13-Nov-2022 – ఆదివారము ఆరాధన – మీ వెలుగు ప్రకాశింపనీయుడి

నిన్ను పోలిన వారెవరు

నిన్ను పోలిన వారెవరు
నీతో సమముగా లేరెవరు
పరమును వీడి నా దరికొచ్చిన
నా ప్రభువా నిన్ను స్తుతియించెదన్

యేషూవ యేషూవ – నా రాజు మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా
యేషూవ యేషూవ – నా సర్వం మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా….

1) సిలువలో నాకై – మరణించి
నాపై నీ ప్రేమను – కనుపరచి
మూడవ దినమున – తిరిగి లేచి
మరణమునే జయించి
వేలాది దూతలతో మధ్యాకాశములో
నన్ను కొనిపోవా రానైయున్న

యేషూవ యేషూవ – నా రాజు మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా
యేషూవ యేషూవ – నా సర్వం మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా….

2) నా పేరుతో- నన్ను పిలచి
నీ సాక్షిగా- నిలువబెట్టి
నీ ఆత్మతో- అభిషేకించి
నీ సొత్తుగా- నన్ను మార్చి
కృప వెంబడి కృపతో- యెనలేని ప్రేమతో
నీ సేవకునకు తోడైయున్న

యేషూవ యేషూవ – నా రాజు మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా
యేషూవ యేషూవ – నా సర్వం మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా….

నా ప్రాణమా సన్నుతించుమా

నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును (2)
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా (2) ||నా ప్రాణమా||

ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు (2) ||నా ప్రాణమా||

మేలుతో నా హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును (2) ||నా ప్రాణమా||

ఆరాధన వర్తమానం

మనము ఎప్పుడూ దేవునినే వెంబడించేవారుగానే ఉండాలి. ఎందుకంటే ఆయనే మన జీవితాలకు ఆధారము.

నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియులేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనీలాగందునుభూమిమీదనున్న భక్తులే శ్రేష్టులు; వారు నాకు కేవలము ఇష్టులు. – కీర్తన 16:2,3

ఈ మాటలు మన జీవితాలగురించి తెలియజేయబడుతున్న మాటలు. అనుక్షణము అనుదినము ఆయన ఆధారము మనకు అనుగ్రహించబడుతుంది కనుకనే మన జీవితాలు కొనసాగించబడుతున్నాయి.

యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికిశ్రమలు విస్తరించును. వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపనువారి పేళ్లు నా పెదవులనెత్తను.- కీర్తన 16:4

మరి దేవుడే మనకు ఆధారము అయినట్టయితే? శ్రమలు ముగించబడవలసినదే కదా! ఈ సత్యము గ్రహించినప్పుడే మనము ఆత్మతోను సత్యముతోను ఆరాధించగలుగుతాము. “ఆయనే మనకు క్షేమాధారము”. కనుక ఆ “ఆధారము” అనే స్థానము దేవునికి మాత్రమే మనము ఇవ్వాలి మరే మనుష్యునకు ప్రాధాన్యత ఇవ్వకూడదు.

కరోనా సమయములో అనేక ధనవంతులను వారి ధనము కాపాడలేకపోయింది కానీ మనము దేవుని ఆధారముగా చేసికొని సురక్షితముగా ఉన్నాము.

యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగమునీవే నా భాగమును కాపాడుచున్నావు. – కీర్తన 16:5.

కొన్ని సందర్భాలలో పరిస్థితులు చెయ్యి దాటిపోయినట్టో, దాటిపోయో ఉండవచ్చు. అయితే ఆయనకు అత్యధిక మహిమ కలుగులాగున ఏ పరిస్థితి అయినాసరే ఆయన నీకు ఆధారము కనుక నిన్ను నీ భాగమును కాపాడుతాడు. మనలను కాపాడి భద్రపరచేవాడు కనుక మనము ఆయనను ఆరాధిద్దాము.

మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెనుశ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను.- కీర్తన 16:6.

మన దేవుని కలిగి ఉండటమే మనకు భాగ్యము. అనేక కోట్ల సంపదకంటే ఆయనే శ్రేష్టుడు. సర్వసంపదలు బుద్ధిజ్ఞానములు ఆయనయందే గుప్తములై ఉన్నవి. అటువంటి ఆయనను కలిగి ఉండటమే మనకు మహాభాగ్యము. అయినప్పటికీ మనకొరకు ఆయన ఏమైతే సిద్ధపరచి ఉంచాడో, ఆ మనోహరమైన వాటియందు పాలుపంపులు కలిగి ఉన్నాము. “ఆయనే మనకు స్వాస్థ్యము అయి ఉన్నాడు”.

నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదనురాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకుబోధించుచున్నది – కీర్తన 16:7

నీ యెడల ఆయన కలిగిన ఆలోచనలు బహు విస్తారములు. ఈరోజు నీవు ఈ సత్యాన్ని గ్రహించాలి. నీ జీవితమంతటి కొరకు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలు ఏమై ఉంటాయి? నీకు క్షేమము కలిగించుటకే. నిన్ను ఉన్నతమైన స్థలములలో నిలబెట్టుటకే ఆయన ఆలోచనలు. నీవు సంతోషము కలిగి ఉండుటకై నిన్ను నడిపించుటకైన ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడు.

