చెల్లించెద యేసయ్యా
మహిమకు పాత్రుడు మెస్సయ్యా ॥2॥
||నే పాడెద||

నిరతము పాడెద హల్లెలూయా
ఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా ॥2॥
||నే పాడెద||

స్తోత్రగీతము – 2

ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా (2)
||ఎంత||

ఘోరపాపినైన నేనూ దూరంగా పారిపోగా (2)
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా (2)
||ఎంత||

నాకున్న వారందరూ నను విడచిపోయిననూ (2)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువలేదయ్యా (2)
||ఎంత||

నీవు లేకుండ నేనూ ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
నీతో కూడా ఈ లోకం నుండీ
పరలోకం చేరెదనేసయ్యా (2)
||ఎంత||

స్తోత్రగీతము – 3

పాపాన్ని పోగొట్టి శాపాన్ని
తొలగించా భూలోకం వచ్చావయ్యా
మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసవయ్య
కన్నీటిని తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్య
మనుషులను చేసావయా నీ రూపాన్ని ఇచ్చావయ్యా
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య

బంగారం కోరలేదు వెండియు కోరలేదు హృదయాన్ని కోరావయ్య
ఆస్తియు అడగలేదు అంతస్థులడగలేదు హృదయాన్ని అడిగావయ్య
నేవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య

తల్లి నన్ను మరచిన తండ్రి నన్ను మరచిన యేసయ్య మరువడయ్యా
బంధువులు విడిచిన స్నేహితులు విడచిన యేసయ్య విడువడయ్య
చేయిపట్టి నడుపునయ్య శిఖరముపై నిలుపునయ్య
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య

ఆరాధన వర్తమానము

ప్రభువును స్తుతించడానికి, మహిమపరచడానికి మరొక సమయము మనకు ఇచ్చినాడు గనుక, ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధించడానికి సిద్ధపడదాము. దేవుని ఆరాధించుటలో దేవుని గూర్చిన సత్యము ఎంతో ప్రాముఖ్యము. దేవుని గూర్చిన సత్యము తెలియకపోతే, మనము ఆయనను హృదయమారా ఆరాధించలేము. సత్యము గనుక ఎరిగి ఉన్నట్టయితే, నివు చేసే ఆరాధన హృదయములోనుండి వస్తుంది అలా కాకపోతే అది నీ పెదవులనుండి వస్తుంది.

యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు -నిర్గమకాండము 15:11

మన దేవుని వంటి పరిశుద్ధుడు, ఆశ్చర్య కార్యములు జరిగించువాడు మరొకడు లేదు. అంతే కాదు గానీ, మన జననవిధానమును జ్ఞాపకము చేసుకున్నట్టయితే దేవుని జ్ఞానము గూర్చిన సాక్ష్యము మనము తెలుసుకోగలుతాము.

నీ దేవుడు నీ జీవితమును పరిపాలన చేసేవాడు. నీ దేవుని వంటి దేవుడు లేడు గనుక ఆయనయే నీ అతిశయకారణము అయి ఉన్నాడు.

ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి–భూతవర్తమాన భవిష్యత్కాలములలోఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.౹ -ప్రకటన 4:8

మన జీవితాలలో ఆయన కలుగ చేసుకోకపోతే, మన జీవితాలు ఎప్పుడో నాశనమైపోయేవి. మన దేవుడు ప్రతి సారీ మనకు సహాయకరమైన కేడెముగా ఉన్న కారణాన మన జీవితములు ఎంతో శ్రేష్టకరమైనవి. ఆయన బట్టియే మన జీవితాలు కొనసాగించబడుతున్నాయి గనుకు నీ అతిశయ కారణము, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్న నీ దేవుడే

యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియులేదు. -1 సమూయేలు 2:2

“నా దేవుడే నాకు ప్రభువు” అని నీవు చేసే ప్రకటన నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. ఆయన ప్రభువుగా నీ జీవితములో ఉంటే ఏమి జరుగుతుంది? శ్రమలు నీ ముందుకు వచ్చినట్టుగా కనబడినప్పటికీ నిన్ను మ్రింగివేయలేవు. ఏలయనగా నీతిమంతుని మార్గములో మరణమే లేదు. దానికి కారణము ఏమిటి అంటే “నీ ప్రభువే”. నీ ముందరకు వచ్చే ప్రతి పరిస్థితీ నీలో ఉన్న సర్వాధికారి అయిన దేవుని దాటుకునే రావాలి. ఒకవేళ నీ ముందర ఉన్న పరిస్థితి నిన్ను భయపెడుతుంది అంటే నీ ముందర నీ ప్రభువు ఉన్నాడు అనే సంగతి నీవు ఎరగక ఉండుటయే.

నీ జీవితములో నీవు అనుభవించిన గొప్ప కార్యములు జరిగించిన దేవుడు, నీ జీవితములో నష్టకరమైన పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినప్పుడు సహితము, నీ దేవుడు నీతోనే ఉన్నాడు. ఈ సత్యమే మనకు ఆదరణ, బలము. దేవుడు మాట ఇచ్చాడు అంటేనే మనము ఎంతో ధైర్యము కలిగి ఉండాలి. ఎందుకంటే, దేవుడు తన మాటను తన కార్యము చేత స్థిరపరచేవాడు గనుక.

ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని యున్నావు. -కీర్తనలు 77:14

దేవుని తన శక్తి ఎందుకు జనములలో ప్రత్యక్ష పరచుకుంటున్నాడు? అంటే నీ నా జీవితములలో ఆశ్చర్య కార్యములు జరిగించుట ద్వారా, ఆయన మహిమకు కీర్తి కలుగులాగున. నిజానికి మన పుట్టుకును గూర్చి ఆలోచిస్తే, దేవుడు తన ఊపిరి ఊది మనకు జీవమును అనుగ్రహించాడు గనుక, ఆశ్చర్యకరుడైన వాని ఊపిరి కలిగిన వారిగా మనము కూడ ఆశ్చర్య కార్యములచే నడిపించబడేవారము.

ఆరాధన గీతము

అద్భుతముల కొరకు ఆశించుచున్నాము
నీకసాధ్యమేదియు లేనే లేదు యేసయ్యా ||2| |
యెహోవా యీరే, యెహోవా షాలోం
యెహోవా నిస్సీ, యెహోవా రాఫా ||2||

వాగ్దానములు చేయువాడా – నమ్మదగిన దేవా
వాగ్దానములు నెరవేర్చుటకు – శక్తిగల దేవుడవు ||2||
మాటతప్పని వాడవు – మార్పులేని వాడవు
నిన్న నేడు నిరతము – ఉన్నవాడవు
మహత్తైన కార్యములు, మహాశ్చర్య కార్యములు ||2||
అద్భుతములు చేయుము || యెహోవా యీరే ||

చీకటిని ఉదయముగా మార్చు – నీతి సూర్యుడవు
లేనివాటిని ఉన్నట్టుగానె – పిలచు దేవుడవు ||2||
మృతులను సజీవులుగా, చేయు దేవుడవు
సమాధినుండి లాజరును, లేపిన నాధుడవు
మహత్తైన కార్యములు, మహాశ్చర్య కార్యములు ||2||
అద్భుతములు చేయుము || యెహోవా యీరే ||

సమస్తము సాధ్యము చేయువాడా సజీవుడైనవాడా
నీళ్ళను ద్రాక్షారసముగా మార్చి అద్భుతముచేసితివి
అరణ్యయాత్రలో మన్నాతో ఆకలి తీర్చితివి
బండనుండి నీటి ఊటతో దాహము తీర్చితివి
మహత్తైన కార్యములు మహాశ్చర్యకార్యములు ||2||
అద్భుతములు చేయుము || యెహోవా యీరే ||

నీటి యొక్క ద్రాక్షారసము యొక్క స్వభావము వేరు వేరు అయినప్పటికీ నీటినే ద్రాక్షారసముగా మార్చగలిగిన వాడు. నీ జీవితములో నీవు ఆశించినదానిని నెరవేర్చకుండా ఎవరు అడ్డుగా ఉన్నప్పటికీ అనుకూలపరచి వారి స్వభావమును మార్చగలిగే వాడు. సమస్తము సాధ్యము చేసేవాడు మన దేవుడు.

