15-01-2023 ఆదివారం రెండవ ఆరాధన – ఆయన సిద్ధముగా ఉన్నాడు

ఆశయ్యా.. చిన్న ఆశయ్యా

ఆశయ్యా.. చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా

నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని (2)
ఆశయ్యా చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2) ||నీతో||

నడవలేక నేను ఈ లోక యాత్రలో
బహు బలహీనుడనైతినయ్యా (2)
నా చేయి పట్టి నీతో నన్ను
నడిపించుమయ్యా నా యేసయ్యా (2)
నీతో నడువాలని – నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా||

సౌలును పౌలుగా
మార్చిన నా గొప్ప దేవుడా (2)
నీలో ప్రేమా నాలో నింపి
నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)
నీలా ఉండాలని – నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా||

స్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడా

స్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడా
ఉత్సాహించి పాడెదం – ఉదయ సాయంత్రముల్
స్తుతుల సింహాసనం మీదాసీనుడా
మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము (2) ||స్తుతించి||

గతకాలమంతా నీవు – మము కాచి కాపాడావు
వ్యధలన్ని తీసావు (2)
గతి లేని మాపై నీవు
మితిలేని ప్రేమ చూపి (2)
శత సంఖ్యగా మమ్ము దీవించావు ||స్తుతించి||

కరుణా కటాక్షములను కిరీటములగాను
ఉంచావు మా తలపై (2)
పక్షి రాజు యవ్వనమువలె
మా యవ్వనమునంతా (2)
ఉత్తేజపరిచి తృప్తిని ఇచ్చావు ||స్తుతించి||

స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా

స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా
స్తోత్రించి ఘనపరతుము మహోన్నతుడా
యేసయ్యా మా యేసయ్యా నీవేగా అర్హుడవు
స్తుతియించెదము స్తోత్రించెదము పూజించెదము ఘనపరచెదము

నా దేహం నీ ఆలయమై నా సర్వం నీకంకితమై
నా జీవితమంత నీకై నేను పాడి నా సర్వమునర్పింతును

ప్రతి క్షణము నీ సముఖములో అనుదినము నీ అడుగులలో
నా జీవితమంత నీకై నేను పాడి నా సర్వమునర్పింతును

ఆరాధన వర్తమానం

ప్రభువు సన్నిధిలో పూర్ణ సంతోషము కలదు. మనము ప్రభువు సన్నిధిలో ఉంటున్నాము. ఆ ప్రభువు సన్నిధి నూతనమైనది సృష్టించగలదు. ఈ రోజు మీ జీవితాలలో కూడా నూతనమైనది సృష్టించబడుతుంది. నీవు ఆశ కలిగి ఉంటే నీ జీవితములో ఆయన తన కృపను విడుదల చేసేవాడుగా ఉన్నాడు.

దేవుడు తన బిడ్డలకొరకు సిద్ధపరచేవాడుగా ఉంటాడు. ఆయనలో సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసముంది. ఆ సర్వపరిపూర్ణత ఎవరి జీవితములో స్థిరపరచబడటానికి అని ఆలోచిస్తే అది నీ జీవితములోనే.

ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు. యోహాను 1:16

కృప మన జీవితాలలో దేవుని కార్యమును సిద్ధపరుస్తుంది. మన దేవునిలో ఉన్న సర్వపరిపూర్ణత ఉంది. ఆయన లక్షణము ఇచ్చుట. దేవుని కోసం జీవించువారిని, దేవుని మహిమ కొరకు జీవించువారిని ఎల్లప్పుడు తృప్తిపరుస్తాడు. ఒక స్త్రీ ప్రసవ వేదన పడిన తరువాత నూతనమైన సృష్టిని చూసేదిగా ఉంటుంది. ఆ నూతనముగా పుట్టీన బిడ్డను చూసినప్పుడు ఆ వేదన జ్ఞప్తికి రాదు. మీ జీవితములో కూడా ఒక నూతనమైన క్రియ దేవుడు చేసేవాడుగా ఉన్నాడు.

