28-1-2024 – ఆదివారం రెండవ ఆరాధన

స్తుతిగీతము -1

హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము
ఆ….. హల్లెలూయ …
హల్లెలూయ … హల్లెలూయ …

అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతియించెదము
అలసంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతియించెదము
…హల్లెలూయ…

ఆకాశము నుండి మన్నాను పంపిన
ఆ దేవుని స్తుతియించెదము
బండ నుండి మధుర జలమును పంపిన
ఆ యెహోవాను స్తుతియించెదము
…హల్లెలూయ…

స్తుతిగీతము -2

నాలో ఉన్న ఆనందం
నాకున్న సంతోషం
నా జీవన ఆధారం నీవే కదా
||నాలో||

నా ఆశ్రయము నా దుర్గము
నా కోట నీవే యేసు
నా బలము… నా యేసుడే

గాఢాంధకారములో నే సంచరించిననూ
ఏ అపాయమునకు నే భయపడను
నీ దుడ్డు కర్రయు నీ దండమును
నన్నాదరించును నా యేసయ్యా
||నా ఆశ్రయము||

నే బ్రతుకు దినములలో కృపయు క్షేమమును
నన్నాదరించును నా వెంట వచ్చుఁను
చిరకాలము నేను నీ మందిరావరణములో
నివాసము చేసెదను నా యేసయ్యా (2)
||నా ఆశ్రయము||

స్తుతిగీతము -3

నే సాగెద యేసునితో
నా జీవిత కాలమంతా

యేసుతో గడిపెద యేసుతో నడిచెద
పరమును చేరగ నే వెళ్లెద
హనోకు వలె సాగెదా
||నే సాగెద||

వెనుక శత్రువులు వెంటాడిననూ
ముందు సముద్రము ఎదురొచ్చినా
మోషె వలె సాగెదా
||నే సాగెద||

లోకపు శ్రమలు నన్నెదిరించినా
కఠినులు రాళ్ళతో హింసించినా
స్తెఫను వలె సాగెదా
||నే సాగెద||

బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే
క్రీస్తుకై హత సాక్షిగా మారిన
పౌలు వలె సాగెదా
||నే సాగెద||

తల్లి మరచిన తండ్రి విడచిన
బంధువులే నన్ను వెలివేసినా
బలవంతుని వలె సాగెదా
||నే సాగెద||

ఆరాధన వర్తమానము

ఈరోజున దేవునిని ఆరాధించడానికి ప్రభువు సన్నిధికి వచ్చాము. అనుదినము మన భారము వహించువాడు, మనకు రక్షణకర్త అయిన వాడు అయిన దేవుడు మహిమ పొందదగినవాడు.

ఈరోజు దేవుని గూర్చిన సత్యము తెలుసుకొని దేవునిని ఆరాధిద్దాము.

యెహోవా దయాదాక్షిణ్యములుగలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు. -కీర్తనలు 145:8

మన దేవుడు దయాదాక్షిణ్యములుగలవాడు. నిజముగా మన జీవితములు ఆయన దయను బట్టి మాత్రమే కొనసాగించబడుతున్నాయి. మనము కలిగి ఉన్న పరిస్థితిలు బేరీజు వేసుకుని మన జీవితములను కొనసాగించడము కాదు గానీ, మన దేవుని దయ, కనికరములను బట్టి మన జీవితములను కొనసాగించాలి.

ఆయన దయను, కృపను మన పితరులు అనుభవించారు. అందుకే నీ కృప నిత్యముండును అని చెప్పగలిగారు. దేవుని బిడ్డలుగా మనము కూడా అదే అనుభవము కలిగి ఉండవలసినవారము. మనము మన తండ్రి అయిన దేవుని యొక్క లక్షణములను ప్రచురము చేయవలసిన వారము.

అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.౹ -1 పేతురు 2:9

మనము దేవుని గుణములను ఎలా ప్రచురము చేయగలము? కరపత్రికల ద్వారా యేసయ్య మంచివాడు అని ప్రచురము చేయాలా? ఇంకవేరేవిధముగా చెయ్యాలా? మన దేవుడు దయ కలిగినవాడు అంటే నీ జీవితములో ఎలా దయ చూపించాడో, ఆయన దీర్ఘశాంతము కలవాడు అనే లక్షణము నీ జీవితములో ఎలా నెరవేరింది అనే దానికి సాక్ష్యముగా జీవించుట ద్వారా మనము ఆయన గుణలక్షణములను ప్రచురము చేయగలుగుతాము.

