స్తోత్ర గీతము 1
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటే బలమైన ప్రేమది
నన్ను జయించే నీ ప్రేమ (2)
|| ఆశ్చర్యమైన ||
పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే
|| ఆశ్చర్యమైన ||
పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే
|| ఆశ్చర్యమైన ||
శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు
|| ఆశ్చర్యమైన ||
నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే
|| ఆశ్చర్యమైన ||
స్తోత్ర గీతము 2
యేసు చావొందె సిలువపై నీకొరకె నాకొరకే
యెంత గొప్ప శ్రమనోర్చెను నీకొరకె నాకొరకే
నదివోలె యేసు రక్తము – సిలువలో నుండి ప్రవహించె
పాపము కడిగి – మలినము తుదిచె – ఆ ప్రశస్త రక్తమే
నేడె నీ పాపములొప్పుకో – నీ పాపపు డాగులు తుడుచుకో
నీ యాత్మ తనువుల – శుద్ధి పరచుకొ – క్రీస్తు యేసు రక్తములో
పాప శిక్ష పొంద తగియుంటిమి – మన శిక్ష ప్రభువె సహించెను
నలుగ గొట్టబడె పొడవబడె నీకై -అంగీకరించు యేసుని
స్తోత్ర గీతము 3
ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని
ఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా (2)
నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా ||ఎవరు||
తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక – నీ కొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన – నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ – అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా – ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా – యేసయ్యా నీవెగా
||ఎవరు||
ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణం
నీ సన్నిధానమందు – సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే – నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన – నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన – నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా – నిలిచె నా యేసయ్యా
||ఎవరు||
స్తోత్ర గీతము 4
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)
నే పాడెదన్ – కొనియాడెదన్ (3)
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4)
||ప్రేమా||
లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)
యేసుని ప్రేమ వెల యెంతో
ఇహమందైనా పరమందైనా (2)
వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ
కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2)
||ప్రేమా||
మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ (2)
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2)
గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2)
||ప్రేమ||
ఆరాధన వర్తమానము
2000 వేల సంవత్సరముల ముందు కలువరి సిలువలో మరణించారు. అయితే ప్రస్తుతం మనం ఎందుకు జ్ఞాపకము చేసుకోవాలి? అనేది మనము తెలుసుకుందాము.
ఆ కలువరి సిలువలో దేనికొరకు బలియాగం అయ్యారో ఖచ్చితముగా మనము తెలుసుకోవాలి. అలాగే దేని కొరకు మనకు మంచి దినముగా మార్చబడింది?
మొదటిగా ప్రభువు సిలువలో ఎందుకు మరణించవలసి వచ్చింది? అనేది మనము తెలుసుకుందాము? దీనికి జవాబు మన వ్యక్తిగత సాక్ష్యము అయితే మనము ఎంతో ధన్యులము.
నీవు ప్రభువుకు, ప్రభువు సిలువకు సాక్ష్యముగా ఉన్నావా? ఇది ప్రభువు మన అందరికీ వేసే ప్రశ్న! సిలువకు సాక్షిగా ఉండాలి అంటే, అసలు ఆ సిలువలో ఏమి జరిగిందో మనకు తెలియాలి.
ప్రభువు సిలువ మరణమే ఎందుకు ఏర్పాటు చేసారు? వేరే రకమైన మరణమును ఎందుకు ఏర్పాటు చెయ్యలేదు? ఆరోజుల్లో, ఈ సిలువ మరణము ఎంతో భయంకరమైనది. సిలువ వేసినప్పుడు, నరక యాతన అనుభవించి, చివరి రక్తపు బొట్టు కూడా కారిపోయి చనిపోతారు. అనగా ఒక్కసారే ప్రాణము పోదు గానీ, కొంచెము కొంచెముగా ప్రాణము పోతుంది.
దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.౹ -అపొస్తలుల కార్యములు 2:23
ఈ సిలువ, దేవుడు తన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి, నిశ్చయించిన సంకల్పము. పాపము పోవడానికి మనము విడుదల పొందడానికి పరిశుద్ధమైన రక్తము చేతనే అది సాధ్యము అనేది మనకు వాక్యం ద్వారా తెలుసు.
