ఆరాధన వర్తమానము
ఈ సంవత్సరపు చివరి ఆదివారము ఈరోజు. ఈ సంవత్సరమంతా ప్రతీ ఆదివారము దేవుని సన్నిధిలో ఉండగలుగుట అనే భాగ్యాన్ని ప్రభువు మనకు ఇచ్చాడు.
ఆయన సన్నిధిలో ఉండగలుగుట అనేది ఎందుకు భాగ్యముగా మనము ఎంచుకోవాలి అని ఆలోచిస్తే, ప్రతీ ఆదివారము ప్రభువు మనతో మాట్లాడేవాడుగా ఉంటున్నాడు, ఆ ప్రతీ మాట మననలను జీవింపచేసేదిగా ఉంటుంది. అటువంటి దేవుని వాక్కు మనకు దొరికినందుకు ఆయనకు కృతజ్ఞతా అర్పణలు అర్పించేవారముగా మనము ఉండాలి.
కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి. -కీర్తనలు 100:4
ఈ దినము ఏ విషయములో మనము కృతజ్ఞతార్పణ దేవునికి అర్పించాలి అని చూస్తే, ఈ సంవత్సరమంతా ఆయన వాక్కును అందించి, మన జీవితములో వెలుగు, జీవము నింపినందుకు.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి౹ దానిని విరిచి–యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.౹ -1 కొరింథీయులకు 11:23-24
మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.౹ -1 కొరింథీయులకు 11:26
ప్రభువు యొక్క మరణము మనకు జీవాన్ని తీసుకువచ్చింది. గనుక ఆయన మరణమును ప్రచురించుట అంటే ఆయన వలన మనము పొందుకున్న జీవమును ప్రచురము చేస్తున్నాము అని అర్థము. అంతే కాక లేఖనముల ప్రకారము, వాక్యమే శరీరధారి అయి ఈ లోకములోనికి వచ్చింది. ప్రభువు శరీరము అంటే ఆయన వాక్యము అయి ఉన్నది. గనుక, ప్రతి సారీ ఆయన వాక్యము మనకు అందించబడుతుంది గనుక ఆ వాక్యమును బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన శరీరమును తినువాడు ఖచ్చితముగా జీవిత్స్తాడు గనుక, ఆయన వాక్యమును తినువాడు ఖచ్చితముగా జీవిస్తాడు. గనుక మనకు అందించబడే దేవుని వాక్యము బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిచాలి.
అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడి–ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను.౹ ఆమె ఏడ్చుటయు, ఆమెతోకూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు–అతని నెక్కడ నుంచితిరని అడుగగా,౹ వారు–ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.౹ యేసు కన్నీళ్లు విడిచెను.౹ -యోహాను 11:32-35
లాజరు చనిపోయిన వర్తమానం యేసయ్యకు తెలిసిన తరువాత నాలుగు రోజుల తరువాత యేసయ్య అక్కడకు వచ్చాడు. అయితే అక్కడ మరియతో మాట్లాడిన తరువాత ప్రభువు కన్నీళ్ళు విడిచాడు. ఎందుకు అని ఆలోచిస్తే, యేసయ్య మరియ, మార్తల ఇంటికి వెళ్ళినపుడు మార్త పనులలో ములిగింది గానీ మరియ అయితే ఆయన వాక్యమును శ్రద్ధగా వింది. అయితే సమయము వచ్చేసరికి ఆ వాక్యములోని జీవాన్ని, సత్యాన్ని గ్రహించి నిలబడలేకపోయింది గనుక ఆయన కన్నీళ్ళు విడిచాడు. మనము కూడా ఆయన వాక్యమును విని దానిలోని జీవాన్ని మనము అనుభవించలేకపోతే, ఆ సత్యముపై మనము నిలబడకపోతే, ఆయన మన విషయములో కూడా కన్నీళ్ళు విడిచేవాడుగా ఉంటాదు.
ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు.౹ -యెషయా 8:20
వాక్యము ఎవరికైతే బోధించబడుతుందో వారికి అరుణోదయము కలుగుతుంది. ఈ సంవత్సర కాలమంతా మనకు వాక్యము అందించబడింది గనుకనే మనము జీవింపచేయబడ్డాము. పాత నిబంధన కాలములో ఏర్పాటు చేయబడిన ప్రవక్తల మీద మాత్రమే దేవుని ఆత్మ దిగివచ్చి, దేవుని వాక్కు వెల్లడిచేయబడుతూ వచ్చింది. ఈ దినము, దేవుని వాక్కు నీకు, నాకు అందించబడుతుంది అంటే, మనము కూడా ఏర్పాటుచేయబడినవారమే కదా!
