26-01-2025 – ఆదివారం రెండవ ఆరాధన – ఒకటి చేయుచున్నాను

ఆరాధన వర్తమానము

మన దేవుడు మంచి దేవుడు మరియు తన బిడ్డలను ఆదరించేవాడు, అక్కున చేర్చుకొనేవాడు. చాలా సందర్భాలలో మనము వెళుతున్న పరిస్థితులను బట్టి దేవుడు మనలను విడిచిపెట్టేసాడేమో అని అనిపిస్తుంది. అయితే మన దేవ దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. నిత్యము ఆయన మనలను భద్రపరచేవాడు, మన పక్షమున నిలిచేవాడు అయి ఉన్నాడు.

అయితే సీయోను–యెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. -యెషయా 49:14

అసలు మన ప్రభువు మనలను విడిచిపెట్టడము అనేది జరగనే జరగదు. నిన్ను సృష్టించిన దేవుడు తాను నీ యెడల ఒక చిత్తాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే మధ్యలో అపవాది దేవుని దగ్గరనుండి మనుష్యులను దూరము చేసినప్పటికీ, దేవుడు వారిని విడిచిపెట్టలేదు కానీ, తాను ప్రేమించిన మనుష్యులను తిరిగి తన వద్దకు చేర్చుకోవడానికి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకములోనికి పంపించాడు. గనుక ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు అనే సంగతి నీవు గ్రహించాలి.

మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు –నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను. -యెషయా 57:15

నలిగిపోయిన వారిని ఉజ్జీవింపచేసి, తిరిగి నిలబెట్టడానికి ఆయన వారి యొద్దకు వచ్చి నివాసము చేసే దేవుడిగా ఉన్నాడు. మన పితరులు ఫరో వద్ద కఠినమైన బాధలు, శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, వారిని విడిచిపెట్టక, అబ్రహాముతో చేసిన వాగ్దానము నిమిత్తమై, తన బిడ్డలనందరినీ విడిపించడానికి దిగి వచ్చినవాడుగా ఉన్నాడు.

నీవు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు గానీ, ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఉజ్జీవింపచేసేవాడుగా ఉన్నాడు. నీవు నేను ఈ భూలోకములో ఉన్నాము అంటేనే ఆయన చిత్తము నెరవేర్చబడటానికే అని మనము గ్రహించాలి. ఈ లోకములో ఉన్నదంతా అపవాదికి సంబంధించినదిగా ఉంది. అయితే అటువంటి లోకములో నీ ద్వారా తన చిత్తమును నెరవేర్చడానికి నిన్న్ను సజీవుల లెక్కలో ఉంచాడు.

ఇశ్రాయేలీయుల శ్రమ దినములలో దేవుడు చేసిన వాగ్దానము వారిని పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి వారిని తీసుకుని వెళతాను అనే! ఇప్పుడు నీవు దుఃఖములో ఉన్నా సరే నీ దుఃఖమును సంతోషముగా మారుస్తాడు. ఇశ్రాయేలీయుల పరిస్థితిలో విడిపించడానికి మోషేను ఏర్పరుచుకుని, సిద్ధపరచి, సంతోషముగా వారి స్థితిని మార్చాడు. ఆలాగే నీ పరిస్థితిలో కూడా నిన్ను విడిపించడానికి, అవసరమైన మార్గమును ఏర్పరచి, సిద్ధపరచి నీ వద్దకు పంపేవాడుగా ఉన్నాడు.

స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. -యెషయా 49:15

నీవు దేవుని సొత్తు ఆయన ప్రజ నీవు గనుక నిన్ను మరిచిపోయే అవకాశమే లేదు. ఈ లోకములో తల్లి మరిచినా సరే నీ దేవుడు మాత్రము నిన్ను మర్చిపోడు. నీవున్న స్థితిలోనే నీవు ఉండిపోవు, నీ స్థితి మార్చబడుతుంది.

చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి -యెషయా 49:16

సీయోను అంటే మనమే, ప్రాకారము అంటే మన జీవితమే. మన జీవితములో ఏ పరిస్థితి గుండా మనము వెళుతున్నామో, ఏ బాధ నీవు పడుతున్నావో, ఎందుకు కన్నీరు విడిస్తున్నావో అన్నీ ఎరిగినవాడు, చూసేవాడు. మరువని, విడువని నీ దేవుడు ఏమి చేస్తాడు?

యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలెనగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును -యెషయా 51:3

విడువని, మరువని నీ దేవుడు ఆదరించేవాడుగా ఉన్నాడు. అరణ్యములో చూస్తే, ఏమీ దొరకదు ఏ సహాయము అందదు. అయితే అటువంటి జీవితమును ఏదేను తోటవలే చేసేవాడుగా ఉన్నాడు. ఏదేను తోట అంటే దేవుని చేత సిద్ధపరచి నిత్యము ఫలించే తోట, అంటే నీ జీవితము కొరకు సిద్ధపరచిన సమస్తము నీవు అనుభవించే జీవితము అని అర్థము.