అందుకే మన ప్రభువైన యేసయ్య, పాపపు లోకములో పరిశుద్ధునిగా పుట్టి, పరిశుద్ధునిగా జీవించి, మనకొరకు పరిశుద్ధమైన రక్తమును చెల్లిచడము ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది.
దేవుని సంకల్పము ఏమి అయిఉంది? అది నీవే, నిన్ను పరిశుద్ధునిగా చేయడమే! నీవు నేను నిర్ణయించబడిన వారము. అందుకే నీవు నేను సిలువకు సాక్ష్యముగా ఉండాలి.
ఏ సత్యమైతే నీకు ప్రకటించబడుతుందో, ఆ సత్యమందు నీవు నిలిచినపుడు, నీ జీవితము సాక్ష్యముగా మార్చబడుతుంది.
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. -రోమా 8:30
ప్రభువు ముందుగా నిర్ణయించబడిన సంకల్పము చొప్పున కలువరి సిలువలో అర్పించబడటానికి కారణము ఏమిటి? దానికి నేనే కారణము అని నీవు ఎరిగినప్పుడు, నీవు సత్యమును గ్రహించగలుతావు!
“నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ” అని పాట పాడాము. మన స్థితి ఏమిటి? పాపపు స్థితి. అయితే పాపము చేసినవాడిపై జాలి ఎందుకు చూపించాలి? ఇది అర్థము చేసుకోవాలి అంటే, ఆయన మనసు మనము చూడాలి.
మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతోకూడ బ్రదికించెను.౹ మీరు వాటినిచేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.౹ -ఎఫెసీయులకు 2:1-2
మన స్థితి ఏమిటి అంటే, చచ్చిన స్థితి. అంటే దేవుని అంగీకరించని వారు చచ్చిపోయినవారేనా? చచ్చిన స్థితి అంటే ఏమిటి?
ఒకని మార్గము వాని దృష్టికి యదార్థముగా కనబడుతుంది, గానీ తుదకు అది మరణమునకు దారి తీస్తుంది. అయితే దేవుని దృష్టి ప్రకారము చూస్తే, పాపమునకు జీతము మరణము గనుక, దేవుడు మనలను చనిపోయినవారిగా చూస్తున్నాడు.
అనగా మన దేవుడు చనిపోయిన స్థితిలో ఉన్న మనలను చూసి జాలి పడుతున్నాడు. చాలా సందర్భములలో తప్పు చేయకూడదు అని ప్రయత్నిస్తాము. మహా అయితే ఒకరోజు లేదా రెండు రోజులు, అటు తరువాత మరలా అదే తప్పు చేసేవారిగా అయిపోతాము.
ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.౹ ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేప్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను.౹ కావున ఇకను దానిచేయు నది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.౹ నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.౹ నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడుచేయుచున్నాను.౹ నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.౹ కాబట్టి మేలుచేయగోరు నాకు కీడుచేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది.౹ అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని౹ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపెట్టి లోబరచుకొనుచున్నది.౹ -రోమా 7:15-23
అంటే, నేను ఫలానాది చెయ్యకూడదు అని నేను నిశ్చయించుకున్నాను కానీ, అది చెయ్యలేకపోతున్నాను అని అర్థము. మేలైనది చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను కానీ, అది చెయ్యడము నా వల్ల కావట్లేదు. దీనికి కారణము “పాప నియమము”.
ఈ పాప నియమము మనలో ఉండటమును బట్టి, అపవాది చేత సుళువుగా ప్రేరేపించబడుతున్నాము. మంచిగా ఉండాలి అనుకున్నప్పటికీ, వల్ల కావట్లేదు అనే దుస్థితి ప్రభువు చూసినవాడుగా ఉన్నాడు.
మనము మంచి చెయ్యాలి అనుకున్నప్పటికీ, చెయ్యలేని నిస్సహాయ స్థితిని చూసి జాలి చూపించాడు మన దేవుడు. మన కొరకు పరుగెత్తి మన దగ్గరకు వచ్చాడు, అయితే అనేకసార్లు మనము ఆయనకు దొరకక మనము తప్పించుకుని వెళ్ళిపోతున్న మనలను విడువక తన జాలి చూపిస్తూనే వచ్చాడు.
మన స్థితి జూచి, మనపై జాలిని జూపి, మనకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి – మనపై ప్రేమను చూపించి మనలను రక్షించుకున్నాడు. ఈ సత్యము వ్యక్తిగతముగా ఒప్పుకొని, ప్రభువును ఆరాధిద్దాము. నేను సిలువకు ఒక సాక్షిని అని ఉజ్జీవముగా ప్రకటిద్దాము.