అలాగే పాత నిబంధన సమయములో ఏర్పరచబడిన ప్రవక్తలకు అందించబడినా, ఆ వాక్కు అక్కడ ఉన్న తన ప్రజల కొరకు ఆ వాక్యము అందించబడుతుంది. అయితే ఇప్పుడు ప్రభువు మనలను ఏర్పాటుచేసుకొని మనకు అందించేమాటలు ఎవరికొరకు అంటే, అది నీ కొరకే నా కొరకే, నీ జీవితము కొరకే, నా జీవితము కొరకే. ప్రబువు అందించే వాక్యము మన అందరి కొరకూ.
మార్త పనులలో ములిగిపోయినపుడు మరియను చూపించి మార్తను హెచ్చరించాడు. అయితే లాజరు చనిపోయిన సందర్భములో, మార్తకు మరలా బోధించాడు. అలాగే ఇంతకు ముందు ప్రభువు చెప్పినపుడు మనము వినలేదేమో, అయితే ఈ దినము మరలా ప్రభువు బోధించేవాడుగా ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు.
ఆరాధన గీతము
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
2025 స్వతంత్రించుకొనులాగున మన హృదయములను సిద్ధపరచుకోవాలి అని ప్రభువు ఆశ కలిగి ఉన్నాడు. చిన్నపిల్లలుగా ఉన్నపుడు మనము ఏమీ చెయ్యలేము గానీ, పెద్దవారిగా ఎదిగినపుడు మనము ఏమైనా చెయ్యగలుగుతాము. 2025 లో నీ జీవితములో ఆయన మహిమ పరచబడటానికి ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు.
మరియు యెహోషువ–రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.౹ -యెహోషువ 3:5
“రేపు” అనే మాట 2025 ను సూచిస్తుంది. 2025 లో ప్రభువు చేయబోయే అద్భుత కార్యములు మీరు చూడాలి అంటే, పరిశుద్ధత లేకుండా మనము ఆ కార్యములను అనుభవించలేము. గనుక, మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకొనుడి. పరిశుద్ధతను కోల్పోతే అద్భుతమును కోల్పోతాము గనుక, జాగ్రత్త కలిగి సిద్ధపడదాము.
అయితే ఎలా మనము పరిశుద్ధపరచుకోవాలి? శరీరానికి సంబంధించి స్నానము చేయడం ద్వారా శుభ్రపరచుకొంటాము. అయితే ఆత్మను వాక్యము ద్వారా పరిశుద్ధపరచుకోవాలి, ఎందుకనగా వాక్యము ఉదకస్నానము చేయగలిగిన శక్తి కలది. 2025 అద్భుతాలతో నిండిన సంవత్సరము.
దేవుని ప్రేమకు కండిషన్ లేదు గానీ, ఆయననుండి మనము ఏమైనా పొందుకోవాలి అంటే కండిషన్ ఖచ్చితముగా ఉంది. మనము వాక్యప్రాకారముగా మన జీవితము ఉన్నపుడు, ఆయన పరిపూర్ణతలోనుండి కృపవెంబడి కృప మనము పొందుకుంటున్నాము.
ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.౹ -యోహాను 1:17
వాక్యప్రకారముగా మనము జీవించినపుడు, పరిశుద్ధతను మనము ధరించేవారిమిగా ఉంటాము. వాక్యము అనగా శరీరము అనగా యేసయ్య శరీరము. ఆయన పరిపూర్ణతలోనుండి అనగా వాక్యము యొక్క పరిపూర్ణతలోనుండి కృప వెంబడి కృప మనము పొందుకొనేవారిమిగా ఉంటాము. అప్పుడు 2025 లో ఏ అద్భుతము మనము పొందుకోవాలి అని ప్రభువు నిర్ణయించాడో, ఆ అద్భుతము నీవు పొందుకొనేవాడిగా ఉంటావు.
