దేవుని స్తుతియించుడి
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని||
ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)
ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)
ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)
స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
సన్న తంతుల సితారతోను (2)
చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
తంబురతోను నాట్యముతోను (2)
తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
పిల్లనగ్రోవుల చల్లగనూది (2)
ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2)
గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2)
హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
ఆరాధింతు ఆరాధింతు
ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘన నామం (2)
స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును
క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును (2)
వేవేనోళ్లతో స్తుతి నే పాడెదా. (2)
యేసునందే సత్యం యేసులోనే మార్గం యేసే నా నిత్యజీవము (2)
ప్రభు నామము ఎంతో ఘనమైనది
అన్ని నామములకంటె హెచ్చైనది (2)
ఆ నామమందే రక్షణ సోదరా (2)
యేసయ్య రక్తము చిందించెగా (2)
యేసే నా రక్షణ యేసే విమోచన యేసే నా నిరీక్షణా (2)
ప్రభు నామము ఎంతో బలమైనది
అపవాది క్రియ లయపరుచునది (2)
భయమేల నీకు ఓ సోదరా (2)
సాతాను సిలువలో ఓడిపోయెగా (2)
యేసే రక్తమే జయం యేసు నామమే జయం యేసునందే విజయం (2)
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య
ఆరాధన వర్తమానం
దేవుని సన్నిధిలో ఆచారము ప్రకారముగా కాదు గానీ, నిజమైన భక్తి కలిగి దేవునిని ఆరాధించాలి.
యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే. – కీర్తన 18:46,47.
మన వ్యక్తిగతమైన జీవితాలలో బైబిల్ నుండి అనేకమైన విషయాలు తెలుసుకోగలము. కీర్తనాకారుడు “నా నిమిత్తము” అని తన వ్యక్తిగతమైన అనుభవమును ఆధారము చేసుకొని ప్రభువును కీర్తిస్తున్నాడు. మనము ఏ స్థితిగతులలో కృంగిపోయి ఉన్నామో, ఆ పరిస్థితులలో మనలను బలపరచి ఆ స్థితిని తప్పించుటను ప్రతిదండన అని మనము అర్థంచేసుకోగలము. అటువంటి అనుభవము నీవు కూడా కలిగి ఉంటే, నువ్వు కూడా “నా నిమిత్తమే సమస్తము కలుగచేసినవాడు” అని చెప్పగలుగుతావు. నీవు తృప్తిపొంది దేవుని మహిమపరచాలనే ఉద్దేశ్యముచేత దేవుడు తన కార్యములను నీ జీవితములో కార్యములు జరిగిస్తున్నాడు.
ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును.నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్నుహెచ్చించుదువుబలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండినీవు నన్ను విడిపించుదువు – కీర్తన 18:48.
మన శత్రువుకు అందనంత ఎత్తులో మనలను దేవుడు ఉంచి, మనలను నాశనము చేయడానికి శత్రువు పన్నిన ప్రతీ పన్నాగమునుండి నిన్ను తప్పించుచున్నాడు. మన జీవితములో కూడా అనేకమైన శత్రువు పన్నాగాలనుండి తప్పించి కాపాడుచున్నాడు. బలత్కారము చేయువారి చేతిలోనుండి ఇప్పుడు ఇకముందూ మనలను తప్పించువాడు. అందుకే నేను దేనికీ భయపడను అని దావీదు చెప్పుచున్నాడు.
మన సంఘము కొరకైన మందిరము కట్టుటకై స్థలము గురించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు జ్ఞాపకము చేసిన మాట, “యెహోవా నా పక్షమున ఉండగా నాకు విరోధిగా ఎవరు నిలువగలరు?”. ఇప్పుడు స్థలము దొరకకుండా ఉంటుందా? స్థలము దొరికాక, దానిని కొనగలగుటకు అవసరమైన ధనము వ్యతిరేకముగా ఉంటుందా? అనగా ఆ ధనము దయచేయబడకుండా ఉంటుందా? ఇలా ఒకదాని తరువాత మరొక విషయములో అద్భుతము వెంబడి అద్భుతము జరిగి స్థిరపరచబడుతుంది.
