05-02-2023 ఆదివారం రెండవ ఆరాధన – సమయము అయిపోయిందా

పావనుడా యేసు నిన్ను చేరితి

పావనుడా యేసు నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి “2”
దీనుడా సాత్వికుడా బహు ప్రియుడా ” 2 ” ||పావనుడా||

1. ఆశ్చర్యకరుడా నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి “2” ||దీనుడా||

2. ఆలోచనకర్త నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి “2” ||దీనుడా||

3. బలవంతుడా యేసు నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి “2” ||దీనుడా||

నా ప్రాణమా.. నీకే వందనం

నా ప్రాణమా.. నీకే వందనం
నా స్నేహమా.. నీకే స్తోత్రము (2)
నినునే క్రీర్తింతును మనసారా థ్యానింతును (2)

హాల్లెలూయ హాల్లెలూయ హాల్లెలూయ
హాల్లెలూయ హాల్లెలూయ నా యేసయ్య || నా ప్రాణమా||

సర్వ భూమికి మహరాజా – నీవే పూజ్యుడవు
నన్ను పాలించే పాలకుడా – నీవే పరిశుద్దుడా (2)
సమస్తభుజనుల స్తొత్రములపై ఆసీనుడా (2)
మోకరించి ప్రణుతింతును (2)
|| హాల్లెలూయ హాల్లెలూయ ||

మహిమ గలిగిన లోకములో – నీవే రారాజువు
నీ మహిమతో నను నింపిన – సర్వశక్తుడవు (2)
వేవేల దుతలతో పొగడబడుతున్న ఆరాధ్యుడా (2)
మోకరించి ప్రణుతింతును(2)
|| హాల్లెలూయ హాల్లెలూయ ||
|| నా ప్రాణమా||

సర్వేశ్వరా నీకే స్తుతి

సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభూ
ఆధారము ఆశ్రయము నీవే నా యేసు
నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి

చిన్న చిన్న గొర్రె పిల్లలము కాపరివై మము కాయుము
అమ్మ నాన్న అన్నీ నీవే ఆదరించి సేదదీర్చుము
నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి

పరుగెత్తినా కొండ కోనలలోన పచ్చని పచ్చికలో
అండదండ కొండా కోనా నీవే యేసు
నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి

ఆరాధన వర్తమానం

ఎక్కడ వాక్యము ఉంటుందో అక్కడ జీవము ఉంటుంది అది ప్రసరింపచేయబడుతుంది. వాక్యము నా పాదములకు దీపము అయి ఉన్నది అని లేఖనములు సెలవిస్తుంది. వాక్యము వెలుగై ఉంది, ఆ వెలుగులో జీవము ఉంది. వెలుగు ఒకే చోట ఉండిపోదు కానీ, అది ప్రసరింపచేయబడుతుంది. కాబట్టి, దానిలో ఉన్న జీవముకూడా ప్రసరింపచేయబడుతుంది.

ఈరోజు దేవుడు నీతో మాట్లాడే వాక్యము నీకు వెలుగై ఉంది, అది నీకు జీవము కలిగిస్తుంది.

దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు – కీర్తనలు 75:1

ఈరోజు నీకు సమీపముగా ఉన్న వ్యక్తి సర్వశక్తుడైన దేవుడు. ఆయన అధిక మహిమను పొందదగినవాడు. ఆయన నిన్ను ఆదరించేవాడు.

ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు – యెషయా 66:13

మనకు ఆదరణ అవసరమా అని ఆలోచిస్తే, మనము ఉన్నది భూమి మీద. ఈ లోకాధికారి అయిన అపవాది మన జీవితాలను నాశనము చేయ్యడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. అనేక చోట్ల మనము చిక్కుబడుతున్నాము కూడా. మన దేవుడే గనుక మనలను ఆదరించకపోతే మన పరిస్థితి ఎంత దయనీయమో ఒక్కసారి ఊహించుకోండి. ఆయన ఎలా ఆదరిస్తాడో తెలుసా?

యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును యెషయా 51:3.

సీయోను యొక్క “పాడైన స్థలములను ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలే చేస్తున్నాడు”. అదే దేవుడు నిన్ను ఆదరించడానికి వస్తున్నాడు. నీకు సమీపముగా ఉన్న నీ దేవుడు నిన్ను ఆదరించేవాడు. నీ జీవితములో ఎక్కడైతే పాడైపోయి ఉందో దానిని బాగుచేసేవాడుగా ఉన్నాడు. పాడైన స్థలములు అంటే ఎదైనా నెగటివ్ పరిస్థితి.

