6 గంటలు స్తుతి ఆరాధన పరిచర్య

స్తోత్రము స్తుతి స్తోత్రము

స్తోత్రము స్తుతి స్తోత్రము
వేలాది వందనాలు
కలుగును గాక నీకే మహిమ
ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము
యేసయ్య యేసయ్య యేసయ్య (4)

శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను
యేసే నా సర్వము
యేసే నా సమస్తము ||యేసయ్య||

పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు
సిలువ మరణమునొంది మార్గము తెరిచెను
యేసే నా రక్షణ
యేసే నా నిరీక్షణ ||యేసయ్య||

హల్లెలూయ స్తుతి మహిమ

హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము

ఆ….. హల్లెలూయ … హల్లెలూయ … హల్లెలూయ … || హల్లెలూయ ||

అల సైన్యములకు అధిపతియైన – ఆ దేవుని స్తుతించెదము (2)
అల సంద్రములను దాటించిన – ఆ యెహోవాను స్తుతించెదము ||హల్లెలూయ||

ఆకాశము నుండి మన్నాను పంపిన – ఆ దేవుని స్తుతియించెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతియించెదము
||హల్లెలూయ||

నా యేసయ్యా నా రక్షకా

నా యేసయ్యా నా రక్షకా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)

ప్రేమింతును నీ సన్నిధానమును
కీర్తింతును యేసయ్యా (2)

నా విమోచకుడా నా పోషకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును||

నా స్నేహితుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును||

పాపాన్ని పోగొట్టి శాపాన్ని
తొలగించ

పాపాన్ని పోగొట్టి శాపాన్ని
తొలగించ భూలోకం వచ్చావయ్యా
మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసవయ్య
కన్నీరే తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్య
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య నా
ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య

1. బంగారం కోరలేదు వెండియు కోరలేదు
హృదయాన్ని కోరావయ్య ఆస్తియు అడగలేదు అంతస్థులడగలేదు
హృదయాన్ని అడిగావయ్య నేవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య నా
ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య

2. తల్లి నిన్ను మరచిన తండ్రి నిన్ను మరచిన యేసయ్య మరువాడయ్యా
బంధువులు విడిచిన స్నేహితులు విడచిన యేసయ్య విడువడయ్య
చేపట్టి నడుపునయ్య శిఖరముపై నిలుపునయ్య
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య నా
ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య.

ఆరాధన వర్తమానం

సత్యము ఎరిగిన వారు ఉజ్జీవము కలిగి ఉంటారు. దేవుని ఆరాధించడానికి, దేవుని సిద్ధముగా ఉండాలి. ఎందుకు అంటే? మనము సృష్టించబడినదే ఆయనను స్తుతించడానికి. ఈ సత్యములో మనము జీవించాలి. నా తండ్రి నాలో మహిమపరచబడాలి అనే ఆలోచన కలిగి మనము జీవించాలి. మన పనిలో, నడకలో, పడకలో అన్ని పరిస్థితులలో ఆయన మహిమ పరచబడాలి అనే ఆలోచన కలిగి జీవించాలి. అప్పుడు అపవాదికి అవకాశము మనము ఇవ్వము. అపవాది ప్రయత్నాలు చేసినాకూడా అవకాశము వాడికి దొరకదు.

ఏదీకూడా మనకు బలహీనతగా మార్చబడకూడదు. అది స్నేహితులైనా, వినోదమైనా ఏదైనా సరే మనకు బలహీనత కాకూడదు. దేవునిని మహిమపరచడమే బలహీనతగా మారితే అదే నీకు బలముగా ఉంటుంది.

ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈలాగున సెల విచ్చుచున్నాడునేను ఇశ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తు దేశములోనుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండియు, మిమ్మును బాధపెట్టిన జనములన్నిటి వశములో నుండియు విడిపించితిని. అయినను మీ దుర్దశలన్నిటిని ఉపద్రవము లన్నిటిని పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మామీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగియున్నారు. కాబట్టి యిప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. – 1 సమూయేలు 10:18,19

ఇశ్రాయేలు ప్రజలు దేవుని నిజముగా విసర్జించలేదు. దేవునిగా ఆయనే ఉండాలి. అయితే వారిని నడిపించడానికి ఒకరాజు కావాలి అనుకుంటున్నారు. కానీ దేవుడు తానే వారిని నడిపించాలి అని కోరుకుంటున్నాడు. అయితే వారు దేవుడు కాకా, వేరే నడిపింపు కోరుకుంటున్నారు. మనము కూడా అనేకమైన సార్లు, దేవునికి స్థానము ఇవ్వకుండా మరొకదానికి, మరొకరికి ఆ స్థానము ఇచ్చేవారిగా ఉంటున్నాము.

