స్తుతిగీతము – 1
ప్రేమ యేసయ్య ప్రేమా (4)
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2)
||ప్రేమ||
తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా
తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2)
||ప్రేమ||
నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా
తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2)
||ప్రేమ||
నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2)
తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా
ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా (2)
||ప్రేమ||
స్తుతిగీతము – 2
నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును
నా ఊహ చాలదు ఊపిరి చాలదు
ఎంతో ఎంతో మధురం
నీ ప్రేమ ఎంతో మధురం
ప్రభు యేసు ప్రేమ మధురం
నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో
నా పూర్ణ మనస్సుతో
నిను పూజింతును నా ప్రభువా (2)
||నీ ప్రేమ||
దేవదూతలు రేయింబవలు
కొనియాడుచుందురు నీ ప్రేమను (2)
కృపామయుడా కరుణించువాడా
ప్రేమస్వరూపా ప్రణుతింతునయ్యా (2)
||నా పూర్ణ||
సృష్టికర్తవు సర్వలోకమును
కాపాడువాడవు పాలించువాడవు (2)
సర్వమానవులను పరమున చేర్చెడి
అద్వితీయుడా ఆరాధ్యదైవమా (2)
||నా పూర్ణ||
స్తుతిగీతము – 3
కీర్తి హల్లెలూయా
గానం యేసు నామం మధురమిదే
నిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2)
స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ గానము శ్రీ యేసుకే
స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ స్తోత్రము మా క్రీస్తుకే
ప్రయాసే లేదుగా – యేసే తోడుగా
మాతో నడువగా – భయమే లేదుగా
||స్తుతి||
క్రీస్తుని వేడగా – మార్గం తానేగా
సత్యం రూఢిగా – జీవం నీయగా
||స్తుతి||
ఆరాధన వర్తమానము
కష్టములలో, శ్రమల కొలిమిలో ఉన్న సందర్భములలో 99 శాతము మనకు దేవుడు ఏమి చేయగలడొ అని మర్చిపోతాము, అసలు మనము ఉన్న సమయమును బట్టి మనము వెంబడించే దేవుడు ఎలా ఫీల్ అవుతాడు, ఏమని అనుకుంటున్నాడు అనే ఆలోచన కూడా మనము కలిగి ఉండము. అయితే ఒక ఉదాహరణ చూస్తే, ఈ లోకములో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు కలిగిన శ్రమలను బట్టి పిల్లలు బాధ అనుభవిస్తున్నా సరే తల్లి దండ్రులే కుమిలిపోయేవారుగా ఉంటారు. మనము ఉన్న పరిస్థితులలో ప్రభువును మనము మర్చిపోకూడదు. శారీరకముగా జన్మనిచ్చిన తల్లిని మనము మర్చిపోము, చిన్న దెబ్బత తగిలినా సరే, “అమ్మా” అని అరిచేంతగా ఉంటాము. మరి మనకు నూతన జన్మను ఇచ్చిన ప్రభువు అస్సలు మర్చిపోకూడదు.
ఈరోజు అటువంటి దేవుని మనసు మన యెడల ఎలా ఉంటుందో తెలుసుకుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాము.
అప్పుడు దేవుడు–ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనా–ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను.౹ అందుకు యెహోవా–నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే;౹ అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులునుగల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను. -యోనా 4:9-11
ఈ వాక్యములో మన దేవుని మనస్సు ఎలా ఉంటుంది అని అర్థము చేసుకోవచ్చు. నినేవే పట్టణము గూర్చి ఆలోచిస్తే, ఘోరమైన పాపముతో నిండిన పట్టణము.
