స్తోత్రగీతము – 1
యేసు మాతో నీవుండగా
మేము అలసిపోలేమయ్యా (2)
అంతా నీవే చూసుకుంటావు (4)
||యేసు మాతో||
సమాధానకారకుడు నీవేనయ్యా
సర్వశక్తుడవు నీవేనయ్యా (2)
||యేసు మాతో||
అద్భుత దేవుడవు నీవేనయ్యా
ఆలోచన కర్తవు నీవేనయ్యా (2)
||యేసు మాతో||
తల్లియు తండ్రియు నీవేనయ్యా
పెంచేవాడివి నీవేనయ్యా
||యేసు మాతో||
నా యొక్క సౌందర్యం నీవేనయ్యా
నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2)
||యేసు మాతో||
చీకటిని తొలగించు వెలుగు నీవేనయ్యా
రక్షించు దేవుడవు నీవేనయ్యా (2)
||యేసు మాతో||
స్తోత్రగీతము – 2
సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభూ
ఆధారము ఆశ్రయము నీవే నా యేసు
నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి
చిన్న చిన్న గొర్రె పిల్లలము కాపరివై మము కాయుము
అమ్మ నాన్న అన్నీ నీవే ఆదరించి సేదదీర్చుము
నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి
పరుగెత్తినా కొండ కోనలలోన పచ్చని పచ్చికలో
అండదండ కొండా కోనా నీవే యేసు
నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి
స్తోత్రగీతము – 3
మనసారా పూజించి నిన్నారాధిస్తా
భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా
చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను
సంతోష గానాలను ఆలాపిస్తా (3) ||మనసారా||
నిన్న నేడు ఉన్నవాడవు నీవు (2)
ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు (2)
పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు (2)
నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు (2) ||మనసారా||
రక్షణ కొరకై లోకానికి వచ్చావు (2)
సాతాన్ని ఓడించిన విజయశీలుడవు (2)
మరణము గెలిచి తిరిగి లేచావు (2)
నీవే మార్గము సత్యము జీవము (2) ||మనసారా||
ఆరాధన వర్తమానము
సాధారణముగా ఏదైనా వేడుకకు వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మంచి భోజనము ఉంటుంది, మంచి బట్టలు వేసుకోవచ్చు, అలంకరణలు బాగుంటాయి. అయితే అదే సంతోషము ప్రభువు సన్నిధిలో ఆరాధించేటప్పుడు కూడా మనము ఇంకా ఎక్కువ సంతోషముగా ఉండాలి.
అలాగే మనమున్న ఈ రోజుల్లో ఆరోగ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నాము. అంటే ఆరోగ్యము పట్ల శ్రద్ధ కనపరచేవారుగా, ఆహారము, వ్యాయామము పట్ల ఆలోచన కలిగి ఉంటున్నారు. అంటే వారి శరీరాన్ని సిద్ధపరచుకుంటున్నారు. అయితే దేవుని పిల్లలుగా మనము మన ఆత్మను సిద్ధపరచుకొనుట యందు ఆసక్తి కలిగి ఉంటున్నాము. దేవుని కృపను బట్టి విడుదల అయ్యే ఆయన జీవ వాక్కులను బట్టి మన ఆత్మ బలపరచబడుతుంది.
యెరూషలేమా, యెహోవాను కొనియాడుము సీయోనూ, నీ దేవుని కొనియాడుము. -కీర్తనలు 147:12
“యెరూషలేము” అంటే దేవుని పట్టణము! “సీయోను” ఆయన నివసించు ప్రదేశము. మనము కూడా “దేవుని ఆలయము” గనుక ఆయన నివసించే ప్రదేశమే. దీనిని బట్టి, మనము మన దేవునిని కొనియాడవలసిన వారుగా ఉన్నాము.
