23-04-2023 – ఆదివారం రెండవ ఆరాధన – నీవే నా ప్రభువు

స్తోత్రగీతము – 1

ఎల్లపుడు సోత్రం నీకేనయ్యా
ఎనలేని దైవమా నీకేనయ్యా(2)
నీకేనయ్యా నీకేనయ్యా(2)

ఏది జరిగిన సోత్రమయ్యా
ఎవరు విడిచిన సోత్రమయ్యా(2)
సోత్రం సోత్రం ఎల్లపుడు సోత్రం(2)
|| ఎల్లపుడు ||

నీతి దైవమా సోత్రమయ్యా
విజయవంతుడా సోత్రమయ్యా(2)
సోత్రం సోత్రం ఎల్లపుడు సోత్రం(2)
|| ఎల్లపుడు ||

అనాది దైవమా సోత్రమయ్యా
అధిపతి అయినవాడ సోత్రమయ్యా
సోత్రం సోత్రం ఎల్లపుడు సోత్రం(2)
|| ఎల్లపుడు ||

స్తోత్రగీతము – 2

నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2)
రాజులకే……… మహారాజవు
కృపచూపే…….. దేవుడవు
నడిపించే……… నజరేయుడా
కాపాడే……….. కాపరివి (2)
||నా నీతి||

శ్రమలలో – బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను
వాక్యమే – కృపావాక్యమే – నను వీడని అనుబంధమై (2)
నీమాటలే – జలధారాలై – సంతృప్తి నిచ్చెను
నీమాటలే – ఔషధమై – గాయములు కట్టెను
నీ మాటే మధురం
రాజులకే……… మహారాజవు
కృపచూపే…….. దేవుడవు
నడిపించే……… నజరేయుడా
కాపాడే……….. కాపరివి
||నా నీతి||

మేలులకై – సమస్తమును – జరిగించుచున్నావు నీవు
ఏదియు – కొదువ చేయవు – నిన్నాశ్రయించిన వారికి (2)
భీకరమైన కార్యములు – చేయుచున్నవాడా
సజీవుడవై – అధిక స్తోత్రము – పొందుచున్నవాడా
ఘనపరుతును నిన్నే
ప్రేమించే ………………యేసయ్యా
నీవుంటే ……………….చాలునయా
నడిపించే …………….. నజరేయుడా
కాపాడే …………………కాపరివి
||నా నీతి||

సంఘమై – నీ స్వాస్థ్యమై -‌ నను నీ యెదుట నిలపాలని
ఆత్మతో – మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2)
వరములతో – ఫలములతో – నీకై బ్రతకాలని
తుదిశ్వాస – నీ సన్నిధిలో – విజయం చూడాలని
ఆశతో ఉన్నానయా
కారుణించే………యేసయ్యా
నీ కోసమే…….. నా జీవితం
నిను చేరే ఆశయం తీరాలయ్యా
నిను చూసే………. ఆక్షణం. రావాలయ్యా
||నా నీతి||

స్తోత్రగీతము – 3

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య

నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో

ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య

ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచొస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య

ఆరాధన వర్తమానము

దేవుని ఆరాధించుట, దేవునిని మహిమ పరచటము ఎంతో ధన్యత. పరలోకములో దూతలు రకరకములైన పనులు కలిగి ఉన్నారు. కొంతమది వర్తమానములు తీసుకు వెళ్ళే పని, కొంతమందికి యుద్ధము చేసే పని మరికొంతమందికి ఆరాధించుట అనే పని ఉన్నది. మన దేవుడు స్తుతింపదగిన దేవుడు. పరలోకములో ఆయన ఎల్లప్పుడూ స్తుతింపబడుతున్నాడు అలాగే భూలోకములో కూడా ఆయనకు స్తుతి కలుగవలెను అని ఆయన నిన్ను నన్ను నియమించాడు.

దేవుని స్తుతిలో ఒక గొప్పదనము ఉంది. ఎక్కడైతే దేవుడు స్తుతింపబడుతున్నాడో అక్కడ పరలోకములో దూతగణము కూడా వచ్చి ఆ ఆరాధనలో పాలుపంచుకుంటారు. అయితే అటువంటి ఆరాధన ఎప్పుడు చెయ్యగలుగుతాము అంటే, మనము ఆత్మీయముగా ఎదిగి ఆత్మీయ సత్యములను ఎరిగినప్పుడు ఆత్మతో మనము ఆరాధించగలుగుతాము. పరలోకపు ఆరాధన అనుభవము కలిగిఉండాలనే ఆశ మనము కలిగి ఉండుట మొదటి మెట్టు.

