నూతన సంవత్సరపు వాగ్దాన పరిచర్య

నా ప్రాణమా సన్నుతించుమా

నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును (2)
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా (2) ||నా ప్రాణమా||

ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు (2) ||నా ప్రాణమా||

మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును (2) ||నా ప్రాణమా||

అన్ని కాలంబులలో ఉన్న మా దేవుడవు

అన్ని కాలంబులలో ఉన్న మా దేవుడవు
తండ్రి కుమార శుధ్ధాత్మ దేవా ॥2॥

దర్శించుమయా వర్షించుమాపై
ఫలభరితులుగా చేయుమయా
తొలకరి వర్షం కడవరి వర్షం
పంటను విస్తారం చేయుమయ ॥2॥

సంవత్సరములు జరుగుచుండగా
నూతనపరచు నీ కార్యములన్
పరిశుధ్ధాత్మతో మము వెలిగించి
శక్తిమంతులుగ చేయుమయా ॥2॥

దర్శించుమయా వర్షించుమాపై
ఫలభరితులుగా చేయుమయా
తొలకరి వర్షం కడవరి వర్షం
పంటను విస్తారం చేయుమయ ॥2॥

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా (2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా(2) ||నీ కృప||

మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా||

ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా

ఆరాధన వర్తమానం

2022 చివరి ఘడియలలో ఉన్నాము. మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. దేవునితో గడపడానికి వచ్చిన మీరు సిద్ధపడండి.

ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచిమీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లు చుండగా, శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచిగొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు. అందుకు యేసుపదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ? – లూకా 17:12- 17

ఈ మాటలు యేసు ప్రభువు చెప్పుచున్నాడు. యేసు ప్రయాణములో ఉన్నాడు. యేసు వచ్చిన పని, నశించినదానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చినాడు కనుక ఆయన ప్రయాణమై వెళ్తున్నాడు. మన జీవితములో దేవుని వాక్యము “యేసు” ను గా చూడగలము. అనేకసందర్భాలలో మన యొద్దకు వాక్యము వచ్చిన అనుభవము మనకు ఉంది. ఒకవేళ పది మేలులు మనము ఆ వాక్యము ద్వారా పొందినట్టయితే, ఒకదానినే మనము జ్ఞాపకము చేసుకుంటున్నాము. సంవత్సరమంతా ఒక్కోనెలలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మేలులు పొంది ఉంటాము. అయితే మనము ఎదైతే ఆశించామో అదే మనము జ్ఞాపకము చేసుకుంటాము గానీ, దేవుడు తన కృపతో చేసిన అనేకమైన మేలులను జ్ఞాపకము చేసుకోలేము.

ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాద ములయందు వ్యర్థులైరి. రోమా 11 1:20,21

మనము శ్రమలనుండి విడుదలపొందలేదేమో కానీ, ఆ శ్రమలో మనలను నడిపించాడు. ఒక కుటుంబము ఒక సంవత్సరమంతా ఒక మేలుకొరకు ఎదురుచూసారు కానీ, పొందలేదు. అయినా దైవ జనుడిని ఇంటికి ఆహ్వానించబడినప్పుడు, దేవుడు జ్ఞాపకము చేసిన మేలు, ఆ కుటుంబము మరణము ద్వారా నశించబడక తప్పించబడిన సందర్భము. ఎందుకు బ్రతికించాడు అంటే, నీవు ఆశించిన మేలు నీకు దయచేయడానికే అని నీవు గ్రహించు.

ఇశ్రాయేలు ప్రజలైతే, ఐగుప్తులో సమాధులు లేవు అని ఇక్కడకు తీసుకొచ్చావా అని దేవునిని అడుగుతున్నారు. అయితే కానాను లోనికి ప్రవేశపెట్టడానికే ఐగుప్తులోనికి తీసుకువచ్చాడు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు. అయితే ఎవరు మహిమ పరచగలుగుతారు? ఎవరైతే దేవుడూ శ్రమలో సహితము నడిపించాడు అని ప్రకటించగలిగిన వారు ఆయనను మహిమపరచగలుగుతాడు. నా దేవుడు శక్తిమంతుడు, నన్ను తన శక్తిచేత ఐగుప్తు నుండి విడిపించి నడిపించాడు అని ప్రకటించగలుగుతారు.