కీర్తనాకారుడి అనుభవములను బట్టి, “అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదనునీ నామకీర్తన గానము చేసెదను.” అని చెప్పుచున్నాడు. మరి నీవు కూడా అటువంటి అనుభవము కలిగి ఆరాధించగలుగుతావా? దేవుని కృపమీద ఆధారపడేవారిని బట్టి ఆయన ఎంతో సంతోషించేవాడిగా ఉన్నాడు. కీర్తనకారుడు ఇలా అంటాడు – “నేను ఇప్పుడు నిన్ను స్తుతించకపోతే మన్ను స్తుతిస్తుందా?” అంటే, నేను ఇక్కడ జీవించుచున్నప్పుడు కాక మరణించినప్పుడు స్తుతించలేను. ఇప్పుడే ఈ సమయాన్ని సద్వినియోగము చేసుకుంటాను అని చెప్పుచున్నాడు. మనము కూడా ఈ సమయాన్ని పోనియ్యక దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాము.
ఆరాధన గీతము
స్తుతి మహిమ యేసు నీకే
స్తుతి ఘనత ప్రభు నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన (8) ||స్తుతి||
కళ్ళల్లో కన్నీరు తుడిచావు
గుండె బరువును దింపావు (2)
వ్యధలో ఆదరించావు
హృదిలో నెమ్మదినిచ్చావు (2)
యెహోవా షాలోమ్ ఆరాధన (8) ||స్తుతి||
నీవొక్కడవే దేవుడవు
మిక్కిలిగా ప్రేమించావు (2)
రక్తము నాకై కార్చావు
రక్షణ భాగ్యమునిచ్చావు (2)
యెహోవా రోహీ ఆరాధన (8) ||స్తుతి||
నను బ్రతికించిన దేవుడవు
నాకు స్వస్థత నిచ్చావు (2)
నా తలను పైకెత్తావు
నీ చిత్తము నెరవేర్చావు (2)
యెహోవా రాఫా ఆరాధన (8) ||స్తుతి||
నాముందు నీవు నడిచావు
నాకు తలుపులు తెరిచావు (2)
ప్రాకారములను కూల్చావు
ప్రాకారముగా నిలిచావు (2)
యెహోవా నిస్సీ ఆరాధన (8) ||స్తుతి||
Main Message | మెయిన్ మెసేజ్
మనము ఎదురుచూస్తున్నది మిస్స్ అయినప్పుడు మన హృదయము ఎలా ఉంటుంది? ఎంత కృంగిపోయి ఉంటుంది? స్థిమితము లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాము. అయితే అటువంటి సమయములో కొంతమంది వారి జీవితాలను బలవంతముగా ముగిస్తున్నారు. మనము అనుకున్నది జరగనప్పుడు, న్యూన్యతా భావముకలిగి, ఒంటరిగా ఉంటున్నప్పుడు అపవాది నిన్ను ప్రేరేపిస్తుంది. అటువంటి సమయములో నీ మనస్సు చెప్పిన రీతిగా పలకకు కానీ, నీ దేవుడు నీకిచ్చిన వాగ్దానమును జ్ఞాపకము చేసికొని నిలబడాలి.
మనము ఏమైనా కష్టపరిస్థితులలో ఉన్నప్పుడు ఎవరు మనదగ్గర వచ్చినా “విశ్వాసము” ఉంచండి దేవుడు తప్పకుండా తప్పిస్తాడు అని చెప్తారు. అయితే ఎలా అటువంటి పరిస్థితులలో విశ్వాసము ఉంచగలుగుతాము? “నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును”. ఇది ఒక క్రైస్తవుని జీవితములో ఖచ్చితమైన సత్యము. అయితే అనేకమైన స్థితులలో మనము విశ్వాసము కనపరచలేకపోతున్నాము.
అయితే మన కష్ట పరిస్థితులలో ఎవరైనా విశ్వాసము కలిగి ఉండమని చెప్పినప్పుడు, విశ్వాసము లేదు అని ఎవ్వరమూ చెప్పము.
వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును – రోమా 10:8-10.
ఇది పాప రక్షణ అయినా, మన దైనందిన పరిస్థితులలో రక్షణ అయినా ఇదే ప్రిన్సిపుల్.
తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను – రోమా 12:3.
అనగా ప్రతీ ఒక్కరికీ విశ్వాసాన్ని దేవుడు అనుగ్రహించాడు. మన జీవితములో అవసరమైన విశ్వాసము మనకు దయచేయబడింది అయితే ఎలా ఆ విశ్వాసమును ఎలా ఉపయోగించాలి? ఆవగింజంత విశ్వాసము ఉంటే ఈ కొండను ఎత్తి ఆ సముద్రములో పడమంటే పడుతుంది అని ప్రభువు చెప్పారు కదా? అయితే మన జీవితములో ఎందుకు విశ్వాసముచేత జీవించలేకపోతున్నాము. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని ఎలా ఉపయోగించాలో మనకు తెలియట్లేదు.
ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్ప గించినట్లుండును. అతడు ఒకనికి అయిదు తలాంతులను1 ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను. అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపాదించెను. ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను. అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. – మత్తయి 25:14-18.
ప్రతి ఒక్కరికీ విశ్వాసాన్ని దేవుడు ఇచ్చారు. అయితే కొంతమంది అ విశ్వాసాన్ని ఉపయోగించి అనేకమైన ఆశీర్వాదములు పొందుకుంటున్నారు. అయితే కొంతమంది ఆ విశ్వాసాన్ని ఉపయోగించని కారణాన, ఏ ఆశీర్వాదము పొందని స్థితిలో ఉంటున్నారు. మన జీవితము ముందుకు కొనసాగించబడే జీవితమే కానీ, కప్పిపెట్టబడే జీవితాలో, ఆగిపోయే జీవితాలో కాదు.
విశ్వాసము అనేది డాలు. శత్రువు యొక్క అగ్నిబాణములు ఆర్పగలిగిన శక్తి ఈ డాలుకు ఉంది. అయితే ఈ విశ్వాసమును ఎలా వాడాలో తెలియట్లేదు. అయితే ప్రభువు నందు విశ్వాసము ఉంచువాడు ఎన్నటెన్నటికినీ సిగ్గుపడడు. మన జీవితాలు సమృద్ధితో నింపబడే జీవితాలు. యోహాను 10:10 లో ఆయన సమృద్ధి కలుగజేయుటకు వచ్చాడు అని వాక్యము చెప్పుచున్నది.
అయితే ఈ విశ్వాసాన్ని ఎలా ఉపయోగించగలుగుతాము?
అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపర చెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను – మార్కు 5:34.
మనకు తెలిసిన భాగమే ఈ వాక్యము. పండ్రెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకట పడెను.ఆమె యేసునుగూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని అనుకొంది. వినుటవలన విశ్వాసము కలుగును అనే వాక్య ప్రకారము. ఈమె యేసును గూర్చిన మాట విన్నది. ఆ మాటను బట్టి యేసునందు విశ్వాసము ఉంచింది. ఆమె తన పరిస్థితిలో ఎంతో పోరాటము చేసింది, అనేకమైన వైద్యులదగ్గరకు వెళ్ళింది అయితే ఏమీ ప్రయోజనము లెకుండాపోయింది. అయితే యేసుని గూర్చి విన్నతరువాత, యేసు యొక్క వస్త్రపు చెంగు ముడితే చాలు అని నమ్మింది. అలా తాను పొందిన విశ్వాసాన్ని ఉపయోగిస్తుంది. ఎలా? “జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను – మత్తయి 5:28”. ఆ రోజులలో మగవారి గుంపులోనికి మధ్యలోనికి ఒక స్త్రీ వెళ్ళగలగే పరిస్థితులు లేవు. ఒకవేళ తనను మొదట చూసినవారు, పక్కకి త్రోసివేసిఉండవచ్చు. ఇలా అనేకమైన ఆటంకాలు వచ్చి ఉండవచ్చు అయినప్పటికీ తన విశ్వాసాన్ని కోల్పోలేదు. తన మనసులో యేసును గూర్చి ఏ విశ్వాసమైతే నీవు కలిగిఉన్నావో, ఆ విశ్వాసాన్ని బట్టి కార్యము స్థిరపరచబడుతుంది.
