07-04-2023 – నీ కొరకు వెల చెల్లించబడింది

స్తోత్ర గీతము 1

ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటే బలమైన ప్రేమది
నన్ను జయించే నీ ప్రేమ (2)
|| ఆశ్చర్యమైన ||

పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే
|| ఆశ్చర్యమైన ||

పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే
|| ఆశ్చర్యమైన ||

శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు
|| ఆశ్చర్యమైన ||

నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే
|| ఆశ్చర్యమైన ||

స్తోత్ర గీతము 2

ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని
ఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా (2)
నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా ||ఎవరు||

తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక – నీ కొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన – నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ – అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా – ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా – యేసయ్యా నీవెగా
||ఎవరు||

ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణం
నీ సన్నిధానమందు – సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే – నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన – నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన – నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా – నిలిచె నా యేసయ్యా
||ఎవరు||

 

స్తోత్ర గీతము 3

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్
తల్లి ప్రేమను మించినది *(లోక)*
నిన్ను నేను ఎన్నడు విడువను
నిత్యము నీతోనే జీవింతున్
సత్య సాక్షిగా జీవింతున్

నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్
ఏక రక్షకుడు యేసే లోక రక్షకుడు యేసే
నీ చిత్తమును చేయుటకై
నీ పోలికగా ఉండుటకై
నా సర్వము నీకే అర్పింతున్
పూర్ణానందముతో నీకే అర్పింతున్

నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్
మేఘ రధములపై రానైయున్నాడు
యేసురాజుగా రానైయున్నాడు
ఆరాధింతును సాష్టాంగపడి
స్వర్గ రాజ్యములో యేసున్
సత్యదైవం యేసున్
*”నిత్య ప్రేమతో”*

ఆరాధన వర్తమానము

ఈ దినము మనము పండుగలా జరుపుకోవలసిన దినము. అయితే ఎందుకు మనము సంబరముగా జరుపుకోవాలి

అని మనము తెలుసుకుంటే ఎంతో సంతోషము. మనము ఆచార యుక్తముగా ప్రభువు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు సంతోషించడు గానీ, నీవు సత్యమును ఎరిగి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషపడతాడు.

లోకములో చూస్తే, ఒక వ్యక్తి మరణించినపుడు దుఃఖపడతారు అయితే మనము మన ప్రభువు మరణించినందుకు మనము సంతోషించేవారుగా ఉన్నాము. ఎందుకు అంటే, ఈ దినము నేను విమోచించబడిన దినము. ఈ విమోచన అనేది నీకు నీవు, నాకు నేను చేసుకోలేనిది. పరలోకమందున్న దేవునికి మనపై ఉన్న ప్రేమ పరిపూర్ణమైన రోజు ఈరోజు.

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.౹ లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.౹ -యోహాను 3:16-17

ఆ కలువరి సిలువలో నీ కొరకు, నా కొరకు యేసు ప్రభువు రక్తము చిందించాడు. పరిశుద్ధమైన రక్తము తప్ప మన పాపములను పోగొట్టగలిగినది ఏమీ లేదు.

ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.౹ -కొలొస్సయులకు 1:19

యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ సిలువలో అర్పించబడుట బట్టి దేవునికి మనకు సంధి జరిగింది.

ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.౹ -రోమా 5:10

దేవుని నిమిత్తము మాత్రమే చేయబడిన మన జీవితాలు అపవాదిని బట్టి దేవునికి శత్రువులుగా మారిన దానిని బట్టి, దేవుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపములను విమోచించినవాడై ఉన్నాడు. యేసుక్రీస్తులో ఏ పాపము లేదు అయినప్పటికీ వధకు తేబడిన గొర్రెపిల్ల వలే ఆయన మౌనముగా ఉన్నారు. ఎందుకు ఆయన మౌనముగా ఉన్నారు అనే సత్యము మనము ఎరిగి ఉండాలి.

–నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు౹ గనుక పిలాతు–నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను.౹ -యోహాను 19:9-10

ఇక్కడ చూస్తే, యేసు క్రీస్తు ప్రభువు సిలువ నుండి తప్పించుకొనుటకు అవకాశము ఉంది. పిలాతు కూడా యేసును తప్పించడానికి మనసు కలిగినవాడై ఉన్నాడు. అయితే అవకాశము ఉన్నప్పటికీ యేసయ్య ఎందుకు మౌనముగా ఉండి సిలువకొరకే సిద్ధపడుతున్నాడు. ఎందుకు? అనే ప్రశ్నకు సమాధానము మనము ఎరిగి ఉండాలి.

అందుకాయన తన శిష్యులవైపు తిరిగి, వారిని చూచి–సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. -మార్కు 8:33

సాతాను మనుష్యుల సంగతులను మాత్రమే ఎరిగినది అయి ఉన్నది అయితే దేవుని సంగతులను యేసు ప్రభువు మాత్రమే ఎరిగినవాడై ఉన్నాడు. దేవుని ఉద్దేశ్యము ఏమిటి అని ఆలోచిస్తే, నీవు నేను విమోచించబడటమే. అందుకే మన జీవితము ఎంతో విలువైనది. మనము విలువ పెట్టి కొనబడినవారము, దేవుని సొత్తు అయినవారము.

మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతోకూడ బ్రదికించెను.౹ -ఎఫెసీయులకు 2:1

యేసయ్య ఆ కలువరి సిలువలో మరణించకపోతే, మన జీవితాలు పాపముచేత చచ్చిన జీవితములు. అయితే మనము బ్రతికించబడటానికి ఆయన రక్తము అనే వెల చెల్లించాడు.

నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది -యెషయా 52:5

పాపము చేత, మరణము చేత నిత్య నరకమునకు ఊరకనే కొనిపోబడిన వారుగా ఉండినవారము. అపవాది మనలను చూసి గర్జించి బాధపరచే పరిస్థితి.

మీరు వాటినిచేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.౹ -ఎఫెసీయులకు 2:2

అయితే అటువంటి స్థితినుండి తప్పించబడటానికి, దేవుడి ప్రణాళిక ఏమిటి అంటే –

మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. -హెబ్రీయులకు 9:22

అందువలన యేసయ్య నీ కొరకు నా కొరకు రక్తము చిందించాడు. తలనుండి అరికాలి వరకు ఆయన రక్తము చిందించాడు. ఒక పొలాన్ని నాగలితో దున్నినట్టు ఆయన శరీరము దున్నబడింది. మన శరీరముతో జరిగించిన పాపములన్నిటినుండీ యేసయ్య శరీరము చిందించిన రక్తము ద్వారా విమోచించబడ్డాము. పూర్వపు రోజులలో బానిసలను కొనుక్కొనేవారు. వారి వారి సామర్థ్యము బట్టి వారికి వెల చెల్లించి కొనుక్కునేవారు. అలాగే మనము చేసిన పాపమును బట్టి ఎంత వెల చెల్లిస్తే మనము విమోచించబడతామో, అంత వెల చెల్లించి యేసయ్య నిన్ను నన్ను విమోచించాడు. మన తలంపులను బట్టి తలకు ముళ్ళకిరీటం, మనము చేతులద్వారా చేసిన పాపములను బట్టి చేతులకు మేకులు, మనము కాళ్ళతో చేసిన పాపములను బట్టి కాళ్ళకు మేకులు, మన శరీరముద్వారా జరిగించిన పాపములను బట్టి తన శరీరమంతా కొరడాలతో కొట్టబడింది, ఇలా శరీరమంతా రక్తము చిందించి మనలను విమోచించాడు.

శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,౹ విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,౹ భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.౹ -గలతీయులకు 5:19-21

ఇలా మన శరీరముతో జరిగించిన కార్యములన్నిటిని బట్టి, ఆయన రక్తము చిందించి మనలను విమోచించాడు. ఆయ్న ఎంత వెల చెల్లించాడో తెలిస్తే మనము ఎంత పాపులమో మనకు అర్థమవుతుంది. ఆయన రక్తము సంపూర్ణముగా ధారపోస్తేనే గానీ నీ నా పాపమునుండి విమోచించబడలేని పరిస్థితి లో ఉన్నాము. అంత ఘోరమైన పాపము కూడగట్టుకొనినవారము మనము.

పిలాతు–మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా౹ -యోహాను 18:31

మనము చేసిన పాపములను బట్టి ధర్మశాస్త్రము ప్రకారము తీర్చబడవలసిన తీర్పు యేసయ్య అనుభవించి మనలను విడిపించాడు. మనము అనుభవించవలసిన ఘోరమరణము ఆ యేసయ్య అనుభవించాడు.

లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. -యెషయా 53:2

యేసు క్రీస్తు సిలువ కార్యమును సినిమాలో చూపించిన హీరో, నటించినప్పుడు ఆయన శ్రమను గ్రహించి ప్రభువును అంగీకరించినవాడుగా ఉన్నాడు. నీవు కూడా ఆయన శ్రమను గ్రహించినప్పుడు, ఆయనకొరకు నిన్ను నీవు ఉపేక్షించుకోగలుగుతావు. ఒక బానిసను కొనుక్కున్నప్పుడు ఒక ఉద్దేశ్యము కలిగి కొనుక్కుంటారు. అయితే నిన్ను నన్ను అమూల్యమైన రక్తము అనే వెల చెల్లించి కొనుక్కొనుట యొక్క ఉద్దేశ్యము ఏమిటి? “నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు” అని వాక్యము చెప్తుంది అంటే, మనము ఆయన నిమిత్తము, ఆయన మహిమ నిమిత్తము విమోచించబడ్డాము.

నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది -యెషయా 52:5

మన్ము చేసిన పాపము బట్టి, దేవుని నామము దూషించబడుతుంది, అవమానపరచబడుతుంది. అయితే ఇప్పుడు మనము విమోచించబడిన దానిని బట్టి మన జీవితములో ఇంక ఆయన మహిమ మాత్రమే ప్రచురింపబడాలి.

ఆరాధన గీతము

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్
తల్లి ప్రేమను మించినది *(లోక)*
నిన్ను నేను ఎన్నడు విడువను
నిత్యము నీతోనే జీవింతున్
సత్య సాక్షిగా జీవింతున్

నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్
ఏక రక్షకుడు యేసే లోక రక్షకుడు యేసే
నీ చిత్తమును చేయుటకై
నీ పోలికగా ఉండుటకై
నా సర్వము నీకే అర్పింతున్
పూర్ణానందముతో నీకే అర్పింతున్

నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్
మేఘ రధములపై రానైయున్నాడు
యేసురాజుగా రానైయున్నాడు
ఆరాధింతును సాష్టాంగపడి
స్వర్గ రాజ్యములో యేసున్
సత్యదైవం యేసున్
*”నిత్య ప్రేమతో”*

గొర్రెపిల్ల రక్తములో
కడుగబడినవారే పరిశుద్ధులు (2)
పరిశుద్ధుడా యేసయ్యా..
నను శుద్ధి చేయుమయా (2)
నను శుద్ధి చేయుమయా
||గొర్రెపిల్ల||

ఆకాశము ఈ భూమియు
గతియించినా గతియించవు నీ మాటలు (2)
శాశ్వతమైనది నీ రాజ్యము (2)
ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా
||గొర్రెపిల్ల||

వేవేల దూతలు అనునిత్యము
కొనియాడుచున్న ఆ పరలోకము నీ సింహాసనం (2)
పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము (2)
ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా
||గొర్రెపిల్ల||

నా జీవిత భాగస్వామి – నా ప్రియ యేసు స్వామి
నా జీవిత భాగస్వామి – ప్రియ వరుడా యేసు స్వామి
యేసయ్యా నా స్తుతి పాత్రుడా – యేసయ్యా నా ఘననీయుడా
యేసయ్యా నా మహనీయుడా – యేసయ్యా నా ఆరాధ్యుడా (2)

