31-03-2023 సూపర్ నేచురల్ సర్వీస్ – ఎంత ప్రయత్నించినా అవ్వడం లేదా?

స్తోత్ర గీతము 1

నీకసాధ్యమైనది లేనేలేదు – నీకసాధ్యమైనది లేనేలేదు /2/
సమస్తము సాధ్యము – హల్లెలూయ సమస్తము సాధ్యము
స్తోత్రం స్తుతి స్తోత్రం – స్తుతి పాత్రుడా నీకే సోత్రం /2/నీకసా/

1. గాలితుఫాను సముద్రము నణచిన దేవా గొప్ప దేవా
గగనము చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా /2/
తండ్రి నీకే స్తోత్రం – ప్రభువా నీకె స్తోత్రం /2/స్తోత్రం/

2. మారా జలమును మధురము చేసిన దేవా గొప్ప దేవా
మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా గొప్ప దేవా/2/
తండ్రి నీకే స్తోత్రం – ప్రభువా నీకె స్తోత్రం /2/స్తోత్రం/

3. ఎర్రసముద్రము పాయలు చేసినదేవా (గొప్ప దేవా)
ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా (గొప్ప దేవా)/2/
తండ్రి నీకే స్తోత్రం – ప్రభువా నీకె స్తోత్రం /2/స్తోత్రం/

 

స్తోత్ర గీతము 2

పల్లవి: విజయ వీరుడా యేసుప్రభువా– జయము జయము నీకే
అపజయమెరుగని యుద్దశూరుడ — జయము జయము నీకే (2)
జయమూ…విజయమూ …(2)
సైన్యములకు అధిపతి నీవే (2)
విజయ వీరుడా యేసుప్రభువా — జయమూ జయమూ నీకే
అపజయమెరుగని యుద్దశూరుడా — జయమూ జయమూ నీకే

1. భయము వణకు కలిగెను – అపవాదికి (అపవాదికీ)
తోక ముడిచి పారిపోయెను – సిగ్గుతో (సిగ్గుతో) (2)
నీ బలము చూచిన శత్రువుకు – చెమటలు పట్టెను
తరుముకొచ్చిన అపవాది సైన్యము – చిత్తుగా ఓడెను (2)
సైన్యములకు అధిపతి నీవే…(2)
విజయ వీరుడా యేసుప్రభువా — జయమూ జయమూ నీకే
అపజయమెరుగని యుద్దశూరుడా — జయమూ జయమూ నీకే హల్లెలూయా ……..8

2. నీప్రేమలోనే విజయమూ ఉన్నది (మాకున్నది)
అంతమువరకూ నిలుచునది – నీప్రేమయే (ఆ ప్రేమయే) (2)
ఆ ప్రేమ తోనే జయించినావే —
ఈ లోకమంతటిని సర్వసృష్టి నీ ముందు నిలిచి –జయమని పాడెను (2)
సైన్యములకు అధిపతి నీవే(2)
విజయ వీరుడా యేసుప్రభువా–జయమూ జయమూ నీకే
అపజయమెరుగని యుద్దశూరుడా — జయమూ జయమూ నీకే (2)
జయమూ..విజయమూ..(2)
సైన్యములకు అధిపతి నీవే (2)
విజయ వీరుడా యేసుప్రభువా — జయమూ జయమూ నీకే
అపజయమెరుగని — యుద్దశూరుడా — జయమూ జయమూ నీకే హల్లెలూయా …….8

స్తోత్ర గీతము 3

భయపడక సంతోషించి గంతులు వేయుము
విశ్వాసముతో నిరీక్షణతో స్తోత్రము చేయుము
యెహోవ గొప్ప కార్యముల్ చేసెను
యెహోవ గొప్ప కార్యముల్ చేయును
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా

1. నీ ప్రార్థన ఫలము నీవు అనుభవింతువు
నీ దుఃఖ దినములు నాట్యముగా మారును

యెహోవ గొప్ప కార్యముల్ చేసెను

2. నీవు పోగొట్టుకొన్నది తిరిగి పొందెదవు
నీవు తలగా ఉందువు తోకగా ఉండవు

యెహోవ గొప్ప కార్యముల్ చేసెను

ఆరాధన వర్తమానము

దేవునిని స్తుతించడానికి సిగ్గుపడక ఉరకలు వేస్తున్న హృదయముతో సిద్ధపడి ఉండాలి. అద్భుతము మొదట నీ హృదయములో సిద్ధపరచబడుతుంది, అక్కడ సిద్ధపరచబడినదే నీ జీవితములో స్థిరపరచబడుతుంది. అపవాదికి దేవునికి ఎల్లప్పుడు యుద్ధము జరుగుతుంది. అపవాది నీ జీవితాన్ని నాశనము చెయ్యడానికి ప్రయత్నిస్తుంటే, దేవుడు నీ జీవితాన్ని మహిమ వెంబడి మహిమ లోనికి నడిపించడానికి ప్రయత్నిస్తాడు.

వారమంతా మనము మన పనులలో నిమగ్నమై ఉన్నప్పటికీ, ఒక సత్యము మనము గ్రహించాలి. అది ఏమిటంటే, అపవాది ఎప్పుడూ మీ జీవితాన్ని నాశనము చెయ్యటానికే పొంచిఉంటుంది. మనము కేవలము దేవుని సన్నిధిలో మాత్రమే నిలవగలుగుతాము.

మన శరీర బలహీనతలను బట్టి మనము మందులు వాడుతున్నప్పటికీ, మనము ప్రార్థన మానకూడదు. ఎలా ప్రార్థించాలి అంటే, “నా శరీరములో ఏ సమస్య అయితే మానకుండా అపవాది ఆధిపత్యము ఏమి ఉన్నా సరే, దానిని యేసు నామములో విరుగగొట్టుచున్నాను” అని అధికారముతో కూడిన ప్రార్థన చెయ్యాలి. అయితే ఇది విశ్వాసము కలిగి చెయ్యాలి. ఎందుకంటే మనకు ఆధారము ఆయనే. నీవు ఎంత లేవాలని ప్రయత్నము చేసిన నిన్ను అంతగా వెనుకకు తీసుకువెళ్ళడానికి అపవాది ప్రయత్నము చేస్తూఒనే ఉంటాడు.

మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీదపడి బెదరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. -కీర్తనలు 18:4-6

భక్తిహీనులకు సత్యము తెలియదు గనుక వారు అపవాదిచేత ప్రేరేపించబడి వారు దూషణ మాటలు పలుకుతారు. అయితే దేవుని పిల్లలమయిన మనము దేవుని చేత కాపాడబడేవారము. నీ పరిస్థితులలో దేవుని చేత జవాబు పొందుకోబోతున్నావు, అందువల్ల అపవాదికి ఎప్పుడూ కూడా ఓటమే అనే సత్యము గుర్తుపెట్టుకోండి. ప్రతి సారీ నీకే విజయము. దానిని బట్టి మన దేవుడు మంచి దేవుడు. నిన్ను తల యెత్తుకొనేవాడిగా ప్రభువు చేస్తున్నాడు. ప్రభువు కార్యములు క్రియలతో కూడినవి. ఆ క్రియలు ఆశ్చర్యకరమైనవి.

శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. -కీర్తనలు 18:27

ఉరులు, పాశములు అనేవి చుట్టుకుని క్రిందికి లాగుతాయి. అయితే నీ స్థితిని చూసిన నీ దేవుడు, ఉత్తరము ఇచ్చేవాడిగా ఉన్నాడు. అయితే నీవు దేవుని మాటను స్వీకరించినప్పుడు దేవుని కార్యము ప్రారంభమవుతుంది. దేవుని కార్యము స్థిరపరచబడుతున్నప్పుడు ఒక్కోసారి మనకు తెలుస్తుంది, మరికొన్నిసార్లు మనకు తెలియదు.

ఉదాహరణకు నీ విరోధులు నీకు వ్యతిరేకముగా మాటలు తూలనాడుతుంటే దానిని బట్టి నీవు కృంగినస్థితిలో ఉంటే, నీ దేవుడు నీకు జవాబు ఎలా ఇస్తున్నాడు అంటే, ఆ మాటలను అణిచివేస్తున్నాడు. ఎలా అంటే నీ జీవితములో దేవుడు చేసే ఆశ్చర్యకార్యములు చూసి వారి మాటలు ఆగిపోతాయి.

