స్తోత్రగీతము – 1
ఎన్నెన్నో మేళ్లను జేసితివే
ఎటుల స్తోత్రించేదన్
నేనెటుల స్తోత్రించెదన్
నాదు రాజా నీకేస్తోత్రం
దీనుడైయుంటిన్ దయతో దలచితి
దేవర నిన్ను స్తుతింతున్
“ఎన్నెన్నో”
బలహీనడనుచు – త్రోయక నన్ను
బలమిచ్చి బ్రోచితివే
“ఎన్నెన్నో”
పాపముచేత మృతిబొందియుంటిన్
కృపచే రక్షించితివి
“ఎన్నెన్నో”
నాకై మరణించి, నాకై బ్రతికితి
మరల నాకై వత్తు
“ఎన్నెన్నో”
స్తోత్రగీతము – 2
వేటగాని ఉరిలో నుండి
నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద
నాకు ఆశ్రయమిచ్చావు (2)
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా శృంగమా నా కేడెమా
ఆరాధన ఆరాధన
నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన
నా యేసు నీకే ఆరాధన (2)
రాత్రి వేళ భయముకైననూ
పగటి వేళ బాణమైననూ
రోగము నన్నేమి చేయదు
నా గుడారము సమీపించదు (2)
||లేనే లేదయ్యా||
వేయిమంది పడిపోయినా
పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు
నా గుడారము సమీపించదు (2)
||లేనే లేదయ్యా||
మానవుల కాపాడుటకు
నీ దూతలను ఏర్పరచావు
రాయి తగులకుండా
ఎత్తి నన్ను పట్టుకున్నావు (2)
||లేనే లేదయ్యా||
స్తోత్రగీతము – 3
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4)
యేసయ్యా నీవే నా రక్షకుడవు
యేసయ్యా నీవే నా సృష్టికర్తవు
దరి చేర్చి ఆదరించుమా
ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా
వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు
ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు
హాల్లేలూయా ఆమెన్
ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా
పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి
సర్వాధికారివి.. ఓ యేసయ్యా (2)
కరుణించి కాపాడుమా
ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2)
||హల్లెలూయా||
స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్
కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా (2)
కృప చూపి నడిపించుమా
ఓ యేసయ్యా.. కృప చూపి నడిపించుమా (2)
||హల్లెలూయా||
ఆరాధన వర్తమానము
ఈ దినము పరిశుద్ధపరచబడే దినము. ఈ దినము దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, దేవుఇని వాక్యము చేత, ఉదక స్నానము చేయిచబడతాము. ఈ లోకము అనేక రకములైన మాలిన్యములతో కూడి ఉంటుంది. మన శరీరమునకు పట్టిన మాలిన్యములను సబ్బుతో స్నానము చేసి శుభ్రపరచుకుంటాము అయితే ఆత్మకు పట్టిన కల్మషమును దేవుని వాక్యము చే మాత్రమే శుభ్రపరచుకోగలము.
నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.౹ -1 పేతురు 1:14
నా తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడు గనుక నేనును పరిశుద్ధుడనై ఉందును. అని మనము కూడా మనలను సిద్ధపరచుకోవాలి. ఒకవేళ దేవుడు కోరుకొనే పరిశుద్ధత మనలో లేని యెడల, మనము నాశనము అయిపోతాము. అందుకే దేవుడు తన ప్రేమ చేత, ఆయన సన్నిధికి తీసుకువచ్చి, మనలను తన వాక్యము చేత పరిశుద్ధపరుస్తాడు. మన దేవుడు పరలోకములో మాత్రమే కాదు గానీ భూమి మీద కూడా పరిశుద్ధుడే! దేవుని ఎరగనప్పుడు బలహీనతలతో మన జీవితము కొనసాగించబడింది. మనము ఎంతగా నిలబడదాము అని ప్రయత్నించినా, నిలబడలేని పరిస్థితిలో మనము ఉంటాము. అయితే ఒకసారి దేవునిని ఎరిగినతరువాత, అంగీకరించిన తరువాత మనము నిలబడటానికి ఆయనే సహాయము చేసేవాడుగా ఉంటాడు గనుక మనము నిలబడలేము అని గనుక అంటే, ఆయనను అబద్ధికునిగా చేసేవారుగా అయిపోతాము. దీనికొరకు మన శరీరములు ఆయన ఆలయము అయి ఉన్నది అనే సంగతి జ్ఞాపకము పెట్టుకోవాలి. ఆయన పరిశుద్ధ స్థలములలోనే నివసించేవాడుగా ఉన్నాడు. కేవలము క్రైస్తవులము, ఆదివారము చర్చ్ కి వెళ్ళేవారుగా ఉండుటను బట్టి పరిశుద్ధుడవు కాలేవు, కానీ, నీ అంతరాత్మ ప్రేరేపించే గద్దింపును పట్టించుకోకుండా అపవాది ప్రేరేపిత కార్యమును కొనసాగించినట్టయితే పాపమును కూడగట్టుకుని మరణమును పొందుతాము.