దేవుడు మనలను ప్రేమించేవాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన సిద్ధపరచినది మనకోసము సిద్ధముగా ఉంది. ఆయన సిద్ధపరిచినది వాడబారనిది అయి ఉంటుంది. మన దేవుడు మన జీవితములను చూసి రోషము కలిగినవాడుగా ఉంటాడు. అంత్య దినములలో ప్రేమ చల్లారిపోయే దినాలలో నిన్ను నన్ను గురించి ఆలోచించేవారు ఎవరు? అయితే నీకు నాకూ, మన ప్రభువైన యేసు ఉన్నాడు. ఆ ప్రేమను నీవు అర్థము చేసుకుంటే, ఆయన సన్నిధిలో కనబడటానికి నీవు సిద్ధపడతావు.

రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. – కీర్తన 95:1

దేవుని ప్రేమ నీకు ఎంత రక్షణ కలిగిస్తుందో నీవు అర్థము చేసుకోవాలి. ఆయన ప్రేమను బట్టే ఒకరికి విడుదల, ఒకరికి క్షమాపణ, ఒకరికి రక్షణ కలుగుతున్నాయి.

2023 నీవు వెలిగించబడి ప్రకాశించబడుదువు.

మన జీవితములో ఆయన తన వాగ్దానమును నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే మనము ఆచారయుక్తమైన భక్తిని విడిచిపెట్టి ఆయన ప్రేమను పొందుకోవడానికి సిద్ధపడదాము.

యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు – కీర్తన 94:14

మన జీవితములో ఆయన వాగ్దానములు ఎందుకు స్థిరపరచబడటములేదు? మనము రివైవల్ అవ్వకుండా ప్రభువు కార్యము స్థిరపరచబడదు. ఎవరిని విడనాడడు? తన ప్రజలను. ఈరోజు నీవు ఆయన ప్రజలలో ఉన్నావు, ఆయన స్వాస్థ్యముగా ఉన్నావు, గనుక నిన్ను ఆయన విడనాడడు. మన దేవుడు మహిమ పరచబడవలసిన వాడు. ఎవరైతే అనుభవము కలిగి ఉంటారో వారు దేవుని నిజమైన ఆశతో ఆరాధిస్తారు.

రక్షణ పొందుకున్నామా, ఆదివారము చర్చ్ కి వెళ్తున్నామా, పొద్దున్న వాక్యము చదువుకున్నామా, రాత్రి పడుకున్నామా ఇదే సంపూర్ణము కాదు. ఇది పునాది మాత్రమే. ఇంకా చాలా ఉంది ప్రభువులో నీవు అనుభవించడానికి, కట్టబడటానికి. మీ జీవితములో దేవుని కార్యములు జరిగించబడటానికి ఆయన సిద్ధమే గానీ, మీరు ఉజ్జీవము కలిగి ఉండకుండా ఏమీ జరగదు. ఈ సత్యము గ్రహించి నీవు సిద్ధపడు. ఇప్పుడైనా నీ మనసును సరిచేసుకుని ఆయనను స్తుతించు. నీ కొరకై ఆయన కలిగిన ఆలోచనలకొరకు స్తుతించు. ఆయన సన్నిధిలోని ప్రభావమును నీవు అనుభవించాలి అనే ఆశతో స్తుతించు. నీ జీవితములో నూతనమైన కార్యము జరుగును గాక!