దేవుడు మీ ముందు నడుచువాడై ఉన్నాడు. ఎలా ఆయన నడుస్తాడు? ఉదాహరణకు ఎర్ర సముద్రము పాయలుగా అయినప్పుడు ఏమి జరిగింది? మోషే కర్ర యెత్తక మునుపే బలమైన తూర్పుగాలి చేత ఆ సముద్రమును సిద్ధపరిచారు. అందుకే నీ జీవితములో అడ్డులు తొలగించడానికి దేవుడు జవాబు ఇస్తున్నాడు. మీ హృదయములు తృప్తిపరచబడతాయి.

నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును -కీర్తనలు 18:28

ఇప్పుడు నీ జీవితములో చీకటి ఉందేమో, అయితే జవాబుగా వెలుగును ఇవ్వబోతున్నాడు. ఆ చీకటిని వెలుగూఅ చెయ్యబోతున్నాడు.

నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును. -కీర్తనలు 18:29

దేవుని గూర్చిన ఈ సత్యములు ఎరిగినవాడు ఎటువంటి స్థితిలోనైనా కుడా ఈ ధైర్యమును కలిగి ఉంటారు. నా ముందు నడుచువాడిని బట్టి నేను సైన్యమును జయింతును, ప్రాకారములు దాటుదును అని చెప్పగలుగుతారు.

ఒక సందర్భము చూద్దాము. పేతురు చెరసాలలో బంధించబడినప్పుడు, దేవదూత పేతురును బయటకు తీసుకువచ్చింది. అయితే పేతురు అది స్వప్నము అనుకున్నాడు. ఇలానే నీ జీవితములో కూడా ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నాడు. ఈరోజు సూపర్నేచురల్ సర్వీస్ యొక్క ఉద్దేశ్యము “జవాబు”.

నీ యెదుట ఉన్న ప్రాకారమును దాటించుటకు, నీ యెదుట ఉన్న సైన్యమును ఓడించుటకు నీ దేవుడు నీ ముందర ఉన్నాడు.

ఆరాధన గీతము

కృపచూపువాడా నీ కృపతో మమ్మును యెల్లప్పుడు రక్షించువాడా

నీ కృపతో రక్షించి నీ దయతో దీవించి
నన్ను నిత్యము తృప్తిపరిచితివే

జీసస్ కేర్స్ యూ జీసస్ కేర్స్ యూ జీసస్ కేర్స్ యూ
జీసస్ కేర్స్ మీ జీసస్ కేర్స్ మీ జీసస్ కేర్స్ మీ

పరమవైద్యుడై నన్ను స్వస్థపరచి
ఆరోగ్యము అనుగ్రహించితివే
బలమైన శత్రువైనా బలహీన స్థితియైనా
వియ్ డోంట్ కేర్ వియ్ డోంట్ కేర్ వియ్ డోంట్ కేర్
నా ముందు నడుచువాడు
నా యుద్ధం చేయువాడు
నను విజయమునకు నడిపించువాడు.

జీసస్ కేర్స్ యూ జీసస్ కేర్స్ యూ జీసస్ కేర్స్ యూ
జీసస్ కేర్స్ మీ జీసస్ కేర్స్ మీ జీసస్ కేర్స్ మీ

ఎర్ర సముద్రము ఎదురొచ్చినా
యెరికో గోడలు అడ్డొచ్చినా
నా ముందు నడుచువాడు యేసే
నను కాపాడువాడు యేసే
యేసే యేసే నా కోట
యేసే యేసే నా ఆశ్రయము
హల్లెలూయా హల్లెలూయా ఆరాధన
హల్లెలూయా హల్లెలూయా ఆరాధన

విడిపించువాడవు నీవే
రక్షించువాడవు నీవే
యేసే యేసే నా కోట
యేసే యేసే నా ఆశ్రయము

 

ప్రవచనాత్మక వర్తమానము

నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలో చించుడి మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి -యెషయా 51:1

దేవుడు ఇచ్చిన వాక్కును పట్టుకొని ఆశతో కనిపెట్టుచున్న స్థితిలో ఉన్న నీకొరకు. ఎంతో ప్రయత్నించి సఫలముకాక నీరుకారిన స్థితిలో, నిరాశలో ఉన్న స్థితిలో ఉన్న నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు.

