27-Nov-2022 – ఆదివారము ఆరాధన – రాజమండ్రి

నిను పోలిన వారెవరూ

నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2)
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2)

ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధన
అడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన (2)

కృంగియున్న నన్ను చూచి
కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి
కరుణతో నడిపితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్||

మరణపు మార్గమందు
నడిచిన వేళయందు
వైద్యునిగా వచ్చి నాకు
మరో జన్మనిచ్చితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్||

నజరేయుడా నా యేసయ్య

నజరేయుడా నా యేసయ్య
ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద          ||నజరేయుడా||

ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2)       ||నజరేయుడా||

అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2)        ||నజరేయుడా||

సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2)        ||నజరేయుడా||

నీవే నా సంతోషగానము
రక్షణశృంగము

నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము (2)
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2)        ||నీవే నా||

ఓ లార్డ్! యు బి ద సేవియర్
షో మి సం మెర్సీ
బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్
సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్
ఐ విల్ సరెండర్
యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్

త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2)        ||నీవే నా||

వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2)
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2)        ||నీవే నా||

నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2)
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2)        ||నీవే నా||

ఆరాధన వర్తమానం

ఈ దినము ప్రభువు మనకొరకు సిద్ధపరచిన దినము అయి ఉన్నది. మనలను ఆ ప్రభువు ప్రేమించాడు కాబట్టి మనకొరకు ఈ దినము తన వాక్కును విడుదల చేస్తాడు. ఈ దినము శుద్ధీకరణ దినము అని నిర్ణయించబడిన దినము అని మనము ఇంతకు ముందు నేర్చుకున్నాము. అయితే మనము దేవుని ఆరాధించడానికి సిద్ధపడదాము,

నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి కీర్తన 33:1-3.

మన దేవుడు ఏమై ఉన్నాడో, ఆయనను ఎందుకు స్తుతించాలో ఎందుకు ఆరాధించాలో అని తెలిసినపుడు మాత్రమే మనము ఆయనను బట్టి ఆనంద గానము చేయగలుగుతాము.

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుజ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతి శయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యిర్మీయా 9:23

భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్నది యెహోవా అనే సత్యమును గ్రహించినట్టయితే నీ జీవితములో నీతి న్యాయములు జరిగించుచున్నది నీ దేవుడైన యెహోవా అని అర్థమూవుతుంది. ఈ విషయము మనము గ్రహించకపోతే మనము దేవుని కృపను అర్థము చేసుకోలేము. మన జీవితములు పువ్వువలే వాడిపోయే జీవితములు అయినప్పటికి నిత్యము కొనసాగించబడుతున్నయి అంటే దానికి దేవుడే కారణము. యేసును అంగీకరించిన ప్రతి వారిలో జీవజల నదులు పారుతాయి అని వాక్యము సెలవిస్తుంది.

కొంతమంది జీవితాలను చూస్తే, వారి జీవితంలో న్యాయము జరిగించబడవలిసినది ఉంది. అయితే కొన్నిసార్లు ఆ పరిస్థితి కనబడనప్పటికీ, మనము నిశ్చయముగా మన దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండగలము. మనం వ్యక్తిగతము గా చూస్తే భూమిని సృష్టించిన దేవుడే నిన్ను నన్ను సృష్టించాడు. భూమిని రక్షిస్తున్నా దేవుడే మనలను రక్షిస్తున్నాడు. మనము యెహోవాను బట్టే ఆనందగానములు చేయ్యాలి. ఎందుకంటే ఆయనే మనకు న్యాయము జరిగించువాడు.

కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురుమనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము. వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. కీర్తన 20:7

ఈ మాటలను గ్రహిస్తే దేవుని స్తుతించగలుగుతావు. పడిపోయి నీవున్న పరిస్థితులలో నీవు ఆనందగానములు దేవునికి చెల్లించగలిగినప్పుడు, నీవు ఖచ్చితముగా పడిపోయిన స్థితిలో లేచి చక్కగా నిలబడతావు. అనగా కృంగినస్థితిలో మన జీవితాలు ఉండవు కానీ సంతోషముతో కొనసాగించబడతాయి. అందుకే కీర్తనాకారుడు చెప్తున్నాడు, “నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము” అని. దేవుని అంగీకరించినవరు, దేవుడు నా పక్షమున నిలబడతాడు అని విశ్వాసముతో నిలబడేవారి జీవితములో అన్యాయము జరగనే జరగదు. ఎందుకంటే మన దేవుడు నీతి న్యాయములు జరిగించువాడు.

యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది – కీర్తన 33:4.

ఆయన ఏమి చేస్తాడు? “న్యాయము” చేస్తాడు. ప్రవచనాత్మకముగా దేవుడు సెలవిస్తున్న మాట, “నీకు న్యాయము తీర్చేవాడిగా నేను ఉన్నాను”. అందుకే మనము మనసారా దేవుని స్తుతిద్దాము. మనము స్తుతించుచుండగానే ఆయన కార్యము జరిగించబడుతుంది. ఒకవేళ నీవు ఉండవలసిన స్థితిలో ఉండక నీ జీవితము థగ్గించబడిన స్థితిలో ఉందేమో, అయితే నీ దేవుడు కలుగుజేసుకొనేవాడుగా ఉన్నాడు. నీ జీవితంలో నీతి న్యాయములు జరిగించేవాడుగా నీ దేవుడు ఉన్నాడు.

చాల సందర్భాలలో మనము ఎదుర్కోనే పరిస్థితులను బట్టి, ఇతరులతో కలబడానికి ఇష్టపడము. ఒంటరిగా ఉండటానికి చూస్తాము అయితే దేవుని చిత్తము అది కాదు, సంతోషముతో ఉత్సహించే గుంపులో నిన్ను ఉంచాలి అనేది ఆయన ఉద్దేశ్యము. నీ పరిస్థితిలో నీవు ధైర్యము తెచ్చుకుని, ప్రభువు నా జీవితములో న్యాయము తీరుస్తాడు అని నమ్మి సంతోషముతో ఆరాధించినట్టయితే ఖచ్చితముగా నీవు నిలబడతావు. ఎక్కడ అంటే జనముల ముందు. ఇంతకు ముందు నీవు జనముల మధ్యకు రావడానికి సిగ్గుపడ్డావేమో, అయితే ప్రభువు నిన్ను ప్రభువు కు సాక్ష్యముగా జనముల మధ్య నిలబడతాను అని నీవే సిద్ధపడు దేవునిని ఆయన మాటను నమ్మి స్తుతించు ఆరాధించు.

సంవత్సరము ముగింపునకు వచ్చింది. అయితే మనకు ఈ సంవత్సరమునకు ఇచ్చిన వాగ్దానములు నెరవేరవలసినదే. అనగా నీ అద్భుతము యొక్క సమయము అతి దగ్గరలో ఉన్నది. కాబట్టి సంతోషముతో దేవుని స్తుతిద్దాము.

ఏ ఏ విషయాలతో నీవు కృంగిపోయావో, ఏ ఏ విషయాలలో నలిగిపొయావో వాటన్నిటిలో నిన్ను సంతోషముతోనింపి నిలబెట్టేవాడుగా నీదేవుడు ఉన్నాడు.

