25-06-2023 – ఆదివారం రెండవ ఆరాధన – నా వెంబడి రండి

స్తోత్రగీతము – 1

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా
పరవశిస్తు ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా ॥2॥
చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా
యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా ॥2॥
॥ ప్రేమిస్తా॥

నను ప్రేమించీ భువికొచ్చినదీ ప్రేమా
నీ ప్రేమా
సిలువలో మరణించీ బలియైన ప్రేమా ॥2॥
ఆ ప్రేమా
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు }
నా జీవ మర్పింతు నీ సేవకు }॥2॥
॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥

కన్నీటిని తుడిచి ఓదార్చును ప్రేమా
నీ ప్రేమా
కరములు చాపి కౌగిట చేర్చును ప్రేమా ॥2॥
ఆ ప్రేమా
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు
నా జీవ మర్పింతు నీ సేవకు ॥2॥
॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥

నా స్థితి మార్చీ నను రక్షించెను నీ ప్రేమా
నీ ప్రేమా
నను దీవించీ హెచ్చించినదీ నీ ప్రేమా ॥2॥
నీ ప్రేమా
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు
నా జీవ మర్పింతు నీ సేవకు ॥2॥
॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥

స్తోత్రగీతము – 2

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని
గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని
నీ కీర్తిని నేను కొనియాడెదన్
హల్లెలూయా నా యేసునాథా
హల్లెలూయా నా ప్రాణనాథా (2)
||గొప్ప||

అద్భుత క్రియలు చేయువాడని
ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2)
అద్వితీయుడవని ఆదిసంభూతుడని
ఆరాధించెద నిత్యం నిన్ను (2)
||హల్లెలూయా||

సాగరాన్ని రెండుగా చేసినాడని
సాతాను శక్తులను ముంచినాడని (2)
సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని
సాక్ష్య గీతం నే పాడెదన్ (2)
||హల్లెలూయా||

స్తోత్రగీతము – 3

కీర్తి హల్లెలూయా
గానం యేసు నామం మధురమిదే
నిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2)

స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ గానము శ్రీ యేసుకే
స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ స్తోత్రము మా క్రీస్తుకే

ప్రయాసే లేదుగా – యేసే తోడుగా
మాతో నడువగా – భయమే లేదుగా
||స్తుతి||

క్రీస్తుని వేడగా – మార్గం తానేగా
సత్యం రూఢిగా – జీవం నీయగా
||స్తుతి||

ఆరాధన వర్తమానము

మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయనను నమ్ముకున్నవారిని సిగ్గుపడనీయని వాడు. ఎవరైతే సంపూర్ణమైన విశ్వాసము ఆయనయందు కనపరుస్తారో వారు ఎన్నటికిని సిగ్గుపడరు. మన జీవితములలో మన దేవుడు మహిమ పరచబడవలసినవాడు. ఈ లోకములో మనలను తన బిడ్డలనుగా చేసుకొనుటకు ఆయన ఇష్టము కలిగినవాడై మనలను వెతికినాడు. వెతికి రక్షించుకున్నాడు. తన కృపను మన యెడల విస్తరింపచేసి, ఆ కృపద్వారా మనలను రక్షించినాడు. ఈ కృప పొందిన మనము, ఆ దెవునికి మహిమకరముగా ఉన్నాము. కృప ఉన్నంతకాలము, మన జీవితాలు దేవునికి మహిమకరముగా మార్చబడతాయి. ఆయన నమ్మకత్వాన్ని మాటి మాటికీ కనపరస్తున్నాదు. మనము కలిగి ఉన్న పోరాటాలలో గానీ, మనము ఎదురుచూసే విషయాలలోను ఆయనను బట్టి కొంత దూరము నడిచేవారముగా ఉంటాము. అయితే ఒక విషయము మనము మర్చిపోకూడనిది ఏమిటంటే, “ఆ కృపను బట్టియే ఆ కార్యము ముగించబడేదిగా ఉంది”.

నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒకముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.౹ అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.౹ అందుకు–నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.౹ నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. -2 కొరింథీయులకు 12:7-10

పౌలుకు కలిగిన ముల్లు వంటి పరిస్థితిలో ఆయన వేడుకొన్నప్పుడు, నా కృప నీకు చాలును అని ప్రభువు చెప్తున్నాడు. ఏలయనగా, బలహీనతయందు, కృపను బట్టి, కృప ద్వారా దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది. కృప నీకు తోడుగా ఉన్నట్టయితే, తనను అడ్డుకొనగలిగినది ఏదీ లేదు అని పౌలు గ్రహించాడు గనుక, “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను” అని చెప్పగలుగుతున్నాడు. దేవుని కృపను పొందుకోవడానికి మనకు ఎటువంటి అర్హత లేదు. దేవుని ప్రేమ దేవుని కృపను పొందుకోవడానికి సహాయము చేసింది.

మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమునుబట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.౹ ణ్.ఆ ఆ సువార్తవిషయములో నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడనుగాను, బోధకుడనుగాను, నియమింపబడి తిని.౹ ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవు చున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.౹ -2 తిమోతికి 1:9-12

మన క్రియలను బట్టి కాక, ఆయన అనాది కాల సంకల్పమును బట్టి మనలను క్రీస్తునందు పిలుచుకున్నాడు. ఎవరి ద్వారా అయితే మనకు కృప అనుగ్రహించబడుతుందో, ఆయన మరణమును నిరర్థకము చేసి, జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను. పౌలు జీవితములో చూస్తే, ఏ ముల్లు వలన తను మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడో, ఆ పరిస్థితి దేవుని కృపను బట్టి నిరర్థకము చేయబడి, జీవకరమైన పరిస్థితిగా మార్చబడింది. ఈ సత్యము దావీదుకూడా ఎరిగినవాడై, తాను తప్పు చేసిన సందర్భములో, పరిశుద్ధాత్మను తీసివేయకుము, నీ కృపను దూరము చేయకుము అని వేడుకోగలిగాడు. దేవుని కృప మనతో ఉన్నంతకాలము మనము క్షేమము గా ఉంటాము. అయితే ఈ కృప ఎప్పుడు స్థిరపరచబడుతుంది?

నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.౹ -గలతీయులకు 2:20

క్రీస్తు మనలో నివాసముండునట్లుగా మనము మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. “నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును” అని ఆయనే చెప్పెను గదా!

ఆ సువార్తవిషయములో నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడనుగాను, బోధకుడనుగాను, నియమింపబడి తిని.౹ ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవుచున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.౹ -2 తిమోతికి 1:11-12

“నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను” అని పౌలు చెప్పినట్లు మనము కూడా చెప్పగలగాలి. దానికొరకు నీవు దేవుని కృపను ఎరిగినవడవై ఉండాలి. ఆవిధముగా నిలిచినవాడవై ఉన్నప్పుడు, దేవునికి నీవు అప్పగించిన ప్రతీదీ ఆయనే నెరవేర్చి సమకూర్చేవాడు. దేవుని కృపను బట్టియే మన జీవితములు ఇంతవరకు నడిపించబడుతూ వచ్చాయి. మనకు అర్హత లేనప్పటికీ మనలను వెతికినవాడైన మన దేవునిని స్తుతిద్దామా?

ఆరాధన గీతము

నాకు నీ కృప చాలును ప్రియుడా (2)
నాకు నీ కృప చాలును
శ్రమలతో నిండిన ఈ జీవితములో (2)
నాకు నీ కృప చాలును ప్రియుడా (2)
నాకు నీ కృప చాలును

నాథా నీ రాక ఆలస్యమైతే (2)
పడకుండ నిలబెట్టుము నన్ను
జారకుండ కాపాడుము (2) ||నాకు||

మరణ స్థితిలో నే సంచరించగ
నీదు కృపతో జీవింప చేసావు
బలహీనుడనై నేనుండగా
నా బలమంత నీవైతివే

పాము వలెను వివేకముగను
పావురమువలె నిష్కపటముగను (2) ||నాథా||

జంట లేని పావురము వలెను
మూల్గుచుంటిని నిను చేరుటకై (2) ||నాథా||

పాపిని నను కరుణించు దేవా
చేరి నిను నే స్తుతియించుచుంటిని (2) ||నాథా||

 

మెయిన్ మెసేజ్

పరలోకములో దేవుని నిర్ణయమును ఈ లోకములో మన జీవితములలో దేవుని కృపద్వారా జరిగించబడుతుంది.

