31-03-2024 – పునరుత్థాన దినపు మొదటి ఆరాధన

స్తోత్ర గీతము 1

యూదా రాజసింహం – తిరిగి లేచెను
తిరిగి లేచెను – మృతిని గెలిచి లేచెను
యూదా రాజసింహం – యేసుప్రభువే
యేసుప్రభువే – మృతిని గెలిచి లేచెను
యూదా రాజసింహం – తిరిగి లేచెను

1. నరక శక్తులన్నీ – ఓడిపోయెను
ఓడిపోయెను – అవన్నీ రాలిపోయెను

2. యేసు లేచెనని -రూఢియాయెను
రూఢియాయెను – సమాధి ఖాళీ ఆయెను

3. పునరుత్థానుడిక – మరణించడు
మరణించడు – మరెన్నడు మరణించడు

4. యేసు త్వరలో – రానైయున్నాడు
రానైయున్నాడు – మరల రానైయున్నాడు

స్తోత్ర గీతము 2

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా పాడెదం
హోసన్నా హోసన్నా హోసన్నా యేసుకే

ప్రేమతో యేతెంచెను పాపమును మోసెను
ప్రాయశ్చిత్తబలిగా ప్రాణమునర్పించెను
“హల్లెలూయా”

మృత్యువును గెలిచెను దుఃఖమును బాపెను
క్రీస్తుగీతం పాడి శ్రీయేసును కీర్తింతుము
“హల్లెలూయా”

నిరీక్షణనిచ్చెను నిట్టూర్పు పోగొట్టెను
నిత్యుండైన యేసుతో నిశ్చింతగా సాగెదన్
“హల్లెలూయా”

విశ్వాసమునిచ్చెను విజయము చేకూర్చెను
విశ్వమంత చాటన్ ప్రభు యేసు వార్తను
“హల్లెలూయా”

అద్భుతమునిచ్చెను భయమును బాపెను
అభయ హస్తమిచ్చి ఈ భువిలో నిలిపెను
“హల్లెలూయా”

స్తోత్ర గీతము 3

నీదు త్యాగమే నాకు విజయము
నీదు మరణమే నాకు జీవము
నీ ప్రేమతో నా పాపముకై
బలియాగమైన నా యేసయ్య
మరణాన్ని జయించి లేచిన
అసాధ్యుడా నా యేసయ్యా

నాకు విజయమే నా యేసుని నామంలో
విజయమే నా యేసుని త్యాగంలో
విజయమే నా యేసుని మరణంలో
జయమే పునరుత్థాన క్రీస్తులో

నా పాప పరిహారము నీవు మోసావయ్యా
నా దోష శిక్షంతయు నీవు భరియించావయ్యా
నీ మరణము మారా వంటి నా గతాన్ని సమాధి చేసింది
పునరుత్థానము నా భవిష్యత్తును మధురముగా మార్చేసింది
“నాకు విజయమే”

 

 

ఆరాధన వర్తమానము

ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైన దినము. మనము శ్రేష్టముగా ఎంచే ఏ దినముకన్నా కూడా ఎంతో శ్రేష్టమైన దినము. మన ప్రభువు సజీవుడై, మరణమును జయించి తిరిగి లేచిన దినము. అపవాది సిగ్గుపడిన దినము.

ఈ దినము యొక్క ప్రాముఖ్యత మనము ఎరిగి ఉంటే, మనము దేనికీ భయపడం. ఈరోజు ఆయన చేసిన కార్యమును మనము జ్ఞాపకము చేసుకుందాము

నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను,౹ లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.౹ -1 కొరింథీయులకు 15:3-4

మొదటి దినము మన పాపముల నిమిత్తము సిలువపై మృతిపొందెను. మన పాపముల నిమిత్తము వెల చెల్లించబడింది. ఆ మొదటి దినముతోనే మన జీవితములు సంపూర్ణము చేయబడలేదు గానీ, మూడవ దినమున ప్రభువు తిరిగి లేచిన తరువాత మన జీవితములు సంపూర్ణము చేయబడ్డాయి.

“నీ మరణము మారా వంటి నా గతాన్ని సమాధి చేసింది పునరుత్థానము నా భవిష్యత్తును మధురముగా మార్చేసింది” అని మనము పాడాము. ఈ మాటలు సత్యము.