విశ్వాసము ఉంది అని చెప్పడము వలన ప్రయోజనము ఏమీ లేదు. అయితే ఎనంతి ఆటంకాలు వచ్చినా కూడా నీ విశ్వాసము ప్రకారము నీవు చెయ్యవలసినది కొనసాగించినప్పుడు నీవు విశ్వాసాన్ని ఉపయోగిస్తున్నట్టు. అయితే ఎలా ఆటంకాలు వస్తాయి? మొదట నీ హృదయములోనే ఆటంకములు బయలుదేరతాయి. సందేహము రూపములో. అందుకే, “అల్పవిశ్వాసీ ఎందుకు సందేహపడితివి?” అని ప్రభువు అడుగుతున్నాడు.
మరొక వ్యక్తిని చూద్దాము.
యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచిఇశ్రా యేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను – మత్తయి 8:10.
ఇక్కడ శతాధిపతిలో ఉన్న విశ్వాసమును గూర్చి యేసుప్రభువు చెప్పుచున్న మాట.
ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చు టకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెల విమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను – మత్తయి 8:5-9.
ఇక్కడ కూడా ఈ శతాధిపతి యేసును గూర్చిన మాటలు విన్నాడు. ఆ వినినమాటలను బట్టి కలిగిన విశ్వాసము చేత యేసు యొద్దకు వెళ్ళాడు. ఇంతవరకు యేసు ముట్టుటవలన కాక మాటద్వారా స్వస్థత కలిగిన సాక్ష్యము లేదు. అయితే ఈ శతాధిపతి యేసు వద్దకు వచ్చినప్పుడు యేసు మీద కలిగిన విశ్వాసము పెరిగినట్టుగా మనము చూడగలము. దానిని బట్టే, “ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును” అని చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ ఆ శతాధిపతి యేసుయొక్క అధికారము గూర్చి చెప్పుచున్నాడు. యేసు మాట సెలవిస్తే చాలు అక్కడ అధికారము స్థిరపరచబడుతుంది అని ఎరిగి అదే విశ్వాసము కలిగి, ఆ ప్రకారము మాట్లాడాడు.
రక్తస్రావము కలిగిన స్త్రీ కొంత సమయము వెచ్చించవలసి వచ్చింది. అయితే ఈ శతాధిపతి సమయము వెచ్చించనవసరము లేడు, యేసు యొక్క అధికారము మీద విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టి, అధికారము కలిగిన మాట విడుదల చెయ్యమని అడిగాడు.
విశ్వాసములో పరిమాణములు ఉన్నాయి. ప్రారంభదశలో మనకు కొంచేమే విశ్వాసము ఉంటుంది. అయితే మనము దేవునితో నడిచేకొద్దీ మన విశ్వాసము ఎదగవలిసిందే. ఈరోజు ప్రభువు మనకు జ్ఞాపకము చేస్తున్న విషయము, “నీవు కలిగిన విశ్వాసమును ఉపయోగించు”. నిన్ను నీవు పరీక్షించుకో ఈరోజు. ఎటువంటి పరిమాణములో నీ విశ్వాసము ఉంది? ఇంకా ప్రారంభ స్థితిలో ఉన్నట్టే ఉందా? ఎమైనా ఎదుగుదల ఉందా? మనము చిన్నవాటినీ స్వతంత్రించుకోవాలి పెద్దవాటినీ స్వతంత్రించుకోవాలి. అలాగే సాధ్యమైన వాటినీ, అసాధ్యమైన వాటిని కూడా మనము స్వతంత్రించుకోవాలి అంటే, మనము సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి.
అలాగే మన ప్రభువు దేశాంతరము తరువాత వచ్చి లెక్కచూసేవాడిగా ఉన్నాడు. నేను విశ్వాసము ఇచ్చాను కదా ఎంత సంపాదించుకున్నాడు? అని లెక్క చూస్తాడు. అప్పుడు కలిగినవాడికి సమస్తము ఇవ్వబడుతుంది. అయితే లేని వాడికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. ఎప్పుడైతే నీవు నిలబడతావో, ఖచ్చితముగా కార్యము స్థిరపరచబడుతుంది.