30-06-2024 – ఆదివారం రెండవ ఆరాధన

ఆరాధన వర్తమానము

మన జీవితములకు ముందుగా దేవుని వాక్కు బయలుపరచబడుతుంది, ఆ వాక్కు ప్రకారము మన జీవితము స్థిరపరచబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్కును బోధిస్తాడు తప్ప స్టేజీ పై నిలబడిన వారు కాదు.

ఈరోజు దేవునిని ఆరాధించడానికి వచ్చిన మనము మన దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి, ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి.

యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. -కీర్తనలు 92:1-2

దేవుని స్తుతించుట అంటే ఏమిటి? పాటలు పాడటమా? కాదు గానీ, ఆయన నామముము ఒప్పుకోవడమే స్తుతి. ఆశ్చర్య కరుడు, ఆలోచనకర్త, సమాధాన కర్త ఇవన్నీ ఆయన నామములు, మనము స్తుతించుట అంటే, ఆ నామములు అన్నీ నా జీవితములో సత్యములే అని ఒప్పుకోవడము.

మనము పెదవులతో మాత్రమే ఒప్పుకుంటే దాని వలన ఉపయోగములేదు. అయితే, మనము హృదయమారా ఒప్పుకున్నపుడు మాత్రమే ఆ స్తుతి వలన కలిగే ఆశీర్వాదములు అనుభవించగలుగుతాము.

ఉదయ కాలమున దేవుడు మనలను ఏర్పరుచుకుని, సిద్ధపరచున్నారు అని తెలియచేసారు. పేతురు ఉదాహరణను మనము చూస్తే, యేసయ్య పేతురు ఎదుట ఊచ చెయ్యి గలవారిని స్వస్థపరచాడు. పేతురు సమయము వచ్చినపుడు తానుకూడా స్వస్థపరిచాడు. ఇలా తన శిష్యుల యెదుట యేసయ్య తన కార్యములు జరిగించి, ఈ కార్యము తరవాత శిష్యులు చేయగలుగులాగున సిద్ధపరచారు.

క్రికెట్ ఆడే వారు, లేదా వేరే క్రీడలు ఆడేవారు ఎంతో సిద్ధపడి వెళతారు. అయితే మన పితరులు యుద్ధమునకు వెళ్ళేటపుడు, దేవుని నామమును ఒప్పుకుంటూ అనగా “యెహోవా దయాళుడు, ఆయ్నా కృప నిరంతరము ఉండును” అని ఒప్పుకుంటూ యుద్ధానికి వెళ్ళేవారు.

ఆ మాటలే ఎందుకు ఉపయోగించారు అని మనము ఆలోచిస్తే, యుద్ధమునకు వెళ్ళినపుడు, వారికంటే బలమైన వారినే ఎదుర్కునేవారు. ఎప్పుడైతే యెహోవా దయాళుడు అని చెప్పారో, ఆయన దయ మా పక్షముగా విడుదల అవుతుంది, ఎందుకంటే ఆ శత్రువును ఎదుర్కోవడానికి మాకు బలము లేదు గానీ నీ దయను బట్టే మేము జయించగలుగుతాము అని చెప్పుచున్నారు.

అలాగే, ఆయన కృప నిత్యముండును అని చెప్పుచున్నారు అంటే, అర్హత లేని మాకు దేవుని కృపను బట్టి జయించే అర్హత కలిగించబడుతుంది. ఈ విధముగా దేవుని కృపను కోరుకొనే విధానములో మన జీవితము ఉంటే, అది ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది.

ప్రార్థన, స్తుతి ఈ రెండిటిలో స్తుతి ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే, మనము చేసే స్తుతి సింహాసనముపై దేవుడు ఆసీనుడవుతాడు. పౌలు సీలలు చెరసాలలో పాటలు పాడుతూ ఉన్నప్పుడు, వారు దేనిచేత బంధింపబడ్డారో, దానినుండి విడిపింపబడ్డారు.

స్తుతించడము ద్వారా దేవుని శక్తి ప్రత్యక్షపరచబడుతుంది. నీ జీవితమును బంధించినదానినుండి విడుదల కావాలి అంటే, నీవు స్తుతించాలి. నీకు ఖాళీ సమయము దొరికితే దేవుని స్తుతించుట మంచిది. స్తుతి అనేది మనకు ఒక ఆయుధముగా ఉంది. దేవుడు అద్భుతము చేయాలి, తన శక్తి కనపరచాలి అని ఆశపడతాము. అయితే దేవుడు తన కార్యము చేయుట కొరకు దేవుడు ఏమి చేయమని చెప్పాడో అది చేయుటకు మనము సిద్ధముగా ఉండాలి.

యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొనిపోయి యెముకలతో నిండియున్న యొక లోయలో నన్ను దింపెను. ఆయన వాటిమధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా యెముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి.౹ ఆయన–నర పుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుక గలవా? అని నన్నడుగగా–ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని.౹ అందుకాయన–ప్రవచన మెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము–ఎండిపోయిన యెముకలారా, యెహోవా మాట ఆలకించుడి.౹ ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను;౹ -యెహెజ్కేలు 37:1-5

ఇక్కడ యెహెజ్కేలు ముందు ఎముకల లోయ ఉంది. దేవుడు యెహెజ్కేలును జీవాత్మ వచ్చులాగున ప్రవచించమనగా, ఇవి ఎముకలు అని ఆలోచించలేదు గానీ, దేవుడు చెప్పిన ప్రకారము చేసాడు.

యెహెజ్కేలు ప్రవక్త గనుక ప్రవచించమన్నాడు. మనము ఆయనను స్తుతించడానికి వచ్చాము గనుక, ఈరోజు మనము చేసే స్తుతి ఆరాధన ద్వారా జీవము ప్రత్యక్షపరచబడుతుంది. దేవుడు ఆరాధన ద్వారా అద్భుతము చేస్తాను అని చెప్పుచుంటే, మనము మాత్రము వేరేలా చేస్తే బాగుండు అని ఆలోచిస్తాము.

అయితే ఈరోజు అలా ఉండక మనము దేవుని నమ్మి స్తుతిద్దాము. ఇశ్రాయేలు ప్రజలు స్తుతించి ఆరాధించినపుడు, శత్రువులు బలముతో వచ్చినప్పటికీ, వాళ్ళలో వారు పొడుచుకుని చనిపోయే విధానములో దేవుని కృప ఇశ్రాయేలు ప్రజల పట్ల కార్యము జరిగించింది. దేవుని స్తుతించిన వారికీ, వారి శత్రువుకు మధ్య కృప నిలిచింది. ఆ కృప వీరు యుద్ధము చేయనవసరము లేకుండానే జయము వారికి కలిగింది. దేవుని కృప నీ శత్రువు యొక్క బలమును నిర్వీర్యము చేస్తుంది.

ఈ సత్యమును ఎరిగి మనము మన దేవునిని ఆరాధిద్దాము, స్తుతిద్దాము. కృప సర్వ నాశనమునుండి తప్పించింది.

ఆరాధన గీతము:

యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు

వారము కొరకైన వాక్యము

పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్య కలను పోలియున్నది. -మత్తయి 25:1

ఈ వాక్యము పరలోకములోనికి వెళ్ళడానికి సిద్ధపాటుగా ఇంతకు ముందు నేర్చుకున్నాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమి నేర్పుతున్నాడో నేర్చుకుందాము.

పెండ్లికుమారుడి గురించి ఆలోచించినపుడు, అంతకు ముందు వరకు అతడు సాధారణముగా ఒక యవ్వనుడిగా ఉన్నప్పటికీ, పెండ్లి సమయములో మాత్రమే పెండ్లి కుమారుడిగా పిలవబడతాడు. తన గృహము గురించి ఆలోచిస్తే, అది ఎంతో సంతోషముతో నిండి ఉంటుంది. ఎందుకంటే, పెళ్ళి అనేది ఎంతో ఆశీర్వాదకరమైనది గనుక, ఆ ఆశీర్వాదమును బట్టి ఆ గృహము ఎంతో సంతోషముగా ఉంటుంది.

అయితే ఈ దినము నీ జీవితము గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. పెండ్లి కుమారుడి గృహము గూర్చి ఒక మాట చెప్పుచున్నాడు. పెండ్లి కుమారుడు గృహములో ఉన్నప్పుడు ఆ గృహము ఉపవాసముండ తగునా?

పెండ్లి అనేది ఆశీర్వాదము ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వారు సిద్ధపడ్డారు. అనగా ఆశీర్వాదమును ఎదుర్కోవడానికి మనము కూడా సిద్ధపడాలి. అయితే అక్కడ దివిటీలతో సిద్ధపడి ఉండటానికి పిలువబడినవారే అక్కడకు వచ్చారు. అందులోనూ 5గురు మాత్రమే సరిగ్గా సిద్ధపడ్డారు ఆశీర్వాదమును పొందుకున్నారు.