–నీనెవెపట్ట ణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.౹ -యోనా 1:2
నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ; అది ఎడతెగక యెర పట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండియున్నది.చక్కనిదానవై వేశ్యవై చిల్లంగి తనమందు జ్ఞానముగల దానవై జారత్వముచేసి జనాంగములమీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసినదానా,౹ నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే–నేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు నీ ముఖముమీద కెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును.౹ -నహూము 3:1,4-5
నినెవే పట్టణము ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువు యొక్క మనసు మాత్రము, ఈ పట్టణమును మార్చాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. అందుకే యోనాకు తన ఉద్దేశ్యమును బయలు పరచడానికి ఒక సొరచెట్టును ఉపయోగించుకున్నాడు. మన జీవితములను ప్రస్తుతము మనము జ్ఞాపకము చేసుకుంటే, మనలను తన యొక్క ప్రాణము పెట్టి రక్షించి, అనేకమైన పరిస్థితులలో కృపద్వారా నడిపించిన మనము తప్పిపోయిన పరిస్థితులలో ప్రభువు మనసు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే, నిన్ను ప్రాణము పెట్టి రక్షించుకున్న నీ జీవితమును బట్టి విచారము కలిగి ఉండవద్దా అనే ఆలోచన కలిగి ఉన్నాడు.
మన జీవితాలను నిలబెట్టడానికి మన ప్రభువు ఎంత శ్రమ పడ్డాడు? ఎంత గొప్ప కార్యములు మన యెడల జరిగించాడు. మారనిది, మరువనిది, విడువనిది యెడబాయనిది అయిన దేవుని ప్రేమను మనము జ్ఞాపకము చేసుకోవాలి.
–యెహోవా, నేను నా దేశమం దుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందు గానే తర్షీషునకు పారిపోతిని.౹ -యోనా 4:2
నినెవె ఎంతో భయంకరమైన పట్టణము అయినప్పటికీ దాని యెడల కటాక్షము చూపుటకు ఇష్టము కలిగిన వాడై ఉంటున్నాడు. అత్యంత కృప కలిగిన దేవుడుగా ఉన్నాడు. వేశ్యవంటి జీవితమును కలిగిన పట్టణమును బట్టి ప్రభువు ఎంతగా చింతిస్తున్నాడు? దానిని బాగు చేయడానికి ఎంతగా ఆలోచిస్తున్నాడు? మనలను తన ప్రాణము పెట్టి రక్షించుకున్న మన జీవితములు అపవాది ఉచ్చులలో పడి తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, మనలను బాగుచేయడానికి ప్రభువు ఇష్టము కలిగి ఉన్నాడు.
కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యమువేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు యెహోవా న్యాయముతీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు. -యెషయా 30:18
ఎవ్వరూ నశించిపోకూడదు అనే ఆలోచన కలిగి, మనము మారడానికి అవకాశము దయచేయుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. జక్కయ్యను రక్షించుటకు, తన జీవితాన్ని సరిచేయడానికి ప్రభువే వెళ్ళినవాడుగా ఉన్నాడు. సమరయ స్త్రీ జీవితాన్ని సరిచేయడానికి ప్రభువే వెళ్ళాడు. వారి కోసము వెళ్ళిన దేవుడు, నీకోసము నాకోసము రాలేడా? నినెవే పట్టణము, జక్కయ్య, సమరయ స్త్రీ భయంకరమైన జీవితము కలిగినవారుగా ఉన్నారు. వారికోసము వెళ్ళిన దేవుడు, నీ గురించి రాడా? నీ కోసము తన వాక్కును పంపడా? ఈ విషయమును మనము ఆలోచించాలి.
పౌలు సౌలుగా ఉన్న సమయములో దమస్కు మార్గములో సంధించలేదా? గనుక ఎక్కడైతే మన జీవితములు కలత చెంది అయ్యి ఉంటాయో ఆ సమయములో మన యెడల ఆలోచన కలిగి, తన వాక్కు ద్వారా మనలను సంధించేవాడుగా ఉంటాడు. ఆలా పంపబడిన వాక్కును స్వీకరించి ఆ వాక్కు ప్రకారము నిలబడి ఉన్నట్టయితే, ప్రభువు యొక్క కార్యము చేసేవాడుగా ఉంటాడు.
నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను. అందు విషయమై– ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది. -రోమా 15:8
మొదటిగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు, అనగా నేను నిజమైన దేవుడను అని వాగ్దానము పొందినవారికి తెలియచేయుటకు క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను. అయితే మనము ప్రవచనాత్మకముగా చూస్తే, పితరులు అనగా మన గతకాలము. మన గతకాలములో చేసిన వాగ్దానములు నెరవేర్చడానికి యేసయ్య పని చేయువాడుగా ఉన్నాడు అని అర్థము చేసుకోగలము.
అయితే యేసు–నాతండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను.౹ -యోహాను 5:17
మన జీవితము కలత చెంది ఉన్నప్పటికీ, మనలను ప్రేమిస్తున్న తండ్రి ప్రేమ మార్క అలాగే నిలిచి ఉంది. జక్కయ్య జీవితమును మార్చడానికి వెళ్ళినవాడు, సమరయ స్త్రీ గుర్తించేవారకు సంధించి తన జీవితమును మార్చిన దేవుడు ఈరోజు నిన్ను, నన్ను విదిలిపెడతాడా? నీకు నాకు చేసిన వాగ్దానములను నెరవేర్చుటకు మన జీవితములలో పనిచేయువాడుగా ఉన్న దేవుడు నమ్మదగినవాడు.
అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును సహితము క్రీస్తు పరిచారకుడాయెను. అనగా మనము దేవుని ఎరగనటువంటి సమయము. మన జీవితములో అనేక సందర్భములు అసాధ్యముగా కనబడతాయి. అటువంటి సమయములో దేవుడు కూడా ఏమీ చేయలేడు అని మనమే నిర్ధారించేస్తాము. అటువంటి సమయములలో అనగా దేవుని శక్తిని ఎరగలేని సమయములో, దేవుని కనికరము ఏమిటో నీకు నాకు తెలియచేయుటకు క్రీస్తు పనిచేసేవాడుగా ఉన్నాడు అని అర్థము.
అనగా నీ గతకాలములో దేవుడు చేసిన వాగ్దానమును నెరవేర్చడానికి ఆయన పనిచేసేవాడుగా ఉంటున్నాడు. అలాగే, దేవుని గూర్చి, తాను ఏమి చేయగలడో ఎరగలేని స్థితిలో ఉన్నప్పటికీ కనికరము చూపించే దేవుని హృదయమును ఎరుగులాగున క్రీస్తు మన జీవితములలో పనిచేస్తున్నాడు.
అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులునుగల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను. -యోనా 4:11
పశువులు అనగా ఒకనికి కలిగి ఉన్న కలిమిస్థితి ని సూచిస్తుంది. అనగా దేవుని కనికరము మన మీదనే కాక, మనము కలిగి ఉన్న్నదానిపైనా కూడా ఉంటుంది. ఇంత ప్రేమ కలిగిన దేవునిని నుండి ఏ పరిస్థితి దూరము చేయగలినది?
క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?౹ -రోమా 8:35
అందు విషయమై– ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది – రోమా 15:8
“అందు విషయమై” అనగా వాగ్దానము నెరవేర్చే ఆలోచన కలిగి, దేవుని గూర్చి ఎరగలేని స్థితిలో మనపై కనికరము కలిగి తిరిగి సమకూర్చే దేవుని వ్యక్తిత్వమును బట్టి, క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? అని వ్రాయబడి ఉన్నది.
ఈరోజు మనము మనలను ఎంతగానో ప్రేమించే దేవుని స్తుతిద్దామా, ఆరాధిద్దామా? తాను మొదలు పెట్టిన పని ముగించేవరకు వదిలిపెట్టని మన దేవుని ప్రేమనుండి ఏదీ మనలను ఎడబాపలేదు అనే సత్యము ఎరిగి, ఆయనను స్తుతిద్దాము.