అయితే మనము అపవాది ఉచ్చులు ఎరిగి ఉండాలి. మనము బలముగా నిలబడాలి అనుకున్నప్పుడే ఆ ఉచ్చులు తంత్రములు మరి ఎక్కువగా ఉంటాయి. అయితే “నా దేవునికే మొదటి స్థానము” అనే డిటర్మినేషన్ కలిగి ఉండాలి. అప్పుడే దేవుని కార్యములు చూడగలిగేలా మన జీవితము సిద్ధపరచబడుతుంది. నీ హృదయములో ఆయనకు స్థానము ఇవ్వకుండా, ఆయన సన్నిధి నీవు అనుభవించలేవు. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించాలి.

ప్రభువుకు ప్రార్థన చేసే సమయములో మన మనస్సు అనేకమైన విషయాల గూర్చి ఆలోచిస్తుంది. దేవునికి కావలిసినది నీ ఆత్మ. నీ శరీరము ఆయన ప్రభావమును అనుభవించగలుగుతుంది గానీ, దేవుడు కోరుకునేది నీ ఆత్మనే. అయితే అనేకమైన వాటితో నీ మనస్సు నిండిపోయింది. అవన్నీ తొలగించకుండా దేవునితో కనెక్ట్ అవ్వలేదు. ఒక డ్రెయినేజ్ పైప్ లో వ్యర్థములు అడ్డుగా ఉండి స్టక్ అయిపోయిన స్థితిలో, క్లియర్ చేసే పౌడర్ వేసినప్పుడు అడ్డుగా ఉన్న వ్యర్థములన్నీ కరిగిపోయి కొంచెము కొంచెముగా డ్రెయిన్ పైప్ ఖాళీ అవుతుంది. అలాగే మనము కూడా ఏ ఏ వ్యర్థములను కలిగి ఉన్నామో, అవన్నీ మనము వాక్యము ద్వారానే తొలగించగలము. ఒక్కో వాక్యము ఒక్కొక్క విషయాన్ని తొలగిస్తుంది. అలా మనము దేవునితో కనెక్ట్ అవ్వగలుగుతాము.

మనము చివరి ఘడియలలో ఉన్నాము. అంత్యకాలములో జరగవలసిన విషయాల కొరకు టెక్నాలజీ పేరుతో అనేకమైన మార్గములు సిద్ధపరచబడ్డాయి. మనము జాగ్రత్త పడకపోతే అపవాది ఉచ్చులలో పడిపోతాము. అపవాది నిన్ను మచ్చిక చేసుకుని మంచిగా మొదలుపెట్టి తరువాత నిన్ను లోబరుచుకుని ఉచ్చులో బంధిస్తాడు.

ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. – ప్రకటన 4:10-11.

దేవుడే సమస్తము జరిగిస్తున్నాడు. ఆయన చిత్తముప్రకారము ఆయనయే సృష్టించి, జరిగిస్తున్నాడు. ఆ విషయము అర్థము చేసుకున్నదానిని బట్టి, ఆ పెద్దలు ఆ కిరీటాలు దేవుని పాదాల వద్ద పడవేసినారు. మేము కిరీటాలకు అర్హులము కాదు, నీవే ఘనతకు అర్హుడవు అని దేవుని చెప్పుచూ స్తుతిస్తున్నారు. అలాగే మనము కూడా ఏది దేవుని స్థానము తీసుకోవడానికి అవకాశము ఇవ్వకూడదు. అలా దేవుని స్థానము దొంగిలించడానికి దేనికి అవకాశము ఇచ్చావో దానిని సరిచేస్తావా ఈరోజు.

ఈరోజు పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ఆయనను స్తుతిస్తావా.

యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు నేను నిన్ను మరచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము. – యెషయా 44:21,22

నీతో ప్రభువు చెప్పుచున్న మాటలు “నీవు నాకు సేవకుడవు” వేరే దేనికీ సేవకుడవు కావు. సేవకుడు అనగా యజమాని ఏమి చెప్తే అది విని ఆ ప్రకారము చేసేవాడు.

ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రభువు ఐగుప్తునుండి విడిపించాక వేరే రాజును కోరుకున్నారు. ఇక్కడకూడా పాపము, అతిక్రమములనుండి విడిపించాక వేరే వాటివైపు మళ్ళుకుంటున్నారు. అయితే ఇప్పుడు నీవు నీ దేవుని వైపు మళ్ళుకుంటే, ఎంత ధన్యుడవు?

యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి.యెహోవా యాకోబును విమోచించునుఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును – యెషయా 44:23

నీవు గనుక దేవునికి సంపూర్ణ స్థానము ఇవ్వగలిగితే, ఆకాశము ఆయన సింహాసనము అయిఉన్నది. సింహాసనము అనగా ఆజ్ఞలు బయలుదేరుతాయి. భూమి ఆయన పాదపీఠము. పరలోకములో బయలుదేరిన ఆజ్ఞలు మన జీవితములో స్థిరపరచబడటానికి వస్తున్నాయి. ఆయన సన్నిధిలో పూర్ణ సంతోషము ఉంది. అయితే అది అనుభవించాలి అంటే నీవు దేవుడు కోరుకున్నట్టే ఆయనకు మొదటి స్థానము ఇవ్వాలి. కనుక నీవు ఆ విడుదల అయిన ఆజ్ఞలు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధముగా ఉండాలి.

ఆరాధన అంటే మనము తగ్గించుకుని ఆయనను హెచ్చించటము. ఆయన నడిపించినదాని బట్టి మనము అన్నీ పొందుకుంటున్నాము. నడిపించేవాడిని మరిచిపోతే మన జీవితము వ్యర్థము. అయితే నడిపించేవాడిని ఘనపరిస్తే, మహిమపరిస్తే మన జీవితము ధన్యము.

కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము. హెబ్రీ 12:15

ఆరాధన అనగా ఆయన నామమును గొప్ప చేయడము, జిహ్వ ఫలము అర్పించడము అనగా నీ ఆత్మ రిసీవ్ చేసుకున్న సత్యమును బట్టి నీవు స్తుతించే మాట. ఇది నీలోపలనుండి వచ్చేది, పెదాలనుండి మాత్రమే కాదు. అప్పుడే నీవు నిజముగా ప్రభువు ఆరాధించగలుగుతావు. ఈరోజు ఆ పరలోకమును అనుభవించడానికి మనకు అవకాశము దొరికింది.

దేవునికి నీ హృదయములో ఉన్న మొదటి స్థానమును దొంగిలించే విషయములు ఏమి ఉన్నాయి అని పరీక్షించుకో. ఏది ఉన్నా దానిని ఒప్పుకుని విడిచిపెట్టు. ​“నీవు నా సేవకుడవు” అని నీ దేవుడే చెప్పుచున్నాడు. నా యొద్దకు మళ్ళుకో అని ఆయన అవకాశము ఇస్తున్నాడు. ఒప్పుకుని విడిచిపెట్టిన దాని వైపు ఇంకెప్పుడూ కనీసము చూడవద్దు. ఆయన నిన్ను నడిపించాలి అని ఆశ కలిగి ఉన్నాడు. ఆయనను పూర్ణ హృదయముతో స్తుతించు

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే } 2

ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ ||

కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ ||

మృత్యుంజయుడా స్తోత్రం మహా ఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ ||

ఆమేన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం } 2

పరలోక రాజ్యము గూర్చిన కొన్ని విషయాలు బోధిస్తూ ఒక ఉపమానము చెప్పారు. ఉదయకాల సమయములో పని కొరకు నిలబడ్డవారిని పొలములో పని చేయుటకు తీస్కెళ్ళారు. ఆ తరువాత మరలా వచ్చి మరొక గుంపును తీసుకెళ్ళారు. అలా సాయంకాలము వరకు ఆ పని జరిగింది.

ఏలాగనగాపరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పని వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి. దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను. తిరిగి దాదాపు అయిదు గంట లకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచిఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా, వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొన లేదనిరి. అందుకతడుమీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచిపనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. మత్తయి 20:1-8

ఆ పరలోకరాజ్యములో ఎవరు వెళ్ళగలుగుతారు అని ఈ ఉపమానము బోధిస్తుంది. ఈరోజు మనము ఆరు గంటల ఆరాధన కొరకు మనము కూడుకున్నాము. ఇది ఈ ఉపమానము ద్వారా పోల్చుకుంటే, పరలోకమును అనుభవించడానికి నీవు వచ్చావు, ఆయన నిన్ను తీసుకొచ్చాడు. పనివారికి జీతముగా ఆ యజమానుడు దినమునకు ఒక దేనారము చొప్పున నిబంధన చేసారు, ఇప్పుడు మనము ఎలా తీసుకోవాలి? యజమానుడు దేవుడు, ఆయనకు కలిగిన పొలము ఆయన సన్నిధి. పనివారు మనము, మన పని ఆరాధించడం. జీతము నిబంధన స్థిరపరచబడటము.

