21-04-2023 – సూపర్ నేచురల్ సర్వీస్ – ఆయన నీకు తోడుగా ఉన్నాడు

స్తోత్రగీతము – 1

ఇది జరుగునని నేననుకొనని భీకరకార్యములు
ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు (2)
చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

సంద్రమే రహదారిగా మారాయే మధురముగా
ఆకాశం ఆహారన్నే కురిపించేదిగా (2)
బండయే నీటిని రప్పించేదిగా (2)
చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

నీటిని ద్రాక్షరసముగా నీటిపైనే నడువగా
గాలి తుఫానే భయముతో నిమ్మళమవ్వగా(2)
మృతులనే సజీవులయి లేచువారిగా(2)
చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

ఇది జరుగునని నేననుకొనని భీకరకార్యములు
ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు (2)
చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

స్తోత్రగీతము – 2

మంచి మంచి మంచి మంచి దేవుడు యేసన్నా

ఆరాధన వర్తమానము

దేవుని యొక్క నియమములు మనము అర్థము చేసుకోవడానికి, ప్రభుత్వాన్ని ఉదాహరణగా తీసుకుందాము. ప్రభుత్వము రాజ్యాగము, న్యాయ విధానము వంటి నియమములను అనుసారముగా నడుస్తుంది. అలాగే దేవుడు కూడా నియమముల ప్రకారముగా తన కార్యము జరిగిస్తాడు.

దేవుడు ఒక మాట పలకగా దాని ప్రకారము ఆయెను. అటువంటి శక్తి గల దేవుడు ఊరకనే మాట పలుకుతాడా? ఆ మాట పలుకుట కొరకు ఖచ్చితముగా ఒక ఉద్దేశ్యము ఉంటుంది కదా? తన చిత్త ప్రకారమైన ఆ ఉద్దేశ్యము జరిగించుట కొరకు ఆయన కార్యములు చేస్తాడు. ఈరోజు కూడా మన అందరినీ తన సన్నిధికి నడిపించాడు. అది వట్టిగానే నడిపించాడా? దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఏమి మాట్లాడతాడు అంటే, నీ జీవితముకొరకైన మాటలే! నీ జీవితములో ఆయన కలిగిన మాట విడుదల చేయుట కొరకు నిన్ను పిలిచాడు. ఆ మాట ప్రకారము నీ జీవితములో జరుగును!

దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు. -కీర్తనలు 75:1
తనకు మొఱ్ఱపెట్టువారికందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. -కీర్తనలు 145:18

ఈ మాట నీ కొరకే దేవుడు చెప్తున్నాడు. నీవు ఏ విషయము కొరకు మొర్రపెట్టినా కూడా, దేవుడు సమీపముగా ఉన్నాడు. అయితే ఎందుకు సమీపముగా ఉంటున్నాడు? నీవు మొర్ర పెట్టిన కార్యము సఫలము చేయటానికి. ఆ వాక్యము ప్రారంభమయిందే కృతజ్ఞతా స్తుతులతో, ఎప్పుడు కృతజ్ఞత చెప్తాము? ఒక కార్యము సఫలము అయినప్పుడే కదా! దీనిని బట్టి మనము ఒక సత్యము అర్థము చేసుకోవచ్చు, “నీవు మొర్రపెట్టినదానిని నెరవేర్చడానికి” ఆయన సమీపముగా ఉన్నాడు. అందుకే “అడుగుడి మీకియ్యబడును”. ఇది సూపర్నేచురల్ సర్వీస్ కాబట్టి మీరు సూపర్నేచురల్ విషయాలకొరకే సిద్ధపడాలి.

నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నాను. -కీర్తనలు 75:2

న్యాయము తీర్చుట అనగా చూద్దాము. మనము దేవుని సన్నిధిలో ఒక విషయము కొరకు మొరపెడుతున్నాము. అది జరగలేదు కాబట్టే ఇంకా మొరబెడుతున్నాము. దేవుడు న్యాయమును బట్టి తీర్పు తీరుస్తున్నాడు అంటే, నీవు మొరపెడుతున్నది ఖచ్చితముగా నెరవేరుతుంది – ఆమెన్!

దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును -కీర్తనలు 75:7

దేవుడు తీర్పు తీర్చువాడు అంటే నీవు ఏమి జరగట్లేదని నీవు మొరపెడుతున్నావో, అది జరిగించునట్లు దేవుడు కార్యము జరిగించువాడు. నీ జీవితములో తగ్గించబడిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన హెచ్చించేవాడు.