యెషయా చూసినప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుడు కొనియాడబడుతున్నాడు. యోహాను చూసినప్పుడు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుడు కొనియాడబడుతున్నాడు. ఇప్పుడు మన సమయము, అయితే మనము పరిశుద్ధత లేకుండ ఎంతగా మనము పలికినా అది వ్యర్థమే.
రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.౹ ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.౹ వారు–సైన్యములకధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.౹ వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమముచేత నిండగా నేను–అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనులమధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.౹ అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి –ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను.౹ -యెషయా 6:1-7
యెషయా యొక్క అపరిశుద్ధతను ఆ నిప్పు చేత తొలగించి ఆయనను పరిశుద్ధినిగా చేసినతరువాతనే ఆ దేవుని పరిశుద్ధ సన్నిధిలో నిలువగలిగాడు. అందుకే మనము కూడ, దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చాము. మన స్తుతికి ఆయనే అర్హుడు. అందుకే ఆయనను స్తుతించాలి అంటే పరిశుద్ధత లేకుండా చేయలేము. అందుకే ఆయన సన్నిధిలో, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను పవిత్రపరచు అని నీవు అడుగుతావో, అప్పుడు ఖచ్చితముగా ఆయన క్షమించేవాడుగా ఉంటాడు. అయితే పాపముగా ఒప్పుకొన్నదానికి విడిచిపెట్టి మరలా ఇంక దానిని చేయకూడదు. అలాకాని యెడల మనము వర్థిల్లము. అయితే మనము దేవుని పిల్లలు గనుక మనము ఫలించెడి కొమ్మగా మనము ఉందాము. ఉదాహరణకు చెరువులోని తామర మొక్కను చూస్తే, అది ఉన్నదంతా బురద అయితే ఆ బురద మధ్యలో ఎంతో సుందరముగా కనబడుతుంది. అదేవిధముగా భూలోకముకూడా పాపమనే బురదగా ఉంది. అటువంటి లోకములో మనము తామరపువ్వు వలే అందముగా సాక్ష్యకరముగా ఉండాలి అని దేవుని కోరిక. దేవునికి కావలసినది నీ పెదాలనుండి వచ్చే పాటలు కాని, హృదయాంతరంగముల నుండి వచ్చే నిజాయితీ గలిగిన మాటలు. ఈ సత్యము గ్రహించినట్టయితే, గత వారమంతా మనము గడిపిన విధానమును జ్ఞాపకము చేసికొని, ఎక్కడైతే మనము తప్పిపోయామో అక్కడ ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని క్షమాపణ పొందుకుని సిద్ధపడి ఆయనను ఆరాధిద్దాము.
సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.౹ -యెషయా 6:3. మరి దేవుని మహిమ ఎవరికి అనుగ్రహించబడేదిగా ఉంది?
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.౹ -రోమా 3:23
పాపాన్ని బట్టి దేవుని మహిమ పొందలేకపోతున్నాము. మరి పరిశుద్ధులుగా ఉంటే దేవుని మహిమను పొందుకోగలన్ము. మరి అటువంటి విధానములో మనము సిద్ధపడి ఆరాధిద్దాము.
