26-02-2023 ఆదివారం మొదటి ఆరాధన – దేవుని ఏర్పాటు ఎందుకో తెలుసా?

హల్లెలూయా ఆరాధన

హల్లెలూయా ఆరాధన
రాజాధి రాజు యేసునకే
మహిమయు ఘనతయు
సర్వాధికారి క్రీస్తునకే (2)
చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ
ఆ ప్రభుని కీర్తించెదం
నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో
స్తోత్రార్పణ చేసెదం ||హల్లెలూయా||

రూపింప బడక ముందే
నన్ను ఎరిగితివి
నా పాదములు జారకుండా
రక్షించి నడిపితివి (2) ||చప్పట్లు||

అభిషేక వస్త్రము నిచ్చి
వీరులుగా చేసితివి
అపవాది క్రియలను జయించే
ప్రార్థన శక్తినిచ్చితివి (2) ||చప్పట్లు||

మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట

మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది
మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట (2)           ||మహోన్నతుడా||

మోడుబారిన జీవితాలను
చిగురింప జేయగలవు నీవు (2)
మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు (2)             ||మహోన్నతుడా||

ఆకు వాడక ఆత్మ ఫలములు
ఆనందముతో ఫలియించినా (2)
జీవ జలముల ఊట అయిన
నీ ఓరన నను నాటితివా (2)      ||మహోన్నతుడా||

వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచి యుంచితివా (2)
వాగ్ధాన ఫలము అనుభవింప
నీ కృపలో నన్ను పిలచితివా (2)  ||మహోన్నతుడా||

నిన్ను పోలిన వారెవరు

నిన్ను పోలిన వారెవరు
నీతో సమముగా లేరెవరు
పరమును వీడి నా దరికొచ్చిన
నా ప్రభువా నిన్ను స్తుతియించెదన
యేషూవ యేషూవ – నా రాజు మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా
యేషూవ యేషూవ – నా సర్వం మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా….

1) సిలువలో నాకై – మరణించి
నా పై నీ ప్రేమను – కనుపరచి
మూడవ దినమున – తిరిగి లేచి
మరణమునే జయించి
వేలాది దూతలతో మధ్యఆకాశములో
నన్ను కొనిపోవా రానైయు
యేషూవ యేషూవ – నా రాజు మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా
యేషూవ యేషూవ – నా సర్వం మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా….

2) నా పేరుతో- నన్ను పిలచి
నీ సాక్షిగా- నిలువబెట్టి
నీ ఆత్మతో- అభిషేకించి
నీ సొత్తుగా- నన్ను మార్చి
కృప వెంబడి కృపతో- యెనలేని ప్రేమతో
నీ సేవకునకు తోడైయున్న
యేషూవ యేషూవ – నా రాజు మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా
యేషూవ యేషూవ – నా సర్వం మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా….

ఆరాధన వర్తమానం

ఈరోజు మన అందరినీ ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవ దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక! ఈ దినము చాల శ్రేష్టకరమైన దినము ఎందుకు అంటే, ఈ దినము ప్రభువు కొరకు ప్రత్యేక పరచబడిన దినము. మిగతా అన్ని దినములలోను మనకొరకు అనేకమైన పనులు చేసుకునే దినము. అయితే ఈ దినము ప్రభువును ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఆయన జీవ వాక్కులను పొందుకునే దినము. ఈ సత్యము ఎరిగిన వారు ఆయనను మహిమపరచడములో నిమగ్నమై ఉంటారు.

రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరా పులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెద వులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని. అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాప మునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను. యెషయా 6:1-1-5

ఈ వాక్యములలో యెషయా యొక్క పరలోక దర్శనము గూర్చి వ్రాయబడినది. ఎప్పుడైతే అక్కడ పరలోకపు ఆరాధనను, దేవుని మహిమను చూసిన యెషయా తాను అపవిత్రతను గుర్తించి పశ్చాత్తాపము తో రోదించినవాడై ఉన్నాడు.

మనము దేవుని ఆలయమై ఉన్నాము. మనలో ఉంటున్న, నివసిస్తున్న దేవునిని మనసారా ఆరాధించాలి. పరలోకములో ఉన్న ఆరాధనను చూస్తే, మొదటగా మందిరపు గడపకమ్ముల పునాదులు కదులుచున్నవి, అలాగే ఆ మందిరమంతా ధూమము చేత నిండిపోయింది.

