విజయం నీ రక్తంలో
విజయం నీ రక్తంలో – అభయం నీ హస్తంలో
సమాధానం సదాకాలం – నా రక్షకుడా నీలో
1. స్వస్థత నీరక్తంలో – భద్రత నీ హస్తంలో
2. రక్షణ నీ రక్తంలో – సాంత్వన నీ హస్తంలో
3. క్షమాపణ నీ రక్తంలో – నిరీక్షణ నీ హస్తంలో
4. పవిత్రత నీ రక్తంలో – వినమ్రత నీ హస్తంలో
5. ఆరోగ్యం నీ రక్తంలో – ఆనదం నీ హస్తంలో
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను నాట్యమాడెదన్
నాట్యమాడెదన్ నేను
నాట్యమాడెదన్ నేను
దావీదువలె నేను నాట్యమాడెదన్
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను పాటపాడెదన్
పాటపాడెదన్ నేను
పాటపాడెదన్ నేను
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను స్తుతించెదను
స్తుతియించెదన్ నేను
స్తుతియించెదన్ నేను
దావీదువలె నేను స్తుతించెదను
ఆరాధించెదము యేసయ్య నామమును
ఆరాధించెదము యేసయ్య నామమును
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము (2)
ఆరాధన ఆరాధన ఆరాధనా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా (2) ||ఆరాధించెదము||
ఆది యందు ఉన్న దేవుడు
అద్భుతాలు చేయు దేవుడు (2)
అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు (2)
అద్వితీయ సత్య దేవుడు
యేసయ్య అద్వితీయ సత్య దేవుడు (2) ||ఆరాధన||
మోక్షము నిచ్చు దేవుడు
మహిమను చూపు దేవుడు (2)
మోషే దేవుడు మాట్లాడే దేవుడు (2)
మహిమ గల దేవుడు నిత్య దేవుడు
యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు (2) ||ఆరాధన||
దాహము తీర్చు దేవుడు
ధన ధాన్యములిచ్చు దేవుడు (2)
దావీదుకు దేవుడు దానియేలు దేవుడు (2)
ధరణిలోన గొప్ప దేవుడు
యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు (2) ||ఆరాధన||
ఆరాధన వర్తమానం
మన దేవుని వంటి దేవుడు ఎవ్వరూ లేరు ఆయనకు సాటి అయినవారు ఎవ్వరూ లేరు.
కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు? – యెషయా 40:17
మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయు దురు? యెషయా 46:5
మన జీవితాలలో ఏమి కలిగి ఉన్నాకూడా మన దేవునికి సాటి అయినది ఏదీ లేదు. కీర్తన 89:6 లో చూస్తే, “మింటను యెహోవాకు సాటియైనవాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు?” అని వ్రాయబడింది.
మనజీవితములో స్తుతింపదగిన వాడు యెహోవా మాత్రమే.
యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు. – కీర్తన 89:8.
బలము విషయములోనే గానీ, కార్యములు చేయడములోనే గానీ, నడిపించేవిషయములో గానీ మన దేవుని వంటి దేవుడు మరొకడు లేడు. దేవుని ఆరాధించడానికి వచ్చినమనము ఆయనకు సాటి అయిన వాడు మరొకరు లేరు అని జ్ఞాపకము చేసుకోవాలి.
మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటనుబట్టి మీరుదాని గ్రహింపలేదా?
ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను – యెషయా 40:21-22
దేవుని గూర్చిన సాక్ష్యములను నీవు వినలేదా? అయితే ఈరోజు నీతో మాట్లాడుతున్న ఈ వాక్యమును విను. దేవుని శక్తిని గూర్చి మనము ఆలోచిస్తే మన ఊహకు కూడా అందదు. భూమిని శూన్యములో వేలాడదీసినవాడు. మనమైతే మనకు కలిగిన ధనమును ఆస్తిని బట్టి శక్తివంతులముగా అనుకుంటాము కానీ మన దేవుని వంటి శక్తిముందు అది ఎందుకూ పనికిరానిది.
కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.- అపొస్తలుల కార్యములు 17:29.
లోకములో మీరు సిరికి అయినా దాసుడుగా ఉండండి లేదా దేవునికి అయినా దాసుడుగా ఉండండి అని దేవుని వాక్యము చెప్పుచున్నది. అనేకమైన బోధలు అనేకమైన మాధ్యమాలలో ఉన్నాయి. ధనము గూర్చి అనేకమైన విషయాలు ఏర్పరచబడినవారు సహితము తప్పించబడే బోధలు కూడా ఉన్నాయి.
