26-02-2023 ఆదివారం రెండవ ఆరాధన – మీరు దేవుని వారసులై ఉన్నారు

నాదు రక్షక నీ మనసే ఉత్తమం

నాదు రక్షక నీ మనసే ఉత్తమం
దినదినము నీతోనే వసియింతును
నేనేది పలికినను ఏమి చేసినను
నీ ప్రేమనే కనుపరుతును
నీ శక్తినే కొనియాడేదను

నా హృదిలో నీ వాక్యము నివసింపని
ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును
లోకము నను విడచిన నీవు విడువలేదు
నాకు జయము జయము నీ శక్తితోనే

నా తండ్రి నా విభుడా పాలించుమా
ఆదరణ నా హ్రుదిలోనా నింపుమయా
మనుజులు నను మరిచిన నీవు మరువలేదు
నాకు జయము జయము నీ ప్రేమతోనే

రాజుల రాజుల రాజు

రాజుల రాజుల రాజు
సీయోను రారాజు (2)
సీయోను రారాజు నా యేసు
పైనున్న యెరూషలేము నా గృహము (2)

తల్లి గర్భము నుండి వేరు చేసి
తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)
సీయోను కొరకే నన్ను ఏర్పరచిన
సీయోను రారాజు నా యేసు (2)|| రాజుల ||

నిషేధించబడిన రాయి
సీయోనులో మూల రాయి (2)
ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన
సీయోను రారాజు నా యేసు (2)|| రాజుల ||

మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా 

మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా (2)
న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన (2)
ధనవంతులను అణచేవాడవు
జ్ఞానులను సిగ్గుపరచువాడవు (2)
దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు (2)
యుద్ధవీరుడా శూరుడా
లోకాన్ని గెలిచిన యేసయ్యా (2)

మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు
నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు ||దరిద్రులను||

గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావు
నోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు ||దరిద్రులను||

ఆరాధన వర్తమానం

మనము కేవలము దేవునిని బట్టియే దీవించబడతాము గానీ, మనకు మనము దీవించబడము. అందుకే ఆయన సన్నిధిలో ఉన్న మనము, దీవించబడినవారము. యేసయ్యను స్వీకరించిన ప్రతీ ఒక్కరూ ఆశీర్వదించబడినవారే. అందుకే “నేడే నీ దీవెన దినము” అని వాక్యము సెలవిస్తుంది. సమయాన్ని పొనివ్వక సద్వినియోగము చేసుకోవాల్సిన బాధ్యత మనదే! ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుంటారో వారి మధ్య నేనుంటాను అని ఆయన వాక్యము ద్వారా సెలవిచ్చారు కదా!

నీవు ఏమి నమ్మి దేవుని సన్నిధికి వచ్చావో అది దాని సమయములో ప్రత్యక్షపరచబడుతుంది గనుక, నెగటివ్ ఆలోచన రానివ్వవద్దు. శుక్రవారము సూపర్ నేచురల్ సర్వీస్ లో, యాయీరు కుమార్తె చనిపోయింది అని మనుష్యులు చెప్పారు. యేసుక్రీస్తేమో, నిద్రపోతుంది అని చెప్పారు. అయితే చనిపోకముందు ఆమె అనారోగ్యముతోనే ఉంది. అయితే ఆమె అనారోగ్యముతో ఉన్న సమయములో యేసయ్య బాగుచేయగలడు అనే సత్యాన్ని నమ్మి ఆ సత్యము మీదనే నిలబడి, యేసయ్య మాట నమ్మాడు. అదేవిధముగా నీ జీవితములో కూడా నీవు ఏమి నమ్మి నిలబడుతున్నావో అదే స్థిరపరచబడుతుంది.

మన విశ్వాసానికి ఆధారమైనవి రెండు, ఒకటి మృతమైనది కూడా సజీవముగా చేయగలవాడు నీ దేవుడు. రెండవది, లేనిదానిని కూడా ఉన్నట్టుగా చేయగలవాడు నీ దేవుడు. ఈ సత్యము మీదనే అబ్రహాము నిలబడ్డాడు.

యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతోషించుదురు గాక సీయోను జనులు తమ రాజునుబట్టిఆనందించుదురు గాక. కీర్తన 149:1-2

“ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతోషించుదురు గాక” ఈ మాట నీవు నమ్మితే, నీ పరిస్థితి ఏమైనా సరే, నీవు దేవునిని స్తుతించేవాడివిగా ఉంటావు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొంతవరకే నీకు చెయ్యగలరు. అయితే నిన్ను సృష్టించినవాడు ఏమై ఉన్నాడు?

నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు – యెషయా 54:5

నిన్ను సృష్టించినవాడు నీకొక్కడికే కాదు గానీ సర్వలోకమునకు దేవుడై ఉన్నాడు. ఉదాహరణకు మంచి ఆరోగ్యమును కలిగి ఉన్నవాడిని, అనారోగ్యముతో ఉన్నవాడిని కూడా సృష్టించింది ఒకే దేవుడు. వాడికి ఆరోగ్యము కలుగజేసినవాడు అనారోగ్యమును బాగుచేయగలడు కదా!

నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశకాండము 7:6

“స్వకీయ జనముగా” ఏర్పరుచుకొనుట అనే దానికి ఒక ఉదాహరణ. విందు భోజనాలు జరిగే సమయములో వడ్డించేవాడికి తెలిసినవాడు పంక్తిలో ఉంటే ఖచ్చితముగా ఎక్కువ పడుతుంది కదా! అలాగే నిన్ను కూడా తనకు స్వకీయ జనముగా చేసికొన్న ఆయనే నిన్ను సమృద్ధిగా పోషించేవాడు. మిగతావారికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అంటే నీలో ఉన్నది ఏమిటి? ఇతరులలో లేనిది ఏమిటి? ఈ సత్యము నీవు గ్రహించాలి. ఏమి అర్హత లేకపోయినా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఏమి ఇవ్వగలము? ఆయన ప్రేమకు సరిపోల్చగలిగినది ఏది ఉంది? అయితే ఆయన కోరుకోనేది ఒకేఒకటి – “నీ హృదయము”. అందుకే విస్తారముగా ప్రేమించిన ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. అయితే నీవు ఎలా విస్తారముగా ప్రేమించగలవు? నీ మనసారా, హృదయమారా నీవు ఆరాధించుటయే. దేవుని ఆశీర్వాదాలు కొంచెముగా కాదు కానీ అవి కుమ్మరించబడేవి.

“ఈరోజు నీవు చేసే ఆరాధన రేపటి నీ భవిష్యత్తును స్థిరపరస్తుంది” – దీనిని ప్రయత్నించి అనుభవించండి. మనము వెంబడించేది అసత్యము కాదు, “సత్యము”. ఈరోజు నీకు తెలియచేసిన సత్యము. నిన్ను సృష్టించిన నీ దేవుడు, నిన్ను తన స్వంతజనముగా చేసుకున్నాడు, నిన్ను పోషించేవాడు, నీకు విమోచకుడుగా ఉన్నాడు. నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు.

ఆరాధన గీతము

తండ్రీ దేవా… తండ్రీ దేవా…
నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు (2)

నా ప్రియుడా నా ప్రాణమా – నిన్నారాధించెదన్
నా జీవమా నా స్నేహమా – నిన్నారాధించెదన్ (2) ||తండ్రీ||

నీ ప్రేమ వర్ణించుట – నా వల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట – నా బ్రతుకు చాలదయ్యా (2)
తండ్రీ దేవా… నా ఆనందమా…
నీ ఒడిలో నాకు సుఖము (2)

నా ప్రాణ స్నేహితుడా – నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్నా – నీ ప్రేమ మధురమయ్యా (2)
తండ్రీ దేవా… నా ఆనందమా…
నీ ఒడిలో నాకు సుఖము (2)

Main message| మెయిన్ మెసేజ్

మనకు క్షేమకరమైన మార్గాల కొరకు నానా రకాల ప్రయత్నాలు చేస్తాము. లోకము అటువెళ్ళు ఇటువెళ్ళు అని పరిగెట్టిస్తుంది. అయితే నీ ప్రభువు “నా వద్దకు రా, నీకు విశ్రాంతిని ఇస్తాను” అని చెప్తున్నాడు. మీరు ఒప్పుకున్నది నీ దేవుడు స్థిరపరుస్తాడు. “నా తండ్రీ, నా దేవా! నీ ఒడిలోనే నాకు సుఖము” అని ఒప్పుకున్నావుకదా! ఆయన ఒడిలో నీకొరకు సిద్ధపరచబడినది స్థిరపరచబడుతుంది.