మన ప్రభువు నిజమైన వాడు. ఆయన చెప్పే మాట ప్రతీదీ సత్యమే.

బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు – మత్తయి 11:12

బలాత్కారులు అనేదానిని తీవ్రత కలిగిన వారు అనే రీతిలో చూసినట్టయితే నీవు ఆసక్తి కలిగి ఆత్మలో తీవ్రత కలిగి దేవుని యొద్దకు వచ్చినప్పుడు, నీ జీవితములోని అరణ్యప్రదేశములను ఏదేను తోట వలే చేస్తాడు.

మనము అద్భుతము వెంటకాదు గానీ మన వెంట అద్భుతము రావాలి. అదే మన జీవితము అయి ఉండాలి. దేవుడు సమయము వెంబడి సమయము మనకు ఇస్తున్నాడు. ప్రతిసారీ ఆయన సన్నిధిలోనికి ఎందుకు తీసుకొస్తున్నాడు? ప్రతిసారీ వచ్చినా సరే ఎందుకు ఏమీ పొందుకోవట్లేదు? మనలో తీవ్రత లేకపోవుటచేతనే. కానీ ఈసారైనా, తీవ్రతతో సిద్ధపడు. నీవు సమీపముగా ఉన్నావు దేవా, నన్ను ఆదరించడానికి నీవు సమీపముగా ఉన్నావు. అని స్తుతించి ఆరాధించినపుడు, ఆయనలోని ప్రభావము నీలో ప్రవేశిస్తుంది. ఆయన సన్నిధి ప్రభావము నీవు ఎరిగి అనుభవించాలి అనేది నీ దేవుని ఆశ. అందుకే నీ హృదయపు తలుపు తడుతున్నాడు. ఆయన స్వరము విని నీవు తీయగలుగుతావా?

ఆయన నిన్ను బాగుచేయాలి అని ఆశపడుతున్నాడు! ఎందుకంటే నీవు ఆయన సొత్తు. యేసయ్య రక్తముతో నిన్ను కొనుక్కున్నాడు. ఎవరైతే స్తుతిస్తారో వారు వేసిన స్తుతుల సింహాసనముపై ఆసీనుడవుతున్నాడు. అనగా ఆయన ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించిన ఆయన నీ జీవితమును బాగుచేస్తాడు.

“దాని యెడారి భూములు యెహోవా తోటవలెనగునట్లు చేయుచున్నాడు”, నీ జీవితములో ఎక్కడైతే యెడారి వంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ నిన్ను సమృద్ధితో నింపేవాడుగా ఉన్నాడు. అందుకే ఈ సమయాన్ని పోనివ్వవద్దు.

ఈరోజు మరి దేవుడు ఏ ఉద్దేశ్యముతో నిన్ను ఆయన సన్నిధికి తీసుకువచ్చాడో, ఈ సమయాన్ని పోగొట్టుకోకు. ఆయన ప్రభావము ఆయన కుమ్మరించబోతున్నాడు. నీకు సమీపముగా ఉన్న సర్వశక్తుని నీవు ఆరాధించుచుండగా ఆయన నీ స్తుతుల సింహాసనముపై ఆసీనుడవుతాడు. అప్పుడు నీవు ఆయన ప్రభావమును అనుభవించగలుగుతావు.

ఆరాధన గీతము

ఎడారులలో దారిని
కలుగజేయువాడా
మహోన్నతమైన అద్భుతములు
చేయువాడా
అది నీవే యేసయ్యా
నీవొక్కడివేనయ్య

చీకటిలో వెలుగునిచ్చే తేజోమయుడవు నీవే
మరణములో జీవమునిచ్చే మృత్యుంజయుడవు నీవే
అది నీవే యేసయ్యా
నీవొక్కడివేనయ్య

వాగ్దానములు నెరవేర్చే నమ్మదగినదేవా
లేనివాటిని ఉన్నట్టుగా పిలచువాడవు నీవే
అది నీవే యేసయ్యా
నీవొక్కడివేనయ్య

నీవు ఎంతోకాలము నుండి చేస్తున్న ప్రార్థనలకు దేవుడు ఇస్తున్న సమాధానము “నీ ప్రార్థనలు వినబడినవి”,

ఇది ప్రార్థనల నెరవేర్పు సమయం. ప్రవచనము నెరవేర్చబడు సమయం. ఆయన సంకల్పం నెరవేర్చబడు సమయం.