రేమా: ఉద్యోగములు చేయువారి జీవితములో హెచ్చించుట కొరకు దేవుడు చిత్తము కలిగి ఉన్నాడు. ఆయనకు మొర్రపెట్టేవారిని ఖచ్చితముగా హెచ్చింపచేస్తాడు. “ప్రభువు సన్నిధిలో నిజముగా మొర్రపెట్టుట” అనేది నియమము. ఆ ప్రకారము చేసిన నీ జీవితము హెచ్చించబడుతుంది.

కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.౹ -ఎఫెసీయులకు 1:8

ఆయన ఏ మాట చెప్తున్నాడో ఆ మాట యొక్క అర్థము తెలియచేయబడుతున్నపుడు, ఆ మాట నెరవేరే యుక్తకాలము, వచ్చింది అని అర్థము. ప్రభువు నిర్ణయించినదానిని నెరవేర్చడానికి నిన్ను దేవుని కృప వెంబడిస్తుంది.

నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురముచేయు దును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. -కీర్తనలు 75:9

“నేనైతే” అంటే ఎవరైతే నేను మొర్రపెట్టినది పొందితిని అని విశ్వసించి స్వీకరించువారు అని అర్థము.

బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను.౹ యూదావారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించునట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సీయోను కుమారులను మీమీదికి రేపుచున్నాను.౹ -జెకర్యా 9:12-13

“బంధకములు” అనగా మొరపెడుతున్నది జరగకుండా ఉన్న స్థితి. అయినప్పటికీ నా దేవుడు నా పక్షాన చేస్తాడు అని మొరపెడుతున్నవారు, ఆయన కోటలో ప్రవేశించండి. ఆయన కోట అనగా దేవుని సన్నిధి. “యూదావారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను” అనగా, నీ జీవితములో జరగవలసిన న్యాయము జరిగించుటకు ఆయన సిద్ధపరుస్తున్నాడు అని అర్థము. ఇంతకుముందు కృంగిపోయావేమో అయితే ఇప్పుడు నీవు పోరాటము కొరకు సిద్ధపరచబడుతున్నావు.

రేమా : కృంగిపోయినవారిని లేవనెత్తడానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు.

“ప్రభువు సన్నిధిలో నిజముగా మొర్రపెట్టుట” అనేది నియమము. ఆ ప్రకారము చేసిన నీ మొర్ర నెరవేరుతుంది, నీవు హెచ్చించబడతావు. ఆమెన్

ఆరాధన గీతము

నిన్నే నమ్మి ఉన్నాను సిగ్గుపడను
నీ సన్నిధిలో నిలచి యున్నా
ఒంటరిగా నేనుండిననూ
సమస్తమును నా కిచ్చువాడవు

ఎల్ ఎలోహిమ్ ఎల్- ఎలోహిమ్
ఎల్ ఎలోహిమ్ నిన్నే స్తుతింతున్

గాయపడిన వేళ కన్నీటిలోనూ
కలతతో ఉన్నా నాకై దిగివచ్చితివి
నిబంధనతో నా చేయి పట్టి
సమస్తమును ఆశీర్వదించెదవు ….ఎల్ ఎలోహిమ్

గాయపడిన వేళ కన్నీటిలోనూ
కలతతో ఉన్నా నాకై దిగివచ్చితివి
నిబంధనతో నా చేయి పట్టి
న్యాయమును నాకు తీర్చెదవు ….ఎల్ ఎలోహిమ్

నిన్నే నమ్మి ఉన్నాను సిగ్గుపడను
నీ సన్నిధిలో నిలచి యున్నా
లేమిలో నేనుండిననూ
సమస్తమును నాకిచ్చెదవు

 

మెయిన్ మెసేజ్

నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును.౹ -యెహోషువ 1:5

మోషేకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు?
యెహోషువకు ఎందుకు తోడై ఉంటాను అంటున్నాడు?
వారికి తోడై ఉన్న దేవుడు నాకూ తోడై ఉన్నాడా?

దేవుడు ఆకర్షించకుండా ఎవరూ ఆయన సన్నిధికి రాలేరు – ఈ సత్యము గ్రహించి జీవించాలి. వచ్చిన వాడు ఆశీర్వదించబడాల్సిందే!

మోషేకు తోడై ఉండటానికి మోషే చేసింది ఏమీ లేదు. అయితే మోషేకు ఆయనే తోడై ఉన్నాడు కారణం ఏమిటి అంటే, ఆయన ఉద్దేశ్యము.