ఈరోజు ప్రభువు తెలియచేసే సత్యము ఏమిటి అంటే, నీవు ఆశీర్వాదము పొందటానికే, ఆయన మేలు పొందటానికే పిలువబడ్డావు. అయితే ఆ మేలు, ఆశీర్వాదము పొందడానికి నీవు సిద్ధపడి ఉండాలి.

వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి. -మత్తయి 25:2-4

ఆశీర్వాదము అందరికొరకు సిద్ధపరచబడినప్పటికీ, కొంతమంది మాత్రమే దేవుని జ్ఞానము కలిగి సిద్ధపడుతున్నారు, మిగతావారు అత్మీయ జ్ఞానము లేకపోవడం చేత ఆశీర్వాదము పొందలేకపోతున్నారు. యేసయ్య సొంత గ్రామములో అనేకులు అద్భుతము చూడలేకపోవటానికి కారణము, వారికి ఆత్మీయ జ్ఞానము లేకపోవటమే!

ఈరోజు ప్రభువు నీతో చెప్పుచున్నాడు. నీవు ఆశీర్వాదముకొరకే పిలువబడ్డావు.

పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి. -మత్తయి 25:5

అశీర్వాదము కొరకే మనము పిలువబడ్డాము. అయితే ఆశీర్వాదము రావడానికి కొంత ఆలస్యమైంది. ఈ ఆలస్యమును బట్టి మెలకువగా ఉండవలసిన వారు, కునికి నిద్రపోయారు. దేవుడు ఇస్తాను అని చెప్పిన ఆశీర్వాదము గురించి మనము కనిపెట్టుకుని ఉండాలి. అయితే మనము అలాకాక, ఆ ఆశీర్వాదము ఆలస్యము అయిన కారణము చేత, ఆ ఆశీర్వాదము గూర్చి మనము మర్చిపోయినవారుగా ఉంటున్నాము.

మనము దేవుని ఆశీర్వాదము పొందులాగున మనము ఎన్నిక చేయబడ్డాము. అంటే ఆ ఆశీర్వాదము ఆలస్యమైనా సరే నీ జీవితములో ఆ ఆశీర్వాదము రావలసినదే.

అర్ధరాత్రివేళ– ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధిలేని ఆ కన్యకలు– మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. -మత్తయి 25:6-9

మొత్తము 10 మంది కూడా నూనెతో దివిటీలను నింపుకొనే వచ్చారు. అంటే, మొదట మనము ఆశీర్వాదము గురించి విన్నపుడు విశ్వాసము కలిగే ఉంటాము. అయితే ఆశీర్వాదము ఆలస్యము అయిన కారణముచేత విశ్వాసము సన్నగిల్లుతుంది.

ఇప్పుడు నీ ఆశీర్వాదము ఆలస్యమయింది అని నీ విశ్వాసము సన్నగిల్లితే, నీవు బుద్ధిలేని కన్యకలవలే ఉన్నవాడవు. అలాకాక, నీవు విశ్వాసము కలిగి నిలిచిఉంటే నీవు బుద్ధిగల కన్యకలవలే ఉన్నవాడవు.

విశ్వాసము అనేది సూపర్ నేచురల్ కార్యములకొరకే కావాలి. ఆత్మీయముగా దేవుడు సిద్ధపరచినదానికి ఖచ్చితముగా విశ్వాసము కావాలి. నీ విశ్వాసమును సన్నగిల్లనివ్వకు. పేతురు విశ్వాసమును కనపరచినపుడు సూపర్నేచురల్ కార్యము చేయగలిగాడు. నీటి పై అడుగువేస్టె సాధారణముగా ములిగిపోతారు. అయితే పేతురు విశ్వాసము కనపరచినపుడు, అసాధారణముగా నీటిపై నడిచాడు. అదే సందేహము కలిగినపుడు, ములిగిపోసాగాడు.

విశ్వాసములో నిలబడ్డప్పుడు సందేహము వస్తుంది. అయితే ఆ సందేహమును బట్టి మన పోరాటములోనుండి మనము పారిపోకూడదు. సందేహము వచ్చినా, టెన్షన్ వచ్చినా సరే, పోరాటములోనుండి పారిపోక నిలబడినపుడు ఖచ్చితముగా విజయము మనదే.