అయితే ఆరాధించే ముందు మనము ఒకసారి పరీక్షించుకుందాము. ఆయన సిలువకు మనము నిజముగా సాక్షిగా ఉంటున్నామా? ఒకవేళ సాక్షిగా ఉంటే ఆరాధించు, అలా లేకపోతే నీ ఆరాధన వలన ప్రయోజనము లేదు. అయితే ఇకనుండి అయినా సరే సాక్షిగా ఉండాలి అని తీర్మానము చేసుకుంటే, అప్పుడు ఒప్పుకొని ఆరాధించు!
ఆ సిలువలో కార్చిన రక్తము నిబంధన రక్తమై ఉంది. ఈ దినము నీ విమోచన దినము. యదార్థముగా, కలువరి సిలువను చూస్తూ ప్రభువును ఆరాధిద్దాము.
ఆరాధన గీతము
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటే బలమైన ప్రేమది
నన్ను జయించే నీ ప్రేమ
|| ఆశ్చర్యమైన ||
నా స్థితి జూచిన ప్రేమ
నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి శ్రమనోర్చి
రక్తముకార్చి నన్ను రక్షించెను
|| ఆశ్చర్యమైన ||
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా
వెలియైన యేసయ్య బలియైన యేసయ్య
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా
నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు
కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువునే రుధిరంబు ధారలే
శుభశుక్రవారపు వర్తమానము
ఆజ్ఞాతిక్రమమే పాపము, అయితే ఈరోజునుండి మనము ప్రభువు సిలువకు సాక్ష్యము. నీవు నిలబడగలిగితే, నీ చేయి పట్టి నడిపించగలిగినవాడుగా ఆయన ఉన్నాడు.
సిలువ యొక్క ప్రాముఖ్యత మనకు తెలిసినట్టయితే, ఆ సిలువకు సాక్షిగా మనము జీవించగలుగుతాము.
దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.౹ -అపొస్తలుల కార్యములు 2:23
ఆయన నిశ్చయించిన సంకల్పము “మనమే” అని తెలుసుకున్నాము.
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.౹ -రోమా 3:23
దేవుని సంకల్పము మన జీవితమే, అయితే ఆ జీవితము ఎలా ఉండాలి? రోమా 3:23 ప్రకారము, పాపమును బట్టి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. మరొక వాక్యము కూడా చూసి కొన్ని విషయాలు తెలుసుకుందాము.
మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. -కొలొస్సయులకు 2:13
మనము దేవునికి విరోధముగా మనము చేసిన ప్రతి పాపపు చిట్టా సిద్ధపరచబడి ఉంది. ఈ చిట్టాను బట్టి మనము ఆ పాపపు దాసత్వములోనికి, బానిసత్వములోనికి వెళ్ళిపోయాము. బానిసత్వము అంటే, యజమాని ఏమి చెప్తే అది చెయ్యవలసినదే.
అలాగే మనలను ప్రేరేపించే అపవాది మనకు యజమానిగా ఉండటానికి మనము చేసిన పాపముల యొక్క చిట్టా ఒక సాక్ష్యముగా ఉంది. అందుకే మనలను ప్రేరేపించగలుతున్నాడు. అయితే దాని నుండి మనము విడిపించబడాలి అంటే, ఆ పాపములకు వెల చెల్లించాలి.
మన పాపముల చిట్టా ప్రకారము, మనము మరణపాత్రులము అయ్యాము. మనము జీవించే అవకాశము లేదు. ముగించబడవలసిన స్థితిలో మనము ఉన్నప్పుడు, ఆ పాపపు చిట్టాను మేకులతో సిలువకు కొట్టెను. ఎందుకంటే, రక్తము చిందించబడితేనే గానీ పాప క్షమాపణ లేదు. ప్రభువు యొక్క రక్తము ఆ సిలువలోనే కార్చబడింది గనుక, ఆ చిట్టా మేకులతో కొట్టబడింది.
“మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి”. మనము చేసిన పాపము దేవుడు మనకు అనుగ్రహించు మహిమకు అడ్డముగా నిలబడుతుంది. దీని ద్వారా అసలు ఏమి కోల్పోతున్నాము అని మనము తెలుసుకోవాలి.