ఆరాధన గీతము

దేవా నా దేవా – నీవే నా కాపరి
నీ ప్రేమ నీ క్షమా – నింపుము నాలోనా 2)
ఆరాధింతును హృదయాంతరంగములో
స్తుతించెదను నీ పాద సన్నిధిలో (2)
నీవే కదా దేవుడవు – (2)
దేవా యేసు దేవా (4) ||దేవా||

పాపము నుండి విడిపించినావు
పరిశుద్ధుని చేసి ప్రేమించినావు (2)
నీవే కదా దేవుడవు – (2)
దేవా యేసు దేవా (4) ||దేవా||

పరిశుద్ధాత్మను నాలో నింపావు
మట్టి దేహమును మహిమతో నింపావు (2)
నీవే కదా దేవుడవు – (2)
దేవా యేసు దేవా (4) ||దేవా||

Main message| మెయిన్ మెసేజ్

దేవుని సన్నిధిలో చిన్నపిల్లల వలే ఉత్సాహముతో ఉండాలి. దేవుని సన్నిధిలో సిగ్గుపడితే ఏమీ పొందుకోలేము. నీ దేవుడు నీకొరకు సిద్ధముగా ఉన్నాడు. మరి నీవు సిద్ధముగా ఉన్నావా?

ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము 3:21.

మూయబడిన ద్వారము దగ్గర యేసయ్య నిలబడి ఉన్నాడు. అక్కడ నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు. ఎందుకు? లోపలికి ప్రవేశించడానికి. అయితే తలుపు తీయబడాలి. నీ జీవితములో కార్యము జరిగించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అయితే నీ తలుపు మూయబడి ఉన్నది. అయితే ఆయన వెళ్ళిపోవట్లేదు. ఇంకా నుంచుని తలుపు తడుతూనే ఉన్నాడు. అయితే ఈరోజు ఆ తలుపులు గురించి తెలుసుకుందాం.

మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను. మార్త యేసుతోప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను. యోహాను 11: 20-23.

లాజరు రోగిగా ఉన్నప్పుడు యేసయ్య వద్దకు వర్తమానము పంపినారు. యేసయ్య లాజరును ప్రేమించాడు. అయితే రోగిగా ఉన్న లాజరు చనిపోయి సమాధి చేయబడి ఉన్నాడు. దానిని బట్టి లాజరు విషయములో మార్త,మరియల హృదయపు తలుపులు మూయబడి ఉన్నాయి. అయితే ఆ తలుపులు యేసయ్య తలుపులు తడుతున్నాడు. నీ జీవితములో కూడా ఆశీర్వాదమును ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు అయితే నీవు నీ తలుపులు తడుతున్నాడు. మన జీవితములో వెయ్యబడిన తలుపు ఎలా తీయాలో సిద్ధపడదాము.

అద్భుతమును జరుగకుండా ఆపివేసే మూయబడిన తలుపు ఏమిటి అంటే, బోధ. మార్త మరియలకు కూడా యేసయ్య బోధ చేసాడు. ఖచ్చితముగా పరలోకరాజ్యమును గూర్చిన సువార్త ఆయన బోధించే ఉంటాడు.

మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను – యోహాను 11:24.

ఆమె విన్న బోధ ప్రకారము పునరుత్థాన దినమునులో జరుగుతుంది అని నమ్మింది కానీ, ఇప్పుడే జరుగుతుంది అని నమ్మి తలుపు తియ్యలేకపోతుంది. ఈరోజు నీ జీవితములో 31 తారీఖున ఇచ్చిన ప్రవచనాత్మక వాగ్దానము నెరవేరుతుంది. ఇప్పుడు ఆ ఆశీర్వాదము నీ జీవితములో నెరవేరకుండా నీ మనస్సులో అనేకమైన ఆలోచనల ద్వారా మూసిన తలుపులు తీసి ఆశీర్వాదమును పొందుకోండి.

ఇది అసాధ్యము అనే బోధ(నియమము) నుండి బయటకు వచ్చి దేవునికి సమస్తము సాధ్యమే అని నమ్ముదాము.