మొదటి దినము మన పాపము కొరకై వెల చెల్లించబడింది. మనకు విరోధముగా ఉన్న ఋణ పత్రమును సిలువపై మేకులతో కొట్టివేయబడింది. ఆ సిలువలో ప్రభువు “సమాప్తము” అని చెప్పినాడు. అయితే ఏమి సమాప్తము అయింది అని ఆలోచిస్తే, అది మన పాప జీవితమే. నీవు రక్షించబడటానికి ఏమి జరిగించబడాలో అది అంతా కూడా జరిగించబడింది.

మనకు క్రీస్తులో ఉంటే, మన గత జీవితము జ్ఞాపకము చేసుకోవడానికి కూడా అసహ్యం పుడుతుంది. అటువంటి గత జీవితము సమాధి చేయబడింది.

మూడవ దినమున ఆయన తిరిగిలేచాడు. అయితే అది మన జీవితములో ఎలా అర్థము చేసుకోవాలి? మరణము ఎంతో బలమైనది, ఒకసారి మరణించిన తరువాత ఇక జీవితములేదు. అయితే ఆ మరణమును జయించి ప్రభువు తిరిగ్ లేచాడు.

ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ?౹ -1 కొరింథీయులకు 15:55

ఈ మాటలు దేని గురించి చెప్పుచున్నాడు? ఈ మాటలు నా జీవితములో ఎలా నెరవేరింది అనేది మన ఆశ అయి ఉండాలి. అపవాదికీ మన జీవితమే కావాలి, దేవునికీ మన జీవితమే కావాలి.

దేవుడు సృష్టించిన మనలను అపవాది లాక్కుపోయాడు. ఇప్పుడు దేవుడు ఈ మూడు దినముల సిలువ కార్యము ద్వారా, మరలా దేవుడు తన సొత్తుగా చేసుకున్నాడు.

ప్రభువు రక్తము మన పాపపు బంధకమునుండి మనలను విడుదల చేసాడు. అలాగే తిరిగి లేచిన తరువాత ఆ పాపముపై మనకు కూడా విజయమునిచ్చి, ఓ మరణమా నా బిడ్డ జీవితములో నీ ముల్లెక్కడ? విజయమెక్కడ అని అపవాదిని సిగ్గుపరచాడు.

యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు–ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. -మత్తయి 3:16-17

ఈ మాటలు యేసుకు మాత్రమేనా మనము కూడా తీసుకోవచ్చా?

యేసు–ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. -మత్తయి 3:15

యేసయ్యను అంగీకరించినపుడు ఆయన “నీతి” మనకు కూడా వర్తింపచేయబడింది. కాబట్టి, ఆయనను అంగీకరించిన మనలను నీవు నా ప్రియ కుమారుడవు అని ప్రభువే చెప్పుచున్నాడు.

మన బాప్తీస్మము యేసయ్య బాప్తీస్మమును అనుసరించే ఉన్నది. మనము నీటిలో ముంచబడి తిరిగి లేపబడినపుడు, యేసయ్యకు చెప్పబడిన “ఈయన నా ప్రియ కుమారుడు” అనే మాట మనకు కూడా వర్తిస్తాయి.

“ఓ మరణమా నీ ముల్లెక్కడ?” అంటే ఏమిటి? యేసయ్య దేని గురించి చెప్పుచున్నాడు? యేసయ్య రక్తము అంతకు ముందు చేసిన పాపముల నిమిత్తము చెల్లించబడిందా? జీవితము మొత్తమునకు సంబంధించిన పాపముల కొరకు చెల్లించబడిందా? మన జీవితము మొత్తమునకు సంబంధించిన పాపముల కొరకే!

మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. -అపొస్తలుల కార్యములు 2:24

మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక, ఆయన యందు విశ్వసించిన మనలను కూడా బంధించుట అసాధ్యమే. పాపిగా ఉన్న మనలను ప్రియ కుమారునిగా పిలవడము ఎంత అద్భుతము?

తప్పిపోయిన కుమారుడు పందుల ఆహారముతో కడుపునింపుకున్న దుస్థితి నుండి, తన తండ్రి వద్దకు వెళ్ళగానే, పరుగెత్తి కౌగలించుకొని నా ప్రియకుమారుడు అని చెప్పుచున్నాడు. అదే మన జీవితము కూడా. మరణము మన జీవితమును ఇంక బంధించలేదు.

వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నప్పటి, బాలుడుగా ఉన్నకాలము అంతా, దాసుడుతో సమానమే! అదే బాలుడు ఎదిగినపుడు, ఇది నా తండ్రి ఇల్లు, నాకు స్వతంత్రము ఉంది అని గుర్తెరుగుతాడు.

మనము కూడా దేవుని గురించిన సంగతులలో బాలుడుగా ఉన్నంతకాలము, మనకు ఉన్న బలము, అధికారము, ఆధిక్యత మనము అనుభవించలేము. అందుకే మనము వాక్యములో ప్రతి దినము ఎదగాలి.

మన ఐడెంటిటీ అనగా మన గుర్తింపు, “సజీవుడైన దేవుని కుమారుడు” అనేదే! ఇది మనము పోగొట్టుకోకూడదు. మనము ఆశపడే చిన్న చిన్న వాటిని ఎరగా వేసి అపవాది మనలను లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే, నీకు అవసరమైన ప్రతీదీ, నీ తండ్రి అయిన దేవుడు సిద్ధపరచి నీకు దయచేస్తాడు

ఆరాధన గీతము

నీదు త్యాగమే నాకు విజయము
నీదు మరణమే నాకు జీవము
నీ ప్రేమతో నా పాపముకై
బలియాగమైన నా యేసయ్య
మరణాన్ని జయించి లేచిన
అసాధ్యుడా నా యేసయ్యా

నాకు విజయమే నా యేసుని నామంలో
విజయమే నా యేసుని త్యాగంలో
విజయమే నా యేసుని మరణంలో
జయమే పునరుత్థాన క్రీస్తులో

నా పాప పరిహారము నీవు మోసావయ్యా
నా దోష శిక్షంతయు నీవు భరియించావయ్యా
నీ మరణము మారా వంటి నా గతాన్ని సమాధి చేసింది
పునరుత్థానము నా భవిష్యత్తును మధురముగా మార్చేసింది
“నాకు విజయమే”

పునరుత్థాన దినపు వర్తమానము

ఈరోజు ఎందుకు మనము సంతోషించాలి? మన జీవితము జయకరమైన జీవితము. మనకు ఇవ్వబడిన జీవితమును మనము బ్రతుకుదాము. ఆ జీవితములోనే, మనకు ఇవ్వబడిన జయ జీవితములోనే మనము నడుద్దాము. ఆ మార్గములో ఉన్నంతసేపు జయమే. ఆ మార్గమును విడిచి, అటు ఇటు వెళితే, ఆ జయకరమైన జీవితమును మనము అనుభవించలేము.

అయితే ఒక కండిషన్ ఉంది. అది మన జీవితమును క్రీస్తుకు మహిమకరముగా మార్చుకోవాలి. అయితే ఇది సాధ్యమేనా అంటే, ఖచ్చితముగా సాధ్యమే. ప్రభువే నిన్ను నన్ను ప్రియకుమారుడవు, ప్రియకుమార్తెవు అని పిలుచుచున్నాడు. అంతకంటే గొప్ప భాగ్యము వేరే లేదు.

యేసయ్య తండ్రికి ఎందుకు ప్రియమైన వాడిగా ఉన్నాడు? తండ్రి హృదయము ఏమై ఉందో అదే హృదయము యేసయ్య కలిగి ఉన్నాడు. తండ్రి ఏమి కోరుకున్నాడో, అదే యేసయ్య చెయ్యడానికి ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉన్నాడు, అలాగే చేసాడు.

మనము కూడా అదేవిధమైన మనసు కలిగి ఉంటే, మనము కూడా ప్రియకుమారులమే! పౌలు సీలలు శ్రమపడినప్పుడు అందుకే సంతోషముగా దేవునిని స్తుతించారు.

యేసయ్య శ్రమ పడ్డాడు, శిష్యులు శ్రమ పడ్డారు వారి శ్రమలలో దేవునినే మహిమ పరచారు. ఈరోజు మన దినము. మన శ్రమలలో సహితము, దేవునినే మహిమపరచే జీవితమే మన తీర్మానము అయి ఉండాలి.