నీ ధైర్యము ఏమిటి అంటే, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, నీ యెడల ఆయన చిత్తమును కలిగి ఉన్నాడు. నీవున్న పరిస్థితిలో ఇంతవరకు నిన్ను నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎగతాళి చేస్తున్నారేమో, నిందవేసేవారిగా ఉన్నరేమో, అయితే ఈ దినము నీ దేవుడు, నిన్ను విడువని మరువని నీ దేవుడు, నిన్ను ఆశీర్వాదముగా మార్చేవాడుగా ఉన్నాడు, సమస్తము నీకు అనుగ్రహించి నీ సాక్ష్యము మార్చేవాడుగా ఉన్నాడు.

నీ గురించి లోకము ఏమి నెగటివ్ గా మాట్లాడుకున్న ఇప్పుడు ఆ మాట మార్చబడుతుంది. ఇప్పుడు నీవు ఖాళీగా ఉన్నాసరే, నీ గిన్నె ఇప్పుడు నిండి పొర్లిపోయేదిగా ఉంటుంది. వారి కన్నుల యెదుట నిన్ను గొప్ప చేయడము మొదలు పెడుతున్నాడు.

బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను.౹ -జెకర్యా 9:12

బంధించబడిన స్థితిలో ఉన్నా సరే, నీవు నిరీక్షణ కలిగి ఉన్నట్టయితే, మరలా మీ కోటలో ప్రవేశించండి. రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అని నీ ప్రభువు నీతో చెప్పుచున్నాడు.

నీవున్న నెగటివ్ పరిస్థితిలో నీవు నీ దేవునిని బట్టి నిరీక్షణ కోల్పోక నీవు నిలిచి ఉంటే, మరలా నీ కోట అయిన నీ దేవుని సన్నిధిలో ప్రవేశించు.

మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ -యోహాను 16:20
అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు.౹ -యోహాను 16:22

ఇప్పుడు నీవున్న పరిస్థితిలో నీవు దుఃఖిస్తున్నావు, మరియు లోకము నీ దుఃఖముచూసి సంతోషిస్తుంది. అయితే నీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది, అప్పుడు నీవు పొందిన సంతోషమును ఎవరూ నీ వద్దనుండి తీసివేయలేడు.

“ఇప్పుడు ఎవరూ నీ వద్దనుండి తీసివేయలేడు” అంటే ఇంతకుముందు ఎవరో దానిని తీసివేయగలిగాడు అనే కదా అర్థము? అయితే నీవు మరలా కోటలో ప్రవేశిస్తే, మరలా నిన్ను నీ దేవుడు చూస్తాను అని చెప్పుచున్నాడు. అప్పుడు నీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. ఆ సంతోషమును ఎవరూ నీ యొద్దనుండి తీసివేయలేడు.

ఈ దినము దేవుడు తన వాక్యము అనే విత్తనములు విత్తాడు. నీ హృదయము మంచి నేలగా ఉంటే, అనగా విశ్వాసము కలిగినదిగా ఉంటే, అప్పుడు ఆ విత్తనము నూరంతలుగా ఫలిస్తుంది.

ఆరాధన గీతము

స్థితిగతులన్నిటినీ మార్చువాడా
జీవితాలన్నిటినీ కట్టువాడా
యేసూ నీ సన్నిధిలో సాధ్యం
సమస్తము నీ సన్నిధిలో సాధ్యం

సమస్తము సాధ్యం
నీ యందే నా విశ్వాసం

దేవా నీకే నా స్తుతి పాడెదన్

నాలో ధైర్యం లేనపుడు, బలపరచే వాక్యము ఇస్తాడు, కోల్పోయినవాటన్నటినీ తిరిగి రెండంతలుగా దీవిస్తాడు. నా యేసు నాతో ఉన్నాడు, నా యేసు నన్ను విడువడు.

ఎవరూ లేని చోటలో, ఉంటాడు నా ప్రక్కనే! కనుమేర ఎవరూ లేనప్పుడు, కన్నులు మూస్తే కనిపిస్తాడు నా యేసు నాతో ఉన్నాడు, నా యేసు నన్ను విడువడు. నాతో ఉన్నాడు, నన్ను విడువడు

వారము కొరకైన వాక్యము

ప్రభువు నమ్మ దగిన వాడు, ఆయన నమ్ముకోదగినవాడు. ఈ 2025 ప్రభువు మహిమ కొరకు సిద్ధపరిచే సంవత్సరము. మనము ఆత్మీయమైన జీవితము బలముగా ఉండాలి. దేవుడు కోరుకొనేది ఏమిటి అంటే, నీవు బలముగా ఉండాలి, నిన్ను బట్టి మరికొంతమంది బలపడాలి.

యవ్వనస్థులు దేవుని చేతిలో బలమైన బాణములుగా ఉన్నారు. బాణము అంటేనే శత్రువును ఓడించడానికి వాడబడేది. నీవు ఆత్మీయముగా బలముగా ఉంటావో, అప్పుడు నీ ద్వారానే అపవాది ప్రయత్నములన్నీ లయపరచడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు.

