27-10-2024 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

మరొక సమయం, మరొక అవకాశం దేవాది దేవుడు మనకు ఈ దినము ఇచ్చాడు. దేవుడు మన దేవుడు మన జీవితములలో స్తుతింపదగినవాడు. ఈ సత్యము అనుభవపూర్వకముగా ఎరిగినవారు ఖచ్చితముగా ఈ మాట ఒప్పుకుంటారు.

దేవుని విషయములలో మనము మౌనముగా ఉండకూడదు. ప్రత్యేకించి దేవుని స్తుతించుటలో అస్సలు మౌనముగా ఉండకూడదు. దేవుని స్తుతించే సమయములో మనము మౌనముగా ఉండకూడదు. ఆరాధించడానికి వచ్చిన మన అందరము కంటికి కనబడే వ్యక్తిని కాదు గానీ, మన దేవునినే ఆరాధించడానికి వచ్చాము.

మన జీవితములు శ్రేష్టకరమైన జీవితములే. మన జీవితములో ఎన్ని కష్టములు, నష్టములు ఉన్నప్పటికీ, ఆ దేవుని రుచి చూచి యెరిగినట్టయితే, ఖచ్చితముగా మన జీవితము శ్రేష్టమైన జీవితము అనే సత్యము గ్రహించగలుగుతాము. మన కళ్ళముందు ఉన్న నష్టము, కష్టము, అపజయము సత్యమే అయినప్పటికీ దేవుని మాట అంతకన్నా సత్యము.

నా ముందు ఉన్న పరిస్థితి సత్యమే కానీ ఈ పరిస్థితులు మారిపోయేవే కానీ దేవుని మాట మాత్రము మారనది గనుక, ఆ వాక్యమును పట్టుకుని నడిచే మనము శ్రేష్టులము.

ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు – ద్వితీయోపదేశకాండము 33:29

దేవునిని స్తుతించడానికి మనకు దేవుడు అద్భుతమైన జీవితమును మనకు ఇచ్చాడు. దేవుడు మనకు ఇచ్చిన జీవితమును మనము గ్రహించగలిగితే మనము హృదయమారా, యదార్థముగా ఆ దేవునిని స్తుతించేవారుగా ఉంటాము.

“నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు?” ఈ మాట వ్యక్తిగతముగా చూసుకున్నపుడు, అర్థము చేసుకున్నప్పుడు, మన జీవితము ఎంతో శ్రేష్టము అనే సత్యము ధృఢముగా బోధపడుతుంది.

నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులనుబట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తుదేశములోనుండియు, ఆ జనుల వశములోనుండియు, వారి దేవతల వశములోనుండియు నీవు విమోచించిన ఇశ్రాయేలీయులనునట్టి నీ జనులవంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది – 2 సమూయేలు 7:23

ఈ వాక్యము చదివితే నీకు ఇవ్వబడిన జీవితము ఎంత గొప్పదో, శ్రేష్టమైనదో అర్థము చేసుకోగలవు. నీవు ఏ శ్రమలో ఉన్నా, ఏ నష్టములో ఉన్నా, నీవు ఆరాధించే నీ దేవుడు నిన్ను ఆ పరిస్థితినుండి విమోచించేవాడుగా ఉన్నాడు. ఈ సత్యము నీకు అర్థమైతే, నీ జీవితము ఎంతో శ్రేష్టమైనది అనే సత్యము అర్థమవుతుంది, అప్పుడు హృదయపూర్వకముగా మన దేవునిని స్తుతించగలుగుతాము, ఆరాధించగలుగుతాము.

మన జీవితము ప్రభువే ఇచ్చాడు, అయితే ఈ జీవితము శ్రమలతో కొనసాగించబడుతుంది. అయితే మన జీవితము శ్రేష్టమైన జీవితము గనుక, మన జీవితములో ఉన్న శ్రమ ఖచ్చితముగా మారుతుంది. ఈ సత్యము గ్రహించినపుడు, ఎటువంటి నెగటివ్ పరిస్థితి వచ్చినా సరే అది మారుతుంది అనే నిజమైన నిరీక్షణ కలిగి ఉంటావు. నీ జీవితములో శత్రువు నిలువడు – ఆమేన్!