ఆరాధన గీతము

అద్భుతముల కొరకు ఆశించుచున్నాము
నీకసాధ్యమేదియు లేనె లేదు యేసయ్యా ||2||
యెహోవా యీరే, యెహోవా షాలోం
యెహోవా నిస్సీ, యెహోవా రాఫా ||2||

వాగ్దానములు చేయువాడా – నమ్మదగిన దేవా
వాగ్దానములు నెరవేర్చుటకు – శక్తిగల దేవుడవు ||2||
మాటతప్పని వాడవు – మార్పులేని వాడవు
నిన్న నేడు నిరతము – ఉన్నవాడవు
మహత్తైన కార్యములు, మహాశ్చర్య కార్యములు ||2||
అద్భుతములు చేయుము || యెహోవా యీరే ||

చీకటిని ఉదయముగా మార్చు – నీతి సూర్యుడవు
లేనివాటిని ఉన్నట్టుగానె – పిలచు దేవుడవు ||2||
మృతులను సజీవులుగా, చేయు దేవుడవు
సమాధినుండి లాజరును, లేపిన నాధుడవు
మహత్తైన కార్యములు, మహాశ్చర్య కార్యములు ||2||
అద్భుతములు చేయుము || యెహోవా యీరే ||

సమస్తము సాధ్యము చేయువాడా సజీవుడైనవాడా
నీళ్ళను ద్రాక్షారసముగా మార్చి అద్భుతముచేసితివి
అరణ్యయాత్రలో మన్నాతో ఆకలి తీర్చితివి
బండనుండి నీటి ఊటతో దాహము తీర్చితివి
మహత్తైన కార్యములు మహాశ్చర్యకార్యములు ||2||
అద్భుతములు చేయుము || యెహోవా యీరే ||

Main Message | మెయిన్ మెసేజ్

చాల సందర్భాలలో మన నోటి మాటలచేత మన ఆశీర్వాదాలను పోగొట్టుకునే వారిగా ఉంటాము. ఇదే మనము తెలుసుకోవలసిన విషయము. చాలా మంది వట్టిగనే వారి జీవితాలను పాడుచేసుకుంటున్నారు.

మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము – సామెతలు 4:24

ఇది ఎవరు చెయ్యాలి అంటే మనమే. మూర్కపు మాటలు రాకుండా మనమే జాగ్రత్త పడాలి.

నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును. 21:23

అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాగ్దానమునకు వ్యతిరేకముగా మీరు మాట్లాడకండి. మనము ఆయనను మన నోటి మాట ద్వారానే స్వీకరించినాము కదా! యేసు ప్రభువు అని, మృతులలోనుండి లేచెనని మన నోటితో ఒప్పుకొని రక్షణ పొందాము కదా! మరి అదే నోటితో ప్రభువు మాటను తృణీకరిచేవారిగా ఉంటున్నాము. మనకున్న పరిస్థితులలో, “ఎందుకు ఈ పాడు జీవితము” అని మనకు మనమే శపించుకుంటాము. అయితే మనకు ఇవ్వబడినది మహిమ తో కూడిన జీవితము. వాక్య జ్ఞానము లేక అపవాది ఉచ్చులో పడి మోసపోతున్నాము. ఈ రోజు కొన్ని సత్యాలు చూసి నేర్చుకుందాము.

మన జీవితానికి ప్రామాణికము వాక్యమే. ఏ సేవకుడూ కూడా ప్రామాణికము కాదు. అంత్య దినములలో అబద్ధబోధలు ఎక్కువ అవుతాయి. అందుకు పౌలు నేను ప్రకటించిన సువార్తకు వ్యతిరేకముగా నేనే చెప్పినా నమ్మకండి అని చెప్తున్నాడు. ఏ సేవకులకైనా మొత్తమంతా తెలుసా? దేవుని మర్మములను ఎరిగినవాడు, సర్వము ఎరిగినవాడు పరిశుద్ధాత్ముడే! ఎవరైన ఇద్దరు దేవుని విషయాలలో డిబేట్లు పెట్టుకుంటే అది వెర్రితనమే. అంత్య దినములలో ఈ అబద్ధపు బోధలు ఎక్కువ అవుతాయి అని వాక్యమే చెప్తుంది. అందుకే చాల జాగ్రత్తగా ఉండాలి. ఒక సింపుల్ లాజిక్ ఎమిటి అంటే, నీవు చేసేపని దేవునికి మహిమ కలిగిస్తుందా లేదా అని పరీక్షించండి. అది మహిమకరమైనదైతే నీవు సంపూర్ణముగా అర్థముకాకపోయినా కూడా ఆ ప్రకారమే చెయ్యి.

