08-01-2023 ఆదివారం రెండవ ఆరాధన – దేవునితో సహవాసం

సిద్ధపడుదాం సిద్ధపడుదాం

సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై
సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై //2//

అ. ప. “సిద్ధ మనస్సను జోడు తొడిగి – సమాధాన సువార్త చాటెదం” //2//

1. ప్రతి ఉదయమున ప్రార్ధనతో – నీ సన్నిధికి సిద్ధమౌదును
జీవము కలిగిన వాక్కులకై – నీ సన్నిధిలో వేచి యుందును //2//సిద్ధ//

2. సత్కార్యముకై సిద్ధపడి – పరిశుద్ధతతో నుందును
అన్ని వేళలయందు ప్రభుయేసును – ఘనపరచి కీర్తింతును //2//సిద్ధ//

3. బుద్ధిని కలిగి నీ రాకడకై – మెలకువతో నేనుందును
నీ రాజ్య సువార్తను ప్రకటించి – ప్రతివారిని సిద్ధపరతును //2//సిద్ధ//

స్తుతి గీతముల్ సంగీతముల్

స్తుతి గీతముల్ సంగీతముల్ రారాజు యేసునికే
మహిమ ఘనత యుగయుగములకు నా యేసుకే చెల్లును
పాడి కొనియాడి నిన్నారాధించెదన్ (2)
హల్లెలూయా లూయ లూయ హల్లెలూయా (2)

లోకమంతయు తోచినవారిని పూజించుచుండగా
నేను మాత్రం యేసు ప్రభునే ఆరాధించెదన్
పాడి కొనియాడి నిన్నారాధించెదన్ (2)
హల్లెలూయా లూయ లూయ హల్లెలూయా (2)

కెరూబులు సెరాపులందరూ పూజించుచుండగా
నేను కూడా పరిశుద్ధులతో ఆరాధించెదన్
పాడి కొనియాడి నిన్నారాధించెదన్ (2)
హల్లెలూయా లూయ లూయ హల్లెలూయా (2)

నన్ను కోరి నా దరిచేరి నను ప్రేమించితివే
అందరువిడిచిన నా చేయి విడువక నను నడిపించితివే
పాడి కొనియాడి నిన్నారాధించెదన్ (2)
హల్లెలూయా లూయ లూయ హల్లెలూయా (2)

కీర్తి హల్లెలూయా

కీర్తి హల్లెలూయా
గానం యేసు నామం మధురమిదే
నిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2)

స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ గానము శ్రీ యేసుకే
స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ స్తోత్రము మా క్రీస్తుకే

ప్రయాసే లేదుగా – యేసే తోడుగా
మాతో నడువగా – భయమే లేదుగా ||స్తుతి||

క్రీస్తుని వేడగా – మార్గం తానేగా
సత్యం రూఢిగా – జీవం నీయగా ||స్తుతి||

ఆరాధన వర్తమానం

సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము. – కీర్తన 100:1-3

మనము ఆయనవారము అయి ఉన్నాము. ఎందుకంటే ఆయన మనలను సృష్టించినాడు. కనుక మన సన్నిధికి చేరినప్పుడు మన తండ్రి ఇంటికి వెళ్ళినప్పటి సంతోషము మనము అనుభవించగలగాలి. మన సొంత తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు సొంత స్థలమునకు వెళ్ళిన అనుభవము ఉంటుంది. అలాగే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా సొంత ఇంటికి వెళ్ళిన సంతోషము మనము కలిగి ఉండాలి.

మనము ఆయన మేపు గొర్రెలము అయి ఉన్నాము, కాబట్టి ఆయన మన కాపరి అయి ఉన్నాడు. మనము ఆయనకు సొంతవారమై ఉన్నాము. ఆయన మనలను పోషించేవాడుగా ఉన్నాడు. ఆయన మనకు ఆధారము అయి ఉన్నాడు.

మనము ఆయన ప్రజలము కనుక ఆయన మనకు రాజు అయి ఉన్నాడు.

కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి – కీర్తన 100:1-4

మనకు ఆయన తండ్రిగా ఉన్నాడు, కనుక మనము ప్రభువా నీవు మమ్మును సృష్టించినావు అని స్తుతించాలి. మనకు ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి, నాయనా నీవు నా జీవితాన్ని పాలించి ఇంతవరకు సురక్షితముగా ఉంచినావు అని స్తుతించాలి. ఆయన మనకు కాపరిగా ఉన్నాడు కాబట్టి, నాయనా నీవు నాకు పోషకుడవై ఉన్నావు అని స్తుతించాలి. కృతజ్ఞత అర్పణగా ఏమి సమర్పించగలము? మన హృదయమే ఆయనకు అర్పించదగినది.

ఆరాధన గీతము

నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే – నీవే ||నా తండ్రి||

యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా ||నా తండ్రి||

నా తండ్రి నీవే – నా కాపరివి నీవే
నా తండ్రి నీవే – నీవే ||నా తండ్రి||

యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా ||నా తండ్రి||

నా తండ్రి నీవే – నా రాజువు నీవే
నా తండ్రి నీవే – నీవే ||నా తండ్రి||

యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా ||నా తండ్రి||

Main message| మెయిన్ మెసేజ్

ఈ సంవత్సరము మనము దేవుని నామ మహిమ కొరకు మనము సిద్ధపడవలసినవారమై ఉన్నాము. కావున దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు ఏమి జరుగుతుంది అనే విషయము తెలుసుకోవలసినవారముగా ఉన్నాము.

ఇంతకు ముందు నీ జీవితములో దేవునితో గడిపే సమయము కొంచెమే ఉందేమో, అయితే ఇప్పుడు కొంచెం పెరిగింది. దానిని బట్టి దేవునికే స్తోత్రము. సహవాసము అనగా కలుసుకొనుట అని అర్థము. కొంతమంది ప్రార్థన ద్వారా, కొంతమంది వాక్యము చదువడము ద్వారా, కొంతమంది స్తుతించడము ద్వారా దేవునితో సహవాసము కలిగి ఉన్నారు. అయితే అలా సహవాసము కలిగి ఉండుటనుబట్టి ఏమి జరుగుతుంది అనే విషయము మనము ఖచ్చితముగా తెలుసుకోవాలి.

జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము. మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తోకూడను ఉన్నది.- 1యోహాను1:1-3

యోహాను గారు చెప్తున్న మాటలు చూస్తే, వారు ఏమి చూసారో, ఏమి కనుగొన్నారో అనే విషయము చెప్తున్నారు. వాళ్ళు తెలుసుకున్న విషయము ఆది నుండి వున్నది అనే సంగతి వారు తెలుసుకున్నారు. వారు ఎలా తెలుసుకున్నారు? అని గమనిస్తే, వారు కలిగిన సహవాసమును బట్టి తెలుసుకోగలిగినారు.

ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకోండి వారు స్నేహితులైతే, ఒకరికొకరు వాళ్ళ విషయాలు చెప్పుకుంటారు. రహస్యాలు కూడా ఒకరికొకరు వారి సహవాసములో చెప్పుకుంటారు. ఎప్పుడైతే శిష్యులు యేసుక్రీస్తుతో సహవాసము చేసినప్పుడు, అనేకమైన మర్మములు తెలుసుకోగలిగినారు. ఆదినుండి యేసు క్రీస్తు ఉన్నారు. ఆయన వాక్యమై ఉన్నారు అనే సంగతి వారి సహవాసములో తెలియచేయబడ్డాయి. అయితే యోహాను చెప్పుచున్న విషయము ఏమిటి అంటే, మనకు కూడా ఆ అవకాశము ఉంది.

దేవునితో సహవాసము చేసినప్పుడు రెండు విషయాలు జరుగుతాయి. మొదటిది “వ్యక్తీకరణ”. మీ మనసులోని విషయాలు మీరు తెలియచేస్తారు. ఆయన మనసులోనిది ఆయన తెలియచేస్తారు. రెండవదిగా “బదలాయింపు” జరుగుతుంది. ఆయన బలము, కృప మన పరిస్థితిలో మనకు బదిలీ చెయబడుతుంది. అనగా మనకు ఇవ్వబడుతుంది.

ఉదాహరణకు, మనము కృంగిన వేళలో మన ఆత్మను తన వాగ్దానము ద్వారా గానీ, స్వప్నముల ద్వారా కానీ, ఆయన తన మాట వ్యక్తీకరిస్తారు. అదే ప్రభువు నీతో మాట్లాడుట. అయితే ఇంకొంచెం లోతుగా తెలుసుకోవడానికి ఆదికాండములో పాపము ప్రవేశించకమునుపు ఆదాము జీవితము చూసి తెలుసుకుందాము.