ఇప్పుడు మొదటిగా మనము స్తుతించాము, దానికొరకు నిబంధన స్థిరపరచబడుతుంది. అలాగే కొంచేము సేపు అయినతరువాత మరలా స్తుతిస్తాము, అప్పుడు ఏది న్యాయమో అది ఇవ్వబడుతుంది. నీకు అర్హత ఉంది కానీ దానికి తగినట్టుగా నీకు జరగలేని పరిస్థితిలో, ఏది న్యాయమో నీకు ఖచ్చితముగా జరుగుతుంది. ఈరోజు దేవుని ఆరాధన చేసిన నీవు ఖచ్చితముగా నీవు పొందుకునేవాడవుగా ఉంటావు.

ఇది నీవు మిస్స్ అయిపోయినది పొందుకునే సమయము. న్యాయము పొందుకునే సమయము. అంతా అయిపోయింది ఇంక ఏమి అవకాశము లేదు అని నీవు అనుకుంటున్నావేమో, అయినా సరే నీకు అవకాశము కల్పిస్తున్నాడు. దేవుడు నీలో చూసేది, అసలు నీవు నిలబడుతున్నావా? లేదా?

క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. – రోమా 8:2.

నియమము అనగా ఏర్పాటుచేసిన ప్రకారము జరిగిస్తే ఏ కార్యము జరగాలి అని నియమించబడిందో అది జరుగుతుంది. ఉదాహరణకు జ్వరము వచ్చింది అప్పుడు నియమము ప్రకారము, మన శరీరము బలహీనపడుతుంది. అలాగే వేరే నియమము ఉంది, అది ఆత్మీయ నియమము. అది జీవమునిచ్చే నియమము, అది శరీర నియమముకు పైగా కార్యము జరిగిస్తుంది. ఆ జ్వరము యొక్క ప్రభావమును కూడా జయించి నీవు నిలబడగలుగులాగున అది శరీర నియమమునుండి విడుదల చేస్తుంది.

అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ​నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను. రూతు 1:16-17.

రూతు మోయాబీయురాలుగనుక అన్యజనురాలు అయినప్పటికీ వివాహము ద్వారా ఇశ్రాయేలీయుల కుటుంబమునకు చేర్చబడింది. ఎప్పుడైతే తన అత్త తన ఇంటికి వెళ్ళిపొమ్మని, వేరే పెళ్ళి చేసుకోమని చెప్పినప్పుడు, రూతు ప్రకటించిన మాటలు. రూతు తన భర్తను పోగొట్టుకుని, సమస్తమును పోగొట్టుకుని ఉన్న సమయములో రూతు ప్రకటించిన మాటలు ఇవి.

మోయాబీయురాలైన రూతునీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమెనా కూమారీ పొమ్మనెను – రూతు 2:2.

రూతు ప్రకటించినతరువాత తన ప్రయాణము ప్రారంభము అయింది. తన ఆశీర్వాదపు అడుగుగా అది మొదలయింది.

అప్పుడు బోయజు రూతుతోనా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము. ​​వారు కోయుచేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని¸ యవ్వనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహమగునప్పుడు కుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. – రూతు 2:8.

ఆశీర్వాదపు అడుగుగా మొదలయ్యి సమకూర్పు అడుగుగా తను కట్టబడే అడుగుగా మారుతుంది. ఆమె ప్రకటించిన తరువాత తన ప్రయాణము సాగింది.

యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను. – రూతు 2:12.

రూతు శరీరకముగా తిరిగి కట్టబడింది. ఆత్మీయముగా యేసుక్రీస్తు వంశములోనికి చేర్చబడింది. నీవు నేను కూడా ఈరోజు “నా దేవుడవు నీవే” అని నీవు ప్రకటించుచుండగా నీ సమకూర్పు మొదలవుతుంది. నీవు ప్రకటించినప్పుడు ప్రభువుకు మహిమకరముగా నీ జీవితము మార్చబడుతుంది. ప్రభువు రాజ్యము కట్టేవాడిలా నీవు మార్చబడతావు. ఎంత గొప్ప ధన్యత?