26-11-2023 – ఆదివారం రెండవ ఆరాధన

స్తుతిగీతము – 1

ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో (2)

నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధనా
ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)

ఎబినేజరే ఎబినేజరే
ఇంత వరకు ఆదుకొన్నావే (2)
ఇంత వరకు ఆదుకొన్నావే
|| నిన్ను పూర్ణ ||

ఎల్రోహి ఎల్రోహి
నన్ను చూచావే వందనమయ్యా (2)
నన్ను చూచావే వందనమయ్యా
|| నిన్ను పూర్ణ ||

యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరిచావే వందనమయ్యా (2)
స్వస్థపరిచావే వందనమయ్యా
|| నిన్ను పూర్ణ ||

స్తుతిగీతము – 2

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య

నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో

ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య

ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచొస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య

స్తుతిగీతము – 3

నీటిపైనా నడిచెను
గాలి సముద్రమును గద్దించెను
మృత్యుంజయుడై లేచెను
నాతో నిత్యము జీవించును
ఆయనే కాపాడు దేవుడు
ఆయనే నడిపించే దేవుడు
ఆయనే తోడైయుండు దేవుడు
ఆయనే

మనకొరకై మరణించి
సిలువలో ప్రాణమునిచ్చెను
జయశీలుడై లేచెను
పాపికి విడుదలనిచ్చెను

మేఘముల మధ్యలో
బూర ధ్వని శబ్దముతో
రారాజుగా దిగివచ్చును
ఈ భూలోకమును ఏలుటకై
ఆయనే అధికారముతో యేసయ్యా
ఆయనే రాజ్యమేలుటకు యేసయ్యా
ఆయనే న్యాయాధిపతి యేసయ్యా

ఆరాధన వర్తమానము

యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. -కీర్తనలు 92:1-2
యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము. -కీర్తనలు 147:1

యెహోవాను స్తుతించుట, ఆయన నామమును కీర్తించుట మంచిది, ఆయనకు స్తోత్రగీతము చేయుట మంచిది అని వ్రాయబడింది. మంచిది అనగా ఏమిటి?

మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. – నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. -2 కొరింథీయులకు 6:16

ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు గనుక ఆయనను స్తుతించుట మంచిది. మన నోటనుండి ఏమి పలకబడుతుందో, అది స్థిరపరచబడుతుంది. హృదయమందు విశ్వసించి, నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ కలుగుతుంది అని వ్రాయబడింది. మనము ఆయన దేవుడు అని మనము ఒప్పుకుంటున్నాము, బుద్ధిజ్ఞాన సర్వ సంపదలు ఆయన అయి ఉన్నాడు అని ఒప్పుకుంటున్నాము, మన దేవుడు ప్రేమామయుడు అని విశ్వసించి నోటితో ఆరాధిస్తూ ఉండగా, ఆయన ప్రేమ నీ జీవితములో స్థిరపరచబడుతుంది.

మనము స్తుతించేదేవుడు మనకు మంచి చేయాలి అనే ఉద్దేశ్యము, ఆశ కలిగినవాడు. అటువంటి దేవుడు మనలో నివసించాలి అని కోరిక కలిగి ఉన్నాడు.

యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతిగంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు. -కీర్తనలు 92:5-6

దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన కార్యములు ఎట్టివో, నీవు నేను మాత్రము ఎరిగే ఉండాలి. మన దేవుడు మనలో నివాసము ఉండటమే కాదుగానీ, సంచరించేవాడుగా ఉన్నాడు. మన జీవితము ఎటువైపుకు వెళ్ళినా సరే అటువైపుకు ఆయన వచ్చేవాడుగా ఉన్నాడు.

మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు –నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను. -యెషయా 57:15

మనము దేవునిని అంగీకరించినప్పుడు ఆయన నివాసముంటాడు. ఎక్కడైతే నలిగిపోయావో, ఎక్కడైతే కష్టము అనుభవిస్తున్నావో, అక్కడ ఆయన సంచరించి నీకు సహాయము చేస్తూ, తన క్రియలు జరిగించువాడై ఉన్నాడు.

తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుట లేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయుచున్నాడు.౹ -యోహాను 14:10

యేసయ్య కూడా తాను భూమి మీద ఉన్నప్పుడు, తండ్రి తనలోనే ఉన్నాడు అనే సంగతి ఎరిగినవాడుగా ఉన్నాడు. అందుకే గలిలయకు వెళ్ళవలసిన సమయములో, నేను ఒంటరిని కాదు గానీ, నాతో తండ్రి ఉన్నాడు అని చెప్పుచున్నాడు.

యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము. -కీర్తనలు 135:3

నీలో నివాసముండి, నీతో వచ్చుచున్నవాడు దయాళుడు అయి ఉన్నాడు. ఆయన కఠినమైన మనసు కలిగినవాడు కాడు.

యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును. -కీర్తనలు 107:1

నీలో ఉండి నీతో సంచరించుచున్న నీ దేవుడు దయాళుడు. నీవు జ్ఞానము లేనిచేత ప్రక్కకు వెళ్ళిపోయిన సందర్భములలో, నీ దేవుడు నిన్ను విడువక, తన దయాళుత్వమును బట్టి, మరలా నిన్ను తిరిగి సరైన విధానములోనికి తీసుకువచ్చుటకై తన కృపను విడుదల చేసేవాడుగా ఉన్నాడు. ఆ కృప, తప్పిపోయిన పరిస్థితిలో నిన్ను రక్షించేదిగా ఉంటుంది.

పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. -రోమా 5:20

అపవాది పాపము చేత దేవుని నుండి లాక్కుపోవడానికి ప్రయత్నించినపుడు, మనలో ఉన్న దేవుడు తన కృపచేత మరలా చేర్చుకొనేవాడుగ ఉన్నాడు. అందుకే మన దేవుడు దయాళుడు గనుక ఆయనను స్తుతించుట ఎంతో మంచిది. ఆయన కృప నీకు ఎల్లప్పుడు తోడుగా ఉంటుంది గనుక ఆయనను స్తుతించుట మంచిది.

యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పదితంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను. -కీర్తనలు 92:1-4

మన పగటి సమయములో మన పనులు జరిగించుకుంటాము. ప్రతి దినము సంతోషముగా ముగిస్తున్నాము అంటే అది కేవలము దేవుని కృపను బట్టియే! అపవాది మనలను లాక్కుపోవడానికి ఎంతగా ప్రయత్నిస్తాడో, అంతకంటే ఎక్కువగా దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించినవారిగా మనము దేవునిని స్తుతించవలసినవారుగా ఉన్నాము.

ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును.-2 కొరింథీయులకు 1:10

అనగా ఇప్పుడు తప్పించేవాడు అలాగే ఇకముందుకూడా తప్పించువాడు అయి ఉన్నాడు గనుక మన దేవుడైన యెహోవాను స్తుతించుట మంచిది. ఇంతవరకు ఆయన కృప మన జీవితములలో పనిచేసింది. ఇకముందు కూడా మన జీవితములలో పనిచేస్తుంది. మన జీవితములో కృప ఉన్నంతకాలము మనకు ఏ సమస్య, కొదువ ఉండదు. అయితే ఆయన కృప దేవుడు మనలో ఉన్నంతకాలము ఉంటుంది. కృప అనగా అర్హతలేనివాడికి చూపే ఆదరణ, దయాపూర్వక కార్యము.

ఆరాధన గీతము

యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు
ఆయన కృప నిత్యముండును
ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు
యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు
యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు
జై జై యేసు రాజా – జయ యేసు రాజా

సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే
మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే

దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే
విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే

 

వారము కొరకైన వాక్యము

మన దేవునిని ఆనుకొని మనము వెళ్ళాలి. ఆనుకొని వెళ్ళుట అంటే ఏమిటి?

ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు. -యెషయా 26:3

ఆనుకొనుట అంటే, ఆయన ఏ రీతిగా తెలియచేస్తున్నాడో, అనగా వాక్యము తెలియచేస్తున్న ప్రకారముగా నిలబడి కొనసాగించుటయే. అందుకే ఆయన వాక్యానుసారముగా నిలబడి జీవించుటకు మనలను మనమే సిద్ధపరచుకోవాలి.