ఆయన నీకు సహాయకరమైన కేడెముగా ఉన్నది ఎవరో నీవు ఎరిగినట్టయితే, అప్పుడు నీవు స్తుతించగలుగుతావు. నీకు సహాయకరముగా ఉన్న దేవుడు, మరణమును జీవముగా మార్చగల శక్తిమంతుడు, లేనిదానిని సహితము ఉన్నట్టుగా పిలువగల శక్తిమంతుడు అటువంటి దేవుడు నీ పక్షముగా ఉండగా నీకు ఇంక ఏమిటి కొదువ?

ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు – యెషయా 26:3

ఎవరైతే ఆయనను అంగీకరించి, ఆయన మీద ఆనుకొని తమ జీవితాన్ని జీవిస్తారో, వారి జీవితములలో ఆయన మరణమయిన పరిస్థితులలో జీవము కలుగచేయువాడు, లేనిదానిని సహితము ఉన్నట్టుగా చేయగలిగినవాడు. ఒకవేళ నీవు దేవునిని నమ్మినప్పటికీ ఒకవేళ పరిస్థితులు మారకపోయినట్టయితే, ఎక్కడెక్కడ నీవు ఆయనపై పూర్ణముగా ఆనుకోకుండా జీవిస్తున్నావో పరీక్షించుకోవాలి.

అపవాది ఎన్ని ఉచ్చులు వేసినప్పటికీ నీకు సహాయకరముగా ఉన్నది సర్వశక్తుడైన నీ దేవుడే గనుక, అపవాది ప్రయత్నములు సఫలము అవ్వవు, నీవు తప్పించబడతావు. ఆమేన్!

నీ జీవితమునకు విమోచన ఉంది, విడుదల ఉంది, ఆమేన్! మనము సృష్టించబడిందే దేవునికి మహిమకరముగా ఉండునట్లు, ఆయనకు ఖ్యాతి కలిగించుటకు గనుక మన జీవితములు ఎంతో శ్రేష్టము. నీ జీవితములో ఆయన మహా కార్యములు, భీకరమైన కార్యములు చేసేవాడిగా ఉన్నాడు. ఈ సత్యము ఎరుగక ఆ గొప్ప కార్యములను మనము పోగొట్టుకుంటున్నాము. అయితే ఆయనపై పూర్ణముగా ఆనుకొనే వారిని పూర్ణశాంతిగలవానిగా చేస్తాడు. వారికి ఆయన వాక్కు ప్రకారమే ప్రతీదీ జరుగుతుంది. చిన్న చిన్న కార్యములు కాదు గానీ, గొప్ప కార్యములే నీ జీవితములో జరుగుతాయి – ఆమేన్!

దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను – కీర్తన 63:1-2.
రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును – మత్తయి 6:34

వేకువ అనగా ప్రతీ దినము ఉదయమున దేవునిని వెదుకుదును అని దావీదు చెప్పుచున్నాడు. అనగా ఈ దినమునకు సిద్ధపరచబడిన సంగతులు అవి విమోచన సంగతులైనా, సమకూర్పు సంగతులైనా మరేదైనా ఉన్నవేమో అని కనిపెట్టుకొంటున్నాడు అని అర్థము. నా కొరకు భీకరమైన కార్యములు ప్రభువు జరిగించేవాడుగా ఉన్నాడు. నా జీవితము ద్వారా ఆయనకు ఖ్యాతి కలగవలసినదే!

ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు – ద్వితీయోపదేశకాండము 33:29

నీ జీవితము యొక్క విలువను పెంచేవాడు నీ దేవుడు – ఆమేన్. నీవు పనికి రాని స్థితిలో ఉన్నా సరే, ప్రయోజనకరముగా మార్చువాడు.

నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. శత్రువు మనలను ఎదుర్కొన్నపుడు నిన్ను భయపెట్టి, నిన్ను లోబర్చుకోవడానికి తన ప్రయత్నములు ఉంటాయి. అయితే నీ దేవుడిపై నీవు పూర్ణముగా ఆనుకొన్నపుడు, ఆ భయపెట్టే శత్రువు మారువేషము వేసుకొని నిన్ను తప్పుకొని వెళ్ళవలసినదే!