మనము మనసారా దేవునిని ఆరాధిస్తున్నప్పుడు, మన కళ్ళు మూసుకున్నప్పటికీ మన ఆత్మీయ కన్నులద్వారా దేవుని సన్నిధిని చూడగలిగే భాగ్యమును పొందగలుగుతాము. ఇటువంటి ఆరాధన సమయములో నీకు ఎటువంటి ఆటంకము లేకుండా చూసుకోవాలి. మరిముఖ్యముగా మీ మొబైల్స్ మిమ్మలను ఆటంకపరచకుండా చూసుకోవాలి.

యెషయా యొక్క అనుభవము యోహానుకు కలిగింది. యోహానుకు కలిగిన అనుభవము నీకు నాకు కూడా కలుగుతుంది.

ఆబ్సురీ చర్చ్ అనే సంఘములో నిరాటంకముగా ఆరాధించుటను బట్టి అక్కడ దేవుని మహిమ మేఘమువలే ఆవరించిన అనుభవమును వారు పొందుకున్నారు. ఈరోజులలో లోకములో అనేకమైన విషయాలు మన ఆసక్తిని దొంగిలిచేవి ఉన్నాయి, అయితే మన ఆసక్తి పరసంబంధమైన విషయాల మీదనే ఉండాలి, అందుకొరకై మనము జాగ్రత్త పడాలి.

యెషయా ఏమి ఒప్పుకుంటున్నాడు? మొదటిగా అపవిత్రమైన పెదవులు కలవాడను అని అన్నాడు. ఆ తరువాత అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను అని ఒప్పుకుంటున్నాడు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనము మనలను పరిశుద్ధపరచుకోవలసిన అవసరము ఉంది. మనము ఎంతగా పరిశుద్ధపరచుకున్నప్పటికీ మన చుట్టూ ఉన్న అపవిత్రమైన మాటలను బట్టి మనము కూడా అపవిత్రపరచబడతాము. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన ప్రతీ సారీ, ఆ కలువరి సిలువలో నీవు కారిచిన రక్తము చేత నన్ను పరిశుద్ధపరచమని ఆయనను ప్రార్థించాలి. అప్పుడు పరలోక అనుభవము నీవు పొందుకుంటావు.

యెషయా ఒప్పుకున్న వెంటనే సెరాపులలో ఒకడు బలిపీఠము మీద ఉన్న నిప్పును యెషయా నోటికి తగిలించి పాపము తొలగిపోయెనని చెప్పెను.

మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. – అపొస్తలులకార్యములు 2:3-4

నీకు ఆశ ఉంటే, నీవు కూడా ఇటువంటి అనుభవమును పొందుకోగలుగుతావు. నీవు నిజముగా దేవునిని ఆరాధించునప్పుడు దేవుని అగ్ని కాలుస్తుంది. యోహాను మాటలను జ్ఞాపకము చేసుకుంటే, “నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నిలోను, ఆత్మలోను బాప్తీస్మము ఇచ్చును” అని చెప్పెను కదా!

సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. – లూకా 2:14

దేవునిని హృదయమారా నీవు ఆరాధిస్తుండగా నీకు సమాధానము కలుగుతుంది. పరసంబంధమైన అనుభవము నీవు పొందుకుంటావు. అందుకే దేవునిని ఆరాధించుట అనేది ఒక విశ్వాసి జీవితములో ఎంతో ప్రాముఖ్యమైనది. అటువంటి అనుభవములోనికి మనముకూడా వెళ్ళగలుగులాగున దేవుడు సహాయము చేయును గాక!

ఆరాధన గీతము

ఇదిగో దేవా నా హృదయం
ఇదిగో దేవా నా మనసు
ఇదిగో దేవా నా దేహం
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిశుద్ధ అగ్నితో కాల్చుమా (2)

పనికిరాని తీగలున్నవి
ఫలమివ్వ అడ్డుచున్నవి (2)
ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ||

ఓ నా తోటమాలి
ఇంకో ఏడాది గడువు కావాలి (2)
ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ||

Main message| మెయిన్ మెసేజ్

ఈరోజు మనము ధ్యానము “దేవుని ఏర్పాటు ఎందుకో తెలుసా?”. సాధారణముగా ఏర్పాటు అనేది పరిచర్య సంబంధమైన విషయాలగురించి మాట్లాడతాము. అయితే ప్రతి విశ్వాసీ కూడా దేవుని కొరకు ఏర్పాటు చెయ్యబడ్డవారే

ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకుకీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పముచొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధుల మును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.- ఎఫెసీ 1:4-6

మనము గమనించవలసిన మూడు ప్రాముఖ్యమైన విషయాలు
1. కృప చేత రక్షించబడ్డాము కనుక ఆయన కృపకు మహిమకరముగా జీవించాలి
2. యేసు క్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా ఉండుట
3. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలి.