మార్త యేసుతోప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును అని చెప్పుతుంది, అంటే లాజరు చనిపోకముందు యేసయ్య వచ్చి ఉంటే బ్రతికేవాడు అని నమ్మింది. అయితే ఇప్పుడు చనిపోయాడు గాబట్టి ఇంక అది అసాధ్యము అని తలుపు మూసింది. మన జీవితములో చూస్తే, నీ కళ్ళముందు కనబడితే నమ్మి తలుపు తీస్తావు గానీ, నీ కళ్ళముందు కనబడకపోతే నీవు కూడా ఇంక అయిపోయింది అనే ఆలోచన ప్రకారము తలుపులు మూసేవాడివిగా ఉండిపోతున్నావు. అయినప్పటికీ యేసయ్య తలుపు తడుతున్నాడు.

యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్తప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నీవు నమి్మనయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; – యోహాను 11:39-40.

మళ్ళీ యేసయ్య తలుపును తడుతున్నాడు. అయితే ఇంకా మార్త హృదయపు తలుపులు తీయబడలేదు. ఎందుకంటే చనిపోయినవాడు లేవడము అసాధ్యము అని ఆమె అనుకుంటుంది. నీ జీవితములో ముగించబడినదైనా ప్రభువు తలుపు తడుతుంటే ఇకముందు నీ హృదయపు తలుపులు తీసి ఆహ్వానించు. నీ జ్ఞానము చేత తలుపులు మూయకు.

అయితే ప్రభువుకు తాను ఏమి చేస్తున్నాడో ఆయన ఎరిగే ఉన్నాడు. నీవు నమ్మవలసినది ఏమిటి అంటే, ఆయన ప్రయత్నిస్తూనే ఉంటున్నాడు. ఈ సత్యమును నీవు గ్రహించాలి.

ఇప్పుడు వేరే వ్యక్తిని మనము చూద్దాము.

యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను – ఆ సమరయ స్త్రీయూదుడ వైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యోహాను 4:5, 9.

ఇక్కడ ఆమె దగ్గరకు వచ్చిన ఆయన ఎవరు అని అమెకు తెలియదు. అయితే యేసయ్య ఆమెను తడుతున్నాడు.

అందుకు యేసునీవు దేవుని వరమునునాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను – యోహాను 4:10.

ప్రతిసారీ ఆమె వేసే ప్రశ్నల ద్వారా ఆమె హృదయపు తలుపులు మూయబడి ఉన్నాయి అని ఆమె కనుపరచింది. ఆమె పాత కాలములో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు గనుక ఇప్పుడు ప్రవక్త లేడు అని అనుకుంటుంది. అయితే యేసయ్య ప్రతిసారీ ఆమె హృదయపు తలుపు తడుతూనే ఉన్నాడు.

మనము అడిగినది నెరవేర్చడానికి ఆయన తలుపు తడుతున్నాడు. నీవు ఊహించనిది అయినప్పటికీ ఆయన సిద్ధపరచినది జరిగించడానికి ఆయన తలుపు తడుతున్నాడు. అయితే ఆయన తలుపు తట్టడానికి ఉద్దేశ్యము ఏమిటి? దెవుని చిత్తము నెరవేరడానికి. ప్రభువు పునరుత్థానము కొరకై లాజరు జీవితములో అద్భుతము జరిగించి మనుష్యకుమారుని మూడు దినములైన తరువాత పునరుత్థానము కొరకు సిద్ధపరచాడు. అలాగే అనేకులు రక్షణ పొందులాగున సమరయ స్త్రీతో మాట్లాడాడు.

ఈరోజు నీవు పరీక్ష చేసుకో ఎక్కడ నీ తలుపులు మూసావు? నీ జ్ఞానమును బట్టి నీవు మూసేసావేమో, నీకు తెలిసిన బోధను బట్టి నీవు మూసేసావేమో. ఈరోజైనా ఈ మాటలు విన్న నీవు ఈరోజు నీ తలుపులు తీస్తావా? దేవుని తో చెప్తావా? అయ్యా నీ మాట ప్రకారము నా జీవితములో జరుగును గాక అని చెప్తావా?