బుద్ధికలిగిన కన్యకలు వాళ్ళతో ఇంకొంచెము నూనె తెచ్చుకున్నారు. బుద్ధిలేనివారు అలా నూనె సిద్ధపరచుకోలేదు. అనగా బుద్ధికలిగిన వారు తమ విశ్వాసమును సన్నగిల్లనివ్వలేదు. ఇంతవరకు జరగలేదు గానీ, ఖచ్చితముగా జరుగుతుంది.

అర్ధరాత్రివేళ– ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. -మత్తయి 25:6

అర్థరాత్రి అనే సమయమును ఎలా చూడాలి అంటె, ఆ సమయములో మనుష్యులు నిద్రలో ఉంటారు. అప్పుడు మన శరీరము, మనస్సు స్పృహలో ఉండవు. అనగా నీ భౌతికమైన శక్తి అలాగే నీ జ్ఞానము పనిచేయనపుడు దేవుని ఆశీర్వాదమును నీవు పొందుకుంటావు. ఎందుకంటే, నీ జ్ఞానము, నీ శక్తి చేత నీవు పొందుకుంటే, అది సూపర్నేచురల్ అని నీవు ఒప్పుకోవు. మనము పొందే ఆశీర్వాదమును బట్టి దేవునికే మహిమ కలగాలి.

నీ శక్తి నీ జ్ఞానము పనిచేయనపుడు నీకొరకు ఆశీర్వాదము సిద్ధపరచబడింది. పెండ్లికుమారుడు వస్తున్నాడు అనే పిలుపు వినబడింది అంటే, నీ ఆశీర్వాదము కొరకైన కొన్ని సూచనలు నీకు తెలియచేయబడతాయి.

కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.౹ -ఎఫెసీయులకు 1:8

మొదట తన చిత్తమును గూర్చిన మర్మము తెలియచేస్తారు. ఎందుకంటే ఆశీర్వాదము నీకు ఇవ్వాలి అని దేవుడు నిర్ణయించాడు. పెండ్లికుమారుని కేక వినగానే దివిటీలు సిద్ధపరచుకున్నారు. అంటే, దేవుడు తన ఆశీర్వాదము గూర్చి తెలియచేయగానె, అంతవరకు ఉదాసీనముగా ఉన్నాసరే, కేక వినబడగానే, తమవద్ద ఉన్న నూనెతో సిద్ధపరచుకున్నారు.

అయితే పెండ్లికుమారుడు రాగానే, 5గురు పెండ్లివిందుకు లోపలికి పిలువబడ్డారు. మిగతావారు నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. అంటే మరలా వారి విశ్వాసము మొదటినుండి ప్రారంభమవవలసి వచ్చింది.

వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితోకూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి; -మత్తయి 25:10

విశ్వాసము కలిగినవారు ఆశీర్వాదము పొందుకున్నారు అంతమాత్రమే కాక, విందులో కూడా పాలు కలిగి ఉన్నారు. అనగా ఆశీర్వాదముతో ముడిపడి ఉన్న మరిన్ని మేలులు కూడా పొందుకుంటారు. ఈరోజు నీవు ఒక ఆశీర్వాదమును నీవు పొందుకున్నావేమో, అయితే నీవు అనేకమైనవి నీ జీవితములో పొందుకోబోతున్నావు. అయితే నీవు నీ విశ్వాసమును కొనసాగించుకోవాలి. ఆలస్యమైనా అశీర్వాదము రాకమానదు.

ఉదాహరణకు ఆర్థికముగా ఆశీర్వాదము కొరకు నీ ఉద్యోగములో ఉన్నత స్థానము ప్రభువు నీకు ఇస్తాడు. దానిని బట్టి అర్థికముగా ఎదిగిన తరువాత, ఇంకా అనేకమైన విషయాలలో ఎదుగుదల ఉంటుంది. అలాగే వివాహము ఒక ఆశీర్వాదము, ఆ వివాహముతో ముడిపడి ఉన్న అనేకమైన విషయములలో కూడా ఆశీర్వాదము నీవు పొందుకుంటావు.

నీ విశ్వాసము ఎలా ఉంది? నీ శక్తి, నీ జ్ఞానము నీ ఆశీర్వాదమునకు అడ్డువస్తున్నాయా? అని నీవు పరీక్షించుకోవాలి. ఎందుకంటె దేవుని ఆశీర్వాదము నీ జీవితములో జరగాలి అని దేవుడే నిర్ణయించాడు, ఏర్పరచాడు, నిన్ను పిలిచాడు. గనుక ఆలస్యమైనా సరే, నీ ఆశీర్వాదము ఖచ్చితము.