మరియు యెహోషువ–రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.౹ -యెహోషువ 3:5

అద్భుత కార్యములకు, పరిశుద్ధపరచుకొనుటకు ఏమైనా సంబంధము ఉందా? ఒకవేళ ఎవడైనా పాపములో ఉన్నయెడల అతనితో పరిశుద్ధపరచుకొమ్ము అని అంటే అది సబబే. మరి మీ మధ్య అద్భుత కార్యము చేయాలి అనుకుంటున్నాడు గనుక పరిశుద్ధపరచుకొండి అంటే ఏమిటి? అంటే మన జీవితములలో పరిశుద్ధత ఎంతో ప్రాముఖ్యము అని అర్థముచేసుకోవచ్చు. మనలో పరిశుద్ధత లేని కారణము చేత అనేకమైన మేలులు మనము కోల్పోయాము.

మోషే అరణ్యమందు గొర్రెలు మేపుతున్న సందర్భములో మండుతున్న పొదలో దేవుడు మాట్లాడాడు. అంతకంటే ముందు నీ చెప్పులు విడిచిపెట్టు, ఇది పరిశుద్ధ స్థలము అని దేవుడు చెప్పాడు. ఇది ఏమి సూచిస్తుంది అంటే, మన జీవితములో అపవిత్రత కలిగించే ప్రతీదీ విడిచిపెట్టి దేవుని సమీపించినప్పుడే దేవుడు తన ఉద్దేశ్యము బయలుపరుస్తాడు.

పేతురుతో నా వెంబడిరా నిన్ను మనుష్యులు పట్టే జాలరిగా చేస్తాను అని చెప్పినప్పుడు, పేతురు ఎదుట విస్తారమైన సంపద చేపల రూపములో ఉంది. అయితే ఆ లోకమునకు సంబందించినది విడిచిపెట్టినప్పుడే అది జరిగింది.

ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము. -2 కొరింథీయులకు 7:1

ఇక్కడ వాగ్దానానికి పరిశుద్ధతకు సంబంధము ఏమిటి? దేవుడు ఇచ్చిన పరిశుద్ధమైన జీవితమును సంపూర్ణముగా జీవిస్తూ ఉన్నప్పుడు వాగ్దానమును స్వతంత్రించుకొంటాము.

సమూయేలు ప్రతిష్ట చేయబడ్డాడు, తన జీవితకాలమంతా దేవుని సేవలో ఉంటాడు అని, క్షౌరపు కత్తి తలమీదికి రానియ్యక ఉంటాడు అని ప్రతిష్ట చేయబడ్డాడు. అనగా దేవుడు పాపమంతా తొలగించి ఇచ్చిన పరిశుద్ధమైన జీవితమును అదే పరిశుద్ధతలో కొనసాగించుకోవాలి. అప్పుడే మనకొరకు ఉన్న వాగ్దానములు నెరవేరబడతాయి.

పరిశుద్ధమైన జీవితము అంటే, దేవుని ఉద్దేశ్యము నెరవేర్చుట కొరకు, ఆయన వాక్యమునకు లోబడుట ద్వారా ప్రత్యేకించబడిన జీవితము అని అర్థము. మరియ కన్యకగా ఉన్నప్పుడు దేవదూత నీవు గర్భవతివి కాబోతున్నావు అంటే, నీ చిత్తమే జరుగును గాక అని చెప్పింది. అది పరిశుద్ధత కలిగి ఉండుట ను సూచిస్తుంది.

అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై–నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.౹ -ఆదికాండము 17:1

అబ్రాహాము దేవునికి వ్యతిరేకముగా ఏమి చెయ్యలేదుగానీ, ఆలోచనలలో మాత్రము సంతానము విష్యములో దేవుని వాగ్దానమునకు వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. అయితే, వాగ్దానము చేసిన దేవుడి యెడల మాత్రము సందేహింపక విశ్వాసము కలిగి ఉన్నాడు.

మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,౹ అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక౹ దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.౹ -రోమా 4:19-21

వ్యతిరేకమైన ఆలోచన వచ్చినప్పటికీ, దానిని కార్య రూపము దాల్చనివ్వలేదు అబ్రహాము. దీనినిబట్టి ఆలోచనలు పరిశుద్ధతను కోల్పోయేలా చేస్తాయి అని అర్థము చేసుకోవచ్చు. అందుకే దేవుడు శరీరమునకు, ఆత్మకు పట్టిన కల్మషమునుండి పవిత్రపరచుకోవాలి అని వ్రాయబడింది.

ఉదాహరణకు దేవుడు నీ జీవితములో ఒక అద్భుతము చేస్తాను అని మాట ఇచ్చడు అనుకోండి. అసాధ్యముగా కనబడే పరిస్థితిలో ఇచ్చిన వాగ్దానము అని. అప్పుడు నీ పరిస్థితులను బట్టి అసలు ఇది జరగదు అని అనుకొంటే, అది శరీరమునకు పట్టిన కల్మషము. ఒకవేళ జరుగుతుంది అని నమ్మినప్పటికీ, పరిస్థితులను బట్టి ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచనలద్వారా వచ్చే సందేహమును అనుమతించినట్టయితే, అది ఆత్మకు పట్టిన కల్మషము. ఇప్పుడు మనము వీటినుండి పవిత్రపరచుకోవాలి అయితే ఎలా? విశ్వసించుట ద్వారా నీ శరీరమునకు, ఆత్మకు పట్టిన కల్మషమునుండి పరిశుద్ధపరచబడతారు.

మరియు యెహోషువ–రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.౹ -యెహోషువ 3:5

మన ఆలోచనల చేత గానీ, రెఫు కనబడే పరిస్థితులను బట్టిగానీ దేవుని వాగ్దానమును సందేహిస్తే, పరిశుద్ధత కోల్పొతాము. అపుడు దేవుని కార్యమునకు అడ్డువేసినవారము అవుతాము. గనుక పరిశుద్ధపరచుకొమ్మన్నాడు.

ఇశ్రాయేలు ప్రజలకు కానానులోనికి తీసుకువెళతాను అనే దేవుని వాగ్దానము ఉంది. అయితే వారు సగము దూరము వచ్చినతరువాత చెప్పిన మాటలు చూస్తే,

మనయొద్దకు తీసికొని వచ్చి–మన దేవుడైన యెహోవా మన కిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి.౹ అయితే మీరు వెళ్లనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి మీ గుడారములలో సణుగుచు–యెహోవా మనయందు పగపెట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తుదేశములోనుండి మనలను రప్పించియున్నాడు.౹ మనమెక్కడికి వెళ్లగలము? మన సహోదరులు–అక్కడి జనులు మనకంటె బలిష్ఠులును ఎత్తరులునై యున్నారు; ఆ పట్టణములు గొప్పవై ఆకాశము నంటు ప్రాకారములతో నున్నవి; అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి.౹ -ద్వితీయోపదేశకాండము 1:25-28

అంటే వాగ్దానము ఉన్నప్పటికీ, సగము దూరము వచ్చినతరువాత వేగు చూసిన తరువాత, దేవుడు చేసిన వాగ్దానము ప్రకారమే ఆ ప్రదేశము ఉంది. అయినప్పటికీ, దేవునికి ఆయన వాగ్దానమును వ్యతిరేకముగా సణుగుకున్నారు. ఎందుకంటే, అక్కడ ఉన్న ప్రజలు వీరికంటే బలవంతులు అనే మాట వీరి ధైర్యమును కోల్పోచేసి, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాటలాడుతున్నారు.

అందుకే యెహోషువ వారితో రేపు మీ మధ్య అద్భుతకార్యము చేయబోతున్నాడు గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పుచున్నాడు. ఈ విషయము గ్రహించినవారమై 2024 లో ప్రభువు జరిగించబోయే, అద్భుతకార్యములకొరకు మనలను పరిశుద్ధపరచుకొందాము.