ఈరోజు మనము “నా వెంబడి రండి” అనే మాటను గూర్చి నేర్చుకుందాము. “నా వెంబడి రండి” అని ఇక్కడ పిలుపు ఇవ్వబడింది. అయితే మనము ధ్యానించవలసినవి –

1. ఎవరు పిలిచారు?
2. ఎందుకు పిలిచారు?

ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. -మార్కు 1:16-18

ఇక్కడ పిలువబడినవారు జాలరులు. వారి వృత్తి వారు చేసుకుంటున్నపుడు, నా వెంబడి రండి అని యేసయ్య పిలిస్తున్నాడు. మరొక వాక్యములో కూడా ఒకసారి చూద్దాము.

సీమోను – ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాటచొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. -లూకా 5:5

వారిని పిలిచిన సందర్భము వట్టి సందర్భము కాదు గానీ, ప్రయాసముతో కూడిన సందర్భము. ప్రయాసము అంటే ఎటువంటి ప్రయాసము అయి ఉంటుంది? పేతురు చేపలు పట్టే విషయములో చూస్తే, మొదటి జాములో ప్రయత్నము ఫలించలేదు, రెండవ చేసిన జాములో ప్రయత్నములో ఏమి జరగలేదు, మూడవ జాములో ప్రయత్నము ఫలించలేదు. మన జీవితాలలో చూస్తే, ఎన్ని సార్లు ప్రయత్నించినా సరే ఏమీ ఫలించట్లేదు. మరొక విషయము చూస్తే, సాధారణముగా ఈ చేపలు రాత్రి సమయములో వస్తాయి అయినప్పటికీ ఆరోజున ఏమీ రాలేదు. మన జీవితాలలో చూస్తే, మనకు రావలసిన ఆశీర్వాదములు కూడ రావట్లేదు. అటువంటి సందర్భములో “నా వెంబడి రండి” అని పిలుస్తున్నాడు.

ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. -మత్తయి 11:28

మనము ప్రయాసముతో ఉన్నాము, అటువంటి సందర్భములో మనలను పిలుస్తున్నాడు అంటే, ఈయన ఎవరై ఉంటారు? ప్రయాసమును తొలగించలేని వాడైతే, ఎందుకు పిలుస్తాడు? సమరయ స్త్రీ విషయములో చూస్తే, “నేనిచ్చు నీళ్ళు తాగు వాడు ఎప్పుడునూ దప్పిగొనడు” అని చెప్పాడు. అంటే, ఆయన విశ్రాంతి కలిగించువాడై ఉన్నాడు.

పేతురుతో చెప్తున్నాడు, ఇంతవరకు నీవు ప్రయాసము పడి చేపలు పట్టావు గానీ, ఇకనుండి నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపిస్తాను అని చెప్పి నా వెంబడి రండి అని చెప్పి పిలిచాడు. ప్రభువు తిరిగి లేచిన తరువాత, పేతురు ఒకరాసి 3000 మందిని, మరొకసారి 5000 మందిని అలా వేల వేల మంది మనుష్యులను ప్రభువుకొరకు పట్టిన జాలరిగా మార్చబడ్డాడు.

కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి. -1 కొరింథీయులకు 15:58
అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కు వగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.౹ -1 కొరింథీయులకు 15:10

శరీర సంబంధమైన విషయములలో ప్రయాసము పడినప్పుడు మనమే ప్రయాసపడేవారముగా ఉంటాము. అయితే ఆత్మీయ విషయములలో ప్రయాస పడినప్పుడు మనము బాహ్యముగా ప్రయాసపడినట్టు కనపడినప్పటికీ, నిజానికి ప్రయాస పడినది దేవుని కృపయే! అనగా ఆత్మీయ విషయముల కొరకు నిలబడినప్పుడు, దేవుని కృప నీ పరిస్థితిలో విడుదల అయి, ప్రతి పరిస్థితిలో నీ పక్షాన దేవుని కార్యము జరిగిస్తుంది. ఆ విధముగా నిజమైన ప్రయాస మనము కాదు గానీ, దేవుని కృపయే ప్రయాస పడుతుంది. ఈ కృప యేసయ్యనుండి కలుగుతుంది. మన పరిస్థితిలో కృప విడుదల అవ్వాలి అంటే, మన పరిస్థితిని యేసయ్య గమనించి ఉండాలి. యేసయ్య కనికరపూర్ణుడు గనుక, ఆయన బిడ్డలము అయి ఉన్నాము గనుక, మనము అనుభవిస్తున్న శ్రమ, బాధ ఆయన కూడా అనుభవించేవాడుగా ఉంటాడు. అందుకే మన జీవితములో కార్యము జరుగునట్లుగా తన కృపను విడుదల చేసేవాడుగా యేసయ్య ఉన్నాడు. నిన్ను “నా వెంబడి రా” అని పిలుస్తున్నాడు. పేతురు వాళ్ళైతే సమస్తమును విడిచిపెట్టి వెళ్ళారు. మరి నీవు ఎలా స్పందిస్తావు? నీ ప్రయాసముతో కూడిన జీవితము ముగించడానికే ప్రభువు పిలిస్తున్నాడు అని గమనిస్తున్నావా?

మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని–నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.౹ -యోహాను 1:43

ఈరోజు ప్రభువు నిన్ను కనుగొంటున్నాడు. ఎందుకు అనే సత్యము నీవెరిగితే, నీ ముందు ఉన్న గొలియాతును సహితము హతమార్చేవాడివిగా ఉంటావు. ఫిలిప్పును ఎందుకు వెంబడించమని అడిగాడు? ఫిలిప్పు ఏమి చేసాడు అని చూస్తే, మొదట ఫిలిప్పు యేసును వెంబడించి, నతానియేలును యేసు యొద్దకు తీసుకువచ్చాడు. అప్పుడు యేసయ్యకు నతానియేలు మధ్య సంభాషణ వింటున్నాడు.

యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి–ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను.౹ –నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు–ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్న ప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను.౹ -యోహాను 1:47-48

యేసయ్య ఎటువంటివాడో, ఆయన ఏమి కలిగి ఉన్నాడో అది ఫిలిప్పు ముందు ప్రకటించబడుతుంది, గనుక యేసయ్యను గూర్చిన సత్యమును ఎరిగేవానిగా మార్చబడుతున్నాడు. మరొక సందర్భములో చూస్తే,

కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తనయొద్దకు వచ్చుట చూచి–వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలుకొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని౹ యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.౹ -యోహాను 6:5-6

ఈ సందర్భములో ఈ ప్రశ్న ఫిలిప్పునే అడిగాడు ఎందుకు? పేతురు ఒకదానికొరకు పిలువబడ్డాడు, ఫిలిప్పు మరొకదానికి కొరకు పిలువబడ్డాడు. ఫిలిప్పు కళ్ళముందు ఒక అద్భుతము జరగవలసిన సందర్భము వచ్చింది. ఆ అద్భుతము అతని కళ్ళముందే ఆ అద్భుతము జరుగుతుంది. మొదటిగా నతానియేలు విషయములో సర్వము ఎరిగినవాడుగా యేసయ్య ప్రత్యక్షపరచుకున్నాడు, భోజనము విషయములో ఆశ్చర్య కరుడుగా ప్రత్యక్షపరచుకున్నాడు.

ప్రయాస పడే సందర్భములోనైనా, అద్భుతము జరగవలసిన సందర్భము అయినా సరే, ఆయన “నా వెంబడి రా” అని యేసయ్య పిలుస్తున్నాడు. పేతురును మొదట అద్భుతము చేసి ఆ తరువాత నా వెంబడి రమ్మని పిలిచాడు. మరి ఫిలిప్పును మొదటిగా పిలిచి తరువాత అద్భుతము చేసినవాడుగా ఉన్నాడు. మనము అడుగక మునుపే మన అవసరములు ఎరిగి తీర్చేవాడుగా ఉన్నాడు. మరి కొన్ని సందర్భాలలో మనము అడిగిన వాటిని తీర్చేవాడుగా ఉన్నాదు.

నా వెంబడి రండి అంటే, ఆయన ముందుగా వెళ్ళి చూపిన మార్గములో మనము కూడా వెళ్ళాలి అనే కదా! మనము అడకుండా చేసేవి, మనము అడిగినప్పుడు చేసేవి రెండూ ఆయనతో మనము ఉన్నప్పుడే మన జీవితములో స్థిరపరచబడతాయి.