స్తోత్రగీతము – 1
యేసయ్య వందనాలయ్యా
నీ ప్రేమకై వందనాలయ్యా
నన్ను రక్షించినందుకు
పోషించినందుకు
కాపాడినందుకు
వందనాలయ్యా
వందనాలు వందనాలయ్యా
శతకోటి స్తోత్రాలయ్యా
నీ కృపచేత నన్ను, కాపాడినందుకు –
వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు-
కోట్లాది స్తోత్రాలయ్యా
నీ జాలి నాపై కనపరచినందుకు –
వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు –
కోట్లాది స్తోత్రాలయ్యా….. //వందనాలు//
జీవ గ్రంథములో నా పేరుంచినందుకు –
వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు –
కోట్లాది స్తోత్రాలయ్యా
నన్ను నరకము నుండి తప్పించినందుకు
వేలాది వందనాలయ్యా
నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా …. //వందనాలు//
స్తోత్రగీతము – 2
ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని
ఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా (2)
నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా ||ఎవరు||
తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక – నీ కొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన – నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ – అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా – ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా – యేసయ్యా నీవెగా ||ఎవరు||
ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణం
నీ సన్నిధానమందు – సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే – నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన – నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన – నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా – నిలిచె నా యేసయ్యా ||ఎవరు||
స్తోత్రగీతము – 2
రాజుల రాజుల రాజు
సీయోను రారాజు (2)
సీయోను రారాజు నా యేసు
పైనున్న యెరూషలేము నా గృహము (2)
తల్లి గర్భము నుండి వేరు చేసి
తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)
సీయోను కొరకే నన్ను ఏర్పరచిన
సీయోను రారాజు నా యేసు (2)
||రాజుల||
నిషేధించబడిన రాయి
సీయోనులో మూల రాయి (2)
ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన
సీయోను రారాజు నా యేసు (2)
||రాజుల||
ఆరాధన వర్తమానము
ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. -మత్తయి 6:31-32
నీవు అడగకమునుపే నీ అక్కరలు ఎరిగిన వాడు నీ దేవుడు. ఎంత మంచి దేవుడో నీ యేసయ్య కదా!
సీయోను నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి.౹ -జెఫన్యా 3:14
సీయోను నివాసులారా అంటే దేవుని పట్టణమునకు చెందిన మనమే! ఈ సంగతి గుర్తెరిగి మనము జీవించినట్టయితే, పరలోకమే మనలను ముందుకు నడిపిస్తుంది. అటువంటివారి ఆలోచన భూసంబంధమైనవాటి మీద ఉండదు.
సీయోను పట్టణమునకి నిన్ను నన్ను చేర్చినది దేవాదిదేవుడే! “ఇశ్రాయేలీయులారా” అంటే తనకొరకు ప్రత్యేకపరచుకున్న మనమే! నిజానికి ఎటువంటి మంచితనము లేని జీవితములు మనవి. అయినప్పటికీ నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఈ సత్యమును గ్రహించినట్టయితే నీవు జయధ్వని చేస్తావు. భూలోకములో ఉన్న రాజులు వచ్చినప్పుడే ప్రజలు ఆ రాజ్ గొప్పతనాన్ని కీర్తించి పొగుడుతారు. మన రాజుల రాజైన ప్రభువు సన్నిధిలో మీరున్నప్పుడు ఇంకెంత సంతోషముతో కీర్తించి పొగడి స్తుతించాలి.
ఈలోకములో ఉన్న సమస్త ప్రజలూ ఆయన ప్రజలే! అయినప్పటికీ నిన్ను ప్రత్యేకమైన వాడిగా ముద్రించాడు. ఎందుకు మనకే ఈ ఆధిక్యత అని ఆలోచిస్తే, ఆయన ఏమై ఉన్నాడో నీ ద్వారా లోకమునకు ప్రకటించాలి అనేది ఆయన ఆశ అయి ఉన్నది.
ఓ ఇశ్రాయేలూ, దేవుడు తనకొరకు ప్రత్యేకపరచుకున్న (నీ పేరు పెట్టుకో) నీ భాగ్యమెంత గొప్పది. నీవు దేవుని మార్గమై ఉన్నావు.
