26-03-2023 ఆదివారం మొదటి ఆరాధన – ప్రార్ధన యొక్క శక్తి

స్తోత్ర గీతము 1

కృపామయుడా నీలోనా – నివసింప జేసినందునా –
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా –
ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా…. ఆ అ

1. ఏ అపాయము నా గుడారము – సమీపించనియ్యక -2
నా మార్గములన్నిటిలో – నీవే నా ఆశ్రయమైనందున -2

2. చీకటి నుండి వెలుగులోనికి – నన్ను పిలచిన తేజోమయా -2
రాజ వంశములో – యాజకత్వము చేసెదను -2

3. నీలో నిలచి ఆత్మ ఫలములు – ఫలియించుట కొరకు -2
నాపైనా నిండుగా – ఆత్మ వర్షము కుమ్మరించు -2

4. ఏ యోగ్యత లేని నాకు – జీవకిరీట మిచ్చుటకు -2
నీ కృప నను వీడక – శాశ్వత కృపగా మారెను -2

స్తోత్ర గీతము 2

ఆపత్కాలమున తన పర్ణశాలలో
ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను
తన గుడారపు మాటున నన్ను దాచెను
ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను

యెహోవా నా ప్రాణ దుర్గము – నేను ఎవరికి వెరతును
నా చేయి విడువని దేవుడుండగా – నేను భయపడను

ఇహలోక దుఃఖ బాధలలో – నీవు నాతో ఉన్నావు
ముదిమి వచ్చువరకు – నన్ను ఎత్తుకొనే దేవుడవు
నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు
నిత్యము నీ పై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్
ఆ … హల్లెలూయ …. హల్లెలూయ

లెక్కించలేని అద్భుతములు – మక్కువతో చేసిన దేవా
నీవు చేసిన కార్యములకై – నేను ఏమి అర్పింతును
స్వచ్ఛమైన నిత్య ప్రేమను – నాపై చూపినదేవుడవు
కోట్ల కొలది స్తోత్రములు – నిరతము నీకే ప్రభువా
ఆ … హల్లెలూయ …. హల్లెలూయ

స్తోత్ర గీతము 3

కీర్తి హల్లెలూయా
గానం యేసు నామం మధురమిదే
నిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2)
స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ గానము శ్రీ యేసుకే
స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ స్తోత్రము మా క్రీస్తుకే

ప్రయాసే లేదుగా – యేసే తోడుగా
మాతో నడువగా – భయమే లేదుగా ||స్తుతి||

క్రీస్తుని వేడగా – మార్గం తానేగా
సత్యం రూఢిగా – జీవం నీయగా ||స్తుతి||

ఆరాధన వర్తమానము

మన దేవుడు మంచివాడు, అన్ని సమయములలోనూ మంచివాడుగా ఉన్నాడు. “ఆపత్కాలమున తన పర్ణశాలలో ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణ దుర్గము – నేను ఎవరికి వెరతును నా చేయి విడువని దేవుడుండగా – నేను భయపడను”. అనే స్తోత్రగీతము మనము పాడి స్తుతించాము. ఆ మాటలు సత్యము అని విశ్వసించి స్తుతించిన ప్రతీవాని జీవితములో అపవాదికి ఓటమే! నీ దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు.

యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. -కీర్తనలు 92:1-2

దేవుని సూపర్ నేచురల్ శక్తిని అనుభవించాలి అంటే, దేవునిని యదార్థముగా వెంబడించాలి. యదార్థత లేకుండా మనము ఆయనను రుచిచూడలేము. దేవుని విశ్వాస్యత నీవున్న ప్రతీ శ్రమలోనూ స్థిరపరచబడుతుంది.

పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు. -కీర్తనలు 92:6

ఈ పశుప్రాయులు “దేవుడు చేస్తున్న కార్యములను” గ్రహించలేరు. పశువు అనగా జ్ఞానము లేనిది. దేవుని జ్ఞానము లేనివారు అటువలే ఆయన చేయు కార్యములను గ్రహించలేనివారుగా ఉంటారు. అలాగే వివేచన లేని వారుకూడా ఆయన కార్యములను గ్రహించలేనివారుగా ఉంటారు. అయితే దేవుని సన్నిధిలో పూర్ణ సంతోషము ఉన్నది.

యెహోవా మందిరములో నాటబడినవారైవారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతు డనియు ఆయనయందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు. -కీర్తనలు 92:13-15

ముసలితనము అనగా ఏ మాత్రము బలములేని, ఫలించలేని స్థితి. అయినప్పటికీ దేవుడు యదార్థవంతుడు అని ప్రచురము చేయబడటానికి అటువంటి స్థితిలో కూడా దేవుని శక్తి బలము కనపరచబడుతుంది. దేవుని మహిమ వెల్లడిపరచబడటానికే నీ జీవితము ఉంది. అందుకే దేవుని స్తుతించుట మంచిది.