అరణ్య యత్రలో అనగా శరీర రూపములో జరిగిస్తున్న యాత్రలో పరలోకమునుండి వారి ఆకలి తీర్చబడింది. నీ అవసరత ఏమైనా సరే నీ అవసరము పరలోకముండి నుండి తీర్చబడుతుంది.

బండనుండి నీళ్ళు రావడము అసాధ్యము. అయితే అటువంటి బండనుండి సహితము నీళ్ళు రప్పించగలిగినవాడు నీ దేవుడు. నీ ఎదుట అసాధ్యమైనది సాధ్యము చేయుటకు నూతన కార్యము జరిగించేవాడు.

మెయిన్ మెసేజ్

మన దేవునిని మనము సరిగా అర్థము చేసుకోవాలి. మనకు కలిగే కొన్ని పరిస్థితులలో ఆయన కఠినముగా ఉన్న దానిని బట్టి ఆయనకు ప్రేమ లేదేమో అనుకునే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. అయితే కొంతమంది దేవునిని మధ్యలోనే విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. అయితే “దేవుడు అన్యాయము చేయుట అసంభవము” అనే సత్యము మన హృదయములపై ముద్రించుకోవాలి. ఏ పరిస్థితి అయినప్పటికీ నా దేవుడు అన్యాయము చేయుట అసంభవము అనే సత్యములోనే మనము జీవించాలి.

అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.౹ -యోహాను 6:66

ఇక్కడ ఆయనను విడిచిపెట్టినవారు ఎవరు అంటే “శిష్యులు”. అక్కడ జరిగిన సందర్భములో చూస్తే, ప్రభువు పలికిన కొన్ని మాటలను బట్టి, వారు ప్రభువును విడిచిపెట్టి మరెన్నడూ వెంబడించలేదు. ఇప్పటి పరిస్థితులలో చూస్తే, యేసయ్యను అంగీకరించి, ఆయన వాక్యమును వెంబడించిన మన అందరికీ ఈ మాట వర్తిస్తుంది. మన జీవితములో జరిగిన కొన్ని విషయాలను బట్టి ప్రభువు సన్నిధికి దూరముగా వెళ్ళిపోయే పరిస్థితులు అనేకములు. నీ జీవితాన్ని మార్చడానికే ప్రభువు తన వాక్యాన్ని నీ యొద్దకు తీసుకువస్తాడు.

ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.౹ -యోహాను 6:60

కఠినమైనప్పటికీ, వాక్య ప్రకారము యేసయ్య మాటలు జీవమును, సమాధానము అయి ఉన్నవి. అయితే అక్కడ యేసుపలికిన కఠినమైన మాట విని అర్థము చేసుకోలేక, శిష్యులు ఆయనను వెంబడించుట మానివేసిరి.

పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. యూదులు–ఈయన తన శరీరమును ఏలాగు తిన నియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.౹ కావున యేసు ఇట్లనెను–మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు.౹ -యోహాను 6:51-53

యేసయ్య మాటలు జీవమును, సమాధానమును అయి ఉన్నవి. ఆయన పలికిన ప్రతీ మాట మనకు జీవమై ఉన్నది. అయితే యేసయ్య పలికిన ఆ మాట శిష్యులు సరిగా అర్థము చేసుకోలేదు. అయితే దానిలోని మర్మమును గూర్చి వారు అడగలేదు, కనిపెట్టలేదు ఉండలేదు. యేసయ్య కలువరి సిలువలో చెయ్యబోయే కార్యము శిష్యులకు ఇంకనూ తెలియదు కాబట్టి వారికి మర్మము అర్థము కాలేదు.