యెహోవా దయాదాక్షిణ్యములుగలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు. యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి. యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. -కీర్తనలు 145:8-10

మన దేవుడు అందరికీ మేలు చేసేవాడు. అయితే ఆయన భక్తులు మాత్రమే ఆయనను స్తుతించగలుగుతారు. నీవు ఈ సత్యము గ్రహించావా? అయితే ఖచ్చితముగా నీవు స్తుతిస్తావు. “వెనుక శత్రువులు వెంటాడిననూ ముందు సముద్రము ఎదురొచ్చినా మోషె వలె సాగెదా…” అని పాట మాత్రమే కాదు గానీ, మన జీవితములో నిజముగా యదార్థముగా నిలబడితే అప్పుడు మన దేవుని గుణలక్షణములను ప్రకటించే సాక్ష్యముగా మన జీవితము ఉంటుంది.

బేతెస్ద కోనేరు దగ్గర ఆ వ్యాధి గ్రస్తుడు 38 సంవత్సరములనుండి అక్కడ పడిఉండుట చూసి అతనికి ఏ సహాయము లేదు అని ఎరిగినవాడుగా మన దేవుడు ఉన్నాడు. మన దేవుడూ కనికరము కలవాడు కాబట్టి, ఖచ్చితముగా ఆ స్థితిలో ఉన్న వాడిని చూసి విడిచిపెట్టేవాడు కాదు.

“నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి” మనము కూడా ఆయన కనికరము ఎలా విడుదల అవుతుంది, ఎలా మనము ఆయన కనికరమును పొందుకుంటున్నావు? అనే సంగతి నీవు ఎరిగి ఉంటే, ఆయనను స్తుతించకుండా నీవు మౌనముగా ఉండలేవు.

మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. -అపొస్తలుల కార్యములు 17:28

మనమాయనయందు బ్రదుకుచున్నాము అంటే, ఆయన కనికరమును బట్టి మనము బ్రతుకుచున్నాము. మన జీవితమును కొనసాగించడానికి బలము లేదు, జ్ఞానము లేదు మరియు సామర్థ్యము లేదు అయితే ఆయన కనికరమును బట్టి మనము బ్రతుకుతున్నాము.

కనికరము అంటే? మనము రోడ్డు మీద వెళుతున్నప్పుడు భిక్షాటన చేసేవారిని చూస్తే, వంద మంది అతడిని చూసినప్పటికీ, ఎవరికి కనికరము పుట్టిందో వాడు మాత్రము ఆగి, తాను కలిగి ఉన్నదానిలో సహాయము చేస్తాడు.

మన దేవుడూ కూడా కనికరము కలవాడు గనుక మన స్థితిని చూసి, దాటి వెళ్ళిపోడు. ఈ లోకములో తాను కలిగి ఉన్నదానిలోనుండి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయితే మన దేవుడూ ఎటువంటివాడు? చిల్లర సహాయము చేసేవాడు కాదు మన దేవుడు, సంపూర్ణమైన సహాయము చేసేవాడు.

ప్రభువు స్తుతినొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడై యున్నాడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. -కీర్తనలు 68:19-20

మన దీన స్థితిని చూసి, ఆయన కనికరము కలవాడు గనుక మన భారమును భరించి మన కొరకు ఏమి చేస్తే మన దీన స్థితి మారుతుందో, దానిని జరిగించే మార్గములను తెరిచి, సంపూర్ణముగా నీ స్థితి మారునట్టు కార్యము జరిగించేవాడు. నీవు ఊహించదానికంటే మించిన కార్యము జరిగించేవాడుగా నీ దేవుడు ఉన్నాడు.

మన దేవుడు మేలు చేసేవాడు, కనికరము కలవాడు. ఆ కనికరము మన దీన స్థితిని మార్చగలిగిన శక్తి కలది. ఈరోజున నీవు ఆయన నీ స్థితి మార్చగలవాడు అని ఎరిగితే, నీవు ఆయనను ఖచ్చితముగా స్తుతించేవాడవుగా ఉంటావు. మనము ఆయనయందే బ్రతుకుతున్నాము, చలించుచున్నాము మరియు ఆయనయందే ఉనికి కలిగి ఉన్నాము.