అలాగే ఆయనమీద ఆనుకోవడము అంటే ఎలా అని చూస్తే, మనకు కలిగిన ఆలోచనలు ఎలాంటివి అయినా సరే, దేవుని ఆలోచన వెల్లడిపరచగానే, ఆయన తన ఆలోచన తెలియచేసినపుడు, అదే విధముగా మనము మార్చుకొని వేళ్ళడమే ఆనుకొనడము. అనగా నీకు నచ్చినా నచ్చకపోయినా, ప్రభువు మాట ప్రకారము మార్చుకొని ముందుకు వెళ్ళడమే ఆయనపై ఆనుకోవడము. 

స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను – కీర్తన 50:23

మనము ఆరాధించినపుడు దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు ఆరాధించువాడి కొరకు దేవుడు రక్షణ మార్గము సిద్ధపరుస్తాడు. గనుక ఈ దినము ఆయనను ఆరాధించే అవకాశమును వదిలిపెట్టక సద్వినియోగపరచుకుందాము.

ఆరాధన గీతము

నా దేవుడవు నీవే
నా విమోచకుడవు నీవే
భీకరమైన కార్యములు
నాకై చేయువాడవు
నీ బలమును ప్రభావమును
చూడాలని నా ఆశయ్యా

 

వారము కొరకైన వాక్యము

యెహోవా–నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పినప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితోకూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు – ఆదికాండము 12:1-4

ఎప్పుడైతే ప్రభువు నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము అని చెప్పాడో, అప్పుడు హోవా అతనితో చెప్పినప్రకారము అబ్రాము వెళ్లెను. అనగా దేవుడు చెప్పిన మాట ప్రకారము అబ్రహాము తన జీవితమును సిద్ధపరచుకొంటూ వచ్చాడు.

ప్రభువు అబ్రహామును ఎన్నిక చేసుకొన్నపుడు చెప్పిన మాటలు – నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. అప్పటినుండి అబ్రహాము దాని ప్రకారముగా తనను తాను సిద్ధపరచుకొంటున్నాడు.

అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము –మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, దయచేసి నన్ను విడిచి వేరుగానుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లినయెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమతట్టునకును వెళ్లుదునని లోతుతో చెప్పగా – ఆదికాండము 13:7-9

అబ్రహాము మాట్లాడిన విధానము చూస్తే – ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, నీవు ఎడమతట్టునకు వెళ్లినయెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమతట్టునకును వెళ్లుదునని లోతుతో చెప్పాడు. ఈ మాటలలో అబ్రహాము తన దేవుని పై నిలిపిన విశ్వాసమును కనపరుస్తున్నాడు.

ఒకవేళ లోతు బాగున్న ప్రదేశమును కోరుకొన్న యెడల, మిగిలినది బాగాలేని ప్రదేశము అయినప్పటికీ, తన దేవుని ఆశీర్వాదమును మాత్రము నమ్మి, సమయము వచ్చినపుడు, అవకాశము వచ్చినపుడు దేవుని మాటపై మాత్రమే నిలబడినవాడు. అప్పుడు ఆశీర్వాదము లేని స్థితి వైపు మనము దేవునిని మాట ప్రకారము పయనించినప్పటికీ, మనము నమ్మిన దేవునిని బట్టి ఆశీర్వాదము పొందవలసినదే.

లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణముచేసెను. అట్లువారు ఒకరి కొకరు వేరై పోయిరి – ఆదికాండము 13:10-11

ఇక్కడ చూస్తే, కంటికి శ్రేష్టమైన దానిని లోతు తీసుకున్నాడు. అబ్రహాము మిగిలినదే తీసుకున్నాడు. అనగా కంటికి కనబడే దానిని కాక, దేవుని మాట నమ్మి మాత్రమే అబ్రహాము నిలబడ్డాడు. మనము కూడా మనము అవకాశము వచ్చిన ప్రతీ సారీ, దేవుని వాక్కుపై నిలబడి మనము దేవుడు ఏమి చేయగడో నిరూపించే ధన్యత మనము కలిగి ఉందాము. నీవు దేవుని కలిగి ఉంటే, సమస్తమూ నీవు కలిగిఉన్నట్టే! ఆమేన్!