మనమైతే, దేవుని యొద్దనుండి ఒక మాట, వాక్కు విడుదల అయింది అంటే, అది అర్థము అయినా అవ్వకపోయినా సరే, ఆ మాటను స్వీకరించడమే. ఎందుకంటే ఆ మాటలో నీకు జీవము ఉంది. అది హెచ్చరిక మాట అయినా సరే అందులో నీకు జీవమే దాచబడి ఉంటుంది.

కాబట్టి యేసు–మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా౹ సీమోను పేతురు– ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;౹ నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.౹ -యోహాను 6:67-69

యేసును విడిచిపెట్టిన శిష్యులు ఆ మాటను కఠినముగా తీసుకున్నారు గానీ, పేతురు అవే మాటలు నిత్య జీవపు మాటలు అని చెప్పాడు. అయితే పేతురుకు ప్రభువు పలికిన మాటలలోని సత్యము తెలియదు అయినప్పటికీ, ప్రభువు మాటలో జీవము ఉంటుంది అనే సత్యమును మాత్రమే నమ్మాడు. మరి నీ నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంతకు ముందు ఎలా ఉన్నప్పటికీ, ఇప్పటినుండీ మాత్రము దేవుని మాటలను జీవము గలిగినవిగా ఎంచి స్వీకరించి, నమ్మి నిలబడదాము.

నీవు దేవుని సన్నిధిలో ఉన్న ప్రతిసారీ విడుదలైన ఆయన మాటలు నీవు స్వీకరిస్తున్నావు. ఆ మాటలే నీ జీవితాన్ని స్థిరపరుస్తాయి. అందుకే నీవు ఆసక్తితో దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవుని మాట ప్రకారము నీ జీవితాన్ని మార్చుకోవడమే ఆత్మీయ ఎదుగుదల. అప్పుడు నీ ఆత్మ బలపరచబడుతుంది. నీ ఆత్మ ఎదుగుతున్నపుడు అన్నివిషయాలు సరైన విధానములో సిద్ధపరచబడుతుంది. అప్పుడు దేవుడు ఏమి మాట్లాడతాడో అనే ఆసక్తితో మనము ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటాము.

ఒక అధికారి ఆయనను చూచి–సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయన నడిగెను. అందుకు యేసు–నేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింప వద్దు, నరహత్యచేయ వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తలి దండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను. అందుకతడు–బాల్యమునుండి వీటినన్నిటిని అనుసరించుచునే యున్నాననెను. యేసు విని–నీకింక ఒకటి కొదువగా నున్నది; నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా -లూకా 18:18-23

ఈ సందర్భములో మరొక వ్యక్తి యేసయ్య చెప్పిన మాటలు విని వ్యసనపడ్డాడు. ఇక్కడ కూడా యేసయ్య చెప్పిన మాటలు సరిగా అర్థము చేసుకోలేక వ్యసనపడ్డాడు. ఆ ధనవంతుడు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే? “నిత్య జీవము పొందటానికి ఏమి చేయాలి”. అప్పుడు యేసయ్య ఆజ్ఞలను గూర్చి మాట్లాడగా, తాను చిన్నప్పటినుండి పాటిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు యేసయ్య ఆ ధనవంతుని ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్మన్నాడు. ఈ మాట అతననిని ఎంతో నిరాశపరిచింది.

మనము జన్మమువలన యూదులమే గాని అన్యజనులలోచేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచియున్నాము; ధర్మశాస్త్రసంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.౹ -గలతీయులకు 2:15

పాత నిబంధన ప్రకారము ధర్మ శాస్త్ర సంబంధమైన క్రియలు అవసరమైనవి కానీ, నూతన నిబంధన ప్రకారము, యేసయ్య చెప్పిన మాటలు “విశ్వసించుట” యే అవసరము. అయితే ఈ సత్యము అర్థము కాక, ఆ ధనవంతుడు వ్యసనపడ్డాడు అనగా చింతపడ్డాడు, దుఃఖపడ్డాడు. అయితే పేతురును చూస్తే,