ఆరాధన గీతము
గొర్రెపిల్ల రక్తములో
కడుగబడినవారే పరిశుద్ధులు (2)
పరిశుద్ధుడా యేసయ్యా..
నను శుద్ధి చేయుమయా (2)
నను శుద్ధి చేయుమయా
||గొర్రెపిల్ల||
ఆకాశము ఈ భూమియు
గతియించినా గతియించవు నీ మాటలు (2)
శాశ్వతమైనది నీ రాజ్యము (2)
ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా
||గొర్రెపిల్ల||
వేవేళ దూతలు అనునిత్యము
కొనియాడుచున్న ఆ పరలోకము నీ సింహాసనం (2)
పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము (2)
ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా
||గొర్రెపిల్ల||
మెయిన్ మెసేజ్
ఈరోజు “విశ్వాసములో నిలబడటానికి ఏమి చెయ్యాలి” అని విషయమును గూర్చి మనము తెలుసుకుందాము.
మనము ఈ భూలోకమును విడిచిపెడతామో మనకు తెలియదు గనుక ఉన్న సమయమును మనము సద్వినియోగము చేసుకోవాలి. ఎన్నిసార్లు గద్దించినను లోబడనివారికి అకస్మాత్తుగా మరణము సంభవించును. మనము దేవుని పిల్లలము ఆయన ప్రేమను అనుభవించవలసిన వారము గనుక మనము సమస్తమును చక్కరపచుకొని, సిద్ధపరచుకుందాము.
ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా– నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.౹ -గలతీయులకు 3:11
లోకములో ఆక్సిజన్ ప్రాణవాయువుగా ఉంది. అలాగే మన ఆత్మీయ జీవితమునకు విశ్వాసము ప్రాణవాయువుగా ఉంటుంది. ఈ విశ్వాసములో నిలబడాలి అంటే ఎలా నిలబడగలుగుతాము? మనము విశ్వాసముంది అని చెప్పినప్పటికీ, సరైన సమయములో విశ్వాసముతో నిలబడలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతాము. అయితే మనలను జీవింపచేయాలి అనేది ప్రభువు యొక్క ఉద్దేశ్యము. విశ్వాసము కలిగినవారు దేవుడు వారికొరకు సిద్ధపరచిన సమస్తమును పొందుకుంటారు. అయితే మన విశ్వాసము మనము వెళ్ళే పరిస్థితులలో ఎలా నిలువగలుగుతుంది?
మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.౹ -1 కొరింథీయులకు 2:4
మన విశ్వాసమునకు ఆధారము ఏమిటి అని అర్థము చేసుకోవడానికి ఈ రెండు విషయాలు జ్ఞాపకము పెట్టుకోవాలి.
1. మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకోకూడదు.
2. దేవుని శక్తిని మాత్రమే ఆధారము చేసికొని యుండవలెను
మన విశ్వాసము నిలకడగా ఉండాలి అంటే దేవుని శక్తినే ఆధారము చేసుకొని ఉండాలి. అబ్రహాము జీవితము ద్వారా కొన్ని సంగతులు ఈ విషయమై నేర్చుకుందాము.
ఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన–అబ్రా హామా, అనిపిలువగా అతడు–చిత్తము ప్రభువా అనెను.౹ -ఆదికాండము 22:1
అబ్రహామును పిలిచిన తరువాత దేవుడు వాగ్దానమును ఇచ్చి నడిపించాడు. ఇలా అనేకమైన కార్యములు అబ్రహామునకు నేర్పినతరువాత, తన విశ్వాసమునకు ఒక పరీక్ష పెట్టబడింది. మన జీవితంలో కూడా మన విశ్వాసమునకు ఖచ్చితముగా పరీక్ష ఉంటుంది.