ఒకవేళ పది మేలులలో తొమ్మిది పొంది ఒక్కటే పొందకపోయినప్పుడు నీలో నిరాశ ఉందేమో దానిని బట్టి నీవు దేవుని స్తుతించకుండా నీవు మౌనముగా ఉంటున్నావేమో, అయితే ఒక్క నాణెము కొరకు దేవుడు చూసినప్పుడు, తొమ్మిది చేసిన దేవుడు మిగిలిన ఒక్కటి నీకొరకు చేయ్యాలేడా అని అలోచించి గ్రహించు. ఈ సత్యము ఎరిగి నీ దేవుని ఆరాధించు. నీ జీవితములో సంపూర్ణమైన మహిమను పొందదగిన వాడు. నీ జీవితములో ముగించబడినదాని గురించి, ముగించబడని దాని గురించి రెండిటిగురించి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిద్దాము.

నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు – యెషయా 43:21

నీ జీవితము యొక్క ఉద్దేశ్యము, దేవుని మహిమను ప్రచురము చేసే జీవితము. 2023 లో నా దేవుని, ఆయన స్తోత్రమును ప్రచురము చేస్తాను అని నిర్ణయించుకొని ఆరాధించు. కృతజ్ఞత అనేది అధికమైన మేలు మనకు తీసుకువస్తుంది. నీవు ఆశించినది పొందుకోవడానికి నీవు చెల్లించే కృతజ్ఞత మార్గము తెరుస్తుంది.

 ఈ సంవత్సరము నేను ఏమీ పొందుకోలేదు అని నీవు అనుకుంటే, 2023 లో ఆ ఖాళీని నింపువాడు నీ దేవుడు. నీ దేవుడు ఖచ్చితముగా నీ జీవితములో మహిమ పొందదగినవాడుగా ఉంటున్నాడు. 2023 నింపబడిన సంవత్సరముగా ఉంటుంది. 2022 లో ఖాళీ గా ఉన్న అక్కౌంట్స్ 2023 లో నింపబడుతున్నాయి. ఈరోజు ఉన్న దుఃఖము 2023 లో తీర్చబడుతుంది. 2023 లో కష్టము అనేది ఉండదు.

ఏ హృదయముతో దేవుని సన్నిధిలో నాట్యమాడాలి అని నీవు అనుకున్నావో, నీవు ఆశించినది జరగక నిరాశలో ఉన్నాసరే అదే హృదయముతో ఆరాధించు. నిన్ను ఈ సంవత్సరమంతా నిన్ను పోషించాడు? నడిపించాడు? భద్రపరిచాడు అని జ్ఞాపకము చేసుకుని ఆరాధించు

ఆరాధన గీతము

పల్లవి: నీవు చేసిన మేళ్ళకు – నీవు చూపిన కృపలకు
అనుపల్లవి:వందనం యేసయ్య – వందనం యేసయ్య (2)

1. ఏ పాటివాడను నేను – నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి – నన్నెంతగానో దీవించావు (2) !! వందనం యేసయ్య!!

2. బలహీనులమైన మమ్ము – నన్నెంతగానో బలపరచారు

క్రీస్తేసు మహిమైశ్వరములో – ప్రతి అవసరమును తీర్చావు (2) !! వందనం యేసయ్య!!

Preparation Message for new year promise | వాగ్దానము యొక్క సిద్ధపాటు కొరకై వర్తమానము

2023 వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి సిద్ధపడదాము

ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగాఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసికవేయడు; వేసిన యెడల క్రొత్తది దానిని చింపివేయును; అదియునుగాక క్రొత్తదానిలోనుండి తీసిన ముక్క పాతదానితో కలియదు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులును పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయ వలెను – లూకా 5:36-38.

మన జీవితాలను కొనసాగించువాడు, రూపుదిద్దువాడు అయిన దేవుడు పాతదానితో కొత్తదానిని జతచేయడు. అనగా పాత సంవత్సరము కొత్త సంవత్సరము వలె ఉండదు. పాత సంవత్సరపు నిరాశతో కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టకు. నిన్ను ఎన్నిక చేసుకొన్నదే ప్రభువు మహిమ కొరకు

కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను; 2 కొరింథీ 5:17.