ఆరాధన గీతము
ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా
ఆనందముతో నింపేవాడా ఆశ్చర్యకరుడా నా యేసురాజా
యేసు రాజా యేసు రాజా యేసు రాజా
పరిశుద్ధమైన వాడా పూజింపదగినవాడా
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
కన్నీరు తుడిచేవాడా కౌగిటిలో చేర్చేవాడా
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
పరిపూర్ణమైన వాడా పరలోక మేలు వాడా
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
వారము కొరకైన వాక్యము
మనము ఉన్న దినములు అంత్య దినములు. ఈ దినములలో ఏర్పాటుచేయబడినవారిని సైతము పడద్రోసే దినములు. అనేకులు ఆత్మీయతను కోల్పోయే దినములు. ఇటువంటి భయంకరమైన దినములలో మన ఆత్మీయతను ఎలా కాపాడుకోగలుగుతాము అని వాక్యము ద్వారా నేర్చుకుందాము.
మనము దేవునికి దూరముగా ఉండకూడదు, దూరముగా పారిపోకూడదు. ఈ విషయము గూర్చి మనము యోనా గ్రంథము ద్వారా నేర్చుకుందాము.
అయితే యెహోవా సన్నిధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.౹ -యోనా 1:3
యోనా జీవితమును పరిశీలనచేస్తే, దేవుని సన్నిధిలో నిలువక పారిపోతున్నాడు. అయితే ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అని ధ్యానిస్తే, ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, అబద్ధప్రవక్త కానేకాదు.
అతడు వారితో ఇట్లనెను – నేను హెబ్రీయుడను; సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై యున్నాను. -యోనా 1:9
యోనా దేవుని యందలి భయభక్తులు కలిగి, ఆత్మీయమైన జీవితమును జీవించేవాడు. అయితే ప్రస్తుతము ఉన్న పరిస్థితిలో దేవుని సన్నిధిలో నిలువలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. మన జీవితములో కూడా ఒకప్పుడు మేము బాగా ఆత్మీయముగా ఉండేవారము, ఒకప్పుడు ప్రార్థన బాగా చేసుకొనేవారము అయితే ఇప్పుడు? దేవుని సన్నిధిలో నిలువలేని వారముగా అయిపోతున్నాము.
అయితే యోనా ఎందుకు పారిపోతున్నాడు? భయభక్తులు కలిగినవాడు దేవుని సన్నిధిలో ఉండాలి కదా! దేవుని సన్నిధిలో మాత్రమే పూర్ణ సంతోషము, బలము ప్రభావము ఉంటుంది. అటువంటి సన్నిధికి దూరముగా ఉంటే, నీవు సంతోషమునకు, దేవుని శక్తికి, ఆయన కనుపరచే తన బలమునకు దూరముగా ఉండిపోతున్నావు అని అర్థము చేసుకోవాలి, గ్రహించాలి.
అయితే ఈరోజు యోనా పరిస్థితి ఏమైనప్పటికీ, మన జీవితములను గూర్చి నేర్చుకుందాము. యోనా సందర్భములో, నినెవే పట్టణమునకు వెళ్ళి దేవుడు చెప్పిన మాట చెప్పమని చెప్పాడు. అయితే ఆ పని చేయుటలో యోనాకు ఇష్టములేకుండా ఉండవచ్చు, లేక భయము ఉండి ఉండవచ్చు.
యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –నీనెవెపట్ట ణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.౹ -యోనా 1:1-2
నినెవే పట్టణములోనికి వెళ్ళి మీ పట్టణము నాశనము అయిపోతుంది అని ప్రకటిస్తే నరహత్య చేయు పట్టణము ఊరుకుంటుందా అనే భయము చేత యోనా పారిపోయి ఉండవచ్చు. అయితే మన జీవితములో వేరే వేరే కారణములతో దేవునికి దూరము అయిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నము. ఒకప్పుడు ఆదివారము మాత్రమే కాక, ప్రతి దినము ప్రార్థనలో, దేవుని వాక్యము ధ్యానము చేయడానికి సమయము కేటాయించేవారముగా ఉన్నామేమో, అయితే ఇప్పుడు ఆ ఆసక్తి కూడా లేని స్థితిలోనికి మారిపోయామేమో.