ఈరోజు మన ధ్యానము, “మీరు దేవుని వారసులై ఉన్నారు”. దేవుని వాక్యము పరలోకమును తెరిచే తాళపుచెవిగా ఉంది. పరలోకము తెరువబడింది అంటే, నీవు నిలబడిన వాక్యము నెరవేరబడుటకు పరలోకమునుండి మహిమ వెడలుతుంది. ప్రభువు ప్రత్యక్షత దినదినము నూతనముగా మన జీవితములలో కనుపరచబడుతుంది. యేసుప్రభువు చెప్పిన మాటలు పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా విన్నారు, అయితే స్వీకరించలేదు. అయితే సామాన్య ప్రజలు ఆయన మాట విని స్వీకరించి, ఆశీర్వదించబడ్డారు.

మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు – గలతీ 3:29

అనగా విశ్వాసము ఉంచిన ప్రతీవారు కుమారులుగా చేయబడ్డారు. దానిని బట్టి వారు వారసులుగా చేయబడ్డారు. వారసత్వము అనగా తండ్రి కలిగియున్నదానిని అనుభవించటానికి అర్హత కలిగినవారు. ఈరోజు మనమందరము దేవుని పిల్లలమే అయితే దేవుడు కలిగియున్న సమస్తములో ఎంతవరకు మనము అనుభవించగలుగుతున్నాము?

మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయైయున్నను బాలుడైయున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు – గలతీ 4:1

బాలుడుగా ఉన్నంతకాలము తండ్రి యొక్క స్వాస్థ్యమును అధికారముతో అనుభవించలేని స్థితిలో ఉంటాడు. మనము ఆత్మీయముగా చూస్తే, మనము కూడా దేవుని కుమారులుగా వారసులమే అయినప్పటికీ, మన ఆత్మీయ స్థితి ఇంకా బాల్య దశలోనే ఉంటుంది గనుక. ఈరోజు మనము ఎలా వృద్ధి కలుగచేయబడి మనము తండ్రి స్వాస్థ్యమును సూపర్నేచురల్ ను అనుభవించగలము.

యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును – మలాకీ 4:5-6

ఇది బాప్తీస్మము ఇచ్చు యోహాను గూర్చిన మాటలు. ఇదే మాట లూకాలో చూస్తే,

మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనంద మును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను – లూకా 1:17

మన శరీరము దేని కొరకు చేయబడింది? ఆత్మ నివసించడానికి చేయబడింది. ఏలియా ఆత్మ నివసించడానికి, బాప్తీస్మమిచ్చు యోహాను శరీరము సిద్ధపరచబడింది.

అయినను ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమ కిష్టము వచ్చినట్టు అతని యెడల చేసిరి. మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహా నునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. – మత్తయి 17:12,13.

ఇక్కడ చూస్తే, ఏలియా వచ్చాడు అని యూదా ప్రజలు గుర్తించలేదు. ఏలియా ఆత్మ యోహానులో ఉంది అని ఎలా గుర్తించగలము? ఏలియా తాను బ్రతికి ఉన్నంత కాలము మారుమనస్సు గూర్చి ప్రకటించారు.

ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుస రించుడి,బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రక టన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి – 1 రాజులు 18:21

అలాగే వీరి రూపురేఖలు చూస్తే, “అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనినవాడని ప్రత్యుత్తరమియ్యగాఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలీయా అని అతడు చెప్పెను – 2 రాజులు 1:8”. యోహాను ఎలా ఉన్నాడు? “ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము – మత్తయి 3:4”.

ఏలియా ఆహాబు రాజును ఎదిరించాడు, యోహాను హేరోదు రాజును ఎదిరించాడు. ఏలియా యెజెబెలు చేత శ్రమ పరచబడ్డాడు, యోహాను కూడా హేరోదియ చేత శ్రమపరచబడినాడు.