ఆదాము, హవ్వ మరియు సర్పము పాపము చేసారు. అయితే నోవహు సమయములో సమస్తము నాశనము చేసారు ఎందుకు అని ఆలోచిస్తే – సృష్టించిన సమస్తము సృష్టించిందే మనిషికోసం. ఆ మనిషే లేనపుడు ఇంక ఈ సృష్టి ఇంకెందుకు? అంటే దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో, నీ కొరకు సమస్తము సృష్టించగలవాడు అనే సత్యము ఎరిగి ఉండాలి.

అబ్రహాము కూడా ఇదే సత్యమును నమ్మినవాడుగా ఉన్నాడు. నా కొరకు సమస్తము సృష్టించగలిగినవాడు అని అబ్రహాము నమ్మాడు.

అప్పుడు వారు సొదొమ గొమొఱ్ఱాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నియు పట్టుకొనిపోయిరి మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొనిపోగా తప్పించుకొనిన యొకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసికొనినవారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన యింట పుట్టి అలవరచ బడిన మూడువందల పదునెనమండుగురిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులును వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసికొని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితోకూడ నున్న రాజులను ఓడించితిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు, రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. – ఆదికాండము 14:11-17
సొదొమ రాజు–మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసికొనుమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము–నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పులవారైనను నీవాటిలో ఏదైనను తీసికొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవాయెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతోకూడ వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏయే భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసికొననిమ్మని సొదొమ రాజుతో చెప్పెను – ఆదికాండము 14:21-24

అబ్రహాము మాటలు ఇక్కడ ఎంతో ప్రాముఖ్యము. నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పులవారైనను నీవాటిలో ఏదైనను తీసికొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవాయెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను. ఇక్కడ మరొక సందర్భము వచ్చింది. ఎంతో గొప్ప ఆస్తి సమకూర్చుకునే అవకాశము అబ్రహాముకు వచ్చింది. అయినప్పటికీ, దేవుడి మాటపై మాత్రమే అబ్రహాము నిలబడ్డాడు.

దేవుని పై, ఆయన నీకిచ్చిన మాటపై నీకున్న విశ్వాసమును కనపరిచే అవకాశము వచ్చిన ప్రతీ సారీ నీవు నీ విశ్వాసమును క్రియల ద్వారా కనపరిస్తే, ఇప్పుడు నీ బహుమానము అత్యధికము అగును.

మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రి నిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులును నీలోనుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను. – ఆదికాండము 17:5-8

మొదట నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను అని అబ్రహాముతో చెప్పాడు. ఎప్పుడైతే అబ్రహాము అవకాశము వచ్చిన ప్రతీ సారీ తన విశ్వాసమును కనపరిచినదానిని బట్టి, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను అని ప్రభువు చెప్పుచున్నాడు.

అలాగే మన జీవితములో కూడా దేవుని యొక్క మాట ప్రకారము మన జీవితములో విశ్వాసమును కనపరిస్తే ఇప్పుడే కాదు గానీ, భవిష్యత్తులో కూడా ఆశీర్వాదముగానే ఉంటాము. మన పరిస్థితులు మారిపోగానే మనము మారిపోయే విధానములోఉంటాము. అయితే అబ్రహాము వలే మారక మనము ఉండాలి.

అటువలే పౌలు కూడా క్రీస్తు జ్ఞానము నిమిత్తము సమస్తమును పెంటకుప్పవలే ఎంచుకుంటున్నాను అని చెప్పగలిగాడు. నీతిమంతుని యెదుట ఒక మార్గము మూసివేయబడినా, ఏడుమార్గములు నీ యెదుట తెరువబడతాయి. అనగా ఆశీర్వదించబడేవరకు మార్గములు తెరువబడుతూనే వుంటాయి.