26-11-2023 – ఆదివారం మొదటి ఆరాధన – దేవుని యొక్క స్వరం వినడానికి

స్తుతిగీతము – 1

నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును (2)
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా (2)
||నా ప్రాణమా||

ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు (2)
||నా ప్రాణమా||

మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును (2)
||నా ప్రాణమా||

స్తుతిగీతము – 2

పాపాన్ని పోగొట్టి శాపాన్ని
తొలగించ భూలోకం వచ్చావయ్యా
మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా
కన్నీటిని తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్యా
మనుషులను చేసావయా నీ రూపాన్ని ఇచ్చావయ్యా
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య

బంగారం కోరలేదు వెండియు కోరలేదు హృదయాన్ని కోరావయ్యా
ఆస్తియు అడగలేదు అంతస్థులడగలేదు హృదయాన్ని అడిగావయ్యా
నేవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య

తల్లి నన్ను మరచిన తండ్రి నన్ను మరచిన యేసయ్య మరువడయ్యా
బంధువులు విడిచిన స్నేహితులు విడచిన యేసయ్య విడువడయ్యా
చేయిపట్టి నడుపునయ్య శిఖరముపై నిలుపునయ్యా
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య

స్తుతిగీతము – 3

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య

నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో

ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య

ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచొస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య

ఆరాధన వర్తమానము

నీతిమంతుడు విశ్వాసము మూలమున జీవించును. మనందరము యేసుక్రీస్తు సిలువ కార్యము చేత నీతిమంతులుగా తీర్చబడ్డాము. అయితే మనలను జీవింపచేయునది యేసుక్రీస్తు ద్వారా దేవుని యందలి విశ్వాసము. దేవుని సన్నిధిలో ఆయన మాటలు వెల్లడి అగును. ఆ మాటలను బట్టియే విశ్వాసము కలుగుతుంది.

కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తునుగూర్చిన మాటవలన కలుగును.౹ -రోమా 10:17
మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను. -మత్తయి 4:4

అనగా కేవలము భౌతికము గా తీసుకునే ఆహారమును బట్టి మాత్రమే మనము జీవించము గానీ, దేవుని మాటలను బట్టి మాత్రమే మన జీవితము కొనసాగించబడుతుంది అని అర్థము. ఆ కృప గల దేవుని మాటలు అనుగ్రహించబడినప్పుడు మనము ఎంతో ధన్యులము గనుక ఆయన సన్నిధిని ఎన్నడూ పోగొట్టుకోకూడదు. కీర్తనాకారుడు కూడా ఎప్పుడుడెప్పుడు ఆయన సన్నిధి కి వెల్తానా అని ఎదురుచూసే ఆసక్తి కలిగినవాడుగా మనము గమనించగలము. అయితే ఆచారయుక్తమైన భక్తి ఏమాత్రము ప్రయోజనము చేకూర్చదు. అయితే ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి అనుభవించిన వాడి హృదయములోనుండి నిజమైన ఆరాధన వస్తుంది.

మన దేవుడు నిన్న, నేడు మరియు రేపు ఏకరీతిగా ఉన్నాడు.

యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు -నిర్గమకాండము 15:11

మన పితరులు దేవుని గూర్చి చెప్పే సాక్ష్యము చూస్తే, “దేవుళ్ళుగా కొలవబడేవారిలో నీవంటివాడు లేడు” అనే సాక్ష్యము ఇస్తున్నారు. ఎందుకంటే, దేవుని యొక్క ప్రేమ, శక్తి మరియు కార్యములు చూసి అనుభవించినవారు గనుక అలా చెప్పగలుగుతున్నారు.

ప్రభువా, నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు. -కీర్తనలు 86:8-9
యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహా త్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘనమైనదాయెను.౹ -యిర్మీయా 10:6

కీర్తనాకారుడికంటే అనేక సంవత్సరములకు ముందుగా మన పితరులు ఇచ్చిన సాక్ష్యము – “దేవా నీవంటివాడు లేడు”. అలాగే కీర్తనాకారుడి సమయములో ఇస్తున్న సాక్ష్యము కూడా “దేవా నీవంటివాడు లేడు”. అటు పిమ్మట అనేక సంవత్సరముల తరువాత యిర్మీయా ఇస్తున్న సాక్ష్యము – “నిన్ను పోలినవాడెవడును లేడు”.

