ఆరాధన వర్తమానము
ఈ లోకములో ఉన్నవారికి దేవుడు ఉన్నాడు అనే ఆలోచన ఉండదు అందుకే వారు దేవుని సన్నిధికి దూరంగా సంవత్సరపు ఆఖరి ఘడియలు గడిపేవారుగా ఉంటారు. అయితే దేవుని కృప పొందిన మనము, ఆయన మహిమ కరమైన సన్నిధిలో గడిపేవారిగా ఉన్నాము.
ఈ సంవత్సరకాలము మనము అనుభవించిన కృపను, ప్రేమను బట్టి ఆయన సన్నిధిలో కృతజ్ఞతా హృదయముతో మనము కూడివచ్చాము. మరిముఖ్యముగా శత్రువైన అపవాది యొక్క ఆలోచనలు మన జీవితములో ఫలింపకుండా, అనగా మనము మరణములోనికి పోకుండా మన దేవుడు మనలను కాపాడుకుంటూ వచ్చారు.
మనము అనేకమైనవాటి గురించి ప్రభువును అడిగేవారిగా ఉంటాము, ప్రార్థించేవారిగా ఉంటాము. ఈ సంవత్సరము మనము అడిగిన వాటిలో కొన్ని పొంది ఉండవచ్చు, కొన్ని పొందలేదేమో, అయితే, మన కృతజ్ఞత, ఆరాధన ఇంతవరకు అపవాది కోరలలో చిక్కుకోకుండా నడిపించిన దానిని బట్టి, మనము కృతజ్ఞతా స్తుతులు చెల్లించేవారిగా మనము సిద్ధపడదాము.
ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులును పాడగును. లూకా 5:37
దేవునికి మహిమకరముకానివి మన జీవితములో ఏమైనా ఉంటే అవి ఈ సంవత్సరములోనే విడిచిపెట్టి, మనము నూతన సంవత్సరములో అడుగుపెడదాము. పాత తిత్తి మన పాత జీవితము, పాత అలవాట్లు, దేవునికి మహిమకరము కాని విషయములు అయి ఉన్నాయి. గనుక నూతనమైన, కడుగబడిన, పరిశుద్ధపరచబడిన తిత్తి వలే మన జీవితమును సిద్ధపరచుకొని నూతన సంవత్సరములో అడుగుపెడదాము.
నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ యోహాను 5:24
2026 నీ కొరకు ప్రభువు సిద్ధపరచాడు అని నీ వద్దకు పంపబడిన మాట నీవు విశ్వసించినయెడల, నీవు నిత్యము సంతోషము కలవాడిగా ఉంటావు.
2026 నా కొరకే సిద్ధపరచబడిన సంవత్సరము, ఈ సంవత్సరములో నా జీవితములో గొప్ప కార్యములు ప్రభువు చేస్తాడు అని నేను నమ్ముతున్నాను, అని ప్రకటిస్తూ మనము ఆరాధిద్దాము. ఈ సత్యము గ్రహించి, విశ్వసించి మనము ఆరాధిస్తుండగా, మహిమ మేఘము మన చుట్టూ ఆవరించి, మనకు ప్రత్యక్షత అనుగ్రహించి, అపవాదిని అడ్డగించేదిగా ఉంటుంది.
2026 మొదటి దినము నుండి, చివరి దినము వరకు, దేవుడు నీ కొరకు సిద్ధపరచిన ఆశీర్వాదములు నీవు లెక్కించలేనివిగా ఉండబోతున్నాయి.
రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను–దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటివాడను? నా యిల్లు ఏమాత్రపుది? దేవా, యిది నీ దృష్టికి స్వల్పవిషయమే; దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలమువరకు నీ సేవకుని సంతతినిగూర్చి సెలవిచ్చి, మనుష్యునితో మనుష్యుడు మాటలాడునట్లు దయ పాలించి నాతో మాటలాడి, నా సంతతి ఘనతజెందునని మాట యిచ్చియున్నావు.౹ నీ దాసుడనగు నాకు కలుగబోవు ఘనతనుగూర్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవిచేసెదను? నీవు నీ దాసుని ఎరుగుదువు.౹ యెహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్తప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసియున్నావు, అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసియున్నావు.౹ యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు.౹ 1 దినవృత్తాంతములు 17:16-20
ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.౹ ప్రకటన 21:4
నీవు గత కొన్ని సంవత్సరముల నుండి ఫలానా కార్యము జరిగితే నేను జనులమధ్య సాక్ష్యము ఇస్తాను అని నీవు ఎదురుచూస్తూ ఉండి ఉంటే, 2026 లో ఆ కార్యము జరుగును గనుక సిద్ధపడమని దేవుడు నీకు తెలియచేస్తున్నాడు.
మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎఫెసీయులకు 3:20
2025 లో నీవు ఏమైతే అడుగుతూ వచ్చావో, అది ఇంతవరకు జరగలేదేమో, అయితే 2026 లో నీవు అడుగుపెట్టుచుండగా నీవు అడిగినదానికంటే, ఊహించినదానికంటే అధికముగా జరుగును అని ప్రభువు సెలవిస్తున్నాడు.
–అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మ ను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మ ను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. అపొస్తలుల కార్యములు 2:17-18
తమ దేవునిని ఎరిగినవారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు.
మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. –నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. – 2 కొరింథీయులకు 6:16
దేవుడే మన పక్షమున ఉండగా ఎవడు మన ఎదుట నిలువగలడు? ఆయన మనతో సంచరించుచుండగా మనకు శత్రుభయము ఇంక ఉండదు!
గిద్యోను–చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.౹ న్యాయాధిపతులు 6:13
నీ జీవితములో శత్రువు దోచుకుంటున్న పరిస్థితులున్నప్పటికీ, నీవు సంపాదించిన సంపాదన దోచుకోబడుతుంటే, దేవుడు మాకు తోడై ఉంటే అనే ప్రశ్న నీకు వచ్చి ఉంటే, 2026 లో నీ స్థితి మార్చబడుతుంది.
ఇంతవరకు నీ జీవితములో మిద్యానీయులవలే అధికారము కలిగి దోచుకుంటున్న ప్రతీ పరిస్థితినీ నీవు ఓడించెదవు, అలా శత్రువును ఓడించుటకై నిన్ను బలపరుస్తాడు.
ఒంటరి అయినవాడు వేయి మంది అగును, మూకుమ్మడిగా నీ చుట్టూ దాడిజరుగుతుంది, నీవు ఒంటరిగా ఉన్నావు అయితే, నీకు వెయ్యి మంది బలము అనుగ్రహించబడుతుంది. 2026 నీలో దేవుని కార్యము ఖచ్చితముగా కనపరచబడుతుంది.
ఆరాధన గీతము
ఓ మహిమ మేఘమా
ప్రవచన పరిచర్య
యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు. కీర్తనలు 46:8
ఒక్క కార్యము కాదు గానీ, అనేకమైన కార్యములు అని మనము గమనించాలి. యోసేపు జీవితము చూస్తే, కుటుంబమంతా అతనిని విడిచిపెట్టారు, అయితే చివరికి యోసేపే ఆ కుటుంబానికి ఆధారం అయ్యాడు. అలాగే నీవు పడిన స్థితిలో నీవిక ఉండవు గానీ, 2026 లో సింహాసనము పై కూర్చుండబెట్టబోతున్నాడు. భవిష్యత్తు కొరకైన నీ ఆలోచనలను బట్టి, దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు.
నీవు జీవించుట మాత్రమే కాదు గానీ, నీ ద్వారా అనేకులు జీవిస్తారు. నీవు సాక్ష్యమివ్వటమే కాదు గానీ, నిన్ను బట్టి అనేకులు సాక్షులుగా మార్చబడతారు.
క్రీస్తు చేయుచున్న కార్యములనుగూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా, మేము మరి యొకనికొరకు కనిపెట్టవలెనా? అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను. యేసు వారిని చూచి– మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తర మిచ్చెను. మత్తయి 11:2-6
క్రీస్తు చేయుచున్న కార్యములనుగూర్చి యోహాను చెరసాలలో విన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి అని ఈ సంవత్సరము చెప్పబడుతుంది. యోహాను అయితే మేము ఇంకా వేచిచూడాలా? అని అడిగాడు, అయితే ప్రభువు చెప్పుచున్నాడు, 2026 లో వేచి చూడవలసిన అవసరము లేదు, ఖచ్చితముగా కార్యము జరుగుతుంది.
మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తునుగూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.౹ 2 కొరింథీయులకు 2:14
ప్రతి స్థలమందును అనగా 2026 లో ప్రతీ నెల, దేవుని బట్టి, మనకు అపజయము అనేది ఉండదు. నీ ప్రయత్నములు సఫలమగును, ఆమేన్! నీ పోరాటములో విజయము నీదే, ఆమెన్!