మనము కృపచేతనే రక్షించబడ్డాము కదా! యేసయ్యను ఎరగనపుడు ఆయనను అంగీకరించులాగున, కృప మనలను వెంబడించింది. ఇప్పుడు యేసయ్య యొక్క పరిపూర్ణతలోనుండి మనము అద్భుతమును పొందుకొనునట్లుగా ఆయన కృప మనలను వెంబడిస్తుంది. దేవుడు మనకొరకు సిద్ధపరచి ఇచ్చినది, పోగొట్టుకోకుండా పొందుకొన్నపుడు మనకు వచ్చే ఆనందం ఎంతో గొప్పది. ప్రభువు ఏలియాతో ఒకమాట చెప్పాడు –
కాబట్టి అతడు ఈ సమాచారము తెలిసికొని, లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి, యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి, అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణాపేక్షగలవాడై – యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను.౹ అతడు బదరీవృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి–నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను.౹ అతడు చూచినంతలో అతని తలదగ్గర నిప్పులమీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనముచేసితిరిగి పరుండెను.౹ అయితే యెహోవాదూత రెండవమారు వచ్చి అతని ముట్టి–నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై యున్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనముచేసి, ఆ భోజనపు బలముచేత నలువది రాత్రిం బగళ్లు ప్రయాణముచేసి, దేవుని పర్వతమని పేరుపెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న యొక గుహలోచేరి బసచేసెను -1 రాజులు 19:3-9
ఏలియా ఇంతగా భయపడటానికి కారణము ఏమిటి అని చూస్తే, “ఏలీయా చేసినదంతయును అతడు ఖడ్గముచేత ప్రవక్తలనందరిని చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను–రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయునుగాక” అని యెజెబెలు ఒక వర్తమానము పంపిన కారణము చేతనే.
ఈ వాక్యము ద్వారా మనము తెలుసుకోవలసినది ఏమిటి అంటే, అపవాది రేపు యేలియా ప్రాణమును తీయాలి అని ఆలోచన చేసాడు. ఏలియాకు ఆహాబును, యెజెబెలును ఎదుర్కొనే శక్తి లేదు గనుక అతడు పారిపోగలిగినంత మట్టుకు పారిపోయి, ఇంక పారిపోలేని స్థితిలో దేవుడినే తన ప్రాణము తీసుకోమని అర్ధించాడు. అయితే దేవుని దూత ఏలియాను దర్శించి, బలపరచి, సిద్ధపరచినట్టుగా మనము చూడవచ్చు.
మీ జీవితములో కూడా మీరు ఎదుర్కోలేని విషయములు మిమ్ములను భయపెడుతూ, ఇంక చాలు నా వల్లకాదు అనే నిట్టూర్పుతో కూడిన జీవితము 2024 లో ఉంటే గనుక, ప్రభువు చెప్తున్న మాటలు, 2025 లో నీ శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు సిద్ధపరచబడి ఉంది. బలము లేకపోవటము చేతనే ఏలియా పారిపోవలసి వచ్చింది. అయితే 2025 మనకు బలమైన సంవత్సరముగా ఉండబోతుంది. గనుక నీ జీవితము కూడా గొప్పగా ఆశీర్వదించబడునట్లుగా నీవు నిన్ను సిద్ధపరచుకోవాలి.
“రేపు ఈవేళకు నిన్ను చంపకపోతే” – అనే మాట చూస్తే, ఆహాబు అధికారము కలిగినవాడు గనుక ఖచ్చితముగా చేయగలుగుతాడు. అయితే ప్రభువు మాటను బట్టి సిద్ధపరచబడిన ఏలియా 40 దినముల ప్రయాణము చేయగలిగాడు. అనగా అపవాది ఏ ప్రయత్నమూ అసలు సఫలము కానేకాదు.
అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చిన దేమనగా–నీవు మరలి అరణ్యమార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశముమీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము;౹ ఇశ్రాయేలు వారిమీద నింషీకుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము; నీకు మారుగా ప్రవక్తయైయుండుటకు ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము.౹ -1 రాజులు 19:15-16
ఏలియాకు మారుగా ఏలిషాను అభిషేకము చేయమని చెప్పాడు అంటే, ఏలియా చేసిన అద్భుతములకంటే రెట్టింపు అద్భుతములు చేయగలుగునట్లు ప్రభువు ఏలియాను నడిపించాడు. ఏలియాను తన శక్తికి మించిన ప్రయాణము ఎందుకు చేయమన్నాడు అంటే, రెట్టింపు ఆశీర్వాదము కొరకు.
2025 రెట్టింపు అద్భుతముల సంవత్సరము, రెట్టింపు ఆశీర్వాదముల సంవత్సరము.
ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను. -లూకా 24:49
వాగ్దానములో మనము నిలిచి ఉండాలి అని ప్రభువు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. ఏమిటీ వాగ్దానము? “పరిశుద్ధాత్ముడు”. ఆ వాగ్దానము మీరు పొందుకున్నపుడు శక్తిని పొందుకుంటారు అని ప్రభ్వూ చెప్పుచున్నాడు.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.౹ -అపొస్తలుల కార్యములు 1:8
2025 కొరకు మనము ఎలా సిద్ధపడాలి అని ఈరోజు తెలియచేసిన మూడు విషయములు
1. పరిశుద్ధపరచుకోవాలి
2. సిద్ధపరచుకోవాలి
3. వాగ్దానమందు నిలిచి ఉండాలి.