అంతే కాక సామాన్యురాలైన హన్నా ఇస్తున్న సాక్ష్యము చూస్తే – “యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియులేదు. -1 సమూయేలు 2:2”.

ఇలా తరములు మారినప్పటికీ మారనిది దేవుని యొక్క లక్షణము, కార్యము మరియు మహాత్మ్యము. అందుకే మన దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు అని ఈ వాక్యములద్వారా మనము అర్థము చేసుకోగలము. ఇప్పుడు మన తరము అయినప్పటికీ ఆయన మారనివాడు, ఆయన తనను తానే మనకు ప్రత్యక్షపరచుకుంటాడు. అందుకే ఆయనను మనము ఆరాధించడానికి అర్హుడు.

మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి ఆయన పరిశుద్ధుడు. -కీర్తనలు 99:5

మన పితరులు గ్రహించినదానిని బట్టి ఆయనను స్తుతించారు. ఈరోజు మనము కూడా ఈ సత్యము గ్రహిస్తే మనము కూడా ఆయనను స్తుతిస్తాము. అయితే దానికొరకు ఆయనను స్వీకరించుట అనేది ఎంతో ప్రాముఖ్యము. ఆయనను ఆయనన మాటలను స్వీకరించని యెడల ఆయనను స్తుతించలేము.

విశ్రాంతిదినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి–ఈ సంగతులు ఇతనికి ఎక్కడనుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి? ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. -మార్కు 6:2-3

ఇక్కడ చూస్తే, యేసయ్య అద్భుతముల ద్వారా ప్రత్యక్షపరచుకొన్నాడు. జ్ఞానముతో కూడిన మాటల ద్వారా ప్రత్యక్షపరచుకున్నాడు. తాను బోధించుట ద్వారా ప్రత్యక్షపరచుకున్నాడు అయినప్పటికీ, వారు తమ హృదయములను కఠినపరచుకున్నారు ఆయనను అగీకరించక అభ్యంతరపడ్డారు. అయితే నీవు నేను ఆయనను స్వీకరిస్తున్నామా? ఆయన విషయమై అభ్యంతరపడుతున్నామా?

ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.౹ మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.౹ -రోమా 1:20-21

ఆయన చేసిన సృష్టిని గమనిస్తే, దేవుడు కలిగిన శక్తిని మనము తెలుసుకోవచ్చు. అనగా దేవుని శక్తి మన ముందు ప్రత్యక్షపరచబడింది. అంతే కాక, ఆయన చేసిన సృష్టిని చూస్తే, ఆయన దేవత్వమును కూడా అర్థము చేసుకోగలము. అయితే ఈ సంగతి గమనించలేని దుస్థితిలో వాదములచేత వ్యర్థులవుతున్నారుగానీ, సత్యము గ్రహించడములేదు.

దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. –నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. –కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. –మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. -2 కొరింథీయులకు 6:16

మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము. “నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు” అని దేవుడే చెప్పుచున్నాడు. ఆయనే దేవుడు అని ఎరిగి స్తుతించకపోతే ఏమి జరుగుతుంది అని చూస్తే –

అందువలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. -మార్కు 6:5

ఆయనే దేవుడు అని ఎరిగి స్తుతించకపోతే, తన శక్తిని కనబరచలేకపోయాడు. అదే ఒకవేళ ఆయనను అంగీకరించి స్తుతిస్తే, ఏమి జరుగుతుంది? ఖచ్చితముగా ఆయన బోధ, జ్ఞానము విడుదల అవుతుంది, అద్భుతములు కనపరచబడతాయి, ప్రత్యక్షపరచబడతాయి. అనగా ఆయన ఏమై ఉన్నాడో అది మన జీవితములలో స్థిరపరచబడుతుంది. అందుకే ఈరోజున మనకు దేవుని గూర్చి తెలియచేయబడిన సత్యములను స్వీకరిద్దాము, ఆత్మతో ఆరాధిద్దాము.

మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను– నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహా బలముకలిగెను నీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నాను నావిరోధులమీద నేను అతిశయపడుదును. -1 సమూయేలు 2:1

హన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, అప్పుడు తన హృదయము యెహోవా యందు సంతోషించింది. అప్పుడు తనకు మహా బలము కలిగింది. దేవుని రక్షణను బట్టి సంతోషించుచున్నాను అని సాక్ష్యము ఇస్తుంది. అంతే కాక నా విరోధులమీద అతిశయపడుదును అని ప్రకటిస్తుంది. అనగా దేవుని మాటను స్వీకరిస్తే, మొదట సంతోషము, తరువాత బలము అటుతరువాత సంతోషకరమైన నిరీక్షణ కలుగుతాయి. ఈ అనుభవము కలిగినవారు ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిస్తారు.

మన పితరుల కాలము అయిపోయింది. ఈరోజు మన సమయము. ఏ గుంపులో ఉంటున్నాము? స్వీకరించిన గుంపా, తృణీకరించిన గుంపా? మనలను పరీక్షించుకుని ఆయనను ఆరాధించడానికి సిద్ధపడదాము.

ఆరాధన గీతము

ఎల్షడ్డాయ్ ఎల్షడ్డాయ్
ఎల్షడ్డాయ్ ఎల్షడ్డాయ్
నీలాంటి దేవుడులేడు మాకిలలో
నీలాంటి దేవుడులేడు

మృతులను సజీవులుగా
లేనివి ఉన్నట్టుగా
చేసినదేవా స్తోత్రం
ఆశ్చర్యకరుడా స్తోత్రం
నీలాంటి దేవుడులేడు

వేదనలో మాకు శాంతి
కన్నీళ్ళలో సంతోషం
ఇచ్చినదేవా స్తోత్రం
అద్భుతకరుడా స్తోత్రం
నీలాంటి దేవుడులేడు

రోగములో మాకు స్వస్థత
బాధలలో నెమ్మది
ఇచ్చినదేవా నీకు స్తోత్రం
యెహోవా రాఫా స్తోత్రం
నీలాంటి దేవుడులేడు

కుటుంబములను కట్టువాడా
విజయమునిచ్చువాడా
యెహోవా షాలోం స్తోత్రం
యెహోవా నిస్సీ స్తోత్రం
నీలాంటి దేవుడులేడు

కార్యము రూపము దాల్చునట్టుగా
చేసిన దేవా స్తోత్రం
నెరవేర్చే దేవా స్తోత్రం
ఆశ్చర్యకరుడా స్తోత్రం

దేవుని శక్తి కనపరచబడే సమయములో ఉంటున్నాము. ఇది దేవుని సమయము గనుక మనము ఆయన యందలి భయభక్తులతో ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధిద్దాము.

“మృతులను సజీవులుగా లేనివి ఉన్నట్టుగా చేసినదేవా” అనేది మన అనుభవము అయిఉండాలి. దానికి, మొదట మనము స్వీకరించాలి, విశ్వసించాలి, ఆరాధించాలి అప్పుడు ఆ మృతమైన పరిస్థితులు జీవింపచేయబడటము చూడగలుగుతాము.

అనుభవముతో కూడిన ఆరాధన ఆశీర్వాదముగా మార్చబడుతుంది.

జీసస్ కేర్స్ యూ మినిస్ట్రీ ద్వారా ప్రభువు యొక్క శక్తి బహిరంగముగా కనపరచబడే దినములు ఇవి గనుక, ఈరోజు నీవు హృదయపూర్వకముగా ఈరోజు సత్యముతో ఆత్మతో స్తుతించి ఇంటికి వెళ్ళి నీ పరిస్థితిలు గమనించు, అనుభవముకొరకు ఆశకలిగి స్తుతించు. Decide and Declare. 

 

వారము కొరకైన వాక్యము

ఈరోజు దేవుని స్వరాన్ని వినడానికి ఏమి చేయాలి అని మనము నేర్చుకుందాము. ఏలా మనము దేవుని స్వరాన్ని వినగలుగుతాము?

పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. -హెబ్రీయులకు 1:1-2

“నానాసమయములలోను నానా విధములుగా” అనగా ఆయన మాట్లాడే విధానములు వేరు అని గ్రహించాలి. అలాగే ఆయన ఖచ్చితముగా మాట్లాడేవాడు అని మనము గ్రహించాలి. మన పితరులు అనేకులతో ప్రభువు మాట్లాడాడు. మోషే అనుభవమును జ్ఞాపకము చేసుకుంటే, దేవుడు మాట్లాడటానికి మోషే ఏమైనా చేసాడా?

మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను.౹ ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవాదూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను.గాని పొద కాలిపోలేదు.౹ అప్పుడు మోషే–ఆ పొద యేల కాలిపోలేదో నేను ఆతట్టు వెళ్లి యీ గొప్పవింత చూచెదననుకొనెను.౹ దానిని చూచుటకు అతడు ఆతట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమనుండి–మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు–చిత్తము ప్రభువా అనెను.౹ -నిర్గమకాండము 3:1-4

ఇక్కడ చూస్తే, దేవుడు మాట్లాడటానికి మోషే ప్రత్యేకముగా ఏమీ చేయలేదు గానీ, దేవుడే మోషేతో మాట్లాడుటకు తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. దేవుడు మాట్లాడటము వెనుక ఉద్దేశ్యము ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బంధకములనుండి విడిపించుట అని మనకు తెలుసు. అయితే దేవుడు మోషే ఎక్కడ ఉన్నాడో అక్కడికే దిగి వచ్చి తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. తన ప్రజలను విడిపించడానికి ఏ ప్రణాళిక అయితే తాను కలిగి ఉన్నాడో అది తెలియచేయుటకు, కార్యరూపము దాల్చులాగున మోషేకు ప్రత్యక్షపరచుకున్నాడు. దీనిని బట్టి మనము మోషే ఏర్పరచబడ్డవాడు అని మనము గ్రహించగలము.

అయితే మోషే చేసిన ఒక సంగతి చూస్తే, “ఆ పొద యేల కాలిపోలేదో నేను ఆతట్టు వెళ్లి యీ గొప్పవింత చూచెదననుకొనెను”. అనగా దేవుడు దిగి వచ్చిన సందర్భములో తన హృదయమును సిద్ధపరచుకుంటున్నాడు. దేవుడు ఎన్నిక చేసుకున్నవానితో దేవుడు ఖచ్చితముగా మాట్లాడతాడు అనే సత్యము మనము గ్రహించాలి. కానీ సిద్ధపాటు లేకుండా దేవుని స్వరమును వినలేవు.

ఒకవేళ నీ జీవితములో ఆయన నీతో మాట్లాడాలి అనే ఆశ నీవు కలిగి ఉంటే, నీవు సిద్ధపరచుకోవాలి. నీవు దేవుని ప్రణాళిక కొరకు నీవు ఎన్నుకోబడినవాడవే, ఎన్నుకోబడినదానివే అయితే, నీ హృదయమును సిద్ధపరచుకో!

అందుకాయన–దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.౹ -నిర్గమకాండము 3:5

దేవుని స్వరమును వినాలి అంటే, మొదట హృదయము సిద్ధపరచబడాలి. తరువాత, మనము విడిచిపెట్టవలసిన సంగతులు విడిచిపెట్టాలి. అప్పుడే తన ఉద్దేశ్యము సంపూర్ణముగా బయలుపరచబడుతుంది. ఇక్కడ చెప్పులు కాదు గానీ, నీ పరిశుద్ధతను పాడుచేసేదిగానీ, దొంగిలించేదిగాని అయిన అపవాదికి సంబంధించిన విషయములు విడిచిపెట్టి, పరిశుద్ధత కలిగిమాత్రమే దేవుని స్వరమును వినడానికి సిద్ధపడాలి.

గమనించవలసిన మూడు విషయములు
1. ఎన్నిక చేయబడుట
2. హృదయము సిద్ధపరచుకొనుట
3. పరిశుద్ధత కలిగి ఉండుట.

సమూయేలుతో దేవుడు మాట్లాడిన సమయమును, సంగతులను మనము గమనిస్తే –

సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్నశ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసి కొనెను. -1 సమూయేలు 1:11

అనగా సమూయేలు తల్లి దేవునికొరకు ప్రతిష్ఠ చేసినది గనుక దేవుడు అతనితో మాట్లాడాడు. గనుక ఎన్నిక చేయబడిన వారితోనే కాక, తనకు తాను దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న వారితో సహితము ఆయన మాట్లాడతాడు. కేవలము ఒకరోజు కాదు కానీ, నీ బ్రతుకు దినములన్నిటను, దేవుని కొరకే, ఆయన మహిమ కొరకే జీవిస్తాను అని తీర్మానమును చేసుకొని నిలబడటమే ప్రతిష్టించుకోవడము.

“వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక” అనగా ఏ విధముగా దేవుని చేత పుట్టింపబడ్డాడో అదే విధముగా కొనసాగించబడుట. మనమైతే ఈరోజు ఏ తీర్మానము తీసుకున్నామో, ఆ తీర్మానము చివరి దినము వరకు అదే తీర్మానముతో నిలబడాలి. మరొకలా చూస్తే, యేసు క్రీస్తును బట్టి ప్రారంభమైన పరిశుద్ధ జీవితమును కడదాకా కొనసాగించాలి.

బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. -1 సమూయేలు 2:26

దేవుని స్వరమును వినక మునుపు, యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్థిల్లే జీవితము కలిగి ఉండాలి. అనగా ఆత్మీయముగా ఏమి నేర్చుకుంటున్నామో, అది భౌతికమైన జీవితములో క్రియల ద్వారా కూడా కనపరచబడాలి.

బాలుడైన సమూయేలు ఏలీయెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరుచుగా తటస్థించుటలేదు.౹ -1 సమూయేలు 3:1

ఇక్కడ సమూయేలు దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఇంకా తాను బాలుడై ఉన్నాడు. అనగా ఇంకా యాజక ధర్మము, బాధ్యత, ఇవ్వబడలేదు. అనగా దేవుని ఉద్దేశ్యము కొరకు నియమించబడిన స్థానమునకు వచ్చేవరకు దేవుని పరిచర్యలో నిలిచి ఉండాలి.

సమూయేలు జీవితములో మనము నేర్చుకొన్న మూడు విషయములు –
1. ప్రతిష్ట చేసికొనుట
2. ఆత్మీయముగా నేర్చుకున్న విషయములు క్రియలద్వారా కనపరచుట
3. దేవుని పరిచర్యలో ఉండుట.

యెహోవా సమూయేలును పిలిచెను. అతడు–చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీదగ్గరకు పోయి–నీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చినాననెను. అతడు–నేను పిలువలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను.౹ యెహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీయొద్దకు పోయి –చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను.౹ సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంక ప్రత్యక్షము కాలేదు.౹ యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి –చిత్తము నీవు నన్ను పిలిచితివే; యిదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి –నీవు పోయి, పండుకొమ్ము, ఎవరైన నిన్ను పిలిచినయెడల–యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను.౹ -1 సమూయేలు 3:4-9

ఇక్కడ సమూయేలు కూడా దేవుని స్వరము వినడానికి ఏమీ చేయలేదు. కానీ జీవితమును మాత్రమే సిద్ధపరచుకున్నాడు. ఇంకా తరువాత వాక్యములు గమనిస్తే, సమూయేలు దేవుని స్వరమును గ్రహించనప్పటికీ, విడిచిపెట్టక దేవుడు సమూయేలుతో మాట్లాడినాడు. అలాగే మనము కూడా మొదట మనము దేవుని స్వరమును గుర్తించే శక్తి కలిగి ఉండనప్పటికీ, ఆయన విడిచిపెట్టక నీవు వినగలుగునట్లు, దేవుని స్వరముగా నీవు గుర్తించులాగున ఒక మార్గమును కూడా సిద్ధపరుస్తాడు.

వారిద్దరు రాగా ఆయన –నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడుకాడు.౹ -సంఖ్యాకాండము 12:6

దేవుడు మనము వినగలిగేలాగున మాట్లాడతాడు. అలాగే కలల ద్వారా కూడా మనతో మాట్లాడతాడు.

పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు౹ ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను -హెబ్రీయులకు 1:1-2

కుమారుడైన యేసయ్య వాక్యము అయి ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరమును వినును అంటే, ఆయన బిడ్డలముగా మనము ఆయన వాక్యము ద్వారా వినగలుగుతాము.

దేవుడు మాట్లాడే విధానములు చూస్తే –
1. ముఖాముఖి మాటలాడుట
2. కలల ద్వారా మాటలాడుట
3. వాక్యము ద్వారా మాటలాడుట

దేవుడు మాట్లాడేది, తన ఉద్దేశ్యము ప్రకారమైన ప్రణాళికను నీ ద్వారా నెరవేర్చుటకే, గనుక సిద్ధపడు.