నీ జీవితము కొరకు ప్రవచించబడినది స్థిరపరచబడుతుంది. అది స్థిరపరచబడుట కొరకు అనుకూలముగా లేకపోయినా కూడా స్థిరపడుతుంది.

మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించినవాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు – యిర్మియా 33:2 నమ్మి స్వీకరించు, నీవు ధన్యుడవే ధన్యురాలవే

Main message| మెయిన్ మెసేజ్

ఈరోజు మన ధ్యానాంశము “సమయము అయిపోయిందా?”. ఈ సమయమును గూర్చి చాలమంది ఆందోళనతో ఉంటున్నారు. అయితే ఎవరు అందోళణతో ఉండాలి? ఎవరు అందోళణతో ఉండకూడదు అని గ్రహించాలి.

యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. జనసమూ హములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలినడకను ఆయనవెంట వెళ్లిరి – మత్తయి 14:13.

యేసు అరణ్య ప్రదేశమునకు వెళ్ళారు. ఆ విషయము తెలిసిన జన సమూహములు కూడా ఆయనను వెంబడించి వెళ్ళారు. ఉదయము నుండి రాత్రివరకు వాళ్ళు అక్కడే ఉన్నారు.

సాయంకాలమైనప్పుడు శిష్యులాయనయొద్దకు వచ్చిఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి – మత్తయి 14:15.

వాళ్ళున్నది అరణ్యప్రదేశము. అప్పటికే పొద్దుపోయెను. ఈ మాటలు శిష్యులు యేసయ్యతో చెప్పడానికి కారణము, వారున్న అరణ్య ప్రదేశములో భోజనము ఉండదు కాబట్టి, వారు పట్టణముకు వెళ్ళి భోజన పదార్థము కొనుక్కోవడానికి వారు వెళ్ళాలి. పొద్దు పోయాక, అనగా సమయము అయిపోయాక వారు వెళితే ఏమి జరుగుతుంది? శిష్యుల యొక్క ఉద్దేశ్యము ఏమిటి? అసలే ప్రొద్దు పోయింది. అరణ్య ప్రదేశము క్షేమము కాదు. సమయము అయిపోయాక వారు వెళితే వారు కష్టపడాలి.

మన జీవితాలలో చూస్తే, అరణ్య ప్రదేశము అనగా ఏ సహాయము అందించబడలేని పరిస్థితి. ఆ పరిస్థితిని మార్చుకోవడానికి ప్రయత్నము చేసినా సరే సఫలము కావట్లేదు, పైగా సమయము అయిపోతుంది. అయితే మనము జ్ఞాపకము చేసుకోవలసినది ఎమిటి అంటే, యేసయ్య దగ్గర ఉన్నారు.

యేసువారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా – మత్తయి 14:16.

శిష్యులు జనులు భోజన పదార్థములు కొనుక్కోవటానికి పంపివేయమన్నారు అయితే యేసయ్య వారికి భోజనమే పెట్టమన్నారు.

దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి – యెషయా 55:1

యేసు దగ్గర ఉన్న జనములకు, ఇక్కడ యెషయాలో చూసిన జనములకు ఏమిటి తేడా? యెషయాలో చూసిన గుంపును రమ్మని పిలుస్తున్నాడు. అయితే యేసయ్య దగ్గర ఉన్న గుంపు, ఆయనను అంగీకరించి ఆయన దగ్గర ఉన్నారు. కాబట్టి వారికి ఒక ధన్యత ఉంది. శిష్యులు వట్టినే యేసయ్యను అడిగి ఉంటారా? ఎవరి దగ్గరో ఆకలి ప్రభావమును చూసినవారై శిష్యులు గమనించి చెప్పి ఉంటారు కదా!

నీవు కూడా నీలో ఉన్న పరిస్థితుల ప్రభావము చేత నీరసముగా కనబడుతున్నావేమో, నీవు కనబడుతున్న ప్రభావమును బట్టి ఆయన స్పందిస్తున్నాడు.

కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు – మత్తయి 6:31

యేసయ్యను ఎరగక ముందు నీవు వీటిగురించి విచారించావు. అయితే ఇప్పుడు నీవు యేసయ్యను అంగీకరించి ఆయన వద్ద ఉన్నావు. ఇప్పుడు వాటి గురించి విచారించకూడదు.

ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి. 1 పేతురు 5:7.

దేవుని ఎరగని వాడు చింతపడతాడు. అయితే దేవుని ఎరిగిన వాడికొరకు దేవుడే చింతపడతాడు కనుక వాడిక చింతపడనవసరము లేదు. నిజముగా నీవు నేను ధన్యులమే. చింతించేవాడు అనగా నీవు పడే బాధను ఆయనదిగా స్వీకరించేవాడు.

ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. – మత్తయి 6:32

నీవు కృంగిపోతున్నావు, నీరసించిపోతున్నావు, ధనము లేదు, సమయము లేదు! అయితే నీవు ఎక్కడున్నావు? ఎవరితో ఉన్నావు? అది నీవు ఎరగగలిగితే.

హాగరు జీవితములో, ” ఎక్కడుంచి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు?” అని దేవదూత ద్వారా ప్రభువు అడిగాడు. అయితే నీవు ఉన్నది యేసయ్య దగ్గర.

ఒకవేళ జనులు కొనుక్కోవడానికి వారి వారి గ్రామాలలోనికి వెళుతున్నారు అనుకోండి. దారిలో రాయి ఉందో, ముల్లు ఉందో ఏమి ఉందో తెలీదు. అంటే నీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు నీ క్షేమము కోరుకునే దేవుడు. అందుకే నీవు ఉన్నది ఎక్కడ అని నీవు ఎరగాలి. అయితే నీ యేసయ్య ఎటువంటివాడు, ఆయన మనసేమిటి అని అర్థము చేసుకోవాలి.

మనము దేవునితో ఉన్నవారము. మన పరిస్థితులలో సమయము అయిపోతుంది. ఉన్నదానిలోనే నీవు ప్రయత్నిస్తూ వెళుతున్నావు, అయితే నీవు వెళుతున్నది చీకటిలో! అనగా ఏ దారీ తెలియని పరిస్థితి. నీవు నష్టపడతావు, చీకటిలో చిక్కుబడతావు. అయితే నిన్ను పోగొట్టుకోవడం, నీవు నష్టపడటము నీ యేసయ్యకు ఇష్టములేదు.

వారు ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి – మత్తయి 14:17

అక్కడ అయిదువేల మంది ఉన్నారు. అయితే యేసయ్య మాట్లాడుతున్నప్పుడు ఒకడు వెళ్ళి జనముల దగ్గర ఎమైనా తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. అలా వెతికినప్పుడు ఒకడి దగ్గర దొరికింది. అయితే భోజనము సిద్ధపరచినతరువాత, అయిదు రొట్టెలు ఇచ్చినవాడితో పాటు, ఏమీ లేని వాడు కూడా భోజనము చేసాడు.

జనులకు ఆకలవుతుంది, తినడానికి ఏమీ లేదు. వారు యేసయ్య దగ్గర ఉన్నారు. వారందరూ పంక్తిలో కూర్చున్నారు. వారందరికీ భోజనము సిద్ధపరచబడింది. అయితే ఎలా సిద్ధపరచబడింది? అది అద్భుతము. వారు అద్భుతము పొందుకున్నారు.

నీ జీవితములో సహాయము లేని పరిస్థితిలో ఉన్నావు. అయితే నీ దగ్గర వనరులేమీ లేవు. అయినా సరే నీవు కూడా భోజన పంక్తిలో కూర్చో, ఎందుకంటే నీ కొరకు అద్భుతాన్ని దేవుడు సిద్ధపరచాడు.

అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవార లారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మత్తయి 5:34

కుడివైపున ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశము. అనగా ఎవరైతే యేసయ్యను అంగీకరించినవారికి మాత్రమే ఈ అవకాశము. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని ఆహ్వానము ఇవ్వబడుతుంది. దేవుడు సిద్ధపరచబడినది నీ వద్దకే వస్తుంది. యేసయ్యను అంగీకరించిన నీ ధన్యత ఇదే. నీ ఆశీర్వాదము నీదే. అది ఎలా సిద్ధపరచబడుతుందో నీకు అనవసరము. ఆయన ఏది సిద్ధపరచేనో అది కంటికి కనపడదు, చెవికి వినబడదు, హృదయమునకు గోచరముకాదు.

నీవు యేసయ్య దగ్గర ఉన్నావో లెదో ఎలా పరీక్షించుకోవాలి? “నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును – యోహాను 10: 27”.