అయితే ఈరోజు మన నోటిమాటలు ఎలా దేవుని వాగ్దానములు పోగొట్టుకుంటున్నాము అని నేర్చుకుందాము. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఫరో దగ్గర శ్రమ పడుతున్నప్పుడు దేవుడే వారి మూలుగులు విని వారిని విడిపించాడు.

ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము. నిర్గమ 3:17

ఇది దేవుని వాగ్దానము. ఈ వాగ్దానము నెరవేర్పు కొరకై వారిని ఐగుప్తునుండి విడిపించి

యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనానుదేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను. మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు సంఖ్యా 13:1-3

మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపి నప్పుడు వారితో ఇట్లనెనుమీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో. దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారము లలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు న్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము సంఖ్యా 13:17-20.

వారు అతనికి తెలియపరచినదేమనగానీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితివిు; అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే; దాని పండ్లు ఇవి- సంఖ్యా 13:27

మొట్టమొదట దేవుడు ఇచ్చిన మాట “పాలు తేనెలు ప్రవహించే ప్రదేశము”. వీరు పరిశీలించి తెలుసుకున్నది కూడా అదే విషయము. అయితే వారు ఏమి గమనించారు?

అయితే ఆ దేశ ములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితివిు. అమాలేకీయులు దక్షిణదేశ ములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంత ములలోను నివసించుచున్నారని చెప్పిరి. సంఖ్యా 13:28 – 29.

మరి దేవుడు ఏమి చెప్పారు? మీరు పాలు తేనెలు ప్రవహించే దేశములో మీరు ప్రవేశించుదురు అని చెప్పారు. అలాగే అక్కడ ఉన్న అమోరీయులు, హిత్తీయులు యెబుసీయులు అనే ప్రజలనుండి ఆ ప్రదేశమును మీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ఈ వాక్యములు మనము గమనిస్తే దేవుడు ఏమైతే చెప్పాడో అది సత్యము.

అయితే పదిమంది దృష్టి అక్కడ ఉన్నవారి బలముమీద ఉన్నది వారిని బట్టి భయపడుతున్నారు. వారు ఇలా చెప్తున్నారు.

అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీ యులను చూచితివిు; మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి – సంఖ్యా 13:33.

అయితే ఇద్దరు మాత్రము ఇలా చెప్తున్నారు

కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను – సంఖ్యా 13: 30.

దానిని స్వాధీనపరుచుకుందుము అని చెప్తున్నారు. అయితే ఆ పన్నెండుమంది కూడా అదే విషయాలను చూసారు. అయితే పది మంది దృష్టిలో వారు మిడతలవలే ఉన్నారు కనుక గెలవలేము అని ఆలోచించారు. అయితే ఇద్దరు మాత్రము మన శక్తి చాలు అని విజయము కొరకైన ప్రోత్సాహకరమైన మాటలు చెప్పుచున్నారు.

దేవుడే అది పాలు తేనెలు ప్రవహించే దేశము అని ముందే చెప్పాడు. అయినా కూడా వారిని వెళ్ళి చూసి రమ్మని చెప్పారు. అయితే వారు వెళ్ళి దేవుని వాగ్దానము ను నమ్మని వారిగా అయిపోయారు.

మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు – సంఖ్యా 14:34.