“యెరూషలేము నివాసులారా” అంటే దేవుని నివాస స్థలము. మనలో కూడా దేవుడు నివాసము ఉంటున్నాడు. మనము లోకములో ఉన్నట్టు కాదు గానీ మనము ప్రత్యేకమైన వారిగా ఉన్నాము. మనకు దేవుడు ఈరోజు చెప్పుచున్న మాట, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. నీకు నాకు ఉన్న ఆధిక్యత ఎరిగి ఉన్నట్టయితే మనము అలాగే ఉంటాము.
సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు. -యెషయా 12:6
ఈ సత్యమును ఎరిగి ఆయనను స్తుతిస్తే ఏమి జరుగుతుంది? ఘనుడైన దేవుడు మన జీవితాల ద్వారా ప్రకటించుకుంటాడు. అనగా దేవుని ఘనత నీ జీవితము ద్వారా ప్రకటించుకుంటాడు. అనగా నీ జీవితములో ఘనమైన క్రియలు ఆయన చేస్తాడు. ఆ క్రియల ద్వారా ఆయన ఘనత లోకమునకు ప్రకటించబడతాయి.
సీయోను నివాసులారా, నేను వచ్చి మీమధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.౹ -జెకర్యా 2:10
నీ దేవుడు ఘనుడై ఉన్నాడు, మీ మధ్య నివాసము చేయువాడు గనుంక సంతోషముతో పాటలు పాడుడి.
మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవునిబట్టి ఉత్సాహధ్వని చేయుడి. -కీర్తనలు 81:1
మన దేవుడు బలమైనవాడు. మనము బలమైన జనాంగమై ఉన్నాము. ఈ సత్యమును ఎరిగి ఉన్నట్టయితే దేవునిని సంతోషముతో ఆరాధించండి. ఈరోజు మన జీవితములు మార్చబడాలి, దుఃఖముతో వచ్చిన నీవు సంతోషముతో తిరిగి వెళ్ళాలి.
రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వనిచేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానముచేయుదము -కీర్తనలు 95:1
నీవు దేవుని మాటలు నీ నోట ప్రకటిస్తావో, అప్పుడు అపవాది భయముచేత వణుకుతాడు. ఆ మాటలో జీవముంది, బలముంది.
మనము సీయోను పట్టణమునకు చెందినవారము, ఇశ్రాయేలుగా పిలువబడినవారము, యెరూషలేముకు చెందినవారము. నీ ఆత్మతోనూ, ఈరోజు నీకు ప్రకటింపబడిన సత్యముతోను నీ దేవునిని ఆరాధించు.
స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. -కీర్తనలు 50:23
ఎప్పుడైతే నీవు దేవునిని స్తుతిస్తున్నావో అప్పుడు దేవుని రక్షణ కనపరచబడునట్లు మార్గము సిద్దపరచబడుతుంది. ఒకవేళ నీవు స్తుతించకుండా మౌనముగా ఉంటే, నీ రక్షణ కొరకు సిద్ధపరచిన మార్గము తెరువబడదు. ఈ సత్యము ఎరిగి, నీ దేవుని మాటను నమ్మి, ఈరోజు చుట్టూ ఏమి జరుగుందో లెక్కచేయకు, కేవలము నీ దేవునిని ఆరాధించు, నీవు ఈరోజు దేవుడు నీకొరకు సిద్ధపరచినది నీవు పొందుకునే వేళ్ళాలి.
ఆరాధన గీతము
బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు
శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము
సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)
హల్లెలూయా……..హల్లెలూయా (2)
హల్లెలూయా……..హల్లెలూయా హోసన్న
హల్లెలూయా……..హల్లెలూయా
1. ఎల్ ఓలామ్ (2)
అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2)
నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు
నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2)
హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా
2. ఎల్ షద్దాయ్ (2)
పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు (2)
రెక్కలపై మోసావు – రక్షణ శృంగము నీవేగా
నీ మాటున దాచె దేవా మాటను నెరవేర్చే దేవా (2) ||హల్లెలూయా||
3. అడోనాయ్ (2)
ప్రభువైన దేవుడవు -ప్రభువులకు ప్రభువు నీవు (2)
సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు
నీవే నాకు ప్రభువు -నీవేనా యజమానుడవు (2) ||హల్లెలూయా||
నీవు బలహీనుడవు కాదు, నీ జీవితము బలహీనమైనది కాదు. నీ దేవునిని బట్టి నీవు బలపరచబడుతున్నావు, నీ జీవితము బలపరచబడుతుంది.