నేను యెహోవా నామమును ప్రకటించెదను మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. -ద్వితీయోపదేశకాండము 32:3-4

మన దేవుడు ఆశ్రయ దుర్గము అయినవాడు, కార్యము సంపూర్ణము చేయువాడు. అందుకే ఏలియా అరచెయ్యి అంత మేఘము కనపడగానే, ఆహాబుకు వెళ్ళి ప్రచండవర్షము కురుస్తుంది అని చెప్పమన్నాడు. నీ జీవితములో కూడా ఆయన ప్రారంభించింది ముగించేవరకు చెయ్యి విడిచిపెట్టడు. నీవు చెయ్యి విడిచినప్పటికీ నీతోనే ఉంటాడు. ఆయన చెయ్యి పట్టుకున్నప్పుడు నీలో ఉంటాడు. నీవు చెయ్యి విడిచిపెట్టినప్పుడు నీతోనే ఉండి, మరలా నీవు చెయ్యిపట్టుకునేవరకు నిన్ను సంధిస్తాడు. నీ చివరి దినము వరకు ఆయన నిన్ను కాపాడేవాడు. అందుకే ఆయన కార్యములు సంపూర్ణము చేయు వాడు. మన జీవితాలకు ఆయన నమ్ముకొనదగినవాడు. ఆయన మనకు ఆధారమై ఉన్నాడు కాబట్టే, ఇంకా మనము జీవిస్తున్నాము. ఆయన ఆధారముగా లేకపోతే, మన జీవితములు ఎప్పుడో ముగించబడేవే.

దేవుడు మనలను విడిచిపెట్టక వెంబడిస్తూ సంధిస్తున్నాడు అంటే దాని వెనుక ఒక ఉద్దేశ్యము ఉంది. నీవు నాశనములోనే ఉండిపోక, నిత్యాందము ఉండే స్థలములో నిన్ను నిలపాలని ఆయన ఆశ.

యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. -యిర్మీయా 10:10

మనము క్రైస్తవులు గా ఈమాట చాలా సుళువుగా చెప్పేస్తాము. అయితే నిజమైన అనుభవపూర్వకముగా చెప్పగలుగుట ఎంతో ధన్యము. లోకమంతా సత్యము గ్రహించలేక, దేవుడు కాని వాటి వెంబడి వెళ్తుండగా, మనకు మాత్రము ఆయనే దేవుడనే సత్యము తెలియచేయబడుట మన ధన్యత. ఈ సత్యము ఎరిగిన షద్రకు, మేషాకు అబెద్నెగోలు మా దేవుడికి తప్ప మరొకరికి మొక్కము అని ఖండితముగా చెప్పారు. మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు అని చెప్పగలిగినారు. వారి పరిస్థితులలో చూస్తే, వారి ఎదురుగా ఉన్నది మరణము. అయితే వారు నమ్మినది, మా దేవుడు మరణము నుండి జీవములోనికి నడిపించే దేవుడు అని విశ్వసించారు. వారిని పడద్రోయవలసిన అగ్ని గుండములో ఏది వేసినా అది కరిగిపోతుంది, కాలిపోతుంది. అయితే ఆ అగ్నిగుండము కన్నా శక్తిమంతుడు మా దేవుడు అని వారు వారి క్రియల ద్వారా సాక్ష్యము ఇవ్వగలుగినారు.

పరిస్థితులు ఏమైనప్పటికీ మన దేవుడు శక్తిగలిగిన దేవుడు. ఆశ్చర్యకరమైన కార్యములు చేయువాడు. కార్యములు సంపూర్ణము చేయువాడు. యెహోవా దేవుడుగా గలిగిన జనులు ధన్యులు. వారు, “నీకంటే నాకు క్షేమాధారము ఏమీ లేదు” అని చెప్పగలుగుతారు. మన ముందు ఉన్న సాక్షిసమూహము కూడా అలాగే చెప్పుచున్నది. మన దేవుడు నిత్యము, తరతరములు మారని దేవుడుగా ఉంటున్నాడు. ఈరోజు మనము కూడా ఆయనను సత్యములో ఆత్మతో స్తుతిద్దాము ఆరాధిద్దాము.

ఆరాధన గీతము

తరతరములు ఉన్నవాడవు
యుగయుగములు ఏలువాడవు
నీవే రాజువు నీవే దేవుడవు

జగాలను ఏలే జయశీలుడవు నీవు
జనసైన్యములను నడిపే విజయశీలుడవు నీవు
ఎన్నితరాలు మారినా ఎన్ని యుగాలు గడిచినా
నీవే నీవే నీవే రారాజువు.
“తరతరములు”

భూమికి నీవే పునాదులు వేసినవాడవు
నీ రాజ్యస్థాపనకై ఈ సృష్టినే కలుగజేసావు
సృష్టికర్తవు నీవే శాంతిదాతవు నీవే
నీవే నీవే నీవే మహరాజువు
“తరతరములు”

 

 

మెయిన్ మెసేజ్

ఏ సత్యమైతే మీరు తెలుసుకుంటారో ఆ సత్యములోనే నిలబడి ఉండాలి. అనుభవము దేవునికి ఇంకా దగ్గరగా మనము చేరడానికి సహాయము చేస్తుంది. ఈరోజు ధ్యానాంశము, “నీవే నా ప్రభువు”.