మరియు యెహోవా యిట్లనెను–నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.౹ కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను…కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను.౹ -నిర్గమకాండము 3:7-8,10

ఈ వాక్యముల ప్రకారము దేవుని ఉద్దేశ్యము కొరకై మోషేను ఎన్నిక చేసుకొని, అతనికి తోడై ఉన్నాడు. అందుకే తన ఉద్దేశ్యమును నెరవేర్చడానికి “ఫరో యొద్దకు” పంపెదను అని చెప్పుచున్నాడు. ఫరో ఒక రాజు ఆయన దగ్గర మాటలాడుట ఎంతో భయంకరమైనది. అయినప్పటికీ “నేను నీకు తోడుగా ఉన్నాను” అని ప్రభువు చెప్పుచున్నాడు.

మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. -కీర్తనలు 91:1

“సర్వశక్తుని నీడ”, అసలు నీడ అంటేనే ఒక వ్యక్తి ఉన్న ప్రదేశములో కలుగుతుంది. అంటే, మోషే ఎక్కడకు వెళితే అక్కడ దేవుడు తోడై ఉన్నాడు అని అర్థము. అలాగే నీడ మనము వెలుగులో క్రింద చూసినపుడు కనబడుతుంది. అలాగే దేవుని నీడ ఆయన క్రియల ద్వారా కనబడుతుంది.

దేవుని ఉద్దేశ్యము తెలియచేయబడుట —> ఎన్నిక చేయబడుట —> లోబడుట ద్వారా —> దేవుని తోడు కలిగి ఉండుట –> అవరోధములు తొలగుట —> దేవుని ఉద్దేశ్యము నెరవేరుట

దేవుడు మోషేను ఎర్రసముద్రము దగ్గర కర్ర ఎత్తమన్నప్పుడు ఎందుకు కర్ర ఎత్తగలిగాడు? “అవరోధములను తొలగించగలిగిన దేవుడు నాతో ఉన్నాడు అనే సత్యము ఎరిగి ఉండుటను బట్టియే”.

తరువాత అహరోను, మిర్యాము మిద్యానీయురాలిని పెండ్లి చేసుకున్నందున మోషేకు వ్యతిరేకముగా మారినప్పుడు, “నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు” అనే సాక్ష్యము దేవుడు ఇచ్చుట ద్వారా ఆయ్న మోషేకు తోడై ఉన్నాడు అని నిరూపించబడింది.

పరిస్థితులు అడ్డువచ్చినా, మనుష్యులు అడ్డువచ్చినా దేవుడు తోడై ఉన్నాడు.

మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను–నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము; నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడై యుందును. -ద్వితీయోపదేశకాండము 31:23

ఇప్పుడు యెహోషువను కూడా, దేవుని ఉద్దేశ్యమును బట్టి ఎన్నుకున్నాడు. యెహోషువ చాలా నమ్మకమైనవాడు. మోషే సీనాయి కొండపై 40 దినములు ఉన్నప్పుడు, యెహోషువకూడా కొండ కింద అలాగే కనిపెట్టుకుని ఉన్నాడు. అందుకే పరిచారకునిగా ఉన్న వ్యక్తిని ఎన్నుకోవడానికి కారణము, అతనికి కలిగిన ఆసక్తి, నమ్మకత్వము.

మొదటిగా ఉద్దేశ్యము మోషేకే ఇవ్వబడింది. యెహోషువకు ఆ ఉద్దేశ్యము ఇవ్వబడలేదు కానీ పరిచారకుడిగా ఉన్నాడు. అయితే మోషే ముగించలేని ఉద్దేశ్యమును ముగించడానికి యెహోషువను ఎన్నుకున్నాడు. అందుకే యేహోషువకు కూడా దేవుడే తోడై ఉన్నాడు.

నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.౹ -యిర్మీయా 29:11

ఎవరినైతే దేవుడు ఈరోజు ఆయన సన్నిధికి తీసుకువచ్చి, మీ గూర్చి ఒక ఉద్దేశ్యమును కలిగి ఉన్నాను అని చెప్తున్నాడో, వారి గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేకు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు, ఇప్పుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. అందుకే ఆయన ఉద్దేశ్యమునకు అడ్డుగా ఉన్నది ఏమైనా సరే అది నిలువక తొలగించబడవలసిందే, గనుక భయపడక సంతోషించి గంతులు వేయండి.