2022 ముగించబడింది, 2023 నాకొరకు నూతనముగా ప్రారంభమయ్యెను. ఒకవేళ హృదయము గాయముతో ఉన్నయెడల, 2023 లో అదే గాయముతో అడుగుపెట్టకు. నీ హృదయగాయము పాతసంవత్సరములోనే ఉండనీ, 2023 లో సమస్తము నూతనపరచబడుతున్నవి

యెహోవా, నిన్నుగూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చు కొనుము. హబక్కూకు 3:2

ఏమి సంవత్సరములు అంటే ముగించబడినది, ప్రారంభించబడినది అయిన సంవత్సరములు. పాత సంవత్సరములో ముగించబడనిది, కొత్తసంవత్సరములో నూతనపరచువాడు నీ దేవుడు. అందుకే నీ మనస్సును సిద్ధపరచుకో, నేను నిరాశతో కొత్త సంవత్సరములో అడుగుపెట్టను. ఆ పాత సంవత్సరపు నిరాశతో నీవు నూతన సంవత్సరములో అడుగుపెడితే, ఆ కొత్త సంవత్సరముకూడా ఫలభరితముగా ఉండదు. దేవుడు మీకొరకు సమస్తము చేసినప్పటికీ, మనము పోగొట్టుకోవడానికి కారణము, పాత లోపాలతోనే, నిరాశలతోనే కొత్త సంవత్సరములో అడుగుపెట్టడమే. 2022 లో ఏ కార్యములైతే నిరాశతో ఉండిపోయి ఉందో, 2023 ఆ సమస్తమైనవి నూతనపరచబడుతాయి.

పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్య కలను పోలియున్నది. వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు. మత్తయి 25: 1,2

సమస్తము నూతనముగా చేయబడినదానిని స్వతంత్రించుకోవడానికి ఈ సత్యము మనము ఎరిగి ఉండాలి. ఇక్కడ పెండ్లికుమారుని ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు అయితే ఇందులో 5గురు బుద్ధిగలవారు, 5గురు బుద్ధిలేనివారు. ఏంటి వీరిలో తేడా? మన అందరము కూడా 2023 లో అడుగుపెట్టడానికి సిద్ధముగానే ఉన్నాము అయితే మనము ఏ గుంపులో ఉన్నాము?

బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి – మత్తయి 25:3,4.

2023 లో అడుగుపెట్టే మనము తీసుకువెళ్ళవసినవి ఉన్న్నయి. అందులో మొదటిది, “ఆశ”. నిరాశ కాదు కానీ, “ఆశ” కలిగి మనము 2023 అడుగు పెట్టాలి. అపవాది పుట్టించిన ఆలోచననకే బానిస అయిపోయే మనము దేవుని మాటకు మరెంత లోబడాలి? 2023 అన్నింటికీ కూడా సమాధానము దయచేసేదిగా ఉంది.

సిద్దెలో నూనె అంటే నీ హృదయములో ఆశ.

ప్రవచనము: ఖచ్చితముగా ఏదైతే నిరాశలో ముగించబడిందో, ఆ విషయములో 2023 లో దేవుని మహిమపరచే మహిమ కార్యాలు జరుగుతాయి.

ప్రవచనము: ఆరిపోతున్న దీపమునకు నూనె అందించబడ్డప్పుడు ఎలా అయితే మరలా వెలుగుతుందో ఆ విధముగా దేవుడు కార్యము జరిగించబోతున్నాడు. గనుక భయపడకు దేవుడే నీకు సహాయము చేయబోతున్నాడు గనుక నీవు వెలిగించబడతావు, ప్రకాశించబడతావు.

వాక్యములో గమనిస్తే, సిద్దెలలో నూనె లేని కారణముచేత విడిచిపెట్టబడ్డారు. 2022 లో నీలో ఆశలేని కారణాన నీవు ఆశించినది జరగలేదేమో. అయితే 2023 లో నీ కొరకు సమస్తము నూతనపరచబడ్డాయి. నీవు ఆశతో నీవు సిద్ధపడితే నీవు స్వతంత్రించుకుంటావు.

వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి – మత్తయి 25:10.