దేవుడు అనుగ్రహించు మహిమ దేని కొరకు? అసలు మహిమ ఎప్పుడు ఉంది? పాపము చెయ్యనంతవరకు దేవుని మహిమ మనతో ఉంది. ఆదాము పాపము చెయ్యనంతవరకు, దేవుని మహిమ అతనితో ఉంది. ఆదాము ఏమి పలికితే అది జరిగింది. ఇది ఆదాముకు దేవుడు అనుగ్రహించు మహిమను బట్టి జరిగింది.
అంటే, దేవుని మాట ప్రకారము మనము చేసినప్పుడు, దేవుని మహిమ మనకు అనుగ్రహించబడుతుంది. మన జీవితము కొనసాగించబడుతుండగా అది దేవుని మహిమ చేతనే అది కొనసాగించబడాలి.
మోషే కొండమీద దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు, దేవుని మహిమతో నిండిపోయినవాడుగా ఉన్నాడు. అప్పుడు మోషే క్రిందకు వచ్చిన తరువాత ఎవ్వరూ అతని ముఖమును చూడలేకపోయారు.
దేవుని మహిమ మనకు అనుగ్రహించబడితే, మనకు ఎదురుగా వ్యతిరేకముగా నిలబడిన ఏది నిలువదు.
మనము దేవుని మాటను పాటించకపోతే, పాపము చేసినట్టు. అదే దేవుని మాటను బట్టి మనము చేయగలిగితే, దేవుని మహిమ పొందుకుంటాము, ఆ మాట ప్రకారము జరగడానికి కార్యము జరుగుతుంది
నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను – గలతీయులకు 2:20
“నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను” అని చెప్పాలి అంటే మనము ఎలా ఉండాలి? “ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు” అన్నట్టుగా మన జీవితము ఉండాలి. మన యొక్క అహము మనలో ఇంకా మిగిలి ఉంటే, క్రీస్తువలే జీవించలేము.
పాపము విషయములో నేను సిలువ వేయబడి ఉన్నాను, నేను పాపము విషయములో చనిపోయాను, ఇంక జీవించేది నేను కాదు గానీ, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అంటే, దేవుని మాట ప్రకారము నేను చేయగలిగినట్టుగా నేను బలపరచబడతాను.
క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు, అంటే దేవుని వాక్యమే క్రీస్తు. దేవుని యొక్క వాక్యమే నా జీవితము అనే తీర్మానము మనము కలిగి ఉండాలి. ఇంతవరకు ఏమైనా గానీ, ఈరోజు గనుక నీ దేవుని మాటలు విని, ఇప్పటినుండి అయినా సరే దేవుని మాటలే నా జీవితము అని తీర్మానము తీసుకుంటే, దేవుని కే మహిమ కలుగును గాక!
“మీరు కారా నా పత్రికలు” అని పౌలు చెప్పుచున్నాడు. ఆ పత్రికలు క్రీస్తుని మాత్రమే ప్రకటిస్తున్నాయి. అనగా మనము పత్రికలైతే, మనము, మన జీవితము క్రీస్తుని ప్రకటిస్తుంది.
అందుకే మనం పరీక్షించుకుందాము ఎక్కడ మనము దేవుని వాక్యము ప్రకారము ఉండట్లేదో పరీక్షించుకుందాము. మన నడక, పడక, ఆలోచన, చూపు, మాట, తిండి అన్ని విషయాలలో సరిచేసుకుందాము.
ఆ కలువరి సిలువ యొక్క త్యాగము మనము కనుపరచాలి అంటే, మనమే దేవుని వాక్యమై ఉండాలి. అలా మనము ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే –
ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.౹ -కొలొస్సయులకు 1:13
నీ జీవితము వాక్యము అయి ఉన్నట్టయితే, నీవు దేవుని మహిమచేత నింపబడతావు. అలాగే, వాక్యము వెలుగై ఉన్నది, మన జీవితము వాక్యమైతే, మన జీవితము వెలుగుగా మారుగుతుంది. వెలుగు ఉన్నచోట చీకటి ఉండదు.
మరొక విషయము చూస్తే, మనము ప్రభువును అంగీకరించనపుడు తప్పు చేయడానికి ప్రేరేపించాడు. ప్రభువును అంగీకరించిన తరువాత కూడా ప్రేరేపించబడుతున్నాము కదా! అయితే ఇప్పుడు, ఆ సిలువ మనము పాపములోనికి వెళ్ళకుండా అడ్డుపడుతుంది.