మరియు దేవుడైన యెహోవానరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయ మును వానికొరకు చేయుదుననుకొనెను – ఆదికాండము 2:18.

అనగా దేవుని హృదయములోని ఆలోచన ఇది. అయితే దేవునికి ఈ విషయము ఎలా తెలిసింది? ఆదాముతో సహవాసము చేయటము బట్టియే కదా, ఒకరి విషయాలు మరొకరికి తెలుసుతుంది? దీనిని బట్టి, ఆదాము దేవునితో సహవాసము ఉన్నది అనే సంగతి మనము తెలుసుకోగలము. అందుకే ఆదాములో ఏమి లేమి ఉన్నదో, ఏమి అవసరమో దేవుడు కనుగొనేవాడుగా ఉన్నాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు అనే సంగతి దేవుడు ఎరిగినవాడై, దానికొరకైన ఆలోచన కలిగి ఉన్నాడు.

ఆయనతో మనము సహవాసము చేస్తున్నప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నామో, ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. మనము పడిన స్థితిలో ఉన్నా, లేచిన స్థితిలో ఉన్నా, లేవలేని స్థితిలో ఉన్నా ప్రతీది దేవునికి తెలుసు. అయితే దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు ఈ ఆధిక్యత కలిగి ఉంటాము. సహవాసము అనగా మాటి మాటికీ కలుసుకొనుట.

దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను – ఆదికాండము 2:19,20.

ఆదాము యొక్క ఒంటరి తనాన్ని పోగొట్టడానికి అక్కడ ఉన్న జంతువులను, పక్షులను తీసుకువచ్చి వాటికి పేరులను పెట్టే ఆధిక్యత కలుగచేసారు. అయినప్పటికీ ఆదాము కొరకైన సాటియైన సహాయము అతనికి దొరకలేదు.

వాక్యము తెలియచేస్తున్న సత్యము ఏమిటి అంటే, నా జనులు జ్ఞానములేకనే నశించిపోతున్నారు అని. మనము ప్రార్థన చేస్తాము. అనేక గంటలు ప్రార్థన చేస్తాము కానీ ఆ ప్రార్థనలో ఏమి జరుగుతుంది అనే విషయము గమనించలేకపోతున్నాము. నీవు ప్రార్థించినవ్యక్తి నీ కాపరి. నీ మంచి కాపరి. నీ కొరకు అవసరమైతే ప్రాణము పెట్టేవాడిగా ఉంటాడు. ఇకనుంచి మనము ప్రార్థించే విధానము మారాలి. నీవు ఆయన సన్నిధిలో నీవు గడిపినప్పుడు, నీ స్థితిని ఆయన ఎరిగినవాడుగా ఉంటాడు. నీ స్థితి కొరకైన కార్యము ఆయన జరిగించెవాడుగా నీ దేవుడూ ఉన్నాడు.

ఆదాము జీవితములో ఒంటరితనము అనే స్థితి ఉన్నది అని గ్రహించిన దేవుడు మొదటగా అక్కడ ఉన్న వనరులు దయచేసాడు. అయితే ఎప్పుడైతే ఆదాము స్థితి ఇంకా మారలేదు ఇంకా ఒంటరిగానే ఉన్నాడు అనే సంగతి ఎరిగిన దేవుడు, ఆదాము కొరకు నూతన సృష్టి చేసాడు. హవ్వను సృష్టించాడు. నీ జీవితములో కూడా నీ స్థితిని మార్చడానికి ఉన్న వనరులు దయచేసి మారుస్తాడు. ఒకవేళ అవసరమైతే, నీ కొరకు నూతనముగా సృష్టించి అయినాసరే స్థితి మారుస్తాడు. ఆమేన్!

ఈ గొప్ప ధన్యత కేవలము దేవునితో సహవాసము చేసేవారికే. అందరికీ కాదు. నీ జీవితాన్ని స్వతంత్రించుకోవాలి అంటే దేవునితో నీవు సమయం గడపాలి. నీవు చేసిన పాపములు, తప్పులు ఎవరితో చెప్పుకుంటావు? నీవు సహవాసము చేసే స్నేహితులతోనే కదా! నీ దేవునితో నీవు చేసే సహవాసములో నీ పాపములు చెప్పుకోగలుగుతావు. నీవు చేసిన తప్పులు చెప్పుకోగలుగుతావు.

అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిన నేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా- మత్తయి 15: 32

ఈ మూడు దినములు ఈ జనములు యేసు ప్రభువుతో సహవాసము కలిగి ఉన్నారు. తినడానికి ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు అలాగే ఆయన సహవాసము కలిగి ఉన్నారు. వారు అడగకపోయినా కూడా వారితో కలిగిన సహవాసమును బట్టి, వారి స్థితి ఎరిగినవాడుగా ఆయన వారికొరకైన ఆలోచన, “ఆకలి తీర్చాలి” అనే ఆలోచన కలిగి ఉన్నాడు. కనికరము కలిగిన యేసయ్య తన శిష్యులతో ఈ విషయము చెప్పినాడు.

ఆయన శిష్యులుఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసుమీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారు ఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి – మత్తయి 15: 33,34

అక్కడ ఉన్న జనములు చాల పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే వారి దగ్గర ఉన్న రొట్టెలు, చేపలు చాలా తక్కువ. ఇక్కడ కూడా ఉన్న వనరులు ఏమిటి అని ప్రభువు చూసాడు. అయితే అవి సరిపోనప్పుడు నూతనముగా సృష్టించి వారి ఆకలి తీర్చాడు. ఆదాము జీవితములో “ఒంటరితనము” వీరి జీవితములో “ఆకలి తీర్చబడుట”. సందర్భాలు వేరైనా, “నియమము” ఒకటే.

నీ దగ్గర ఉన్న వనరులు నిన్ను తృప్తిపరచగలిగితే వాటితో నిన్ను తృప్తిపరుస్తాడు. ఒకవేళ కాకపోతే, నూతనముగా సృష్టించి నిన్ను తృప్తిపరుస్తాడు. ఈ సత్యము ఆది నుండి ఉన్నదే, ఇప్పుడు ప్రత్యక్షపరచబడింది. ఈరోజు నుంచి మనము దేఉవునితో చేసే సహవాసము మన జీవితాలను మారుస్తుంది. ఆదాము సమయము, దావీదు సమయము, ఆ జనముల సమయము, శిష్యుల సమయము అయిపోయింది. ఇది నీ సమయము. ఇకనుంచి నీ ప్రార్థన, సహవాసము మారిపోవాలి. క్రీస్తు యేసునందున్నవారు ఎల్లప్పుడూ నూతనపరచబడతారు. గతించినదానిలో మనము ఉండము. నూతనపరచబడిన దానిలో మనము ఉంటాము.

ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు – యోహాను 15:5

దేవునితో సహవాసములో నీవున్నట్టయితే నీవు బహుగా ఫలించేవాడిగా ఉంటావు.

మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. 1 కొరింథీ 1:9

ఒకవేళ ఎవరైనా సహాయము చేస్తాను అని నీతో చెప్పి ఉంటే, వాడితో నీకు కలిగిన అనుభవమును బట్టి, నమ్మకమునుబట్టి ఒకవేళ ఆలస్యమైనా కూడా నీవు ఎదురుచూస్తావు. అదే నమ్మకములేకపోతే, అలా ఎదురుచూడలేవు. అయితే నిన్ను పిలిచిన నీ దేవుడు నమ్మదగినవాడు. నీవు ఆయనతో, ఆయన నీతో సహవాసము చేస్తున్నారు. అప్పుడు జరిగే క్రియ “ఫలించుట”. నీవు ఫలించటానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉన్న వనరులతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ అవసరమైతే నూతనమైనది సృష్టించి అయినా నిన్ను ఫలింపచేస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో ప్రతిరోజు గడపండి. ఆయన నమ్మదగినవాడు.

ఎలాగైనా నేను ఈ సంవత్సరము ఆశీర్వదించబడాలి అనే ఆశ, నిరీక్షణ కలిగి దేవునితో సహవాసము కలిగి ఉందాము. వీలైతే రాత్రి పడుకున్నప్పుడు దేవుని స్తుతిస్తూ పడుకోండి. ఎలా ప్రభువు మీతో మాట్లాడతాడో మీరే చూడండి.