ఆలస్యమైనా సరే ఖచ్చితముగా నీవు దేని కొరకు ఆశ కలిగి ఎదురుచూసావో, అది ఖచ్చితముగా జరుగుతుంది. దానికి కారణము, సిద్దెలలో నూనె కలిగి ఉండుటయే, అనగా ఆశ కలిగి ఉండుటయే. ఆశతో నీవు అడుగుపెడితే నీకొరకు సిద్దపరచిఉంచబడుతున్నాయి. నీవు కోరుకున్నది విందులో నీకొరకు ఉన్నలాగున, 2023 లో నీవు కోరుకున్నది నీకొరకు సిద్ధపరచబడుతుంది. నీవు అడుగుపెట్టుచోటల్లా సంతోషమే. కనుక 2022 లోనే నీ నిరాశను వదిలిపెట్టు. ఆశకలిగి, నీకొరకు విందు సిద్ధపరచబడుతుంది అనే ఆశకలిగి అడుగుపెట్టు.

Prophetic Service | ప్రవచన పరిచర్య

యెహోవా సేవకుడైన మోషే మీ కాజ్ఞా పించిన సంగతి జ్ఞాపకము చేసికొనుడి, ఎట్లనగా మీ దేవు డైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు; ఆయన ఈ దేశమును మీకిచ్చును – యెహోషువ 1:13.

మీ దేవుడైన యెహోవా 2023 లో విశ్రాంతిని కలుగచేయుచున్నాడు. 2022 లో మిగల్చబడినది, 2023 లో ముగించబడుతుంది. ఆయన ఈ దేశమును మీకిచ్చును అనగా 2023 నీకు ఇస్తున్నాడు అనగా 2023 నీ సంవత్సరము. ఈ మాట స్వీకరించు.

మనకు విశ్రాంతి ఎప్పుడు అవసరము? అలిసిపోయి, ఎదురు చూసి చూసి ఉన్న సమయములో దేవుడు చెప్పుచున్నాడు విశ్రాంతి కలుగచేస్తాను అని. దేవుని వాక్య సత్యము నీవు గ్రహించి స్వీకరించినప్పుడు నీవు దానిని అనుభవించగలుగుతావు.

ప్రభువు మాట వెల్లడిపరిచినప్పుడు దైవజనుడు ఎంత ప్రార్థించినా, విశ్వాసిగా నీవు ఆ మాటను గ్రహించి స్వీకరించేంతవరకు అది నెరవేరదు. అయితే ఆయన ప్రార్థన నీ స్థితిలో నశించిపోకుండా అడ్డుగా నిలుస్తుంది. దేవుడు ఈరోజు నీకు చేసే వాగ్దానము, “నీకు విశ్రాంతి కలుగచేతును”.

వారు అతనికి తెలియపరచినదేమనగానీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితివిు; అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే; దాని పండ్లు ఇవి. సంఖ్యాకాండము 13:27

ఈ సంవత్సరము నీ శక్తిచేత కాక, నీ బలము చేతకాక దేవుని కృపచేత పాలు తేనెలు ప్రవహించేవిగా ఉంటాయి. పాలు అనగా దేవుని మాట. నీ కొరకు వాక్యము విడుదల అయింది అంటే అది నెరవేరబడవలిసిందే. అందుకే ఈ సంవత్సరము అంతా విడుదలయ్యే వాక్యము కొరకు ఆశ కలిగి ఎదురుచూడాలి.

మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తునుండి యోర్దానువరకు తీసుకు వచ్చాడు, తరువాత మోషే చనిపోయాడు. అయితే వాగ్దానము కానాను వరకు. ఇప్పటినుండి యెహోషువ ద్వారా నడిపించాడు.

మీరు నిబంధన మందసమును ఎత్తికొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవియ్యగా వారు నిబంధన మందసమును ఎత్తికొని ప్రజలముందర నడచిరి – యెహోషువ 3:6.

2022 మోషే ద్వారా అయితే 2023 యెహోషువ ద్వారా నడిపించబడుతుంది. ఎటువంటి పరిస్థితులలో ఆ మాటలు స్థిరపరచబడతాయి? యెహోషువ ప్రయాణము ప్రారంభించబడింది ఎలా అంటే దేవుని మాట ముందుగా నడుస్తుంది, వెనుక వారు నడుస్తున్నారు.

ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటునప్పుడు యాజకులు మందసమును పట్టుకుని అడుగుపెట్టగానే యోర్దాను రెండుగా చీలిపోయినది. 2023 లో కూడా మనకు అడ్డుగా ఉన్న ప్రతీ పరిస్థితిలోను, దేవుని మాటను పట్టుకుని వెళ్ళినప్పుడు అది చీల్చబడి మనకు దారి కలుగుతుంది

ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని, నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి, యోధులు వారికి ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడివచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలు ఊదుచు వచ్చిరి. 6:13

బలమైన యెరికో గోడలు పడగొట్టడానికి వారు మందసమును ముందుగా తీసుకెళుతున్నారు. ఆ మందసము అనగా దేవుని మాటను ముందుగా వారు పెట్టినదానిని బట్టి ఆ గోడలు కూల్చబడ్డాయి. 2023 లో తన మాటను బట్టి నీ జీవితములో విశ్రాంతి కలుగచేస్తున్నారు. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే యోర్దాను అయినా, యెరికో అయినా ఆ అడ్డును తొలగించేవాడు నీ దేవుడు.

ప్రవచనము: ఏదైతే అడ్డుగా బలమైనది, నీవు ఆశించినది దొరకకుండా అడ్డుగా ఉందో, ఆ అడ్డును ప్రభువు తొలగిస్తున్నాడు. దేవుడు కలుగచేయు విశ్రాంతిని నీవు చూసెదవు.

దేవుని మాటలు అడ్డుగా ఉన్న నదిని చీల్చగలిగింది, అడ్డుగా ఉన్న గోడలు తొలగించగలిగింది. ఈ రెండు విషయాలు, చీల్చబడటము అనగా సెపరేషన్. తొలగించబడుట అనగా

ప్రవచనము: నీ జీవితములో, నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నదానిని ప్రభువు తొలగించును.

వారితో యిట్లనెనుసర్వలోక నాధుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయు లను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసి కొందురు. యెహోషువ 3:10

దేవుడు మీ మధ్య ఉన్నాడు అనే సత్యము మీరు తెలుసుకొందురు. అనేక సందర్భాలలో మీరు ఈ సత్యమును ఎరిగినవారుగా ఉండలేకపోతున్నాము.

ప్రవచనము: జీవము గల దేవుడు నీతో ఉన్నట్టుగా, నీ కుటుంబములో ఉన్నట్టుగా, ఆయన జరిగించే బలమైన కార్యముచేత నీకును, అనేకులకును వెల్లడిపరచబడుతుంది.

ఈ సంవత్సరము దేవుని యొక్క ఆధారాలు తెలుసుకుంటావు.

వారు అతనికి తెలియపరచినదేమనగానీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితివిు; అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే; దాని పండ్లు ఇవి. – సంఖ్యాకాండము 13:27.

ఇక్కడ వారు ఇంకా స్వతంత్రించుకోలేదు గానీ, దాని కొరకైన ఆధారముగా దాని పండ్లు వాళ్ళు చూసారు. నిజానికి ఈ వాగ్దానము ఎప్పుడో ఇచ్చాడు గానీ, దాని కొరకైన ఆధారము వారు ఇంకా స్వాధీనపరచుకొనక మునుపే చూపించబడింది.

ప్రవచనము: దేవుడు చేసిన వాగ్దానము కొరకైన ఆధారము చూపించి స్థిరపరచును. నీ కుటుంబాన్ని విడుదల చేయును.

ప్రవచనము: 2023 లో దేవుడు మన పక్షమున ఉన్నాడు అనే ఆధారము నీవు చూస్తావు.

అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీ యులను చూచితివిు; మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి.- సంఖ్యాకాండము 13:33.

వేగు చూసి వచ్చిన దేశములో ఉన్నవారు బలవంతులు, ఉన్నత దేహులు. వీరు వాగ్దానము చేయబడిన కానాను దేశములో ఉంటున్నారు. 2023 లో మన శక్తికి మించిన బలమైన పరిస్థితులు ఉండవచ్చు. అయితే దేవుడే విశ్రాంతిని కలుగచేస్తున్నాడు కనుక మనలను 2023 లో ప్రవేశపెట్టేదే ఆ బలమైన పరిస్థితులు తొలగించడానికి.

ప్రవచనము: ఇంతవరకు నీవు పోరాడి పోరాడి అపజయము పొందుతున్న పరిస్థితి 2023 లో ఓడిపోతుంది, నీకు విడుదల లభిస్తుంది. ఇది కుటుంబ ఆశీర్వాదము.