ఒక సహోదరుడికి ఒక ప్రశ్న వచ్చింది. దశమభాగాలు లేదా కానుకలు ఎందుకు దేవునికి ఇవ్వాలి? దేవునికి ఎమైనా తక్కువ అయ్యిందా అని. అయితే దేవుడు మనిషిని పరీక్షించేవాడుగా ఉన్నాడు. ఎలా అంటే నీ హృదయములో దేవునికి ప్రథమ స్థానమా? ధనమునకే ప్రథమ స్థానమా? అని దేవుని పరీక్షిస్తాడు.
కరోన సమయములో మనుష్యులు కలిగిన ధనము వారిని కాపాడలేదు కానీ దేవుని కృప మాత్రమే కాపడింది. మనము అంత్యకాలములో ఉన్నాము. ఎప్పుడు మన సమయము ముగుస్తుందో తెలియదు. ఎప్పుడైతే దేవునిని కలిగి ఉంటావో, ఆయనలో సమస్తముకూడా నీవు కలిగి ఉంటాయి. యేసయ్యలోనే బుద్ధి జ్ఞాన సర్వసంపదలూ గుప్తమై ఉన్నాయి అని వాక్యము చెప్పుచున్నది.
ఈ లోకములో బంగారమునకు చాలా విలువ ఉంది. అయితే అది దేవుని కి సాటిగా నీ జీవితములో ఉండకూడదు. ఈ సత్యమును ఎరిగినవారుగా నీవే నాకు చాలు మరేదీ నీకు సాటిగా నా జీవితములో లేదు అని ఆరాధిద్దాము. ఒకవేళ నీ జీవితములో ప్రభువు స్థానమును దొంగిలించి ప్రథమముగా ఉంటే ప్రభువు ఎదుట ఒప్పుకుందాము. సత్యముతో ఆత్మతో ఆరాధిద్దాము.
ఆరాధన గీతము
పల్లవి: నీవే నాకు చాలును యేసు “8”
1.ఒంటి నిండా బంగారమున్నాను
అది నీకు సాటి రాగలదా “2”
బంగారమా యేసయ్యా
నా బంగారమా యేసయ్యా…( నీవే )
2. కోట్లు కోట్లుగా ధనము ఉన్నాను
అది నీకు సాటి రాగాలదా…. “2”
ధనమంతా నీవే యేసయ్య
నా ధనమంతా నీవే యేసయ్య….( నీవే )
3. కొండంతగా బలము ఉన్నాను
అది నీకు సాటి రాగలదా… “2”
బాలమంతా నీవే యేసయ్యా
నా బాలమంతా నీవే యేసయ్యా.. (నీవే )
4. ప్రేమించే వారు ఎందరున్నాను
వారు నీకు సాటి రాగలరా….. “2”
ప్రేమమాయా యేసయ్య
నా ప్రేమమయా యేసయ్యా.. (నీవే )
Main Message | మెయిన్ మెసేజ్
నీవు దేవునిని ప్రేమించినట్లైతే అనేది ఈరోజు టైటిల్. అయితే నీవు దేవునిని ప్రేమిస్తున్నావా అని అడిగితే కాదని ఎవ్వరమూ చెప్పము. అయితే నీవు నిజముగా దేవునిని ప్రేమిస్తున్నట్టయితే వాక్యము మనకు ఏమి తెలియచేస్తుందో ఆ ప్రకారముగా చెయ్యాలి.
వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచియెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసునా గొఱ్ఱ పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. యోహాను 21:15.
పేతురుని యేసు ప్రభువు అడుగుతున్నాడు నీవు వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. పోలిక అనేకమందికి ఇష్టం ఉండదు. అయితే ఈరోజు పేతురుకు వేసిన అదే ప్రశ్న నీకు నాకు కూడా ప్రభువు అడుగుతున్నాడు.
అయితే పేతురు ఏమి సమాధానం చెప్తున్నాడు? “నేను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు” అని. అప్పుడు ప్రభువు “నా గొర్రెపిల్లలను మేపుము” అని అతనితో చెప్పెను. మరి ఈ వాక్యము మనతో కూడా చెప్పబడుతుంది కదా? మరి మనము ఎలా తీసుకోవాలి? ఈ వాక్యములోని ప్రవచనము లేదా రివలేషన్ ని అర్థం చేసుకుందాము.
బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు. సామెతలు 22:6
ఇక్కడ బాలుడు, పెద్దవాడు అనే మాటలు మనిషి జీవితములోని సమయములను సూచిస్తున్నాయి. గొర్రెపిల్లలు అనేది యేసయ్య ద్వారా అనుగ్రహించబడిన ఆత్మీయ జీవితముగా మనము చూడవచ్చు. ఈ ఆత్మీయ జీవితము బాలుడుగా ఉన్న సమయములో అనగా ప్రారంభ సమయములో, నువ్వు చేయవలసినది ఉంది. నీ ఆత్మీయ జీవితమును మేపవలసి ఉన్నది అనగా బలపరచవలసి ఉన్నది. ఒక ఇల్లు పునాదితో ప్రారంభిస్తాము. అలాగే మన జీవితము బాల్య దశతోనే ప్రారంభం అవుతుంది. కాబట్టి బాల్య దశ అనేది పునాది వంటిది. అలాగే మన ఆత్మీయ జీవితపు ఆరంభము కూడా పునాది వంటిది అది బలముగా వెయ్యాలి.
నా యొద్దకు వచ్చి, నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియ జేతును.
వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలి యుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున2 దాని కదలింపలేకపోయెను – లూకా 6:47
మన ఆత్మీయ జీవితపు పునాది కూడా బండ మీద కట్టబడి బలముగా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యము? “నా యొద్దకు వచ్చి, నా మాటలు విని, ఆ ప్రకారము చేయువాడు” పునాది బలముగా వేస్తున్నాడు అని అర్థము. చాలామంది దేవుడే ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఆయనే చూసుకుంటాడు అని అనుకుంటారు. అయితే దేవుడు వాక్యము లేదా మాట ఇస్తాడు ఆ ప్రకారము మనమే చెయ్యాలి.
ఆత్మీయజీవితపు బాల్యదశలో వాక్యములో బలముగా ఎదగాలి. ఎప్పుడైతే దేవుని లేఖన సత్యాలను గ్రహిస్తామో అప్పుడే ఆయన మాట ప్రకారము నడువగలుగుతాము. మన ఆత్మీయ పునాది బలముగా ఉండాలి అలా కాకపోతే మన ఆత్మీయ జీవితము పాడు అవుతుంది, ప్రమాదముల బారిన పడతాము.
వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలి యుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేలమీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలి పడెను; ఆ యింటిపాటు గొప్ప దని చెప్పెన లూకా 6:48,49
మరల ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన నా గొఱ్ఱలను కాయుమని చెప్పెను – యోహాను 21:16
రెండవసారి పేతురును అడిగినప్పుడు, “గొర్రెలను” కాయుము అని చెప్పుచున్నాడు. గొర్రెపిల్లలు కాదు గొర్రెలు. అనగా మనము ఆత్మీయముగా ఎదిగిన తరువాత ఆ జీవితాన్ని కాపాడవలసిన బాధ్యత అవసరత ఉన్నాయి.
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు 1 పేతురు 5:8
ఈ అంత్య దినాలలో అపవాది తన ఉచ్చులు అనేకములుగా పన్ని ఎలా మన ఆత్మీయ జీవితములను పాడుచేయాలో అనే ఆలోచనతో పొంచిఉన్నాడు. అందుకే ఎదిగిన ఆత్మీయ జీవితములు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమి్మదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయి నది దొరకువరకు దానిని వెదక వెళ్లడా? లూకా 15:4
మన ఆత్మీయమైన జీవితములలో పది విషయములలో బాగుంటున్నామేమో కానీ ఒక్క విషయములోనే బాగాలేమేమో! అయితే ఆ ఒక్క విషయములో కూడా తప్పిపోవడము అనేది దేవునికి ఇష్టము లేదు. అపవాది దేవునికి వ్యతిరేకముగా చేయులాగున మనలను ప్రేరేపిస్తాడు. అపవాది మన చెయ్యి పట్టి పాపము చెయ్యించడు కానీ దేవుని మాటకు వ్యతిరేకమైన ఆలోచన పుట్టించి పాపమునకు ప్రేరేపిస్తాడు. అందుకే నీవు తప్పిపోయిన విషయములను గూర్చి వెతికి సరిచేసుకొను లాగున నీవు సిద్ధపడి బాధ్యత కలిగి ఉండాలి. మన ఆత్మీయ దినాలను మనమే కాచుకోవాలి. కానీ ఎలా?