యెహోవా నిరంతరము ఏలును సీయోనూ, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును యెహోవాను స్తుతించుడి. -కీర్తనలు 146:10
అనగా నీ మంచి స్థితిలోనైనా చెడ్డ స్థితిలోనైనా నాదేవుడు నీలో, నీతో ఉండి నన్ను పరిపాలిస్తూ నడిపిస్తూ పోషిస్తూ, సరిచేస్తూ ఆశీర్వదిస్తాడు. దీనిని బట్టి నిన్ను విడిచిపెట్టక, నిన్ను పరిపాలించువాడు నీ దేవుడు అనే సత్యము నీవు ఎరిగినప్పుడు ఖచ్చితముగా ఆయనను మనసారా, సంతోషముతో ఆరాధిస్తావు. మన జీవితము ఎంతో శ్రేష్టకరమైన జీవితము. ఎందుకంటే, ఆయన మనలో ఉండి పరిపాలన చేసేవాడుగా ఉన్నాడు.
దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము -యోబు 34:10
మనలో ఉండి పరిపాలన చేస్తున్న దేవుడు అన్యాయము జరగనివ్వడు. అందుకే “నా దేవుడు నాలో ఉండి పరిపాలన చేస్తున్నాడు” అనే సత్యము మనము ఎరిగి ఉండాలి. నిన్ను పరిపాలించే నీ దేవుడు లేని దానిని ఉన్నట్టుగా చేయగలిగినవాడు, మృతమైనదానిని సహితము జీవింపచేయగలిగినవాడు. అందుకే నీ జీవితము దేవుని మహిమకొరకే. ఆయనకు ఆలయమైన నీవు కృంగిపోయి, నిరాశతో ఉంటే, ఆయనకు మహిమ ఎలా వస్తుంది? అందుకే ఈ సత్యము మనము ఎరిగి ఉండాలి, “నా దేవుడు నన్ను విడిచిపెట్టడు”.
దేవుని పరిపాలనను గూర్చి మనము ఆలోచిస్తే. ఒక రాజు, తన రాజ్యములోని ప్రజల జీవితములను మెరుగుపరచబడటానికి ఆలోచనలను కలిగి ఉంటాడు. ఆ ఆలోచన ప్రకారము ఆ రాజు తన కార్యములను జరిగిస్తాడు. అలాగే నిన్ను పరిపాలించే నీ దేవుడు నీ జీవితమును పరిపాలిస్తున్నాడు అంటే నీ జీవితము ఇంకా మెరుగుపరచబడటానికి మేలు పొందుకోవడానికి ఆయన ఆలోచన కలిగి ఉంటాడు. ఆ ఆలోచనలను నెరవేర్చడానికి ఆయన ఆశ్చర్య కార్యములను సహితము జరిగించగలిగిన సమర్థుడు. నీ మంచి సమయములోనే కాదు గానీ, నీ కష్టసమయములో కూడా నీతో ఉండేవాడు నీ దేవుడు, నిన్ను విడువడు యెడబాయడు.
మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీదపడి బెదరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. -కీర్తనలు 18:4-6
మరణకరమైన పరిస్థితులైనా, భక్తిహీనుల మాటలు హృదయమును కృంగదీసే స్థితి అయినా మన దేవుడు మనలోనే ఉండి మనలను విడిపించేవాడుగా ఉంటాడు. ఒక్కొక్కసారి ఎవరితోనూ పంచుకోలేని కష్టములో, హృదయవేదనతో మౌనముగా రోదించే సమయములో కూడా నిన్ను విడిచిపెట్టడు. నీ కష్టసమయమునుండి నిన్ను విడిపించేవాడుగా ఉన్నాడు నీ దేవుడు.