దేవుడు ఇశ్రాయేలీయులందరినీ కానానులో ప్రవేశపెడతాను అని వాగ్దానము చేసాడు. బ్రతికి ఉన్న ప్రతివాడు ఆ వాగ్దానమును స్వతంత్రించుకున్నాడు. ఇంతవరకు బలమైనది అక్కడ ఉందేమో, అయితే నీకు వాగ్దానము ఇవ్వబడింది.

ప్రవచనము: 2023 నీ విడుదల కొరకు నిర్ణయించబడిన సంవత్సరము. బలమైనది చెదరగొట్టబడుటకై నిర్ణయించబడిన సంవత్సరము.

ప్రవచనము: దేవుడు నిర్ణయించిన స్థలములో నీకంటే బలమైన వారున్నప్పటికీ, వారిని వెళ్ళగొట్టి నీకు స్వాస్థ్యముగా దేవుడు ఇవ్వబోతున్నాడు.

మన జీవితాలు ఒక కఠినమైన యజమాని క్రింద ఉంటే, అతడు చెప్పిన పనులు నచ్చినా నచ్చకపోయినా సరే చెయ్యవలసినదే కదా! వారి ఆధిపత్యములో నీ జీవితము ఉంటుంది. అయితే ఆ ఆధిపత్యమునుండి దేవుడు విడుదల చేయును.

ప్రవచనము: 2023 లో మీపై ఆధిపత్యము తొలగించబడుతుంది. మీరు స్వతంత్రులుగా చేయబడుతున్న సంవత్సరము.

ప్రవచనము: బలమైనవారి చేతిలోనుండి అనగా బలమైన పరిస్థితులనుండి విడుదల చేస్తాను అని ప్రభువు చెప్తున్నాడు. 2023 నీ విడుదల సంవత్సరము.

ప్రవచనము: 2023 ఖచ్చితముగా నిన్ను వాడుకొంటున్నాడు, ప్రభువు కొరకు నిలబడతావు. బలమైనదానినుండి విడుదల చేసి వాడుకుంటాడు. పరలోకములో కలిగిన చిత్తము 2023 లో సిద్దపరచబడుతుంది. మినిస్ట్రీ కొరకైన ద్వారములు దేవుడు తెరవబోతున్నాడు.

ప్రవచనము: కుదరని రోగము నయము చేయబడుతుంది. సన్నీ కుదరని రోగము 2023 లో నయము చేయబడుతుంది.

ప్రవచనము: వివాహ జీవితము చెదరినవారు 2023 లో వారి జీవితంలను దేవుడు సెటిల్ చేస్తున్నాడు. ఆర్థికముగా చెదరినవారి జీవితాలు కూడా సెటిల్ చేస్తున్నాడు.

ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల నున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా – ఆ రాజు లందరి సంఖ్య ముప్పది యొకటి. యెహోషువా 12:1, 24.

అనగా 31 రాజ్యాలను స్వతంత్రించుకున్నారు. కానానులో అడుగుపెట్టినాక ఒకదానివెంబడి మరొకటి జయించారు.

ప్రవచనము: 2023 లో ఒకదాని వెంబడి ఒకటి స్వతంత్రించుకుంటారు.

ప్రవచనము: ప్రభువు నిన్ను విస్తరింపచేయుచున్నాడు. ప్రభువు వాగ్దానము చేసినది స్వతంత్రించుకొనుటకై విస్తరింపచేస్తున్నాడు.

ప్రవచనము: స్వాస్థ్యమునకు స్వాస్థ్యము జతపరచబడుతుంది, స్వతంత్రించుకోవడానికే దేవుడు నిన్ను విస్తరింపచేస్తున్నాడు.

ఇశ్రాయేలీయులు దేశములను స్వాధీనపరచుకొన్నారు. కానాను అనే ప్రదేశము, అనేకమైన దేశముల గుంపు. నీ జీవితములో అనేకమైన ఆశీర్వాదాలు, ఒకదాని తరువాత మరొక దానివైపుకు ప్రభువే నడిపించబడుతున్నావు.

ప్రవచనము: విస్తరింపజేయబడుటకై మరొక స్థలములోనికి ఉద్యోగవిషయములో నీవు నడిపించబడుతున్నావు.

ప్రవచనము: జీసస్ కేర్స్ యూ మినిస్ట్రీస్ 2023 అనేక ప్రాంతములకు విస్తరించబడుతుంది.