ఈ సత్యము నీవు గ్రహించినట్టయితే నేను నా దేవుని, నా ఆధారమైన నా దేవుని, నాకొరకు ఉన్నతమైన ఆలోచనలు కలిగిఉన్న దేవునిని నేను నా ఆత్మతోను, సత్యముతోను ఆరాధిస్తాను అని నీవు సిద్ధపడగలుతావు.

 

ఆరాధన గీతము

ఆధారం నీవేనయ్యా (2)
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
 ||ఆధారం||

నీ మహిమ కొరకే నేను
జీవించ చిరకాల ఆశ
నీ దరి కి చేరి
నను నీకర్పించి
సాక్షిగా జీవింతును  (నా దేవా) ||ఆధారం||

Main Message | మెయిన్ మెసేజ్

ఈ సంవత్సరం ముగించబడే సంవత్సరము. గత సంవత్సరము ఏదైతే కొనసాగించబడి నీకు నష్టమో కష్టమో కలిగిందో, ఆ విషయములో దేవుని వాక్యమును బట్టి ఎవరైతే మార్చుకున్నారో, వారి జీవితములో ఆ నష్టము, కష్టము కలిగించిన విషయము ఈ సంవత్సరము ముగించబడవలసినదే! అటువంటివారి జీవితములో అడుగుపెట్టు ప్రతీ చోట నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు. మన దేవుడు నీతో వచ్చువాడు, నీ ముందర నడుచువాడు.

ఈరోజు “మీ వెలుగును ప్రకాశింపనియ్యుడి” అనే విషయము గురించి నేర్చుకుందాము. మనము ఎల్లప్పుడు సిద్ధపడి, ఆయన చిత్తమును కొనసాగించేవారుగా ఉండాలి. యేసు ప్రభువు లోకమునకు వెలుగు అయి ఉన్నారు, అలాగే మనము కూడా యేసు క్రీస్తును అంగీకరించిన దానిని బట్టి లోకమునకు వెలుగు అయి ఉన్నాము.

మీరు లోకమునకు వెలుగైయున్నారు – మత్తయి 5:14
ఎవడును దీపము వెలిగించి, చాటుచోటునైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభముమీదనే పెట్టును – లూకా 11:33.

పాత రోజులలో లాంతరు దీపాలు ఉండేవి. వాటిని వెలిగించి ఎత్తైన ప్రదేశములో పెట్టేవారు. అప్పుడే వాటి వెలుగు ఉపయోగపడుతుంది. మనలను దేవుడే వెలుగుగా చేసాడు. వెలుగుగా చెయ్యబడిన మనము ఎక్కడ ఉంటున్నాము? మంచము క్రిందనో, కుంచము క్రిందనో ఉంటున్నామా లేక దీప స్తంభముపై ఉంటున్నామా? మనము ప్రభువు ఏర్పాటుచేసిన ఆ ఉన్నత స్థానములో ఉన్నప్పుడే మన వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగును బట్టి అనేకులు రక్షించబడి వెలిగించబడతారు. ఇదే మన దేవుని ఉద్దేశ్యము. ఈ సత్యము మనము గ్రహించాలి అప్పుడే సిద్ధపడగలము.

మనలో ధైర్యము గాని, జ్ఞానము కానీ ఉండదు. నేను చెప్తే ఎవరు వింటారు, ఎవరు మారతారు అని అనుకుంటాము. అయితే మనకు మనముగా చేసేది ఏమీ ఉండదు. దీపములో నూనె ఉండి, ఒత్తి ఆ నూనెలో ఉంటేనే వెలుగుతుంది. మనము దీపము మాత్రమే అయితే ఆ దీపమును ఉపయోగించేది దేవుడు. దీపములో నూనె తక్కువైనప్పుడు, ఒత్తి సరిగా లేనప్పుడు దానిని సరిచేయువాడు కూడా ఆయనే. నీ పని కేవలము “ప్రకాశించటమే”. అందుకే దేవుడు నీపై ఉన్న ఉద్దేశ్యమును గ్రహించాలి. అప్పుడే నీవు సిద్ధపడగలవు.

మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి – మత్తయి 5:16.

గదిలోనో, రహస్యముగానో కాదు కానీ, మనుష్యుల ఎదుట నీవు ప్రకాశించబడటానికి దేవుడు నిన్ను వెలుగుగా చేసాడు. సత్క్రియ అనగా దేవుని మహిమపరిచే ప్రతీదీ సత్క్రియయే! మనుష్యుని దృష్టిలో కాదు కానీ దేవుని దృష్టిలో సత్క్రియ.

నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది – కీర్తన 119:105.