నీలోని ఆసక్తిని బట్టి ఆయన తనను తాను నీకు ప్రత్యక్షపరచుకుంటాడు. నీ ఆశను ఆయనకు కనబరుచుకో! నీవు ఆయనను గూర్చి ఏమి నమ్ముతున్నావో ప్రకటించు.
సమస్తము నీ పక్షమున అనుకూలపరచేవాడు, నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని ఆయన నీకు చెప్పుచున్నాడు.
నా యజమానుడా అని ప్రకటించు! ఆయన నీ చేయి పట్టుకోవడానికి ఆయన సిద్ధమే నీ ఆశను కనబరచడానికి నీవు కూడా సిద్ధపడి ప్రకటించు.
నీ ప్రతీ బలహీనతను ఎరిగినవాడుగా నీ జీవితములో ఆయనే తనను తాను మహిమపరచుకుంటాను అని చెప్పుచున్నాడు.
నిన్ను నీవు ఆయనకు లోబరుచుకుంటావా! నీ హృదయమును కుమ్మరించు! ఆయన అబద్ధికుడుకాదు. నన్ను ముట్టు, నన్ను విడుదల చెయ్యి అని విశ్వాసముతో అడుగు!
నీ జీవితము మార్చడానికే నీ ముందు ఆయన నిలుచున్నాడు. ఈ సమయము పోగొట్టుకోవద్దు! నోరు తెరిచి మాట్లాడు ఆయతో మాట్లాడు
నిన్ను చిగురింపచేయడానికి నీ యెదుట నిల్చున్నాడు. ఎవరూ ప్రేమించని నీ జీవితాన్ని ఆయన ప్రేమించినవాడు అని గుర్తిస్తే ఆయనతో మాట్లాడు, స్తుతించు.
ఎవరూ ప్రేమించని నీ జీవితాన్ని ఆయన ప్రేమించినవాడు అని గుర్తిస్తే నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకో! నన్ను అంగీకరించు తండ్రీ అని అడుగు! మహిమా జీవితముగా మార్చు తండ్రీ అని అడుగుతావా! ఈ దినమే నీ రక్షణ దినము!
నీవు మార్చుకోవలనుకున్నది మార్చుకో, సిద్ధపరచుకోవాలనుకున్నది, నీవు సిద్ధపరచుకో! ప్రభువు నీతో మాట్లాడేది గ్రహించు
వారము కొరకైన వాక్యము
ఎప్పుడైతే నీ మనసును ఆయనపై లగ్నము చేస్తావో అప్పుడు ఖచ్చితముగా ఆత్మపూర్ణుడుగా మార్చబడతావు! ఆమేన్! వాక్యము ద్వారా ప్రభువు ఏమి తెలియచేస్తున్నాడో, ఆ ప్రకారము మన జీవితము ఖచ్చితముగా అలాగే ఉండాలి అని తీర్మానము కలిగి జీవించడమే అంతే! ఈరోజు “నిన్ను నీవు ప్రత్యేకపరుచుకో” అని ప్రభువు చెప్పుచున్నాడు.
యెహోవా–నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.౹ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.౹ -ఆదికాండము 12:1-2
అబ్రహామును కూడా ప్రత్యేకపరచుకొమ్మని ప్రభువు చెప్పాడు. నిన్ను నీవు ప్రత్యేకముగా సిద్ధపరచుకొమ్మని అంటున్నాడు. ఆదివారపు వాక్యము మన ఆత్మకు కలిగిన కల్మషమునుండి పరిశుద్ధపరచే వాక్యము!
