30-06-2024 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

మనము మన జీవితాన్ని మన బలము చేత, మన శక్తి చేత కొనసాగించుకోలేము గానీ, దేవుని కృప చేతనే కొనసాగించుకోగలుగుతాము. ఆయన ఈరోజు మనలను సిద్ధపరచుకున్నారు. సర్వశక్తుడైన దేవుడు మనలను సిద్ధపరచుకోవడము అనేది ఎంతో గొప్ప ధన్యత మనకు.

యేసయ్య ఈ భూలోకములో ఉన్నపుడు, ఆయనే తన శిష్యులను ఏర్పరుచుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన వారిని ఏర్పరచుకుని, సిద్ధపరచుకుని, తన పనిని జరిగించుకున్నాడు. అలాగే ఈరోజు మనలను కూడా సిద్ధపరచుకున్నాడు.

యేసయ్య తన శిష్యులను ఎలా సిద్ధపరచాడో అని ఆలోచిస్తే, వాళ్ళేమైతే చెయ్యవలసి ఉన్నదో దానిని ముందుగానే, తెలియపరచి సిద్ధపరచాడు. ఉదాహరణకు ఒక పక్షవాయువు గలవాడిని తన శిష్యుల ఎదుట స్వస్థపరచాడు. అటు తరవాత, శృంగారము అనే దేవాలయము వద్ద శిష్యులు కూడా అదే విధముగా స్వస్థపరచారు. అలాగే యేసయ్య చనిపోయినవారిని లేపాడు, అలాగే శిష్యులుకుడా అదేవిధముగా చేసారు. అలాగే మనలను కూడా సిద్ధపరచుకున్నాడు.

ఈరోజు ఏ కృపను మనము పొందుకున్నామో, ఆ కృప రాబోయే రోజుల్లో మన ద్వారా విస్తరించబడుతుంది, ఆమేన్. కృప ఎంతో శక్తి కలది. మరణములో ఉన్నదానిని జీవింపచేయగలది దేవుని కృప.

నోవహు కృపనొందెను అని వ్రాయబడింది. దేనికొరకు కృప పొందాడు అని ధ్యానిస్తే –

అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. -ఆదికాండము 6:8

దేవుని కృప జరగబోయే నష్టమునుండి నోవహును తప్పించింది. గొప్ప వర్షముచేత కలగబోయే నష్టమునుండి నోవహును తప్పించి, నూతనమైన ఆరంభము నోవహు ద్వారా జరుగులాగున కృప పనిచేసింది. ఈ కృపను మనము ఎరిగి ఉంటే, మన సంతోషము మనలను మౌనముగా ఉండనివ్వదు.

మనము తప్పించబడి ఉన్నాము, మన ద్వారా నూతనమైన ఆరంభము జరుగుతుంది. అంటే, దేవుడు సిద్ధపరచిన ఆరంభమే జరుగుతుంది. దీనంతటికీ కారణమే దేవుని కృప.

–యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమియందైనను లేడు.౹ -2 దినవృత్తాంతములు 6:14

నీవు నేను హృదయపూర్వకముగా దేవుని అనుసరించిన యెడల, మన యెడల తప్పక తన కృప చూపిస్తాడు. నోవహు దేవుని కృప పొందినవాడు అని వ్రాయబడింది. అంటే తాను దేవునిని హృదయపూర్వకముగా అనుసరించాడు అని అర్థముచేసుకొనగలము. మొత్తము నాశనము అయింది కానీ, నోవహు మాత్రము నాశనము అవలేదు. దానికి కారణము తాను యదార్థముగా నిలబడటమే.

నోవాహు యదార్థముగా ఉన్నాడు అని ఎలా చెప్పగలము? నోవహు దేవుని నమ్మాడు, అందుకే ఆయన యేమి చెప్తే అదే చేసాడు. అలాగే మనము కూడా దేవునిని నమ్మి, ఆ ప్రకారమే మనము చేసినయెడల, మనము కూడా యదార్థముగా ఉండగలుగుతాము.

మనమున్న దినములు, అంత్య దినములు. ఈ దినములలో ఉంటున్న మనము ఒక సత్యమును గ్రహించాలి. దేవుని రాకడ ఎంతో సమీపముగా ఉన్న దినములు. ఆయన రాకడకు గుర్తు అయిన అనేకమైన కార్యములు వెనువెంటనే జరుగుతున్నాయి.

ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండి పోయెను.౹ -ప్రకటన 16:12

2021 లో మంచిగానే నీళ్ళు పారుతున్నాయి. అదే 2023 వచ్చేసరికి ఆ నీళ్ళు తగ్గిపోయి, ఇప్పుడైతే అది ఎండిపోయింది. ఇది ఎందుకు అంటే, తూర్పునుండి వచ్చే రాజులు రావడానికొరకు ఆ విధముగా జరుగుతుంది అనే మాటలు బైబిల్ లో వ్రాయ బడింది.

ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవునియెదుట ఉన్న సువర్ణ బలిపీఠముయొక్క కొమ్ములనుండి యొక స్వరము –యూఫ్రటీసు అను మహానదియొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని యున్న ఆయారవ దూతతో చెప్పుట వింటిని. మనుష్యులలో మూడవభాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్ట బడిరి. -ప్రకటన 9:13-15

ఇప్పుడు చూస్తే, యూఫ్రటిసు ఎండిపోయింది. అలాగే ఏ సంహారమైతే ప్రభువు ముందుగా చెప్పారో, అది ఖచ్చితముగా జరుగుతుంది. అటువంటి దినములలో మనముంటున్నాము గనుక ప్రభువు రాకడ ఎంత దగ్గరగా ఉందో అనే సత్యము మనము ఎరిగి ఉండాలి.

నోవహు దినములలో తాను ప్రకటించిన దేవుని మాటలు, హెచ్చరిక ఎవ్వరూ నమ్మలేదు. ఈ దినములలో కూడా రాకడ గూర్చిన మాటలు కూడ అనేకులు నమ్మలేరు. అయితే మనము నోహవు వలే యదార్థముగా ఉన్న యెడల, మనము దేవుని కృప చేత ఈ నాశనమును మనము తప్పించుకోగలుగుతాము.

–యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమియందైనను లేడు.౹ -2 దినవృత్తాంతములు 6:14

ఇక్కడ నిబంధన నెరవేర్చువాడుగా దేవుడు ఉన్నాడు అని వ్రాయబడింది, అయితే అది ఏ నిబంధన అని ధ్యానిస్తే. “నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు”. నరకమునుండి తప్పించబడి, నిత్య రాజ్యములో నీవుండునట్లుగా దేవుని నిబంధన నెరవేరుస్తాడు. మనము దేవుని కృపలో దాచిపెట్టబడ్డాము, ఆయన కృప మన చుట్టూ ఆవరించి ఉంది. కృప వలననే మనము రక్షించబడ్డాము.

ఇదిగో నీ కటాక్షము నీ దాసునిమీద వచ్చినది; నా ప్రాణము రక్షిం చుటవలన నీవు నాయెడల కనుపరచిన నీ కృపను ఘనపరచితివి – ఆదికాండము 19:18

ఇక్కడ లోతు ప్రాణము దేవుని కృపను బట్టి రక్షించబడింది. ఆ కృపను గ్రహించినవాడై లోతు ఆయన కృపను ఘనపరచాడు. ఇక్కడ కూడా తన చుట్టు సమస్తము నాశనమైపోయేదే. అయితే ఆ నాశనమునుండి లోతు మాత్రమే తప్పించబడ్డాడు. ఈరోజు మనము కూడా నాశనమునుండి తప్పించబడి అనేకులు మన ద్వార ప్రబలే విధముగా మనలను సిద్ధపరచాడు.

పౌలు కూడా నేను ఏమై ఉన్నానో అని దేవుని కృపవలననే అని చెప్పుచున్నాడు.

అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.౹ -1 కొరింథీయులకు 15:10

ప్రయాస అనేది క్రియలతో కూడినది. అయితే పౌలు ప్రయాస పడింది నేను కాదు గానీ, దేవుని కృపయే అని చెప్పుచున్నాడు. అంటే, దేవుని కృప క్రియలచేత కనపరచబడుతుంది. పౌలు వెళ్ళిన ప్రతీ పరిస్థితిలో దేవుని కృప క్రియలచేత తనను నిలబెట్టింది. అలాగే నీ జీవితములో కూడా దేవుని కృప నివు ఉన్న ప్రతీ పరిస్థితిలో నిన్ను నిలబేడుతుంది. అలాగే నిలాంటి పరిస్థితిలో ఉన్న అనేకులకు నీ ద్వారా దేవుని కృప విస్తరిస్తుంది.

నీకు అనుగ్రహించబడిన దేవుని కృప వ్యర్థము కాదు. అయితే నీవు యదార్థమైన భక్తి కలిగి ఉండటము వలన మాత్రమే ఇది సాధ్యము. నీవు కనపరచే యదార్థమైన భక్తి నిన్ను దేవుని కొరకైన సాక్షిగా నిలబెడుతుంది.