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును. కీర్తన 23:4
ఈ దుడ్డుకర్ర మరియు దండము అనగా దేవుని వాక్యమే
ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మునైయున్నది.1 తిమోతి 4:9
అలాగే ఈ వాక్యము రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గముకంటెను పదునైనది. మన ఆలోచనలకంటెను బలమైనది. గొర్రెపిల్ల స్థితిలోనైనా గొర్రె స్థితిలోనైనను అనగా ప్రారంభ దశ అయినా ఆత్మీయంగా ఎదిగిన స్థితిలోనైనా నీ ఆత్మీయ జీవితాన్ని వాక్య ప్రకారము నిలబడగలుగులాగున నీవే కాపాడుకోవాలి. అప్పుడే నీవు దేవుని నిజముగా ప్రేమిస్తున్నట్టు అని వాక్యము ద్వారా అర్థము చేసుకోగలుగుతాము. మనలో అనేకమంది ప్రతి ఆదివారము చాలా నిష్టగా ఉంటారు అయితే సోమవారమౌ వరకు ఆలోచనలు గానీ, పనులు గానీ అన్నీ దేవుని మాటకు వ్యతిరేకముగానే ఉంటాయి. దేవుని ప్రేమిస్తున్నట్టయితే నీకు దేవుడిచ్చిన ఆత్మీయ జీవితమును నీవు కాపాడవలసినదే. అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాక్యమనే దుడ్డుకర్ర చేత నిన్ను నీవు సరిచేసుకోవాలి.
మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడిప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొఱ్ఱలను మేపుము. – యోహాను 21: 17,18
మాటిమాటికీ ఈ ప్రశ్న వేయబడుతుంది. మన జీవితాలు ఆయనను ఆధారము చేసుకొన్నటువంటి జీవితాలు. అందుకే ప్రతిసారీ ఆయన అడుగుతున్నాడు. ఆయనను ప్రేమిస్తేనే మనము నిలిచి ఉండగలము.
గొర్రెలు అనేది ధ్యానము చేస్తే మన యేసుప్రభువు కాపరిగానూ, మనము గొర్రెలు. అయితే ఈరోజు మనము చూసినది ఏమిటంటే, గొర్రెలు మన ఆత్మీయ జీవితము మరియు కాపరి మనము. ఈ ఆత్మీయమైన జీవితములో ఎదుగుతున్నకొలది కాయవలసిన, మేపవలసిన బాధ్యత ఆ అత్మీయ జీవితములకు కాపరి అయిన మనదే
నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. యోహాను 10: 27.
స్వరము అంటే మాటలు. నా గొర్రెలు అనగా ఎదిగిన ఆత్మీయ జీవితము. ఎదిగిన మన ఆత్మీయ జీవితము దేవుని మాటలను బట్టి సిద్ధపరచుకుంటే, ఆయనను వెంబడించగలము. అంటే, ఆయన జీవము కలిగినవాడు కాబట్టి మనము కూడా జీవము కలిగినవారముగా ఉంటాము. మనము వాక్యప్రకారము నడిచినప్పుడు మనము జీవముతో కూడిన జీవితముతోనే నడిపించబడతాము.
నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు యోహాను 10: 28.ఎదుగుతున్నటువంటి ఆత్మీయ జీవితములో కాయవలసిన బాధ్యత, మేపవలసిన బాధ్యత నీమీదే ఉంది. ఎప్పుడైతే దేవుని వాక్కుతో నీవు సిద్ధపడతావో అప్పుడు నీవు వెంబడించబడే జీవితము కలిగి ఉంటావు. అప్పుడు నీ జీవితములో నాశనము అనేది నీ దరి చేరదు. ఈ మాట ధైర్యముగా చెప్పగలుగుతావా? అందరూఒ నాశనము వద్దు, ఆశీర్వాదమే కావాలి అని కోరుకుంటారు. దానికి సింపుల్ రూల్, దేవుని వాక్య ప్రకారము నడుచుటయే. అప్పుడు మన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్ని కష్టపరిస్థితులు ఉన్నప్పటికీ నాశనము అనేది మన దరి చేరదు.
మనము ఎక్కువ ధనము దగ్గర తప్పిపోతుంటాము. బయట విస్తారముగా తప్పుడుబోధలు ప్రకటించబడుతున్నాయి. అయితే మనము వాక్యము కలిగి, వాక్యప్రకారము నడిచినట్టయితే అపవాది ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఏ మాత్రమూ అపహరించే అవకాశము దొరకదు. అపహరించడము అంటే దొంగిలించడము. అనగా నీకు తెలియకుండా మోసపూరితముగా నీది అయిన దాన్ని లాక్కోవడము. అయితే దేవుని వాక్యముగనుక కలిగి ఉండి, ఆ వాక్యముతో నీ జీవితాన్ని నింపుకుని, ఆ వాక్య ప్రకారము నడిచినట్టయితే అప్పుడు అపవాది నిన్ను ఏమీ చెయ్యలేడు.
మనము ఆత్మలో ఎదుగుతున్న సమయములో నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి మరియు ఆత్మీయ జీవితాన్ని వాక్యముతో నింపుకోవాలి. అయితే అది కోల్పోయినప్పుడే దాని గూర్చి ఆలోచన వస్తుంది అయితే ఆత్మీయ జీవితము కోల్పోకముందే జాగ్రత్తపడి సరిచేసుకోండి.