ఇవన్నీ “మహా దినముల రాక” కొరకైన గురుతులు. అవి గ్రహించి ఉన్నట్టయితే, ఆ ప్రజలు యోహానును ఏలియా గా స్వీకరించి ఆ దినములకొరకు సిద్ధపడేవారు.

“మరియు మీరు కుమారులై యున్నందుననాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను – గలతీ 4:6”.

ఏలియా ఆత్మ బాప్తీస్మమిచ్చు యోహానులో ఉన్నప్పుడు యోహాను జీవితములో ఏలియా తాలూకు గుర్తులు కనబడుతున్నాయి. మనలో క్రీస్తు ఆత్మ ఉంది అంటే, మనలో కూడా ఆ తాలూకు గుర్తులు కనబడాలి కదా! యోహానులోని ఏలియా ఆత్మను ప్రజలు గుర్తించలేదు గనుక వారు సిద్ధపడలేదు. మనలో ఉన్నది యేసు ఆత్మ అని గ్రహించలేదు కనుక దేవుని వారసత్వమును అనుభవించలేకపోతున్నాము. అందుకే ఇంకా మనము బాల్య దశలో ఉన్నాము అని అర్థము అవుతుంది. అయితే ఎప్పుడైతే ఈ సత్యము గ్రహించావో, నీలో ఉన్న క్రీస్తు ఆత్మలో నీవు ఎదగడానికి ప్రయత్నించాలి. ఎలా అంటే, క్రీస్తువలే ప్రవర్తించడము ప్రారంభించుట చేతనే. అప్పుడు నీవు బాల్య దశదాటి వృద్ధిపొందుతావు.

సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారు డెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశిం చునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. – మత్తయి 11:27

యేసయ్య ఎప్పుడూ కూడా నేను తండ్రి ఏకమై ఉన్నామనే చెప్పేవాడు. యేసయ్యను చూస్తే తండ్రి చిత్తము నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పేవారు. అలాగే యేసయ్య ఆత్మను కలిగి ఉన్న మనము కూడా తండ్రి చిత్తమును నెరవేర్చడానికే ప్రయాసపడాలి. “నేనునూ తండ్రియు ఏకమై ఉన్నామని మీరు నమ్ముటలేదా, అయితే ఈ క్రియలను బట్టి అయినా నమ్ముడి” అని యేసు చెప్పాడు, అంతే మన క్రియలద్వారా మనము తండ్రితో ఏకమై ఉన్నామని కనపరచగలుగుతాము. అలాగే యేసయ్య ఎప్పుడూ పరిశుద్ధమైన జీవితము జీవించాడు. అలాగే క్రీస్తు ఆత్మ కలిగిన మనము కూడా పరిశుద్ధత కొరకు ప్రయాస పడిన యెడల నీవు బాల్య దశనుండి ఎదుగుతావు. అలాగే యేసయ్య ఎప్పుడూ తండ్రి కి విధేయత చూపినవాడుగా ఉన్నాడు. అయితే మరి మనము ఎలా ఉంటున్నాం? దేవుని మాటకు విధేయత చూపక పోతే, ఇంకా మనము బాల్య దశలో ఉన్నట్టే.

క్రీస్తు ఆత్మ యొక్క లక్షణములు
1. తండ్రి చిత్తమే నెరవేర్చుట.
2. పరిశుద్ధత కలిగి జీవించుట.
3. దేవుని మాటకు విధేయత చూపుట.

దేవుని విషయములలో ఏమాత్రము రాజీ పడవద్దు. సాతాను ఎప్పుడూ నిన్ను పడగొట్టడానికి ప్రయత్నిస్తుంది. యేసయ్య శ్రమలో దేవుని మాటపై నిలబడినప్పుడు అపవాది ఎటువంటి అపాయము కలుగచేయలేకపోయాడు. అలాగే నీలో క్రీస్తు ఆత్మ ఉంటే, నీలో ఉన్న క్రీస్తు ఆత్మలో నీవు ఎదిగి ఉంటే, నీకు కలిగిన శ్రమలో నీవు దేవుని మాటపైనే నిలబడతావు. అప్పుడు ఖచ్చితముగా అపవాది నీకు అపాయము కలుగజేయలేడు.