నీ విశ్వాసమును చెడగొట్టే రీతిగా ఉన్న ప్రతీ దానినుండి పక్కకు వెళ్ళిపో. పరిస్థితులు కష్టముగా ఉన్నపుడు, దేవుని విశ్వాసమునుండి తొలగిపోయే స్థితిలోనికి వెళ్ళిపొయే ప్రమాదము ఉంది. గనుక మనము జాగ్రత్తగా యదార్థముగా మన భక్తిని కొనసాగించాలి.

నీ భక్తికి దేవుని కృప తోడవుతుంది గనుక, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే, ఖచ్చితముగా నీవు తప్పించబడతావు. అందుకే మీ విశ్వాసమును చెడగొట్టే మాటలు ఏవీ మీ చెవి కూడా చేరనివ్వకండి, ఒకవేళ విన్నా సరే అవి మీ మనసులలోనికి రానివ్వకండి. ఆ మాటలు మాట్లాడేవారు నీతో నిలబడరు గానీ, దేవుని కృపయే నీతో నిలిచేది.

దేవుని కృప నిష్ఫలము కాకుండా ఉండాలి అంటే, మనము చివరి దినములలో ఉన్నాము అనే సంగతి ఎరిగి, జాగ్రత్త పడదాము. మనము గొప్పవారము కానప్పటికీ, మనకు ఇంకా అవకాశము దొరికింది.

తొలకరి వర్షము కురిపించింది ఆయనే, కడవరి వర్షము కురిపించేది ఆయనే. యేసయ్య పరిచర్య అద్భుతముల ద్వారా ప్రారంభమయింది, తరువాత వాక్యము చేత సిద్ధపాటు జరిగింది. కడవరి దినములలో మరలా అనేకమైన అద్భుతములు జరుగుతాయి. అలా తన కృప చేత మనలను నాశనమునుండి తప్పించి, నూతనమైన ఆరంభమునిచ్చిన దేవుని మనము ఆరాధిద్దాము స్తుతిద్దాము.

 

ఆరాధన గీతము:

కృపలను తలంచుచు

వారము కొరకైన వాక్యము

ఈరోజు ప్రభువు మనలకు ఒక హెచ్చరిక ఈరోజు ఇస్తున్నాడు, “అలక్ష్యముగా ఉండకు”. ప్రభువు మనతో ఈ మాటలు మాటలాడుతున్నాడు అంటే, దానివెనుక ఆయన ఉద్దేశ్యము మనము ఎరిగి ఉండాలి.

దేవుడు మనకు సమయమును ఇచ్చాడు. మనము తిరిగి దేవునిలో కొనసాగించబడునట్లుగా మనకు సమయము ఇచ్చాడు.

దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.౹ -ఎఫెసీయులకు 5:15

ఈరోజులలో జ్ఞానము అనేది మనకు ఎంతో అవసరము. అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె అని ప్రభువు చెప్పుచున్నాదు. ఈ చివరి దినములలో అత్మీయముగా ఉన్న నీవు జ్ఞానము కలిగి జీవించాలి అంటే, నీ ఆత్మీయమైన జీవితమును నష్టపరచేది ఈ చివరి దినములో ఉంటుంది గనుక జ్ఞానము కలిగి ఉండాలి.

మన జీవితము, ప్రయోజనమైనగాను, ప్రభువుకు మహిమ తెచ్చే జీవితముగా ఉండవలసినది. జ్ఞానము కలిగిన వారు ఖచ్చితముగా దేవుని మాటలను గ్రహిస్తారు. అజ్ఞాని అయితే, చుట్టు నష్టము జరుగ్తున్నా సరే ఏ మాత్రము గ్రహింపు లేక ఉంటాడు.

భౌతికముగా ఏదైనా సమస్య కలిగినపుడు, దాని ప్రభావము అత్మీయ జీవితముపై పడుతుంది. అయితే మనము జ్ఞానము కలిగి ఉన్నపుడు, ఆ సమస్యనుండి విడిపించగలిగేదే దేవుడే అని ఎరిగి, ఆత్మీయ జీవితములో ఇంకా ఎక్కువగా జాగ్రత్త కలిగి ఉంటాడు. అదే అజ్ఞాని అయితే దేవుని వద్దకు వెళ్ళక, ఆ సమస్యలోనే కుమిలిపోతాడు.

యెహోవా యందు భయము కలిగి ఉండుటయే జ్ఞానమునకు ఆధారము అని లేఖనములు తెలియచేస్తున్నాయి.

మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి -1 పేతురు 1:22

సత్యమునకు విధేయులవుటచేత మన మనస్సులు పవిత్రముగా చేయబడతాయి. సత్యమునకు విధేయులగుట అంటే, వాక్యము ద్వార బోధించబడినదానికి విధేయత చూపించాలి. అనగా ఆ వాక్య ప్రకారము జీవించాలి. అప్పుడు నీ మనస్సు పవిత్రపరచబడుతుంది. అంటే దాని అర్థము ఏమిటి?