సీమోను – ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాటచొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పెట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలుమునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పెట్టిన చేపల రాశికి అతడును అతనితోకూడనున్నవారందరును విస్మయమొందిరి. ఆలాగున సీమోనుతోకూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయ మొందిరి). అందుకు యేసు–భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. -లూకా 5:5-11

ఇక్కడ చూస్తే, పేతురు ముందు ఎంతో విస్తారమైన చేపలు అనగా వారి వ్యాపారమును బట్టి కలగబోయే ధనము ఉన్నది. అయితే ఎప్పుడైతే యేసయ్య వారిని వెంబడించమని చెప్పినప్పుడు, పేతురు సమస్తము విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాడు. ఎందుకు అంటే,

సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. -లూకా 5:8

ఈ కార్యము ఎంతో ప్రాముఖ్యము. పేతురు ప్రభువులో ఒక విషయమును గ్రహించినవాడై ఉన్నాడు. ఆ గ్రహించిన విషయమును బట్టి యేసయ్యను విశ్వసించాడు. ఏమి గ్రహించాడు అంటే, యేసయ్య ఏమి పలికితే అది జరుగుతుంది అని గ్రహించాడు. అనగా యేసయ్య మాటలు నిత్య జీవపు మాటలు అని అర్థము చేసుకున్నాడు. ఆ నమ్మిన దానిని బట్టి పేతురు యేసయ్యను వెంబడించిన వాడుగా ఉన్నాడు.

ఒక ధనవంతుడు యేసయ్య మాటకు వ్యసనపడ్డాడు. మరొక ధనవంతుడు యేసయ్య మాటకు లోబడి సమస్తము విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు.

అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీయుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి–ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారముగాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను.౹ పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై –నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము;౹ ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. -1 రాజులు 17:1-5
కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. -1 రాజులు 17:7

ఇక్కడ ఏలియా ద్వారా మంచైనా వర్షమైనా కురవదు అని చెప్పిన తరువాత, కెరీతు వాగు నీళ్ళు తాగుము అని చెప్పిన తరువాత అది ఎలా ఎండిపోయింది? దేవుని మాట తప్పిపోయింది అని అర్థమా? అయితే మనము దేవుని సరిగా అర్థము చేసుకోవాలి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. అలాగే ఏలియా జీవితములో కూడా ఆ వాగు ఎండిపోయినప్పటికీ ఏమీ తొణకలేదు బెదరలేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనతో ఉన్నాడనే సత్యమును ఎరిగిఉన్నాడు. అందుకే వెనుదీయలేదు.

నీవు నేను కూడ దేవుని గూర్చిన సత్యమును ఎరిగి నిలిచినట్టయితే, మన జీవితములో ఆయన జీవపు మాటలు కార్యమును జరిగిస్తూ కొనసాగిస్తూ నడిపిస్తాయి. ఏలియా జీవితములో కెరీతు వాగు ఎండిపోయాక ఎక్కడ అడుగుపెట్టాడు? అనేది మనము గమనించాలి. నిజానికి ఏలియాను పోషించడానికి వాగు యొద్దకు పంపలేదు కానీ, సారెఫతు విధవరాలి జీవితాన్ని నిలబెట్టడానికి ఏలియా నడిపించబడ్డాడు.

మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైనశ్రమలనుగూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశో ధించిరి.౹ -1 పేతురు 1:10

ఏలియాను చూస్తే, కొంతకాలము విశ్రాంతిలో ఉన్నాడు తరువాత సారెఫతు విధవరాలి వద్దకు నడిపించబడ్డాడు. ఇంతవరకు కాకుల ద్వారా ఏలియా పోషించబడ్డాడు, తరువాత ఏలియా ద్వారా ఆ విధవరాలు పోషించబడింది.

మొదట చూసిన ధనవంతుని వలే దేవుని మాటను బట్టి వ్యసనపడవద్దు. పేతురు వలే, యేలియా వలే జీవము కలిగిన మాటలు అని ఎరిగి, నమ్మి ఆ మాట ప్రకారము నిలబడదాము.