అరచేతిలో చెక్కావు – నీ శ్వాసతో నింపావు
జీవాత్మగ నను చేసి సృష్టించావు (2)
ప్రతిగా నీకేమివ్వగలనేసయ్యా
నా సమస్తముతో ఆరాధింతును (2)
||యేసయ్యా||

అమితముగా ప్రేమించి – ప్రాణమునే అర్పించి
నీ వధువుగా నన్ను స్వీకరించావు (2)
నీ ఋణమెలా తీర్చగలనేసయ్యా
నా జీవితముతో ఆరాధింతును (2)
||యేసయ్యా||

సిలువ ధ్యానము

కలువరి సిలువలో ప్రభువు పలికిన 7 మాటలలో, మొదటి మూడు మాటలు నీ జీవితాన్ని గూర్చి, మాదిరికరమైన మాటలుగా ఆయన పలికాడు. అలాగే చివరి మూడు మాటలు ప్రత్యక్షముగా మార్చబడుటకు పలికిన మాటలు. అయితె నాల్గవ మాట మాదిరి నుండి ప్రత్యక్షముగా మార్చబడే మాట.

మొదటి మూడు మాటలు చూస్తే,

తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను – లూకా 23:34 – మొదటి మాట.

యేసయ్య జీవించిన దినములలో శిష్యులకు ఒక విషయము నేర్పించినవాడుగా ఉన్నాడు. పరలోక ప్రార్థనద్వారా క్షమాపణ నేర్పించాడు.

మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. -మత్తయి 6:12

ఇప్పుడు కలువరి సిలువలో ఆయన నేర్పిన విషయము నెరవేర్చాడు. క్షమాపణ అనేది దేవుని ఉద్దేశ్యము అయిఉన్నది. క్షమాపణ అనే కాదు కానీ, అన్ని విషయాలలో మాదిరికరముగా మనము జీవించాలి. మనము ఏమి విషయాలైతే మనము చెప్పుచున్నామో వాటినే మనము ఆచరించేవారుగా ఉండాలి. మనము చెప్పే మాటలు మనము జీవించే విధానము ఒకేలా ఉండాలి. మన క్రియలు మన హృదయాన్ని తెలియచేస్తాయి. ఇంతకుముందు శరీర కార్యములు కనపరచబడ్డాయి అయితే ఇప్పుడు ఆత్మ కార్యములు కనపరచబడాలి. మన నడకలో, మాటలలో, పడకలో ప్రతీ విషయములో ఈ మాదిరి కనపరచాలి. మనము విడుదల పొందాము, విమోచించబడ్డాము అనేది సత్యము. యేసయ్యను అంగీకరించిన తరువాత మనలో నివాసముండి మన జీవితాలను నడిపించేది ఆయనే అనేది సత్యము. అందుకే ఆ సత్యములో నిలబడితే చాలు, ఆయన శక్తిచేత మనలను నడిపిస్తాడు. ఇంతకు ముందు పాపపు ఆలోచనలచేత పట్టబడ్డాము. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు ఆలోచన కర్తగా దేవుడే నీకు ఆలోచనలు దయచేయుచున్నప్పుడు పాపపు ఆలోచనలను జయించగలుగుతావు.

ఒకవేళ పాపపు ఆలోచనలు వెంటాడుతుంటే, “యేసయ్య రక్తమును, సిలువ శ్రమలను” జ్ఞాపకము చేసుకోవాలి. రక్తము కారుతున్న యేసయ్యను ఎదురుగా పెట్టుకుని ఆయనను అంగీకరించిన మనము ఎలా పాపము చేయగలము? గతించిన ఓటమి దినాలే చాలు, ఇక మిగిలిన జీవితము ప్రభువు మహిమ కొరకే! ఆమేన్!

నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను – లూకా 23:43 – రెండవ మాట

ఈ రెండవ మాట కూడా మాదిరిని సూచించే మాట. యేసయ్య సువార్త ప్రకటించినప్పుడు, “మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యము సమీపిస్తుంది అని చెప్పారు”. సిలువలో కూడా ఇద్దరు దొంగలు వారి స్వభావమును బయటపెట్టినప్పుడు, నిజమైన మారుమనస్సు పొందిన వానికి ఆ పరలోక రాజ్యము దయచేసాడు.

వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు–నీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడ రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించి–నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి–యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. అందుకాయన వానితో–నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. -లూకా 23:39-43

ఏ స్వభావము కలవారు దేవునిచేత అంగీకరించబడేవారు? రెండవ దొంగ, తన జీవితము గూర్చిన సత్యము ఒప్పుకుంటున్నాడు. యేసయ్య ఏ పాపము ఎరుగని వాడు అనే సంగతి కూడా ఒప్పుకుంటున్నాడు. మనము కూడా ఒప్పుకోలు స్వభావము కలిగివుండాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్థిల్లడు. దానిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు ఆశీర్వదిచబడేవాడుగా ఉంటాడు. హృదయ రహస్యములను ఎరిగిన వాడు మన దేవుడు. అయితే మనము ఒప్పుకున్నప్పుడు క్షమించేవాడుగా మన దేవుడు ఉన్నాడు. ఏమి ఒప్పుకోవాలి అంటే, ఇంక నుండి యేసయ్యే మన ప్రభువు అని ఒప్పుకోవాలి.

యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి–అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను,౹ -యోహాను 19:26 – మూడవ మాట.

ఈ మాట కూడా మాదిరికరముగా ఉండవలసిన సందర్భము గూర్చి మాట్లాడే మాట. యేసయ్యను సిలువ వేసినప్పుడు యోహాను తప్ప మిగతా అందరూ దూరముగా వెళ్ళిపోయారు. అయితే మరణము గురించి భయపడకుండా యేసయ్య దగ్గరగానే నిలబడి ఉన్నాడు. మరియ యేసయ్యకు జన్మనిచ్చినది కాబట్టి, తన తల్లి బాధ్యతను యోహానుకు అప్పగించాడు. జన్మనిచ్చిన వారి బాధ్యత ఖచ్చితముగా స్వీకరించాలి. మన జీవితము తిరిగి జన్మించిన జీవితము. మనము నూతన సృష్టిగా చేయబడ్డాము. మనము బాధ్యత కలిగి ఆత్మీయ జీవితము యొక్క బాధ్యత స్వీకరించాలి. యోహానును గమనిస్తే “తాను ప్రేమించిన యోహాను” అని వ్రాయబడింది. ఎవరిని దేవుడు ప్రేమిస్తాడు? ఆయన ఆజ్ఞలను పాటించేవారిని. గనుక, ఆత్మీయ జీవితమును బాధ్యత కలిగి ఎలా జీవించాలి అంటే, ఆయన ఆజ్ఞలను పాటించుటద్వారా! అలాగే ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారికి మాత్రమే బాధ్యత ఇవ్వబడుతుంది.

నీ స్వభావము, నీ మాటలు, నీ ఆత్మీయ జీవితము యేసు పలికిన మూడు మాటల సారాంశము.

ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసుఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము – మత్తయి 27:46. – నాల్గవ మాట.

ఈ మాటలు లోకమునకు అర్థము కాలేదు. అందుకే వారు, తనను తాను రక్షించుకోలేని వాడు మమ్మల్ని ఎలా రక్షిస్తాడు అని ప్రశ్నవేస్తున్నారు. ఈ నాల్గవ మాటలో దేవుని కార్యము జరుగుతుంది.

మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. -కొలొస్సయులకు 2:13

పిలాతు మాటలలో “ధర్మశాస్త్రము ప్రకారము” తీర్పు తీర్చాలి. ధర్మశాస్త్రము లో చెప్పబడిన మాటలకు వ్యతిరేకముగా చేసినప్పుడు పాపిగా తీర్చబడతాము. పాపము వలన వచ్చు జీతము మరణము. మనము అనుభవించవలసిన ఘోరమరణము మన పాపము బట్టి నలగగొట్టబడవలసిన మన శరీరము, యేసయ్య త్యాగమును బట్టి తప్పించబడ్డాయి. అందుకె, “పాపమెరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు”. నీవు నేను చేసిన పాపము ఆయనపైన మోపబడింది. మన జీవితములలో కూడా గమనిస్తే, మనము పాపము చేసినప్పుడు ప్రభువు మనలో ఉండలేడు, గానీ మనతో ఉండి మనలను తిరిగి సమకూర్చుటకు ప్రయాసపడతాడు.

యేసయ్య సిలువలో మన పాపభారము మోయగానే, దేవాలయము యొక్క అడ్డుతెర చిరిగిపోయింది. దాని అర్థము, దేవునికి మనుష్యునికీ మధ్య దూరము తీసివేయబడింది. ఈ నాల్గవ మాట ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ నాల్గవ మాటలోనే నీ నా నూతన జీవితము ప్రారంభమయింది.

అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.౹ -1 పేతురు 2:9

నాల్గవ మాట పలకక మునుపు, మనము చీకటిలో ఉన్నవారము. ఎప్పుడైతే ఆయన ఆ నాల్గవమాట పలికారో, అప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డాము. ఇకనుండి మనకు ఇవ్వబడిన బాధ్యత అంతా దేవుని గుణాతిశయములను ప్రచురించుటకే! ఇప్పుడు మనము ఏమై ఉన్నామో అని గమనిస్తే, “ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలు”. నిత్యము చిగురించే వంశములోనికి మనము పిలువబడ్డాము.

మనుష్యుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలన జీవిస్తాడు. మరొకలా చూస్తే, మనుష్యుడు తాను కలిగిఉన్న దానిని బట్టి కాదుగానీ, దేవుని నోటనుండి వచ్చే ప్రతి మాట ద్వారా తన పరిస్థితి ఫలింపులో స్థిరపరచబడుతుంది.

అలాగే మనము ఆయన సొత్తుగా చేయబడ్డాము. నిన్ను, నన్ను ముట్టినవాడు దేవుని కనుగుడ్డును ముట్టినవాడు అని దేవుడు చెప్పుచున్నాడు. దేవుని ముట్టగలిగిన వాడు ఎవడున్నాడు? నీ, నా ఆధిక్యత ఏమిటి అనే సత్యము ఎరిగితే దానిని నిజముగా అనుభవించగలుగుతాము.

అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు–నేను దప్పిగొనుచున్నాననెను.౹ -యోహాను 19:28 – ఐదవమాట

లేఖనములో ఏమి వ్రాయబడింది అంటే, దేవుని చిత్తము. అనగా దేవుని చిత్తము నెరవేర్చాలి అనే ఆశ మనము కలిగి జీవించాలి.

ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.౹ -యోహాను 6:39

అనగా దేవుని చిత్తము నా జీవితములో ఏమై ఉన్నదో అది నెరవేర్చబడాలి అనే ఆశ మనము కలిగి ఉండాలి. “దప్పిక” అనేది “ఆశ” గా మనము చూడవచ్చు. ఆత్మీయ జీవితములో “ఫరవాలేదు” అనే ధోరణి ఉండకూడదు. ఆసక్తి కలిగి ఆయన చిత్తమును నెరవేర్చాలి అనే ఆశ మనము కలిగి ఉండాలి.

కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును. -యోహాను 6:40

దేవుని చిత్తము మీ, నా జీవితములో తప్పకుండా నెరవేర్చబడాలి. ఆయన చిత్తమే మన జీవితములో జరుగును గాక.

