13-Nov-2022 – ఆదివారము ఆరాధన – నీ హృదయము సిద్ధపరచుకొనుము

యేసయ్యా వందనాలయ్యా

యేసయ్యా వందనాలయ్యా
నీ ప్రేమకు వందనాలయ్యా ॥2॥
నన్ను రక్షించినందుకు పోషించినందుకు
కాపాడినందుకు వందనాలయ్యా ॥2॥

వందనాలు వందనాలయ్యా
శతకోటి స్తోత్రాలయ్యా ॥2॥
॥ యేసయ్యా వందనాలయ్యా ॥

నీ కృపచేత నన్ను రక్షించినందుకు
వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥

నీ జాలి నాపై కనపరచినందుకు
వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥

ఆనందం నీలోనే – ఆధారం నీవేగా

ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే – నాయేసయ్యా ​స్తోత్రార్హుడా /2/
అర్హతే లేనినన్ను ప్రేమించినావు
జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై /ఆనందం/

1. పదేపదే నిన్నే చేరగా – ప్రతిక్షణం నీవే ధ్యాసగా /2/
కలవరాల కోటలో – కన్నీటి బాటలో /2/
కాపాడే కవచముగా – నన్ను ఆదరించిన
దివ్య క్షేత్రమా – స్తోత్ర గీతమా /ఆనందం/

2. నిరంతరం నీవే వెలుగుని – నిత్యమైన స్వాస్థ్యం నీదని /2/
నీసన్నిధి వీడక – సన్నుతించి పాడనా /2/
నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే – జీవ వాక్యమే /ఆనందం/

3. సర్వ సత్యమేనా మార్గమై – సంఘ క్షేమమేనా ప్రాణమై /2/
లోకమహిమ చూడక – నీజాడను వీడక /2/
నీతోనే నిలవాలి – నిత్య సీయోనులో
నీదర్శనం నా ఆశయం /ఆనందం

నీతో గడిపే ప్రతి క్షణము

నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)
కృప తలంచగా మేళ్లు యోచించగా (2)
నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4) ||నీతో||

మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు (2)
నా ప్రేమ చేత కాదు
నీవే నను ప్రేమించి (2)
రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు (2) ||యేసయ్యా||

గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను భయము లేదన్నావు (2)
నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే (2)
వాగ్ధానము నెరవేర్చి
వారసుని చేసావు (2) ||యేసయ్యా||

ఆరాధన వర్తమానం

ఆదివారము మాత్రమే కాదు కానీ దేవుని సన్నిధిలో ఉన్న ప్రతీసారీ, అలాగే దేవుని మేలులను అనుభవించిన ప్రతీసారీ దేవుని యదార్థముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. మనుష్యులను సంతోషపెట్టడానికి మనము దేవుని సన్నిధికి రాకూడదు. మనుష్యులను సంతోషపెట్టినయెడల మనము దేవుని దాసులము కాము అని వాక్యము సెలవిస్తుంది కదా! దేవుని సన్నిధికి రావడానికి ఏడురోజులు వేచియుండాలా అనే ఆలోచన, ఆశ మనము కలిగి ఉండాలి. మనము దేవుని ఎరిగినవారమై మనము ప్రభువుని ఆరాధించాలి.

యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము – కీర్తన 100:2.

మనలను సృష్టించిన వాడు ఆయన అనే మనము చెప్తాము కానీ ఆ సృష్టికర్తకు తగిన మహిమ మనము చెల్లిస్తున్నామా? కేవలము నీ సృష్టికర్త ఎవరు? నీకు ఏమై ఉన్నారు అనేది నీవు ఎరిగినప్పుడే, నీవు ఆయనను ఎరిగి, ఆయనకు తగిన మహిమను చెల్లించగలుగుతావు. ఆయన ఉద్దేశ్యములు నీపై నాపై ఉన్నాయి కాబట్టే ఇంకా మనము భూమి మీద ఉన్నాము.

దేవుడు మనకు ఇచ్చిన జీవితము అపవాదిచేత పాపము ద్వారా దొంగిలించబడింది. దానిని బట్టి మనము కోల్పోయిన జీవితము కలిగినవారుగా ఉన్నాము. అయినప్పటికీ మనలను ప్రేమించాడు.

మీఅపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను. అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను.
కృపచేత మీరు రక్షింపబడియున్నారు. – ఎఫిసీయులకు 2:1,4-5.

దేవుడు ఎటువంటి స్థితిలో ప్రేమించాడు అనే సత్యము చాలా ప్రాముఖ్యము. మనము మన పాపములచే చచ్చిన స్థితిలో, దేవునికి వ్యతిరేకముగా వున్నప్పుడు మనలను ప్రేమించి, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనలను రక్షించి నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు. దానిని బట్టి కృతజ్ఞతా హృదయము కలిగినవారమై, మన సృష్టికర్త అయిన దేవుని మనము స్తుతించి ఆరాధిద్దాము. నీవు పొందిన నూతనమైన జీవితము దేనికొరకు కొనసాగించబడుతుంది అంటే, దేవుని మహిమ కొరకై!

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు – రోమా 3:23.