అంతకు ముందు మన మనస్సు, మనమున్న పరిస్థితిని బట్టి ఇది అసాధ్యము అని అనుకుని నిరాశతో ఉంది. అటువంటి పరిస్థితిలో దేవుని సత్యము దేవునికి సమస్తము సాధ్యమే అనే మాటకు నీవు విధేయత చూపినపుడు, అది నీ మనసును పవిత్రత కలిగించి, దేవుని వాక్కు నెరవేరులాగున నిన్ను సిద్ధపరుస్తుంది.

అందుకే దేవుని చేత బయలుపరచబడిన సత్యమును వెంబడించుటకు అలక్ష్యముగా ఉండకు. లోకములో నీ చుట్టూ నిరాశ, శ్రమ, అపజయము ఉన్నాయి. అయితే దేవుని సత్యమునకు నీవు విధేయత చూపించి అలక్ష్యముగా ఉండకుండునట్లు నీవు సిద్ధపడితే, నీవు తప్పించబడతావు.

సర్వశరీరులు గడ్డినిపోలినవారు,వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే. -1 పేతురు 1:24

ఇక్కడ అందము శరీరమునకు సంబంధించినది, అలాగే ప్రభువు వాక్యము ఆత్మీయమైనది. శరీర సంబంధమైనది వాడిపోతుంది, ఆత్మీయమైనది నిత్యము నిలుస్తుంది. దినములు చెడ్డగా ఉన్నది, శరీరానుసారులకు మాత్రమే, అయితే ఆత్మానుసారులకు మాత్రము ప్రతీ దినము మంచి దినమే, ఆమేన్! జ్ఞానము కలిగి, అత్మీయముగా సిద్ధపడితే, మంచి దినములు అనుభవిస్తావు.

తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?౹ -1 పేతురు 4:17

తీర్పు ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, మనము చనిపోయినపుడే. తీర్పు మనతోనే ప్రారంభమయితే అంటే, మనము ఇప్పుడే చనిపోతే, మనము ఆత్మీయముగా ప్రభువును వెంబడిస్తే, అప్పుడు ప్రభువు కుడిపార్శ్వమున మనము ఉంటాము. అదే శరీరముప్రకారము మనము జీవిస్తే, అనగా సువార్తకు అవిధేయులైనవారివలే మనము ఉంటే, వారికి సిద్ధపరచబడిన నరకములోనే మనము ఉండవలసి వస్తుది.

ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్నయెడల౹ సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణమాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.౹ -1 పేతురు 2:1-2

ప్రభువు చెప్పిన ఈ మాట ప్రకారము, ఈ చెడు కార్యములు మనలో ఉంటే, ఆయన పిలుపు ప్రకారము మనము మనలను సరిచేసుకుందాము. సమస్తమైన దుష్టత్వము అంటే, అపవాదికి సంబంధించిన ప్రతీదీ. మనకు ఫలానాది అపవాదికి సంబంధించినది అని ఎలా తెలుస్తుంది? మనలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి తెలుస్తుంది.

వారు–రండి మన దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించు వాడు గదా; నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు.౹ మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము.౹ -యిర్మీయా 5:24-25

పాపము అపవాదికి సంబంధించినది. ఈ పాపము, ఆశీర్వాద క్రమమును తప్పిస్తుంది. అదే ఒకవేళ నీవు సత్యమునకు లోబడితే, ఏ ఆశీర్వాద క్రమము ప్రభువు నీ జీవితమునకు సిద్ధపరచాడో, ఆ క్రమమును ప్రభువు స్థిరపరుస్తాడు. మన జీవితము ఆయన చేత నడిపించబడుతుంది, స్థిరపరచబడుతుంది.

అందుకే ఈరోజు ప్రభువు మాటలకు మనము లోబడుదాము. దేవుని ప్రతీ మాటలో మన క్షేమమే దాచబడి ఉంటుంది.

క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి – 1 కొరింథీ 2:1

ఎలా అయితే పుట్టిన పిల్లలు పాలకోసమే ఆరాటపడతారో, మనము కూడా వాక్యము కొరకు అలాగే ఆరాటపడి వాక్యము కొరకు ఆశపడాలి. దేవుడు అనుగ్రహించిన రక్షణలో మనము ఎదగాలి అంటే వాక్యమునే మనము వెంబడించాలి. అందుకే జ్ఞానము కలిగి సిద్ధపడదాము. మనలను పరీక్షించుకుందాము. అపవాదికి సంబంధించిన ప్రతీదీ మనము విడిచిపెట్టి ప్రభువు వాక్యము సత్యమునే వెంబడిద్దాము.