అప్పటి వరకు జాలరిగా ఉన్న పేతురును నన్ను వెంబడించు అని చెప్పుచున్నాడు. అబ్రహామును, పేతురును, జబదయి కుమారులను పిలుచుకున్న దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ప్రత్యేకపరచుకోమంటున్నాడు అంటే ఆయనకు మన మీద ఒక ఉద్దేశ్యము ఉంది. ఎలా ప్రత్యేక పరచుకోవాలి? లేఖనములు ఏమి చెప్పుచున్నాయి అని చూస్తే, లోకమునుండి నిన్ను నీవు ప్రత్యేక పరచుకో!
మీరు లోక సంబంధులైనయెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.౹ -యోహాను 15:19
నేను లోకసంబంధిని కాదు! నేను లోకమున్నట్టుగా ఉండను నేను ప్రత్యేకముగా ఉంటాను. నేను సజీవుడైన యేసయ్యను పోలి ఉంటాను అని తీర్మానము చేసుకొంటావా! యదార్థముగా ఆయనతో చెప్పు!
యవ్వనస్థులకు స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఒకవేళ వారు ప్రభువుకొరకు సిద్ధపడినప్పటికీ, వారి స్నేహితులు వారిని లోకసంబంధమైన కార్యములవైపు ప్రేరేపిస్తారు.
మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.౹ -1 కొరింథీయులకు 15:33
దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. -కీర్తనలు 1:1-2
గతవారము ఎక్కడైనా ఇక్కడ చెప్పబడిన మాటలు మన జీవితములో ఉంటే ఇప్పుడే ప్రభువుతో ఒప్పుకుందాము విడిచిపెడదాము! ఒకవేళ ప్రభువు ఈరోజు సూటిగా అడిగితే ఏంటి మన సమాధానము!
ఈరోజు లోకములో సరదాగా ఉండటము అంటే డ్యాన్సులు, మందులు విందులు, అపహాస్య పూరితమైన కామెడీ షోలు కలిగి ఉండటము. అయితే మనము దేవునిచేత పిలువబడినవారము గనుక మనము వీటన్నిటినుండి ప్రత్యేకపరచుకోవాలి.
వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.౹ -యాకోబు 4:4
లోకముతో స్నేహముచేయాలి అనిగానీ, లోకములో ఉన్నట్టుగా ఉండటానికి నీవు ప్రేరేపించబడితే, దేవునితో వైరము పెట్టుకుంటున్నావు అని నీకు తెలుస్తుందా! దేవుని యందలి భయము లేకపోతే మన జీవితము పోగొట్టుకుంటాము.
దేవుని సన్నిధిలో గడపడానికి ఆశకలిగి తహతహలాడే హృదయము కలిగి ఉండుట అనేది ప్రత్యేకపరచుకున్నవాని లక్షణము! దావీదు ఏడుమారులు ప్రార్థించేవాడుగా ఉన్నప్పటికీ ఆయన సన్నిధిలో ఎప్పుడు కనబడతానో అనే ఆశ కలిగి ఉండేవాడు.
అపవాది పొంచి ఉన్నది అనే సంగతి మరచిపోకు. అపవాది దాడి చేసే అవకాశము మనమే ఇస్తాము. ఎప్పుడైతే లోకము వైపు ఆశగా చూస్తామో అప్పుడు అపవాదికి అవకాశము ఇచ్చినట్టే. దేవుని భయము లేక దేవునిని విసర్జిస్తావో అప్పుడు దేవుడితో వైరమే! ఒక్కోసారి మనము ఆత్మీయముగా బలముగా ఆరంభిస్తాము కానీ చివరికి శరీరరీతిగా ముగించబడేవారముగా మారిపోతాము. అలా ఉండకూడదు!
నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.౹ అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైనయెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది.౹ -ఫిలిప్పీయులకు 1:21-22,24
నేను చనిపోతే లాభమే కానీ నేను జీవించుట మరి అవసరము. మన జీవితము ద్వారా దేవుని ఘనత, మహిమ ప్రకటించబడాలి. గనుక నేను జీవించుట మరి అవసరము! అపవాది మనలను ఖచ్చితముగా ఉచ్చులో బిగించడానికి ప్రయత్నిస్తాడు. అందుకే మనము మరి జాగ్రత్త గలిగి ఉండాలి.