మనము జగత్పునాది వేయకమునుపే మనము క్రీస్తునందు ఏర్పరుచుకున్నారు. ఎప్పుడైతే యేసును అంగీకరించామో అప్పుడు దేవుని కుమారులుగా చేయబడ్డాము. మన ఐడెంటిటీ దేవుని కుమారుడుగా ఉండుట.

నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా, ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను. 4 అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.
మత్తయి 4:2-4

యేసయ్య దేవుని కుమారుడు అని మనకు తెలుసు. అయితే ఇక్కడ సందర్భము చూస్తే 40 దినాల ఉపవాసము తరువాత ఆకలిగొన్నప్పుడు, “నీవు దేవుని కుమారుడవైతే” ఈ రాళ్ళను రొట్టెలుగా చెయ్యి అని అపవాది రెచ్చగొడుతున్నాడు. అపవాది యేసుక్రీస్తును పడగొట్టడానికి ప్రయత్నము చేస్తుంది. ఎలా అంటే, మొదటి ఆదామును ఎలా పడగొట్టిందో, కడపటి ఆదాము అయిన యేసయ్యను అలాగే పడగొట్టడానికి ప్రయత్నిస్తుంది. దేవుడు ఎలా అయితే చెప్పాడో, దానికి వ్యతిరేకముగా చేయునట్లు ఆదామును హవ్వను ప్రేరేపించి పడగొట్టాడు. ఇప్పుడు యేసయ్యను కూడా అలాగే ప్రేరేపిస్తున్నాడు. ఈ రాళ్ళు దేవుడు సృష్టించినవి, అలాగే రొట్టెలు కూడా దేవుని చేతనే సృష్టించబడ్డాయి. అయితే దేవుడు సృష్టించిన క్రమమును తప్పులాగున ప్రేరేపించి దేవునికి వ్యతిరేకముగా చేయులాగున యేసయ్యను శొధిస్తున్నాడు.

మన జీవితములో కూడా భౌతికమైన అవసరాలకొరకు దేవుని కుమారత్వమును పోగొట్టుకొనే ప్రేరేపణ ప్రకారము చేయడము బట్టి నష్టపోతున్నాము. అయితే, యేసయ్య దేవుని మాట ప్రకారము చేసినవాడుగా ఉన్నాడు. మరొక సందర్భములో చూస్తే, అరణ్యములో వేలమందికి భోజనము పెట్టినప్పుడు, అరణ్యములో ఉన్న రాళ్ళను రొట్టెలుగా మార్చలేదు గానీ, ఉన్న రొట్టెలనే అనేకమైన రొట్టెలుగా మార్చాడు. అనగా దేవుడు దేనిని ఏ విషయము కొరకు ఏర్పరిచారో అదే క్రమము అనుసరించి ప్రవర్తించారు.

అంతట అపవాది పరి శుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడ వైతే క్రిందికి దుముకుముఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును,నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను. – మత్తయి 4: 5-7

ఈ సందర్భములో “నీవు దేవుని కుమారునివైతే” అని చెప్పి మరొక శోధన కొరకు ప్రేరేపిస్తున్నాడు. మనము కూడా, అనేకసార్లు నిజముగా నీవే చెప్తే, నీవే అయితే ఈ ప్రకారము నాకు చెయ్యి అని ప్రార్థనలో అడుగుతాము. ఒకవేళ అడిగినది, ఆశించినది దొరకనప్పుడు మనము దేవుని మీద నమ్మకము పోగొట్టుకునేవారముగా అయిపోతున్నాము.

మనము కూడా అనేకసార్లు ఈ చిక్కులలో పడి, మన ఏర్పాటులోనుండి మనము తొలగిపోతున్నాము. రానున్న రోజులలో నీవు అపవాది ముద్ర ఉంటేనేగానీ తినుటకు ఆహారము దొరకని పరిస్థితులలోకి వెళ్ళబోతున్నాము.

అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడుపరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయన నడుగగా యేసుఅవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను.మార్కు 14:61, 62

మన జీవితములో శ్రమలకాలము, జయకరమైన కాలము రెండూ ఉంటాయి. అయితే, శ్రమకాలములో ఏమిటీ ఈ జీవితము అనే ప్రశ్న మనకు రాకూడదు. మన జీవితాన్ని ఆయన కృపకు మహిమకరముగా మనము సిద్ధపరచుకోవాలి. మనము యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా సాక్ష్యము కలిగి జీవించాలి. ఆదాము ఒక్కడిని పడవేసినప్పుడు అతని సంతానమంతా పడగొట్టబడింది. అయితే కడపటి ఆదాము నిలబడినప్పుడు అతని సంతానమైన మనము ఖచ్చితముగా నిలబడతాము.

మరొక విషయము అపవాది యేసయ్యను శోధించినప్పుడు భౌతికముగా ఎటువంటి అపకారము కలుగలేదు. మనము కూడా మన శోధనలలో వాక్యమును బట్టి నిలబడినప్పుడు ఎటువంటి అపాయమూ నీకు జరగదు.

మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి; మనము దేవుని పిల్లలమే.ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.- 1 యోహాను 3:1

దేవుని పిల్లలము అని “పిలవబడునట్లు” ఆయన ప్రేమను అనుగ్రహించాడు. మన శోధనలలో నిలబడ్డప్పుడు, ఆయన ప్రేమ నీపై విడుదల అయ్యి, నీవు దేవుని కుమారునివే అనే సాక్ష్యము ప్రకటించబడుతుంది.

ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము – 2 థెస్సలోనికయులకు 2:13

అకస్మాత్తుగా మీ జీవితములో భౌతికమైన అవసరముల కొరకైన శోధన వచ్చినప్పుడు, ఆ పరిస్థితులలో మీరు దేవుని మాట ప్రకారము నిలబడి ఉంటే, మీరు దేవుని కుమారులు అని పిలువబడునట్లు ఆయ్న ప్రేమ నీ శొధన పరిస్థితులలో కార్యము జరిగిస్తుంది.

మనము నిలబడినప్పుడు ఎందుకు మనకు వ్యతిరేకముగా నిలబడదు అంటే,

ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు. ఎఫెసీ 1:20-21

“యుగము” అనగా మంచి దినములు లేదా చెడ్డ దినములు మరియు శోధన దినములు. ఇప్పుడు ఉన్న మంచి దినాలలోనైనా చెడ్డ దినాలలోనైనా లేక రాబోయే మంచి దినాలలోనైనా చెడ్డ దినాలలోనైనా సరే అధికారము కలిగిన వాడు, రక్షించే వాడు జీవించే ఉన్నాడు.

ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను. – కొలస్సీ 1:13

నీవు నిలబడినప్పుడు నిలబడిన సందర్భములో నిన్ను కాపాడి దేవునికుమారుడివి అనే సాక్ష్యము కనపరచబడే అనుభవము మీకు కలుగుతుంది,

మరియు మీరు కుమారులై యున్నందుననాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.- గలతీ 4:6

నీవు దేవుని కుమారునిగా నీ స్థితిలో నిలబడినప్పుడు, “అబ్బా! తండ్రీ!” అని పిలిచే అవకాశము నీకు ఉంటుంది. నీవు నిలబడకుండా ఆ అవకాశము నీకు దొరకదు. మనము పడిపోయిన స్థితిలో ఎన్నిసార్లు “తండ్రీ” అని పిలిచినా కూడా ఎటువంటి జవాబు దొరకట్లేదు.

ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూ ర్ణునిగా చేయుట ఆయనకు తగును. హెబ్రీ 2:10

ఈ అనేకులైన కుమారులు అంటే ఎవరు? శోధన సమయములో నిలబడినవారు. వారు నిలబడిన కారణము చేత “దేవుడు అనుగ్రహించు మహిమ” ప్రత్యక్షపరచబడుతుంది.

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. రోమా 3:23

దేవుని కుమారునిగా ఆయన మాట మీద నిలబడకపోవడము పాపము. దానిని బట్టి ఆ స్థితిలో దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నాము. అయితే నిలబడితే? ఆయన మహిమ విడుదల అవుతుంది అనే కదా! అందుకే దేనికీ లొంగకండి. దేవుని కుమారత్వము పోగొట్టుకునే అవకాశము ఇవ్వవద్దు. నీవు దేవుని కుమారునిగా పిలువబడుటయే దేవుని ఏర్పాటు.