మనలను చిక్కులపెట్టడానికి అపవాది అనేకమైన ఆలోచనలు మనలో పుట్టించినప్పటికీ, దానికి ఏమాత్రము అవకాశము ఇవ్వక, మనము క్రీస్తు విజయములో నిలబడాలి.

ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్ర్తీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి సమాధిముందర ఉండిన రాయి దొరలింప బడియుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరు–సజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు –మనుష్యకుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో అనిరి. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసికొని -లూకా 24:1-8

ఈ మాటలు మనకు బాగా సుపరిచితమే. యేసయ్య ఖచ్చితముగా తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన దానిని బట్టి మన జీవితములు ఏ విధముగా ఉంటాయి?

యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి–నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.౹ -యోహాను 20:17

ఈ మాటలు సమాధిలోనుండి లేచిన తరువాత తండ్రి వద్దకు వెళ్ళక మునుపు ప్రభువు చెప్పిన మాటలు. అయితే ఎందుకు ముట్టుకొనవద్దు అని చెప్పుచున్నాడు? అదే యేసయ్య మరణించకమునుపు, అనేకులు ఆయనను ముట్టి స్వస్థపరచబడ్డారు. మరి ఎందుకు ఇప్పుడు ముట్టుకొనవద్దు అని చెప్తున్నారు?

మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;౹ -1 కొరింథీయులకు 15:42

అనగా యేసయ్య చనిపోకమునుపు ఉన్న శరీరమునకు, తిరిగిలేచిన తరువాత ఉన్న శరీరమునకు వ్యత్యాసముంది. ఇంతకు ముందు ముష్యకుమారుడుగా భూమియందు నివసించాడు, అయితే తిరిగి లేచిన తరువాత దేవుని కుమారుడుగా కనపరచబడుతున్నాడు.

మీరు బాప్తిస్మమందు ఆయనతోకూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి.౹ -కొలొస్సయులకు 2:12

ఇప్పుడు యేసయ్యలో దేవుని యొక్క స్వరూపము, అధికారము, మహిమ అంతయూ కనుపరచబడుతుంది. అయితే మరియ మనుష్య స్వభావము కలిగి ఉంది. అనగా మనుష్య స్వభావముతో, మహిమ శరీరమును ముట్టుకోవడానికి లేదు. అనగా పునరుత్థాన జీవితమును ఈ లోకములోనిది ఏదైనప్పటికీ ముట్టుకోవడానికి కూడా అవకాశము లేదు.

పాపము చేయకముందు ఆదాము జీవితమును ఆలోచిస్తే, అది మహిమా జీవితమే. అయితే పాపమును బట్టి కోల్పోయిన మహిమను, యేసయ్య పునరుత్థానుడగుట ద్వారా తిరిగి మనకు ఇచ్చారు.

వారు–సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితోకూడ ఉండుటకు లోపలికి వెళ్లెను. ఆయన వారితోకూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా -లూకా 24:29-30
ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితోకూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చిమధ్యను నిలిచి–మీకు సమాధానము కలుగును గాక అనెను.౹ తరువాత తోమాను చూచి–నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.౹ -యోహాను 20:26-27

అయితే ఇక్కడ రెండు సందర్భములు మొదట మరియతో చెప్పిన మాటలకంటే భిన్నముగా ఉన్నాయి. ఇక్కడ కూడా యేసయ్య మహిమ శరీరముతోనే ఉన్నాడు. అయితే ఇక్కడ తన మహిమను వారికి కనపరుస్తున్నాడు.

శరీర సంబంధమైనది మహిమా జీవితమును నడిపించడానికి అవకాశము లేదు గానీ, మహిమా జీవితము శరీర సంబంధమైనదానిని నడిపించడానికి అధికారము ఉంది.

ఆయన జగత్తు పునాది వేయబడకమునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవునియందు ఉంచబడియున్నవి.౹ -1 పేతురు 1:20

యేసయ్య మృతులలోనుండి లేచిన తరువాత మహిమతో నిండినవాడై ఉన్నాడు. అయితే, తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను.మీలో కూడా ఆ మహిమా జీవితము కనపరచబడుతుంది.

ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులును పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెను. -లూకా 5:37-38

ఆదాము జీవితము ఒక తిత్తిగా చూస్తే, దేవుడే ఆ తిత్తిని చేసాడు. ఆ తిత్తి పాపమును బట్టి అది పాడైపోయింది. అప్పుడు మరొక తిత్తిని ప్రభువు సిద్ధపరచాడు. అనగా మన జీవితము ప్రభువు నందు నూతన పరచబడింది. పాత జీవితము ఇంక జీవించకూడదు.

కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలుపొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి.౹ మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైనయెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము.౹ -రోమా 6:4-5
వారు నా కట్ట డలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును.౹ అప్పుడు వారు నాకు జనులైయుందురు నేను వారికి దేవుడనై యుందును.౹ -యెహెజ్కేలు 11:19-20

ఈ రెండు వాక్యముల ద్వారా మార్చబడబోవు మన జీవితములను గూర్చి ప్రభువు మాట్లాడుచున్నాడు. ప్రభువు యొక్క పునరుత్థానము ద్వారా మన పాత జీవితము గతించి, నూతనమైన మహిమా జీవితము దేవుడు అనుగ్రహించెను అని మనము అర్థము చేసుకోవచ్చు.

ఈ దినము నూతనముగా పునఃప్రారంభమయ్యింది. నూతనముగా మనము క్రీస్తులో నిర్మించబడ్డాము. మనము మట్టి నుండి చెయబడ్డాము. అనగా ఆదామును మట్టిని పిసికి తన శరీరమును సిద్ధపరచాడు. అయితే మన నూతనమైన శరీరము, నలగగొట్టబడిన యేసయ్య శరీరము ద్వారా చెయ్యబడింది. మన నూతనమైన జీవితము శక్తివంతమైనది.

క్రీస్తును గూర్చిన సత్యము ఏమైతే ఉందో, అదే నీ జీవితము అయి ఉంది. ఎమ్మాయి గ్రామమునకు వెళుతున్న ఇద్దరు శిష్యులు, జరిగిన సంగతులను గూర్చి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. యేసయ్య మరణము, సమాధి, పునరుత్థానము గూర్చి వారు మాట్లాడుకుంటున్నారు.

యేసయ్య తిరిగి లేవడము ద్వారా మనకు నూతనమైన జీవితము ఇవ్వబడింది. ఎలా అయితే యేసయ్య తిరిగిలేచిన దాని గూర్చి ఎలా చెప్పుకుంటున్నారో, అలాగే నూతనమైన మన మహిమా జీవితములో జరిగే మహిమా కార్యములను గూర్చి మన చుట్టూ ఉన్న వారు చెప్పుకుంటారు అని అర్థము.

శిష్యులు యేసయ్యను గుర్తుపట్టలేకపోతున్నారు అంటే, మనము నమ్మ శక్యము కాని కార్యములు, ఆశ్చర్యకార్యములే జరుగుతాయి అని అర్థము. మన మహిమా జీవితములో అన్నీ అద్భుతమైన కార్యములే! దానిని బట్టి ఊరూరా కూడా సాక్ష్యములుగా చెప్పబడతాయి. ఇంక మన జీవితముల గురించి నెగటివ్ గా చెప్పుకునే అవకాశము లేదు.

చనిపైన ఎలీషా ఎముకలకు తగిలిన శవము తిరిగి జీవింపచేయబడింది. అలాంటిది, క్రీస్తు శరీరముతో చేయబడిన జీవితము మనది. ఆయన మహిమతో నింపబడిన జీవితము మనది.

ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.౹ -యోహాను 1:4

మనలో ఆయన జీవము ఉన్నది గనుక, మనలో వెలుగు ఉంది. వెలుగు ఉన్న చోట చీకటికి ప్రవేశము లేదు. చీకటి అనగా అపవాదిని సూచిస్తుంది. అనగా ఎన్నిసార్లు అపవాది ప్రయత్నించినా సరే, వాడికి ఓటమే తప్ప ప్రవేశము లేదు. అటువంటి మహిమా జీవితము, ఏలే జీవితము మనది, జయించే జీవితము మనది.

నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను. -యోహాను 16:33

యేసయ్య లోకమును జయించాడు. అలాగే ఆయనను గూర్చి చెప్పబడిన సత్యమే మన జీవితము. గనుక లోకములో శ్రమ వచ్చినప్పటికీ, జయించినవాని బట్టి సిద్ధపరచబడిన మన జీవితములో కూడా మనకు జయమే!