మరలా యోనాను గూర్చి ఆలోచిస్తే, పారిపోతున్న ఆ వ్యక్తి ఏమైనా ఆలోచన కలిగి ఉన్నాడా ఊరకనే పారిపోతున్నాడా? ఈయనకి ఆ నినెవే పట్టణము బాగుపడటము ఇష్టము లేదు. మనలో కూడా దేవుని సన్నిధిలో సహితము అసూయ పడేవారుగా కూడా ఉంటాము. ఎవరైనా ఆశీర్వదించబడితే చూసి అన్నీ వాళ్ళకేనా అని ఆలోచించి, దేవుని సన్నిధికి దూరము అయిపోయేవారిగా ఉంటాము.
యెహోవా, నేను నా దేశమం దుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందు గానే తర్షీషునకు పారిపోతిని.౹ -యోనా 4:2
అంటే దేవుడు కృపగలవాడు కాబట్టి ఒకవేళ నినెవే మీద తాను చేయాలి అనుకున్న కీడు చేయక మానతాడు అనే ఆలోచనను బట్టి తర్షీషునకు పారిపోయాడు. అంటే నినెవే కు దేవుని కృప లభించడము యోనాకు ఇష్టము లేదు.
అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.౹ -యోనా 1:4
ఉండవలసిన దేవుని సన్నిధిలో ఉండక వేరే మార్గములో వెళ్ళినప్పుడు, పరిస్థితులు ఎలా మారుతున్నాయి అని ఆలోచించాలి. దేవుని సన్నిధికి దూరముగా వెళుతున్నప్పుడు మన జీవితములో జరిగే మార్పులు గమనించుకోవాలి. అదికూడా మనమున్న అంత్య దినములలో మరెంతో భయంకరమైన పరిస్థితులు మన చుట్టు ఉన్నాయి గనుక, మన క్షేమము దేవుని సన్నిధిలోనే అనే సత్యము ఎరిగి ఉండాలి. కోడి తన పిల్లలను ఎలా అయితే తన రెక్కల చాటున భద్రపరచినట్టు దేవుడు తన పిల్లలను కాపాడుతాడు.
కోడి ఎలా తన పిల్లలను కాపాడుతుంది? పైన గ్రద్ద తిరుగుతుంది, పిల్లలు కోడి రెక్కల క్రింద ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. ఎప్పుడైతే కోదిపిల్ల తల్లి రెక్కలనుండి పక్కకు వెళుతుందో, గ్రద్ద వెంటనే దాడి చేసేదిగా ఉంటుంది.
యోనా కూడా ఒకటి అనుకుని బయలుదేరాడు గానీ మరొకటి జరుగుతుంది.
కాబట్టి నావికులు భయపడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను -యోనా 1:5
దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు అనేకులకు ఆశీర్వాదకారణముగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవునినుండి దూరముగా వెళ్ళిపోతున్నాడో అనేకులు తనను బట్టి నష్టపోతున్నారు. వారి వ్యాపార సాధనములు నీటిపాలు అయిపోయాయి. దేవుని ఆలోచనలు నీ జీవితములో పనిచేయాలి అంటే, దేవుని సన్నిధిలోనే నిలిచి ఉండాలి. ఓడ అనేది ఒక కుటుంబముగా మనము చూడవచ్చు. నిన్ను బట్టి కుటుంబము ఆశీర్వదించబడుతుంది, అలాగే నిన్ను బట్టే అదే కుటుంబము నష్టపరచబడుతుంది. గనుక మనము ఎంతో భయము కలిగి జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నడచుకోవాలి. ఈరోజు ఈ మాటలు నీ హృదయమును తడుతున్నట్టయితే, నీ జీవితమును సరిచేసుకో!
యోనా జీవితములో చూస్తే, తాను చివరికి తనను బట్టే, అనే సంగతి గ్రహించగలిగాడు. యోనా దేవుని మనసును ఎరిగిన వాడు, గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. మనను కూడా దేవుడు అలాగే చూస్తున్నాడు. ఎంతో ఉజ్జీవము కలిగిన ఆత్మీయ స్థితిలో ప్రారంభించి ఇప్పుడు చల్లబడిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పటికీ, దేవుడు మరొక అవకాశము ఈరోజు ఇస్తున్నాడు. యోనా జీవితములో నష్టము చూసిన తరువాత గ్రహించాడు. అయితే ఈరోజు ప్రభువు మనకు ఒక అవకాశము ఇస్తున్నాడు. ఇంకా నష్టము చవి చూడక మునుపే ప్రభువు పిలుపుకు లోబడదాము.