బ్రొ. కిషోర్ – 2026 లో పంట చూడబోతున్నావు. సంజయ్ మిశ్ర అనే వ్యక్తి ద్వారా మరొక గృహము అనుగ్రహించబడుతుంది. పోయిన పంట తిరిగి సమకూర్చబడుతుంది.
ఎప్పుడు జరుగుతుందో అని ఎదురుచూసిన ప్రతీ విషయములో లెక్క సరిచేయబడుతుంది. సువార్త కొరకు విత్తిన ప్రతీ వారికి ప్రతిఫలము యొక్క లెక్క సరిచేయబడుతుంది. నీవు కార్చిన కన్నీటి యొక్క లెక్క కూడా సరిచేయబడుతుంది.
నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తనలు 23:5
నీ దేవుడు నిన్ను ఆశీర్వదించే విధానమును బట్టి నీ శత్రువు నిశ్చేష్టుడై ఉంటాడు. నీవు వేచిచూడవలసిన అవసరము లేదు, మొదటి నెలనుండే అది మొదలవుతుంది.
నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోషపరచుము. కీర్తనలు 90:15
నీవు ఎన్ని సంవత్సరములుగా నీ జీవితములో అనవసరముగా జరిగిన నష్టమంతా లెక్క సరిచేయబడుతుంది.
నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ మలాకీ 3:10
నీవు దేవుని సన్నిధికి నీవు సమర్పించిన దశమ భాగము బట్టి, నీ కొరకు ప్రభువు నిర్ణయించిన లెక్క సరిచేయబడుతుంది. ఆకాశవాకిండ్లు విప్పబడి, పరలోక ద్వారములు తెరువబడి, నీవు ఆశీర్వదించబడటము నీవు చూస్తావు, నీ కొరకు సూపర్ నేచురల్ ద్వారములు తెరవబడతాయి.
2026 దేవుడు నీ జీవితములో చేయబోయే కార్యములచేత, వాటిని బట్టి ప్రకటించబడే సాక్ష్యములతో నిండి ఉంటుంది.
నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతిమనుష్యుని వెలిగించుచున్నది.౹ యోహాను 1:9
ఈ నిజమైన వెలుగు, మరణము ఎక్కడ ఉందో, అక్కడకు నడిపించబడుతుంది. ఏ ఏ విషయములలో నీవు 2025 లో మరణకరమైన విషయములలో నీవు ఉంటూ వచ్చావో, ఆ పరిస్థితిలో దెవుని కార్యము జరుగుతుంది.
యేసుప్రభువు పరలోకములోనికి వెళుతున్న సందర్భములో “నేను వెళ్ళుట మీకు ప్రయోజనము” అని చెప్పాడు. ఎందుకంటే, నిత్యము మీతో ఉండుటకు, ఆదరణకర్త పంపబడతాడు అని చెప్పారు.
అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.౹ యోహాను 16:13
2025 లో ఏవైతే ఇంకా ముగించబడలేదో, అవి 2026 లో ముగించబడేవిగా ఉంటాయి.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.౹ అపొస్తలుల కార్యములు 1:8
2026 లో మీరు అడుగుపెట్టినపుడు, మీరు సూపర్నేచురల్ శక్తినొందెదరు. ఆ శక్తిని బట్టి నీవు సాక్షివై ఉందువు. నీ సాక్ష్యము నీవున్న స్థలమందే కాక, భూదిగంతముల వరకు తెలియచేయబడుతుంది.
నీ కుటుంబములో, నీ బంధు మిత్రుల మధ్యలో, దేవుని కొరకైన అనేకమైన జనముల మధ్యలో నీ సాక్ష్యము దేవుని సూపర్నేచురల్ శక్తిని బట్టి, ప్రకటించబడుతుంది. నీ సాక్ష్యము మార్చబడుతుంది.
ఈ సంవత్సరము పరిశుద్ధాత్ముని ప్రవాహముచేత పొర్లబడే సంవత్సరము
–అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మ ను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మ ను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. అపొస్తలుల కార్యములు 2:17-18
కుమారులు, యవ్వనులు మరియు వృద్ధులు అనగా 2026 మూడు సీజన్స్ ని సూచిస్తున్నాయి. ఈ మూడు సీజన్స్ లో కూడా ప్రభువే నడిపించేవాడిగా ఉన్నాడు.
మొదటిగా సీజన్ మొదలైంది అని నీవు అనుభవములోనికి రావడానికి చిన్న కార్యము చేస్తాడు, అటుపై దానికంటే పెద్ద అనుభవములోనికి నీవు నడిపించబడతావు. చివరికి, అంతకు మించిన గొప్ప కార్యములతో నిన్ను నడిపిస్తాడు.