ఆరాధన గీతము

ఆపత్కాలమున తన పర్ణశాలలో
ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను
తన గుడారపు మాటున నన్ను దాచెను
ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను

యెహోవా నా ప్రాణ దుర్గము – నేను ఎవరికి వెరతును
నా చేయి విడువని దేవుడుండగా – నేను భయపడను

ఇహలోక దుఃఖ బాధలలో – నీవు నాతో ఉన్నావు
ముదిమి వచ్చువరకు – నన్ను ఎత్తుకొనే దేవుడవు
నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు
నిత్యము నీ పై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్
ఆ … హల్లెలూయ …. హల్లెలూయ

లెక్కించలేని అద్భుతములు – మక్కువతో చేసిన దేవా
నీవు చేసిన కార్యములకై – నేను ఏమి అర్పింతును
స్వచ్ఛమైన నిత్య ప్రేమను – నాపై చూపినదేవుడవు
కోట్ల కొలది స్తోత్రములు – నిరతము నీకే ప్రభువా
ఆ … హల్లెలూయ …. హల్లెలూయ

వారము కొరకైన వాక్యము

ఆత్మీయ జీవితము ప్రకటించుటపైనే ఆధారపడి ఉంటుంది. ఎలా అంటే, “మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును – రోమా 10:10”. అలా నోటితో ఒప్పుకొనుట ద్వారా మన ఆత్మీయ జీవితము ప్రారంభించబడింది అలాగే నోటితో ఒప్పుకొనుట ద్వారా, ప్రకటించుట ద్వారా మన ఆత్మీయ జీవితము కొనసాగుతుంది.

దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు . సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని౹ యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.౹ -అపొస్తలుల కార్యములు 12:1-2
స్తెఫను విషయములో కలిగినశ్రమనుబట్టి చెదరి పోయినవారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక, ఫేనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశములవరకు సంచరించిరి.౹ -అపొస్తలుల కార్యములు 11:19

స్తెఫను, మరియు యాకోబులను చంపివేసారు. ఇప్పుడు పేతురును కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే,

పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.౹ హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికులమధ్య నిద్రించు చుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి.౹ -అపొస్తలుల కార్యములు 12:5-6

వాక్యము సత్యము. హేరోదు పేతురును ఉదయాన చంపడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ఆ ముందురోజు రాత్రే దేవుని కార్యము పేతురు జీవితములో జరిగింది. ఎందుకంటే, సంఘము యొక్క ఆసక్తికలిగిన ప్రార్థన రేపు జరగబోయే నష్టాన్ని రాత్రికి రాత్రే మార్చివేసింది.

ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి–త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతనిచేతులనుండి ఊడిపడెను.౹ -అపొస్తలుల కార్యములు 12:7

మన సంఘ కాపరి జీవితములో కూడా శ్రమ వెంబడి శ్రమ ఆయనపై యుద్ధమువలే వచ్చుచుండగా, సంఘమంతా చేసిన ప్రార్థన గొప్ప కార్యము జరిగించి ఆయన పరిచర్యలో ఎంతో సహాయకరముగా స్థిరపరచబడింది. ప్రార్థనకు స్థితిని మార్చగలిగే శక్తి ఉంది, ఆమేన్. నీ ప్రార్థన వ్యర్థము కాదు – ఆమేన్. నీ ప్రార్థనకు శక్తి ఉంది.

సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించు టయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి౹ యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనినయెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజములవారికి పత్రికలిమ్మని అడిగెను.౹ అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చి నప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను. అప్పుడతడు నేలమీదపడి –సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.౹ -అపొస్తలుల కార్యములు 9:1-4

తన ప్రయణములో అనేకమైన ఊళ్ళు దాటి సౌలు ప్రయాణించాడు. అయితే ఆ ఊళ్ళలో ఉన్నప్పుడు ఏమీ జరగలేదు. అయితే దమస్కులో అడుగుపెట్టగానే, ఒక ఆశ్చర్యకార్యము జరిగింది. అయితే ఎందుకు దమస్కులోనే జరిగింది? అని ఆలోచిస్తే! దమస్కులో ఒక ప్రార్థనా పరుడైన ఒక మనుష్యుడు ఉన్నాడు.

దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు–అననీయా, అని అతనిని పిలువగా౹ -అపొస్తలుల కార్యములు 9:10

అననీయ ప్రార్థనాపరుడు గనుక దేవుని దర్శనము కలిగి దేవుని నుండి సంగతి తెలియచేయబడినవాడుగా ఉన్నాడు. మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ఖచ్చితముగా జవాబు ఇస్తాడు. అననీయ ప్రార్థన సౌలు ద్వారా వచ్చిన మరణమును నివారించింది. మన ప్రార్థన కూడా మరణ ప్రభావమును నిరోధించగలిన శక్తి కలది.

అతడు–ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు–నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థనచేయుచున్నాడు.౹ -అపొస్తలుల కార్యములు 9:11

దమస్కులో అననీయ చేసిన ప్రార్థన జరగబోయే మరణమునుండి అక్కడి విశ్వాసులందరినీ రక్షించింది. సంఘము ఆసక్తిగా చేసిన ప్రార్థన పేతురును చెరసాలనుండి విడిపించింది. అలాగే నీవు ఆసక్తి కలిగి చేసే ప్రార్థన పరలోకమును కదిలిస్తుంది. దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు.

గుర్తొచ్చినప్పుడు చేసేది ప్రార్థన కాదు కానీ ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో చేసేదే నిజమైన ప్రార్థన.