యేసయ్య ప్రవక్తగా ఉన్నాడు, యోనా కూడా ప్రవక్తగా ఉన్నాడు. యేసయ్య ఓడలో ఉన్నాడు, యోనా కూడా ఓడలో ఉన్నాడు. యేసయ్య ఉన్నచోట తుఫాను రేగింది, యోనా ఉన్నచోట తుఫాను రేగింది. అయితే యేసయ్య దేవుని పని నెరవేర్చడానికి నిలబడినవాడై ఉన్నాడు కాబట్టే, నష్టము జరగలేదు. అయితే యోనా దేవుని పని నెరవేర్చుటలో నిలబడలేదు కాబట్టి నష్టము చూడవలసివచ్చింది. అంతకు మించి, యేసయ్య ఆ తుఫానును అణిచివేయగలిగాడు. యోనా సముద్రములో పడద్రోయబడవలసి వచ్చింది.
నన్నుబట్టియే యీ గొప్పతుపాను మీమీదికివచ్చెనని నాకు తెలిసియున్నది; నన్నుఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీమీదికి రాకుండ నిమ్మళించునని అతడు వారితో చెప్పినను -యోనా 1:12
యోనా బుద్ధి జ్ఞానము ఇక్కడ కనబడుతుంది. నన్ను చంపివేయమని చెప్పట్లేదు గానీ ఈ సముద్రములో పడవేయమని అడిగాడు. ఎందుకంటే, దేవుని చిత్తమును ఎరిగినవాడు. నేను తర్షీషునకు వెళ్ళడము దేవునికి ఇష్టములేదు గనుక ఇక్కడే నన్ను పడవేయమని అడిగాడు. నినెవే లాంటి భయంకరమైన పట్టణమువిషయములోనే కృపాకనికరములు కనపరచిన దేవుడు నా విషయములో సహితము కృప చూపగలిగినవాడు అని ఎరిగినవాడు. గనుక ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబము నష్టపోకుండా నీ దేవుని సన్నిధికి తిరిగిరా. కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడు నీ దేవుడు గనుక, ఈ దినమే నీ దేవునితో సమాధానపడి, సరిచేసుకుని తిరిగి మనసు సిద్ధపర్చుకుంటే, వెంటనే నిన్ను దేవుని చిత్తములో తిరిగి కొనసాగించడానికి మార్గము తెరిచేవాడుగా నీ దేవుడు ఉన్నాడు.
యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి; పడవేయగానే సముద్రము పొంగకుండ ఆగెను.౹ ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి, ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్లు చేసిరి.౹ గొప్ప మత్స్యము ఒకటి యోనాను మ్రింగవలెనని యెహోవా నియమించి యుండగా యోనా మూడుదినములు ఆ మత్స్యముయొక్క కడుపులో నుండెను. -యోనా 1:15-17
యోనాను సముద్రములో పడవేయగానే, ఏ నష్టము అయితే కలిగిందో ఆ నష్టము ఆగిపోయింది. ఓడలోఉన్నవారు దేవునిని గూర్చి తెలుసుకుని మహిమపరచారు. అంతే కాక, యోనా వచ్చేసరికి సిద్ధముగా ఒక గొప్ప చేపను దేవుడు సిద్ధపరచి ఎదురుచూస్తున్నాడు. అదీ మన దేవుని ప్రేమ.
ఒకప్పుడు ఎలా ఉన్నాము? ఇప్పుడు ఎలా ఉంటున్నాము? మనలో ఆత్మీయ ఉజ్జీవము ఏమైంది? ప్రభువుకు మన మొదటి ప్రేమ కావాలి. ఈరోజు ఈ మాటలు నీవు స్వీకరించి ప్రభువు సన్నిధికి తిరిగివస్తావా?