పాపము చేసినప్పుడు దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయాము. అయితే ఎప్పుడైతే మనము క్రీస్తును అంగీకరించి, ఆయన వాక్యము ప్రకారము జీవించినప్పుడు దేవుడు అనుగ్రహించిన మహిమను మనము పొందగలుగుతాము. అపవాది అబద్ధములచే మనలను మోసగించి, మనము వ్యర్థమైన వారము అనే ఆలోచనలు పుట్టిస్తుంది. అయితే ప్రతీ ఆదివారము మన దేవుడు తన వాక్యమనే ఉదకస్నానము చేత మనలను శుద్ధీకరిస్తాడు అనే సత్యమును ఎరిగి ఆయన సన్నిధికి రావాలి.

నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండు టకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకనుగ్రహించును. – యోహాను 14:16.

అపవాది నిన్ను ఎప్పుడు మింగుదునా అని ఎల్లప్పుడు అవకాశము కొరకు ప్రయత్నిస్తాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్లప్పుడు ఉంటాడు అని వాక్యము సెలవిస్తుంది. ప్రతీసారీ ఆయన సహాయము మనకు ఆదరణకర్తగా అందిచుటకు సమీపముగానే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ కర్త అనగా ఆదరణను సృష్టించువాడు అని అర్థము. నీ పరిస్థితులలో కావలసిన ఆదరణ నీకు దయచేసేవాడు. ఈ సత్యము నీవు ఎరిగినట్టయితే ఆయన నీకొరకే ఏర్పాటుచేయబడినవాడు అనే సంగతి ఎరిగినట్టయితే ఆయన సహాయముమీద ఆధారపడి నీవు నడిచేవాడవుగాను, అనుభవించేవాడవుగాను ఉంటావు.

మన దేవుడు నష్టము కలిగించడు. పాస్టరుగారి జీవితములో కారు కాలువలో పడిపోయే పరిస్థితికి దగ్గరగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీద ఆధారపడినప్పుడు ఆయన తప్పించినాడు. అలాగే మన సంఘములో ప్రశాంతి సహోదరి కి ప్లేట్లెట్ కౌంట్ 18000 వరకు పడిపోయి క్లిష్టపరిస్థితులలో ఉంటున్నప్పుడు దేవుడు సూపర్ నేచురల్ సర్వీస్ లో సంఘమంతా పార్థించినప్పుడు దేవుడు ఈరోజు ఉదయానికి 40000 కు పెరుగులాగున కృపచూపించాడు, సంపూర్ణమైన కౌంట్ వచ్చేవరకు ఆయన కృప అలాగే ఉంటుంది.

మన దేవుడు మనకు నష్టము కలిగించడు. ఈ సత్యమును ఎరిగినవారమై, అనుభవించినవారమై మనము దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిద్దాము.

 

ఆరాధన గీతము

హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా (2)

పరమ తండ్రి నీకే స్తోత్రం (2) ||హల్లెలూయా||

పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం (2) ||హల్లెలూయా||

యేసు రాజా నీకే స్తోత్రం (2) ||హల్లెలూయా||

Main Message | మెయిన్ మెసేజ్

దేవుని సన్నిధిని అనుభవించాలి అంటే, ఆయన సన్నిధిలో విడుదల అయిన వాక్యము ఎలా మన జీవితములో పనిచేస్తుంది అనే విశ్లేషణ అవసరము. అయితే దేవుని సన్నిధిని అనుభవించడానికి నీ సిద్ధపాటు లేనట్టయితే అది అసాధ్యము. మన దేవుడు నిజమైనవాడు అబద్ధికుడు కాదు. ఈ విషయము అనుభవించప్పుడే మనము నిజమైన సాక్ష్యము ద్వారా మనము దేవుని మహిమపరచగలుగుతాము.

ఆదివారాన మనకు దేవుడు ఇచ్చే వాక్యము మనము దేవునికి మహిమకరముగా ఎలాఉండాలి అనే విషయము కొరకైన వాక్యము. మనము అంత్య దినాలలో ఉన్నాము ఆయన రాకడకొరకై మనము సిద్ధపడాలి. ఈ విషయము మనము ఖచ్చితముగా ఎరిగి ఉండాలి.

మన హృదయము మన దేవుడు కోరుకొనేది. అందుకే ఆయన కోరుకొన్నట్టుగా మనము మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఆత్మీయముగా ఎదగాలి అని ప్రార్థన చెయ్యండి అని అనేకులు అడుగుతారు. అయితే నీ ఎదుగుదల పాస్టర్ గారి ప్రార్థనలచేత రాదు గానీ, నీ సిద్ధపాటును బట్టే జరుగుతుంది. అందుకే నీ హృదయముమీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి.

హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? – యిర్మీయా 7:9

దేవుడు మనలో ఎక్కడ నివసిస్తాడు? మన హృదయములోనే కదా! అందుకే ఈ హృదయమును సిద్ధపరచుకొనుము అని మనతో చెప్పుచున్నాడు. మన యేసు ప్రభువు ఇలా చెప్పుచున్నాడు.

దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును – మత్తయి 15:19

ఇక్కడ చూసిన విషయాలలో ఎదో ఒకటి మన జీవితములో ఖచ్చితముగా ఉంటుంది. ఇవన్నీ కూడా హృదయములోనుండే వస్తాయి కనుక, మన హృదయమును మనము సిద్ధపరచుకోవాలి. జీసస్ కేర్స్ యూ సంఘపు కాపరి అయిన దైవజనుడి ఆరంభదినాలలో మొట్టమొదట సాధన చేసిన విషయము, “నా తలంపు దేవునికి మహిమకరమా కాదా?” ఈ పరీక్ష ద్వారా సరిజేసుకొను సిద్ధపరచుకున్నారు అని సాక్ష్యము కలిగి ఉన్నారు. అలాగే మీరు కూడా నేను ఏమి చేసినా కూడా దేవునికి మహిమకరముగా ఉండాలి అనే ఆలోచన కలిగే ఉండాలి. ఒకవేళ ఈ ఆలోచనలు గనుక మనలో ఉంటే ఏమి జరుగుతుంది? “నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును – కీర్తన 66:18”.

మన హృదయమును సిద్ధపరచుకోకుండా అనేకమైన దురాలోచనలను అనుమతించినప్పుడు మనము చేసే ప్రార్థనలకు జవాబు రాదు. దేవుడు మనలో నివాసము ఉండడు.

దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు.

రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివినన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయుకానరాలేదు నోటిమాటచేత నేను అతిక్రమింపను – కీర్తన 17:3.

పగలు మనము మెళకువకలిగి ఉంటాము కానీ రాత్రి మనము పడుకుంటాము. రాత్రివేళ ఏమి జరుగుతుందో తెలియని స్థితి. అలాగే నీవున్న పరిస్థితులలో ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో నిన్ను దర్శించి పరీక్షిస్తాడు. దేవుని మీద ఆధారపడతావా లేదా? నీ పరిస్థితులలో ఎంతవరకు నిలబడగలుగుతావు అనే పరిశోధిస్తాడు. పెదాలతో ఎన్నైన చెప్తాము కానీ మనం హృదయములోనే సత్యము దాగి ఉంటుంది కాబట్టి దేవుడు హృదయాన్నే పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు.

నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము. సామెతలు 19:21

దేవుడు మన హృదయములను పరిశీలించినప్పుడు సామెతలలో చూసినట్టుగా, “యెహోవా యొక్క తీర్మానమే స్థిరము” అనే ఆలోచన ప్రకారము మనము హృదయాన్ని సిద్ధపరచుకొన్నపుడు ఆ పరీక్షలో నిలబడగలుగుతాము. మనలో ఎటువంటి దురాలోచనగానీ, నోటి మాటను బట్టి కూడా తప్పిపోయే పరిస్థితి గాని రాకుండా కాపాడుకోగలుగుతాము.

అయితే యెహోవా సమూ యేలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. – 1 సమూయేలు 16:7

రాత్రికాల సమయములో పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు అలాగే లక్ష్యపెడుతున్నాడు ఎందుకు అంటే, అయితే సరిచేయడానికి లేదా ప్రోత్సహించడానికి అనగా నీకు మేలు చేయడానికి.

అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మ తోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును – ద్వితీయోపదేశకాండము 4:29.

దేవుడు హృదయాన్ని లక్ష్యపెడతాడు అయితే, నీవు కూడా పూర్ణ హృదయముతో వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షపరచుకుని నిన్ను నడిపిస్తాడు.

సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెనుమీ పూర్ణహృదయ ముతో యెహోవాయొద్దకు మీరు మళ్లుకొనినయెడల, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్యనుండి తీసి వేసి, పట్టుదలగలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయ నను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించును. – 1 సమూయేలు 7:3.

నీవు కూడా పూర్ణ హృదయముతో వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. ప్రత్యక్షపరచుకున్న దేవుడు నీ పరిస్థితులలో విడిపించేవాడుగా అనగా కార్యము జరిగించువాడిగా ఉంటాడు.

ఈ ధర్మ శాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడ లను నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్లునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందును ఆనందించి నీవైపు మళ్లును – ద్వితీయోపదేశకాండము 30: 10.

మనము ఆరంభము బాగా ఉంది. అయితే రాను రాను తొలగిపోయే వారుగా ఉంటాము. అయితే తిరిగి దేవుని వైపుకు మళ్ళుకుంటే అనగా, నీ హృదయాన్ని దేవుని కొరకు తిరిగి సిద్ధపరచుకుంటే ఆయన కూడా నీవైపు మళ్ళుకుంటాడు. అప్పుడు నీవు ఆరంభదినాలలో ఎలా అయితే నీయందు ఆనందించాడో అదేవిధముగా నీవు తిరిగి మళ్ళుకున్నప్పుడు మరలా నీయందు ఆనంధించేవాడుగా ఉంటాడు. మనలను విడిచిపెట్టేవాడు కాదు మన దేవుడు. మనము ఆయనవైపు మళ్ళుకొనే వరకు మనతో మాట్లాడుతూనే ఉంటాడు.