యేసు ఆ చిరక పుచ్చుకొనిసమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను – యోహాను 19:30

ఈ మాట ద్వారా మనము ప్రత్యక్షముగా ఏమి నేర్చుకోవచ్చు అని చూస్తే, ఆయనకు అప్పగించిన పని ఆయన సంపూర్ణముగా నెరవేర్చాడు. అలాగే మనకు ఏమి పని ఇవ్వబడింది? ఆయన మహిమకొరకు మాత్రమే జీవించుట అనే పని. ఈ పనిని మనము సంపూర్ణముగా నెరవేర్చాలి.

మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.౹ -2 తిమోతికి 4:7

చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని.౹ -యోహాను 17:4

యేసయ్య మరియు పౌలు కూడా మనము ఏమి చెయ్యాలి అనే విషయములో మాదిరి మనకు చూపించారు. దేవునికి మహిమ కరముగా నిలబడకుండా మనము అప్పగింపబడిన పనిలో ఎదో చేస్తాము అంటే అది సరికాదు. అందుకే మన క్యారెక్టర్ ఎంతో ప్రాముఖ్యమైనది. యేసయ్య చెప్పిన ఉపమానములో చూస్తే, ఆయన ఇచ్చిన తలాంతులు ఉపయోగించి అభివృద్ధి చేసిన వారికే బహుమానము, మరిన్ని తలాంతులు, బాధ్యతలు ఇవ్వబడ్డాయి. అందుకే మన సాక్ష్యము కూడ యేసయ్యవలే, పౌలు వలే దేవుని చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చే ఆశ కలిగి ఉండాలి.

కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.౹ -రోమా 8:1

“కాబట్టి” అంటే దేనిని బట్టి అని ఆలోచిస్తే, యేసయ్య కలువరి సిలువలో సమాప్తము చేసిన విషయమును బట్టి.


నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. -యెషయా 53:4-5

యేసయ్యకు ఇచ్చిన ఒక పని, మనపై ఉన్న “తీర్పు” ముగించుట. అలాగే ఆయన పొందిన దెబ్బల చేత మనకు “స్వస్థత” కలుగుతుంది. ఇది ఆత్మీయముగానైనా లేక శరీరము ప్రకారముగా అయినా సరే! నీతిమంతుడు ఏడుమారులు పడిననూ తిరిగి లేస్తాడు ఎందుకంటే, అతడు తిరిగి లేచునట్టు శిక్షావిధి ఆ సిలువలో యేసయ్య సమాప్తము చేసాడు. అలాగే శరీరము విషయములో స్వస్థత గురించి కూడా ఈ మాటలు వర్తిస్తాయి.

క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.౹ -హెబ్రీయులకు 12:24

హేబేలు అన్యాయముగా చంపబడ్డాడు అతని రక్తము మాట్లాడుతుంది. అయితే కలువరి సిలువలో యేసు కార్చిన రక్తము కూడా పలుకుతుంది ఏమని అంటే, “ఇతడు విమోచించబడ్డాడు” అని నీ గురించి, నా గురించి పలుకుతుంది. దానిని బట్టి, దేవుని కనికరము మనపై ఉంటుంది. దేవుని కనికరము మన జీవితములో సమస్త కార్యములపై ఉన్నది. ఆలాగే దేవుని కృప మనమీద కురియునట్లు ఆ రక్తము పలుకుతుంది. మరిశ్రేష్ఠమైన ఆశీర్వాదములు కలుగునట్లు ఆయన తనకు ఇచ్చిన పనిని సమాప్తము చేసెను.

అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి–తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను – లూకా 23:46

అనగా తన ఆత్మను తండ్రికి అప్పగించుచున్నాడు. మనము కూడా తండ్రి వద్దకే వెళ్ళు లాగున మన జీవితములను సరిచేసుకోవాలి. పరిశుద్ధముగా జీవించి పరలోకమును చేరుకొనులాగున మన జీవితమునకు మనమే బాధ్యత వహించాలి.

యేసయ్య మాటలు జీవమును సమాధానమును అయిఉన్నవి.