మన జీవితము యొక్క సామర్థ్యము ఎంతైనా సరే మన ఉనికికి కారణము మాత్రము ఆయన. ఆయన చేసిన మేలుల చేత మన జీవితములు తృప్తిపరచబడుతున్నాయి కాబట్టి ఆయనను మనము స్తుతించాలి, ఆరాధించాలి.

తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.౹ -2 పేతురు 1:2

మన దేవుడు మన జీవమునకు మాత్రమే కాక, భక్తికి అనగా నీవు భక్తుడుగా ఉండుటను బట్టి నీకు కావలసిన మేలులను దాచిఉంచ్ఛాడు. నా దేవుడు నాకు మేలు చేస్తాడు అని నమ్మిన దానిని బట్టి, తన భక్తులకు మేలు చేసేవాడుగా నీ దేవుడు ఉన్నాడు.

మన దేవుడు తన వాక్కును పంపి వారు పడినగుంటలోనుండి లేవనెత్తాడు. ఎవరైతే తన భక్తులో వారు పడిన గుంటలలోనుండి లేవనెత్తెవాడు మన దేవుడు. తన భక్తులకొరకు మన దేవుడు ఏమి చేయగలడో, ఏమి చేస్తాడో ఎరిగినవారమైతే ఆయన భక్తులుగా ఎంతో సంతోషముతో ఆరాధించేవారము గా ఉంటాము.

మన ముందు ఏమున్నా, వెనుక ఏమున్నా, మన అడుగు పడేసరరికే అవి తొలగించబడవలసినదే! మన జీవితమును ఏదో ఒక సమస్యలో చిక్కుపడేసి ఉంచడానికి ఆ సమస్యకు హక్కు లేదు.

మన జీవితము ఆయన యందు, ఆయనను బట్టి కొనసాగించబడేది గనుక మన జీవితములు ఎంతో ధన్యములైనవి.

ఆరాధన గీతము

నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా
||నా ప్రాణమా||

ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు
||నా ప్రాణమా||

మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును
||నా ప్రాణమా||

వారము కొరకైన వాక్యము

దేవునిని స్తుతించి ఆరాధించినవారు ఏ గుంట మీ జీవితములో ఉందో, ఆ గుంట పూడ్చబడటము కూడా గమనించాలి. మన దేవుని మాటలు అబద్ధము కాదు గానీ, సత్యములై ఉన్నవి. గడుస్తున్న మన దినములలో మన దేవుడు ఏమి చేస్తున్నాడు? ఎలా నీ జీవితమును నడిపిస్తున్నాడు? గుంటలను, లోయలను ఎలా పూడుస్తున్నాడు? ఏ ఏ పరిస్థితులలో ఎలా స్పందిస్తున్నాడో గమనించే ఆసక్తి మనము కలిగి ఉండాలి.

మన జీవితములో దేవుని శక్తిని ఆధారము చేసుకొనే ప్రతీదీ జరుగుతుంది గనుక, ఆయన శక్తి ఎలా ప్రత్యక్షపరచబడుతుంది అనేది నీవు గమనించాలి. నీ దుఃఖము, వేదన బాధ అనే లోయలను ఎలా పూడుస్తున్నాడు అనేది నీవు తెలుసుకోవాలి.

మనము ఎంతవరకు ఆయనలో ఎదిగాము అనే పరీక్ష ఖచ్చితముగా దేవుడు చేస్తాడు. రొట్టెల విషయములో ఫిలిప్పును పరీక్షించాడు.

కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తనయొద్దకు వచ్చుట చూచి–వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలుకొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని౹ యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.౹ -యోహాను 6:5-6

అక్కడ పన్నెండుమంది శిష్యులు ఉంటే ఎందుకు ఫిలిప్పునే అడిగాడు?

మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని–నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.౹ ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు.౹ ఫిలిప్పు నతనయేలును కనుగొని – ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.౹ అందుకు నతనయేలు – నజరేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా–వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను.౹ యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి–ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను.౹ –నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు–ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను.౹ -యోహాను 1:43-48

ఈ భాగములో గమనిస్తే, ఫిలిప్పుకు కళ్ళ ముందు ఒక విషయము జరుగుతుంది. యేసయ్య ఏమై ఉన్నాడో అనే సంగతి నతనయేలుతో మాటలాడుతున్నప్పుడు ఫిలిప్పు కళ్ళముందు కనపరచబడుతుంది. అయితే ఫిలిప్పు తన గురించి ఏమి గ్రహించాడో, తెలుసుకోవడానికి రొట్టెల సందర్భములో అడిగాడు. తన కళ్ళముందు జరిగిన అద్భుతములను బట్టి ఏమైనా తెలుసుకున్నాడా లేదా? అనేది తెలుసుకోవడానికి ప్రభువు పరీక్షపెట్టేవాడుగా ఉన్నాడు.

పిల్లవాడిగా ఉన్నప్పుడు అక్షరములు నేర్పిస్తాము. అయితే పెద్దవాడుగా అయ్యాక పెద్ద పెద్ద వ్యాసములను అర్థము చేసుకోనే రీతిలో ఎదగాలి. అలాగే మన జీవితములలో అనేకమైనవి ఆలస్యమవుతాయి అయితే ఆ ఆలస్యములో ఏమైనా ఆశీర్వాదము దాగిఉందా అని ఆలోచించాలి.

ఈరోజు దేవుని ప్రేమిస్తున్నావా అనే ప్రశ్న ద్వారా ప్రభువు మనకు కొన్ని విషయాలను నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు.

వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి–యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు–అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసు–నా గొఱ్ఱెపిల్లలను మేపుమని అతనితో చెప్పెను.౹ -యోహాను 21:15

వారు భోజనముచేసిన తరువాత వారు తృప్తి పరచబడిన స్థితిలో నీవు నన్ను ప్రేమించుచున్నావా? అని అడిగాడు. నేను ప్రేమిస్తున్నాను అని పేతురు చెప్పగానే, నా గొర్రెపిల్లలను మేపుము అని చెప్పాడు. అంటే మనము ఎలా తీసుకోవాలి? అంటే, దేవుని ప్రేమించినవారికి ఒక బాధ్యత అప్పగించబడింది అని అర్థము చేసుకోవచ్చు.

గొర్రెపిల్లలు అనగా ఒక మందగా ఉంది. మంద అనగా సంఘముగా చూడవచ్చు. గొర్రెపిల్లలను మేపుము అంటే వాటికి తృప్తికలుగునట్లు మేత పెట్టుట. పేతురు విషయములో చూస్తే,

యేసు– పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని వారిని అడుగగా,౹ లేదని వారాయనతో చెప్పిరి . అప్పుడాయన–దోనె కుడిప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి.౹ -యోహాను 21:5-6

ఇక్కడ పేతురు ఎలా భోజనము చేసాడు అని చూస్తే ఒక సూపర్నేచురల్ అనుభవము ద్వారా భోజనము చేసాడు. మన జీవితములో కూడా అనేకమైన సందర్భములలో మన దేవుడు మనలను పోషించాడు. అయితే ఇప్పుడు ఎలా అయితే మనము పోషించబడ్డామో, అదేవిధముగా మనము పోషించేవారిగా ఉండాలి. అంటే, ఆశీర్వాదము పొందిన నీవు మరొకరికి ఆశీర్వాదముగా మార్చబడాలి. అనగా సంఘములో మరొకరికి నీవు ఆశీర్వాదకరముగా ఉండాలి.

గొర్రెపిల్లలు అనగా చిన్నవి. అనగా సంఘములోని చిన్న చిన్న విషయములలో మనము బాధ్యత తీసుకోవడముతో ప్రారంభమవ్వాలి అని అర్థము. మనము ప్రేమ కలిగినవారమైతే చిన్న చిన్న విషయములలో బాధ్యత మనము తీసుకోవాలి.

బాధ్యత అనే మాటను చూస్తే, కాపరి గొర్రెలకు కావలసిన మేత ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి అనే బాధ్యత తీసుకుంటాడు. చిన్న చిన్న విషయములలో బాధ్యత తీసుకుంటే ఏమి జరుగుతుంది? ఆ చిన్న చిన్న విషయములలో అవసరమైనది ఎక్కడ ఉంది? ఎలా దొరుకుతుంది? ఎలా తీర్చగలము? అనే తపన ఉంటుంది.