దేవుని వాక్యమును బట్టి మనము నడిచినప్పుడు మన జీవితమంతా వెలుగుమయముగా ఉంటుంది. అప్పుడు మనలను చూచేవారు మీ ప్రకాశమును గమనించేవారుగా ఉంటారు. దానిని బట్టి వారు క్రీస్తును గుర్తించగలుగుతారు. ఎందుకంటే నీవు వెలుగుగా నడిచిన వాక్యము మన యేసు ప్రభువే అయి ఉన్నాడు. నీవు ఆ వాక్యము ప్రకారముగా నడిచినప్పుడు నీ జీవితము ద్వారా యేసు ప్రభువునే చూపించేవాడిగా ఉంటావు. దాని అర్థము నీవు చేసిన దానిని గురించి డంబములు పలకమని కాదు గానీ, నీ నడవడికను బట్టి నిన్ను చూసేవారు చెప్పగలగాలి, ఈ వ్యక్తిలో వాక్యము ఉంది అని చెప్పగలుగుతారు. దానిని బట్టి దేవుని నామము మహిమపరచబడుతుంది.

ఇలా నిన్ను బట్టి నీ తండ్రి మహిమపరచబడ్డాడు? ఒకసారో రెండు సార్లో కాదు కానీ, మన జీవితము చివరివరకు ఇలానే మనము ఉండాలి. మనము చివరి దినాలలో ఉన్నాము. మన ప్రభువు రాకడ సమీపముగా ఉంది. ఇన్ని రోజులు ఎలా ఉన్నాకూడా, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి సిద్ధపడు. నిన్ను వెలుగుగా చేసింది, నీ తండ్రి మహిమ పరచబడటానికి.

యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను – యెషయా 42:7

వెలుగుగా చేయబడిన మనము నియమించబడినవారమే కదా! వెలుగుగా చేయబడిన నీవు అన్యజనులకొరకు నిన్ను నియమించాడు. అనగా దేవుని ఎరగనటువంటి వారికొరకు నియమించాడు. “నీతి విషయములలో” నిన్ను పిలిచాడు అనగా “దేవుని నీతిని” కనబరచడానికై నిన్ను పిలిచాడు.

వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది – ఎఫెసీ 5:9

అన్యజనుల ఎదుట దేవుని యొక్క నీతి, సమస్తవిధమైన మంచితనము మరియు దేవుని సత్యము కనపరచాలి. సత్యమనగా యేసుక్రీస్తే. యేసుక్రీస్తు లేకుండా ఏమీ లేదు. కలిగి ఉన్నదేదీ ఆయన లేకుండా కలుగలేదు, మరియు సమస్తము ఆయన కొరకై అయి ఉన్నవి. ఈ సత్యము గ్రహించనంతవరకు అనేకులను పోగొట్టుకొనే వారిగా ఉంటున్నాము. దేవుని సత్యమును ప్రకటించడానికి పాస్టర్ అవ్వవలసిన అవసరము లేదు. ఇది క్రైస్తవ విశ్వాసి అయిన ప్రతివాడు కూడా దేవుని వెలుగును ప్రకాశించవల్సినవాడుగా ఉన్నాడు.

ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి – అపొస్తలులకార్యములు 13:47.

నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. – యొహాను 12: 46.

అన్యజనులు ఎక్కడ ఉన్నట్టు? చీకటిలో ఉన్నట్టేకదా! అయితే వారు చీకటిలో ఉండకుండునట్టు వారికి విశ్వాసాన్ని మనము ప్రకటించి మనయందు ఆ విశ్వాసాన్ని కనపరచినట్టయితే, వారు కలిగిన విశ్వాసాన్ని బట్టి వారు కూడా వెలిగించబడతారు. ఇది దేవుని ఉద్దేశ్యము అయి ఉన్నది.

దావీదును చూస్తే “దేవా అన్యజనులు వెలిగించబడునట్టు నీ ముఖకాంతిని నామీద ప్రకాశింపనియ్యుము” అని ప్రార్థించినాడు. అన్యజనులకు నిబంధనగా నిన్ను ఏర్పాటుచేసుకున్నాడు. నిబంధన అనగా ఇరువురి మధ్య ఒప్పందము. అన్యజనుల రక్షణ కొరకు నీవు నిబంధనగా అనగా ఒప్పందము చేయబడి ఉన్నావు.

దేవుడు నీలో నాలో మహిమ పరచబడాలి, అలాగే నీద్వారా నా ద్వారా అన్యజనులకు రక్షించాలి అనే ఉద్దేశ్యము కలిగిఉన్నాడు.

ఒబెదోదేము ఇంటిలో కొన్ని దినాలు మందసము ఉన్నందుకు, తన కుటుంబము, సొత్తు, తన ఇంటివారు అందరూ ఆశీర్వదించబడేవారుగా ఉన్నారు. పనివారు జీతమునకు పాత్రులు అనే సత్యమును కూడా జ్ఞాపకము చేసుకో. ఇలా దేవుని చిత్తము నెరవేరునట్టు నీవు సిద్ధపడునట్టుగా దేవుడు తోడుగా ఉండును గాక!