ఈ మాట మన హృదయములోనుండి రావాలి. ఆయన నాకు ప్రభువై ఉన్నాడు అని అనుభవపూర్వకముగా చెప్పగలగాలి.

యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు.౹ -అపొస్తలుల కార్యములు 10:36

“అందరికీ” అనగా నీకు నాకు కూడా ఆయనే ప్రభువు. ఈ సత్యము ఎప్పుడైతే తెలుసుకొని, అవును ఆయనే నా ప్రభువు అని ప్రకటిస్తావో, అప్పుడు కొన్ని స్థిరపరచబడతాయి. అటువంటి ప్రభువుగా ఉన్న ఆయన ద్వారా, సమాధాన సువార్తను దేవుడు ప్రకటించాడు.

అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలుచేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.౹ -అపొస్తలుల కార్యములు 10:38

ప్రభువుగా ఉన్న యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడ్డాడు. అంటే ఒక ప్రత్యేకత కలిగినవాడుగా ఉన్నాడు. ఆ ప్రత్యేకతను బట్టి, ఆయన ఆయన మేలుచేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇప్పుడు ఆయన నాకు కూడా ప్రభువుగానే ఉన్నాడు. ఆ ప్రభువైన వాడు అభిషేకించబడ్డాడు, అటువంటి ప్రభువును స్వీకరించిన వారి జీవితములో కూడా మేలు జరుగుతుంది. అయితే ఆయన ఏమి చెయ్యగలడని నీవు విశ్వసిస్తున్నావో అదే విధముగా కార్యము స్థిరపరచబడుతుంది.

జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి, ఆ సరస్సు తీరముననున్న రెండుదోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కి– దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత–నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా -లూకా 5:1-4

యేసుక్రీస్తు అభిషేకించబడినవాడుగా, పరిశుద్ధాత్మతో నింపబడినవాడిగా సీమోను పేతురు దోనెలో నిలబడినవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే లోతుకు నడిపించుమని చెప్పినతరువాత.

సీమోను – ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాటచొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. -లూకా 5:5

పేతురుకు లోతుగా వెళ్ళమని చెప్పినప్పుడు యేసయ్య బోధకుడుగా అక్కడ ఉన్నప్పటికీ, పేతురు ఎలా స్వీకరించాడు? బోధకుడుగా స్వీకరించలేదు గానీ, “నా యేలిన వాడా” అని సంబోధించాడు. అనగా ప్రభువుగా స్వీకరించాడు. పేతురు ఎప్పుడైతే యేసయ్యను ప్రభువుగా స్వీకరించి, ఆయన మాట ప్రకారము లోతుగా వెళ్ళాడో, అప్పుడు ఒక అద్భుతము జరిగింది. ఎందుకు అంటే పేతురు వద్ద నిలబడ్డ వ్యక్తి శక్తి కలిగినవాడై ఉన్నాడు. ఆ శక్తి ఏమి చేస్తుంది అంటే, లేనిదానిని ఉన్నట్టుగా చేయగలిగినవాడు, నూతనముగా సృష్టించగలిగిన వాడు. పేతురు ప్రభువుగా స్వీకరించి ఆయన మాట ప్రకారము చేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టాడు.

అలాగే మనము కూడా ఆయనను ప్రభువుగా స్వీకరించి, ఆయన మాట ప్రకారము చేసినప్పుడు, ఆయనకు కలిగిన శక్తిని బట్టి నీకు మేలు చేయువాడిగా నీ జీవితములో సంచరించూ ఉంటాడు. నీవు కష్టతరమైన పరిస్థితులలో ఉన్నప్పటికీ, నీకు మేలు చేయుటకై, ఆయన నీతో సంచరించేవాడుగా ఉన్నాడు. అందుకే ఒక ఆత్మీయ సత్యము మనము దైనందిన జీవితములో పాటించగలిగినది ఏమిటి అంటే, ప్రతీ దినమూ, ఉదయానే నీవే నా ప్రభువు అని ప్రకటించి దినమును ప్రారంభించు. అప్పుడు ఎటువంటి అద్భుతములు జరుగుతాయో చూడండి.