వారు వెళ్ళిన దేశములో బలమైన వారు ఉన్నారు అనేది సత్యమే. అయితే ఇశ్రాయేలీయుల విడుదల బలమైన ఫరో చేతిలోనుండి విడిపించబడే వచారు అని మర్చిపోయారు. అందుకే నలభై రోజులలో ముగించవలసిన ప్రయాణము నలభై సంవత్సరాలు పట్టింది. దేవుని ఉద్దేశ్యాన్ని గ్రహించకపోతే నీ పరిస్థితికూడా ఈ పదిమంది లాగానే ఉంటుంది. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. మీ జ్ఞానాన్ని పక్కన పెట్టి జరగలేదు జరగలేదు ఇంక జరగదు అని నెగటివ్ మాటలు మాట్లాడక దేవుని వాగ్దానము నమ్మి ముందుకు వెళదాము. అలాకాకపోతే ఆలస్యము అనేది చూసేవారిగా అవుతాము. దీనికి కారణము, నీ నోటి మాటలే. దేవుని ఉద్దేశ్యము గ్రహించకపోతే మన నోటివెంట ఇలాంటిమాటలే వస్తాయి. అయితే యెహోషువ కాలేబుల వలే దేవుని శక్తిని ఎరిగినవారుగా పాజిటివ్ గా మన నోటివెంట మాటలు రావాలి. నీ జీవితములో ఆలస్యము కాకుండా ఉండాలి ఉంటే, దేవుని శక్తిమీద ఆధారపడి మన మాటలు ఉండాలి. ఎట్టి పరిస్థితిలోను మీ మనుష్య జ్ఞానమును పనిచేయనివ్వవద్దు.

ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి – సంఖ్యా 14:37.

మన పితరులు చాలమంది అనేకులు అలాగే చనిపోయినవారుగా ఉన్నారు. దేవుని వాగ్దానమునకు వ్యతిరేకముగా నోటిమాటలు పలికి వాగ్దానము అనుభవించలేకపోయారు.అయితే మనము అలా ఉండకూడదు. ఆ చనిపోయినవారు అందరూ దేవుని అంగీకరించినవారే. అయినప్పటికీ వారు దేవుని వాగ్దానమును నమ్మకపోవటము మాత్రమే కాక దానికి వ్యతిరేకముగా మాట్లాడినవారుగా ఉన్నారు. దానిని బట్టి తెగులు అనగా వ్యాధుల చేత శిక్షించబడ్డారు.

అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువులయెదుట హతము చేయబడుదురు; మీరు సాగిపోకుడి. ఏలయనగా అమా లేకీయులు కనానీయులు మీకంటె ముందుగా అక్కడికి చేరియున్నారు; మీరు ఖడ్గముచేత కూలుదురు; మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండకొన కెక్కిపోయిరి; అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేయైనను పాళె ములోనుండి బయలు వెళ్లలేదు – సంఖ్యా 14:42-44

ఇక్కడ వారి నోటివెంట దేవుని వాగ్దానమునకు వ్యతిరేకముగా ఏమైతే పలికారో అదే జరిగింది. ఎందుకంటే దేవుడు వారు పలికిన దానిని బట్టి వారితో లేడు గాబట్టి. అయితే మనము ఈ సత్యము గ్రహించినవారమై మన నోటి మాటలు జాగ్రత్తగా రానిద్దాము.

అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రదికిరి – సంఖ్యా 14:38

వేగు చూచుటకు వెళ్ళినవారిలో ఇద్దరు మాత్రమే దేవుని వాగ్దానమును గ్రహించి దేవుని చిత్తానుసారమైన మాటలు విశ్వాససహితమైన మాటలు మాట్లాడిన దానిని బట్టి, వారు మాత్రమే బ్రతికినవారుగా ఉన్నారు. “నా కొరకు ఏమైనా చేస్తాడు, నా దేవుడు నన్ను సిగ్గు పడనివ్వడు” అనే మాటలు మీ జీవితములో ప్రతి సమయములో పలకడము నేర్చుకో. నీ మాటగా స్వీకరిస్తున్నాను అని పలికిన మాట చాల శక్తిగలది అని గ్రహించు.