అంతే కాక, నీవు సూపర్నేచురల్ గా ఆశీర్వదించబడిన తరువాత నీవు దేవుడిచ్చిన బాధ్యత తీసుకున్నపుడు నీ వద్ద లేకపోయినా సరే విస్తారముగా సూపర్ నేచురల్ గా సమకూర్చి నిన్ను బలపరచేవాడుగా ఉన్నాడు.

తలాంతులు ఇచ్చి వెళ్ళాక, కొద్దిలో నమ్మకములో ఉన్న దాసులకు అనేకమైన వాటిపై అధికారము ఇచ్చాడు అనే సత్యము వాక్యములో చూసాము కదా!

మనము బాధ్యత తీసుకుంటే సొల్యూషన్ ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. విత్తువానికి విత్తనము ఆయనే దయచేసేవాడు గనుక, బాధ్యత గుర్తెరిగి నీవు సిద్ధపడినప్పుడు ప్రభువు దాని కొరకు మార్గములు తెరిచేవాడుగా ఉన్నాడు.

మరల ఆయన–యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు–అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన–నా గొఱ్ఱెలను కాయుమని చెప్పెను.౹ -యోహాను 21:16

5 తలాంతులను నమ్మకముగా ఉపయోగించి రెట్టింపు చేసినవాడికి మరింత బాధ్యత ఇవ్వబడుతుంది. అనగా చిన్న చిన్న విషయములలో సంఘములో బాధ్యత తీసుకుంటే తరువాత పెద్ద విషయములలో బాధ్యత ప్రభువు ఇస్తాడు.

మూడవసారి ఆయన–యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. – నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి–ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు – నా గొఱ్ఱెలను మేపుము. -యోహాను 21:17, 18

మొదట గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాడు, తరువాత గొర్రెలను కాయుము అని చెప్పుచున్నాడు, తరువాత గొర్రెలను మేపుము అని చెప్పుచున్నాడు. చిన్న చిన్న అవసరములలో మొదట నమ్మకముగా బాధ్యత తీసుకున్నప్పుడు, పెద్ద అవసరములలో అవసరములు తీర్చగలుగునట్లు నీ సామర్థ్యము పెంచేవాడుగా దేవుడు ఉన్నాడు అని గమనించాలి.

పేతురువాళ్ళకు విస్తారమైన చేపలు పట్టులాగున ఎక్కడవేయాలో చెప్పిందే దేవుడు. బాధ్యత తీసుకుంటే దానిని తీర్చడానికి కావలసిన మార్గము తెరిచేవాడే ఆయన!

మనము మొదట దేవుడిస్తే తరువాత చేయడానికి ఆలోచిస్తాము. అయితే, మొదట నీవు నిలబడితే నేను ఇస్తాను అని ప్రభువు చెప్పుచున్నాడు.

మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు. -హెబ్రీయులకు 6:10

మీరు తీసుకున్న బాధ్యతను బట్టి మీరు సంఘములో చిన్న చిన్న విషయములలో చూపిన నమ్మకత్వమును, అలాగే ఇంకనూ అనేకమైన విషయములలో మీరు దేవుని ప్రేమించుచున్నదానిని బట్టి మీరు బాధ్యతగా తీసుకున్న విషయములను మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు.

అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చి అయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించితివే; అవియుగాక మరి యయిదు తలాంతులు సంపా దించితినని చెప్పెను. అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను. -మత్తయి 25:20-21

దేవుడు అన్యాయస్తుడు కాదు కనుక “నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని” చెప్పేవాడుగా ఉన్నాడు. మన యజమాని ఈ సృష్టి అంతటినీ సృష్టించాడు అది మంచిది అని చూసాడు. ఆ మంచిదైన సృష్టిలో, ఆ సృష్టియొక్క ఉద్దేశ్యములో నీకు పాలుపంపులు దేవుడు ఇస్తాడు. అనగా దేవుడు ఇది మంచిది అని ఏది అనుకుంటే ఆ ప్రతి దానిలో నీకు పాలు ఇస్తాను అని చెప్పుచున్నాడు.

నిజముగా దేవునిని ప్రేమిస్తే ఈరోజు ఆ బాధ్యత తీసుకుందాము. నీ దగ్గర ఉన్న వనరులను బట్టి కాదు గానీ ఆ వనరులను సూపర్ నేచురల్ గా సృష్టించే శక్తి కలిగిన, నీవు ప్రేమించే దేవునిని బట్టి నీవు బాధ్యత తీసుకో!