నీ దేవుడు నీ ముందర నడిచే వాడు, నీతో ఉండేవాడు. ఎప్పుడు అంటే? నీ ముందర ప్రభువుగా నడుస్తాడు. నీతో నీవు ప్రభువుగా అంగీకరించేవరకు నీతో నడుస్తాడు. అలాగే ఒక కాపరిని గమనిస్తే, గొర్రెలకు ఆ కాపరే ప్రభువు. ఆ గొర్రెలకు శ్రమ ఏమి వచ్చినా సరే ఆయన శక్తిచేత వాటిని నడిపిస్తాడు. అలాగే మన ప్రభువు కూడా ఎటువంటి పరిస్థితులనైను మనలను మేలు కొరకై నడిపించేవాడు.

ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితోకూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చిమధ్యను నిలిచి–మీకు సమాధానము కలుగును గాక అనెను.౹ తరువాత తోమాను చూచి–నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.౹ అందుకు తోమా ఆయనతో–నా ప్రభువా, నా దేవా అనెను.౹ -యోహాను 20:26-28

ఇక్కడ కూడా తోమా ముందు ప్రభువుగా నిలబడ్డాడు. పేతురు సందర్భములో శ్రమ వచ్చినప్పుడు ప్రభువుగా నిలబడ్డాడు. ఇక్కడ సందర్భములో తోమా ప్రభువుగా ముందు స్వీకరించలేదు. ప్రభువు గాయములలో వేలు పెడితేనే గానీ నేను నమ్మను అని చెప్పాడు. అయినప్పటికీ ప్రభువు విడిచిపెట్టక, మరలా దర్శించి ప్రభువుగా అంగీకరించే విధముగా ప్రత్యక్షపరచుకున్నాడు. అలాగే మనము కూడా ఎటువంటి పరిస్థితులలో నమ్మలేనివాడవుగా ఉంటున్నావో, అటువంటి పరిస్థితులలో తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. నిజానికి ఆయన ప్రత్యక్షపరచుకోవలసిన అవసరము ఏమిటి? తోమా తప్ప మిగతా వారు స్వీకరించారు కదా! అయినప్పటికీ విడిచిపెట్టలేదు. మన జీవితములో కూడా అనేకమైన విషయాలలో ప్రభువుగా ఆయనను అంగీకరించి స్వీకరిస్తున్నాము కానీ కొన్ని విషయాలలో ఆయనను ప్రభువుగా స్వీకరించలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఆయన విడిచిపెట్టక ఆ విషయాలలో కూడా ఆయన ప్రత్యక్షపరచుకునేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కార్యము సంపూర్ణము చేయువాడు. అలాగే తోమా ఎలా అయితే ఎన్నిక చేయబడినవాడో, నీవు నేను కూడా ఎన్నిక చేయబడినవారమే. అందుకే మనము ఎప్పుడు ప్రభువై ఉన్నాడు అనే సత్యము ఎరిగి ప్రకటించి జీవించాలి.

పేతురు కూడా ఏమీ లేని స్థితిలో ప్రభువుగా స్వీకరించి విస్తారమైన ఫలము పొందుకున్నాడు. నీవు నేను కూడా ఆయనను ప్రభువుగా స్వీకరించి విస్తారమైన దీవెనలు పొందుకుందాము.

పన్ను కట్టవలసిన సందర్భములో యేసయ్య పేతురుతో నీకును నాకును చేపనోటిలో సిద్ధపరచబడింది అని చెప్పాడు. అంటే, శరీర సంబంధమైన దానికీ, ఆత్మ సంబంధమైన దానికీ కూడా ఆయన సిద్ధపరచినవాడు అని అర్థము.

ఆయన కానుకపెట్టె యెదుట కూర్చుండి, జనసమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచు చుండెను. ధనవంతులైనవారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి–కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. -మార్కు 12:41-42

అక్కడ యేసయ్య కూర్చున్నాడు. కూర్చున్న వ్యక్తి ప్రభువు అయినవాడు, శక్తి కలిగిన వాడు. అయితే కానుకలు ఇచ్చిన వారి అందరిలో బీద విధవరాలు మాత్రమే ఎక్కువ వేసింది అని చెప్పారు. అక్కడ ప్రభువుగా ఉన్నవాడు ఈ బీద విధవరాలు తన లేమిలో వేసింది అని గ్రహించాడు. నీవు ఏ లేమి స్థితిలో నీవు కానుక వేస్తున్నావో, నీవు ఏమి కలిగిన స్థితిలో వేస్తున్నావో ఆయన ఎరిగినవాడు. అందుకే నీవు కానుక వేసేటప్పుడు, ఆయన ప్రభువు అని ఎరిగి ప్రార్థనాపూర్వకముగా కానుక సమర్పించినపుడు నీకు న్యాయము జరిగించేవాడుగా ఆయన నీ జీవితములో నీ స్థితిని మార్చేవాడుగా నీదేవుడు ఉంటాడు. అందుకే లేమి అయిన, కష్టమైనా ఏ పరిస్థితి అయినా సరే ఆయనే నాకు ప్రభువు అని స్వీకరించి ప్రకటించి జీవిద్దాము.