మన్యపు నివాసుల నందరిని సీదోనీయులనందరిని నేను ఇశ్రాయేలీయుల యెదుటనుండి వెళ్లగొట్టెదను. కావున నేను నీ కాజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలెను – యెహోషువ 13:6

ప్రవచనము: 2023 లో స్వాస్థ్యము పంచిబెట్టబడుతుంది. మీరు స్వాస్థ్యమును పొందుకోబోతున్నారు. నీవు ఏమీ లేని స్థితిలో ఉన్నాసరే, దేవుడు నీవు స్వాస్థ్యము పొందులాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. రావలసిన స్వాస్థ్యము పొందవలసిన వారు సహితము పొందుకుంటున్నారు.

యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవిచేసెనుకాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్నుగూర్చియు చెప్పినమాట నీ వెరుగుదువు. ఆ దినమున మోషే ప్రమాణము చేసినీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడును స్వాస్థ్యముగా ఉండుననెను. – యెహోషువ 14:6,9.

ఈ భూమి కాలేబుకు స్వాస్థ్యముగా ఇవ్వబడింది. ఇది మోషే ఉన్నప్పుడే నిర్ణయించబడింది. అయితే యెహోషువ కానానును స్వతంత్రించుకున్నాక స్వాస్థ్యముగా ఇవ్వబడింది.

ప్రవచనము: నీది అని నిర్ణయించబడి కూడా నీకు ఇంతవరకు దక్కనిది నీకు దక్కుతుంది. ఇల్లు లేని వారు ఇల్లు కొనునట్లుగా దేవుడు సామర్థ్యము కలుగచేయుచున్నాడు. స్వాస్థ్యము సమకూర్చుకొనులాగున నీ చేతి పనులను దీవించి సమకూర్చును.

యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహో వాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహో షువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను – యెహోషువ 14:13.

ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి యున్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకు డైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్లుడి – యెహోషువ 22:4.

రూబేనీయులకును గాదీయులకును అతివిస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతొ ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు. కాబట్టి మా యెడల నీకు కటాక్షము కలిగినయెడల, మమ్మును యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా సంఖ్యాకాండము 32:1

ప్రవచనము: ఇక్కడ చూస్తే, ఇది నాకు తగినది అని నీవు కోరుకున్నది నీకు స్థిరపరచబడుతుంది. విస్తారమైన మందలకు అనుకూలమైన స్థలము సమకూర్చబడుతుంది, స్వాస్థ్యముగా ఇవ్వబడుతుంది.

ప్రవచనము: ప్రభువు నిర్ణయించినది, నీవు కోరుకున్నది నీకు స్వాస్త్యముగా ఇవ్వబడుతుంది.

కనానీయులవని యెంచబడిన ఉత్తరదిక్కున ఎక్రోనీ యుల సరిహద్దువరకును ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారులకు చేరిన గాజీయులయొక్కయు అష్డోదీయుల యొక్కయు అష్కెలోనీయులయొక్కయు గాతీయుల యొక్కయు ఎక్రోనీయులయొక్కయు దేశమును, దక్షిణదిక్కున ఆవీయుల దేశమును కనానీయుల దేశ మంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకున్న అమోరీయుల సరిహద్దువరకును, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండదిగువ నున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవుమార్గ మువరకు లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకును దేశము మిగిలియున్నది. యెహోషువ 13:3-4

కానానీయులకు సంబంధించినది అయినప్పటికీ మిగల్చబడినది. 2022 లో ఏదైతే దేవుని ప్రణాళిక ప్రకారము నిర్ణయించబడి కూడా మిగల్చబడినది, 2023 లో ఖచ్చితముగా ముగించబడుతుంది.

ప్రవచనము: 2022 లో ఏదైతే దేవుని ప్రణాళిక ప్రకారము నిర్ణయించబడి కూడా మిగల్చబడినది, 2023 లో ఖచ్చితముగా ముగించబడుతుంది. నీవు ఉన్నతమైన స్థితిలోనికి మార్చబడుతున్నావు.

ప్రవచనము: దేవుని ప్రణాళికలు ఏదీ కూడా మిగల్చబడదు. ప్రతీదీ నెరవేర్చబడుతుంది.

ప్రవచనము: దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశ్యము ఖచ్చితముగా నీజీవితములో స్థిరపరచబడుతుంది.