ఆరాధన గీతము
నా యేసయ్యా నా రక్షకా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
ప్రేమింతును నీ సన్నిధానమును
కీర్తింతును యేసయ్యా (2)
నా విమోచకుడా నా పోషకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
||ప్రేమింతును||
నా స్నేహితుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
||ప్రేమింతును||
నా విమోచకుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
||ప్రేమింతును||
మెయిన్ మెసేజ్
“నీ జీవితము హెచ్చించబడటానికి” అనే విషయము గూర్చి ధ్యానిద్దాము. మనలో ప్రతి ఒక్కరికీ జీవితములో ఎదగాలి, మంచిగా వృద్ధిలోనికి రావాలి అనే ఆశ కలిగే ఉంటాము. ఉదాహరణకు ఒక ఉద్యోగి తన ప్రమోషన్ కొరకు తన పై అధికారిని సంతోషపరచడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. అయితే ఆత్మసంబంధమైన వారమైన మనము మనుష్యుల ఆలోచనల ప్రకారము కాదు గానీ, సర్వశక్తిమంతుడైన మన దేవుని నియమముల ప్రకారము మనము హెచ్చింపబడుతాము. ఏలయనగా ఒకని హెచ్చించుట దేవుని వశము. అలాగే మన పౌరస్థితి పరలోకమందున్నది. ఆ పరలోక నాథుడైన దేవుని పరిపాలనలో మనము.
దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును -కీర్తనలు 75:7
నీవు హెచ్చించబడుట అనే దానిని నిర్ణయించువాడు దేవుడే. మరి ముఖ్యముగా యేసయ్యను అంగీకరించి, దేవుని పరిపాలనలో నేనున్నాను అనే సత్యము ఎరిగినవారి జీవితములో ఇది సత్యము. దానిని బట్టి లోకసంబంధులు ఎంత ప్రయత్నించినా దేవుని నిర్ణయమును అడ్డగించలేరు.
అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. -లూకా 18:14
ఇక్కడ ఇద్దరు వ్యక్తులున్నారు. ప్రార్థనచేయుటకై ఈ యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి ప్రార్థన చేస్తూ – దేవా, నేను చోరులును అన్యా యస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పి ప్రార్థించెను. తన ప్రార్థనలో తాను చేసే మంచి కార్యములనే తాను ప్రస్తావిస్తూ దేవునికి ప్రార్థించాడు. అలాగే ఇంకా తన ఆత్మీయ స్థితిని గూర్చి కూడా తాను ప్రార్థించాడు. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను.
మరి సుంకరిని చూస్తే, దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు–దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఈ ఇద్దరిని గూర్చి యేసయ్య చెప్పిన మాటలు, “అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను”.
పరిసయ్యుడు దేవుని ఆజ్ఞల ప్రకారము చేస్తున్నాడు. అయితే సుంకరి తన ఉద్యోగములో ప్రజలను పీడిస్తూ ఉండిన కారణాన దేవుని ఆజ్ఞల ప్రకారము చెయ్యట్లేదు.
అయితే ఇక్కడ ఎవరు ఎక్కడ హెచ్చించుకొన్నారు? తగ్గించుకున్నారు అనే సత్యము మనము ఎరిగి ఉండాలి. పరిసయ్యుడు తనలో తాను హెచ్చించుకున్నాడు. సుంకరి తనలో తాను తగ్గించుకున్నాడు. అనగా వారి వారి “మనస్సాక్షి” ప్రకారము హెచ్చించుకోవడము, తగ్గించుకోవడము అనే విషయము ఉంటుంది. అందుకే దేవుడు మనలను హెచ్చించాలి అంటే, మన మనస్సాక్షి చాలా అవసరము. “స్వనీతి” అనేది చాలా ప్రమాదకరమైన స్థితి. మన హృదయములో ఉన్నదానిని బట్టి దేవుడు తీర్పు తీర్చేవాడు.
ఒకవేళ మన మనస్సాక్షి బలహీనముగా అయిపోతే, మనలో అసూయ, ద్వేషము వంటి దుర్గుణములు ప్రవేశిస్తాయి. ఈ మనస్సాక్షిని బట్టే మనము హెచ్చింపబడటము గానీ, తగ్గించబడటము గానీ జరుగుతుంది.
నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును -సామెతలు 16:18
గర్వము, అహంకారము అనేది ఒక మనిషి హృదయములో, మనసులో జరిగే విషయాలు. అందుకే మన మనస్సాక్షి ఎంతో ప్రాముఖ్యము.
మొదటిగా మనలో మనము తగ్గింపు కలిగి ఉండుట. రెండవదిగా చూస్తే దేవుని యెదుట తగ్గింపు కలిగి ఉండుట.
ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును. -యాకోబు 4:10
పరిసయ్యుడు మంచి కార్యములను చేస్తున్నాడు కాబట్టి తాను అదే విషయములను గూర్చి చెప్పాడు. సుంకరి అయితే చెడ్డకార్యము జరిగించాడు కాబట్టి తాను ఒప్పుకొని తగ్గించుకున్నాడు. అయితే మనము ఎలా తీసుకోవాలి? ఉదాహరణకు ఒక ఉద్యోగి జీవితములో చూస్తే, తాను ఎలా తగ్గించుకోగలడు? “ప్రభువా నా జ్ఞానమును బట్టి కాదు గానీ, నీ కృపను బట్టే, నీవు నిర్ణయించిన దాని బట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను” అనే విధానములో మనలను మనము ప్రభువు ఎదుట తగ్గించుకోవాలి. నీవు హెచ్చించబడుట అనేది ముందుగానే లిఖించబడింది. ఆ లిఖించబడినది స్థిరపరచుకోవాలి అంటే ప్రభువు ఎదుట మనలను మనము తగ్గించుకోవాలి.
మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు –నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను. -యెషయా 57:15
ఎప్పుడైతే తగ్గింపు కలిగిన మనసుతో దేవుని యొద్దకు మనము వస్తామో, అప్పుడు ఆయన “ఉజ్జీవింపచేయుటకు” అనగా మనలను “హెచ్చించుటకు” ఆయన నీయొద్దకు వస్తాడు. అందుకే సుంకరి తగ్గింపు ప్రార్థనను బట్టి నీతిమంతునిగా తీర్చబడ్డాడు అనగా “హెచ్చించబడుటకు అనుకూలమైన స్థితిలోనికి మార్చబడ్డాడు”.
“నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని” అనే మాటను అర్థము చేసుకోవడానికి తప్పిపోయిన కుమారుని జీవితము చూద్దాము.
అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు–నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను. నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను. -లూకా 15:17-19
ఈ కుమారుడు మొదట తన హృదయములో పశ్చాత్తాపముతో తగ్గింపు కలిగినవాడుగా తండ్రి ఇంటికి వెళ్ళాడు. అన్నీ పోగొట్టుకొని తన తండ్రి యెదుట నిలబడ్డాడు. అయితే తండ్రి తన మెడమీద ముద్దుపెట్టుకున్నాడు.
దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారుడెల్లప్పుడును నివాసముచేయును.౹ -యోహాను 8:35
తప్పును ఎరిగి పశ్చాత్తాపముతో ఎదుట నిలిచిన కుమారుని నీతిమంతునిగా తీర్చి, అనగా “కుమారునిగా ఎంచి” ముద్దుపెట్టాడు. అలాగే కుమారునిగా తాను ఇంటిలోనికి వెళ్ళి నిత్యము కుమారునిగానే తాను ఆధిక్యత కలిగి ఉంటాడు. అయితే తండ్రి కుమారుడు మాటలాడక మునుపే ఎలా అంగీకరించి ముద్దు పెట్టుకున్నాడు? అని చూస్తే, తన కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడో ఎరిగినవాడుగా ఉన్నాడు. అలాగే మనము కూడా దేవుని ఎదుట తగ్గింపు కలిగిన స్వభావము కనపరిస్తే చాలు, ఆయనే నిన్ను హెచ్చించుటకు నీకంటే ఎక్కువైన ఆసక్తి కలిగినవాడుగా ఉన్నాడు.