ఈ మాట నీ జీవితములో నెరవేర్చబడాలి అంటే, ఖచ్చితముగా నీవు దేవుని వాక్యము ప్రకారమే మనము జీవించాలి. “అంధకారసంబంధమైన అధికారము” అంటే, అంధకారమునకు ఒక అధికారము ఉంది. ఆ అధికారమునకు లోబడవలసిన స్థితిలో ఉన్నవారికి, వేరే ఆప్షన్ లేదు. అయితే దేవువి వాక్యము ప్రకారము మనము జీవిస్తే, దాని అధికారము కూడా మనపై పని చేయదు.
అంధకార సంబంధమైనది అంటే, నీ జీవితమును నాశనము చేసేది. నీవు దేవుని వాక్యమై జీవిస్తే, నీ జీవితమును నాశనము చేయ్యడానికి అంధకారమునకు ఉన్న అధికారము సరిపోదు.
మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. -మత్తయి 16:18-19
బండ అంటే, క్రీస్తు. క్రీస్తు అంటే వాక్యము. ఆ వాక్యము నీ జీవితము అయితే, పాతాళ లోక ద్వారములు, నిన్ను నాశనము చేసే ఏదీ నీ జీవితములో పనిచేయదు.
ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.౹ -కొలొస్సయులకు 1:19
మన పౌరస్థితి పరలోకములో ఉంది. మనకు కావలసిన ప్రతీదీ పరలోకమునుడే అనుగ్రహించబడతాయి. అయితే మనము చేసిన పాపము అవి మనము పొందకుండా అడ్డుపడింది.
యేసయ్య కలువరి సిలువలో అర్పించబడినతరువాత, దేవుడు యేసులో సమాధానపరచబడి, ఆగిపోయిన పరలోకమైన ఆశీర్వాదము, భూసంబంధమైన ఆశీర్వాదము క్రీస్తు సిలువను బట్టే మనకు అనుగ్రహించబడుతుంది.
సిలువకు నీవు సాక్షివి అయితే, సిద్ధపరచబడిన ప్రతి ఆశీర్వాదము మనము పొందుకుంటాము.
వారు–రండి మన దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించు వాడు గదా; నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు.౹ -యిర్మీయా 5:24
మొదటినుండి చివరి వరకు ఏమి జరగాలో అనే ఒక క్రమము దేవుడు నిర్ణయించి నియమించాడు. ఈ ఆగిపోయిన ఆశీర్వాదపు క్రమమును తిరిగి ప్రారంభించిందే క్రీస్తు సిలువ.
మరలా ప్రభువు ఆరాధిద్దాము
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటే బలమైన ప్రేమది
నన్ను జయించే నీ ప్రేమ
నా స్థితి జూచిన ప్రేమ
నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి శ్రమనోర్చి
రక్తముకార్చి నాకు జీవమిచ్చెన్
నా స్థితి జూచిన ప్రేమ
నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి శ్రమనోర్చి
రక్తముకార్చి నన్ను లేవనెత్తెన్
నా స్థితి జూచిన ప్రేమ
నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి శ్రమనోర్చి
రక్తముకార్చి ఆశీర్వాదమిచ్చెన్
యేసయ్య ఆ సిలువలో వేలాడుతున్నంతసేపు నీ రిస్టొరేషన్ జరుగుతూ వచ్చింది. ఆగిపోయిన ఆశీర్వాద క్రమము తిరిగి ఆరంభించబడింది.
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా
వెలియైన యేసయ్య బలియైన యేసయ్య
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా
నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు
కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువునే రుధిరంబు ధారలే
—————–
ఇదిగో దేవా నా హృదయం
ఇదిగో దేవా నా మనసు
ఇదిగో దేవా నా దేహం
ఈ నీ ఆత్మతో నడుపుమా
పరిశుద్ధ ఆత్మతో నడుపుమా
పనికిరాని తీగలున్నవి
ఫలమివ్వ అడ్డుచున్నవి
ఫలియించే ఆశ నాకుంది
ఓ నా తోటమాలి
ఇంకో ఏడాది గడువు కావాలి
ఫలియించే ఆశ నాకుంది