పౌలు కూడా, “మామట్టుకు మెము బ్రతుకుదుమన్న నమ్మకమే లేదు” అని చెప్పే అనుభవముగుండా వెళ్ళాడు. ఒక సత్యము – దేవుడు మాట ఇస్తే నెరవేర్చి తీరతాడు. అయితే రోజులు గడుస్తున్నాయి కాని ఇంకా నెరవేరట్లేదు. అయితే ప్రతి ప్రయత్నమునకు సమయము ఉంది, అలాగే దాని ముగింపుకు కూడా సమయము ఉంది.

దేవుని మాట పట్టుకుని, ఏ ప్రాకారమైతే అడ్డుగా ఉందో దానిని దాటడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోండి. రోజులు గడుస్తున్నాయి కానీ, అడ్డు తొలగనప్పటికీ, ఒక సత్యము గ్రహించాలి. అది ఏమిటంటే, నీ దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. నీ దేవుడు ఓడిపోనివ్వడు. నీకు వ్యతిరేకంగా అపవాది భక్తిహీనులను రేపి నిన్ను పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు అయితే నీవు నీ దేవునిని బట్టి నిలబడాలి.

తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయాళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు. -విలాపవాక్యములు 3:25

నీవు చేస్తున్న ప్రయత్నము విషయములో నీవు గ్రహించవలసిన సత్యము ఏమిటి అంటే, దేవుని మాటను పట్టుకుని ప్రయత్నిస్తున్న నీపై దయ చూపువాడు. నీవు చేస్తున్న ప్రయత్నములలో నీ శక్తి, నీ బలము సరిపోవడము లేదేమో, అయినప్పటికీ నీ దేవుడు నీపై దయచూపుచున్నాడు.

నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. -విలాపవాక్యములు 3:26

మనము అనేకసార్లు ప్రయత్నము చేసి, చేసి ఓపిక తగ్గిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతాము. అయితే నీ స్థితిని ఎరిగిన వాడైన నీ దేవుడు ఖచ్చితముగా తన దయగల కార్యమును జరిగిస్తాడు. నీ స్థితిలో నిన్ను పైకెత్తుటకు తన కార్యమును జరిగిస్తాడు. నీవు ప్రయత్నము చేసిన ప్రతిసారీ నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు.

దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకకవారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. -యెషయా 41:17

వారికున్న దయనీయమైన స్థితిలో, ప్రయత్నము చేస్తున్నప్పటికీ ఏమీ జరగని కారణము చేత, ఓపిక సన్నగిల్లిపోతున్నది. అయితే ఆ తగ్గిన ఓపికతోనే దేవునిని వెతికితే, ఖచ్చితముగా దేవుని కార్యమును చూడగలిగేవాడవుగా ఉంటావు.

నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను. -యెషయా 43:25

మన సందర్భములో, ఈ మాటను ఎలా చూడాలి అంటే, నీవు ఉజ్జీవముతో ప్రారంభించినప్పటికీ, ఇప్పుడు నీవు ఓపిక సన్నగిల్లిన స్థితిలో ఉన్నావు. అయితే నీ దేవుడు “నేను నేనే నా చిత్తానుసారముగా నీ స్థితిలో అవసరమైన జవాబు ఇస్తున్నాను” అని చెప్పుచున్నాడు. నీ దేవుడు నిన్ను విడనాడేవాడు కాదు.

దేవుని మాటను బట్టి విశ్వాసము కలిగి ప్రయత్నిస్తున్నారో వారికి మాత్రమే ఈ ధన్యత.

జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను-యెషయా 41:18-19

ప్రయత్నము చేసినా ఏమీ జరగని స్థితిలో తన కార్యము జరిగిస్తున్నాడు. నీళ్ళు దొరకని స్థితిలో నీటికొరకు వెతుకుతుంటే, నదులనే పారచేసి నీ దేవుడు జవాబు ఇస్తున్నాడు. ఎందుకంటే, నీ చుట్టూ ఉన్నవారు అది చూసి ఇది దేవుని కార్యము అని గ్రహించి దేవుని మహిమపరచులాగున.

ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి – యెషయా 51:1

మన జీవితము సాధారణమైనది కాదు. మన జీవితము ఓడిపోవుటకు కాదు. నీవు చేయు ప్రయత్నములన్నిటినీ ఆయన సఫలము చేసేవాడుగా ఉన్నాడు.