మీరు లోకమునకు ఉప్పయి యున్నారు-మత్తయి 5:13
ప్రభువు నీ గురించి చెప్పుచున్న మాటలు ఇవి. ఉదాహరణకు మనము వంట చేసేటప్పుడు రుచి కొరకు ఉప్పు వెయ్యవలసినదే. ఆ వంట లోకమైతే, మీరు ఉప్పు అయి ఉన్నారు. ఈ లోకమునకు ఉప్పుగా మనము జతచేయబడితే ఆ లోకము రుచికరముగా, అనగా సంతోషముగా మార్చబడుతుంది.
లోకములో ఉన్నవారు రక్షణ లేనివారుగాను, అపవాది క్రియలకు లోబడి జీవిస్తారు. మనము ఆ ప్రదేశములో ప్రత్యేకముగా మనము కనపరచుకున్నప్పుడు ఆ ప్రదేశము దేవునికొరకైన రుచిని నింపేవారిగా ఉంటాము. ఉప్పు ఎలాగైతే కరిగితేనేగానీ కూరకు రుచి రాదో, అలాగే మనము మనతో ఉన్న లోకములో మనము ప్రత్యేకమైన వారం అని గ్రహిచులాగున మనము నిలబడితేనే గానీ వారి జీవితములో వారు దేవుని రుచి ఎరిగేవారుగా మార్చబడలేరు.
దేవుని సన్నిధిలో ఎంత సమయము నీవు గడిపితే అంతగా నీవు ఆశీర్వదించబడతావు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీ నడక, పడక, ఆలోచన దేవునికి అంగీకారముగా ఉండులాగున నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలి. అనగా ఏ మాటలైతే నీవు ధ్యానము చేస్తున్నావో ఆ మాటలు, మాటల ప్రభావము మన జీవితములో ప్రతీ సమయములో కనపరచబడాలి. మెలకువ కలిగి ఉన్నప్పుడు మనము చదివిన వాక్యము, మెలకువలేని సమయములో నీవు జారిపోయే సమయములో వెంటనే నిన్ను తట్టిలేపే విధానములో నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి.
మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు. -మత్తయి 5:14
మన ఆధిక్యత ఎంత గొప్పది? మనము ఉప్పుగానూ, వెలుగుగాను ఉండులాగున ప్రభువు మనలను ఎన్నుకొన్నాడు. ఎక్కడ మనము వెలుగై ఉన్నాము? అంటే లోకమునకు వెలుగై ఉన్నాము, అనగా చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించులాగున నిన్ను నన్ను ప్రభువు వెలుగుగా ఏర్పరచుకున్నాడు.
మనము ప్రత్యేకపరచబడినవారము. దేనినైతే మనము విడిచిపెట్టామో మరలా వాటివైపుకు వెళ్ళకూడదు. సాక్ష్యము అస్సలు పోగొట్టుకోకూడదు!
ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై౹ దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.౹ -హెబ్రీయులకు 6:4-5
దీనికంటే చచ్చిపోవటము మేలు అనే రోషము మనము కలిగి ఉండాలి. యేసయ్యను రుచిచూసి, పరిశుద్ధాత్మలో పాలివాడవై, తప్పిపోయినట్టయితే, యేసయ్యను మరలా బాహాటముగా సిలువ వేసినవారుగా అవమానపరచేవారిగా అయిపోతాము. దయచేసి అలా ఉండకూడదు. అందుకే అపవాదికి ఏ మాత్రము అవకాశము ఇవ్వకూడదు! నీ దేవుడు రక్షకుడుగా నీ వెంటే ఉన్నాడు. నీ దేవుడు సజీవుడు. నీవొక్కడివే జయించలేవు కాబట్టే, నీకు తోడుగా ఆయన ఉన్నాడు. అందుకే ఆయనకొరకు నీవు ప్రత్యేకపరచుకుంటే ఆయన ఉద్దేశ్యము నెరవేరుతుంది.
దేవుని ప్రేమపూర్వకమైన గద్దింపు దయచేసి తృణీకరించవద్దు. ప్రేమించు కుమారినినే తండ్రి గద్దిస్తాడు.