అప్పుడాయన–నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను.౹ -ఆదికాండము 22:2
అబ్రహాము ఎలా నిలబడ్డాడు అనేది గ్రహించడము అనేది మన ఉద్దేశ్యము. అబ్రహామా అని పిలిచినప్పుడు “చిత్తము ప్రభువా” అని లోబడ్డాడు. అలాగే నీ కుమారుని బలిగా ఇవ్వు అని చెప్పినప్పుడు సహితము, “చిత్తము ప్రభువా” అనే ఆటిట్యూడ్ చూపించగలిగాడు. మరొకలా చూస్తే, తాను పోగొట్టుకొనే పరిస్థితిలో కూడా తాను విశ్వాసముపై నిలబడగలిగాడు. దానికి కారణము, తాను “దేవుని శక్తి” పైనే ఆధారపడి ఉన్నాడు గనుక. ఈ కార్యములన్నీ గమనించినప్పుడు అబ్రహాము ఎక్కడా కూడా బాధపడినట్టు గానీ, రోదించినట్టు గానీ మనము చూడము. ఇస్సాకు పుట్టక మునుపే దేవుని శక్తి ఏమై ఉన్నదో ఆయన ఎరిగి ఉన్నాడు గనుక, ఇస్సాకును అర్పించవలసి వచ్చినప్పుడు కూడా కలవరపడలేదు.
అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, –ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై, తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.౹ -హెబ్రీయులకు 11:17
“మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై” తన విశ్వాసములో నిలబడగలిగినాడు. మనము కూడా అదేవిధముగా ఉండాలి. మన పరిస్థితులలో దేవుని శక్తిని గ్రహించగలిగిన వారుగా మనము ఉండాలి. మన ఆత్మను బలముగా ఉంచుకున్నప్పుడే మనము నిలబడగలుతాము. దేవుని వాక్యమును బట్టియే మన ఆత్మ బలపడుతుంది.
తన పనివారితో–మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి -ఆదికాండము 22:5
ఇక్కడ ఆదాము మృతులను సహితము లేపగలిగినవాడు అని నమ్మినవాడై, వారితో వారిద్దరునూ తిరిగివచ్చెదము పనివారితో చెప్పగలిగాడు.
ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో–నా తండ్రీ అనిపిలిచెను; అందుకతడు–ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు–నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱెపిల్ల ఏది అని అడుగగా అబ్రాహాము–నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను.౹ -ఆదికాండము 22:7-8
ఎంతో కష్టతరమైన ఈ సందర్భములో కూడా దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగినవాడై నిలబడగలిగాడు.
రెండవదిగా, మనము విశ్వాసములో నిలకడగా ఉండటానికి మరొక ఆధారము దేవుని మాట.
యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి –ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.౹ మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి–నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి–నీ సంతానము ఆలాగవునని చెప్పెను.౹ అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.౹ -ఆదికాండము 15:4-6
తనకి పుట్టిన ఇస్సాకు ద్వారానే తన సంతానము ఆశీర్వదించబడుతుంది అని దేవుని మాటగా అబ్రహాము నమ్మినవాడై ఉన్నాడు. ఒకవేళ ఇస్సాకును బలిగా ఇచ్చినప్పుడు మరి తనకు ఇచ్చిన వాగ్దానము వ్యర్థమైపోవును కదా! అయితే, మరణించిన ఇస్సాకును తిరిగి జీవింపచేయువాడు అని అబ్రహాము దేవుని వాక్కును అనగా దేవుని వాక్యమును నమ్మగలిగాడు. తాను ఇస్సాకును పోగొట్టుకొనడు అని చెప్పగలిగాడు. మన జీవితములలో కూడా దేవుడు ఇచ్చిన మాటలు మనము మర్చిపోకూడదు. మన విశ్వాసమునకు ఆధారమైనది ఆ మాటలే.
మూడవదిగా, విశ్వాసములో నిలకడగా ఉండాలి అంటే, దేవుని చిత్తము ఏమిటి అని గ్రహించాలి.
ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.౹ -హెబ్రీయులకు 6:17
దేవుని శక్తి, దేవుని మాట, దేవుని చిత్తము మన విశ్వాసము నిలకడగా ఉండటానికి పునాది మరియు ఆధారము.