మనము దేవుని ఉద్దేశ్యములను గ్రహించేవారిగా ఉండాలి. నిన్ను సిద్ధపరచుకొని తన మహిమ కొరకు నిన్ను వాడుకొనేవాడిగా ఉన్నాడు. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడతాడు. మన జీవితములో అనేకమైనవాటిని పొందుకోవడానికి సిద్ధపడతాము.

శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతోకూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.౹ -1 తిమోతికి 4:8

నీవు శరీర సంబంధమైన దానికంటే ఆత్మీయముగా నీవు సాధన చేస్తే, దానికొరకు నీవు పాటుపడితే, నీవు ఆశించినదానిని పొందుకొనే విధానములో నిన్ను సిద్ధపరుస్తుంది.

సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు౹ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.౹ -ఫిలిప్పీయులకు 3:13-14

పౌలు తన అనుభవములో చెప్పుచున్న మాటలు ఇవి. వెనుక ఉన్నవి మరచిపోయి, గురి వద్దకే పరిగెడుతున్నాను అని చెప్పుచున్నాడు. వెనుక అంటే నీ గతమే! నీ గతము నిన్ను వెనుకకు లాగేదిగా ఉంటుంది, గనుక నీ గతమును మరచిపోవాలి. మన గతమును చూస్తే, అది ప్రభువుకు వ్యతిరేకముగా ఉంటుంది, అది దేవునికి మహిమకరము కానివే. దేవునికి సంబంధిన సమస్తము ముందుకే గానీ, వెనుకకు కాదు. నీ గతము ముగించబడినది గనుక, దానిని మరచి, నీ కొరకు సిద్ధపరచబడిన వాగ్దానము కొరకు గురి కలిగి జీవించాలి.

ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దగ్గర ఉండి, ఐగుప్తును జ్ఞాపకము చేసుకొంటున్నారు. అయితే ప్రభువు ఈరోజు చెప్పుచున్న మాట, ముందుకు సాగిపో! నీ గతమును జ్ఞాపకము చేసుకోవడము వలన ప్రయోజనము ఏమీ లేదు గానీ, నీ ముందున్న, ప్రభువు సిద్ధపరచిన వాగ్దానముతో కూడిన దానిని గమనించు.

క్రీస్తునందు కలుగు బహుమానము – నీకు దేవుడు చేసిన వాగ్దానము అయినా సరే, దేవుడు ఇచ్చే ఆశీర్వాదము అయినా సరే, అది క్రీస్తునందు బహుమానమే. దానిని నీవు పొందుకోవాలి అంటే వెనుకున్నవి మరచి, ముందుకే నిరీక్షణ కలిగి సాగిపోవాలి.

దేవుడే నా జీవితములో కార్యము చేస్తాడు అని నమ్ముతున్నారో, వారు స్వాస్థ్యము పొందుకొనేవారుగా ఉంటారు. నీ స్వాస్థ్యము దీవించబడేదిగా ఉంటుంది. గనుక నీ బహుమానము అనేది ఖచ్చితము.

బహుమానము అనేది ప్రేమించి ఇచ్చేదిగా ఉంది. దేవుడు మనలను ప్రేమించాడు గనుకనే, యేసు క్రీస్తును బహుమానముగా ఇచ్చాడు. తద్వారా ఆయన తన ప్రేమను కనపరచారు. నీవు ఈ దినము ఆయన మాటకు లోబడినందున బహుమానము నీవు పొందుకుంటావు. ఆ బహుమానము దేవుని ఆశీర్వాదమే!

నా గొర్రెలు నా స్వరమును వినును, అవి నన్ను వెంబడించును. ఆ కాపరి ఎక్కడికి నడిపిస్తాడు అంటే, పచ్చిక గల చోట్లకే. నీ జీవితములో ఇంతవరకు కనబడని ఫలింపు ఇప్పుడు కనబడుతుంది. సమాధానకరమైన స్థితిని ప్రభువు నీకు కలుగచేసేవాడుగా ఉన్నాడు.

నీ గతమును మరచి, వేగిరపడి నీ దేవుని కోటలోనికి మరలా ప్రవేశించు. శరీరసంబంధమైనదానిని విడిచి, ఆత్మీయముగా సిద్ధపడాలి. ఈ ఒక్కటే నీవు చేయవలసినది.

నీవు ఆత్మీయముగా కాక, శరీర సంబంధమైన దానికొరకే వేగిర పడితే, నీవు కలిగినది కూడా నీ వద్దనుండి తీసివేయబడుతుంది గనుక జాగ్రత్త పడదాము.

నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మానలేదు. -లూకా 7:45

ఈ స్త్రీ ఒకటి చేస్తుంది. ప్రభువు లోపలికి వచ్చిననాటనుండి ఆమె ముద్దుపెట్టుకొనుట మానలేదు. ముద్దు పెట్టుకొనుట అనేది సహవాసమును సూచిస్తుంది. రక్షణలో ప్రవేశించిన నాటనుండి ప్రభువుతో సహవాసము కలిగి ఉండుట మానకూడదు.